top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

తెలియడం అంటే ఏమిటి?

ఎర్రాప్రగడ రామకృష్ణ

వేద వేదాంగాలలో జీవితమంతా విశేషమైన కృషి చేసిన గొప్ప పండితులిద్దరు పుట్టపర్తి సత్యసాయిబాబా వారిని దర్శించారు. అమోఘమైన వేదపఠనంతో సభను, బాబావారినీ విశేషంగా ఆకట్టుకున్నారు. బాబా చాలా సంతోషించి వారిని తగు విధంగా సత్కరించారు. అంతా అయ్యాకా వారిద్దరూ బాబాను చిన్న కోరిక కోరారు. తమకు బాబా 'మంత్రోపదేశం' చెయ్యాలన్నది వరి చిరకాల వాంచ. బాబా వారికేసి పరీక్షగా చూసి "రేపు ఉదయం కలవండి" అంటూ నవ్వుతూ సాగనంపారు.

మర్నాడు పొద్దున్నే ఆ పండితులిద్దరూ స్నానాదికాలు ముగించుకుని ఏకాంతంలో బాబాను కలవగానే బాబా సూటిగా వారికేసి చూస్తూ "ఏమిటి మీరు అడిగింది? మీకింకా వేరే మంత్రోపదేశం ఏమిటి? మీరు వల్లించినవన్నీ మంత్రాలే కదా! అంత సంపదని మీ దగ్గరుంచుకుని  మంత్రాల కోసం మీరు వెదుక్కోవడం ఆశ్చర్యంగా ఉంది. వేద మంత్రాల మీద మీకు విశ్వాసం లేదా? ఇవి కాక ఇంకా ఏవో వేరే వాటిని సాధువులు, బాబాలు ఉపదేశం చేస్తారని మీరెలా అనుకుంటున్నారు. మంత్రాలంటే మీకు తెలిసున్నవే. వేరేవి ఏమీ లేవు!"" అని హితోపదేశం చేసారట. 

ఇది వింటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే కదా. ఆ వేదపండితుల దగ్గరున్నవే మంత్రాలు. తమ జిహ్వాగ్రాన ఆనంద తాండవం చేసే వేదమాత కన్నా విలువైన విద్యలేవీ ఈ సృష్టిలోనే లేవు. మంత్రం అనే మాటకి నిరంతర మననం చేత, త్ర- రక్షించునది ఏని అర్థం. కనుక వారికి తెలిసిన వేదమంతా మంత్రమే. వేదం తెలిసినవారికి వేరే మంత్రోపదేశాలతో పని లేదు. 

 మరి ఇంత చిన్న విషయం అంత గొప్ప పండితులకి ఎందుకు స్ఫురించలేదూ. అంటే ఈ సృష్టిలోని రహస్యమే అది. తన దగ్గరున్న దాని విలువ ఒకొసారి స్ఫురించదు. సామెత చెప్పినట్లు ఎవరో వెర్రిబాగుల తల్లి ఉయ్యాలలో పరుండబెట్టిన బిడ్డ కోసం ఊరంతా వెతికిందట చూసారా - అలా తమకు తెలిసిన విద్యల ప్రభావం ఎంతటిదో తమకే తెలియకుండానే జీవితాలు గడిచిపోతున్నాయి."నువ్వింత గొప్పవాడివి సుమా" అని హనుమంతుడికి జాంబవంతుడు గుర్తు చేసినట్లు, ఆ వేద పండితులకు భగవాన్ సత్యసాయి బాబా కూడా గుర్తు చేయవలసి వచ్చిందన్నమాట. ఇది ఒక రకం. ఇందులోనే ఇంకో రకం ఉంది.

వెనుకటికి ఒక పెద్ద గురువుగారి దగ్గర చిన్న శిష్యుడు విద్యాభ్యాసం చేసేవాడట. అతనికి గురువంటే దేవుడే. గురువుగారి మాట వేదవాక్కు. గురువుగారు చెప్పారంటే అది జరిగి తీరవలసిందేనని గొప్ప విశ్వాసం. సరే, వాళ్లిద్దరూ ఒకసారి వాగుదాటి అటువైపు అడవిలోనికి వెళ్లారు. తిరిగొచ్చేసరికి నిండా నీళ్లతో వాగు పొంగి ప్రవహిస్తోంది. అది చూసి గురువుగారు కంగారుపడ్డారు గాని, శిష్యుడికి బెంగ తోచనే లేదు. శిష్యుడికి ఈత వస్తుందా? అంటే ఈత రావడం కాదు, గురువుగారు తలుచుకుంటే నీళ్ల మీద కూడా నడిపించగలరని అతని నమ్మకం. ఆ మాటే గురువుగారితో చెప్పాడు. "మీరేదైనా మంత్రం చెప్పండి చాలు. అలా అలా నీళ్ల మీద నడిచి వెళ్లిపోతాను చూస్తుండండి" అని ధీమా ప్రకటించాడు. గురువుగారి గొంతులో చూయింగ్ గమ్ అడ్డం పడింది. నిజానికి అలాంటి మంత్రం ఏదీ ఆయన దగ్గర లేదు. దగ్గరున్న మంత్రాలకి ఈ బాపతు పవరుందని ఆయనకీ నమ్మకం లేదు. కాని శిష్యుడు బలవంతం చేసేసరికి నోటికొచ్చిన మంత్రమేదో చెప్పక తప్పింది కాదు. కాని చిత్రం ఏమిటంటే ఏ పనైనా త్రికరణ శుద్ధిగా నెరవేర్చే శిష్యుడు ఆ మంత్రాన్నే శ్రద్ధగా పఠిస్తూ నిస్సంకోచంగా నీళ్లలోకి దిగి సునాయాసంగా పైన నడుస్తూ అవతల ఒడ్డుకి చేరిపోయాడు. త్ర - అంటే రక్షించేది కదా. కనుక మంత్రం తన పేరు నిలబెట్టుకుంది. తీరాచేసి గురువుగారు మాత్రం ధైర్యం చెయ్యలేక రాత్రంతా అవతల ఒడ్డునే జాగారం చేసి వాగు శాంతించాక ఇవతలకి చేరాడు.

ఈ రెండు ఉదాహరణలను బట్టి మనకి ఒక విషయం బాగా అర్ధమవుతోంది. ముందు మన దగ్గరున్న విద్యలని గ్రహించడం మొదటిది. అవి తనను ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్షించి తీరతాయన్న విశ్వాసం మరొకటి. వేదాంతపరంగా దీన్ని అవిదిత తత్వం అనీ, అవిజ్ఞాత తత్వం అనీ అంటారు. అంటే తన దగ్గరున్నదే గాని, దాని తత్వం తనకీ విదితం కాలేదు - తెలియలేదు అని అర్థం. ఇలా తనకు తెలిసిన దాని గురించీ, తన గురించీ స్పష్టమైన అవగాహన లేకపోవడం చాలామంది పండితుల్లో కూడా కనపడుతుంది. కనుకే చదువు వేరు, జ్ఞానం వేరు అనే మాట పుట్టింది. తన గురించి తనకి తెలియకపోవడమే బంధం అనీ, తెలియడమే మోక్షం అనీ వేదాంతం చెప్తుంది. అలా తనను తాను తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారం. ఆత్మకు సంబంధించినది కాబట్టి ఆ మాట వాడుతున్నాం. అదే కావ్యం తాలూకు తత్వం. సంపూర్ణంగా తెలియడాన్ని కావ్యసాక్షాత్కారమనీ, గ్రంథ సాక్షాత్కారమనీ అంటారు. విద్యల విషయంలోనూ అంటే.

అయితే విద్య విషయంలోమరో చిన్న తిరకాసు ఉంది. పిల్లలలో చూసారా - బాగా వచ్చేసిన సబ్జెక్టు అయితే పరీక్షలను లోకువగా తీసుకుంటారు. అలా విద్య బాగా వస్తే దాని పట్ల నిరసన భావమో, నిర్లక్ష్యమో బయలుదేరే సందర్భాలు కూదా ఉంటాయి. ఇది మనందరి విషయంలో కూడా వర్తిస్తుంది. అవతలివాడు బాగా గొప్పవాడే అయినా మనకి బాగా సన్నిహితుడయ్యేసరికి కాస్త లోకువగా అనిపిస్తుంది. దాన్ని అవజ్ఞ అంటారు. అంటే నిరాకరించడం లేదా తిరస్కరించడం అని అర్థం. మన ముంగండ పండితుడు జగన్నాథ పండితరాయలు ఈ రకమైన లోకువకు గొప్ప పోలిక చెప్పారు. మలయ పర్వత శ్రేణుల్లో గంధపు చెట్లు విస్తారంగా పెరిగే చోట ఆదివాసీ స్త్రీలు వాటి విలువను నిర్లక్ష్యం చేస్తూ వంట చెరకుగా ఉపయోగించినట్లు అని పోలిక చెప్పారు. బాగా తరచుగా వస్తూ పోతుండటం లేదా మరీ ఎక్కువ సాన్నిహిత్యాన్ని అనుమతించడం వల్ల గొప్పవాడైనా అలా లోకువ అవుతాడు.

 

భామినీ విలాసంలోని శ్లోకమిది.

అతిపరిచయాదవజ్ఞా సంతతగమనాదనాదరో భవతి ।

 

మలయే భిల్లపురంధ్రీ చన్దనకాష్ఠమిన్ధనం కురుతే  ।।

అతి పరిచయాత్ అవజ్ఞా, సంతత గమనాత్ అనాదరోభవతి

మలయే, భిల్ల పురంధ్రీ , చందన తరుకాష్ఠం ఇంధనం కురుతే

ఇది దుర్వినియోగానికి సంబంధించిన విషయం. అంటే తన దగ్గరున్న విద్యల గురించి, తన ప్రజ్ఞ గురించి మనిషికి తెలియకపోయినా నష్టపోతాడు,

నిర్లక్ష్యం చేసినా నష్టపోతాడన్నమాట. వేదాలతో సహా ఏ విద్యలలోనైన తత్వం తెలియడమే పరమార్థం. అదంటూ తెలిసాకా నష్టపోవడమనేది ఉండదు. ఆ తెలిసేదాకా యాతనా తప్పదు. అదీ సంగతి.

 

ఈ తెలియడం అనే మాట గురించి ఓ ఇంగ్లీషాయన చెప్పిన చమత్కారం వినండి. నాకు ఫలానా విషయం తెలుసుననే విషయమే కాదు. ఫలానాది తెలియదు, నాకు రాదు అని కూడా తెలియాలి. అదీ తెలియడమంటే! అని అన్నాడు.

To know that we know what we know, and to know that we do not know what we do not know, that is true knowledge. 

నిజమే కదా?

***

bottom of page