top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

అహిద

AnilPrasad.jpeg

       అనిల్ ప్రసాద్ లింగం 

[*Ahida : A Quranic Name for Girls, meaning “one who takes care of others”]

 

1996 సెప్టెంబర్ 22.

 

సమయం సాయంత్రం అయిదు కావస్తుంది. ప్రధాని కార్యాలయంలోని అత్యవసర సమావేశ మందిరంలో మీటింగ్ ప్రారంభమయ్యింది.  

"వీ హావ్ ఏ సిట్యుయేషన్ సార్ !" ఉపోద్ఘాతం లేకుండా ప్రారంభించాడు IB చీఫ్. "ఏజంట్ M అనే ఒక మాజీ శతృ దేశ గూఢాచారి గతవారం ఉన్నంట్టుండి కరాచీలోని తన నివాసం నుండి మాయమయ్యాడు. అసలు ఇటువంటి ఏజంట్ల అస్థిత్వాన్నే ఏ దేశమూ ఒప్పుకోదు అటువంటిది ఆ దేశం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను కనపడటంలేదనే విషయాన్ని మనకు తెలిసేలా చేస్తుంది. అతను దుబాయ్ గుండా మన దేశంలోకి ప్రవేశించాడనే అనుమానాన్ని ప్రచారం చేస్తుంది. ఈ విషయం నా దృష్టికొచ్చాక విచారించమని ఈ కేసుని ఆఫీసర్ విక్టర్ కి అప్పగించాను" 

"ఒకవేళ అతను....." ఆర్దోక్తిగా ఆగాడు ప్రధాని.

"మన రహస్య ఫైల్స్అన్నీ తిరగేశాం సార్, అతను డబుల్ ఏజంటు కాదు. బాగా దేశభక్తి కలవాడు కూడా. వయసుడిగాక తన దేశానికి తిరిగెళ్లి విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. కొన్నాళ్ళపాటు కన్నేసివుంచాక మనవాళ్ళు అతన్ని పట్టించుకోవడం మానేశారు. చాన్నాళ్ల తర్వాత మళ్ళి ఇప్పుడు అతనిగురించి కూపీ లాగాల్సివచ్చింది. విక్టర్.... " అని తన పక్కనున్న ఆఫీసర్ని మిగతాది చెప్పమని ఆదేశించాడు. 

"సార్! మొన్న చీఫ్ ఈ కేసుని నాకు అప్పగించిన వెంటనే, ఆ ఏజంట్ Mని గురించి తెలుసుకోడానికి ముంబైలోని మన రా రహస్య బాండాగారానికి వెళ్లాను. నేను వివరాలు చెప్పిన వెంటనే అక్కడి సిబ్బంది ఆ ఫైల్ నా చేతికందించారు. అంత త్వరగా రిట్రీవ్ చేయగలిగినందుకు నేను వారిని అభినందిస్తే, అంతకు రెండు రోజుల ముందే వేరెవరో ఆ ఫైల్ తీయించారని, ఇంకా దాన్ని తిరిగి సర్దలేదని చెప్పారు. అది అడిగింది మేజర్ సింగ్ అని తెల్సింది సార్. ఇప్పుడు ఆయనకు ఆ ఫైల్ తో అవసరమేమొచ్చిందోనని, ఈ కేసుకు సంబందించిన మరిన్ని వివరాలేమైనా తెలుస్తాయేమోనని నేను ఆ ఫైల్ తీసుకొని వెంటనే చండీగఢ్ లోని ఆయనింటికి వెళ్ళాను.  కానీ ఆయన అక్కడలేడ్సార్" అందరూ స్థాణువై వింటున్నారు. "దేశానికి సంబందించిన అత్యంత రహస్య మిషన్ మీద వెళ్తున్నానని, ఈ విషయం బయటకి తెలియరాదని చెప్పి ఆయన రెండు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లారట. ఆయన పర్సనల్ గన్ మెన్, ఇతర సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆయన అక్కడ లేకున్నా, ఉన్నటే ప్రవర్తిస్తున్నారు. ఆయన ముంబై రా ఆఫీసునుంచి పూణే వెళ్లారని తెల్సి విచారిస్తే అక్కడ పూర్వపు ఉత్తర మండల ఇంటెలిజెన్స్ చీఫ్ కెప్టెన్ స్టాన్లీ జోన్స్ని కలిసారని తెల్సిందిసార్. ఆయనకోసం ప్రయత్నిస్తే తాను కూడా సీక్రెట్ మిషన్ అని చెప్పి ఇంట్లోంచి వెళ్లినట్టు తెల్సింది" 

"హో గాడ్ ! ఏం జరుగుతుంది ?" ఆదుర్దా వ్యక్తం చేసాడు హోం మినిస్టర్. "ఇంకెవరన్నా ఇలా కనపడకుండా పోయారా ?" అడిగాడు రక్షణ మంత్రి. 

"చెక్ చేస్తున్నాం సార్. ఇప్పటికైతే ఇంకెవరి గురించీ ఇటువంటి సమాచారం లేదు. వీళ్ళిద్దరే ఏమైయ్యారనేది కొంచెం ఆందోళన కలిగించే అంశం కాబట్టే, వాళ్ళని వెదికి కనిపెట్టేందుకు  'ఆపరేషన్ మాస్టర్స్'ని చెప్పట్టడానికి మీ అనుమతి కోసం ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాం" విశదీకరించాడు డిఫెన్స్ సెక్రటరీ. 

"అంటే అక్కడ ఆ ఏజంట్ M మాయమవడానికీ, ఇక్కడ మన వాళ్ళు కనపడక పోవడానికీ ఏదైనా లింక్ ఉందంటారా? లేక శత్రుదేశం ఏదైనా కుట్ర చేస్తుందా? మన దృష్టిని ఇటు మళ్లించి వాళ్ళు మరో వైపునుంచి దాడికి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా - తెలుసుకోండి. డోంట్ లీవ్ ఎనీథింగ్ టూ ఛాన్స్. ఈ సంవత్సరం, ఈ నెలా ప్రాధాన్యతలేమన్నా ఉన్నాయేమో కనుక్కోండి. రక్షణ వ్యవస్థలన్నింటినీ అలెర్ట్ చెయ్యండి. మేజర్ సింగ్ 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో కీలక పాత్ర వహించి మనల్ని గెలిపించారు, అటువంటి యుద్ధ వీరులని కాపాడుకోలేక పోవడం మనకు తలవంపులు తెచ్చే వ్యవహారంగా పరిణమిస్తది. ఈ విషయం ఎట్టి పరిస్థిల్లోనూ బయటకి పొక్కకూడదు. నిఘా వర్గాలని ఏకీకృతం చేసి శోధించండి. నాకూ, హోం మంత్రికీ, రక్షణ మంత్రికీ ఎప్పటికప్పుడు విషయలు తెలియచేస్తుందండి" ఆదేశించారు ప్రధాని. 

 

**

12 గంటల దేశవ్యాప్త విస్తృతాన్వేషణ తరవాత, మేజర్ చౌదరీ, స్టాన్లీ జోన్స్లతో ఏజంట్ M - ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొన్నాయి. అసుర సంధ్యా సమయంలో  తెనాలి నారాకోడూరు మార్గంలో నల్లని తారురోడ్డు మీద తెల్లని అంబాసడర్ కారొకటి  వేగంగా పోతుంది. అప్పటికే రోడ్డు మొత్తం మోహరించిన సైనికులు ఆ కారుని వెంటాడసాగారు. స్నయిపర్ దళం వడ్లమూడి ప్రాంతంలోని దారి పక్కన చింత చెట్ల మీద మాటువేసి ఉంది. కారు స్ట్రైక్ రేంజ్ లోకి రాగానే, ఏ మాత్రం ఆలశ్యం చెయ్యకుండా, ఎదురుగా వస్తున్నా వాహనాలు లైటు వెలుగులో ఆఫీసర్ విక్టర్, నున్నగా గెడ్డం గీసుకొని ముందు కూర్చున్నా ఏజంట్ Mని పోల్చుకొని గురి చూసి నుదిటి మీద కాల్చాడు. గ్లాసుకి చిన్న రంద్రం చేసుకొని దూసుకొచ్చిన బుల్లెట్టు తగిలి నెత్తురు ఉబకగా అతను చిన్న నిటూర్పుతో సీట్లోనే తలవాల్చేశాడు. జరిగింది గ్రహించి డ్రైవర్ని వెనుకనుంచి కావలించుకున్నాడు మేజర్. వెను వెంటనే అక్కడంతా టార్చి లైట్లు వెలిగాయి. కారు రోడ్డు పక్కన ఆగడం, పక్కకి ఒరుగుతున్నా M శరీరాన్ని మేజర్ పట్టుకొనే ప్రయత్నం చెయ్యడం, అక్కడే  చెట్టు చాటునున్న మరో సైనికుడు డ్రైవర్ సీటులోని వ్యక్తి గుండెలమీద కాల్చడం క్షణంలో జరిగి పోయాయి. 'అల్లాహ్' అంటూ అతనూ ప్రాణాలొదిలాడు. ఈ హఠాత్పరిణామానికి కంగారుగా వెనుక తలుపు తీసుకొని ముందుకొచ్చిన స్టాన్లీ  ముందు సీట్లోని దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా గుండె పట్టుకొని కింద పడిపోయాడు. వెనుకనుంచి దూసుకొచ్చిన జీపులోని సైనికులు కారుని చుట్టు ముట్టి, మేజర్ ని కిందకి దించి, ఆయన చెప్పేది కూడా వినకుండా తమతో బలవంతంగా తీసుకుపోయారు. ఆఫీసర్ విక్టర్ కారుని, ఏజంట్ Mని  క్షుణ్ణంగా తనిఖీ చేసాక అప్పుడే అటుగా వస్తున్నా సంగం డైరీ పాల లారీతో ఆ కారుని ఢీకొట్టించాడు. తరవాత  తన పై అధికారులకు 'కాన్వోకేషన్ పూర్తయ్యింది' అని టెలిగ్రామ్ పంపించి, మృతదేహాల్లానింటినీ ఫోటోలు తీయించి రెండో రోజు స్థానిక వార్తా పత్రికల్లో రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తుల మృతి అని ప్రచురింపచేసాడు.     

**

"మేజర్, ఈ కోర్టు మార్షల్ ఏర్పాటుకి కారణం కేవలం ఏం జరిగిందనేది తెలుకోవడం మాత్రమే. ఏజంట్ Mతో ఆంధ్ర ప్రాంతానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? కెప్టెన్ స్టాన్లీ జోన్స్ ఎలా  మృతిచెందారో  చెప్పండి"  ఈ  కేసు విచారణకు ఏర్పాటు కాబడిన 3 సభ్యుల బృందంలోని సీనియర్ ఆఫీసర్ ప్రశ్నించాడు తమ ముందు కూర్చున్నా సింగ్ ని.

"మమ్మల్ని వెదికే ఆపరేషన్ కి నేతృత్వం వహించిన ఆఫీసర్ ని  పిలవండి" బదులు పలికాడు సింగ్. 

"మేజర్ సాబ్ మేము మీకు ముందే చెప్పాం. మీ దేశ భక్తి పట్ల ఇక్కడెవరికీ కించిత్ కూడా అనుమానం లేదు. కేవలం ముందు ముందు ఇలాటివి జరగకుండా మన వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలంటే మాకు జరిగిందేంటనేది తెలియాలి, అందుకే అడుగుతున్నాం. దయచేసి సహాయకరించండి" రెండో సభ్యుడు సౌమ్యంగా వివరించాడు. 

"ఈ ఆపరేషన్ ని లీడ్ చేసినవాడిని  నేను కలవాలి" స్థిరంగా బదులిచ్చాడు యుద్ధ వీరుడు. 

"మేజర్, మిలట్రీ రూల్స్ మీకు తెలియనివి కావు. వ్యక్తుల కంటే దేశానికి ఇక్కడ ప్రాధాన్యమెక్కువ. మీరు సహాయ నిరాకరణ చేస్తే అది మీకే నష్టం కలుగచేస్తుంది గుర్తుంచుకోండి. ఏజంట్ M మిమ్మల్ని ఎలా కలిసాడు, అతనితో మీరెందుకు వెళ్లారు, మీ వ్యక్తిగత గన్ మాన్ కి గానీ, ఇంట్లో వాళ్ళకి గానీ ఈ విషయాన్ని ఎందుకు తెలియచెయ్యలేదు? చెప్పండి" మూడో సభ్యుడు కాస్త కఠినంగానే అడిగాడు. 

"నాకు ఆ ఆఫీసరు కావాలి" ఇలా గంటకు పైగా ఒకటే సమాధానం విని విసిగి పోయిన జ్యూరీ, అధికారులతో మాటలాడారు. కాసేపటికి యూనిఫార్మ్ లో లయ తప్పక నడచుకుంటూ వచ్చి మేజర్కి సెల్యూట్ చేసారు ఐబీ చీఫ్ మరియు ఆఫీసర్ విక్టర్. 

 

కుర్చీలోంచి లేచి తానూ సెల్యూట్ చేసి చెయ్యి కలపడానికన్నట్టు ముందుకుచాచి లాగి విక్టర్ చెంప చెళ్లుమనిపించాడు మేజర్. లిప్తపాటులో తేరుకున్న విక్టర్, తన ఆయుధం మీద చెయ్యి వేసి కన్నెర్ర చేసాడు. ఇద్దరి మధ్యకొచ్చిన ఐబీ చీఫ్ కంటి చూపుతోనే వికటర్ని నిలువరించి, సింగ్ గారి భుజం పట్టి, "మేజర్ ప్లీజ్!" అన్నాడు. 

" అస్సలు ఆలోచించావేరా? ఆ ఏజంట్ M వయసు, నా నిబద్దత, స్టాన్లీ నిజాయితీ ఇవేవీ పట్టవా నీకూ? నా చెంపదెబ్బ రుచి చూసావు కదా చెప్పు - ఈ వయసులో కూడా నన్ను నేను రక్షించుకునే బలం ఈ చేతుల్లో లేదనిపిస్తుందా? నీ అతివల్ల మూడు నిండు ప్రాణాలు పోయాయి కదరా, వాళ్ళని వెనక్కి తీసుకురాగలవా? హమేషా దిమాక్ సే నహీ, కభీ కభీ దిల్సేభి సోచ కారో !" అంటూ చెప్పనారంభించాడు. 

**

నాలుగు రోజుల క్రితం నేను రోజూ ఉదయం వాహ్యాళికెళ్లే పార్కులో నన్నెవరో అనుసరించడం గమనించాను. నా ప్రతీ కదలికనూ పసిగడుతూ వెంబడిస్తుండడం చూసాను. తర్వాతి  రోజు నేను తెలివిగా చెట్టు చాటున నక్కి వాడిని పట్టుకుని ఒక్క పిడి గుద్దుకే కింద పడేసాను. సెక్యూరిటీని పిలిచే లోపే వాడు నా చేతిలో ఒక కవరు పెట్టి పరుగుతీసాడు. వాడే ఏజంట్ M. ఆ ఉత్తరంలో తన రాకకు గల కారణాలు చెప్పి నన్ను సాయం అడిగాడు. 

**

వేగంగా పరిగెడుతున్న రైలు మొదటి తరగతి అది, సమయం అర్ధరాత్రి. బెర్త్ మీంచిలేచి కిటికీవద్దకు నడవబోయినామెని గమనించి,  

"కాళ్ళు కింద పెట్టకండి - పాడైపోగలవు" స్వచ్ఛమైన ఉర్దూలో చెప్పాడు పక్క బెర్త్ లోని అబ్బాయి. 

"పాఖీజా మేమూ చూసాం" కాళ్ళు పైకి తీసుకుని బుర్ఖాతో కప్పుకొని నవ్వుతూనే చెప్పింది ఆ అమ్మాయి. ఇంతలో గాలికి ఆమె ముఖం మీద పర్దా కొద్దిగా తొలగింది.  

"దిల్ సే తేరీ నిఘా జిగర్ తక్ ఉతర్గయీ - దోనోంకో ఇక్ అదామే రాజామంద్ కర్గయీ" మళ్ళీ చెప్పాడతను.                                     

 

"ఇది గాలిబ్ !" సర్దుకుంటూ వెంటనే చెప్పిందావిడ. 

"అయితే ఇది వినండీ. ఏక్ ఉమ్మీద్ సే దిల్ బెహలాతా రహా - ఏక్ తమన్నా సతాతి రహీ రాత్ భర్ !"                                           

 

  "ఫయిజ్ అహ్మద్ ఫయిజ్" చటుక్కున బదులిచ్చింది. 

 

"బాప్ రే బాప్. భయ్ వాహ్! మీకు అందరు షాయర్లూ తెలుసనుకుంటా"                                                                           

 

   "నేను ఉర్దూ సాహిత్యం చదివానండీ. ఇప్పుడు కూడా ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో చేరడానికి వెళ్తున్నా. స్టేషన్ ఎప్పుడొస్తుందో తెలియక, నిద్ర పొతే దాటిపోతానేమోననే భయంతో......"

 

"ఫికర్ నయి బీబీ. నాదీ అలీఘడే. తెల్లవారుఝామున 4 కి చేరుతుంది. నేను మేల్కొనే ఉంటా, మీరు పడుకోండి స్టేషన్ వచ్చాక నేను మిమ్మల్ని లేపుతాలే"

 

"పర్లేదు జనాబ్. మీకూ సాహిత్యంలో మంచి పట్టు ఉన్నటుంది" మాట కలిపింది చిన్నది. 

"అబ్బే మీ అంత కాదులేండీ. ఏదో అప్పుడప్పుడూ మిత్రులతో కలసి ముషాయిరాలకి వెళ్ళుతుంటాను. అక్కడ విన్నవీ, గుర్తున్నవీ ఇలా అప్పుడప్పుడు అందగత్తెల సోయగానికి నజరానాగా సమర్పిస్తుంటాను. కానీ మీరు పెట్టేసారు కదా. ఇంతకూ మీరక్కడ ఏమి చదవడానికి వెళ్తున్నారు?" వినయంగా అడిగాడు చిన్నవాడు. 

"ఉర్దూ సాహిత్యంలో డాక్టరేట్ చెయ్యడానికి వెళుతున్నా. ఇప్పటికే గాలిబ్ బాగా జనాల్లోకిచొచ్చుకు పోయారు కాబట్టి వేరెవరైనా షాయర్ గురించి పరిశోధన చెయ్యాలనుకొంటున్నా" 

"ఎవరో ఎందుకు ఫయిజ్ కవిత్వం గురించే పరిశోదించండి. తాను నాకు బాగా తెలుసు.మా వీధిలోనే ఉండే వాడు. విభజన తర్వాత పొరుగు దేశం వెళ్ళిపోయాడు కానీ, మాకిప్పటికీ మంచి మితృత్వం ఉంది. తన ప్రతీ కవితా నాకు ఉత్తరంలో రాసి పంపిస్తాడు"     

     

 "ఇన్షాఅల్లాహ్ ! అయితే మీరు నాకు ఆయన గురించి చాలా వివరాలు చెప్తారన్నమాట"

"నేనెందుకు తానే చెప్తాడు. ఈ సారి మన దేశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయనతో కలిపిస్తాను"                     

 

  "షుఖర్ హై, లేకపోతే మీరు చెప్పేవన్నీ రాసుకోడానికి కాగితం కలం బయటకి తీద్దాంమనుకున్నా"

"మీరు నమ్మడం లేదుకదూ, వచ్చే నెల హిందుస్తాన్ పత్రికలో రానున్న తన కవిత చెప్తా విను, 'కర్ రహా థా గమే జహా కా హిసాబ్ - ఆజ్ తుమ్ యాద్ బే హిసాబ్ ఆయే' తను నాకు రాసిన ఉత్తరంలో ఉంది. మా ఇంటికొస్తే అది కూడా చూపిస్తాను"       

 "నారాజ్ నక్కో జనాబ్. తమరు చూస్తే వేరే మతస్థులులాగున్నారు, ఆయనతో స్నేహం అంటే...." నున్నగా గెడ్డం గీసివున్నా పేడి  మొహాన్ని చూసి  సందేహం వెలుబుచ్చింది పడతి. 

'ఉన్కా జిక్ర్ భి అబ్ జుర్మ్ హో గయా హై:దినో పెహలే ఓ హమారీ పాడోసి హువా కార్తె థె !'ఇలాటి రోజులొస్తాయని తెలియని పసి తనంలోనే మా మధ్య దోస్తీ  అయ్యింది. మనుషులకి పెట్టినట్టు సరిహద్దులు ఇంకా మనసులకి పెట్టలేదు కాబట్టి మా స్నేహాన్ని మేమింకా కొనసాగిస్తూనే ఉన్నాం" నిర్లిప్తంగా అన్నాడు. 

" నేనొక్కత్తినే బయలుదేరితే మా అబ్బూ చాలా భయపడ్డాడు. అల్లాహ్ కా కరం, రైళ్ళోనే మీతో పరిచయం అయ్యింది. ఇక మీరే నాకు ఆ ఊళ్ళో సహాయం చెయ్యాలి"

1970 సం||లో ఆ రోజు అలా రైళ్లో పరిచయం అయిన వాళ్లే అహిద, ఙ్ఞాన్ దేవ్ భట్ లు.ఎంతో తెలివిగా మసలుతూ, దేశం నలుమూలలా వ్యాపారం ముసుగులో తిరుగుతూ మన దేశ రహస్యాలని కనుగొని తన దేశానికి చేరవేస్తూ మనకు పక్కలో బల్లెంలాగా తయారైన జ్ఞాన్ దేవ్ గా ఇక్కడ చెలామణీ అవుతున్న మొహ్మద్ అన్వర్ ఉరఫ్ ఏజంట్ Mని ట్రాప్ చెయ్యడానికి మన ఐబీ అతనికున్న ఉర్దూ సాహిత్యాభిలాషని వాడుకుంది. హైదరాబాదుకి చెందిన అహిద, అక్కడి నిజాం సంస్థానంలోని గూఢచారి విభాగాధిపతి కూతురు. ఆయనే వీడిని బాగా స్టడీ చేసి తన కూతురినే ఎరగా వేసి ముగ్గులోకి దించాడు. కొన్నాళ్ళకి వాడికి హాస్టళ్లో ఉంటున్న అహిద మీద నమ్మకం కుదిరి, హైదరాబాదు వెళ్లి ఆమె వివరాలు సేకరించడం మొదలెట్టాడు. మన వాళ్ళకి ఇంకా అతని వ్యవహారాలకి సంబందించిన గట్టి ఆధారాలు దొరకలేదు - మిషన్ ముగించడానికి. ఇంతలో అతను పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దేశ భక్తి మెండుగా గల ఆ యువతి అతని ఆట కట్టించడానికి అతనితో ఏడడుగులు వేసింది. వాడు ఇంట్లోనే క్రింద అంతస్థులో దుకాణం నడిపేవాడు అతను వేరే ఊరు వెళ్ళినప్పుడు రేడియో ట్రాన్సమీటర్ ద్వారా సందేశాలు చేరవేసేది. ఒక సంవత్సరం గడిచిందో లేదో ఇరు దేశాల మధ్యా ఘర్షణ వాతావరణం పెచ్చుమీరింది. యద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాంతో ఏజంట్ M కూడా మన సైనికుల కదలికలు గురించి వివరాలు సేకరించే పనిలో అండర్ గ్రౌండ్ కెళ్ళిపోయాడు. అప్పటికే అహిద గర్భవతి. తన మీద ఏ అనుమానం లేని జ్ఞాన్ దేవ్ తప్పక ఆమె యోగక్షేమాలు కనుక్కోడానికి ప్రయత్నిస్తాడని మన వాళ్ళు ఊహించినట్టుగానే, అతను అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసేవాడు. ఒక సారి చిట్టగాంగ్ తపాలా ముద్రతో వచ్చిన ఉత్తరాన్ని బట్టి, అక్కడ వెదికాము కానీ ఏదో చమురు కోసం ఆరా తీసిన వాడు ఆ తరవాత అక్కడ కనపడలేదు. మరి కొన్ని రోజులకి ఇంకో ఉత్తరం వచ్చింది. దానిమీద ఆంధ్రదేశంలోని విశాఖ పట్టణం ముద్ర ఉండటంతో వెంటనే మన వాళ్ళు తీవ్రంగా గాలించి అతన్ని పసిగట్టి వెంబడించి ఆ పరిసర ప్రాంతాల్లోని పశుల కాపర్ల వద్ద  వాడు ఆవులూ, మేకలూ, గొర్రెలను కొనుగోలు చెయ్యడం చూసారు. తీర ప్రాంతంలో మాంసం సేకరణ జరుగుతుందంటే ఆ ఒడ్డుకు ఏదో పెద్ద నావ వస్తుందని అర్ధం. ఇది కనిపెట్టిన ఐబీ నౌకా దళ్ళాన్ని అప్రమత్తం చేసింది. గస్తీ పెంచి మనవాళ్ళు  అటకాయించి నడి సంద్రంలో ముంచేసిన 'ఘాజీ' అదే. మూడు మార్గాల్లో మన మీద దాడికి యత్నించిన శతృ దేశం ఘాజీ పరాభవంతో నీరు గారిపోయింది, అలా మనకు బంగ్లా యుద్ధంలో గెలుపుకి అహిద తోడ్పడింది. కానీ ఆ నౌక విశాఖ తీరానికి వస్తున్న విషయం లీక్ కావడం పట్ల శతృ దేశ సైన్యాధికారులు ఇక్కడి తమ వారినందరిని అప్రమత్తం చేశారు. ఏజంట్ M  కూడా మళ్ళీ అక్కడనుంచి మాయం అయ్యాడు, ఆతరవాత  ఎప్పుడూ మన వాళ్ళకి అతను దొరకలేదు. నిండు గర్భిణీ అయిన అహిదాని ఇంకా అక్కడ ఉంచడం మంచిది కాదని తప్పించేసారు. 

**

ఆ యుద్ధంలో త్రివిదళ సమన్వయ కర్తగా పనిచేసిన నేను అప్పుడు వినడమే జ్ఞాన్ దేవ్ గురించి. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్లకి తానే వచ్చి నా చేతిలో కవరు పెట్టి, అహిద గురించిన  వివరాలు కావాలని, ఒకవేళ అప్పుడు తనకు పుట్టిన బిడ్డ బ్రతికి ఉంటే, ఒక్క సారి తన కుటుంబాన్ని చూడాలని వేడుకొన్నాడు. మానవతా రీత్యా స్పందిచిన నేను, ఆ రోజే ముంబై వెళ్లి రా ఆర్చైవ్స్లో అతని ఫైల్ తీయించి - అప్పట్లో అతన్ని డీల్ చేసిన  ఉత్తర మండల నిఘా విభాగాధిపతి స్టాన్లీ జోన్స్ని కలిసి సహాయం అడిగాను. తానూ ఒప్పుకొని తన పరపతిని ఉపయోగించి అహిద చివరి పెన్షన్ ఆంధ్రలోని బాపట్లలో తీసుకుందని తెలుసుకొన్నాక ముగ్గురం కలిసి అక్కడికి బయలుదేరాం. 

**

గుంటూరు జిల్లా బాపట్లకి దగ్గరలో 300 గడపున్నా పల్లెటూరది. రేకుల కప్పున్న పక్కా ఇంటి వరండాలోని మడత కుర్చీలో కూర్చొని పక్కన స్టూల్ మీద పెట్టిన  రేడీయో వింటున్నాడో యువకుడు. 

"ఏరా మున్సీబూ! డ్యూటీకి పోలేదా ?" టెలిగ్రాఫ్ ఆఫీసు బంట్రోతు సైకిలు మీదొచ్చి పలకరించాడు. 

"ఎల్లీ బోజనానికొచ్చాన్రా, కానిదిగో ఇప్పుడే ప్రాంతీయ వార్తల్లో సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొందని చెప్పారు. అది ఇన్నాక మనసు బాగోక కూకుండిపోయాను" చెప్పుకొచ్చాడా కుర్రాడు. 

"ఏరా ! మీకు చుట్టవా?"             

 

 "లేద్రా, కానీ మనిసి పోయిందంటే బాదుంటాది గందా" 

వచ్చిన వాడు నవ్వుతూనే "ఏడిశావులే. నీ కోసం బాపట్ల నుంచీ మిలట్రీ ఆఫీసొల్లు ఫోను చేశారు. పైనుంచి ఎవళ్ళో పెద్దాఫీసర్లు వత్తనారంట నిన్ను ఇంటి కాడే ఉండమన్నారు. మరి నేను పోయొస్తానే. సిల్కు స్మిత దినం చేత్తే నన్ను తప్పకుండా పిల్రోయి" అని వెళ్ళిపోయాడు. "ఆ పిల్చి నీకు గుండు కొట్టిత్తారా" కిందున్నా రాయి తీసుకొని వెళ్లినవాడి వైపు విసిరి కూర్చున్నాడు దిగాలుగా. కాసేపటికి దుమ్ము రేపుకుంటా వచ్చి ఆ ఇంటి ముందాగింది జీపొకటి. "మిల్ట్రీ ఆలిసమ్మ ఇల్లు ఇదేనా?" అడిగాడు డ్రైవర్. "ఆ!" షర్ట్ గుండీలు పెట్టుకొంటూ బయటకొచ్చాడా అబ్బాయి. 

"ఇగో నీ కోసం బొంబాయి నుండీ పై ఆఫీసర్లు వొచ్చారు ఆళ్ళు అడిగేటివన్నింటికీ సరిగ్గా సమాధానం చెప్పి, ఏదైనా కాయితాలు కావాలంటే చూపించమని మన కమాండర్ గారు చెప్పారు" అని చెప్పి తాను జీపుని పక్కన నిలపడానికెళ్ళాడు.  

వచ్చిన వాళ్ళకి కుర్చీలేసి తాను అరుగు మీద కూర్చున్నవాడితో "బేటా మీ అమ్మీ, ఆలీసమ్మ ఫోటో ఏదైనా ఉందా ?" స్టాన్లీ అడిగాడు  .

 

"జీ సాబ్ " అని గబగబా ఇంట్లోకెళ్ళి తెచ్చాడు. 

"హూ|| ఏహీ హై. చర్మం ముడతలు పడినా ముఖంలో కళ ఏ మాత్రం తగ్గలేదు. బేటా మీ అమ్మీ తన గురించి నీకేమన్నా చెప్పిందా?"                   

 

 "దేని గురించి సార్ ?" 

 

"తానెవరో, తన అసలు పేరేంటో, మిలట్రీలో తానేమి చేసేదోనని?"                                     

 

"ఏమైంది సాబ్ ? అందరూ మిలట్రీలో వంట పని చేసేదని అనేవాళ్ళు. నేనెప్పుడూ పనిగట్టుకొని అడగలేదు. మా అబ్బూ యుద్ధంలో పోయాడని అందుకే ప్రభుత్వం మనకు ఈ ఊళ్ళో వ్యవసాయనానికి భూమి ఇచ్చి, పెన్షన్ కూడా మంజూరు చేశారని చెప్పింది. అంతేనండీ. ఇప్పుడేమైంది సార్?"               

 

"ఏం కాలేదు కంగారు పడకు. ముందు నీ పేరేంటి చెప్పు" 

"మున్సీబు"                                 

 

 "ఏంటీ, అమ్మీ పెట్టిందేనా? ఒక్కసారి రాసి చూపిస్తావా?" అప్పటివరకూ అతన్నే ఆసక్తిగా చూస్తుండిన ఏజంట్ M అడిగాడు. 

"అయ్యో తప్పయింది సార్ అది నా ముద్దు పేరు. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉరి మునసబు ఉండే వారండీ. అందరూ అయ్యన్నీ ఎంతో గౌరవంగా, మర్యాదగా 'మున్సబుగారూ' అని పిలస్తా ఉంటే నాకెంతో చాలా గొప్పగా అనిపించేది. నేనూ పెద్దయ్యాక 'మున్సబు'నవ్వుతా అనే వాడినట. అందుకే అందరూ నన్ను 'మున్సీబు' అనేవోళ్ళు. అదే అలవాటైపోయింది. అసలు పేరు ఫైజ్ అన్వర్"

 

అది వినగానే ఏజంట్ M మొఖం విప్పారింది. "అది నా దోస్త్, మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన  గొప్ప షాయార్  ఫయిజ్ అహ్మద్దీ - నా పేరూ కలిపి పెట్టింది. అప్పట్లో కొడుకు పుడితే ఈ పేరు, కూతురు పుడితే ఫయిజ్ రాసిన కవితతో నాపేరు కలిపి దువా అన్వర్ అనే పేరూ పెట్టాలనుకున్నాము" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ఏజంట్ M.  

"చూడు ఫయిజ్ బేటా, మేము చెప్పేది జాగ్రత్తగా విను. ఈయన మొహ్మద్ అన్వర్ - మీ నాన్న. ఇతను శతృ దేశ సీక్రెట్ ఏజంటు. మన దేశంలో సంచరిస్తూ ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేసేవాడు. మీ అమ్మీ కూడా మిలట్రీలో గూఢచారిగా పని చేసేది. ఇతన్ని పట్టుకోడానికి ఆమెను ఎరగా ప్రయోగించాం. తను గొప్ప ఉర్దూ పండితురాలు. మీ తాతగారు నిజాం సంస్థానంలోని పోలీసు విభాగంలో పనిచేసేవాడు. ఆయన తన పిల్లలకి తర్ఫీదు ఇచ్చి ఈ రంగంలోకి దించాడు. హైదరాబాదు భారత్లో విలీనమయ్యాక వాళ్ళని మన సైన్యంలోకి తీసుకొన్నాము. ఇతనూ ఉర్దూ సాహిత్యమంటే చెవి కోసుకునేవాడు. ఆ బలహీనతను ఉపయోగించుకొని మీ అమ్మీ ఇతనితో పరిచయం పెంచుకొని ముగ్గులోకి దింపి, తప్పని పరిస్థితులలో పెళ్లి చేసుకుంది. తర్వాత నువ్వు ఆమె కడుపున పడ్డావు. అప్పుడే బంగ్లా యుద్ధం వచ్చింది. ఇతను అండర్ గ్రౌండ్ అయ్యాడు, కానీ తాను ఎంతో ప్రేమించిన భార్య కడుపుతో ఉండుట మూలాన ఆమె తనకోసం ఆందోళన పడుతుందేమోనని తన క్షేమ సమాచారాన్ని ఉత్తరాలు రాసి తెలియపరిచే క్రమంలో - మన వాళ్ళకి చిక్కాడు" 

"మాఫీ సాబ్ ! నేనెప్పుడూ మీకు దొరకలేదు" రోషంగా ఖండించాడు ఏజంట్ M. 

"అదే అదే, నీ అనుపానాలు - ఎక్కడ తిరుగుతున్నాడో, ఏమి కుట్ర చేస్తున్నాడో అనేది తెల్సింది. అలా ఒక శతృ దేశ రహస్య కార్యక్రమాన్ని మనం ఛేదించగలిగాము. ఆపై మీ అమ్మీని అక్కడనుంచి తప్పించేశాం. ఇన్నేళ్ల తరవాత ఇతను ఇప్పుడిలా వచ్చి అహిద గురించి అడిగాడు" జోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు స్టాన్లీ. కాసేపు మౌనం అక్కడ రాజ్యం చేసింది. ఇంతలో పక్కంటి అతనొచ్చి,"ఎరా డ్యూటీకి పోలేదా?" అనడిగాడు. 

"లేద్రా. సిల్క్ స్మిత ఆత్మ హత్య చేసుకుందట వార్తల్లో చెప్పారు. మనసు బాగోకా"

 

"ఈల్లేవుళ్లురా"                                     

 

"మిలాట్రోళ్ళు. అమ్మీ గురించి వచ్చారు గానీ నువ్వా మేరకేది కేసి పొతే మన అబ్దుల్లా బంకు కాడ మా ఇంటికి ఐదు టీలు అంపించమని సెప్పు" అని పురమాయించాడు.                                                     

 

"నువ్వేమి చేస్తున్నావు బాబూ?"మెల్లగా అడిగాడు మేజర్.

 

"టాక్సీ డ్రైవర్నండీ"  

"బేటా ఇప్పుడు జోన్స్ చెప్పింది నీకు సరిగ్గా అర్థమయ్యుండదు. కాస్త నిబ్బరంగా ఆలోచించు. మీ అమ్మీ ఎప్పుడైనా - ఏదైనా చెప్పిందేమో గుర్తుచేసుకో, అప్పుడు నీకు కాస్త అవగాహన వస్తది" లేచి వెళ్లి కుర్రాడి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా చెప్పాడు మేజర్ సింగ్. 

"అదే ఆలోచిస్తున్నా సాహెబ్. మీరిప్పుడు చెప్పింది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. మా తాతగారు నిజాం సంస్థానంలో పని చేశారని, అబ్బూ బంగ్లా యుద్ధంలో పోయారని అమ్మీ చెప్పింది. ఆమె పేరైన 'అహిద' అంటే ఉర్దూలో సంరక్షకురాలని అర్ధం. కాబట్టీ ఈ దేశాన్ని, ప్రజలని రక్షించడానికి ఏదో చేసే ఉంటది నేను నమ్ముతున్నా" అని ఏజంట్ M వంక చూస్తా   "తానున్నప్పుడు వస్తే అన్నీ ఆమే చూసుకొనేది. కానిప్పుడు ఏమి చెయ్యాలో కూడా నాకు పాలు పోవడం లేదు" 

"బేటే నీ పరిస్థితిని నేనర్థం చేసుకోగలను. అహిదాని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అసలు ఊహించలేదు నా మీద తాను కుట్ర చేస్తదని. నేను చివరి సారి తనకు అల్విదా చెప్పినప్పుడు తానన్న మాటలు నాకింకా గుర్తున్నవి. 'కోయి అచ్చిసి సజా దో ముఝే - ఛలో ఐసా కరో రులాదో ముఝే, తుమ్హే భూలూతో మౌత్ ఆ జాయే - దిల్ కి గహారాయిసే యే దువా దో ముఝే!' తన గురించి తెలిసాక నిజంగానే నేను ఏడ్చాను. ఇంకోటి తెల్సా మేజర్, ఘాజీ అసలు పేరు డయాబ్లో, అంటే స్పానిష్లో  దెయ్యం. ఆ రాక్షసి మా జీవితాలని చిన్నాభిన్నం చేసింది. కొన్నాళ్ళకి మనసు గట్టి చేసుకొన్నాగానీ  నా విధికి ఆటంకమని మరో ఆడదాన్ని దరిచేరనివ్వలేదు. అక్కడికి తిరిగి పోయేసరికి నాకు వయసుడిగిపోయింది. ఎవరో అన్నట్టు 'మొహబ్బత్ భీ రాహే బదల్తి హై సియాసత్ కి తరాహ్' అని నమ్మి  నా అహిద కూడా నన్ను మర్చిపోయి మళ్ళీ పెళ్లిచేసుకొని జీవితాన్నికొన సాగిస్తుందేమో అనుకున్నా. కానీ ఆమె కడుపులోని  నా సంతానం బ్రతికే ఉంటదని ఏదో తెలియని నమ్మకం. ఈ అవసాన దశలో నావాళ్ళ అవసరం తెలిసొచ్చిందిరా. అందుకే నిన్ను వెదుక్కుంటూ వచ్చాను. నాకు నువ్వేమి చేయనవసరంలేదు. అల్లా దయవల్ల మనకు బోల్డు ఆస్ధి ఉంది. నాతో వచ్చేయి - అమ్మీ కూడా సంతోషిస్తది. నా జనాజాలో నావాళ్లు ఉండాలనేదే నా ఆఖరి కోరిక బేటా" కొడుకుని ఆప్యాయంగా తడుముతూ చెప్పాడు M.

 

కుర్రాడు ఏమీ మాటాడక  శూన్యంలోకి చూస్తుండిపోయాడు. ఇంతలో టీ వచ్చింది. అందరికీ ఇచ్చి, తానూ చప్పరిస్తూ ఇంట్లోకెళ్ళి ఒక పుస్తకం పట్టుకొచ్చాడు అబ్బాయి.

 

"ఈ కితాబ్ మీకు తెల్సా?" M చేతికిస్తూ అడిగాడు. 

బైండు చేసివున్న పుస్తకాన్ని తెరిచి ముందు పేజీని తడుముతూ, మొహానికి తాకించుకొని ఆఘ్రాణిస్తూ, గద్గద స్వరంతో "ఇది నేను అహిదకిచ్చిన మొదటి బహుమతి - మాకిష్టమైన ఫయాజ్ కవితల పుస్తకం : ఇది నా చేతి రాతే " అంటూ గుండెలకద్దుకున్నాడు.

 

కుర్రాడు యధాలాపంగా, "Tell me not, in mournful numbers - Life is but an empty dream" అన్నాడు.

 

"For the soul in dead that slumbers - and things are not what they seem" అని పరాయి దేశస్థుడు పూరించాడు.

 

వెంటనే లేచి Mని కావిలించుకొని, "అబ్బూ! అబ్బూ!" అంటూ భుజం మార్చి మార్చి తమ పద్దతిలో కావలించుకొని "అమ్మీ ఉర్దూ బాగా చదివేది. హైదరాబాద్ కెళ్ళి   పుస్తకాలుకొని తెచుకొనేది. ఇక్కడి మదరసాలో పాఠాలు చెప్పేది. నాకు చదువు సరిగ్గా అబ్బలేదుగానీ అమ్మీ అలీఫ్ బాల నుంచీ అమీర్ ఖుస్రూ వరకు ఎన్నో నేర్పింది. ఆమె నాకు నేర్పిన ఒకే ఒక ఇంగ్లీషు పద్యం లాంగ్ ఫెల్లోది. అది మా అబ్బూకి ఎంతో ఇష్టమని చెప్పింది. అలాగే ఈ పుస్తకాన్ని ఖురాన్ లాగా ఎప్పుడూ తన దగ్గరే పెట్టుకునేది. నోరు విప్పి చెప్పకున్నా అది ఎందుకు ప్రత్యేకమో నేను అర్ధం చేసుకున్నా - అందుకే దాచుకున్నా" కళ్ళు తుడుచుకుంటూ, "అబూ! ఇక నువ్వు ఇక్కడే ఉండు. నేను నిన్ను చూసుకుంటాను" అన్నాడు మళ్ళి మొహ్మద్ ని కావిలించుకొని. 

"బేటే. నిన్ను ఇలా ఆలింగనం చేసుకుంటే నా మనసుకు ఎక్కడ లేని శాంతి దొరికిందిరా. నా మాట విను నాతో వచ్చేయి. అక్కడ నువ్వు సకల సౌఖ్యాలు అనుభవించవచ్చు. కారు తోలడం కాదురా పది కార్లలో తిరగొచ్చు  " ఉద్విగ్నంగా చెప్పుకుపోతున్నాడు M. 

"ఈ దేశాన్నీ, నే పుట్టిన ఈ నేలని, ఇక్కడి మట్టినీ ముఖ్యంగా ఇక్కడి సమాధిలో నిద్రిస్తున్న మా అమ్మీని వదిలి నే రాలేను అబ్బూ - అయినోళ్ల  సమాధులని గాలికొదిళ్ళెళ్ళితే వాళ్ళ శాపం తగులుద్ది, అదినాకొద్దు. 'అహిద' అనే అమ్మీ పేరుకి అర్ధమే ఉర్దూలో 'ఇతరులని సంరక్షించేది' అని, కాబట్టి ఇక్కడుంటే తానెప్పటికీ నన్ను కాపాడతా ఉంటది" ధృడంగా చెప్పాడు కుర్రాడు. 

యువకుడి చుబుకాన్ని చేతితో తాకి తిరిగి తన నోటి దగ్గరకు తీసుకొని ముద్దాడి, "సుభాన్ అల్లాహ్! ఫకర్ హై" అని మేజర్ వైపు చూసి గర్వంగా, "దేఖా మేజర్ యేహై మేరా ఖూన్" అంటూ  కొడుకుభుజం తట్టి, "నేనడగంగానే నువ్వు నాతో వచ్చేస్తే తండ్రిగా నేను సంతోషిచేవాడినేమోగానీ ఒక సైనికుడిగా మాత్రం తలదించుకునే వాడినిరా, మీ అమ్మీ పెంపకానికి కూడా అది మచ్చగా మారేది. నీ ఈ మాతృ ప్రేమా, దేశ భక్తి ముందు కోట్లు కూడా దిగదుడుపేరా. అసలు ఈ మట్టిలోనే ఆ గుణం ఉందిరా. శెహభాష్ బేటే. అక్కడి ఆస్తులన్నీ అమ్మేసి నీకోసం ఇక్కడికే వచ్చేస్తారా" అని సుపుత్రుని నుదుట ముద్దు పెట్టుకున్నాడు. 

"Mr.M చీకటి పడుతుంది మనమిక బయలుదేరాలి - ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నువెలా తిరిగి రావాలనేది మనం బొంబాయి వెళ్లి ఆలోచిద్దాం, పదండి" అన్నాడు మేజర్. ముగ్గురూ లేచి నిల్చున్నారు. 

"అబ్బూ! ఇంత దాకా వచ్చి అమ్మీని కలవకుండా వెళ్తావా? ఒక్కసారి ఖబర్ దగ్గర నమాజ్ చేసి వేళ్ళు" అడిగాడు కొడుకు. "హా బేటే, జరూర్..." అని అందరూ బయలుదేరారు. 

**

'సిసక్ కర్ రో పడే, ఏక్ దూజే కే హాల్ పర్-మజ్ హబ్ ఔర్ ఇన్సానియత్ కీ జబ్ ములాఖత్ హుయీ!' అన్నాడో కవి. అలా మేమందరం అహిద సమాధి దగ్గర కన్నీటి నివాళులర్పించాక, తన కారులోనే మమల్ని గన్నవరం విమానాశ్రయంలో దించడానికి వస్తున్న అన్నెం పున్నెం ఎరుగని కుర్రాడి తో సహా, నీ తొందర పాటు వల్ల  మూడు నిండు ప్రాణాలు బలితీసుకున్నావు. ఏం సాధించావురా??" అని కాలర్ పట్టుకొని ఊపేస్తూ ప్రశ్నించాడు మేజర్.

 

విక్టర్ కళ్ళలో నీరు సమాధానం చెప్పలేక పోయాయి.

*****
 

bottom of page