top of page

ఆనాటి వాన చినుకులు

కథా మధురాలు

గీతిక.బి

తుప్పెక్కిన పాత ఇనప సామాను గుట్టలలో నుంచి పనికొచ్చే వస్తువుల్ని వేరు చేయిస్తున్నాను. రేకులూ, పాత సైకిళ్ళూ, విరిగిన రిక్షాలూ, ఇనప కుర్చీలూ,.. ఎక్కువే ఉన్నాయి.

నెల రోజులుగా మా అమ్మాయి పెళ్ళి పనుల్లో మునిగి, కొట్టుని బాగా అశ్రద్ధ చేసేశాను. రీసైక్లింగ్ లోడు అమ్మకపోవడం వల్ల మెటీరియల్ బాగా పేరుకుపోయి, మొన్న కురిసిన వానకి తడిసి తుప్పు వాసన ఘాటుగా వస్తోంది.

కుర్రాళ్ళు సామానుని వేగంగా లాగి పక్కకు పడేస్తుండడంతో చెవులు చిల్లులు పడేంతగా డబడబల శబ్దం వస్తోంది. ఈ షాపుకొచ్చిన మొదట్లో కాస్త ఇబ్బంది పడినా, పాతికేళ్ళుగా ఈ మోత అలవాటైపోయింది నాకు.

పొరుగు రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసొచ్చి, ఉద్యోగం కోసం తిరుగుతుంటే… ఒక ఇంటర్వ్యూలో తారస పడింది సుకన్య. మా పరిచయం పెరిగి మనసులు కలిసే సమయానికి మంచి ఉద్యోగం సంపాదించాను. ఇక సుకన్యని పెళ్ళి చేసుకుంటే జీవిత లక్ష్యం నెరవేరినట్టే అనుకుని, సుకన్య వాళ్ళ నాన్నగారిని కలిశాను.

అప్పుడు... మొదటిసారిగా చూశాను ఈ పాత ఇనప సామాను గుట్టల్ని. ఎంత కంపరంగా అనిపించిందో..! మళ్ళీ ఈ దరిదాపులకి రాకూడదనుకున్నాను. కానీ నా మనసుని చదివినట్టే మా మామగారు నన్ను ఇరకాటంలో పడేసే నిబంధన పెట్టారు.

సుకన్య ఆయనకి ఏకైక సంతానం కావడంతో… ఆమెని పెళ్ళి చేసుకోవాలంటే, తప్పకుండా ఈ పాత ఇనప సామాను వ్యాపారం చూసుకుని తీరాల్సిందే అని ఎంతో నిక్కచ్చిగా చెప్పాడాయన. కూతుర్ని చేసుకోబోయేవాడు ఇంజనీరు అయినందుకు సంతోషించక, నన్ను ఇంజనీరు ఉద్యోగం వదిలేసి ఈ పాత ఇనప సామాను వ్యాపారం చూసుకోమన్నందుకు ఆయన మీద చచ్చే కోపం వచ్చింది. కానీ సుకన్య మీది ప్రేమ ఆ కోపాన్ని అణుచుకునేలా చేసింది. సుకన్యని వదులుకోవడం కంటే... నా ఉద్యోగం వదులుకోవడమే నా మనసుకి కరెక్టనిపించింది. సుకన్యనీ, తన వ్యాపారాన్నీ నాకు అప్పజెప్పి మామయ్యగారు విశ్రాంతి తీసుకున్నారు.

ఆయన ఉన్నన్నాళ్ళూ అయిష్టంగా వ్యాపారం చూసుకున్న నేను... ఆయన చనిపోయిన తరువాత కూడా ఇందులోనే ఉండిపోవడం అలవాటో, ఆయన మీద అభిమానమో నాకిప్పటికీ అర్థంకాదు.

రెండంతస్తుల ఇల్లూ… ఇంటి ప్రాంగణాన్ని అనుకుని పక్కనే ఉన్న పాత ఇనప సామాను వ్యాపారం... ఎటూ వెళ్ళనవసరం లేని పని.

కుర్రాళ్ళు పనికొచ్చేవి, పనికిరానివిగా వేరు చేస్తూ గుట్టలుగా పోగేస్తుంటే, వాటి వంక యధాలాపంగా చూస్తున్న నా చూపులకి ఒక పాత రేకు, దాని మీద సగం,సగం కనబడుతున్న అక్షరాలు చూడగానే ఒక్క క్షణం రెప్పపడలేదు. ఆ ఒక్క క్షణంలోనే రేకుపై ఓ ఇనప కుర్చీ పడి ఆ అక్షరాలని పూర్తిగా కప్పేసింది.

అంతే... వెంటనే ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చి, గట్టిగా ఒక అరుపు అరిచాను. నా కేకకి అందరూ చేస్తున్న పనాపి బొమ్మల్లా నిలబడిపోయారు. నేను గబగబా వెళ్ళి ఆ కుర్చీని పక్కకు లాగి దాని కింద ఉన్న రిక్షా రేకుని బయటకు తీశాను. దాని మీది అక్షరాలని అత్రంగా చూశాను. సందేహం లేదు. ఇవి అవే అక్షరాలు…! అయినా అనుమానం.

మట్టి పట్టిన ఆ రేకుని పాతగుడ్డతో తుడిచి, మళ్ళీ చూశాను. అక్కడక్కడ పెయింట్ పోయి అస్పష్టంగా ఉన్నా పోల్చుకోగలిగేలానే ఉన్నాయి. "ఆనాటి వాన చినుకులు" అనే ఆ అక్షరాలు.

ఏనాటి పదాలు ఇవి...! మళ్ళీ ఇన్నేళ్ళకి... ఇక్కడ..!!

అక్కడ నుంచి ఇక్కడకి ఎలా వచ్చాయి…? నా ఇనప సామాను కొట్టుకి అసలు

ఎప్పుడొచ్చాయి…?? నా ప్రశ్నలూ, చర్యలూ ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. చేతిలో ఉన్న రిక్షా రేకుని ఎత్తి పట్టుకుని, దూరంగా ఉన్న శాయలుకి చూపిస్తూ, "అరేయ్ శాయలూ! ఈ రేకు మన దగ్గరకి ఎప్పుడొచ్చిందిరా…? ఎవడు తెచ్చాడూ?" అని గట్టిగా అరుస్తూ అడిగాను.

వాడు గబగబా నా దగ్గరకి పరిగెత్తుకొచ్చి రేకుని పరిశీలనగా చూశాడు. రెండు క్షణాల తర్వాత ఏదో గుర్తు చేసుకుంటూ, "ఇదా. ఇది లోకోషెడ్ నుంచి వచ్చే అప్పారావ్ పట్టుకొచ్చాడన్నా. ఈ డొక్కురిక్షా రేక్కేమీ రాదురా అని ఎంత చెప్పినా ఇనకుండా ఎంతో కొంతీయమని పట్టుబట్టి పాతిక రూపాయలు తీసుకుపోయాడు..." అని నీళ్ళు నములుతూ చెప్పాడు శాయిలు.

తుప్పెక్కి తేలికైన ఆ రేకుని పట్టుకుని ఆత్మీయంగా చూస్తూ ఇంటి వైపు నడిచాను.

నా కళ్ళనిండా, ఆలోచనల్లోనూ నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు మెదిలాయి.

పాతికేళ్ళక్రితం చూశాను ఈ రిక్షా రేకు మీది తెలుగు అక్షరాలని, అదీ ఢిల్లీ మహానగరంలో..! అవి చదువు నిమిత్తం నేను ఢిల్లీలో ఉంటున్న రోజులు. ఆ రోజు మా కాలేజ్ ఫేర్‌వెల్ డే. ఆలశ్యమైపోయిందని కంగారుపడుతూ, వీధిలోకొచ్చిన గూడు రిక్షాలో ఎక్కి కాలేజీకి బయల్దేరాను. ఆ రిక్షా మీద వ్రాసి ఉన్న "ఆనాటి వాన చినుకులు" అన్న అక్షరాలు నా కంగారుని కుతూహలంగా మార్చాయి.

తెలుగు మాటే వినిపించని రాజధాని నగరంలో తెలుగు పదాలు కనిపించగానే, ఆసక్తితో వెంటనే అతన్ని మీరు తెలుగువాళ్ళా..? అనడిగాను. అవునన్నాడతను. అతనూ ఇంచుమించుగా నా వయసువాడే కావడంతో ఇక కరువుతీరా అతన్తో తెలుగు మాటలు మాట్లాడేశాను. నా సొంత ఊరూ, చదువు కోసం ఇక్కడకు వచ్చి ఉంటున్న వివరాలూ వగైరాలన్నీ చెప్పి, అతని విషయాలు అడిగాను.

బతుకు తెరువు వెతుకుంటూ కూలీగా ఢిల్లీకి వచ్చాడట. కొంత డబ్బు సంపాదించిన తరువాత రిక్షా కొనుక్కుని పిల్లలని పాఠశాలకు తీసుకెళ్ళే కొన్ని కిరాయిలు ఒప్పకున్నాడట. మిగతా సమయాల్లో బయట బేరాలు చూసుకుంటానని చెప్పాడు. రిక్షా అతనిదేనని తెలిశాక.. "ఆనాటి వాన చినుకులు" అన్న పదాలు వ్రాయడం వెనక కారణం ఏంటని అడిగాను.

కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదతను. తర్వాత, అవి ఓ జ్ఞాపకం తాలూకు అక్షరాలని ముభావంగా చెప్పాడు. అతడు చెప్పిన విధానం బట్టి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది, అదేమిటో తెలుసుకోవాలనిపించింది. అడగగా అడగగా నోరు విప్పి చెప్పాడతను.

రెండు సంవత్సరాల క్రితం ఓ వానాకాలపు సాయంత్రం ఒక పెద్దింటి అమ్మాయి అతని రిక్షా ఎక్కిందట. ఆమె కూడా తెలుగమ్మాయట. వాళ్ళిద్దరి మాటలు కలిసి ఆమె ఎక్కడకు వెళ్ళాలన్నా అతని రిక్షానే ఎక్కేదట. వారి పరిచయం పెరిగి అది మానసిక స్థాయి నుంచి శారీరకంగా కలవడంతో వాళ్ళు పెళ్ళి చేసుకోవాలనుకున్నారట. ఆ విషయాన్ని అమ్మాయి ఇంట్లో చెప్పగానే, వాళ్ళు అతన్ని బాగా కొట్టించారట. కానీ… ఆ అమ్మాయి అతని కోసం ఇల్లు వదిలి వచ్చేసిందట. అయినా వాళ్ళ పెద్దవాళ్ళ అప్పటికే గర్భవతైన అమ్మాయిని బలవంతాన తీసుకెళ్ళిపోయారని చెప్పాడు.

తరువాత కొన్ని నెలలకి ఆమె ఒక మగబిడ్డని తెచ్చి ఏడుస్తూ అతనికి ఇచ్చిందట. ఆమెకి అబార్షన్ చేయాల్సిన రోజులు దాటిపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకి కాన్పు కాగానే, ఆ బిడ్డని పురిట్లోనే చంపి, ఆ తర్వాత ఆమెకి వేరొకతన్తో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారట.

ఆ భయంతోనే ప్రసవం కాగానే... ఆ బిడ్డని తీసుకొచ్చి అతనికి ఇస్తున్నాననీ, బాగా పెంచమనీ చెప్పి డబ్బు ఇవ్వబోయిందట. అతను డబ్బు వద్దని పిల్లవాడిని తీసుకున్నాడనీ, ఇప్పుడా పిల్లవాడు అతని దగ్గరే పెరుగుతున్నాడని చెప్పాడు. అతను చెప్పిన విషాదం విన్న తర్వాత... అతను ఆ అక్షరాల వెనక ఉన్న సంఘటనని నాతో చెప్పడానికి ఎందుకు సంకోచించాడో అర్థమైంది. ఆ రిక్షావాని ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని చూడాలన్నకుతూహలం కలిగింది నాకు. కానీ కాలేజ్ ఫేర్‌వెల్‌కి ఆలశ్యమైపోతుందని కాలేజ్ వద్ద దిగిపోయాను.

ఆ రోజు నన్ను కాలేజ్‌లో దించిన తరువాత ఆ "ఆనాటి వాన చినుకులు" రిక్షా రెండు, మూడు సార్లు ఢిల్లీ రహదారుల్లో కనిపించింది గానీ, అతను కిరాయితో ఉండడంతో అతని వెంట వెళ్ళి ఆ పిల్లవాడిని చూసే అవకాశం రాలేదు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులూ రోడ్డు మీదకు రాగానే, ఎక్కడైనా ఆనాటి వాన చినుకుల రిక్షా కనిపిస్తుందేమోనని నా కళ్ళు వెళ్ళేపోయే ప్రతి గూడురిక్షానీ పరికించి చూసేవి.

ఆ సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ వచ్చేశాను.

అక్కడి ఎన్నో విషయాల్ని మర్చిపోయినా, ఆ గూడు రిక్షా మాత్రం నా మనసులో ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. నాకు అదో అందమైన ప్రేమకథ. ఆ రిక్షా నడిపే అతను నా దృష్టిలో హీరో. అతను గుర్తుకు వచ్చినపుడల్లా నేనూ ఓ ప్రేమకథకి మూలమవ్వాలనిపించే ప్రేరణ కలిగేది. బహుశా నేను సుకన్యని ప్రేమించి పెళ్ళి చేసుకోవడంలో ఆ గూడు రిక్షా పాత్ర చాలా ఉండి ఉంటుందేమో.

హాల్లోకి వెళ్ళగానే రిక్షా రేకుని ఒక మూలగా పెట్టి, సుకన్యని పిలిచాను. ఆమెకి ఈ రిక్షా ప్రేమకథ మొత్తం ఇంతకు ముందే చెప్పాను. ఇప్పడు చూపించాలని నా ఆత్రుత.

సోఫాలో కూర్చుని రేకు వంక అపురూపంగా చూశాను. తెల్లని పాల రాళ్ళ మధ్య తుప్పెక్కిన రిక్షా రేకు విషాదం నింపుకున్నట్టుగా అనిపించింది.

"ఏం కావాలండీ..?" అంటూ వంట గదిలోంచి హడావిడిగా వచ్చింది సుకన్య.

ఎందుకో ఈ విషాదాన్ని తనతో పంచుకో బుద్ధి కాలేదు. ఏం లేదంటూ, మళ్ళీ ఇంట్లోంచి బయటకు నడిచాను. ఏంటో.. నా ఆలోచనలు బుర్రని తినేస్తున్నాయి. ఏదోగా ఉంది. వెంటనే ఆ రిక్షా అతన్ని చూడాలని ఉంది. కానీ ఎలా..?

అసంకల్పితంగా మళ్ళీ ఇనుప సామాన్ల గుట్టల దగ్గరకు వచ్చాను.

అక్కడే నిలబడి ఉన్నశాయిలుని చూడగానే, బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది. వెంటనే శాయిలు వంక చూసి, "అరే శాయిలూ...! ఆ రిక్షా రేకు తెచ్చినవాణ్ని వెంటనే తీసుకురారా." అన్నాను గట్టిగా.

శాయిలు వింతగా నా వంక చూసి, అదే వింత భావంతో జేబులోంచి అతని సెల్ఫోను తీసి దాని ముఖంమీద బరబరా గీకుతూ ఏదో వెతికాడు. కొన్నిక్షణాలకి విజయం సాధించినట్టుగా నావంక చూసి, ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. "ఒరేయ్ అప్రావ్.! ఏడున్నావ్రా...  తొరగా ఓనరుగారి కొట్టుకి ఒచ్చేయ్..." అని ఆజ్ఞాపించి, నా వంక చూసి, "ఒక పావుగంట్లో వచ్చేస్తాడన్నా.." అని చెప్పాడు.

ఆ మాటలు విన్నాక, గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నాను.

ఈ సారి రిక్షా అతన్నేకాదు, అతని కొడుకునీ చూడాలి అనుకుంటూ గుట్టలుగా పోగు చేసిన మెటీరియల్ వైపు నడిచాను. ఆ సామానంతా కేజీల లెక్కన తూయించి, లారీల్లోకి ఎత్తించాను. పనిలో పడిన నాకు గంట కాదు, మూడు గంటలు గడిచినా టైం తెలియలేదు.

మధ్యాహ్నం పనిని ఆపుదామనుకుంటున్నసమయానికి, కొంత ఇనప సామానుతో వచ్చాడు అప్పారావు. ఆ సామానుని శాయిలు తూకమేస్తుంటే, అప్పారావుని నా ఆఫీసు గదికి తీసుకెళ్ళి ఆ "ఆనాటి వాన చినుకులు" రిక్షా రేకుని ఎవరు వేశారో వివరాలు అడిగాను.

పాత ఇనప సామాను కొనడానికి వెళ్ళినపుడు ఏ ఇంటివాళ్ళు ఆ రిక్షా రేకుని వేశారో గుర్తు చేసుకుంటూ, ఆ ఇల్లు ఉన్నవీధి పేరు చెప్పాడు. ఆ పేరు వినగానే, నా భృకుటి ముడిపడింది.

అది ఒక మురికివాడ..!

నాదృష్టిలో హీరో స్థాయివాడు అలాంటి చోట ఉండడం తట్టుకోలేకపోయాను నేను. నా పిచ్చిగానీ… అయినా పాపం రిక్షా తొక్కుకునేవాళ్ళు ఇంకెక్కడుంటారూ...! ఆ మురికి వాడల నుంచి పోగు చేసుకొచ్చిన ఇనప సామానుని అమ్ముకునేగా మాలాంటి వాళ్ళు ఇలాంటి మేడలు కట్టుకునేది.

వెంటనే అక్కడకు వెళ్ళి అతన్ని చూడాలన్న బలమైన కుతూహలంతో, వెంటనే కారు బయటకు తీశాను. అప్పారావుని కారెక్కించుకుని ఆ మురికి వాడకి వెళ్ళాను.           మేం వెళ్ళేసరికి ఆ ఇల్లు తాళం వేసి ఉంది. అప్పటికే నన్ను విచిత్రంగా చూస్తున్నచుట్టుపక్కల వాళ్ళని వాళ్ళ ఆచూకీ అడిగాను. అతనూ, అతని కొడుకూ ఆ మధ్యెప్పుడో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనీ, వారం క్రితం అతని కొడుకు వచ్చి ఇంట్లోని సామానంతా అమ్మేసి ఇల్లు ఖాళీ చేసేశాడనీ చెప్పారు వాళ్ళు.

ఎంతో ఆశతో, ఆసక్తితో వచ్చిన నాకు వాళ్ళ మాటలు నిస్సత్తువని తెప్పించాయి. అతను రిక్షా తొక్కేవాడనీ, కొన్నాళ్ళ నుంచి రిక్షా పనికి వెళ్ళడం లేదనీ, అతను పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదనీ, వాళ్ళ అబ్బాయి బాగా చదివేవాడనీ... విస్తుపోతున్నట్టుగా చెప్పారు.

వాళ్ళు విస్తుపోతున్నది అతని మనస్తత్వానికే కాదు, ఒక రిక్షా అతని కోసం కారులో ఎవరో వచ్చారేంటన్నది కూడా అని... వాళ్ళు నావంకా, కారువంకా చూస్తున్న చూపుల్ని బట్టి ఆర్థమైంది.

నాలో మళ్ళీ అనుమానం. ఆ రిక్షా అతను, ఈ రిక్షా అతనేనా... అని. 

ఎక్కడి ఢిల్లీ... ఎక్కడి విజయవాడ...! ఇతను అతనేనా...? అతనే ఇతనని ఆనాటి వాన చినుకులు చెప్తున్నాయిగా. ఒకవేళ అతనే అయితే... ఇక అతన్ని చూడడం సాధ్యపడదా.. అనుకుంటూ, నీరసంగా కార్లోకొచ్చి కూర్చున్నాను. కానీ.. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదు.

అప్పారావు ఆ పక్కన వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు. స్టీరింగ్ మీద చెయ్యి వేసి, అతని కోసం చూస్తున్నాను. రిక్షా అతను ఇన్నాళ్ళూ ఉన్న ఆ ఇంటి వంక తిరిగాయి నా కళ్ళు.

సిమెంటు రేకు కప్పి ఉన్న విశాలం లేని ఇల్లు. రెండు గదులుంటుందేమో... కొడుకుతో కలిసి ఈ ఇంట్లో ఉండేవాడంటే… అతను పెళ్ళి చేసుకోలేదా...? కొన్నాళ్ళ క్రితం వరకూ రిక్షా తొక్కుతూండేవాడని చెప్పారు. అంటే… వేరే జీవనోపాధి ఏమీ వెతుక్కోలేదా అతను! చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరో అయిదు నిముషాలకు వచ్చాడు అప్పారావు.

అతను కార్లో కూర్చోగానే కారు స్టార్ట్ చేశాను. 

"ఒక్కడే కొడుకంట సార్... బాగా సదువుకున్నాడంట. చదివించీ, పెంచి ఇంత చేసిన కన్నతండ్రిని ఎలా చూస్కోవాలి సార్...? ఆడికి రెక్కలు రాగానే, అబ్బని వృద్ధాశ్రమంలో చేర్పించాడంట..." అని ఈసడించుకుంటున్నట్టుగా చెప్పాడు అప్పారావు.

మేం ఇంటికి వచ్చేవరకూ, "మనుషులు మారిపోతున్నారు. సమాజం మారిపోతుంది..." అంటూ ఏవేవో ఉదాహరణలు చెప్తూ వాడి బాధని వెళ్ళగక్కుతూనే ఉన్నాడు అప్పారావు. నా మనను మాత్రం... ముఖం కూడా స్పష్టంగా గుర్తులేని ఆ రిక్షా అతని చుట్టూనే తిరుగుతోంది.

కారుని షెడ్లో పెట్టి కార్లోంచి దిగి, కొట్టువైపు నడిచాను. అప్పారావు నా వెంటే వస్తున్నాడు.

సరిగ్గా అపుడే... అప్పారావు, "సార్... వీడే సార్...! ఆ రిక్షారేకుని అమ్మింది వీడే సార్...!! వీడే వాళ్ళ నాన్నని వృద్ధాశ్ర.మం..లో..." అని అరుస్తూ, నావంక చూస్తూ అంతలోనే హఠాత్తగా మాటలు ఆపేశాడు

.

అప్పారావు అరుపులకి అటు చూసిన నేను అక్కడ నా అల్లుడు ప్రశాంత్ కనిపించగానే నివ్వెరపోయి ఉండిపోయాను. అంటే... ఆ రిక్షావాని కొడుకు ప్రశాంతా..!? నమ్మశక్యం కాని షాక్‌తో తల దిమ్మెక్కింది నాకు.

అంటే ప్రశాంత్… తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి కారణం నేనేనా?! అవును నేనే...!

నేనే చెప్పాను. మానసని ప్రేమించానంటూ వచ్చిన ప్రశాంత్‌కి ఇల్లరికం రమ్మని నిబంధన పెట్టాను అచ్చం మా మామగారిలానే. ఒక తండ్రిగా ఆలోచించినా, ఒక కొడుకుగా చూసినా... నేను చేసింది ఎంత నిర్దయమైన పనో నాకే తెలుస్తోంది. బండబారిన నా గుండె మామూలవ్వాలంటే ఒకటే పరిష్కారం.

ఇంట్లోకి వెళ్ళబోతున్న ఫ్రశాంత్‌ని చూసి, అతని వెనుకే నడుస్తున్న నా కూతుర్ని, "అమ్మా.. మానసా..." అని పిలిచాను.

"వస్తున్నా నాన్నా" అని నవ్వుతూ నా దగ్గరకి వచ్చింది మానస. ప్రశాంత్ కూడా నాలుగడుగులు ఇటు వేశాడు.

నేను నోరు తెరిచి ఏమీ చెప్పకముందే, "మేం మామయ్యగారి దగ్గరకు వెళ్ళి వస్తున్నాం నాన్నా. ఆయన చాలా బాగా మాట్లాడారు. నా మీద కోపం ఏమీ లేదు. నువ్వూ ఒకసారి ఆయన్ని చూస్తే బాగుంటుంది నాన్నా..." అంటూ హుషారుగా చెప్తోంది మానస.

ఆ మాటలు విన్నాక… అతని కోపం నా కూతురి మీదో, ప్రశాంత్ నా కూతుర్ని పెళ్ళి చేసుకోవడం మీదో కాదు. అతని కోపం... ధన వ్యవస్థ మీద...! అందులో ఉండి ప్రేమని వదులుకోవడం మీద... అన్నది స్పష్టంగా అర్థమైంది నాకు.

వెంటనే... ఆ ప్రేమమూర్తిని చూడాలనీ, చూడగానే... నేను "ఆనాటి వాన చినుకుల్లోని ఓ జ్ఞాపకాన్ని" అని చెప్పాలనీ మనసు ఎంతగానో తహతహలాడుతోంది.

*****

మీ అభిప్రాయాలు తెలుపుటకు క్లిక్ చేయండి...click here to post your comments...
 

Bio

గీతిక. బి

వ్రాయడమంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు వీరివి 52 కథలు, 20 నవలలు, సుమారు 50 కవితలు, సాక్షి ఫన్‌డేలో సంవత్సరం పాటు (47 weeks) "ప్రేమ" శీర్షిక ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు ప్రచురించారు. అవి... ఇసుక పూలు,  ప్రేమలో మనం, నానీల చినుకులు.

***

Comments
bottom of page