
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు
సఫరింగు
డా. మూలా రవి కుమార్
సోమవారం ఉదయం ఆఫీసుకి రాగానే బాసు కాగితాల బొత్తి ఇచ్చి చెప్పారు,
“ఈ కాగితాలకి కావలసిన సమాచారం నింపి, అవసరమైన బిల్లులు జతచేసి, శుక్రవారం సాయంత్రానికి పూర్తిగా సిద్ధం చెయ్యి. శనివారం నేచారాముణ్ణి ఢిల్లీ పంపిద్దాం. అతడు సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకొని, అక్కడ ఆఫీసులో సంతకాలు తీసుకొని మళ్ళీ సోమవారం మనకి సంతకాలు పూర్తయిన కాగితాలు తెస్తాడు. పేపర్లు ఢిల్లీ నుంచి రావటం ఆలస్యం అయినా పర్లేదు గానీ, వెళ్ళటం మాత్రం ఒక పూట కూడా ఆలస్యం అవకూడదు, సంతకాలు పెట్టాల్సిన పెద్దాయన ఆ తర్వాత పదిహేనురోజులు మనకి మళ్ళీ దొరకరు.”
ఇంతకీ నేను చేస్తున్న ఉద్యోగంచెప్పలేదు కదూ!? కళింగా కెమికల్స్ అనే పేద్ద ఎరువుల ఫేక్టరీలో చిన్ని కెమికల్ ఇంజనీరుని. ఈఫేక్టరీని రాష్ట్రప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో పెట్టింది. ఆ సంస్థ కార్యాలయమే ఢిల్లీలో ఉంది. మా ఫేక్టరీ నిర్మాణం, శ్రీకాకుళంకి పదిహేను కిలోమీటర్ల అవతల సముద్రం ఒడ్డున మొదలై ఏడాది అయింది. మరో ఏడాదికల్లా పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఫేక్టరీ సైటులోనే ఆఫీసూ ఉంది. కుటుంబాలున్నవాళ్ళం శ్రీకాకుళంలో ఇళ్ళు అద్దెకి తీసుకుంటే, బ్రహ్మచారులూ, కుటుంబాలను వైజాగూ, లేదా అంతకన్నా దూరంలో ఉంచినవాళ్ళు ఈ ఫేక్టరీ ఆవరణలోనే కట్టిన గెస్టు హౌసుకి మారిపోయేరు.
నాలుగో పాదం!
జయంతి ప్రకాశ శర్మ
రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.
రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!
'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.
'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.
అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.
కళ్ళు
- గిరిజాహరి కరణం
“కొత్తగా... రెక్కలొచ్చెనా... గూటిలోనీ గువ్వ పిల్లకీ... మెత్తగా...రేకు విప్పెనా ....”
ఏటి గాలిలో నీళ్ళల్లో ఇసకల్లో కలిసి మృదు మధురంగా సాగుతూంది పాట.
ఏటిపక్కనే వున్న ప్రెసి డెంటు గారి మామిడితోటలో ఏటి వారగా కొన్ని ముంతమామిడి చెట్లు, ఇసకమీదికి నేలబారుగా సాగిన ఓ కొమ్మమీద కూర్చుని పాడుతున్నాడు కాశీ. చాకలివాళ్ళు బట్టలు బండకేసి బాదుతూ చేస్తున్న ఇసో అసో శబ్దాలు, అడపాదడపా రోడ్డుమీదపోతున్న బస్సులూ లారీల శబ్దమూ తప్ప ఇంకే అలికిడీ లేదక్కడ .
పాట వింటూ “ఎవరా పాడేది ?”అంటూ ఆరా తీశాడు ప్రెసిడెంటు గారి పెద్దల్లుడు .
“మంగమ్మ కొడుకయ్యా, కళ్ళు కానరావు. చినిమా పాటలు పాడతా వుంటాడు,"అని చెప్పాడు నీళ్ళ బిందె దింపుతూ మునెప్ప.
“వాణ్ణిట్టా కేకేసుకు రారా "పురమాయించారు ప్రెసిడెంటుగారు.
లక్షాధిపతులు ( తమిళ మూలం: జయకాంతన్ )
అనువాదం: రంగన్ సుందరేశన్
ఇవాళ, ఆరు గంటల వరకూ, అతనొక లక్షాధిపతి.
సరిగ్గా, ఆరుగంటలు కొట్టి పదిహేను నిమిషాలకి, మిస్టర్ అయ్యంగార్ - అతని వకీలు, ఆర్ధిక సలహదారి - నుదుటమీద పెద్ద నామంతో దర్శనమిచ్చాడు; ఇంటిలో కాలుపెట్టగానే అతని కళ్ళు కిందకి జారాయి.
ఆ సమయం ఆ ఇంటి యజమానుడు - యువకుడు - బాగా మత్తెక్కి ఉన్నాడు. గత రెండు రోజులుగా అతను తన గదిలో తలుపు మూసుకొని రోజంతా తాగుతున్నాడు. అప్పుడప్పుడు తనలో తనే మాటాడుకుంటూ, పెద్ద గొంతుకతో అర్ధంలేని పిచ్చిమాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు.
ఈ రెండుమూడు రోజుల్లోనూ అతను స్నానం చెయ్యడానికిగాని, భోజనానికిగాని, తన గదిని వదలి బయటకి రాలేదు. అతన్ని అడగడానికి కాని, చెప్పడానికి గాని బంధువులో, మిత్రులో ఆ ఇంటిలో లేరు.
ఇక అతనొక భర్తయో, తండ్రియో కాదు, పిల్లలెవరూ లేరు. అతను ఆ ఇంటికి యజమాని, అంతే. ఇంటిలో ఉండేది అతని నౌకర్లు మాత్రమే. అందువలన ఒక భార్యలాగ అతను ఎది చెప్పితే అది చెయ్యడానికి వాళ్ళు సిద్ధంగావున్నారు.