top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ రచనల పోటీ

ఆలోచనే మార్గము

pvr.jpg

గోపీనాథ్ పిన్నలి 

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండవ బహుమతి పొందిన పద్యకథ

1. ఉ. నాయన నేను బాల్యమున నాన్ననెరుంగక యీరసమ్ముతో

మా యమ మాటలే వినక మైకము నందున యిల్లు వీడినన్

మాయ తొలంగ జేసెగద మాధవి మాటలు దారి మార్చగా

ఛాయలు సైతమున్ దొలగ ఛాయకు ఛాయగ మారిపోతిగా...

(ఈరసము...కోపము...ఇక్కడ క్షణికావేశము

భావము... బాబూ లోగడ నేను కూడా ఇలాగే మా నాన్నమనసు తెలుసుకోలేక, ఆయన తిట్లను భరించలేక, అమ్మ వివరిస్తున్నా వినకుండా రాత్రికి రాత్రే ఇల్లు విడిచి చెరువులో దూకాలనుకున్నాను. కానీ మాధవి అనే యువతి నన్ను ఆపి తగి దారి చూపడం వలననే ఈ ఛాయ( అనే భార్య) కు నీడలామారి మంచివాడినయ్యాను...)

 

2. తే.గీ. అనుచు రాజేశు మిత్రుని యనుగు సుతుని

బాట తప్పించ యత్నించ బాళితోడ

ఆతడడిగెను గౌతుక మాపలేక

వివరమంతయు మామనె వినయముగను...

(బాళి..ప్రేమ

భావము... రాజేశం వయసులో  ఉన్నప్పుడు ఆత్మ హత్యా చేయబోగా మాధవి అను యువతి అడ్డుకుని చిత్తు కాగితాల ఏజంటు దగ్గరకు చేర్చింది. క్రమంగా అతను ఒక సంపాదకుని చొరవతో పెద్దల ప్రాపు పొంది  ప్రముఖ సంఘ సేవకుడైనాడు. అతనికి తోడుగా నిలిచిన భార్య పేరే ఛాయాదేవి.

 కాలం గడిచి మిత్రుని కుమారుడైన రంగరాజు ఇలాగే  ఆత్మ హత్యా యత్నం చేయబోగా మృదువుగా మందలిస్తూ తన గతం తవ్వుకున్నాడు..)

 

3. ఆ.వె.. శాస్త్రములును రెండు సగటు మార్కులె యిచ్చు

ఆంగ్ల భాష చూడ నంతె యెపుడు

లెక్కలన్న తనకు చిక్కు సమస్యయే

తెలుగులోనె చూపు తెలివి మెండు...

(భావము...సామాన్య, సాంఘిక శాస్త్రాలు రెండింటా సగటు మార్కులే. ఇంగ్లీషూ అంత మాత్రమే. లెక్కలు సరేసరి. కేవలం తెలుగు ఒక్కటే ఇతనికి బాగా వచ్చిన సబ్జెక్టు.)

4. తే.గీ. ఆరు క్లాసులు తానెట్లొ యధిగమించె

ఏడు చివరన జిల్లాయె వీడలేదు

అన్ని పేపర్లు సగటునే యందజేయ

లెక్కలొక్కటె తెచ్చెగా చిక్కులెన్నొ

తల్లి దండ్రులు సిద్ధమే తాట దీయ...

(అందుకే మొదటి ఆరు క్లాసులూ ఎలాగో నెట్టుకు వచ్చినా ఏడో తరగతి జిల్లా బోర్డు పరీక్షలు కావడంతో ఫెయిల్ కాక తప్పలేదు.)

5. ఆ.వె. మొదటి నుంచి నీది మొద్దు స్వరూపమె

తెలుగుతోనె వెలుగు తేలికగున

ఎన్ని చెప్పి యేమి యెక్కించుకోవుగా

బ్రతికి నీవు మాకు బారమేగ.....

6. ఆ.వె. తల్లి యిట్లు తిట్ట, తండ్రియె కొట్టెను

చెల్లి చూపులోన చీత్కరింపు

తాత, నాయనమ్మ దరికి తీయ వెరవ

బ్రతుకె తనకు పెద్ద భారమాయె....

7. ఆ.వె. స్నేహితులను కలసి చింతన చేసెను

చావు యెకటె యన్ని చక్కబరచు

నన్న సబబు కాని యాలోచనే వచ్చె

చెప్పువారు లేక చేయ దలచె...

(అమ్మా నాన్న ఇద్దరూ తిట్టారు. నానమ్మ కూడా వారికి భయపడో లేక తన  బాధ్యతారాహిత్యానికి వెరచో దగ్గరికి తీయలేదు. దాతో..

సావాసగాళ్ళతో మంతనాలు జరిపాడు. వారూ తనలాంటివారే కావడంతో చావడమే మార్గం అనుకున్నాడు.  ఆ రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరిన తనను అమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని మరోసారి తిడుతూనే నాలుగు మంచి మాటలు చెప్తూ బుద్ధిగా చదువుకోమని అన్నది కానీ బుర్రకెక్కలేదు. )

8. తే.గీ.  చెరువులో దూక యత్నించ చేర బిలిచి

మనసు మార్చెను  మాధవి మార్గమొకటి

చూపె కాగితముల నేరు సూర్య కడకు

చేర్చె నది తన భావికే చేసె మేలు.

(మాధవి యనే యువతి తనను ఆప్యాయంగా పిలిచి సంగతి తెలుసుకుని ధైర్యం చెప్పి తన మాదిరిగానే బ్రతకవచ్చని చెప్పి చిత్తు కాగితాలు ఏరే సూర్య అనే ఏజంటుకు పరిచయం చేసింది. అదే రాజేశానికి గొప్ప మేలు చేసింది. ఎలాగంటే....)

9. సీ.  వీధి బాలలతోడ వేగుట యననెట్లు?

------------------------ వీరి బ్రతుకు లందు వెలుగులెట్లు??

అనెడి యంశముపైన నర టావు మించని

------------------------ వచన కైతల నల్లవలయు ననుచు

వార పత్రికొకటి బాల రచయితల

----------------------- అక్షరముల సౌరు నాహ్వయించె

కొడిమె యెవరిదైన కుప్ప చేరెను ప్రతి

------------- తగిన బలము చూప తరుణమిదిగ

తే.గీ. మూడు రోజులె గడువని మూల్గె మనసు

కాని తన చదువె తనను కదప సాగె

ధైర్యమే నూరిపోయగా తగిన రీతి

దారి పొడవున యోచనల్ తడుమ జొచ్చె....

(వీధి బాలల సమస్య పై పదిహేను పంక్తులకు మించని వచన కైతల పోటీ గురించిన ప్రకటన పడిన వార పత్రిక లోని పేజీ ఇతని కంట పడింది.

అప్పటికే తనకు తెలుగు బాగా వచ్చి ఉండటం, తన జీవితానికి దగ్గరగా ఉందనుకుంటూ ....)

 

10. చం. అది తన జీవితమ్మునకె యద్దిన రీతిని యన్వయం బవన్

మది కదిలించ గానె యిక మాటలు జారెను మంత్రమేరిదో

తుదకొక కైతగా వెలిగి దూరము సేసెను వేదనేదియో

చెదరెగ నీడలన్ని మరి చేర్చెను గమ్యమె దైవ లీలగా..

(వ్రాసిన కైత బహుమతి పొందింది. పెద్దల దృష్టిలో పడింది. ఆ పత్రికాధిపతి చొరవతో ఒక సంఘసేవకుడు దగ్గరకు తీశాడు. చివరకు ప్రాజ్ఞుడై ఇల్లు చేరి, ఛాయ అనే యువతిని వివాహమాడి తనూ ఇలాంటి బాలలకు మ్రగ దర్శకుడు కాసాగాడు.)

కథ.. సంక్షిప్తంగా...

రాజేశం అనే బాలుడికి తెలుగు తప్ప ఇంకే సబ్జక్టులోనూ తగినన్ని మార్కులు. ఎప్పుడూ అత్తెసరు మార్కులే. ఫలితంగా ఏడో తరగతి తప్పాడు. అమ్మా నాన్నా గట్టిగా తిట్టిపోయడంతో పోయి చెరువులో దూకాలనుకున్నాడు.  ఆ రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరిని రాజేశాన్ని చూసిన తల్లి ఏదో అనుమానం వచ్చి దగ్గర కూర్చోబెట్టుకుని నాలుగు మంచి మాటలు చెప్పింది. కానీ అతను తల ఊపాడే గానీ మనసు మార్చుకోలేదు.

అనుకున్న పని చేసేయాలనుకుని చెరువు దగ్గరకు పోయి అందులో దూకబోయాడు. అప్పుడే అటుగా వచ్చిన మాధవి అనే యువతి తమ్ముడూ అంటూ పిలిచి విషయం విని తనలాగే కాగితాలు ఏరుకును బ్రతకవచ్చని చావాల్సిన పనిలేదనీ హితవు పలికింది. వెంట  తమ సీనియరైన సూర్య అనే అతని వద్దకు తీసుకువెళ్ళింది.

అలా కాలం గడుపుతుండగా...

ఓ రోజు చిత్తు కాగితాలు ఏరుతున్న రాజేశాన్ని ఓ వార పత్రికలోని పేజీ ఆకర్షించింది. అందులోనిు ప్రకటన సారాంశం...వీధి బాలలెందుకు తయారవుతున్నారు,  వీరి బతుకులెట్లా బాగు చేయాలి...అనే అంశంపై అరఠావు అనగా 15 పంక్తులకు మించని వచన కైత వ్రాయాలని పోటీ.

 

గడువు మూడు రోజులే.

 

అయినా అతనిలోని తెలుగు అభిమాని నిద్రలేచాడు. తను చేస్తున్న పనీ అదే కావడంతో తోచిన నాలుగు మాటలతో కైత అల్లుదామనుకున్నాడు.

కైత చక్కగా రావడమేగాక బహుమతి అందుకుంది. ఇతని వివరం తెలిసిన ఆ పత్రికా సంపాదకుడి చొరవతో ఓ సంఘసేవకుడు చేరదీసి తన దగ్గరున్న ఇతర పిల్లలతోపాటు విద్యాబుద్ధులు నేర్పించాడు. దాంతో రాజేశం ఆ పత్రికలోనే  ఉద్యోగం పొంది, తల్లి దండ్రులను కలిసాడు. భార్య ఛాయాదేవి. ఆమెకు తోడు నీడగా కాలం గడుపుతుతూ తన మాదిరి దారి తప్పేవారికి కౌన్సెలింగ్ ఇవ్వసాగాడు)

*****

bottom of page