
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
కవిత్రయ మహాభారతాంధ్రీకరణము
కవితాశైలి – 1

ప్రసాద్ తుర్లపాటి
Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
"నారాయణం నమస్కృత్వ నరంచేవ నరోత్తమం
దేవీం సరస్వతి వ్యాసం, తతో జయ ముదీరయేత్"
మహాభారతం భారత భారతీ వరప్రసాదం. ఇది మన జాతీయ కావ్యము. వేదవేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం సముచితంగా చోటు చేసికొన్నందువలన మహాభారతం పంచమ వేదమయినది. ధర్మ, అర్ధ, కామ మోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్ధాలను సాధించడానికి అవసరమయిన విజ్ఞానమంతా ఈ గ్రంధంలో వివరింపబడినది.
" ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ:
యదిహాస్తి తదన్యత, యన్నేహాస్తి నతత్క్వచిత్"
అనగా "ఇందులో ఉండేది ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు" అని సూతుడు శౌనకాది మునులకు మహాభారత కథనంతా చెప్పి చివరగా అన్న మాట. మహాభారతం ప్రపంచంలోని గొప్ప గ్రంధాలయిన "ఇలియడ్", "ఒడెస్సి" అన్న గ్రంధాలకన్నా ఎంతో పెద్దది – పరిమాణంలోను, పాత్రచిత్రణంలోనూ మరియు భావాల వైరుధ్యంలో కూడా !
పాండవులు ధార్మిక, సాత్విక మరియు దైవిక శక్తులు. కౌరవులు అధార్మిక, రాజస, తామసిక, అసుర శక్తులు. ఈ రెండు శక్తుల నడుమ జరిగిన సంగ్రామమే కురుక్షేత్ర సంగ్రామము. అందులో ధార్మిక శక్తులకు విజయం కలిగించిన దైవశక్తియే శ్రీకృష్ణుడు. భగవద్గీత భారతానికి ఆత్మ, పాండవుల చరిత్ర శరీరం, చతుర్విధ పురుషార్ధ విజ్ఞానం జీవితం. ఇతిహాసాలు, ఉపాఖ్యానాలు జవసత్వాలు.
" వేదములకు, అఖిల స్మృతి
వాదములకు, బహుపురాణ వర్గంబులకున్
వాదైన చోటులను తా
మూదల ధర్మార్ధ కామ మోక్ష స్థితికిన్ "
ఈ విధంగా మహాభారతం ఆర్ష వాజ్ఞ్మయానికి ప్రమాణం అయినది - అని తిక్కన పేర్కొన్నారు.
ఆదిపర్వంలో నన్నయగారన్నట్లు –
" అమితఖ్యానక శాఖలం బొలిచి, వేదార్ధముల ఛ్ఛాయయై
సుమహద్వర్గ చతుష్క, పుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ, నానాగుణ కీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోద్యాన జా
త, మహాభారత పారిజాత మమరున్, ధాత్రీసుర ప్రార్ధ్యమై"
మహాభారతం భారతీయులందరికీ కల్పవృక్షము. కల్పవృక్షము ఏ విధముగానైతే కోర్కెలు తీరుస్తుందో, మహాభారతము కూడా మానవుడు కోరుకొనే చతుర్విధ ఫలపురుషార్ధాలకు సంభంధించిన విశేషాలను తెలియపరుస్తుంది. అనేక ఉపాఖ్యానాలు అనే కొమ్మలతో, వేదాల్లోని అర్ధమై, నిర్మలమయిన నీడ కలదై, నాలుగు ఫల పురుషార్ధాలు (ధర్మ, అర్ధ, కామ, మొక్షములు) అనే పూవుల సముదాయముతో ఓప్పారుచూ, కృష్ణార్జునల వివిధ సద్గుణాలను కీర్తించడం వలన ఉద్దేశ్యము అన్న ఫలములు కలదై, వ్యాసుడనే తోటలో ప్రభవించిన మహాభారతము అనే కల్పవృక్షం ధాత్రీసురులు ప్రార్ధించ, వెలుగొందుచున్నది.
ఆంధ్ర మహాభారతము కవిత్రయము మనకందించిన మహాకావ్యము. మహాభారతం భారతీయ విజ్ఞానానికి, సంస్కృతికి కల్పవృక్షం. "వ్యాసో నారాయణో హరి:" శ్రీకృష్ణుడు గీతలో అన్నట్లు "మునీనా మప్వహం వ్యాస:". ఈ వ్యాస విరచిత భారతం తెలుగులో మరింత శోభను సంతరించుకొని కవిత్రయ మహాభారతం గా భాసిల్లుచున్నది. ఈ గ్రంధ రచన సుమారు 300 సంవత్సర కాలంలో పూర్తయినది. భరత వంశజుల చరిత్ర చెప్పే మహాభారతం పురాణ భాగంగా కాక ఇతిహాసమయినది.
"తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి", "భారతం చదివినవాడు పండితుడు" వంటి లోకోక్తులు వెలిశాయి. దీన్ని బట్టి ఆంధ్రులకు మహాభారతమంటే ఎంతటి ఆదరణో తెలుస్తోంది. భారత ప్రాంతీయ భాషల్లో వెలువడిన అనువాద గ్రంధాలలో తెలుగు "కవిత్రయ భారతానికి" ఎంతో ప్రత్యేకత వుంది. వేదవ్యాసుని సమగ్ర భావాలన్నింటిని ప్రతిబింబిస్తూ, అంధ్రుల సామాజిక వ్యవహారాలతో, వైదికమైన పరమార్ధాన్ని నిరూపింపచేస్తూ సాగిన స్వతంత్ర రచన "ఆంధ్ర మహాభారతం". త్రిమూర్తులుగా వెలుగొందే నన్నయ, తిక్కన, ఎర్రనలు మనకు ఈ ఆదికావ్యాన్ని ప్రసాదించారు. ఈ ముగ్గురూ వేరువేరు కాలల్లో, ఆంధ్ర దేశములోని వేర్వేరు ప్రదేశాలలో తమరచనలు చేసినప్పటికినీ మనకు ఏక కావ్యంగా, ఏక భావంతో మనకందించారు. శ్రీమదాంధ్రభారతం అంధ్రభారతికి కవిత్రయము సమర్పించిన మణిహారం. నన్నయ, తిక్కనలు ఇరువైపుల పన్నిన ఆ హారాన్ని, ఎర్రన అరణ్యపర్వమనే మణితో అనుసంధానించాడు. ఈ కవితా త్రిమూర్తుల యొక్క రచనా శైలి యొక్క విహంగ వీక్షణమే, ఈ వ్యాసతారవళి యొక్క ముఖ్య వుద్దేశ్యం. మొదటి భాగములో నన్నయ, తదుపరి రెండు భాగాల్లో తిక్కన, ఎర్రనల కవితా శైలిలను స్పృశిస్తూ సాగుదాం.
నన్నయ వ్రాసిన భారతంలో మహాభారత ప్రాశస్త్యాన్ని ఈవిధంగా చెప్పారు -
" ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
ఆధ్యాత్మ విదులు వేదాంతమనియు
నీతి విచక్షుణుల్, నీతిశాస్తం బని
కవి వృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమనియు
ఐతిహాసికులు ఇతిహాసమనియు
పరమ పౌరాణికుల్ బహు పురాణ సమచ్చ
యంబని మహి గొనియాడుచుండ
వివిధ తత్త్వవేది వేదవ్యాసు
డాది ముని పరాశరాత్మజుండు
విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై
పరగుచుండ జేసె భారతంబు “
అనగా - ధర్మ స్వభావం తెలిసినవారు ధర్మశాస్తమనీ, పరమాత్మ జీవాత్మల సంబంధము తెలిసిన వేదాంతులు వేదాంతశాస్త్రమనీ, కవిశ్రేష్టులు గొప్ప కావ్యమనీ, లక్షణం తెలిసిన వారు పెక్కు లక్ష్యాల సంపుటి అనీ, పూర్వ కథలు తెలిసిన వారు ఇతిహాసమనీ, ఉత్తమ పౌరాణీకులు పురాణమనీ భూమి యందు పొగుడుతూ ఉండగా, సకల వేదాల్లో నిక్షిప్తమయిన తత్త్వ రహస్యాలను ఆకళింపు చేసుకున్న వేదవ్యాసుడు ఈ మహాభారతాన్ని రచించాడు అని నన్నయ కొనియాడాడు. సంస్కృత మహాభారతం శాస్త్రేతిహాసం. ఆంధ్ర మహాభారతం కావ్యేతిహాసం.
కవిత్రయ మహాభారత రచన క్రీ.శ. 1000 - 1400 లో పూర్తయినది. ఆంధ్రమహాభారతం లోని పర్వములు - ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వములు - ఆది పంచకము (5); భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు - యుద్ధ షట్కము(6); శాంతి, అనుశాసిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహప్రస్థాన, స్వర్గారోహణ పర్వములు - శాంతి సప్తకము (7).
నన్నయ ఆరంభించిన ఆంధ్రమహాభారతం తెలుగులో ఆదికావ్యం. నన్నయ ఆది, సభా పర్వాలను పూర్తిగా, అరణ్యపర్వంలోని నాలుగవ ఆశ్వాసంలోని కొంతభాగాన్ని రచించారు. (క్రీ.శ 1054-61 సంవత్సరముల మధ్య). ఆ తరువాత తిక్కన 13 వ శతాబ్దంలో (క్రీ.శ1205-1288 మధ్య కాలంలో) విరాటపర్వం మొదలుకుని స్వర్గారోహణపర్వం వరకు 15 పర్వాలను ప్రభంధ మండలిగా సంతరించాడు. ఆ తరువాత 14 వ శతాబ్దంలో ఎర్రప్రగ్గడ అరణ్యపర్వశేషాన్ని పూరించాడు. ఈవిధంగా మహాభారతం రెండున్నర శతాబ్దాల కాలంలో కవిత్రయంచే తెలుగులో రచింపబడినది. ఈ ముగ్గురు కవులు విభిన్న కాలాలలో రచించినా ఒకే స్వతంత్ర రచన అనే మహానుభూతి కలుగుతుంది. వ్యాసభారతం అర్ధప్రధానమయిన శాస్త్రేతిహాసమయితే, తెలుగు భారతం ఉభయప్రధానమయిన కావ్యేతిహాసం, అనగా కావ్య స్వభావానికి ఇతిహాసాన్ని జోడించి రచింపబడిన కావ్యం.
ఆదికవి నన్నయ కవితాశైలి -
" శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు,
యే లోకానాం స్థితి మావహంత్య విహతాం, శ్త్రీ పుంస యోగోధ్భవాం
తే,వేదత్రయ మూర్తయ, స్త్రీ పురుషా స్సంపూజితా వస్సురై:
భూయసు: పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా: శ్రేయసే "
ఇది ఆదికవి నన్నయ గారి ఆంధ్రమహాభాగవతంలోని ప్రారంభ శ్లోకం. శ్రీ అనగా లక్స్మీదేవి, వాణి అనగా సరస్వతి దేవి, గిరిజా అనగా పార్వతిదేవి ని క్రమంగా వక్షస్థలముపై, ముఖముపై (వాక్కునందు), దేహమునందు ధరిస్తున్న విష్ణు, బ్రహ్మ, శివాదులు లోకాల సుస్థిరతను కాపాడుతూ, వేదాల రూపం కలవారై దేవతలచే పూజింపబడుతున్న త్రిమూర్తులు. వారు మీకందరకూ సదా శ్రేయస్సును కలిగింతురు గాక అన్నది దీని భావం.
నన్నయ మహాభారతాన్ని తెలుగులో రచించినప్పటికీ, సంస్కృతం అమరభాష కావడం చేత, ఆశీ:పూర్వక మంగళాశాసనాన్ని నన్నయ సంస్కృతంలోనే చేశాడు. ఈ శ్లోకంలో ఒక విశేశం ఉంది. ఆశీ:శ్లోకంలో శ్రీకంధరా అని ఎందుకు వాడాడు అని, హాలహల భక్షణ లోకహితం కొరకు కావున, అది శుభాన్నే సూచిస్తుందని పండితుల భావన.
త్రిమూర్తులు గృహస్థ ధర్మానికి ప్రతీకలు. వారు లోకానికి అవిచ్ఛిన్నతను ప్రసాదిస్తారనటం, భారతంలో వేద సమ్మతమయిన గృహస్థధర్మం ప్రధానాంశం అని ధ్వని.
మరియొక విశేషం - నన్నయ మొదలే ఈ భారత రచన మొత్తం చేయడం సాధ్యమా అన్న సందేహం వెలిబుస్తూనే ఈ నాందీ శ్లోకంలో త్రిమూర్తులను ప్రార్థిస్తూ వస్తు నిర్దేశం చేశారు. ఆయన నోట ఈ త్రిమూర్తుల ప్రస్తావన రావడం, జరగబోయే మహాభారత ఆంధ్రానువాదాన్ని కవిత్రయమన్న త్రిమూర్తులు పూర్తి చేస్తారన్న సూచన.
పురుషొత్త, మాంభుజ భవ, శ్రీ కంధరా శ్రేయసే ( విష్ణు, బ్రహ్మ, శివుడు)
-
నన్నయ పదం – “నారాయణ” శబ్దం
-
తిక్కన – కవి “బ్రహ్మ”
-
ఎర్రన – “శంభు” దాసుడు
ఈ కవిత్రయమే త్రిమూర్తుల త్రయం. ఈ శ్లోకం శార్దూల విక్రీడతం. ఇది నన్నయ కవితా దృష్టి -
నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. ప్రధమాంధ్ర మహా కావ్య నిర్మాణ చణుడు, వాగమ శాసన సార్ధక బిరుద విభూషణుడూయిన నన్నయ తన సహాధ్యాయుడు, వ్యాకరణ దురంధరుడు అయిన నారాయణభట్టు సహకారంతో మహాభారత ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు. తెలుగుభాష స్వరూపానికి పరిపూర్ణత సాధించి పండిత, పామర రంజకమైన శైలిని రూపొందించారు. భారత అవతారికలో నన్నయ ప్రసన్నకధాకవితార్ధయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తినిధిత్వము తన కవితా లక్షణాలుగా పేర్కొన్నారు.
" సారమతిం గవీంద్రులు ప్రసన్నకధాకలితార్థయుక్తిలో
నారసి మేలునా, నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నారుచిరార్థ సూక్తి నిధి, నన్నయభట్టు తెనుంగునన్
మహాభారత సంహితా రచన బంధురు డయ్యె జగద్ధితంబుగన్ "
కవిపుంగవులు ప్రసాద గుణంతో కూడిన కథలను (అందరికి చక్కగ అర్ధము కావటము అన్న లక్షణం) కవిత్వమందునూ కూడిన అర్ధసహితత్వాన్ని గ్రహించి ప్రశంసించగా, సామన్యులు వీనులకు విందు చేకూర్చే అక్షర కూర్పులోని మాధురిని మెచ్చుకోగా, వివిధ సుభాషితాలకు నెలవై అనేక సుందరకవితాభివ్యక్తులకు నిధి అయిన నన్నయ భట్టారకుడు లోకశ్రెయస్సుకై, మహభారతమును తెలుగులోకి అనువదించెను.
ప్రసన్నకధాకలితార్థయుక్తి
ప్రసన్నకథాకలితార్థయుక్తి అంటే ప్రసన్నమైన కధతో కూడుకున్న అర్థాల సంయోజనం. నన్నయ కధాకథన కవిత్వ పద్ధతిని అభిమానించేవాడు, అంటే కధా సన్నివేశానికి తగ్గ కవితాశైలి.
ఉదాహరణకు ఉదంకుని కథ, శకుంతలోపాఖ్యానం మొదలగునవి. మూలములో లేని కల్పనలను తెలుగులో క్రొత్తగా చేసి కథకు ప్రసన్నతను కల్పించాడు.
శకుంతలోపాఖ్యానంలో కపటిగా, కఠినుడిగా, అసత్యవాదిగా గోచరించే దుష్యంతుడు ఆకాశవాణి నిర్దేశం ప్రకారం నిజాన్ని అంగీకరిస్తాడు. ఈ హఠాత్పరిణామానికి తగిన చిత్త సంస్కారం అతనిలో ఉన్నట్లు భారత మూలకథలో లేదు. దీనిని కల్పించి నన్నయ కథను ప్రసన్నం చేసాడు.
అలాగే దుష్యంతుడు కణ్వాశ్రమానికి వెళ్ళే దారిలో చూసిన సుందరవన ఘట్టం - "లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు జల్లిరి --" ఈ రూపకాలంకార వర్ణన, శకుంతలా దుష్యంతులకు త్వరలో జరగబోయే గాంధర్వ వివాహాన్ని ధ్వనింప జేస్తుంది. ఇదియే ప్రసన్న కవితా కలితార్ధ యుక్తి.
ఈ శకుంతలోపాఖ్యానంలోనే నన్నయ చక్కని శబ్దాలంకారాన్ని ప్రదర్శించాడు.
ఉదాహరణకు
“ భరతు డశేష భూభవనభార ధురంధరుడై, వసుంధరం
బరగి, యనేక యాగముల బాయక భాస్కర జహ్ను కన్యకా
సురుచిర తీరదేశముల సువ్రతుడై యొనరించి భూరి భూ
సురులకు నిచ్చె, దక్షిణలు శుద్ధ సువర్ణ గవాశ్వ హస్తులన్ “
భరతుడు అపారమైన సామ్రాజ్జభారాన్ని వహించి, గంగా, యమున నదీ తీరములందు దీక్షచే యజ్ఞాలను పరమ పవిత్రముగా నిర్వహించు భూసురలకు దక్షిణలనొసగుచూ, ఈ ధరిత్రి యందు ప్రఖ్యాతి గాంచాడు. ఈ భరతుని పేరునే భారతదేశమునకు ఆ పేరు వచ్చింది.
అక్షర రమ్యత
ఎక్కువగా అందరినీ ఆకర్షించేది "అక్షర రమ్యత". అనగా అక్షరాలను రస, భావ వ్యంజకంగా ప్రయోగించడం వలన కలిగే సౌందర్యము. అక్షర రమ్యత వలన పద్యానికి శ్రవణానందం కలిగించే గుణం ఏర్పడుతుంది. నన్నయకు శబ్ద గుణమంటే ఇష్టం. ఉదాహరణకు ఉదంకోపాఖ్యానంలోని నాగస్తుతి –
" బహువన పాద పాబ్ధికులపర్వతపూర్ణ సరస్సరస్వతీ సహిత
మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్, జలధిశాయక బాయక శయ్య యైన య
య్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్ "
అనగా - పెక్కు అడవులతోను, చెట్లతోను, సముద్రాలతోను,కులపర్వతాలతోను, తటాకాలతోను కూడిన గొప్ప భూమి యొక్క బరువును ఎల్లప్పుడూ వేయిపడగల సముదాయము దాల్చి మిక్కిలి సహింప శక్యం కాని విగ్రహం గల నారాయణుడికి శయ్యగా ఉండి, పాపాలను అంతరింప చేసే అనంతుడు మా పట్ల అనుగ్రహం కలవాడు అగుగాక !
నానారుచిరార్థసూక్తి నిధిత్వము
అందమయిన సూక్తులకు నన్నయ నిధి వంటి వాడు. సుభాషితాలయిన సూక్తులు నానావిధాలయిన ప్రయోజనాలను సాధిస్తాయి. లోకనీతిని, రాజనీతిని, ఆధ్యాత్మిక ప్రభోధాలను బోధిస్తాయి.
ఉదాహరణకు ఉదంకోపాఖ్యానం నుండి –
మహాభారత కధకు మూలము " ఉదంకోపఖ్యానము ". ఉదంకుడు తన గురుపత్ని అభ్యర్ధనపై, పౌష్యమహారాజు పత్ని ధరించినటువంటి కర్ణాభరణాలను గురుదక్షిణగా సమర్పించుకుందామని, మహారాజును, వారి దేవేరిని దర్శించగా, ఆమె తన కర్ణాభరణాలను ఉదంకునికి సమర్పిస్తుంది. తదుపరి, పౌష్యమహారాజు ఆతిధ్యమును ఉదంకుడు స్వీకరిస్తాడు. ఆ భోజనములో ఉదంకుడు ఒక కేశము (వెండ్రుక) ను కనుగొనగా కోపించి పౌష్యమహారాజుని 'అంధుడవు కమ్ము ' అని శపించగా, పౌష్యమహారాజు కూడా, ఉదంకుని ' సంతాన విహీనుడవు కమ్ము ' అని మారు శాపం ఇస్తాడు. అప్పుడు, ఉదంకుడు, ఈ శాపాన్ని ఉపశమింపమని కోరగా, పౌష్యుడు నిరాకరించి ఈ విధముగా పలుకుతాడు.
" నిండు మనంబు నవ్యనవనీత సమానము, పల్కు దారుణా
ఖండల శస్త్ర తుల్యము, జగన్నుత విప్రులయందు, నిక్క మీ
రెండును రాజులయందు విపరీతము, గావున విప్రుడోపు
నోపం డతి శాంతుడయ్యు, నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్ "
బ్రాహ్మణ, క్షత్రియుల స్వభావాన్ని గురించి చెప్పిన ఈపద్యమును తెలుగు నాట లౌకికప్రసంగాలలో వాడుకోవడం జరుగుతుంటుంది. లోకంచేత స్తుతింపబడిన వాడా ! ఓ ఉదంక మహామునీ, బ్రాహ్మణులలో వారి నిండు హృదయం అప్పుడే తీసిన వెన్నతో తీసిన వెన్నతో సమానంగా, మిక్కిలి మృదువుగా ఉంటుంది. కానీ, మాట మాత్రము ఇంద్రుని వజ్రాయుధ భాసమై పరుషమయినది. ఇది ముమ్మాటికి నిజం. రాజుల యందు మాత్రం, ఈ రెండూ విరుధ్హము గా ఉంటాయి. రాజుల మనస్సు వజ్రతుల్యం, పలుకు నవనీతం. కావున, బ్రాహ్మణుడు, తన శాపాన్ని ఉపసంహరించుకోడానికి శక్తుడౌతాడు కాని, మిక్కిలి శాంత స్వభావం కలవాడైనా, రాజు అశక్తుడు.
నానారుచిరార్థ సూక్తినిధిత్వమునకు మరియొక ఉదాహరణ –
" నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటె నిక్క స
త్క్రతువది మేలు, తత్క్రతు శతకంబు కంటె సుతుండు మేలు, త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్ "
మాట తప్పిన దుష్యంతుడిని "సూనృత వ్రత" అంటూ దెప్పి పొడుస్తూ శకుంతలచే సత్యవాక్పరిపాలన యోక్క సూక్తిని వివరించుట ఈ పద్యం లోని సౌందర్యము. సూనృతవ్రత ( సత్య సంపద కల ఓ మహారాజా ) ! మంచినీటితో నిండిన చేదుడు బావులు నూరిటికంటె ఒక దిగుడు బావి మేలు; ఆ బావులు నూరిటికంటే, ఒక మంచి యజ్ఞం మేలు; అటువంటి నూరు యజ్ఞములు నూరిటికంటే ఒక పుతృడు మేలు. అట్టి పుత్రులు నూర్గురు కంటే ఒక్ సత్యవాక్యము మేలు. అని శకుంతల సత్యము యొక్క విశిష్టతను చాటి చెప్పుతున్నది. నూరు అధికమయిన ప్రమాణానికి గుర్తు. నన్నయ నానా రుచిరార్ధసూక్తి కిది ఒక మంచి ఉదాహరణ.
నన్నయ భారతాన్ని యధావిధంగా అనువదించక 18 పర్వాలకూ ఒక ప్రణాళిక నిర్ధారణ చేసి తెలుగువారి భావానుకూలంగా స్వేచ్ఛానువాదం చేసారు. నన్నయది రుషి మార్గము. తన భారత రచనను రాజరాజనరేంద్రునికి అంకితం గావించారు. మంగళశ్లోకానంతరము సుమారు ఆరు గద్య, పద్యములతో రాజరాజు గుణాలను వివరించారు. నన్నయ సుమారు 4000 పద్య, గద్యాలను వ్రాసారు. నన్నయ శైలికి గాంభీర్యత సంతరించినది బహుళ సంస్కృత పద ప్రయోగం. ఎర్రన నన్నయను భద్రగజముతో పోల్చాడు.
నన్నయ పద్యం ధారామధురంగా సాగుతుంది. శబ్ద సౌందర్యముతో శ్రవణానందము, అర్ధ గాంభీర్యంతో ఆలోచనామృతం కలిగిస్తుంది. తత్సమ పదభూయిష్టమయిన తెలుగుదనం తొణికిసలాడుతుంటుది.
ఇక నన్నయ చివరగా ఈ ఉత్పలమాలను సమర్పించారు -
“ శారద రాతృలుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారు తరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార, సమీర సౌరభము తాల్చి, సుధాంశు వికీర్యమాణ
కర్పూర పరాగ పాండు రుచిపూరములంబరి పూరితంబులై “
శరత్కాలపు రాత్రులు మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలతో కూడి వున్నవి. వికసించిన తెల్ల కలువల దట్టమైన సుగంధముతో కూడిన గొప్ప పరిమళాన్ని వహించినాయి, అంతటా వెదజల్లబడిన కప్పురపు పొడివలే అకాశాన్ని అవరించిన చంద్రుని వెన్నెల వెల్లువలు కలిగి అకాశం మిక్కిలి సొగసుగా వున్నాయి.
నన్నయ గారు ఆఖరు పాదములో చెప్పినట్లు -
" పూరములం బరి పూరితంబులై " -
పాండు రుచి పూరములు + అంబరి పూరితంబులై అని సంధి విరవటానికి బదులుగా, “ పాండు రుచి పూరములన్ + పరపూరితంబులై “ అని సంధి విశ్లేషించిన, పరిపూరితంబులై అన్న చివరిమాట ఏర్పడుతున్నది. అనగా, నన్నయ ఇక మహాభారతం వ్రాయటము పొసగదు అని భావనా ? నన్నయ్య ౠషి తుల్యుడు. ఋషి వాక్కు సత్యము. భవభూత మహకవి అన్నట్లు " ఋషీణాం పునరాద్యానాం వాచ మర్ధోనుధావతి "
విశ్వనాధ సత్యనారాయణగారన్నట్లు, " ఇది నన్నయ గారి చివరి పద్యమగుటచేనేమో, ఆయన లోని సరసత్వము, చారుత్వము, మాధుర్యము, సౌకురార్యము - సర్వము నిందున్నవి ".
అందుకే ఆరంభములో నన్నయ గారు ఈ విధముగా తెలిపారు -
" అమలిన తారకాసముదాయంబుల నెన్నను సర్వవేదశా
స్త్రముల యశేషసారము ముదంబున పొందను, బుద్ధిబాహు వి
క్రమమున దుర్గమార్ధజలగౌరవభారత భారతీసము
ద్రము తరియంగ నీదను విధాతృన కైనను నేరబోలునే "
పై పద్యము ప్రకారము, యే ఓక్కరూ మహాభారత రచన చివరివరకు వ్రాయజాలరని అన్నారు. కాని "విధాతృన కైనను నేరబోలునే" అనటములో, కవిబ్రహ్మకు సాధ్యమవునేమో అన్నారు లేక, కవిబ్రహ్మకు కూడా సాధ్యము కాదేమో అన్న సంశయమా ! కనుకనే ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని పూరించడము జరిగింది.
ఈ విధముగా ఆదికవి నన్నయ ఆది, సభా, అరణ్య పర్వములో కొంత భాగాన్ని తెనిగించి ఎందరో తెలుగు కవులకు మార్గ నిర్దేశము చేసాడు.
“ రాజకులైకభూషణుఁడు, రాజమనోహరుఁ, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుఁడు, విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్ “
చంద్ర వంశానికి అలంకారమైన వాడు, చంద్రునివలై సుందరుడు, పరరాజులను జయిచడము చేత ప్రకాశించే శౌర్యము కలవాడు, నిర్మలమయిన కీర్తి అనే శరత్కాలచందృడి వెన్నెల చేత ప్రకాశింప చేయబడిన సమస్తలోకాలు కలవాడు, ఓటమి యెరుగని ధీర్ఘబాహువు నందలి ఖడ్గము యొక్క వాదర అనే నీటిచేత శమింపచేయబడిన శత్రువులనెడి ధూళి కలవాడు, అయిన రాజనరేంద్రుడు ఉన్నతముగా వర్ధిల్లాలని నన్నయ తన మహాభారత రచనను తన ప్రభువుకు అంకితం గావించాడు.
తెలుగులో అంతర్జాలపత్రిక "మధురవాణి[madhuravani.com]" ప్రారంభోత్సవ శుభసందర్భముగా చేసిన ప్రసంగానికి వ్యాసరూపమిది.
ధన్యవాదములు. రాబోయే సంచికల్లో తిక్కన, ఎర్రన గార్ల రచనా శైలి గురించి పరిశీలిద్దాము.
*****