top of page

'సినీ' మధురాలు

మధురవాణి ప్రత్యేకం

వి.ఎన్. ఆదిత్య

చలన చిత్ర దర్శకులు

V N Aditya

ఆదిత్య సినీ మధురాలు

ముందుగా మధురవాణి పాఠకులకి 2017 నూతన సంవత్సర మరియు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇంట్లో అమ్మ ఉప్మా చేసిన రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అన్నీ ఉప్మాయే నా వరకూ. అందులోనే కూర, చారు, పచ్చడి, పెరుగు, అన్నీ మార్చి మార్చి కలుపుకుని తినేసే వాడిని. ఆ ఉప్మా మీద ఇష్టం కాస్తా మోహంగా మారిపోయింది నాలుగో క్లాసుకొచ్చేసరికి. నీళ్ళు ఎక్కువ వేసి చేస్తే, దాహంగా కూడా మారిపోయేది.

ముందు నుంచి రెండో అన్నయ్య సుధాకర్‌ని అన్నయ్య అని అంగీకరించేవాడిని కాదు. వాడిని తమ్ముడు అనే అనుకునేవాణ్ణి.  ఎందుకో తెలీదు. ఆ విషయం మీద చాలా సార్లు దెబ్బలే తిన్నాను. అయినా ఆ అలవాటు పోలేదు. చివరికి జంగారెడ్డిగూడెంలో ఓ శుభముహూర్తాన ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన శర్మ బావ, బాబ్జీ బాబయ్యల సలహా మేరకు అమ్మ ఉప్మా చేసి నా ఎదురుగుండా పెట్టి, రెండో అన్నని అన్నయ్య అని పిలిస్తే కానీ ఉప్మా పెట్టననేసరికి చాలాసేపు ప్రతిఘటించి, ఓడిపోయాను. అప్పట్నుంచి వాణ్ని అన్నయ్య అని అంగీకరించేశాను. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, 'భైరవద్వీపం' టైములో చందమామ విజయా కంబైన్స్ తరఫున చాలా సినిమాలకి, కథా చర్చలకి, డబ్బింగ్‌లకి, నిర్మాణ సంస్థ తరఫున తెలుగు, తమిళ భాషల్లో పని చేసే వాడిని నేను. ఆ సమయంలో ఎవరైనా నిర్మాత డబ్బులు సరిగా ఇవ్వకుండా కక్కుర్తి పడితే ఆ నిర్మాణ సంస్థని 'ఉప్మా' కంపెనీ అనేవారు. ఏదన్నా కథ గానీ, సినిమా గానీ ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా ఉండేలా ఆలోచిస్తే, ఉప్మా సినిమా అనేవారు.

మొదటిసారి ఇది విన్నప్పుడు, నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం కాబట్టి ఉప్మా కంపెనీ అంటే చాలా మంచి బ్యానర్ ఏమో అనుకుని చాలా చాలా ఆనందించేశాను. తర్వాత్తర్వాత అర్థమయ్యాక, నచ్చని వాటిని ఉప్మాతో పోల్చినప్పుడల్లా మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు ఉండేది నాకు. ఇప్పటికీ ఉప్మా అంటే చాలా ఇష్టం. ఎవరైనా సినిమాలని గానీ, నిర్మాతలని గానీ ఉప్మాతో పోలిస్తే మాత్రం వెంటనే చెప్పేస్తున్నాను ఇడ్లీతోనో దోశెతోనో పోల్చుకోమని, ఉప్మానంటే ఊరుకుంటానేంటి?

నాకు ఆనందం ఏంటంటే, ఇప్పుడొచ్చే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్‌లు, టీవీ సీరియల్సు దాదాపు 90 శాతం ఉప్మాలే. అందుకే నాకు ఇష్టం, చాలా మందికి చిరాకు. ఆలస్యంగా అర్థమైనా, ముఖ్యమైన విషయం ఒకటి ఇటీవలే తెలిసింది. తెరమీద భారీగా ఖర్చు పెట్టడం నాన్ ఉప్మా గొప్ప సినిమా కాదు.

రెండున్నర గంటల సేపు తీసుకున్న కథాంశాన్ని ప్రతి ప్రేక్షక్కుడికీ నచ్చేలా తెరకెక్కించడానికి కావలసినవన్నీ నిర్మాత సమకూర్చడమే నాన్ ఉప్మా గొప్ప బ్యానర్, నాన్ ఉప్మా గొప్ప సినిమా. అందుకని నాన్ హీరోల సినిమాలన్నీ ఎక్కువ శాతం ఉప్మా సినిమాలే అయినప్పటికీ, వాటిల్లో చిత్తశుద్ధి, క్రమశిక్షణ అనే జీడిపప్పు, నెయ్యి కలిపితే, కొన్ని చిత్రాలు "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "పెళ్ళిచూపులు", "జ్యో అచ్యుతానంద" లాగ అవుతాయన్నమాట.

మూడో క్లాసులో జంగారెడ్డిగూడెంలో నా పుట్టినరోజునాడు "ప్రేమాభిషేకం" సినిమా చూపించాను నా ఫ్రెండ్స్‌కి. అది వన్ ఇయర్ ఆడింది. తొమ్మిదో క్లాసులో చింతలపూడిలో పదిహేనుమంది బంధువులకి బలవంతంగా "ప్రేమసాగరం" సినిమా చూపించాను. మా తాతగారితో సహా ఆయన కోడళ్ళందరూ లేచి బైటకొచ్చేసారు పది నిముషాల్లో. ఆ సినిమా కూడా 175 రోజులాడింది. నాలుగో క్లాసులో "గాయత్రి" అన్న కన్నడ డబ్బింగ్ సినిమాకి మా తాతగారు కాకినాడలో తీసుకెళ్తే, భయంతో వణికిపోయి, ఆయన తెల్ల కండువాని కళ్ళ ముందు తెరలాగ పెట్టుకుని దానిలోంచి సినిమా అంతా చూసాను.

ఎనిమిదో క్లాసులో "ఖైదీ", ఇంటర్ "అంతిమ తీర్పు", డిగ్రీలో "శివ", "మౌనరాగం", "ఆదిత్య 369", "నాయకుడు", ఎనిమిదిలోనే "స్వాతిముత్యం", అయిదులో "శంకరాభరణం", ఏడులో "అప్పుచేసి పప్పుకూడు", "మాయాబజార్" - ఈ ఈ సినిమాలన్నీ కాలానుగుణంగా నా ఆలోచనల్ని మారుస్తూ వచ్చాయి. వీటికి ముందు అచ్చంగా "దాన వీర శూర కర్ణ", "అడవిరాముడు", "వేటగాడు", "యమగోల" వంటి అన్నగారి సినిమాలకే ఫ్యాన్‌ని నేను. ఆ తర్వాత ఆవేశం చల్లబడి ఏసీలాగ మారాక, వ్యక్తుల్ని కాకుండా కూల్‌గా సినిమాలని ప్రేమించడం మొదలుపెట్టాను.

పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్మా తినేసినట్టే, రోజుకి నాలుగాటలు, రెండ్రోజులు వరుసగా ఎనిమిదాటలు, అమెరికాలోను, తిరుపతిలోను ఒకే రోజు మాగ్జిమం ఆరు, ఏడు సినిమాలు చూసెయ్యడం అలవాటైపోయింది. సారీ, పరిపాటి అయిపోయింది. రికార్డు స్థాయిలో తొమ్మిదో క్లాసులో ఒకే కాలెండర్ సంవత్సరంలో అంటే 365 రోజుల్లో 427 సినిమాలు చూసి, వాటి పేర్లన్నీ గుర్తుకోసం డైరీలో రాసుకున్నాను పిచ్చివాడిలాగ. అది అన్నయ్యల ద్వారా అమ్మకు దొరికిపోయి తుక్కు రేగేలా తన్నులు తినేసాను. ఒకటి అన్ని సినిమాలు ఇంట్లో తెలీకుండా ఎలా చూశానని? రెండు, డబ్బులు ఎలా సమకూర్చుకున్నాను అని. పాపం మా రామకృష్ణ మాస్టరు గారి అల్లుడు కిరాణా అండ్ ఫ్యాన్సీ షాపు పెట్టారు లింగపాలెంలో. ఆయన నా మీద అభిమానం కొద్దీ చాక్‌లేట్లు మాత్రం ఎకౌంట్‌లో రాసుకుని అరువిచ్చేవారు. అవి ఫ్రెండ్స్‌కి అమ్మి, ఆయనకివ్వకుండా సినిమాకి వెళ్ళేవాణ్ని. తర్వాతెప్పుడో ఒకసారి ఇంట్లో డబ్బులిచ్చినప్పుడు కామ్‌గా ఆయనకి ఇచ్చేవాడిని. ఇప్పుడు తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఇవ్వాళ తెలుగులో 90 శాతం సినిమా తీసే పద్ధతి ఇదే. ఓ ఫైనాషియర్ దగ్గిర అప్పుచేసి డబ్బులు తేవడం. డిస్ట్రిబ్యూటర్లకి అమ్మి లాభం వస్తే వెనక్కివ్వడం, నష్టం వస్తే అప్పు అలా కంటిన్యూ అవ్వడం - ఈ రొటేషన్‌లో ఒక సినిమా మార్కెట్‌లో - ఎంత కోఇన్సిడెన్స్?

దేవుడి స్క్రీన్‌ప్లే... సలీం-జావెద్ లాగ, పరుచూరి బ్రదర్స్‌లాగ పదునుగా ఉంటుంది...

డాట్స్ అన్నీ కలుపుతుంది...

వచ్చే సంచికలో మళ్ళీ కలుద్దాం...

 

మీ

వి.ఎన్. ఆదిత్య..

*****

 

bottom of page