adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

ఈశ్వరుడి తలపు ఘటన!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"బాలూ గారికి కరోనాట!" - గత నెలలో ఓ స్నేహితురాలు.


"ఆహా? అవునా?" - చాలా మామూలుగా నేను.


"పాపం కదా?"- బాధగా అంది ఆ స్నేహితురాలే.  ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా బాధపడుతుంది. ఇక మరి అక్కడ అందరమూ ఇంటిమనిషిలా భావించే బాలూ!


"బాలుగారికేమవుతుందీ? ఏమీ కాదులే. అమితాబ్ కీ వచ్చింది. ఇంటికి తిరిగి రాలా హాయిగా" - నా గొంతులో ధీమా.


మా బాలూకి ఏమవుతుందిలే అని ఓ ధైర్యం. అదేంటో మరి? బాలూకి మరణమేంటీ? ఏనాడయినా ఊహించామా? 


అంతెందుకు, నాలుగైదేళ్ళ క్రితమనుకుంటా. స్వరాభిషేకంలో ఒక ఎపిసోడ్. అందులో బాలుగారు ఆయనకెంతో ఆప్తులైన సిరివెన్నెలగారి పాటలు పాడుతున్నారు.

పాడుతూ పాడుతూ "తరలిరాద తనే వసంతం" పాట పాడాక, ఆ పాట చరణంలో అర్థవంతమైన పదాలని వర్ణిస్తున్నారు. ఆ సందర్భంలో  "కూసే కోయిల పోతే కాలం ఆగిందా? పారే యేరే పాడే మరో పదం రాదా?" అనే మాటల్లో చమక్కుని వర్ణిస్తూ, పోలిక వివరిస్తూ బాలుగారు కొన్ని మాటలన్నారు - “మనమంతా నా కోడి కుంపటి అనీ అనుకోవటమే కానీ ఏదీ ఆగదు. అప్పట్లో అయ్యో, ఘంటసాల గారు పోతే ఎలా? అనుకున్నాము, రేపు ఈ ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పోతే ఎలా అనీ అంతా అనుకుంటారు. ఏమవుతుందీ? ఏమీ కాదు. ఇంతమంది ఘంటసాలలూ, బాలులూ ఉన్నారిక్కడ" అని!

 ఒక్కసారి ఆ మాటలు వినగానే కిసుక్కున నవ్వాను.

'అయ్యయ్యో, అవేం మాటలు" అని బాలుగారికి బదులు నేను లెంపలేసుకోవాలా?  "అరెరె. సంధ్యపూట ఏంటా మాటలు?" అని ఆ టీవీలోని బాలుగారికి వినబడదని తెలిసినా ఆయన్ని సున్నితంగా మనసులోనైనా వారించాలా? ఉహూ. లేదు. అవేమీ చేయలేదు. నవ్వాను. నాకు బాగా గుర్తు.  అదేదో వాస్తవ విరుద్ధమైన మాటయినట్టూ, అసలు మరణం అనేది దరిదాపులకైనా రాని వరమేదో ఈ బాలు' డు పుట్టినపుడే వెంట తెచ్చుకున్న గంధర్వుడైనట్టూ? కాదు మరీ?  గాన గంధర్వుడేగా. ఎంతటి మనిషి అంత మామూలు మనిషిలా ఒదిగి ఒదిగి ఉన్నాడండీ. అది ఆయన తీరు మరి. అయితే మాత్రం? మామూలు మనిషేనని ఏనాడయినా అనుకున్నామా? అసలూ ఎంత ధైర్యమదీ? ఆయనకేమవుతుందీ? అని.

 

ఉండదు మరీ?  మరి ఇన్ని దశాబ్దాలుగా అన్నేసి కళలతో, ఆ వినమ్ర వినయ సంపదలతో ఎన్ని దీవెనలు పోగుచేసుకునుంటాడు?

పొద్దూ సంధ్యా తెలీక పనిచేసుకున్న శ్రమజీవులకి ఇంటికి వస్తూనే ఏ రేడియోలోనో వినవచ్చే తీయటి గొంతునుంచి వేటూరి కలం చిలికిన "వీణ వేణువైన సరిగమ విన్నావా" అంటూనో లేక దాశరథి కావ్యమేదో “ఏ దివిలో విరిసిన పారిజాతమో" అంటూనో ఓ మెత్తటి పాట చెవిలో దూరి, మనసుని ఉల్లాసపరిచి, బడలిక తీర్చినప్పుడు అప్రయత్నంగా "పదికాలాల పాటు ఈ గొంతు చల్లగా ఉండనీ!" అన్న దీవెనలు ఎన్ని వేల గొంతులనుండి వెలువడుంటాయి? లక్షలంటారా? మరే? కోట్ల గొంతులన్నా ఒప్పుకుంటాను.

విరామం తెలీక, విసుగు ప్రదర్శించలేక, బతుకు తోవలెంబడి పదే పదే అదే పనిగా చేసే చిరుద్యోగాలలో అలిసిపోయి, తమ చిన్న పొదరింటికి చేరి ఏ టేపురికార్డుల్లోనో వినబడే "చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలై పోయి, కడలిగా పొంగు నీ ప్రేమ" అంటూ ఆ తీయటి రాగాలతో వినవచ్చే ఆ పాటలని విని మనసు ఉత్సాహభరితమయినపుడు, మరీ ముఖ్యంగా  "భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా, హా ప్రేమ మనమే సుమా" అంటూ వేటూరి చమక్కు లిరిక్కులకి ఏ మాత్రం తగ్గకుండా తెలుగుపదాల్లోని తేటదనమంతా 'మనమే సుమా' అని పలకటంలోనే చూపించేసి ఏమీ ఎరగనట్టు తర్వాతి చరణాలు పాడుకుంటుంటే ఆ సంతోషంలో ఎందరి హృదయాలు ఆ రాగాలలాగే చిరకాలం సాగాలని కోరుకునుంటాయి? లక్షల్లో ఉండవూ?

పగలనకా, రాత్రనకా దేశవిదేశాల్లో ఎన్నెన్నో వ్యాపారవ్యవహారాలలోనో తలమునకలయి, కుటుంబంతో పది నిమిషాలు గడిపే తీరికలేని జీవితాలలో అలిసిపోతూ, ఏ తప్పని తేనీటి విందులోనో, ఏదో ఓ తప్పించుకోలేని మొహమాటపు ప్లాస్టిక్ పార్టీలోనో ఉనికిపాటుకై పాట్లు పడుతున్న వేళల్లో లీలగా ఏ టీవీ నుంచో "అదే నీవు, అదే నేను, అదే గీతం పాడనా" అంటూ ఏ ఆత్రేయ బరువు పాటో వినబడి మాయకమ్మినట్టు ఆ  వైపు నడిచి, పాటలో ఆరాటం గమనింపుకి వచ్చి, మనసు కదిలినపుడు, మనసంటూ ఉందని గుర్తు చేసిన ఆ స్వరానికి ఎన్ని వేల మనసులు నీరాజనాలు పలికి ఉంటాయి?

మరి ఆ దీవెనలూ, కోరికలూ, నీరాజనాలూ అవన్నీ మూటకట్టుకున్న బాలు- 

 

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ


ఏదో ఓ కార్యక్రమంలో పాడుతూ, పాడిస్తూ,


ఏ సినిమాలోనో నటిస్తూ, నర్తిస్తూ,


అలా ఎల్లకాలం రాగాలకి భావాలద్దుతూ, గాత్రానికి గమకాలద్దుతూ ఉండిపోతాడనే కదా అనుకుంటాము? 

మరి ఇదేమిటీ ఉన్నట్టుండీ ఈ పిడుగుపాటు?

ఏదో మాయ జరిగినట్టే. మాయచేసి మాయమైపోయాడు. ఇన్ని దశాబ్ధాలుగా అలా మాయజేస్తూనే కదా మనలని అంతగా అలరించాడు. 

మాయే మరి. పాటని అభినయించే నటుడి పెదాల నుంచి కాకుండా గొంతు నుంచి వస్తున్నట్టే ఎలా భ్రమింపజేసాడు? ఒకరా, ఇద్దరా? ఒక భాషా రెండు భాషలా? యావత్ భారతదేశంలో సినిమాల్లో నటించిన ఎందరో సూపర్ స్టార్ల గొంతుకలన్నిటినీ తన గొంతునుంచే వినిపించలేదూ? అసలు ఆ ఎనభై, తొంభై దశకాలలో హిందీపాటలతో దేశమంతా యువత ఎంతగా ఊగిపోయిందనీ? అసలూ, ఇన్ని వేల కోట్ల జనాభాలో బాలు పాట ఏదో ఓ దశలో, ఏదో ఓ భాషలో వినకుండా, మాయలో పడకుండా ఉన్నవారు అతి తక్కువేమో కదా? 

నటుల సహజమైన గొంతు సరేసరి. వారి పాత్రల వయసుకి తగ్గట్టు మలిచే నేర్పు ఎన్నిసార్లు అచ్చెరువొందించలేదూ? పడుచు అన్నమయ్య-అదే మన నాగార్జున గొంతు "ఏలే ఏలే మరదలా" అంటూంటే ఆ చిలిపితనం, వృద్ధ అన్నమయ్యగా నాగార్జున " అంతర్యామీ, అలిసితి సొలసితి" అంటూంటే ఆ వణుకూ, వేంకటేశ్వరుడు సుమను గొంతులో ఆ వెంటనే పలికిన లాలింపూ, గాంభీర్యం, ఎంత అవలీలగా తనకున్న ఒకే గొంతులో మార్చేస్తూ ఏమార్చాడనీ! సరే, నటుల విషయంలో ఆతని గాత్రప్రభయితే కొత్తగా మనం చెప్పేదేమీలేదు. బాలుకు అది కొట్టిన పిండేనని జగమంతటికీ తెలుసు. నటులు కాస్తా నటిగా నటించే సినిమాల్లోనూ తన మాయ చూపించేయలేదూ? అప్పట్లో- అంటే 90లలో ‘మేడం’ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ స్త్రీగా నటించి అలరించలేదూ? ఆ స్త్రీ గొంతులో మాయాజాలం మర్చిపోతామా? "ఓ మహిళా, నిదురనుంచి మేలుకో" అని భువనచంద్ర గారి పాట అది. దాన్ని విని అప్పట్లో జనాలంతా అది పాడింది అమ్మాయనీ, అబ్బాయనీ, రాజేంద్రప్రసాదేననీ ఎన్నెన్ని ఊహాగానాలు చేసారు? తీరా చూస్తే అదీ బాలూయే. ఆ పాట ఇప్పుడు విన్నా ఆశ్చర్యమే. ‘వందల గొంతులని ఒకే గొంతులో ఇముడ్చుకుని పుట్టాడా ఏంటీ ఈ బాలూ?’ అని. 

గొంతు సరే. అతని నటనతోనూ ఎంత మాయ చేసేవాడనీ? సరదా అయిన పాత్రలు కొన్ని, గంభీరమైన పెద్దమనిషి పాత్రలు మరికొన్ని, పసిపిల్లాడంటి అమాయకమైన పాత్రలు, అసలు ఇవన్నీ ఒకెత్తు అయితే, ఆ మిథునం లో అప్పదాసు గుర్తున్నాడు కదండీ? అదొక్కటీ మరో ఎత్తు అనిపించలేదూ?! ఎంత నవ్వించాడో, అంతగానూ ఏడిపించాడు తన నటనతో. ఆ నటనా మాయాజాలమే మరి. ఆ మాయతో అలరించినపుడు ఆనందించాముగా. ఇపుడిక ఈ దుఃఖమూ భరించాలేమో. 

ఇదంతా కరోనా వల్ల కదూ? కొన్ని నెలలుగా ఈ కరోనాకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్ని జీవితాలు కుదేలవుతున్నాయో? మనసుని మెలితిప్పే ఎన్ని విషాదాలు చూసామో? కరోనా ఒక్కటీ వెళ్ళిపోయి, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకెళ్ళినవారందరూ తిరిగివస్తే ఎంత బాగుండు?

*****