top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

ఆకస్మిక తనిఖీ

Degala Anitasuri

డేగల అనితాసూరి

"ఏమయ్యా వెంకట్రావ్? ఉదయం పదింటికే ఆఫీసుకొచ్చి వాల్తావ్ కదా, కనీసం చాయ్ త్రాగటానికి క్యాంటీన్ వరకైనా వస్తావా? లేక బల్లిలా సీటుకే అంటుకు పోతావా?" అంటూ పలకరించాడు ప్రక్కసీటు గురునాధం.

 

అప్పటికి సమయం సాయంత్రం నాలుగవుతోంది. వెంకట్రావ్ రోజూ ఠంఛన్ గా ఐదింటికే అలారం పనిచేయకపోయినా అదేమీ పట్టించుకోకుండా నిద్రలేచి వండివార్చి ధర్మపత్ని చేతికిచ్చిన క్యారేజీ బ్యాగుతో ఏడున్నరకే ఇంట్లోంచి బయటపడి రెండు బస్సులు, ఒక షేరింగ్ ఆటో మారి పదింటికల్లా ఆఫీసులోని తన సీట్లోకొచ్చి పడ్తాడు.

 

చాలామంది అరగంట, పది నిమిషాల దూరంలో ఇళ్ళున్న వాళ్ళుకూడా వెంకట్రావ్ కంటే ముందుగా క్రమం తప్పకుండా రాలేక పోతుంటారు. అసలే హెవీ సీటేమో ఎప్పుడో ఒకసారి ఇలా ఏ గురునాధం, గురుమూర్తో వచ్చి కదిలిస్తే తప్ప కనీసం కాఫీ, టీ ల కోసమైనా సీటు కదలడు. స్టాఫ్ అతనికి తెలీకుండా 'తుమ్మజిగురు ' అనే నిక్ నేం పెట్టి పిలుస్తుంటారు. అందుకే ఇందాక గుర్నాధం వెంకట్రావ్తో అలా అన్నాడు.

 

ముఖ్యమైన ఫైలు డ్రాఫ్ట్ రెడీ చేసేసి, సంతకం పెట్టి అటెండర్తో పై ఆఫీసర్ చాంబర్ కి పంపేసి అప్పుడు లేచాడు వెంకట్రావ్ క్యాంటీన్ కెళ్ళటానికి.

 

**

 

సుభద్రకు మనసంతా బాధగా వుంది. తన రెండేళ్ళ కూతురికి జ్వరం. డాక్టరుకి చూపించి అత్తగారి దగ్గర వదిలి వచ్చింది.

 

కానీ, ఆవిడ వేళకు మందులు ఎలా వేస్తుందో? జ్వరం ఎలా వుందో? అని ఆందోళనగా వుంది తనకు.

 

ఆఫీసుకు లీవైనా పెడదామంటే, అంతకు వారం రోజుల క్రితమే తన ఐదేళ్ళ కొడుకు కాలికి దెబ్బ తగిలించుకోవటం వల్ల నాలుగురోజులు మెడికల్ లీవ్ పెట్టింది. ముఖ్యమైన వర్క్ అంతా పేరుకుపోయింది. 

 

సుభద్ర ఆఫీసులో చాలా సిన్సియర్ అనే సంగతిని స్టాఫంతా కూడా సిన్సియర్ గానే ఒప్పుకుంటారు కూడా.ఎప్పటివర్క్ అప్పుడే అయిపోతేగానీ హాయిగా ఆమె ఊపిరిపీల్చుకోలేదు.

 

కానీ, చిన్నపిల్లలు అవటం మూలాన ఆఫీసుకు పదినిమిషాలు అటుఇటుగా వస్తుంటుంది. అంటే, రిజిష్టర్ లాస్ట్ మినిట్ లో అందుకుంటుంటుంది. ఇక నెలకో మూడు లేటు పర్మిషన్ లు వుండగా, అవేమో టృఅఫిక్ పద్మ యూహం లో అబుఇమన్యునిలావ్ బయటపడలేకపోయిన సందర్భాల్లో ఆదుకుంతుంటాయి.

 

అయితే, చాలా మందిలా సాయంత్రాలు త్వరగా ఇంటికి చెక్కేయకుండా ఐదున్నర, ఆరింటివరకైనా ఉండి, తన గర్క్వ్ కంప్లీట్ చేసే వెళ్తుంది. ఎప్పుడైనా పిల్లల అవసరాల నిమిత్తం ముందుగా వెళ్ళాల్సి వస్తే ఆఫ్ డే లీవిచ్చి వీలైనంత పని ముగించి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది తప్ప పనిదొంగ మాత్రం కాదు.

 

తన ఫ్రెండ్ సులోచన అంటూనే వుంటుంది "ఇది గవర్నమెంట్ ఆఫీస్ తల్లీ! నువ్వెంత పడీపడీ పనులు చేసినా మెచ్చి మేకతోలు కప్పేవాళ్ళెవరూ వుండరిక్కడ. పొరపాట్న చిన్న తప్పు చేస్తే మాత్రం నిర్ధాక్షిణ్యం గా మెమోలివ్వడానికి మాత్రం ముందుంటారు గానీ కాస్త అప్పుడప్పుడైనా సీట్లో వంచిన తలను కాస్త పైకెత్తి చుట్టుప్రక్కల చూడు. ఎవరు క్రొత్తగా జాయిన్ అయ్యారో, ఎవరు రిటైరై వెళ్ళిపోయారో అయినా అర్ధం అవుతుంది" అని.

 

లేదులేవే పాపం...ఈ ఫైళ్ళమీద ఎందరి ఆశలో జీవితాలో ఆధారపడి వుంటాయి. ఎవరో మెచ్చుకుంటారని మనం ఎందుకు పనిచేస్తాం? మన తృప్తికోసం, ఇంకా తీసుకుంటున్న జీతం కోసం పనిచేస్తాం. అంతేగానీ అదేదో సినిమాలో మహేష్ బాబు అన్నట్టు గవర్నమెంట్ మనకు జీతం డబ్బులిస్తోంది. కొంతయినా పనిచేయకుంటే తిన్నది అరగదు. లావైపోతాం" అని సమాధానమిచ్చి కిలకిలా నవ్వేస్తుంది సుభద్ర.

"నీకు చెప్పడానికి రావటం నా బుద్ధి తక్కువగానీ, శ్లోకం, తాత్పర్యం రెండూ చెప్పే అభినవ కృష్ణావతారం అర్జెంట్ గా నువ్విప్పుడు ఎత్తకు తల్లీ. మరో జన్మలో మగాడ్రిగా పుట్టి చెబుదువుగానీ. ఇప్పుడీ ఆడవతారం లో…  ఛీ..ఆడవతారమేంటో? పాడవతారం లాగా! నా ముఖానికి అంత తెలుగు కూడా వస్తే నా జన్మ ఎపుడో సార్ధకమవును. మనం మరీ తెలుగు సీరియల్స్ లో లేడీ విలన్స్ లా కావొద్దు. అలాగని మరీ మెతక హీరోయిన్లు కాకుంటే బెటరని నా ఉద్ధేశ్యం. ఇంతకన్నా నాకున్న జనరల్ నాలెడ్జ్ కి నేనేం చెప్పలేను" అంటూ డ్రమెటిగ్గా దండం పెట్టడం సులోచనకు ఎప్పుడూ మామూలే.

**

"ఏమండీ! ఇవాళ వరలక్ష్మీ వ్రతం. ఆఫీసుకెళ్తే ఎలా?" అంటూ ప్రయత్నించి వారించబోయింది అర్ధాంగి.

"అయితే వ్రతం నువ్వు చేసుకుంటావు గానీ నేనేం చేయను పిచ్చిముఖం లా వున్నావ్. సాయంత్రం వచ్చాక అక్షింతలివ్వు దీవిస్తా.నాకు ప్రసాదం పెడుదువుగానీ" చెప్పేసి ఆరోజుకి వంట కాకున్నా క్యాంటీన్ నుంచీ తెప్పుంచుకుందామని బయలుదేరాడు వెంకట్రావ్.

"అదికాదండీ బంధువులు, చుట్టాలు వస్తారు కదా. కాస్త పలకరించే మాటసాయం కోసమైనా వుంటే బాగుంటుందని" గొణిగింది.

 

"బాగుంది సంగతి. వచ్చిన ముత్తయిదువలకు వాయనాలు నన్నివ్వమంటావా ఏంటి? హైస్కూల్ కొచ్చిన కూతురుంది. ప్రక్క షాప్ నుంచి కావలసింది తెచ్చివ్వడానికి పదేళ్ళ కొడుకున్నాడు. వాళ్ళకయితే స్కూల్ సెలవే కదా వాళ్ళ సాయం చాల్లే. అసలే నా సీట్లో ఇవాళ కంటెంప్ట్ కేస్ కూడా వుందాయె. ఆఫీసు పనంటే మధ్యాహ్నం వరకు ఉపవాసముండటం కాదు" అనేసి బయలుదేరాడు వెంకట్రావ్.

"నాన్నా! మరే, మన పక్కింటి అంకుల్ కూడా మీ ఆఫీసే కదా. అయినా ఈ రోజు ఏదో సెలవుందని పోలేదు." అంది కూతురు.

"పిచ్చితల్లీ! అది ఆప్షనల్ హాలిడే అమ్మా. అవసరమైతే వాడుకోవచ్చు. అవతల నాకు కొంపలంటుకునేంత పనుంది. గవర్నమెంట్ సర్వెంట్ అంటే సెలవున్నా ఇరవైనాలుగ్గంటలూ మన బాధ్యత నెరవేర్చాలంటే తయారుగా వుండాలని అర్ధం" అని చెప్పులు వేసుకుని వీధిలోకి నడిచాడు.

 

**

ఒరేయ్..చలపాయ్! అందుకేరా నిన్ను ఉద్యోగం చేయని ఆ గూడూరు అమ్మాయిని చేసుకొమ్మన్నది. విన్నావు కాదు. ఈ నెల్లూరు పిల్లను ఉద్యోగముందని కోరికోరి చేసుకున్నావు. వరలక్ష్మీ వ్రతం అనయినా లేకుండా ఆఫీసుకెళ్తుందట" అంటూ రాగాలు తీయటం మొదలెట్టింది సుభద్ర అత్తగారు అలివేలు మంగ తాయారమ్మ.

 

"అబ్బబ్బా... అలా ఊరికే ఎప్పుడో జరిగిన మా పెళ్ళికి ఇప్పుడు భజంత్రీలు వాయించటం దేనికత్తయ్యా? అయినా నేను వంటా వార్పూ చేసే వెళ్తున్నాగా. ఉపవాసం కూడా వున్నాను. ముఖ్యమైన ఫైలుంది నా సీట్లో. అదొక్కటీ పెట్టేసి ఆఫ్ డే లీవిచ్చి రెండింటికల్లా వచ్చేస్తానంటే వినిపించుకోరేం?" చంటిదాని తలదువ్వి చేతికి బొమ్మనిచ్చి లేస్తూ అంది సుభద్ర విసుగ్గా.

"అనవే అను. ఎందుకనవూ. పెంపకం అలా వుంది. వ్రతమంటే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. బయటంతా తిరిగొస్తుందట. ఇక్కడ నీకోసం వచ్చిన ముత్తయిదువలు కాచుక్కూర్చోవాలా? అది ఎంత పెద్ద దోషం?" తన పంతమే నెగ్గి కోడల్ని ఆపేయాలని నిర్ణయించుకుని అంది తాయారమ్మ.

 

"నేను అందరికీ ఫోన్లు చేసి చెప్పేశా. వాయనాలకు అందరూ సాయంత్రం వస్తారు. మీరు అనవసరంగా నన్ను ఆపకండి ' భుజానికి హ్యాండ్బ్యాగ్ తగిలించుకుని బయలుదేరింది సుభద్ర.

 

"చూశావురా చలపతీ. ఈ నెల్లూరు పిల్ల.." అంటూ ఏదో అనేంతలో..

 

"అత్తయ్య గారూ, మా అమ్మగారు కూడా మీ అమలాపురం సంబంధం వద్దు అక్కడి అత్తలు సాధిస్తుంటారని అంది. సాఫ్ట్ వేర్ ఇంజనీరైన బెంగళూరు సంబంధం చేసుకోమన్నారు. ఇప్పుడు ఆవిడేమైనా మిమ్మల్ని అంటున్నారా? పెళ్ళై ఏడేళ్ళయినా ఇంకా మా ఊర్నెందుకు అంటారు?" అనేసి ఆగకుండా ఆఫీసుకెళ్ళింది సుభద్ర.

 

@@@@@

 

ఆరోజు వీధిలో పిల్లి ఎదురైనా వెనుతిరగలేదు వ్రంకట్రావ్. అత్తగారు అరిచి గీపెట్టినా ఆగలేదు సుభద్ర. కానీ, దాని పర్యవసానం వారికప్పుడు తెలియలేదు. అవాళ మినిష్టర్ గారు తనకేదోమీటింగ్ వుండటం వల్ల తొమ్మిది ముప్పావుకే కార్యాలయం చేరుకున్నారు. లిఫ్ట్ దిగి తన ఛాంబర్ కేసి వెళ్ళబోతూ ఎదురుగా వున్న తన శాఖ వంక దృష్ఠి సారించి చూసి, ఓ లుక్కేసి వద్దాం అని భావించారు. అటు సడెన్ విజిట్ చేసినట్టూ వుంటుంది, ఇటు ఉద్యోగుల్లో కస్త భయం పుట్టించినట్టూ వుంటుందని భావించి.

 

అప్పటికి స్టాఫంతా ఇంకా మెయిన్ గేట్ల దగ్గర వస్తూనో, లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూనో వున్నారు. కొందరైతే తమ సెక్షన్ల లోకి రావడానికి పదడుగుల దూరంలో కూడా వున్నారు. కానీ, మినిష్టర్ గరు డిపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టీ పెట్టగానే రెండు ద్వారాల దగ్గరా సెక్యూరిటీ వాళ్ళు అడ్డగించి నిలబడి ఎవరినీ లోపలికి వెళ్ళనీయలేదు.

దీంతో లోపల అటెండర్లో నలుగురు, స్టాఫో అరడజన్ నంది మాత్రమే వున్నారు. సీట్లన్నీ ఖాళీనే.

 

ఇకనేం?! మీడియాకు పండుగే పండుగన్నట్టు తయారైంది సీను. ఆ రోజనగా వెంకట్రావ్ గేటులోపలికొస్తూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగిగా కెమెరా కళ్ళలో పడితే, ఏదో పనుండి ఎప్పుడూ లేటుగా వచ్చే గుర్నాధం త్వరగా వచ్చేసి సీట్లో వుండి 'వెరీగుడ్' కాంప్లిమెంట్ కొట్టేశాడు. పైగా లేటుగా వచ్చేవాళ్ళకు వార్నింగ్ ఇస్తూ జారిచేసిన సర్కులర్ మెమో వెంకట్రావ్ చేతిలో హేళనగా నవ్వింది.

 

అదే రోజు ఈ మినిష్టర్ గారి ఇన్స్పి రేషన్ తో మరో శాఖ మంత్రిగారు సైతం తన శాఖను లంచ్ అవర్లో వెళ్ళి తనిఖీ చేశారు. ఆ సమయం లో సగం స్టాఫ్ క్యాంటీన్లో వుంటే, కొందరు అర్జెంట్ ఫైల్స్ గురించి స్పీక్ చేస్తూ ఆఫీసర్ల దగ్గరో, ఇంకొందరు అటెండర్లు అందుబాటులో లేక జిరాక్స్ మెషీన్ల దగ్గర, ఫాక్స్ మెషీన్ల దగ్గరో వుండటం వల్ల మూడొంతులు ఖాళీ సీట్లు కనిపించాయి. 

 

అప్పుడనగా పాపం హాఫ్డే లీవిచ్చి హ్యాండ్ బ్యాగ్ తో బయటకెళ్తున్న సుభద్ర కూడా కేమెరాకళ్ళలో పడింది. ఇవన్నీ కవర్ చేసి జనాలకు చూపి పబ్బం గడుపుకోడానికి 'ఆకస్మిక తనిఖీ' వాళ్ళకో అనుకోని అవకాశమైంది.

 

ఫినిషింగ్ టచ్ ఏమిటంటే - "పి.ఆర్.సీ లు, డి.ఏ లు కావాలంటూ అడిగే ఈ గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేయటానికి మాత్రం బద్దకిస్తూ, ఎంత లేటుగా విధులకు హాజరవుతున్నారో చూడండి!" అంటూ కామెంటరీ చెబుతూ వెంకట్రావ్ ని;

"బ్యాగులు సర్దుకుని ఆడవాళ్ళు ఇళ్ళకు త్వరగా ఎలా వెళ్తున్నారో చూడండి" అంటూ సుభద్రని పదే పదే, త్రిప్పి త్రిప్పి మరీ చూపించారు.

***

Bio

డేగల అనితాసూరి

సచివాలయంలో ఒక విభాగానికి అధికారిణి, 'ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, కౌముది, మయూరి, ఆంధ్రప్రభ, సాహితికిరణం, నేటినిజం ....మున్నగు పత్రికలలో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి కవితా సంపుటి 'సర్వధారి ' 'చేతన ' సచివాలయ సారస్వత వేదిక' లో 2014 ఆగస్ట్ లో ఆవిష్కరించబడింది.  డా. సి.నారాయణ రెడ్డి గారు, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, పరుచూరి గోపాలకృష్ణ, గౌ. నారా చంద్రబాబునాయుడు గారు, తనికెళ్ళ భరణి, రంగనాధ్ వంటి నటులు ... వంటి ఎందరో ప్రముఖుల నుంచి  పురస్కారాలు అందుకోవడం మరపురాని అనుభూతులు.

***

degala anitasuri
Comments
bottom of page