MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అర్చన ఫైన్ ఆర్ట్స్ రచనల పోటీలు
భ్రమ
దేవులపల్లి దుర్గాప్రసాద్
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ
"అమ్మా ! ఇదిగో నిన్న నేను వేసిన బొమ్మ కి ఫస్ట్ ప్రైజు వచ్చింది. ఆ! నాన్నగారు చూడలేదు నే వేసిన బొమ్మ. ఇదిగోండి నాన్నగారూ"అంటూ స్కూల్ నుండి వచ్చిన ప్రమోద్ తెగ కబుర్లతో హడావుడిగా వున్నాడు. ప్రమోద్ ఒకటో తరగతి చదువుతున్నాడు.
"ప్రమోద్! త్వరగా బట్టలు మార్చుకుని, టిఫిన్ తినేసి కబుర్లుచెప్పుకోమ్మా, మీ అమ్మా, నాన్నలతో. వాళ్ళెప్పుడూ ఉండేవారేగా. టైమే మనకోసం ఉండదు. " అంటూ ఆయా విజయ పిలుస్తోంది.
"అబ్బ ఉండక్కా. వచ్చేస్తున్నా. చూడమ్మా విజయక్కా, మీతో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తోంది. రేపట్నుంచి ఈ అక్కని మనింటికి రావద్దని చెప్పు." ఇంతలో విజయ వచ్చి ప్రమోద్ ని ఎత్తుకుని తీసుకెళ్తూ, "అలాగేలే నేను నిన్నట్నుంచి రాను సరేనా!" అని నవ్వుతూ, ప్రమోద్ పొట్ట మీద తన ముక్కుతో కితకితలు పెట్టింది. ప్రమోద్ కూడా నవ్వుతూ విజయ చేతుల్లోంచి జారిపోయి పరుగెత్తాడు. తనకున్న నేర్పుతో ప్రమోద్ ని లాలించి, బుజ్జగించి టిఫిన్ పెట్టి పడుకోబెట్టింది విజయ. అప్పటికి సాయంత్రం 4 గంటలు అయింది. తను కూడా ఒక అరగంట పడుకుని లేచి, రాత్రి వంటకి ఏర్పాట్లు మొదలెట్టింది.
ఇంతలో హాల్లో ఫోన్ మోగింది. విజయ ఫోన్ ఎత్తి "హలో" అంది. "ఆ విజయా, బాబు స్కూల్ నుండి వచ్చేడా? " అవతలనుండి ప్రమోద్ తల్లి హేమ గొంతు వినబడింది.
"ఆ వచ్చేడమ్మా. టిఫిన్ పెట్టేను. తిని, కాస్సేపు ఆడుకుని పడుకున్నాడు."
"రాత్రికి మా ఆఫీసులో డిన్నర్ ఎరేంజ్ చేస్తున్నారు. నేను రాను. అయ్యగారికి, నీకు, బాబుకి మాత్రమే వండు. సరేనా!"
అంటూ ఫోన్ పెట్టేయబోతున్న హేమతో "అమ్మా! " అని గాభరాగా అంది. "ఆ ఏంటి చెప్పు." " బాబు వేసిన బొమ్మకి ఫస్ట్ ప్రైజు వచ్చిందట, మీతో ఫోన్లో మాట్లాడించమని చాలా అల్లరి చేసాడమ్మా. ఒకసారి లైన్ లో ఉంటారా లేపి తీసుకొస్తాను."
"అమ్మో ఇప్పుడు కుదరదు విజయా. వాడు నిద్రనుండి లేచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. రేప్పొద్దున్న చూస్తాలే." అంటూ ఫోన్ పెట్టేసింది.
ఒక అరగంట తరువాత, ప్రమోద్ తండ్రి సుకుమార్ ఫోన్ చేసాడు. " విజయా. ఈ రాత్రికి నేనుభోజనానికి రావట్లేదు. మా బాస్ వాళ్ళింట్లో ఒక చిన్న పార్టీ వుంది. నీకు, అమ్మ గారికి, బాబుకు వండుకో. అంతే. అమ్మగారికి నే చెప్తాలే." విజయ తిరిగి మాట్లాడుదామనుకునే లోపల ఫోన్ పెట్టేసాడు.
సాయంత్రం ఆరుగంటలకి బాబు నిద్ర లేస్తూనే "అక్కా ! అమ్మా, నాన్నగార్లతో మాట్లడించ మన్నానుకదా మరి నువ్వు ఫోన్ చెయ్యలేదేం?" అంటూ ఏడుపు మొదలెట్టాడు.
"ఏంటి బాబూ నువ్వు. మరీ అంత మొద్దు నిద్రా? ఎంత సేపు వైట్ చేసారో ఇద్దరూ ఫోన్లో!" అంటున్న విజయ నడ్డిమీద తన చిట్టిచేతులతో "అబద్ధాలు! అబద్ధాలు!" అంటూ కొట్టసాగాడు.
"లేదు బుజ్జీ! నువ్వెంతకీ నిద్ర లేవకపోవడంతో, వాళ్ళిద్దరూ వచ్చి నీకు గిఫ్టులు కూడా పెట్టి వెళిపోయారు. మరి వాళ్ళకి ఆఫీస్ టైం అయిపోతోందికదా. కావాలంటే నువ్వే చూడు." అంటూ ప్రమోద్ ని ఎత్తుకుని తన బెడ్ రూం లోని, టేబుల్ మీద ప్రమోద్ రోజూ కబుర్లు చెప్పే వాళ్ళ అమ్మా, నానా ఫొటోల ముందున్న చిన్న చిన్న గిఫ్ట్ లు చూపించింది. వాటిని చూడగానే ఏడుపు ఎగిరి పోయింది ప్రమోద్ కి. "థేంక్ యూ అమ్మా ! థేంక్ యూ నాన్నగారూ! " అంటూ తన మామూలు ధోరణిలో, ఆ ఫొటోలలోనే వాళ్ళిద్దరిని చూసుకుంటూ కబుర్లు చెప్పేసుకుంటున్నాడు ప్రమోద్. బాబు ఏడిస్తే ఇలా చెయ్యమని వాళ్ళు చేసిన ఏర్పాటే ఇది. ఇదంతా చూస్తున్న విజయ కి కన్నీరు ఆగలేదు. వెంటనే ఆ గది లోంచి బయటకు వచ్చేసింది.
***
సుకుమార్ ఒక పెద్ద కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పెద్ద అధికారి. హేమ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం లీడర్. ఇద్దరూ కలిపి నెలకి మూడు లక్షలు సంపాదిస్తున్నారు. ఆ సంపాదనకోసమే వాళ్ళ టైం సరిపోతోంది. కొడుకు కోసం వాళ్ళు వెచ్చించే టైం వారాంతరాల్లో మాత్రమే. అది కూడా ఇతర వ్యాపకాలతో కలిపే కాని, ప్రత్యేకంగా తమ చిన్నారి ప్రమోద్ కోసంకాదు.
కొడుకు పుట్టిన ఏడాది వరకూ, హేమ ఏ ఉద్యొగం లోనూ చేరలేదు. ఇతరుల ఆస్తి పెరుగుదలలూ, ఆడంబరాల విదేశీ విహారాలూ చూసి సుకుమార్ తామూ అలా ఉండాలంటే, హేమ కూడా జాబ్ చెయ్యాల్సిందే అనుకున్నాడు. బాబుని చూసుకోవడానికి సుకుమార్ తల్లిదండ్రులు, హేమ తల్లిదండ్రులు వారి వారి అనారోగ్యాల వలన, ఇతర కుటుంబ బాధ్యతలవలన రాలేమని చెప్పేసారు. బేబీ కేర్ సెంటర్ లో బాబుని వదలడానికి ఇష్టం లేక హేమ ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. తనుకూడా ఉద్యోగం చేస్తే తమ ఆర్ధిక స్థితి తాము ఊహించనంత ఎత్తుకు ఎదుగుతుందని సుకుమార్ మెల్లగా తనకి నచ్చచెప్పాడు.
మొదట్లో అయిష్టంగానే చేరినా, ఆ తరువాత, ఉద్యోగపు వాతావరణం హేమని బాగా ఆకర్షించిది. దానికి తోడూ, విజయ లాంటి నమ్మకమైన ఆయా దొరకడంతో వాళ్ళ కోరికల రథం మరింత వేగంగా పరుగులు తీయడం మొదలెట్టింది.
హేమ ఉద్యోగంలో చేరిన కొత్తలో, ఒక స్మార్ట్ ఫోన్ విజయ దగ్గరుంచి దానితో బాబుతో వీడియో కాల్స్ చేస్తూ వుండే వారు. కానీ, క్రమక్రమంగా ఉద్యోగంలో తీరిక లేక పోవడం వలన, బాబు కూడా తరుచూ అమ్మని, నాన్నని చూస్తానని అంటూ ఉండడం వలన ఇబ్బందిగా ఉంటోందని ఆ స్మార్ట్ ఫోన్ కూడా తీసేసారు.
కొడుకుతో సరే, ఆ దంపతులిద్దరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మనసారా మాట్లాడుకోవడం వారాంతమే. అప్పుడు కూడా, మనసులేమీ బట్టల మూటలు కావు గదా, ఇలా ముడి విప్పేసి పడేయడానికి. మనసు విప్పాలంటే దానికో మూడ్ , ఒక చక్కని బేక్ గ్రౌండూ ఉండాలి. అవన్ని కుదిరేది చాలా అరుదైపోతోంది ఈ మధ్యన.
హేమ పనిచేస్తున్న సంస్థలో కిషోర్ అనే కుర్రాడు చేరాడు కొత్తగా. మొదటి ప్రోజెక్ట్ తోనే ఉత్సాహంగా పనిచేసే కుర్రాడనే సద్భావాన్ని కలిగించాడు అందరిలో. దాంతో సహజంగానే , టీంలీడర్ అయిన హేమ అతన్ని తన మిగతా ప్రోజెక్టులకు కూడా తీసుకుంది. అందరిలోకి చిన్న వాడు కావడంతో అతనికి ఎక్కువ పని చెప్తూ, అతనిమీదే ఆధార పడసాగింది. ఈ నేపధ్యంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. హేమ ఆఫీసుకి వెళ్తూ కిషోర్ ని పికప్ చేసుకెళ్ళడం , ఆలస్యం అయితే కిషొర్ ని ఇంటికి రమ్మనమని తనింట్లోనే భోజనం పెట్టడం లాంటివి జరుగుతున్నాయి. ఒక్కోసారి వాళ్ళిద్దరినీ సుకుమార్ దించేవాడు వాళ్ళ ఆఫీస్ దగ్గర. వారాంతంలో కూడా కిషోర్ కోసం కొంత సమయం కేటాయించేవారు దంపతులిద్దరూ. కానీ వృత్తి పరమైన సాన్నిహిత్యంవల్లనో, సుకుమార్ తన మార్కెటింగ్ పనుల్లో తనకోసం సమయం కేటాయించలేకపోవడం వల్లనో తెలియదు కానీ, హేమ కిషోర్ తోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతోంది. అది మొదట్లో అంతగా పట్టించుకోకపోయినా రాను రానూ సుకుమార్ గమనించసాగాడు. హేమకి చెప్దామంటే సున్నితమైన విషయమయికూర్చుంది. అలాగని తనలో తను సర్దుకోలేక పోతున్నాడు. అప్పటికీ చాలా సార్లు హేమతో ఏకాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఇంట్లో ఉన్నంత సేపూ అలసటలు, ప్రమోద్ తో ఆటలు,నిద్ర, తిండి అంతే, వాటి తోటే అయిపోతోంది. ఇక ఆఫీస్ లో తనెప్పుడూ ఫోన్లో ఒంటరిగా దొరకదు. పక్కనెప్పుడూ కిషోర్ ఉంటాడు. సుకుమార్ తనతో ఏదో చెప్దామనుకుంటున్నాడు అని హేమ గమనించక పోలేదు. కానీ దానికి తగినవిధంగా స్పందించడానికి కావాల్సిన తీరిక, సమయం కేటాయించలేక పోతోంది హేమ. రెండు రోజుల్లో ఆ విషయం మాట్లాదామని అనుకోవడం, అది అలా వాయిదాలతో, మతిమరుపులతో వెనక్కి వెళిపోవడం చాలాసార్లు జరిగింది.
ఇంతలో సుకుమార్ ఆఫీస్ లో ఒక మార్పు వచ్చింది. సుకుమార్ కి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ, అతనికి సహాయంగా అంజలి అనే ఒక లేడీ అసిస్టెంటు ను నియమించారు. అదనపు ఆదాయంతో పాటు వచ్చిన అదనపు బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించడంలో తను బిజీ అయిపోయాడు. అందునా తన అసిస్టెంట్ అంజలి కూడా ఉషారుగా ఆఫీస్ పనులన్నిటిలోనీ సహాయకారిగా ఉండడంతో సుకుమార్ దృష్టి హేమ మీదనుండి తాత్కాలికంగా మరలింది. తన బాసుకి నచ్చినట్టుగా మసలడంలో అంజలి ఎంతో నేర్పుతో వ్యవహరిస్తోంది.
ఈ నేపధ్యంలో ఇద్దరి ఆఫీసుల్లోనూ సహజంగానే పుకార్ల షికార్లు మొదలయ్యాయి. సుకుమార్ కి అంజలికి మరియు హేమకి కిషోర్ కి ఒకరంటే ఒకరికి ఇష్టమని, త్వరలోనే సుకుమార్ , హేమ విడాకులు తీసుకుని ఈ రెండు కొత్త జంటలుగా మారిపోతారని అందరూ అనుకోసాగారు. ఆ విషయాలు ఈ నలుగురికీ చేరాయి.
అనుమాన బీజాలు సుకుమార్, హేమ మనసుల్లో కొంచం లోతుకి దిగడం మొదలెట్టాయి. కిషోర్ తోటి సాహచర్యమనే భ్రమలో పడి హేమ తమిద్దరి బంగారు భవిష్యత్తు నాశనం చేస్తోందని సుకుమార్ అనుకున్నాడు. అంజలి తో వలపు భ్రమలో పడి, సుకుమార్ తనకు, బాబుకు దూరమయిపోతున్నాడని హేమ అనుకుంది. అనుమానాలు ఇద్దరిలో చెలరేగినా, ఒకరిపై ఒకరికి మనసు పొరల్లో దాగిఉన్న అనురాగాల చెలమ మాత్రం ఇంకా ఇంకిపోలేదు. దాంతో ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే నిర్ణయం తీసుకున్నారు. తామిద్దరం కలిసి మనసు విప్పి మాట్లాడుకోవాలని.
ఆరోజు రానే వచ్చింది.
ఒకనాటి సాయంత్రం, నాలుగు గంటలకే ఆఫీస్ నుండి బయటకు వచ్చేసింది. తన కారు నడుపుకుంటూ సుకుమార్ ఆఫీస్ వైపు పోనిచ్చింది. అదే సమయంలో సుకుమార్ కూడా హేమతో మట్లాడాల్సిన సమయం వచ్చేసిందని, తను త్వర పడితే మంచిదని అనుకొని, తన ఆఫీస్ లోనుండి బయల్దేరి హేమ ఆఫీస్ వైపు కారూ నడుపుతూ వెళ్తున్నాడు. ఇద్దరిదీ ఒకటే ఆలోచన, అకస్మాత్తుగా కనిపించి అవతల వారికి సర్ ప్రైజు ఇద్దామనే. కార్లు నడుపుతూ ఇద్దరూ తామిద్దరూ గడిపిన గత కాలపు మధురస్మృతుల భావ తరంగాల్లో తేలియాడుతున్నారు.
దారిలో ఒక సిగ్నల్ దగ్గర హేమ కారు తనకి ఎదురు రోడ్డులో రావడం గమనించాడు సుకుమార్. వెంటనే తన దారిలోకి వెళ్ళలని ఆతృతగా యూ టర్న్ తిప్పాడు తన కారుని. అప్పటికే గ్రీన్ సిగ్నల్ పడి రోడ్డు ఖాళీగా ఉండడంతో వెనకనుండి వేగంగా వస్తున్న కంటైనర్ లారీ సుకుమార్ కారుని బలంగా ఢీకొంది. ఆ దెబ్బకు సుకుమార్ కారు పల్టీలు కొడుతూ పడిపోయింది. తన కళ్ళముందే సుకుమార్ కారు తన దారిలోకి రావడం, ఆ సిగ్నల్ దగ్గర ప్రమాదానికి గురికావడం చూసిన హేమ ఆ షాక్ లో తను కూదా వెళ్ళి పక్కనున్న స్థంభానికి గుద్దేసింది.
***
ఎయిర్ బేగ్ తెరుచుకోవడంతో, సుకుమార్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి, కోలుకుంటున్నాడు. హేమకి కూడా బలమైన గాయలు తగిలినా త్వరగా హాస్పిటల్ కి తీసుకు రావడంతో తనకీ ప్రమాదం తప్పింది. హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి రూంకి షిఫ్ట్ చేసారు సుకుమార్, హేమలని ఇద్దరినీ. రూంకి షిఫ్ట్ అయిన తరువాత ఆరోగ్యాలు కొంతకుదుట బడడంతో ఇప్పుడు ఇద్దరికీ ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. వారికి సాయంగా సుకుమార్ తండ్రి రాధాక్రిష్ణ పగటి పూట ఉంటే , రాత్రికి హేమ తమ్ముడు హరీష్ ఉంటున్నాడు. విజయ ఇంటి పనులు, బాబు పనులు చూసుకు వచ్చి, కేరేజిలు ఇచ్చి వెళుతోంది. సుకుమార్ తల్లి కూడా వచ్చి ఇంటి దగ్గర పనుల్లో సాయంగా ఉంటోంది.
ఒకరోజు మధ్యాహ్నం భోజనాల తరువాత, విజయ సెల్ ఫోన్లో ఆ ముందురోజు ప్రమోద్ చేసిన పనుల తాలూకా వీడియో చూపెడుతోంది, దంపతులిద్దరికీ, సుకుమార్ తండ్రి రాధాక్రిష్ణకి.
అందులో, ప్రమోద్ స్నానం చేసిన తరువాత తువ్వాలు చుట్టుకుని పూజ గదిలోకి వెళ్ళాడు. డేవుడి పటాల ముందు కూర్చుని చిన్న శబ్దంతో ఏవేవో శ్లోకాల్లాంటివి చదివేసి, అక్కడ బొట్టు తను పెట్టుకుని, కొంత బొట్టు చేత్తో పట్టుకుని తన బెడ్ రూం వైపు నడుస్తున్నాడు.
ఇదంతా చూస్తున్న సుకుమార్ కి, హేమకి ఆశ్చర్యంతో పాటు, కొడుకి మీది వాత్స్యల్యం కూడా పొంగి పొర్లుతోంది. తిన్నగా సుకుమార్, హేమల ఫొటోల దగ్గరికి వచ్చి ఆ బొట్టు రెండు ఫొటోలకీ పెడుతున్నాడు. ఇంతలో వెనక నుండి విజయ అడిగింది, "బాబూ ఎందుకలా అమ్మ, నాన్నలకి బొట్లు పెడుతున్నావూ" అని. "నువ్వు చెప్పేవు కదా అక్క, అమ్మా, నాన్నగారూ అమెరికాకి ఆఫీస్ కేంప్ వెళ్ళేరని, అక్కడ వాళ్ళకి అంతా బాగుండాలని ఆ దేవుడి బొట్టు పెడుతున్నాను." బుజ్జిగా చెపుతున్న బాబు వీడియో ఒక్కసారి కదిలి పోయింది. బాబు మాటలు విన్న వారు కూడ కదిలి పోయారు. విజయ అలా మాట్లాడుతున్న ప్రమోద్ ని ఆర్తిగా ఎత్తుకుని ముద్దు పెడుతోంది.ఆ శబ్దాలు మాత్రమే వినబడుతున్నాయి.
వీడియో ఆగిపోయింది. సుకుమార్ కి, హేమకి కనులవెంట కన్నీరు మాత్రం ఆగట్లేదు. రాధాక్రిష్ణ రుమాలుతో తన కళ్ళను తుడుచుకుంటున్నాడు. కొంతసేపు తరువాత, తమాయించుకుని గద్గద స్వరంతో అంటున్నాడు సుకుమార్, "పిచ్చి వెధవ! చిన్నప్పటినుండి ఆ ఫోటోలలోనే మమ్మల్ని చూసుకుంటున్నాడు. వాటితో మాట్లాడి, మాతోనే మాట్లాడినట్టుగా భ్రమలో ఉంటున్నాడు. ప్చ్! " అని ఇంక మాట్లాడలెక పోయాడు. హేమ ఇంకా ఏడుస్తూనే ఉంది నిశ్శబ్దంగా.
" నాన్నా సుకుమార్! "ఎంతో ఆప్యాయతతో తండ్రి రాధాక్రిష్ణ చెప్తున్నాడు, " భ్రమలో ఉన్నది వాడొక్కడే కాదురా. మీరు కూదా. అవసరాలకి మించిన ఆడంబరాలకోసమై అందమైన బ్రతుకును, అనుబంధాల మధురిమలను తాకట్టు పెట్టేస్తున్నారు. అదే సరైన లైఫ్ స్టైల్ అనే భ్రమ లో బ్రతికేస్తున్నారు. వాడి భ్రమ అమాయకపు భ్రమ. మీ భ్రమ అంతులేని అయోమయపు భ్రమ. భ్రమలో పడడం సాధారణమే అయినా, అందులోంచి ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత త్వరగా బతుకులు బాగుపడతాయి."
ఇంతలో ఒక నర్స్ ఏదో పనిమీద ఆ రూం లోకి వచ్చింది. రూంలో ఉన్నవారి విషణ్ణ వదనాలని, ఆ గంభీర వాతావరణాన్ని చూసి వెంటనే బయటకు వెళిపోయింది.
" నేను తప్పు చేసాను నాన్నగారూ. డబ్బు యావలో పడి అవసరం లేకపోయినా హేమ చేత బలవంతంగా ఉద్యోగం చేయించి, అటు కన్నకొడుకుకీ ముద్దూ ముచ్చట పంచలేక, ఇటు మేమిద్దరమూ ఏ మమతలనూ పంచుకోక అపార్ధాలతో ఆవేదనలతో రగిలి పోయాము." అంటున్నాడు సుకుమార్.
"నేనీరోజే నా రిసిగ్నేషన్ లెటర్ పంపించేస్తాను" అంది హేమ స్థిరంగా.
" తప్పకుండా హేమా. ఈ విషయంలో నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను మన్నించు" అన్నాడు సుకుమార్ హేమ చేతిని అతి కష్టం మీద తన చేతితో అందుకుని నొక్కుతూ.
అది చూస్తున రాధాక్రిష్ణ , విజయల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"అయితే ఇంక బాబు నా ఫొటోతో కబుర్లు చెప్తాడేమోనమ్మా" విజయ అంది.
" ఛ ఛ నువ్వెక్కడికి వెళిపోతావ్? మా బాబుని పువ్వుల్లో పెట్టి మాకు అందించినది నువ్వు. వాడిని ఇలాంటి భ్రమలకి దూరంగా పెంచాలి మనం " అంది హేమ విజయ చెయ్యి లాక్కుని తన చేతిలో వేసుకుంటూ.
*****