top of page

వంగూరి పి.పా.

మూడో జులపాల కథ

వంగూరి చిట్టెన్ రాజు

(మధురవాణి.కామ్ తొలి వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకం)

మా క్వీన్ విక్టోరియా గారి గృహ పరిపాలనలో ఆవిడ ఇచ్చే కొన్ని కొన్ని ఆదేశాలు నాకు అక్షరాలా శిరోధార్యాలే. ఉదాహరణకి నా శిరస్సు మీద రోజుకి ఒక మిల్లిమీటర్ చొప్పున పెరిగే జులపాల మీదే ఎప్పుడూ ఆవిడ దృష్టి సారించి నెలకొక సారి “బైరాగి వెధవ లాగా చెవుల కిందకి జుట్టు పెరిగిపోయింది. వెళ్లి క్షవరం చేయించుకుని రా” అని పదేళ్ళ కిందటి దాకానూ, “సగం పైగా తెల్ల వెంట్రుకలే,  సిగ్గేస్తోంది. వెళ్లి రంగు కూడా వేయించుకు రా” అని ఈ రోజుల్లోనూ అంటూ నెలకో సారి పది డాలర్లు చేతిలో పెడుతుంది.  మొన్న ఇండియా వెళ్ళే ముందు ఈ విషయంలో ఆవిడ ఆదేశాలు  ఖచ్చితంగా పాటించ వలసిందే కాబట్టి నేను $1.99 కి క్షవరం చేసే మా చైనీస్ అమ్మాయి చింగ్ చాంగ్ దగ్గరకి వెళ్లి మిగిలిన చిల్లర జేబులో వేసేసుకున్నాను ఎప్పటిలాగానే. పవిత్ర భారత నారీమణుల ఆచారాల ప్రకారం మగాళ్ళ మంగలి షాప్ లోకి మా ఆవిడ అడుగు పెట్టదు కాబట్టి ఈ అసలు రేటు ఆవిడకి తెలియదు.

 చెప్పొద్దూ, అమెరికాలో మామూలు క్షవరమే కానీ ఇండియా వెళ్ళగానే మోడీ గారి నోట్ల రద్దు ధర్మమా అని “ఆర్ధిక క్షవరం” కూడా చేయించుకోవలసి వచ్చింది. ఎందుకంటే ఓ సారి కాఫీ తాగడానికి సుబ్బయ్య హోటల్‌కి వెళ్లి, కాఫీ ఖరీదు అరవై రూపాయలు అనగానే చిన్న నోట్లు లేక  సరి కొత్త రెండు వేల నోటు ఇచ్చాను. “చిల్లర లేదు సార్” అని సుబ్బయ్య కొడుకు ఆ రెండు వేలూ నొక్కేశాడు.  అక్కడ ఉన్న ఆరు వారాలలో ఇలా అన్ని చోట్లా వేల కొద్దీ రూపాయలు తరిగిపోయినా కానీ నా జట్టు మటుకు యథావిధిగా మళ్ళీ జులపాలు చెవుల కిందకి వచ్చే దాకా పెరిగిపోయింది. ఈ వాలకంతో అమెరికా తిరిగి వెళ్లి మా క్వీన్ విక్టోరియాకి నా మొహం చూపించిన యెడల కలుగు కష్టనష్టములు అనుభవించనేల?   పైగా అసలు నేను ఇండియాలో నిజమైన క్షవరం చేయించుకుని నలభై ఏళ్ళు దాటింది కదా, టెక్నాలజీ ఏమైనా మారిందా అని మా కాకినాడ లోనే ఆ ప్రయత్నం చేద్దాం అని నిర్ణయించుకున్నాను.

మా చిన్నప్పుడు మా కుటుంబానికి ముగ్గురు ఆస్థాన మంగలి వారు ఉండేవారు. ఒకడు రాఘవులు. ఇతను పుట్టి వెంట్రుకలు, గం.భా.స ల స్పెషలిస్ట్. మరొకడు సత్యం. మూడో వాడు వీర్రాజు. సత్యం కొట్టూ, వీర్రాజు కొట్టూ గాంధీ బొమ్మకి అటూ ఇటూ ఉండేవి. సత్యం రేటు రూపాయ పావలా. గూడకట్టు పంచె కట్టేవాడు. ఇంటికొచ్చి మర్దనా చేసి మరీ క్షవరం చేసే వాడు. బ్యాండు మేళం వాయించే వాడు కాదు. కానీ వీర్రాజు లెవెలే వేరు. పేంటు, చొక్కా వేసి టక్ చేసే, ఎర్ర టై కట్టుకునే వాడు.  ఎర్ర సిల్కు లాల్చీ, తళుకు కుర్తా వేసుకుని పెళ్ళిళ్ళలో బ్యాండ్ వాయించే వాడు. ఇక మనం అతని కొట్టుకే వెళ్ళాలి కానీ ఇంటికి వచ్చే వాడు కాదు. పైగా అక్కడ అభిసారిక, మదన వగైరా మేగజీన్లు పెట్టే వాడు. అంచేత ఖరీదు రెండు రూపాయలు. మా నాన్నగారు ఊళ్లో ఉన్నప్పుడు చచ్చినట్టు సత్యం చేతా, లేనప్పుడు వీర్రాజు కొట్టుకి వెళ్ళీ క్షవరం చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్లిద్దరూ ఉన్నారో లేదో తెలీదు, ఎలాగా అనుకుంటూ ఉంటే మా మేనల్లుడు “ఆ రోజులు పోయాయి మావయ్యా, ఇప్పుడు మాంచి షోకైన షాపులు వచ్చాయి” అని స్కూటర్ మీద తీసుకెళ్ళాడు.

స్కూటర్  దిగగానే ఆ షాప్ పేరు రంగు రంగుల దీపాలతో “బెన్ కార్సన్ బ్యూటీ సెలూన్, ఎయిర్ కండిషండ్” అని కనపడింది. మొన్న అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఇప్పుడు కేబినేట్ కి ఎంపిక అయిన ఆయన పేరిట మంగలి షాపు పెట్టి భారతీయుల విశాల దృక్పధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మా కాకినాడ వారంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. లోపలికి వెళ్ళగానే బొట్టు పెట్టుకుని అయ్యప్ప దీక్షలో నల్ల బట్టలు వేసుకున్న ఒకానొక కుర్ర వాడు నాకు వెల్కం, సర్  అన్నాడు. నేను ఉండబట్ట లేక “మీరేనా బెన్ కార్సన్?” అని అడిగాను.

 

“భలే వారే. మై నేమ్ ఈజ్ గవర్రాజ్”

“మరి షాప్ కి ఆ పేరు పెట్టారేమిటి?”

“అదే సార్, మార్కెటింగ్. గవర్రాజు కొట్టు అంటే మీ లాంటి ఎన్నారైలు లోపలికొత్తారేటి?”

నన్ను చూడగానే నేను ఎన్నారై అని ఎలా కనిపెట్టాడో తెలీదు. కానీ ఆ లాజిక్ బాగానే ఉంది అనుకుని వచ్చిన పని చెప్పాను.

“ఏ.సి. వెయ్యమంటారా?”

“ఏ.సి అని పైన బోర్డ్ మీద ఉందిగా. మళ్ళీ అడుగుతావేం?”

“అది రైటేనండి. ఎయ్య మంటే యాభై రూపాయలు కరెంటు చార్జీలు కట్టుకోవాలండి”

“లేక పొతే”

“సేమట్లు పట్టేస్తాయండి.”  

“సరేలే. ఏ.సి. వెయ్యి”. 

“ఫుల్ కటింగేనాండీ? ఏసీ స్విచ్ వేస్తూ అడిగాడు గవర్రాజు.

“యస్. రంగు కూడా వెయ్యాలి”

గవర్రాజు మొహం వికసించింది.

“సిజర్ కటింగా? మెషీన్ కటింగా?” అడిగాడు గవర్రాజ్.

“తేడా ఏమిటి” అడిగాను.

“సిజర్ కటింగ్ రెండు వందలు. గుచ్చుకునే ఛాన్స్ ఉంది. మెషీన్ అయితే నూట యాభై, నో డేమేజ్, ఓన్లీ కిత కితలు“

అది వినగానే తటపటాయించకుండా “మెషీన్ కానియ్” అన్నాను.

“ఏ రంగండి. నలుపేనా?”

ఆ ప్రశ్నకి నా మొహం చూసి “ఏమో నండి. మొన్నొకాయన ట్రంపు రంగు ఉందా అని అడిగాడండి.  ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు కదండీ అందుకూ..కానీ ఇంకా ఆ రంగు మార్కెట్ లోకి రాలేదండి”

దాంతో “ఆంధ్రా బ్లాక్ తప్ప ఇంకేవన్నా వేస్తే ఊరుకోను” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. 

“మరి టాటాయా, హిందుస్తాన్ లీవరా, దీపికా పడుకునే యా, ప్రియంకా పడుకోనిదా?” అడిగాడు తన జోక్ కి తనే వెధవ నవ్వు నవ్వుతూ గవర్రాజ్.

నాకు అసలు ప్రశ్నే అర్థం కాలేదు. “ఈ సమయం లో వాళ్ళ ప్రసక్తి ఎందుకూ?” అడిగాను.

“మీకు వేసే నల్ల రంగు బ్రాండ్ లు సార్ అవన్నీనూ...మీకు ఏది కావాలంటే అదే వేస్తాం” అంటూ రెండు సీసాలూ, రెండు ట్యూబులూ నా కళ్ళ ముందు ఆడించాడు గవర్రాజ్. అందులో ఆ పడుకునే అమ్మాయి బావుంది కాబట్టి అదే తగలెయ్య మన్నాను.

అతను అదే తగలేసి అక్కడక్కడి వెండి రంగుని నల్ల బంగారం చేసి ‘ఏ.సి. యాభై, కటింగ్ నూట యాభై, టేక్స్ మరో పదిహేనూ” ‘అన్నాడు. అలా అనగానే నా మొహం చూసి ‘అవును సార్, కాకినాడ స్మార్ట్ సిటీ కదా... జుట్టు పన్ను కొత్తగా వేశారు” అన్నాడు.

‘సరే’ అని యధాప్రకారం నేను జేబులోంచి రెండు వేల నోటు తియ్యగానే గవర్రాజు మొహం వెలిగి పోయింది. “చిల్లర లేదు సార్” అని అతను అనబోతూ ఉంటే నా మెడ మీద ఏదో జిగటగా అనిపించి చేత్తో తడమగానే అది నల్లగా అయిపోయింది. గవర్రాజు క్షవరం చేసి, దీపికాని నా జులపాలలో పడుకోబెట్టాడు కానీ తరవాత జరగ వలసిన అత్యవసర మంగళ స్నానాలు చేయించలేదూ అని అప్పుడు నాకు హఠాత్తుగా తెలిసి పోయింది.  వెనువెంటనే నేను ఠపీమని రెండు వేల నోటు మళ్ళీ జేబులో నొక్కేసి “అదేమిటీ? జుట్టు కడగవా? లేక పోతే ఎలాగా?” అని చేతిలో ఉన్న ఆ జిగట పదార్థం వాడికి చూపించాను.

“జుట్టు వాషింగాండీ? మా కష్టమర్లు చాలా మంది ఇంటికెళ్ళి కడుక్కుంటారండి”

“అదేమిటీ? ఎందుకూ?”

“ఎందుకేటండి, వాషింగ్ కి వంద అవుద్ది కదండీ”

“ఓరి నీ దుంప తెగా, అదా సంగతీ” అని “అక్కర లేదు” అనబోయి ఇలా తడి జుట్టుతో, నల్ల రంగు కారిపోతూ ఉంటే మా మేనల్లుడు వాడి స్కూటర్ మీద ఎక్కించుకోడేమో అని అనుమానం వచ్చీ, అసలు వాడు నన్ను ఇక్కడ వదిలేసి యవ్వారాలు చక్కబెట్టుకోడానికి ఎక్కడికి పోయాడో, ఎప్పుడు వస్తాడో తెలియకా, ఫోన్ చేసి కనుక్కుందాం అని ఆ పరిస్థితిలో సెల్ ఫోన్ చెవులకి ఆన్చి పెట్టగానే అది కూడా నల్ల రంగులోకి మారిపోయి పని చెయ్యడం మానెయ్యడంతో ఇక గవర్రాజు స్నానమే నాకు గత్యంతరం అని డిసైడ్ అయిపోయాను.   

స్నానం కూడా తనే చేయించాలి అనే విషయం తెలియగానే గవర్రాజు ఎంతో ఆప్యాయంగా నన్ను ఆ కర్ర కుర్చీలోంచి లేపి మెల్లగా నడిపించుకుంటూ ఒక మూల ఉన్న సింక్ దగ్గరకి తీసుకెళ్ళి దాని ముందు కీచుమనే మరో కుర్చీలో కూచోబెట్టాడు.

ఆ తరువాత పదిహేను నిముషాలలో జుట్టు కడగడంలో నాకు అమెరికాకి, ఇండియాకి ఉన్న తేడాలు స్పష్టంగా తెలిసి పోయాయి. అమెరికాలో అయితే మన మొహం ఆకాశం వేపు వేపూ, జుట్టు సింకు లోకీ వచ్చేలా తలకాయని ఏర్పాటు చేస్తారు. అప్పుడు జుట్టు కడిగినప్పుడు ఆ నీళ్లన్నీ మనం మొహం మీద పడకుండా సింక్ లోకే పడతాయి. కానీ మన భారత దేశంలో బహుశా వేదాల్లో రాసినట్టుగ్గా దానికి సరిగ్గా వ్యతిరేకం. అక్కడ మనం మొహం సింకు లోకీ, జుట్టు ఆకాశం లోకీ వచ్చేలా మనల్ని మెడలు వంచి కూచో పెడతారు. తద్వారా జుట్టు కడిగిన ప్రతీ నీటి చుక్కా మన మొహంలో ఉన్న కళ్ళు, ముక్కు, నోరు ఇలా అన్నింటినీ పలకరించుకుంటూ, అప్పుడప్పుడు లోపలికికి పోయి ఆ నల్ల జిగట నీళ్ళ రుచి తెలిసేలా చేస్తారు. నా జన్మలో నేను చాలా సార్లు క్షవరం చేయించుకున్నాను కానీ ఇటువంటి అనుభవం ఇదే నా మొదటి సారి. దీపికా పడుకునే రుచి కూడా అంత దారుణంగా ఉండడం దారుణం. 

మొత్తానికి ఈ వాషింగ్ నుంచి బయట పడి దగ్గూ, రొంపా అరువు తెచ్చుకుని గవర్రాజు ఇచ్చిన నల్ల మరకల తువ్వాలుతో తల తుడుచుకుంటూ ఉంటే అతను నా మొహం కేసి ఆశగా చూడడం గమనించాను.

“ఏమిటి అలా చూస్తున్నావ్? ఎనీ థింగ్ రాంగ్” అన్నాను.

“ఏం లేదు సార్...ఎన్నాళ్ళయింది సార్ మీరు ఫేషియల్ చేయించుకుని?” అన్నాడు గవర్రాజు.

“నేనా, ఫేషియలా?” విపరీతంగా ఆశ్చర్య పోయాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకూ ఈ ఫేషియల్స్ లాంటివి కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కదా. ఆ మాటే గవర్రాజుతో అనగానే “భలే వారే. ఇప్పుడు ఇండియాలో ఆడాళ్ళు మానేసి కాలేజ్ కుర్రాళ్ళు ఫేషియల్స్ మొదలెట్టారండి” అని తాజా భారతీయ సంస్కృతిని నాకు విశదీకరించాడు. ఇంతలో మా మేనల్లుడు ఫోన్ చేసి “మావయ్యా, నాకు ఇంకో గంట పడుతుంది. ఈ లోగా ఫేషియల్, కాళ్ళకి మర్దనా చేయించుకో” అన్నాడు. ఇక తప్పేదేముంది?

“ఇదిగో ఫేషియల్ అంటే ఉట్టినే చర్మం దుమ్ము దులుపు. అంతేగానీ కనుబొమ్మలు కత్తిరించి కాటిక పెట్టావంటే చంపేస్తాను” అని వార్నింగ్ ఇస్తూ గవర్రాజు చేత మరో గంట సేపు నా ముఖ  ప్రక్షాళన, కాళ్ళకి మర్దనా, గోళ్ళు తీయించుకొనుట వగైరా దేహశుద్ది చేయించుకున్నాను. 

మొత్తం అంతా పూర్తి అయ్యాక మళ్ళీ నా జేబు లోంచి అదే రెండు వేల రూపాయల నోటు బయటకి తియ్యగానే గవర్రాజు షాపు లోపలి గదిలోకి చూస్తూ “నాన్నా, ఓ ఇరవై చిల్లర ఉందా? అని అరిచాడు.

“ఇరవయ్యా...ఎందుకు రా” అంటూ ఆ గది లోంచి ఒక పెద్దతను బయటకి వచ్చాడు. అతను పేంటు, చొక్కా వేసుకుని, టక్ చేసుకుని ఎర్ర టై కట్టుకున్నాడు. అతన్ని ‘ఎక్కడో చూసినట్టు ఉందే’ అనుకుంటూ ఉండగా అతను నన్ను పైకీ, కిందకీ చూసి “మీరా, రాజాగారూ. అమెరికా నించి ఎప్పుడు వచ్చారూ?” అన్నాడు. 

“వీర్రాజూ, నువ్వా?”

“అయ్య, నేనేనండి..ఈడు గవర్రాజండి..నా కొడుకు”.

ఇప్పుడు ఆ ఇరవై రూపాయలూ వీర్రాజు దగ్గర తీసుకోవాలా వద్దా, ఇండియాలో క్షవరానికి రెండు వేలయిందని మా క్వీన్ విక్టోరియాకి చెప్పాలా, వద్దా ?

*****

1
2
bottom of page