Website Published & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
ఇంత పంతమేలనే రచన, స్వరరచన
కిభశ్రీ
(శ్రీనివాస భరద్వాజ కిశోర్)

కొంటె కృష్ణుడు తమ ఇళ్లలో వెన్న దొంగిలించాడని, పాలు పెరుగులు బతకనీయడనీ, తుంటరివాళ్ళను వెంట వేసుకుని అల్లరి చేస్తున్నాడనీ, తమ బుగ్గ కొరికాడనీ మరింకా ఎన్నో రకాలుగా తమను బాధిస్తున్నాడని యశోదకు ఫిర్యాదు చేస్తారు వ్రజవనితలు. ఈ వృత్తాంతం మీద ఎందరో కవులు, ఎన్నో రకాల రచనలు చేసారు. ఈ ఉదంతాన్ని, చాడీల నెపంతో కృష్ణుడిని చూసేందుకే వారు వస్తున్నారన్న భావన కూడా కొందరు కవులు, రచయతలు వ్యక్త పరచారు. ఇది మరొక కొత్త దృష్టికోణం ఊహాకల్పన.
తన బిడ్డపై గోపవనితలు చెప్పిన చాడీలకు రోషం వచ్చి, వాళ్ళకు గుణపాఠం నేర్పాలని యశోద కృష్ణుడిని గృహ నిర్బంధంలో ఉంచుతుంది. రెండు రోజులలోనే కన్నయ్య కనబడక రేపల్లె మొత్తం తపించిపోతుంది. ఇత తాళలేక గోపస్త్రీలంతా, యశోద దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని చూపించమని మొరపెట్టుకుంటారు. కానీ, కోపం తగ్గని యశోద ససేమిరా అంటుంది. చివరకు ..... చదవండి. ఈ సన్నివేశం ఊహాస్వాతంత్ర్యం వాడి వ్రాసినవే కానీ ప్రామాణికం కావు.
గోపవనితలు యశోదనుద్దేశించి
గోపవనిత-1
ఇంత పంతమేలనే ఇంతి యశోదమ్మా॥
గోపవనిత-2
కొంతసేపైన నల్లనయ్యను మాకు చూపవమ్మా ॥
వీళ్ళందరినీ తలుపు సందునుంచి నక్కి చూస్తున్న కృష్ణుడిని లోపలికి పొమ్మని యశోద సంజ్ఞచేస్తుంది. మరి గోపికలు
గోపవనిత-3
సొంతమేలే వాడు నీ కొడుకేలే ఐనా
చెంతనె చెంగుకు కట్టుకుతిరిగేవింత స్వార్థమేలే! నీకు ఇంత స్వార్థమేలే॥
గోపవనిత-4
ఇంతవాడైనా అందరినీ అలరించేవాడుగదా! వాడలరించేవాడుగదా॥
కొంతసేపైన మాతో ఆడగ పంపవె ఓయమ్మా! పంపవె ఓయమ్మా॥
గోపికలంతా ముక్తకంఠంతో ॥ఇంత పంత॥
కోపం ఇంకా తగ్గని యశోద మూతి విరుచుకుని, ముఖం తిప్పుకుంటుంది. కాస్త భంగం ఐనా, ఆశ చావకుండా గోపికలు
గోపవనిత-1
వెన్న దొంగిలించాడన్నామని ఇంతటి రోషమా! నీకింతటి రోషమా లేక
లోగిళ్ళ మన్ను తిననిచ్చామని మాపైన కోపమా! మాపైన కోపమా॥
గోపవనిత-2
చిన్నుని మురిపెములన్నీ నీకే చెందవన్న భయమా లేక! నీకే చెందవన్న భయమా॥
వెన్నునిపై మాకేమి హక్కన్న నీ మనసులో భావమా | నీ మనసులో భావమా॥
గోపికలంతా ముక్తకంఠంతో ॥ఇంత పంత॥
నిజమే - - మీకేమి హక్కు అని అనకుండానే కళ్ళలోనే భావం చూపిస్తుంది యశోద. ఇంక ఆమె తగ్గేట్లు లేదని, గోపికలే కాస్త తగ్గి బ్రతిమాలే ధోరణలో
గోపవనిత-3
ఏడీ నేస్తము యేడని లేగలు కళ్ళతోనె వెదికేనే! లేగలు కళ్ళతోనె వెదికేనే॥
నీడవలే మా వెంటతిరుగు వాడేడని అడిగిరి గోపకన్నియలు! అడిగిరి గోపకన్నియలు॥
గోపవనిత-4
వాడల వీధుల సందడి లేదే యేమాయె వేణుగానము! యేమాయె వేణుగానము
వాడినేమి చేసిరి మీరని అత్తల దెప్పులు పోరులు! మూలన అత్తల దెప్పులు పోరులు॥
గోపికలంతా ముక్తకంఠంతో ॥ఇంత పంత॥
ఇన్న విధాలుగా చెప్పినా యశోద మనసు చలించలేదు. ఇక లాభం లేదని ఆఖరు అస్త్రం వాడారు గోపవనితలు
గోపవనితలు 1& 2
చెట్లను కూల్చగలిగినవానికి అడ్డేమి నిలుచునే ! వానికి అడ్డేమి నిలుచునే॥
గోపవనితలు 3&4
కట్టుబడినాడు వాడు
కట్టుబడినాడు నీ మాటకు సంతసించవమ్మా ! సంతసించవమ్మా॥
గోపికలంతా ముక్తకంఠంతో ॥ఇంత పంత॥
ఇంతమందికి తన కొడుకుమీద ప్రేమ ఉందనీ వాడిని చూడకుండా ఒక్కరోజైనా ఉండలేరని ఆమెకు తెలుసు. వాళ్ళ సంగతి ఎట్లున్నా నిజానికి తనకొడుకు తన మాటకు అంత విలువ ఇచ్చాడన్న మాట తలచుకోగానే పట్టలేని ఆనందంతో అప్పుడే బైటికి వచ్చిన తన బిడ్డను గట్టిగా వాటేసుకుని ఆనందభాష్పాలతో తడిపేసింది యశోద. కన్నయ్య తల్లిని వాటేసుకుని, చుట్టూ గుమిగూడి వున్న వ్రజవనితలనొక్కొక్కరినీ చూసి కొంటెనవ్వులతో వాళ్ళందరినీ కవ్వించాడు.
ఈ పాటను ఉన్న మా సోదరి రాధిక నోరిగారి మధురగళంలో రికార్డు చేసాము. ఆసక్తి వున్నవారు ఈ కింది లింకు లో వినవచ్చు
https://soundcloud.com/esbeekay/9wzvnlnhdglg
లేదా మొబైల్ లో ఈ కింది క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి వినవచ్చు
