top of page

కథా మధురాలు

శిల క్రింది జల

Tirumalasree

వాలి హిరణ్మయీ దేవి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో సాధారణ ప్రచురణకు  పొందిన కథ

“ధరణీ, అమ్మా ధరణీ... నీ కోసం ఎవరో వచ్చారమ్మా!” అంటున్న పరంధామయ్య మాటలతో, లాప్ టాప్ మూసేసి, బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది ధరణి.
హాల్లోని సోఫాలో కూర్చుని ఉన్న అపరిచిత వ్యక్తిని చూస్తూ, “ఎవరికోసం వచ్చారు? నేనే ధరణినండీ... నాతో పనేమిటి?” అడిగింది సౌమ్యంగా.
“నేనెవరో నీకు తెలియదు లేమ్మా... నన్ను రామ్మూర్తి అంటారు. నీకోసం నిన్నటినుండీ వెదుకుతున్నాను...” అన్నాడతను అలసటగా.
“ఎందుకు?” అప్రయత్నంగా అడిగింది.
“ఎందుకంటే... సారీ తల్లీ... నిన్న ఉదయం పదిగంటలకు మీ అమ్మగారు చనిపోయారు. ఆ ఇంట్లోని పాత డైరీల్లో ఉన్న మీ అడ్రెస్ చూసి బయలుదేరాను. ఏడెనిమిది చోట్ల వాకబు చేస్తూ వస్తే, ఇదిగో... ఇప్పటికి మీరు కనిపించారు. ఐస్ బాక్స్ లో  ఆమె శరీరాన్ని ఉంచే ఏర్పాట్లు చేసి వచ్చాను. అయినప్పటికీ...” అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే వారించింది ధరణి.
“ఆవిడతో నాకేం సంబంధం లేదు. మీరు వెళ్ళొచ్చు...” అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ధరణి.
పరశురామయ్య తెల్లబోయాడు. తానెరిగిన ధరణేనా ఈమె? ఎందరు బాధితులకో సహాయాన్ని అందించే ఆ ధరణీ, ఈమె ఒకరేనా? కన్నతల్లి పోయిందంటే కంట చుక్క నీరైనా చిందించని పాషాణ హృదయురాలా?’ అనుకుంటూ రామ్మూర్తి  వైపు చూసాడు. అతడూ నిర్ఘాంతపోయి అట్టే నిలబడిపోయి ఉన్నాడు.
ఇంతలో బయటినుంచి వచ్చిన ధరణి భర్త విష్ణు, వారిద్దరి ద్వారా విషయం  తెలుసుకొని, బెడ్ రూమ్ లోనికి నడిచాడు.
అలలు లేని సముద్రంలా, నిశ్చలంగా, నిర్భావంగా ఉన్న ధరణి వైపు చూస్తూ, “ఇంకా అలాగే కూర్చున్నావేమిటి? బయలుదేరు! నాకో అర్జెంట్ పని ఉంది... అది చూసుకుని వచ్చేస్తాను. ఫోన్ లో టచ్ లో ఉండు...” అన్నాడు.
“బయలుదేరటమా, ఎక్కడికి? ఎందుకు??” కోపంగా అడిగింది ధరణి.
“ఎందుకేమిటి ధరణీ? ఆవిడ నిన్ను కన్నతల్లి... నాకు అత్తగారు. మనం వెళ్ళకపోతే ఎలా?” విస్మయంగా అన్నాడు విష్ణు.
“ఆవిడ కన్నతల్లా? నా తప్పున్నా, లేకున్నా ఎప్పుడూ తిడుతూ, కొడుతూ, అడ్డమైన చాకిరీ చేయిస్తూ నరకం చూపించింది. ఒక్కనాడైనా పక్కన కూర్చుని కడుపారా తినిపించింది లేనేలేదు. ప్రేమగా చూసిందీ లేదు. అంతెందుకు? మనిద్దరం పెళ్ళి చేసుకుని వెళితే, ఎన్నెన్ని మాటలన్నది? నన్నేనా, అల్లుడన్న గౌరవం లేకుండా మిమ్మల్నీ అన్నది. ముఖానే తలుపులు వేసేసింది...”
“ధరణీ! కోపతాపాలకిది సమయమా? పాపం అతనెవరో అంత శ్రమ తీసుకుని వచ్చాడే, నువ్విలాగేనా ప్రవర్తించేది? బీరువాలో ఉన్న డబ్బు తీసుకొని, వెంటనే అతనితో వెళ్ళు... లేమ్మా...” అన్నాడు విష్ణు లాలనగా.
“ఆ మనిషి గురించి ఒక్క  పైసా ఖర్చు చేసినా అది వృధానే...” కరుగ్గా అంది ధరణి.
“ధరణీ, ప్లీజ్ అలా మాట్లాడకు... బయలుదేరు...”
అతన్ని కోపంగా చూస్తూ, బీరువా తెరచి డబ్బు తీసుకొని, హాల్లోకి చరచరా వెళ్ళింది ధరణి. ఆమెను అనుసరించాడు విష్ణు. 
“ఇదిగో, ఈ డబ్బు ఖర్చులకోసం తీసుకోండి. మాకు రావటానికి వీలు పడదు.” ఖచ్చితంగా చెప్పేసి, రామ్మూర్తికి డబ్బు ఇవ్వబోయింది. అతను చేష్టలుడిగి నిలుచుండి పోయాడు.
“తల్లి చనిపోయిందంటే ఎవరైనా ఒక్క సారిగా భోరుమంటారు. ఈ అమ్మాయి కంట ఒక్క కన్నీటి బొట్టైనా రాలేదు. పైగా భర్త తానే వెళ్ళమని అంటున్నా, ఇంత మొండితనమేమిటి? ‘తల్లీ కూతుళ్ళకి మాటల్లేవట!’ అని కొందరు అంటున్నా, ఇలాంటప్పుడు అలాంటి  పంతాలు, పట్టింపులు ఉంటాయా?’ అనుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలో?’ అనుకొంటూ పరశురామయ్య వంక, విష్ణు వంక అయోమయంగా చూసాడు రామ్మూర్తి. 
“ధరణీ, వెళ్ళమ్మా. ఇప్పుడు వెళితే కనీసం ఆఖరి చూపైనా దక్కుతుంది. వెళ్లకుంటే, ఆ తరువాత జీవితాంతం విచారించాల్సి వస్తుంది. నువ్వూ ఓ బిడ్డకు తల్లివై ఉండీ, మరో బిడ్డకు తల్లివి కాబోతూ, నీ తల్లి పట్ల అంత కఠినంగా ఉంటే ఎలా చెప్పు?” ధరణి తల నిమురుతూ అన్నాడు పరశురామయ్య.
“ధరణీ, ఈయనెవరో మానవత్వం కొద్దీ ఇంత శ్రమ తీసుకొని వస్తే, మానవత్వానికి మారు రూపులా ఉండే నీవు ఇలా ప్రవర్తించటం నాకు ఎంతో బాధను కలిగిస్తోంది.” అన్నాడు విష్ణు.
దాంతో, తన రెండేళ్ళ బాబు నానీని పరశురామయ్యకు అప్పజెప్పి, బయలుదేరింది ఏడు నెలల గర్భవతి ధరణి భారంగా.
ఏడేళ్ళు కాలగర్భంలో కలసిపోయినా, ఆ చేదు జ్ఞాపకాలింకా పచ్చిగానే ఉండి, నొప్పిని కలిగిస్తున్నాయి ఆమెకు.
***
ఒక గంట కారులో ప్రయాణం చేసి గమ్యం చేరుకున్నారు. టెంట్ వేసిన ఇంటి ముందున్న జనాన్ని తప్పించుకొంటూ లోపలికి వెళ్ళింది ధరణి. చాప మీద పడుకోబెట్టబడిన ఎండిన వరుగు లాంటి తల్లి నిర్జీవ శరీరాన్ని చూసేసరికి కడుపులో దుఃఖం సుళ్ళు తిరిగినా, పెదవిని బిగబట్టి, కన్నీళ్లను అదిమి పట్టింది. ఎముకల మీద చర్మం అతికించినట్టున్న చేతులను, కాళ్ళను చూస్తూ, ‘వీటితో తానెన్ని దెబ్బలు, తన్నులూ తిన్నది? తల్లి గుర్తుగా తన వంటిమీద గాయాలు, వాతలు తప్పించి మరేం మిగిలాయి?” అనుకుంది విరక్తిగా.
“మీ అక్కలిద్దరికీ కబురు పంపాము. అయినా ఇంత వరకూ రానేలేదు. మీ నాన్న ఎక్కడున్నాడో తెలియదు, వస్తాడన్న ఆశా లేదు. మీరు పూనుకుంటే, ఇక ఆవిడను సాగనంపే కార్యక్రమాన్ని మొదలుపెట్టవచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయింది.” అన్నారెవరో.
“ఈ కార్యక్రమం అంతా ఎవరు చేస్తున్నారో చెబితే, వారికి ఈ  డబ్బునిస్తాను.” అంది ధరణి నిర్లిప్తంగా.
 “ధరణీ, నేను చేస్తానమ్మా. మీ చిన్నతనం నుంచీ ఇక్కడే  మా ఇంట్లోనే ఉంటూ, మాలో  కలిసిపోయింది తల్లీ మీ అమ్మ!  ‘అన్నా’ అని నోరారా పిలిచేది.  నేనే ఈ అంత్యక్రియలు నిర్వహిస్తాను లేమ్మా.” అన్నాడెంతో ఉదారంగా ఆ ఇంటి ఓనర్.
“సరే మామయ్యా.” అంటూ ధరణి ఆయనకు డబ్బు ఇవ్వగానే, ఏర్పాట్లన్నీ చకచకా మొదలయ్యాయి.
ఒకావిడ ధరణికి మంచినీళ్ళు ఇవ్వబోతే, వద్దని తిరస్కరించింది. ఒక్క కన్నీటి బొట్టయినా చిందించకుండా, శిలలా, ఎవరింటికో తప్పనిసరిగా వచ్చినట్టు కూర్చున్న ధరణిని చూస్తూ చెవులు కొరుక్కున్నారు ఇరుగుపొరుగు వారంతా.
పాడె పైన ఉన్న తల్లి పార్థివ శరీరానికి ఆఖరు నమస్కారం చేయటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందామెకు. అప్పుడే వచ్చిన ఆమె అక్కలు ఇద్దరూ రాగాలు తీసూ, శోకాలు పెడుతూ ఉంటే, అభావంగా వారివైపు చూస్తూ కూర్చున్న ధరణికి ‘తల్లి’ కనుమరుగైనప్పుడు మాత్రం మనసులో ఏదో ఒక మూల కలుక్కుమంది.
తల్లి ఫోటోను పెట్టి, అక్కడ దీపం, అగరువత్తులూ వెలిగిస్తూ ఉంటే ఆమె చేతులు వణికాయి. 
“దహన కార్యక్రమం అయిన తరువాత, ‘అక్కడి’ నుండి తిరిగి వచ్చేవారికి మజ్జిగ ఇవ్వాలి. చేయమ్మా.” అని పక్కింటావిడ చెబితే, వంటగదిలోనికి వెళ్ళింది ధరణి.
అయ్యవారి నట్టిల్లు లా ఉంది ఆ గది. ‘చివరి రోజుల్లో, తిండికి కూడా కటకటలాడిపోయినట్టుంది!’ అనుకోగానే, ధరణి కళ్ళలోంచి రెండు అశ్రు బిందువులు అప్రయత్నంగా రాలాయి. ఆకలితో అలమటించే ఏ ప్రాణిని చూసినా, ‘ఆకలి బాధ’ బాగా తెలిసిన ధరణి తట్టుకోలేదు.
“ఏమిటోనేమ్మా, మీ అమ్మది మొదటినుండీ కష్టాల జీవితమే. ఏదో, నోరు పారేసుకొంటూ గయ్యాళిలా బ్రతికింది కానీ.” అని దూరపు బంధువు ఒకామె ఏదో చెప్పబోతూ ఉంటే, ‘చాలు’ అంటూ వారించింది ధరణి.
“అన్నట్టు, మూడోరోజున, ఐదో రోజున చేసే చిన్న కర్మలు ఎవరు చేస్తారు?” అంటూ ఏవో పద్ధతుల గురించి చెప్పబోతున్న ఆవిడను వారిస్తూ, “అవన్నీ ఎవరెలా చేస్తారో నాకు అనవసరం. నన్నిక పిలవకండి. ఆ దశ దిన కర్మలకీ డబ్బును ఉంచండి.” అంది ధరణి.
“అలాగంటే ఎలాగమ్మా? ఎంతైనా కన్న తల్లి. మీరంతా కలిసి చేయాలి. ఆ వంకనైనా మీరంతా కలుస్తారు. మీ మూడో అక్క ఎలాగూ పోనే పోయింది కదా. ఉన్న మీ ముగ్గురూ కలిసి చేయండి.” అంది మరొకావిడ మెత్తగా.
“రావటానికి ప్రయత్నిస్తాను...” అంది ధరణి మెల్లగా.
రెండు గంటల తరువాత, తన మనసులోని దిగులుకు మల్లేనే ముసురుకున్న మబ్బుల్ని చూస్తూ అక్కడినుండి బయలుదేరింది ధరణి.
***
“అదేమిటోయ్, అప్పుడే వచ్చేశావు? నీ ఫోన్ కాల్ కోసం ఎంతో ఎదురు చూసాను, నువ్వు అడ్రెస్ చెబితే నానీని తీసుకు వద్దామని... నేను చేసినా నువ్వు ఫోన్ ఎత్తలేదు...” ధరణిని చూస్తూనే అన్నాడు విష్ణు.
అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, మౌనంగా వాష్ రూమ్ లోనికి వెళ్ళిపోయింది ధరణి. మరొకసారి తలారా స్నానం చేసి, నైటీ లోనికి మారిపోయింది. మంచమ్మీద అలసటగా వాలిపోయిన ధరణిని చూసి,  ఆమెకెలాంటి అంతరాయం కలగకుండా, తలుపులు దగ్గరకు చేరవేసి, బయటకు వెళ్ళిపోయాడు విష్ణు.
గుండెల్లోని వేదనంతా అశ్రురూపంలో బయటకు తన్నుకొస్తుంటే, గడచిన రోజులన్నీ ధరణి  కనుల ముందు కదిలాయి.
***
“ధరణీ, ఎక్కడ చచ్చావే? పప్పు రుబ్బమని చెప్పానుగా?” గట్టిగా అరుస్తూ వచ్చింది దుర్గాంబ.
పుస్తకాలు ముందు వేసుకొని చదువుకొంటున్న ధరణి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తల్లి దగ్గరగా వెళ్లి, “రేపు ఎగ్జాముంది అమ్మా...” అని నసిగింది. 
“నువ్విప్పుడు చదివి, ఉద్యోగాలు చేసి, ఊళ్ళేలాలనేం లేదు కానీ, ముందు నేను చెప్పిన పని చేయి. మీ అక్కలకు అంతంత ఫీజులు కట్టి చదివించాను... కానీ ఏం లాభం? రెక్కలు రాగానే ఎగిరెళ్లిపోయారు.  రేపు నువ్వూ అంతే అని తెలిసినా చదివిస్తున్నా, మిమ్మల్ని ముప్పూటలా మేపుతున్నా...: అంటూ దండకం అందుకుంది దుర్గాంబ.
‘మేపుతున్నా..’ అంటుంది కానీ ఎప్పుడూ అర్థాకలి తోనే ఉంచుతుంది. ఏదైనా నచ్చింది మరికాస్త తినబోతే, ‘పోతులా ఇంకెంత తింటావే?” అంటూ తిననివ్వదుగా...’ మనసులోనే అనుకొంటూ రుబ్బురోలు దగ్గరకు వెళ్ళింది ధరణి.
ఛ, ఇప్పుడీ పప్పంతా రుబ్బేసరికి చేతులింతంత వాచిపోతాయ్. మిక్సీ కొంటానని అక్క ఎంత చెప్పినా వినకుండా తనకి పట్టుచీర కొనేసుకుంది అమ్మ. ‘ఇప్పుడు పట్టుచీర అంత అవసరమా?’ అన్న తమ ప్రశ్నకు ‘ఎప్పుడూ వాళ్లనో వీళ్ళనో అడిగి కట్టుకోవటమే అవుతోంది కదా!’ అంటూ తమ నోళ్ళు మూయించింది.
“ఏమిటే, అక్కడే పాతుకుపోయావ్?  ఈ బట్టలు నీ అబ్బ వచ్చి ఉతుకుతాడనుకుంటున్నావా?” అని దుర్గాంబ తన నెత్తిన గట్టిగా మొట్టేసరికి, ఈడ్చుకుంటూ వెళ్లి, బావిగట్టున ఉన్న మాసిన బట్టల మేట వంక దీనంగా చూస్తూ, “అమ్మా, ఇన్ని బట్టకు నేనొక్కదాన్ని ఉతకలేను. చిన్నక్కని కూడా రమ్మను...” అంది ధరణి, తన తలమీద చేతిని పెట్టుకుంటూ.
“భవానిని పక్కింటికి పంపాను కానీ, నువ్వెళ్ళి ఉతుకు.” అని చెప్పేసి వెళ్ళిపోయింది దుర్గాంబ. మనసులోనే పళ్ళు నూరుకుంది ధరణి. 
పక్కింట్లోని సింగిల్ రూమ్ లో కిషన్ అనే బాచిలర్ చేరాడు. బాగా ఉన్నవాళ్ళేమో, ఆర్నెల్ల గ్రాసం తో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. అతని దగ్గరకు చదువు మిషతో వెళ్లి, అవీ, ఇవీ మాట్లాడి, అతను చూసీ చూడకుండా ఉప్పూ పప్పులన్నీ పిట్టగోడ మీదనుంచి భవాని  చేరవేస్తూ ఉంటే, ఇవతలి నుంచి దుర్గాంబ అందుకుంటూ ఉంటుంది.
ఇదంతా ధరణికి చాలా అసహ్యంగా అనిపించి, “ఇలా దొంగతనంగా తెచ్చుకోవటం అవసరమా?” అందోసారి. అంతే! దుర్గాంబకు ఎక్కడలేని కోపం వచ్చేసి ఎడాపెడా బాదేసింది. తల్లికిష్టం ఉండదని తెలిసినా, ఇలాంటివి తన కంట పడినప్పుడు ఏదో ఒకటి అనటం, తల్లితో తన్నులు తినటం ధరణికి మామూలే.
బట్టలుతుకుతూ ఆలోచనలో పడింది ధరణి. పెద్దక్క శివాని ఫ్యాక్టరీ పనిలో చేరాక, కాస్త కాస్తగా పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకునేలోగానే తాను  చేసే వంటపనులు మానేసి, ఇంట్లో దర్జాగా కూర్చుంది తల్లి.
పైగా, “మీ నాన్నతో నేనేనాడూ సుఖపడలేదు. ఆయన్ని నానా పాట్లు పడి పోషించుకు వచ్చాను. నన్నెప్పుడూ అనుమానంతో కాల్చుకు తినటమే. ఆ మనిషి వెళ్ళిపోయినా, మీరంతా గుదిబండల్లా నా మెడకు చుట్టుకున్నారు. మీకోసం చాకిరీ చేసి చేసి హరించుకుపోయాను.” అంటూ ఉంటుంది. 
ఈ సోదంతా, అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ చెప్పి వారి దయాధర్మం ఆశిస్తూ ఉంటుంది. ఇదంతా తనకెంతో చిన్నతనంగా ఉంటుంది. అదిగాక, వాళ్ళింటికీ, వీళ్ళింటికీ వెళ్లి పట్టుచీరల్ని ‘అరువు’గా పట్టుకురమ్మంటుంది. తను వెళ్లినప్పుడల్లా వాళ్ళంతా వెటకారంగా మాట్లాడుతూ, హీనంగా చూస్తూ ఉంటారు. ఆ చీరలను కట్టుకుని పెళ్లిళ్లకు వెళ్లి, ఆ పెళ్ళి వాళ్ళను అడిగి మరీ అవీ ఇవీ మూటగట్టుకు వస్తుంది. తనకీ పనులు చూస్తూ ఉంటే సిగ్గుతో ప్రాణం చచ్చిపోతూ ఉంటుంది. 
“ఇలా అడుక్కోవటం ఎందుకమ్మా? అందరూ మన గురించే చెప్పుకుని నవ్వుకుంటున్నారు తెలుసా?” అంటే “ఏదీ, ఆ నవ్వే వాళ్ళనిలా రమ్మను. మీకోపూట తిండి పెడతారేమో కనుక్కుంటా.” అంటూ విరుచుకు పడుతుంది.
‘తండ్రి ఉన్నప్పుడు ఆయన కూడా తనపైన ఉన్న ముగ్గురినీ తప్ప తననెప్పుడూ ముద్దులాడిన గుర్తు లేనేలేదు. తల్లీదండ్రీ ఇద్దరూ తనని లోకువగా చూడబట్టి, అక్కలకి కూడా తనంటే నిర్లక్ష్యం. ఓ పనిమనిషి కన్నా హీనంగా చూస్తూ ఉంటారు. తను అందంగా ఉందని అసూయతో చచ్చిపోతూ ఉంటారు. తన ఫ్రెండ్స్ ఇళ్లలోని అందరూ ఎంతో అభిమానంగా కలసిమెలసి ఉంటుంటే, అలాంటి వాతావరణం తమ ఇంట్లో ఎందుకు ఉండదో తనకి ఎంత ఆలోచించినా అర్థం కాదు.’ అనుకొంటూ ఉతికిన బట్టల్ని తాడు మీద ఆరేయసాగింది ధరణి.
ఇలా ఎన్నెన్నో నిరసనల, నిరాదరణల మధ్య ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇంటర్మీడియట్ వరకూ చదివింది ధరణి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే, ట్యూషన్స్ చెప్పటం  మొదలుపెట్టింది.
***
తమ వెనుక వీధిలోనున్న చిన్నారికి ట్యూషన్ చెప్పటానికి వాళ్ళింటికే వెళ్ళేది ధరణి. అక్కడ చిన్నారి కజిన్ అయిన విష్ణుతో పరిచయం ఏర్పడి, ఆమె జీవితం ఓ అందమైన మలుపు తిరిగింది. అతను ప్రపోజ్ చేస్తే, భయపడుతూనే తల్లికా విషయం చెప్పింది. ఎంతైనా తల్లి కనుక తనకోదారి ఏర్పడుతోంది అంటే ఎంతో సంతోషపడుతుందని ఆశించింది.
“రెక్కలు రాగానే ఎగిరిపోవాలనుకుంటున్నావు కదూ? ఇంత కష్టపడిన తల్లికి, ఇంత ముద్ద పెట్టే బాధ్యత మీ మీద ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నావా? వాడెవడో పెళ్లి అంటూ నిన్ను ముగ్గులోకి లాగుతున్నాడు. మోజు తీరగానే తనదారిన తాను పోతాడే కానీ, నీలాంటి దాన్ని చివరివరకూ చూస్తాడనుకుంటున్నావా? నోరు మూసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చెయ్. ఈ ప్రేమా, పెళ్ళీ విషయాలకు దూరంగా ఉండు...” అంటూ తిట్ల వర్షం కురిపించింది దుర్గాంబ.
ఇంతలో మూడో అక్కకు ఏదో సినిమాలో ఛాన్స్ వచ్చిందని, తోడుగా రమ్మని అడిగేసరికి సరేనంటూ, పదిరోజుల పాటు వేరే ఊరిలో జరిగే అవుట్ డోర్ షూటింగ్ కి తనతో వెళ్ళింది తల్లి. 
ఇదే అదనని, విష్ణు దగ్గరికెళ్ళి విషయమంతా చెప్పేసరికి, గుళ్ళో పెళ్లి ఏర్పాటు చేసేసాడు. పెళ్లి చేసుకొని, విష్ణుతో కలసి ఇంటికి వెళితే, తాను చెప్పేదేదీ వినిపించుకోకుండానే, నానా మాటలూ, తిట్లూ తిట్టి, ముఖానే తలుపులు వేసేసింది. తరువాత రెండు మూడు సార్లు తాను ఒక్కతే వెళ్లి మాట్లాడాలని ప్రయత్నించింది కానీ, తనను, భర్తను శాపనార్థాలు పెట్టి, శత్రువులా చూసింది. 
పెళ్ళైన ఐదేళ్ళ వరకూ పిల్లలు కలగకపోతే, తల్లి శాపనార్థాలే అందుకు కారణమేమో అనుకొని ఏడ్చేది ధరణి. విష్ణు లాలనలో ఆ గతాన్ని మరచిపోయింది. ‘నానీ’ పుట్టిన తరువాత తల్లీ వాళ్ళు ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలుసుకునే ప్రయత్నం మరి చేయలేదు.
ఏదో, ప్రశాంతంగా జీవనం సాగిపోతూ, తాను మరొక బిడ్డకు తల్లి కాబోతున్న ఈ తరుణంలో ఇప్పుడు ఈ చేదు సంఘటన...
***
ధరణి అస్థిమితంగా కదలటం అప్పుడే బెడ్ రూమ్ లోనికి వచ్చిన విష్ణు కంట పడింది. 
“ఏమిటి ధరణీ? నిద్ర పట్టటం లేదా?” అని అడిగాడు. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. ఇష్టంగా అతడిని పెనవేసుకొని, అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, “నీ ప్రేమనేది లేకుంటే నేననేదాన్ని ఉండేదాన్నా?” అంది ధరణి, మెల్లగా తన పొట్టని ఆప్యాయంగా నిమురుకుంటూ.
“ప్రేమ ఎంతో మాజిక్ చేస్తుంది ధరణీ. అందుకే ఉన్నన్ని రోజులూ ప్రేమిస్తూ, ప్రేమను పంచుతూ బ్రతకాలి. గతాన్ని మరచిపో. ఆ పదవ రోజు కార్యక్రమాన్ని పధ్ధతిగా చేస్తే, మీ అమ్మగారి ఆత్మ సంతోషిస్తుంది.” అనునయంగా అన్నాడు విష్ణు. 
ఆ స్వరంలోని లాలిత్యానికి కరగిపోయిన ఆమె ఇక వాదించలేదు.

***
ధరణి, విష్ణు వెళ్ళిన తరువాత కార్యక్రమం మొదలైంది. తంతు జరిపించినవారికి ఇవ్వవలసిన చెప్పులూ, గొడుగూ, పంచెలూ, తదితర సంభావనలు అన్నీ ఆ దంపతులే ఇచ్చారు. దుర్గాంబ  జ్ఞాపకార్థంగా వచ్చిన వారందరికీ రాగిచెంబులు పంచారు.
అందరిలోకీ చిన్నది అయినా ధరణే సమస్త ఖర్చులనూ భరించింది. ఆ పెద్ద ఆడపిల్లలు ఇద్దరూ చుట్టపుచూపుకు వచ్చినట్టు చేతులు ముడుచుకు కూర్చున్నారు. ‘తల్లికి ఏనాడూ, మందూ మాకూ కొనివ్వక పోయినా, ఇంట్లోని సామానంతా ముందే చేరవేసుకున్నారు.’ అని ఇరుగు పొరుగు వారు అంటూ ఉంటే, వారిని వారించింది ధరణి. 
అక్కలిద్దరూ తనవంక ఈర్ష్య గా చూడటం గమనించినా, తనకు తానుగా వారిని పలుకరించి మాట్లాడబోయింది. కానీ వాళ్ళు ముఖం తిప్పుకొనేసరికి ఏమీ చేయలేక ఊరుకుంది ధరణి.
ఇంతలో ఇల్లుగలావిడ వచ్చి, “ధరణీ, అతన్ని గుర్తుపట్టావా?” అంటూ ఓ మూల కూర్చున్న ఒక వృద్ధుడిని చూపించింది. ఎముకలపోగులా, గుండుతో ఉన్న ఆ వ్యక్తిని తన తండ్రిగా పోల్చుకునేందుకు చాలా శ్రమ పడాల్సి వచ్చింది ధరణికి.
“ఎవరో చెబితే తెలిసిందట. నిన్ననే వచ్చాడు. పలకరిస్తే ఎక్కడ అతని భారం తమ మీద పడుతుందో అని మీ అక్కలిద్దరూ మాట్లాడనే లేదు. నిన్ను కాదని, వాళ్ళను తెగ గారాబం చేసేవాడు, మా బాగా కుదిరింది రోగం.” అంటూ అతని వంక తిరిగి, “శివయ్యా, నీ చిన్నకూతురు ధరణి. దీన్ని మీరెంత ఛీత్కరించినా, ఇదే నీ పెళ్ళానికి దిక్కయింది. సక్రమంగా అన్నీ జరిపించింది. అది అందంగా, తెల్లగా పుట్టిందని అసలు నీ బిడ్డే కాదని అన్నావు. ఇప్పుడు చూడు, పెద్ద మనసుతో ఎంత హుందాగా నిలబడిందో.” అంది.
అతను మెల్లగా లేచి, ధరణి దగ్గరకు వచ్చి, ఆమె తల నిమిరి రెండు కన్నీటి బొట్లు రాల్చాడు. నిర్లిప్తంగా ఉండిపోయింది ధరణి.
***
భోజనాలయ్యాక నడుము వాల్చింది ధరణి. ఆమె పక్కకు వచ్చి కూర్చుంది ఇల్లుగలావిడ.
“అత్తయ్యా, భోంచేసావా, పడుకుంటావా?” అడిగింది ధరణి.
“ఆ, చేసానమ్మా. అన్ని వంటలూ చాలా బాగున్నాయి. పోనీలే, ఇన్నాళ్ళకి మీ అమ్మకి సంతృప్తి కలిగి ఉంటుంది. పాపం ఆవిడ జీవితమంతా అసంతృప్తి తోనే గడచిపోయింది.
దాన్ని చిన్నప్పటినుండీ చూసినదాన్ని కదా. సవతి తల్లితో ఎన్నో బాధలు పడింది. ఎవరినో ప్రేమిస్తే, వాడు ‘పెళ్ళి’ అనే సరికి ముఖం చాటు చేసాడు. తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడూ, నల్లటి వాడూ, అనాకారి అయిన మీ నాన్నను పెళ్లాడవలసి వచ్చింది. పోనీ వాడన్నా ప్రేమగా ఉన్నాడా అంటే లేని పోని అనుమానాలతో ఆమెను కాల్చుకు తినేవాడు.
కటిక పేదరికం, పుట్టినవారంతా ఆడపిల్లలే కావటంతో అభద్రతా భావం. నాలుగో కాన్పులోనైనా మగపిల్లాడు పుడతాడని ఆశ పడితే  నువ్వు పుట్టావు. తెల్లగా, రబ్బరు బొమ్మలా ముద్దుగా పుట్టిన నిన్ను చూసి మురిసే అవకాశం లేకుండా, మీ నాన్న ‘ఇది నాకు పుట్టింది కాదని’ అంటూ మీ అమ్మను కాల్చుకు తిన్నాడు. మిమ్మల్ని పోషించలేక, తనకొచ్చే  జీతం డబ్బులతో  తాగి తందనాలు ఆడాడు. దీంతో మీ అమ్మకు పిచ్చెక్కినట్టైంది. నోరు పెద్దదైంది. ఇష్టం వచ్చినట్టు తిడుతోందన్న వంకతో మీ నాన్న ఇంట్లోంచి చల్లగా జారుకున్నాడు. మగదిక్కు లేని ఆడదాని పాట్లు ఇన్నీ అన్నీ కావు. అవన్నీ ఎదుర్కోవటానికే ‘గయ్యాళి’గా మారింది మీ అమ్మ. 
ఏపుగా, అందంగా ఎదుగుతున్న మీ మీద ఎవరి కళ్ళు పడతాయో అన్న భయంతో అనుక్షణం గడిపేది. ‘లేనప్పుడు సరేసరి వదినా, ఉన్ననాడైనా వీళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాలంటే భయం వేస్తోంది. ఇంత అందం ఇచ్చిన ఆ దేవుడు, వీళ్ళ నుదుట మంచి రాత రాసాడు కాదు.’ అంటూ నొచ్చుకొనేది. ‘పెద్దదాని సంపాదనకు, నా సంపాదన కూడా చేర్చి వీళ్లనో గట్టుకు చేర్చాలని అనుకుంటూ ఉంటే ఆ దిక్కుమాలిన దేవుడు నాకు ‘కాన్సర్’ నిచ్చాడు.’ అని ఏడ్చేది.”
ఆ మాట వింటూనే దిగ్గున లేచింది ధరణి. “ఏమిటత్తా, అమ్మకి కేన్సరా?” నమ్మలేనట్టు అడిగింది. 
“అవునమ్మా... మీరు బాధపడతారని ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టింది. తను లేకపోతే మీరు భీరువులై పోతారని చెప్పలేదు. శారీరక శ్రమ అధికంగా చేయవద్దనీ, విశ్రాంతి ముఖ్యమనీ డాక్టర్ చెప్పటం వలన పని మానేసింది. మీరంతా మీ కాళ్ళ మీద నిలబడాలని, ‘నేనెంతకని కష్టపడాలి, మీరు సంపాదించండి...’ అంటూ మీ వెంట పడిన కారణం ఇందుకే.  కానీ మీ పెద్దక్క తన సంపాదనంతా మీ అమ్మ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తోంది అన్న భ్రమతో అర్జెంట్ గా ఎవరినో పెళ్ళాడి వెళ్ళిపోయింది.
దాంతో, మీ చిన్నక్క, ఇంటిభారం తనమీద పడుతుందని కొంతా, డబ్బుంటే చాలు అనుకొంటూ కొంతా ఒక డబ్బున్న ముసలి వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. ఇక మూడోది సినిమాల పిచ్చిలో పడి, మోసపోయి ఆత్మహత్య చేసుకుంది.
“అందరిలోకీ పధ్ధతిగా ఉండేది ధరణి ఒక్కతే. అందుకే అదెలా మారిపోతుందో అనుకొంటూ నా కోపతాపాలన్నీ దానిమీదనే చూపించాను. అది ‘ప్రేమ, పెళ్లి అనేసరికి నాలాగ ఎక్కడ మోసపోతుందో అని భయమేసి, బాగా తిట్టాను. అది ప్రేమించిన విష్ణు చాలా మంచివాడని, మర్యాదస్తుడని తెలిసిన తర్వాత, మాలాంటి వాళ్లకి దూరంగా ఉంటేనే దాని జీవితం బాగుపడుతుందని, పెళ్ళి చేసుకుని గుమ్మంలోకి వచ్చిన వాళ్ళిద్దరినీ నానా తిట్లూ తిట్టాను. నా మాటలకు అలవాటు పడిన ధరణి సరిపెట్టుకుంటుందని, కావాలనే ఆ విష్ణుని కూడా తిట్టాను. నేను అనుకున్నట్టే దానికి బాగా కోపం వచ్చింది. అది ఏనాడైనా నా గుమ్మంలోకి వస్తే, ఇంత పసుపు కుంకుమా, చీరా రవికా పెట్టలేని నా అశక్తతను అలా ఆ తిట్ల వెనుక దాచిపెట్టాను. మర్యాదస్తుల ఇంటి కోడలు, మన ఈ లోక్లాసు బస్తీలోకి రాకూడదనే దాని మనసు విరిగిపోయేలా ప్రవర్తించాను. కానీ నాకెందుకో ఒక నమ్మకం... నా చివరి దశలో అదే దిక్కు అవుతుంది చూడు” అంటూ పదే పదే అనేది అమ్మా.  మీ అమ్మ నమ్మకమే నిజమైంది!” అంటూ ముగించింది ఇల్లుగలావిడ. 
“మరి పక్కింటి కిషన్ రూమ్ లోంచి సరుకులు తీసుకురావటం, మూడో అక్కను సినిమాల్లో వేషాలకి ప్రోత్సహించటం?” అయోమయంగా అడిగింది ధరణి.
“కిషన్ అసలు మంచి వాడు కాదమ్మా. మీ రెండో అక్క మీద కన్ను వేసాడు. వాడి పీడ ఎలా అయినా వదిలించుకోవాలని అస్తమానూ వాడిని అప్పులు అడగటం, వాడు లేనప్పుడు రూము సర్దే నెపంతో వాడింట్లోనుంచి సరుకులు రవాణా చేయించటం చేసింది. ఇదంతా చూసి వాడు బెదిరిపోయి రూము ఖాళీ చేసేసాడు. మరో కారణం మీ అందరి ఆకలి తీర్చడం ఆవిడ ధ్యేయం. మీ దగ్గర కటువుగా ఉన్నా, ఆమె మనసు వెన్నే. ‘పిల్లల్ని మరీ ఏడిపించేస్తున్నా వదినా. కానీ నేనిలా ఉండకపోతే వీళ్ళు సవ్యంగా ఉండరు’ అంటూ నా దగ్గర చాలా సార్లు వాపోయేది. మిమ్మల్ని చూసేసరికి తనకు తెలియకుండానే కాఠిన్యాన్ని ముసుగుగా వేసుకునేది...”
ఇక మూడో అక్కతో షూటింగ్ కి వెళ్ళింది దాన్ని ప్రోత్సహించటానికి కాదు... కాపలాగా... మీ అమ్మకు లోకం తెలుసు... సినిమాల మీద మోజున్న ఆడపిల్లను,  స్త్రీ బలహీనత ఉన్నవారు ఎలా వంచిస్తారో తెలుసు... అందుకే వెయ్యి కళ్ళతో కాపలా కాసేది... ఈలోగా నువ్వు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయావు. దానికి ఎంతో నిశ్చింతగా ఉన్నా, మీ అక్క గురించి చాలా దిగులు పడుతూ, తన  వెంట వెంటనే ఉండేది... కానీ మీ అక్కయ్య తల్లినే మాయజేసింది... వెండి తెర మీద ఒక తారగా వెలగాలని, ఉన్నతంగా ఎదగాలని తన యవ్వనాన్ని నిచ్చెనగా వేసుకుంది... ఎదగలేదు... పాతాళంలో పడిపోయి, మీకెవరికీ ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంది... దాని చావు మీ అమ్మ జబ్బును మరింత ఎక్కువ చేసింది... నాతో చెప్పుకొని, దాన్ని పదేపదే తలచుకుంటూ కంటికీ మంటికీ ఏకధారగా ఏడ్చేది...”
ధరణి కళ్ళు జలపాతాలయ్యాయి. తల్లిని సవ్యంగా అర్థం చేసుకోలేక, సరిదిద్దుకోలేని పొరబాటు చేశానంటూ కుమిలిపోసాగింది.
***
“బాబాయ్, మీ వయసు నేస్తం ఒకరు కావాలని అన్నారుగా, ఇదిగో, ఈయన్ని తీసుకు వచ్చాను...” అంటూ శివయ్యను పరంధామయ్యకు పరిచయం చేసింది ధరణి.
“శివయ్య గారూ, ఇలాంటి మంచి బిడ్డకు జన్మనిచ్చినందుకు మీరెంత ధన్యులండీ! నేను సంపాదించినదంతా లాక్కుని, నన్ను తన్ని నడిరోడ్డు పాలు చేసారు నా కొడుకులు. ధరణే కనుక నన్ను చేరదీసి ఆదరించి ఉండకపోతే ఏనాడో చచ్చిపోయి ఉండేవాడిని. మనలాంటి వారికోసం ఈ దంపతులు నిర్వహిస్తోన్న అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పనుల్లో ఉడుతా భక్తిగా సేవలను అందిస్తున్నాను. ధరణి బిడ్డ ‘నానీ’ నాకు సొంత మనవడి కన్నా ఎక్కువ. వాడి ఆటపాటల్లో పరవశించిపోతున్నాను. మిమ్మల్ని క్షమించి, పెద్దమనసుతో ఇక్కడకు తీసుకు వచ్చింది మీ అమ్మాయి. మీ శేష జీవితం ఇక సుఖ మయమే...” అన్నాడు.
“బాబాయ్, అమ్మను కానీ, మమ్మల్ని కానీ పట్టించుకోని ఈయన్ను నేనెన్నటికీ క్షమించలేను... కానీ ఆకలి బాధతో అడుక్కు తింటున్నాడని తెలిసేసరికి తట్టుకోలేక పోయాను. ఆకలి బాధ ఎంత దుర్భరమో నాకు బాగా అనుభవం. తల్లిలేని నాకు తల్లిగా మారి, నేను గర్భవతిగా ఉన్నప్పుడైతేనేం, తల్లినైనప్పుడైతేనేం ఎన్నో సేవలు చేసావు. నీ మీద నాకున్న ప్రేమ, గౌరవం ఆయన మీద నాకెన్నటికీ కలగవేమో... నా తల్లిలా అతనూ మలమలా మాడి చావకూడదని...” అంటూ ఆగింది ధరణి.
“అమ్మా, ధరణీ, ఈ దీనుడి మీద ఇంత దయ చూపించాలనుకున్నావంటే అది నా పూర్వజన్మ సుకృతమేనమ్మా... ఈ సారి కాన్పుకు నీకు తల్లిలా మారటం, నిన్ను  కనుపాపలా చూసుకోవటం నా వంతు. మీ అమ్మ ఈ సారి నీ బిడ్డగా పుడుతుందనే నా నమ్మకం. ఈ శేష జీవితం, మీతో సంతోషంగా గడిపే వరాన్ని ప్రసాదించావు, అది చాలు... ఇష్టులను ఎవరైనా ప్రేమిస్తారు... కానీ అయిష్టులనూ, దుర్మార్గులనూ ఆదరించే పెద్దమనసు ఏ నూటికో, కోటికో ఒక్కరికుంటుంది... నీలాంటి వారికి...” చెమ్మగిల్లిన నయనాలతో అన్నాడు శివయ్య.

 

.

oooo

Bio

వాలి హిరణ్మయీ దేవి

వాలి  హిరణ్మయీ దేవి:  శ్రీమతి వాలి ఉమాదేవి గారు వారి చిన్న కుమార్తె అయిన శ్రీమతి హిరణ్మయీ దేవి పేరు తో గత ముప్పై ఏళ్ళుగా రచనలు చేస్తున్నారు. దాదాపుగా 350 కథలు, 4 నవలలు వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికలలో ప్రచురితం అయినవి. చాలా కథలకు బహుమతులు కూడా పొందారు. ఇటీవలే వారి తొలి కథాసంపుటి 'స్వప్న సాకారం' విడుదల అయింది.

***

Mani vadlamani
Comments
bottom of page