Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
19వ శతాబ్దపు సాహిత్య స్పృహ

భట్లపెనుమర్తి హరిత.
సాహిత్యకారులు సౌలభ్యం కోసం తెలుగు సాహిత్యాన్నంతటినీ యుగాలుగా విభజించారు.
కవుల పేర్లతో, కవిపోషకులైన రాజుల పేర్లతో, ఆయా కాలాల్లో వచ్చిన సాహిత్య ప్రక్రియలపేర్లతో ఇలా రకరకాలుగా కాలాన్ని విభజించారు.
అయితే ఈ విభజన అవగాహన కోసం చేయబడినదే కాని సాహిత్యంలో ఎప్పుడూ స్పష్టమైన విభజన రేఖలుండవు. ఉదాహరణకు పురాణయుగంలో అన్నీ పురాణాలే వచ్చాయనో లేక ప్రబంధయుగంలో అన్నీ ప్రబంధాలే రచింపబడ్డాయనో భావించరాదు. ఏదైనా ఒక నిర్దిష్ట కాలపు సాహిత్యాన్ని పరిశీలించాలనుకుంటే ఆ కాలపు పూర్వాపరాలను కూడా విధిగా గమనించి ఒక అవగాహనకు రావలసిందే! యుగనామాలు ఆ కాలపు రచనలను సాధారణీకరించే ప్రయత్నాలు మాత్రమే. కాని ఒక యుగ స్వరూపస్వభావాలు అవగతమవ్వాలంటే అప్పటి పరిస్థితులు, ఆ కాలంలో వెలువడిన సాహిత్యం ఆసాంతం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కనుక 19వ శతాబ్దపు సాహిత్యాన్ని, సాహిత్య స్పృహను అంచనా వేయడానికి కాస్త ముందు వెనుకలు కూడా స్పృశించాల్సిన ఆవశ్యకత ఉంది.
తెలుగులో మొట్టమొదటి కావ్యం సంస్కృతానువాదరూపంలో వెలువడింది. ఆ అనువాదం స్వతంత్ర పద్ధతిలో, కళాత్మకంగా, మూలానికే మెరుగులు పెడుతూ సాగినా ఆది మహా అయితే అనుసృజన కాగలిగిందే కాని సృజన కాలేకపోయింది. అది మొదలుగా తెలుగు కవులు సంస్కృత పురాణాలను, సంస్కృతేతిహాసాలను, సంస్కృత కావ్యాలను, సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. ఇదే ధోరణి కొన్ని శతాబ్దుల పాటు కొనసాగింది. కాగా 15వ శతాబ్ద్యంతానికి సంస్కృత ప్రాచీన సాహిత్యం చాలా వరకు తెలుగులో అనువదింపబడి, తెలుగుకవులకు మూలంనుండి తెచ్చుకోవడానికి వనరులు అడుగంటుతూ ఉన్న తరుణంలో వారు కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే ప్రబంధ ప్రక్రియ. సంస్కృత మూలంలో ఉన్న చిన్న చిన్న కథలను తీసుకొని తమ స్వకపోలకల్పనల ద్వారా, వర్ణనల ద్వారా పెంచి పెద్దవిగా చేసి అనేక రసవత్తరమైన కావ్యాలను సృజించారు. ఇక్కడ స్వతంత్రత తగుమాత్రంలో కనిపించినా అది పూర్తి స్థాయి స్వతంత్రత మాత్రం కాదు. కాగా కాలానికి ఎదురీది పింగళి సూరన కవీంద్రుడు పూర్తి కల్పిత కథతో తెలుగు సాహిత్యం అంతవరకు కనీవిని ఎరుగని ఒక అపూర్వ ప్రబంధాన్ని కళాపూర్ణోదయ రూపంలో ఆవిష్కరించాడు. అయితే అతని ప్రయత్నం, “కేవల కల్పిత కథలు కృత్రిమ రత్నము”లని, ఆ కాలపు ప్రముఖ కవులచే నిరసించబడి, అటువంటి సృజనాత్మక సాహిత్యం ముందుకు సాగలేకపోయింది. కొంతకాలానికి ప్రబంధాలు కూడా పలుచబడి పోయాయి. రేఖామాత్రమైన కథతో వేలంవెర్రిగా చేసే వర్ణనలతో సాగిన ప్రబంధాలు ఎంతో కాలం సహృదయులను రంజింప చేయలేకపోయాయి.
ఇదే సమయంలో భారతదేశంపైకి దండెత్తి వచ్చి, పాలకులుగా స్థిరపడ్డ మహమ్మదీయుల విలాస జీవనం హిందూ సమాజం మీద కూడా ప్రభావం చూపసాగింది. అంతే కాక కొత్తగా కనుగొనబడిన సముద్రమార్గాలతో కొత్త ప్రపంచానికి దారులు తెరవబడి వ్యాపారాభివృద్ధి తామరతంపరగా సాగింది. వర్గసమాజపు కుదుళ్ళు కదిలి, కులాభిజాత్యము కంటె సంపత్సౌభాగ్యానికే ప్రాధాన్యమిచ్చే సమాజంవైపు మెల్లగా అడుగులు పడసాగాయి. కొత్తగా వచ్చిపడిన డబ్బు, చుట్టూ కనిపిస్తున్న విలాసజీవనం హిందూ సమాజపు జీవితాలను ప్రభావితం చేయసాగాయి. ‘కవిత్వం/సాహిత్యం జీవితానికి అనుకరణ’ అన్న నానుడిని ఋజువు చేస్తూ సాహిత్యంలో హేయమైన శృంగార రచనలు రావడం అక్కడే మొదలైంది. మొదటినుండీ కవులు సరస్వతీపుత్రులే కాని లక్ష్మీపుత్రులు కానందువలన, లక్ష్మీ ప్రాపకం కోసం డబ్బున్నవాడికి వారు దాస్యం చేయడం పరిపాటయింది. అయితే కొత్తగా వచ్చి చేరిన సంపదతో పాటుగా సంస్కారం కూడా అదే స్థాయిలో ఉండడం అన్ని వేళలా సంభవం కాదు కనుక కవులకు ఆశ్రయమిచ్చేవారు తమ విలాసజీవితాలను కావ్యరూపంలో చూసుకోవాలని ముచ్చటపడి కవులను ఆ విధంగా ఆదేశించేవారు. వారి విచ్చలవిడితనం, శృంగారమయ జీవితం కవులకు కావ్యవస్తువులయ్యాయి.
కావ్యానికి ప్రయోజనాలుగా ఉపదేశానందాలని చెబుతారు మన ఆలంకారికులు. అయితే క్రమంగా ఉపదేశం మాట పూర్తిగా మరువబడగా, రసపోషణ కూడా కొరవడి, రసహీనంగా తదనుగుణంగా ఆనందశూన్యంగా, కథాకథనాలు గౌణంగా, కేవలం శబ్దాడంబరంతో, పదవైచిత్రితో, పాండిత్య ప్రదర్శనే ధ్యేయంగా కావ్యాలు వెలువడనారంభించాయి. ఆ ప్రయత్నంలో భాగంగా చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, గర్భ కవిత్వం, ద్వర్థి కావ్యాలు, త్ర్యర్థి కావ్యాలు, నిరోష్ఠ్య కావ్యాలు ఇలా ఎన్నెన్నో వింత వింత పోకడలకు పోయింది తెలుగు సాహిత్యం. ఇది 17-18 శతాబ్దులలో ప్రారంభమయి మెల్లగా 19వ శతాబ్ద్యాదికి నిలిచి ఉన్న పరిస్థితి.
దివాకర్ల వేంకటావధానిగారు తమ “ఆంధ్రవాఙ్మయ చరిత్ర”లో ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఇలా అన్నారు.
“పురాణము నందలి ఆంధ్రకవిత్వమున శబ్దార్థములకు సమప్రాధాన్యము కనిపించును. ప్రబంధయుగము నాఁటి కర్థభావములపై కంటె శబ్దములపై కవులకు మక్కువ పెరిగినది. దక్షిణాంధ్రయుగమున నది మఱింత యభివృద్ధి యైనది. చివరకు క్రీ.శ. 19వ శతాబ్దినాఁటికి ఆంధ్ర కవిత రసభావములందు కొఱవడి శబ్దార్థాలంకార ప్రధానమై ఔదాత్త్యమును కోల్పోవుట సంభవించినది.”
ఈ పరిస్థితుల ప్రభావం 19వ శతాబ్ది నాటి కవులపై ఎంతగా ఉన్నదంటే సంఘ సంస్కారి, సాహిత్య సంస్కారి అయిన కందుకూరి వీరేశలింగం పంతులుగారు కూడా మొదట్లో తన రచనా వ్యాసంగాన్ని శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం, రసికజన మనోభిరామము, శుద్ధాంధ్రోత్తర రామాయణము వంటి రచనలతో ప్రారంభించి, ఆ పై ఇటువంటి ప్రయోగాలపై విముఖతతో, పండితులు రసహీనంగా, పాండిత్య ప్రకర్షే ధ్యేయంగా, సరస్వతికి శుష్కాభరణాలను కట్టిబెడుతున్నారని వాపోతూ ‘సరస్వతీ నారద విలాపము’ను రచించారు.
టేకుమళ్ళ కామేశ్వరరావుగారి ‘నా వాఙ్మయ మిత్రులు’ లో వ్యక్తం చేసిన ఈ కింది భావాలు కూడా గమనించదగ్గవి.
“పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో తెలుగు కవిత్వ దశ ఏమంటే – కవులు పండిత శైలిలో ప్రబంధాలను మాహాత్మ్యాలను రచించేవారు. అచ్చ తెనుగు పుస్తకాలను, నిరోష్ఠ్య, నిర్గద్య వంటి, చిత్రబంధ కవిత్వాల వంటి, మొగ్గల (ఫీట్ల) కవిత్వం చేసేవారు. అంకమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, ఇత్యాది దేవతలు ఊరూరా ఉండగా భక్తి శతకాలు బహుళ మయేయి. రెండు అర్థాల, మూడు అర్థాల ప్రబంధాలు పుట్టేయి. మొత్తం మీద తెలుగు కవిత్వం కుక్కమూతి పిందెలను కాచిన కాలమన్నారు సాహిత్య విమర్శకులు.”
ఈ అవగాహన నేపథ్యంగా మనమిప్పుడు 19వ శతాబ్ది సాహిత్యాన్ని స్పృశిద్దాం.
ఉషోదయం:
మానవుడు నిత్య పరిణామశీలి, నిత్య ప్రయోగశీలి. ఎప్పుడూ ఏదో కొత్తదనం కోసం, ప్రస్తుత పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితుల కోసం తపించి ఆ దిశగా అడుగులు వేయడమన్నది మానవుడి సహజ లక్షణం అని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. 19వ శతాబ్దపు తెలుగు కవి సంప్రదాయ సాహిత్యపు చట్రంలో ఇరుక్కుపోయాడు. దాన్నుండీ బయటపడాలనే తాపత్రయం ఉంది అయితే బయటపడే మార్గం కనిపించక కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక చిన్న సందు దొరికితే చాలు, అనంతమైన తన మేధోసామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ మార్గం ఆంగ్లసాహిత్యపరిచయం రూపంలో అతడికి కనిపించింది.
1757 ప్లాసీ యుద్ధం తరువాత ఆంగ్లేయులు భారతదేశంలో తమ సంపూర్ణాధికారాన్ని స్థాపించారు. మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానంవల్ల ఆంగ్లం, తద్వారా ప్రపంచ సాహిత్యం మనకు అందుబాటులోకి వచ్చింది. ఆంగ్లభాషాసంసర్గం ద్వారా తెరుచుకున్న ప్రపంచ సాహితీ గవాక్షాలగుండా చూసి, మనవారు తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఒక కొత్త ఉషోదయాన్ని ఆవిష్కరింపజేశారు.
అయితే ఈ ప్రభావం ముఖ్యంగా 1850 తరువాత కలం పట్టినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అంతకుముందు అంటే 1800-1850 కాలంలో తెలుగు సాహిత్యంలో మంచి రచనలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. అవేమిటో, ఆంగ్లసాహిత్య పరిచయంవల్ల తెలుగు సాహిత్యంలో కలిగిన పరిణామాలేమిటో స్థూలంగా చూద్దాం.
19వ శతాబ్దపు సాహిత్యం:
18వ శతాబ్ది ఉత్తరార్ధంలో జన్మించినా తమ కీర్తనలతో 19వ శతాబ్ది పూర్వార్ధంలో వెలుగులు వెదజల్లారు కర్ణాటక సంగీతకార వాగ్గేయకార త్రయం త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. ఈ కాలం కర్ణాటక సంగీతానికి స్వర్ణయుగమనే చెప్పాలి.
ఈ యుగారంభంలోనే కాసుల పురుషోత్తమ కవి శతక సాహిత్యానికి మణిపూస అనదగ్గ ఆంధ్రనాయక శతకాన్ని అధిక్షేప ధోరణిలో రచించాడు.
1832లో పుదూరి సీతారామశాస్త్రిగారు, ప్రారంభవిద్యకు పునాదిగా పిల్లలకోసం బాలశిక్షను రూపొందించారు. ఇదే తదుపరి ముద్రణలలో మరింత సమాచారాన్ని సమకూర్చుకుని పెద్దబాలశిక్షగా రూపాంతరం చెందింది. ఇది తెలుగువారి మొట్టమొదటి విజ్ఞానసర్వస్వం. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే దాదాపుగా ఒక శతాబ్ది కాలం వరకు పెద్దబాలశిక్షను క్షుణ్ణంగా చదువుకోవడమే ఒక యోగ్యతగా బాలబాలికలు చెప్పుకునేవారు.
ఈ యుగంలోనే పుట్టి “పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ” అని ప్రశంసలు వచ్చేలా చక్కని గద్యం రాసి భావితరాలకు మేలిబాట వేసిన పండితుడు పరవస్తు చిన్నయసూరి. అతడు పంచతంత్రానికి చేసిన అనువాదం నీతిచంద్రిక గొప్ప ఆదరణను పొందింది. అతడి మరొక రచన బాలవ్యాకరణం. మహామహులైన ప్రాచీనకవుల గ్రంథాలనే బాలవ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా మార్చి రాసే ప్రయత్నాలు జరిగాయంటే బాలవ్యాకరణం పొందిన ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఈ కాలంలోనే, సంప్రదాయ కవిత్వంలో కూడా, ఉద్దండులైన కవీశ్వరులు శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి(సర్వకామదా పరిణయము), పిండిప్రోలు లక్ష్మణకవి(రావణ దమ్మీయం), మండపాక పార్వతీశ్వర కవి(రాధాకృష్ణ సంవాదము), గోపీనాథ వేంకటకవి(గోపీనాథ రామాయణం), శేషప్ప కవి(నరసింహ శతకం), కొటికెలపూడి వేంకటకృష్ణకవి(దిలీప చరిత్రం), తరిగొండ వెంగమాంబ(వేంకటాచల మహాత్మ్యం), శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఓగిరాల జగన్నాథ కవి మొదలగు వారు తమ ప్రతిభా విశేషాలతో ప్రాచీనసాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
టూకీగా ఈ యుగం సాధించిన ప్రగతిని చూద్దాం:
-
తొలి తెలుగు ముద్రాక్షరశాల 1806లో ప్రారంభమైంది. అనంతర కాలంలో తెలుగులో ఎన్నో ముద్రాక్షరశాలలు నెలకొని తెలుగు సాహిత్యాన్ని నేల నాలుగు చెరగులా వ్యాపింపజేశాయి. ప్రామాణికతకు మారుపేరుగా నిలిచిన వావిళ్ళవారి ముద్రాక్షరశాల ఈ శతాబ్దిలో పురుడు పోసుకున్నదే.
-
అకారాది క్రమంలో తొలి లఘు శబ్దార్థ సర్వస్వాన్ని (సంస్కృతంలో) రూపొందించారు పరవస్తు వెంకటరంగాచార్యస్వామి.
-
1830-1831లో ఏనుగుల వీరాస్వామి ‘కాశీయాత్ర చరిత్ర’తో యాత్రాసాహిత్యానికి అంకురార్పణ జరిగింది.
-
1832లో తొలి తెలుగు పత్రిక “ది కర్నాటిక్ క్రానికిల్” వెలువడింది; తరువాత క్రైస్తవ మతప్రచారమే లక్ష్యంగా 1835లో ‘సత్యదూత’ ప్రారంభమైంది. అది మొదలుగా కొన్ని సంవత్సరాల వ్యవధానంతో వృత్తాంతిని, వర్తమాన తరంగిణి, హితవాది, సుజనరంజని, ఆంధ్రభాషాసంజీవని, వివేకవర్ధిని, అముద్రిత గ్రంథ చింతామణి వంటి ఎన్నో మాసపత్రికలు/వారపత్రికలు/దినపత్రికలు ఈ యుగంలో తెలుగులో వచ్చాయి.
-
1855లో తెలుగువారి ప్రథమ గ్రంథాలయం సరస్వతీ మహలు గ్రంథాలయానికి అంకురార్పణ జరిగింది.
-
1857లో మద్రాసు, బొంబాయి, కలకత్తా విశ్వవిద్యాలయాలు స్థాపన జరిగింది, తద్వారా మరింత మందికి విశ్వసాహిత్యంతో పరిచయం కలిగింది.
-
1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన ‘మంజరీ మధుకరీయం’ ద్వారా తొలి తెలుగు నాటకం ఆవిష్కృతమయింది. అటుపైన తెలుగునేలపై నాటకాల ప్రాభవం వర్ణించనలవి కానిది. ఈ యుగంలోనే చారిత్రక, సాంఘిక, పౌరాణిక, విషాదాంత, స్వతంత్ర నాటకాలెన్నో వెలుగు చూశాయి. ధర్మవరం రామకృష్ణమాచార్యుని ‘విషాద సారంగధర’, కోలాచలంవారి “రామరాజు చరిత్ర”, చిలకమర్తి వారి ‘గయోపాఖ్యానం’, వడ్డాది సుబ్బరాయ కవి ‘వేణీ సంహారం’, వేదం వేంకటరాయశాస్త్రి ‘ప్రతాపరుద్రీయం’ వంటి పలు నాటకాలు తెలుగు నాటకానికి మణిపూసలు వంటివి.
-
సామినేని ముద్దునరసింహంగారి వ్యాసగ్రంథం ‘హితసూచని’(1862)తో హేతువాద భావజాలానికి బీజం పడింది ఈ శతాబ్దిలోనే. వారు వ్యక్తం చేసిన “తమ పిల్లలకు జీవనాధారమయ్యే సంపదలను వివాహ వేడుకల కోసం తల్లిదండ్రులు ఖర్చుచెయ్యకూడదు” వంటి భావాలు నేటి సమాజానికీ వర్తిస్తుండడం గమనార్హం. ఈ పుస్తకం, ఇందులో వెలుబుచ్చిన అభిప్రాయాలు, వాడిన భాష తదనంతర కాలంలో వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలకు, గిడుగు రామమూర్తి వంటి వ్యావహారిక భాషావాదులకు స్ఫూర్తినిచ్చాయి.
-
నరహరి గోపాలకృష్ణమశెట్టి ‘శ్రీరంగచరిత్రము’(1872), కందుకూరి ‘రాజశేఖరచరిత్ర’(1878) రూపంలో తొలితరం నవలలు ఊపిరి పోసుకున్నాయి.
-
1885లో బహుజనపల్లి సీతారామాచార్యులుగారు కూర్చిన శబ్దరత్నాకరం ఇప్పటిదాక తెలుగులో వెలువడ్డ నిఘంటువులన్నిటిలో తలమానికంగా పేరు తెచ్చుకున్నది.
-
తెలుగులో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు గారు తొలి జీవిత చరిత్రను కూడా రచించారు. అటుపైన 1894లో తోలేటి సుబ్బారావు ‘కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర’ను రచించాడు.
-
శిష్టవ్యావహారికంలో వచన రచనలు విరివిగా ప్రారంభమయిందీ కాలంలోనే.
-
తెలుగు నాటకచరిత్రలోనే అనర్ఘరత్నంగా కీర్తింపబడ్డ కన్యాశుల్కాన్ని గురజాడ అప్పారావుగారు రచించిందీ ఈ శతాబ్ద్యంతంలోనే.
-
శతక సాహిత్యానికి 19వ శతాబ్దం స్వర్ణయుగమనే చెప్పాలి. రాశిలో అయితే శతక సాహిత్యంలో సింహభాగం ఈ శతాబ్దిలో వెలువడ్డదే. కొత్తదనంలో కూడా ఈ శతాబ్దిలో శతక సాహిత్యం కొత్త దారుల్లో పయనించింది. అంతవరకు శతకాలలో ఎక్కువగా భక్తి, నీతి శతకాలు మాత్రమే కానవచ్చాయి. 19వ శతాబ్ది శతక సాహిత్యానికి విస్తృతిని ప్రసాదించింది. తిట్టు శతకాలు, రాజకీర్తన శతకాలు, అధిక్షేప శతకాలు, అనువాద శతకాలు, సమస్యా పూరణాత్మక శతకాలు, జీవిత కథా శతకాలు, కథాత్మక శతకాలు మొదలైన ఎన్నో కొత్త తరహా శతకాలు వెలుగు చూశాయి.
-
ముసలమ్మ మరణం రూపంలో తొలి ఆధునిక ఖండకావ్యం కూడా ఈ శతాబ్ది ఆఖరి దశకంలోనే రచింపబడింది. కట్టమంచి రామలింగారెడ్డిగారు రచించిన ఈ కావ్యం తెలుగు కవిత్వాన్ని కొత్త దారుల్లో నడిపించింది.
-
ఒకటి రెండు మంచి రచనలు వచ్చినా సంప్రదాయ కవిత్వ పరంగా చూస్తే 19వ శతాబ్ది క్షీణయుగమేనని అనిపించినా, మొత్తం తెలుగు సాహిత్యం పరంగా విశ్లేషిస్తే ఈ అభిప్రాయాన్ని మార్చుకోవలసిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటి దాక సమీక్షించినది తెలుగు సాహిత్యంలో వచ్చిన నూతన ప్రక్రియలు, రచనల గురించి మాత్రమే. ఇక తెలుగులో పరిశోధన ఏ విధంగా మొదలైందో చూద్దాం.
పరిశోధన:
తెలుగు భాషా సాహిత్యాల చరిత్రలో క్రీ.శ. 19వ శతాబ్ది పూర్వార్ధాన్ని బ్రౌణ్యయుగమనీ, ఉత్తరార్ధాన్ని వీరేశలింగయుగమని పిలిచారు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు. రాబోయే దశాబ్దులలో జరిగే విమర్శ పరిశోధనల కృషికి కావలసిన సామగ్రి సమస్తం సమకూడిన యుగం ఇది అని వారు పేర్కొన్నారు.
తెలుగులో పరిశోధన మొట్టమొదట మెకంజీతో ప్రారంభమయింది. ఈస్టిండియా కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం సంపాదించి భారతదేశంలో అడుగుపెట్టిన మెకంజీ తదనంతర కాలంలో సర్వేయర్‌గా నియుక్తుడై దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతూ అక్కడి శాసనాలను, తాళపత్రగ్రంథాలను, వ్రాతగంథాలను, పురాతన వస్తువులను, నాణెములను సేకరించి, ఆయా ప్రాంతపు విశేషాలను స్థానిక చరిత్రలను రాయించేవాడు. వాటినే కైఫియతులు అంటారు. ఈ విధంగా మెకంజీ 1076 కైఫియతులను వ్రాయించాడు. ఇవి తదనంతర కాలంలో పరిశోధనకు, చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరించాయి.
భాషాపరిశోధన రీత్యా తెలుగు సాహిత్యంలో 19వ శతాబ్దికి ప్రత్యేకమైన స్థానముంది. అంతవరకు ఉన్న “జనని సంస్కృతంబు సకల భాషలకును” అన్న అపోహను తొలగిస్తూ బిషప్ కాల్డ్వెల్ తన “Comparative Grammar of Dravidian languages”లో సోపపత్తికంగా తెలుగు ద్రావిడభాషా జన్యమని నిరూపించాడు. ఇతని సిద్ధాంతము మీద ఆధారపడి గంటిజోగి సోమయాజులు, కోరాడ రామకృష్ణయ్య, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి పండితులు తమ భాషాపరిశోధనను కొనసాగించారు.
జానపద సాహిత్య పరిశోధనకు కూడా ఈ యుగంలో బీజావాపము పుట్టింది. జె.ఏ.బాయిల్ అనే ఆంగ్లేయుడు పండితలోకం చేత విస్మరించబడిన మధురమైన జానపద సాహిత్యాన్ని లోకం దృష్టికి తెచ్చాడు. అతడు సేకరించిన ఆరు జానపదగేయాలు జానపద సాహిత్య ఖనిలో మేలిమిరత్నాలు.
ఇక తెలుగుసాహిత్యానికి సి.పి.బ్రౌన్ చేసిన సేవ అపారమైనది. ఎన్నో పురాతన గ్రంథాలను వెలికి తీయించడం, లభ్యమైన వ్రాతప్రతులను పరిశీలించి సంశోధిత ప్రతులను తయారు చేయించడం, ప్రాచీన కావ్యాలకు వ్యాఖ్యానాలు వ్రాయించడం, వేమన పద్యాలను సేకరించి ప్రచురించడం, బ్రౌణ్య నిఘంటువును రూపొందించడం వంటి అనేక సేవలతో యావత్ తెలుగుజాతి తనకు ఋణపడేట్టుగా చేశాడు బ్రౌన్.
మరి పరిశోధనలో భారతీయుల పాత్ర ప్రస్తావించాల్సి వస్తే తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు మూలపురుషుడైన వీరేశలింగం పంతులునే మొదటగా చెప్పుకోవాలి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఒక ప్రామాణిక గ్రంథంగా ‘ఆంధ్రకవుల చరిత్ర’ను రూపొందించాడు. తరువాతి కాలంలో సాహిత్య చరిత్రలు కూర్చేవారందరికీ ఇది ప్రమాణంగా నిలిచింది.
“ఒక జాతి నిద్రాణ దశనుంచి మేల్కాంచి పరిశోధనను శాస్త్ర సమ్మతంగా సాహితీరంగంలో నిర్వహించాలన్న ఉద్యమస్ఫూర్తితో పరిక్రమిస్తున్నప్పుడు సహజంగా రూపుదిద్దుకునే చైతన్యప్రవృత్తులన్నీ ఈ యుగంలో బీజావస్థనుండీ అంకురావస్థకు అందుకున్నాయి” అంటారు 19వ శతాబ్ది ఉత్తరార్ధంగురించి మాట్లాడుతూ ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు.
ముగింపు:
ఒక చుక్క విషం పాలన్నిటినీ చెరుపు చేసినట్లుగా కొన్ని హేయమైన రచనలు యుగానికే క్షీణయుగమన్న అపకీర్తిని తెచ్చిపెట్టాయి. అయితే హంస క్షీరనీరాలను వేరు చేసి క్షీరాన్ని మాత్రమే స్వీకరించిన విధంగా ఈ యుగంలోని మంచిని మాత్రమే పరిగణిస్తే, 19వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి అందించిన ప్రక్రియలవల్ల కాని, నవ్యదృష్టివల్ల కాని తెలుగు సాహిత్య చరిత్రలోనే అత్యంత నిర్మాణాత్మక కాలంగా చెప్పుకోవచ్చు.
ఆధార గ్రంథాలు:
-
ఆరుద్ర. 2007. సమగ్ర ఆంధ్ర సాహిత్యం(మూడవ సంపుటి). హైదరాబాదు: తెలుగు అకాడమి.
-
కులశేఖరరావు, ఎం.1985. తెలుగు సాహిత్యము-పరిశోధన.హైదరాబాద్:యం.ఇందిరాదేవి
-
చంద్రమౌళిశాస్త్రి, బెల్లంకొండ. 1962. నవోదయము. విజయవాడ: ఉదయశంకర్ పబ్లిషర్స్.
-
రామారావు, కె.వి.ఎస్. (12/06/2012). Symbols of substance: Court and state of Nayaka Period of Tamilnadu. http://pustakam.net/?p=11764
-
రామానుజరావు, దేవులపల్లి, అప్పారావు, పి.ఎస్.ఆర్., సుబ్రహ్మణ్యం, జి.వి., కృష్ణమూర్తి, ఇరివెంటి. 1983. తెలుగులో పరిశోధన. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
-
సత్యనారాయణరావు, యండమూరి. 1960. ఉషఃకిరణాలు – 19వ శతాబ్ది తెనుగు సాహిత్యచరిత్ర. విజయవాడ: ఉత్తమసాహితి.
-
వెంకటరావు, భట్టు. (01/04/2012). తెలుగు పత్రికల సాహిత్య సేవ” – డా. తిరుమల రామచంద్ర (పరిచయ వ్యాసం). https://venkatbrao.wordpress.com/category/పుస్తక-లోకం/
-
వేంకటావధాని, దివాకర్ల. 1961. ఆంధ్రవాఙ్మయ చరిత్రము. హైదరాబాదు: శివాజి ప్రెస్.
****