పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

mukundra ramarao
mukundra ramarao
mukundra ramarao
mukundra ramarao
mukundra ramarao
mukundra ramarao

మహాదేవివర్మ గీతాలు

సరదాగా మరికొంతసేపు                                                                                              శాయి రాచకొండ

mukundra ramarao

ప్రతీ సంవత్సరంలాగే గత నవంబరులో మాఊరు గుంటూరు వెళ్ళాను.  ఎప్పటిలాగే విశాలాంధ్ర పుస్తకాల షాపుకి వెళ్ళడం, కనిపించిన మనసుకు నచ్చిన పుస్తకాలు కొనడం జరిగింది.  అలా కొన్న పుస్తకాలే, ‘కథ-2015’, ‘సరదాగా మరికొంతసేపు’.  గత సంవత్సరం కథ-2014 పరిచయం చెయ్యడం జరిగింది.  మంచి కథలు చదివాననే తృప్తి కలిగించిన పుస్తకమది.  చూడగానే 2015 పుస్తకం కొనడానికి అది ప్రథమ కారణం.  అనువాదాలంటే ఇష్టం ఉండడం, ఏ భాషలోనుంచి ఎలా అనువదించారో అనే ఆరాటం రెండో పుస్తకానికి ప్రేరణ.  అంతకు ముందెప్పుడూ గబ్బిట కృష్ణ మోహన్ గారి పుస్తకాలు చదవలేదు.  ఇవి కాక సింగపూరులో జరిగిన అయిదవ ప్రపంచసాహితీ సదస్సులో కలిసిన మిత్రులు నా చేతికి అందించిన పుస్తకాలు కొన్ని.  అన్నట్లు మా వంగూరి ఫౌండేషను వారు తాజా తాజాగా ప్రచురించిన అరవై రెండవ పుస్తకం కోసూరి ఉమా భారతి గారు రచించిన నవల ‘వేదిక’.  ఇదిగో ఇవీ మధురవాణి సంక్రాంతి సంచికలో పరిచయం చేయబోతున్న పుస్తకాలు. 

 

ముందరగా నాకు బాగా నచ్చి, నేను చదువుకుని హాయిగా నవ్వుకున్న పుస్తకంతో మొదలు పెడతాను. “సరదాగా మరికొంతసేపు”  పుస్తకం చదువుతూంటే - నిజంగానే సరదాగా మరికొంతసేపు చదువుకుంటే ఎంత బాగుండును అని అనిపించింది.  ఇది గబ్బిట కృష్ణమోహన్ గారు చేసిన పి.జి. వుడ్ హౌస్ గారి కథలకు అనుసృజన. 

 

వుడ్ హౌస్ కథలకు పరిచయం అక్కరలేదు.  ఆయన కథలు ఒక రకమైన వ్యంగ్యంతో కూడిన హాస్యం పుట్టించే అతిశయోక్తులు అనచ్చేమో. 

 

పుస్తకానికి ముందుమాట రాస్తూ దాసరి అమరేంద్ర గారు ‘వుడ్ హౌస్’ గురించి మాట్లాడుతూ సాహితీ ప్రయోజనం అంటూ వెళ్ళడం చాదస్తపు చర్చ అయితీరుతుంది’ అని అన్నారు. బహుశా ‘ఉల్లాసం కలిగించే సాహిత్యానికి అంతకంటే ప్రయోజనం ఏమి కావాలి?  దానికి చర్చ ఎందుకు?’ అన్నది ఆయన ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. 

 

ఈ పుస్తకంలో పదకొండు కథలున్నాయి, అదే వుడ్ హౌస్ గారి కథలకు అనువాదాలు.  కాదు కాదు అనుసృజనలు, అదే,  సృజనాత్మకమయిన అనువాదాలు అన్నమాట.  కథలు చదువుతున్నప్పుడు మనం ఇంగ్లడులోనో మరెక్కడో ఉండము.  చక్కగా మనకు తెలిసిన వాతావరణంలో మన నూకరాజు, మన అవతారం, మన విజయనగరం, మనకు తెలిసిన జమీందారు దారి ఇల్లు, వీటన్నిటితో మనకు తెలిసిన తెలుగు నుడికారాలతో హాయిగా చదువుకుంటాం పుస్తకాన్ని.  నేపథ్యం సహజంగానే ఇంగ్లండు పరిసరాలు, పబ్బులు (పానశాలలు), పట్టణాలు, పల్లెటూర్లలో జమీందార్ల ఇళ్ళు, నౌకర్లు, ట్రైన్లు, కార్లు ....  అవి ఎంతో కొంత తప్పవుకదా, మూల కథ అక్కడిదైనప్పుడు!  అతిశయోక్తి ఉన్నా మనకి తెలియకుండానే ‘ఏం జరిగిందో?’ అన్నది ఊహించుకుంటూ నవ్వుతూ పుస్తకాన్ని చదువుకోగలం. 

 

సోంబాబు వలస కాపురం ఒక క్లాసిక్ కథ.  దీనికి మూలం - వుడ్ హౌస్ రాసిన కథలన్నిటిలోకి అత్యంత ప్రాచుర్యం పొందిన ‘అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై’.  అందులో రావు బహద్దూర్ సోమేశ్వరరావు గారి పాత్ర అత్యంత చురుకైనది (డైనమిక్).  ఆయన సమయస్ఫూర్తి, వెయ్యి అబద్ధాలు చెప్పినా ఒక పెళ్లి చెయ్యచ్చు అనే ధృఢనమ్మకం, క్షణ క్షణానికి మారిపోయే సన్నివేశాలు, మూలకథ ఎలావున్నా కృష్ణమోహన్ గారు రాసిన విధానం మనల్ని ముఖాల్లో నవ్వు మాయమవకుండా చదివిస్తుంది.  ‘బుసబుసలు‘, ‘తల్లి గారి ఘన సత్కారం’, ‘శేషగిరి తంటాలు’, మొదలైన కథలు అతి తెలివితేటలూ, పూర్తి స్వార్థం, కొంత పైశాచిక ఆనందం ఉన్న శశిరేఖ వల్లో పడి, తన్నులు తిని  కన్నూముక్కూ పోగొట్టుకున్న కొంతమంది యువకుల హాస్య కథలు.  ఇక రచయిత్రి బండారు ప్రసునాంబ గారి పాత్ర అంతకంటే ప్రత్యేకం.  ఇలా సాగిపోతాయి అన్ని కథలు.  ఇక సినిమా కథలలో మకుటం ‘మీనా దేశ్ పాండే తారాపథం’.  మనుషుల్లో నిగూఢంగా ఉన్న బలహీనతల్ని ప్రస్ఫుటంగా చూపించి నవ్వించడం వుడ్ హౌస్ చేసిన పనైతే, ఆ రచనల్ని తెలుగు వాడి సొంతమా అన్నట్లు అనుసృజన చేసి మనందరికి అందించిన ఘనత కృష్ణమోహన్ గారిదే.  ‘సరదాగా మరికొంత సేపు’ చదువుకొని హాయిగా నవ్వుకోండి.

 

ఇది నవచేతనా పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ.  వెల రూ. 165.

 

కథ-2015                                                                                                        శాయి రాచకొండ

mukundra ramarao

కథ-2015, కథ-2014 తో పోలిస్తే కొంచెం నిరుత్సాహ పరిచిన మాట వాస్తవం.  వైవిధ్యం, మంచి కథాంశం, రచనా శైలిలో కొత్తదనం ఉన్న కథలకోసం వెతికాను.  ఈ సంపుటిలో ఎంపిక చేసిన కథలు పన్నెండు వున్నాయి.  అవి కాక మూడు ప్రత్యేకమైన కథలను కూర్చారు.  సంపాదకులు ఎంపిక చేసుకున్న కథలు బాగుండలేదని కాదు కాని, ఇంతకన్నా మంచివి ఎంపిక ఎందుకు చేసుకోలేక పోయారో అనిపించక మానదు పుస్తకం చదివిన తరువాత.  ఒక రకంగా అది బాధే మరి.  ఉన్న పన్నెండులో నాలుగు గ్రామీణ వాతావరణం నేపథ్యంగా వున్న కథల వల్లో, మాండలికంలో రాయబడ్డ కథల వల్లనో నేను నిరాశ పడలేదు.  ఆడెపు లక్ష్మీపతి గారు రాసిన ముందుమాటలో ‘వేల సంఖ్యలో కథలు వస్తున్నా, మంచి కథలకు కొరత ఉందన్న వాస్తవం ఉత్తమ అభిరుచి గల సాహితీ ప్రియులకు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది.  ఈ పరిస్థితి మారుద్దాం”, అన్నారు.  మంచి కథలకు కొరతే వుందో, లేక ఈ సంపుటిలోని కథల ఎంపికలో లోపముందో తెలియదు కాని, ఇంకా మంచి కథలకు గుర్తింపు తీసుకు రావచ్చు కదా అని అనిపించింది. 

గత 25 ఏళ్లుగా వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ గారు కథలు ఎంపిక చేసేవారు.  అయితే 2015 సంపుటి నించి ఒక కొత్త ప్రయోగం మొదలు పెట్టేరని రాసారు.  సంపాదకులుగా కథలను సేకరించి సంపుటికి ఎన్నిక చేసే బాధ్యత ఈ ఏడు (2015) ఆడెపు లక్ష్మీపతి గారికి, ఎ.వి రమణమూర్తి గారికి అప్పచెప్పారు.  అయితే 2015సంవత్సరంలో అంత వైవిధ్యం ఉన్న కథలు రాలేదా?  సంపాదకత్వంలో తేడానా?  నవీన్ గారు, శివశంకర్ గారు, కొంచెం వెనక బెంచిలో కూర్చుని కేవలం సలహాదారులుగా వ్యవహరిస్తూ ఏడాదికో ఇద్దరి చొప్పున సంపాదకీయ బాధ్యత అప్పచెబుతామన్నారు.  అదికూడా సబబే.  ఎన్నేళ్ళని చెయ్యగలరు ఎవరు మాత్రం? పాతికేళ్లలో కథా సాహిత్యంలో నిష్ణాతులుగా వారిద్దరు చేసిన కృషి, వేసిన బాట తెలుగు సాహితీ ప్రపంచంలో మైలు రాళ్లగా నిలిచిపోతాయి.  అయితే సంపాదకత్వంలో చేసిన మార్పు వల్ల భవిష్యత్తులో వెలువడే సంపుటిలలో ఏటికీ ఏటికీ ఎంపికకు కావలసిన స్థిరమయిన ఆలోచనా క్రమం ఉండదు.  అయినా ఉండాలా?

ఇంత చెప్పిన తర్వాత ఇక్కడితో ఆపేసి ముందుకు ఎక్కడికో వెళ్ళిపోకండి.  వైవిధ్యం లేదన్నానే కాని, ఎంపిక చేసిన కథలు బాగాలేవని నా అభిప్రాయం కాదు. 

ఈ సంపుటిలో పన్నెండు కథలున్నాయి.  అవికాక అనుబంధంలో మరి మూడు కథలున్నాయి.  నేను మొదట అనుబంధంతో చదవడం మొదలు పెట్టాను.  శ్రీపాద వారి ‘కలుపుమొక్కలు’, తమిళనాడు లోని ఉడుముల పేట లో పుట్టి పెరిగిన పదమూడేళ్ల మార్జూరి సంజనా పద్మం రాసిన వాళ్ళ నాయనమ్మ చెప్పిన కథ ‘అట్ట పుట్టింది ఆ ఊరు’, ఇంకా పద్నాలుగేళ్ల తాడాల కుసుమసాయి సుందరీరాణి రాసిన ‘దైవం మానవ రూపేణ’ అన్న కథ.  ఈ అనుబంధం మంచి ఆలోచన.  సంజనా పద్మం రాసిన కథలోని మనం సాధారణంగా వినని తమిళ, మలయాళం కలగలిసిన తెలుగు చదువుతున్నప్పుడు కొత్తగా కనిపించే అతి పాత పదాలు, ఆ ఊరికి పేరెలా వచ్చిందని చెప్పిన ఆ కథ, ఆ పదమూడేళ్ల అమ్మాయి రాసిన కథ నాకెంతో ఆసక్తి కలిగించాయి.  పుస్తకమంతా ఈ కథల్లాగే ఉంటే ఎంత బాగుండును? 

స్త్రీ పురుష సంబంధాలు సాంప్రదాయాలను వదలి కొత్త దారులు తొక్కుతున్నాయన్నది వాస్తవం.  సహజీవనం చేస్తున్నా ఇద్దరి మధ్య ఘర్షణలు తప్పవు.  మల్లీశ్వరి రాసిన ‘శతపత్ర సుందరి’ కొత్త కోణంలో మనల్ని ఆలోచింప చేస్తుంది.  జాన్ సన్ చోరగుడి రాసిన ‘చివరి చర్మకారుడూ లేడు’ కథలో గ్రామాల్లో సాంప్రదాయకంగా వస్తున్నా వృత్తివిద్యలు కాల క్రమేణా ఎలా కనుమరుగైపోతున్నాయో చాలా స్పష్టంగా మనముందుంచారు.  మోహిత రాసిన ‘తొమ్మిదో నంబరు చంద్రుడు’ స్త్రీ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకి అద్దం పట్టింది.  ‘నేను అప్పటికి నా పర్ ఫెక్ట్ మాన్ కే కమిట్ అయి వుంటాను.  దొరక్కపోతే అది మగజాతి ప్రాబ్లెం.  నాది కాదు’ అన్న నిర్ణయానికి వస్తుంది కథా నాయిక. 

పల్లెటూరి నేపథ్యంలో నాలుగు కథలున్నాయి.  కథా వస్తువులు మంచివే.  ఒకటి రెండు కథలు మాండలికంలో రాసినవి.  తమది కాని మాండలికంలో రాస్తున్నప్పుడు  మొత్తం వివరణ అంతా ఒకే భాషలో ఉండేటట్లు చూసుకునే బాధ్యత రచయితలది. 

మొత్తంగా కథలు ‘బానే ఉన్నాయి’ అనిపించినా, ఇంకా బావుండచ్చనే అసంతృప్తి మాత్రం మిగులుతుంది కథలన్నీ చదివిన తరువాత. 

కథా సాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం ఖరీదు కేవలం 65 రూపాయలే.

 
 

వేదిక                                                                                                       శాయి రాచకొండ

mukundra ramarao

‘వేదిక’ ఉమా కోసూరి గారు రాసిన వంగూరి ఫౌండేషన్ వారి అరవై రెండవ ప్రచురణ.  ఇది నిజంగా కోసూరి గారి నాట్య వేదికే!  ఆమె నేల విడిచి సాము చెయ్యరు. జీవితానుభావాల్ని కలబోసి పాఠకుల ముందుంచారని అనిపించక మానదు ఈ నవల చదువుతుంటే.  నర్తకిగా, ఒక కాళాకారిణిగా రాణించి, ప్రస్తుతం తనదైన శైలిలో రచనా వ్యాసంగాన్ని చేస్తున్న ఈమె గత నాలుగైదు ఏళ్లలోనే ఎన్నో కథలు, మూడు నవలలు రాసి ఒక రచయిత్రిగా మంచి స్థానం ఏర్పరుచుకున్నారంటే అతిశయోక్తి కాదు. 

ముందుమాటలో భువనచంద్ర గారు ‘భాష సంగీతంలా, కథ నృత్యంలా కళ్ళ ముందు కదలిపోతూ ఉంటుంది’ అని అంటారు.  మంథా భానుమతి గారు రాస్తూ ‘నవలంతా చదివాక ఆ పాత్రల ప్రభావంలోంచి బైట పడడానికి కొంత సమయం పడుతుంది’ అని.  ఆమె చెప్పినట్లు ఏ రచయితాకయినా కావలసిఉంది అదే కదా? 

నవరసాలతో వండి వడ్డించిన నవల ఇది.  నాట్యంలో పరిపూర్ణత సాధించాలంటే ఎంత సాధన కావాలో, ఎంత దీక్ష ఉండాలో!  ప్రేమలూ, ఆప్యాయతలూ, అంతస్తుల తేడాలూ, స్నేహ మధురాలూ, ఎన్నో ఎన్నెన్నో రుచులున్నాయీ నవలలో.  అన్ని పాత్రలలోనూ మనకు తెలిసిన మనిషి ఎవరో కనబడుతూనే వుంటారు.  సరళమయిన భాషలో, ఎన్నో మనసులని తాకగలిగే కథను మనకందించారు ఉమ గారు.

నలభై వారాలపాటు ధారావాహికంగా గోతెలుగు.కాం లో వచ్చిన ఈ నవల పాఠకులను ఎంతో అలరించింది.  నవలలో కొత్తదనం కోసం వెతకొద్దు.  అలాగే ఇది ఏదో విప్లవాత్మకమైన కథాంశం కుడా కాదు.  సామాజిక స్పృహలపై చర్చలుండవు.  మనుషుల మధ్య సంబంధాలు ఈ నవలకు ఆటపట్టు. 

పుస్తకం ఖరీదు రూ. 150.  ప్రతులకు జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాదు ని సంప్రదించండి. 

 

సంక్షిప్త పరిచయాలు

mukundra ramarao

వ్యాస వాటిక’ డా. నిడమర్తి నిర్మలాదేవి గారు రచించిన వ్యాస సంపుటి.  సాహిత్యంలో విభిన్న విషయాలను ఎంచుకుని, పరిశోధన చేసి రాసిన వ్యాసాలివి.  శ్రీకృష్ణ దేవరాయల రాజనీతి శాస్త్ర వైదుష్యము, రాయలనాటి కవయిత్రమణుల సాహిత్య సేవ, దేవులపల్లి గారి లలిత గీతాలు, బోయి భీమన్న గారి భావచిత్ర కళా వానమామలై వరదాచార్యుల వారి గీతరామాయణం, సలీం కథానికలు, గత దశాబ్ది రచయిత్రుల కథానికలపై వ్యాసాలున్నాయి. 

పుస్తకం ఖరీదు రూ. 200/-.  ప్రతులకు రచయిత్రిని సంప్రదించండి

mukundra ramarao

‘ఆధునిక తెలుగు భాషా నిర్మాణం’  గురించి చెప్పాలంటే సూక్ష్మంగా “తెలుగు భాష గురించి తెలుసుకోవాలనుకునే పాఠకులకు, ఆ భాషను అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు, భాషపై పరిశోధన చేయాలనుకునే పరిశోధకులకు, తెలుగు భాష నిర్మాణాన్ని భాష శాస్త్ర దృక్పథంతో ఈ పుస్తకం వివరిస్తుంది”.

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం తిరుపతిలో ఆచార్యునిగా పనిచేస్తున్న డా. శివుని రాజేశ్వరి గారు ఎంతో పరిశోధన, పరిశీలనలతో, తమ అనుభవాన్ని జోడించి రాసిన పుస్తకం ఇది.  తెలుగు భాష మీద ఇష్టం వున్న ఎవరైనా చదవాల్సిన పుస్తకం ఇది. 

పుస్తకం ఖరీదు రూ. 90 మాత్రమే.  ప్రతులకు రచయిత్రిని సంప్రదించండి.

mukundra ramarao

బారసాల’  వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి, వర్ధమాన రచయిత కలంలోంచి వెలువడిన కథల సంపుటి.  ఈ సంపుటిలో 25 కథలున్నాయి.  కథలన్నీ గో తెలుగు.కాం, విపుల మరి వేరెన్నో పత్రికలలో ప్రచురితమైనవే.  అన్నీ చిన్న చిన్న కథలు – నాలుగైదు పేజీలకు మించినవి. ఏ రచయితైనా అతి తక్కువ మాటలతో తను చెప్పదలచుకున్న భావాల్ని వ్యక్తం చెయ్యగలగడం మెచ్చుకోవలసిన విషయం.  కథాంశాలో కావలసినంత వైవిధ్యం కనిపిస్తుంది..  యాభై పైచిలుకు కథలు రాయడమే కాదు, మినీ నవలలు, నాటికలు, ఏక పాత్రాభినయాలు, గణిత భ్రహ్మ అనే స్వీయ ప్రదర్శనం, యాభైకి పైగా వ్యాసాలతో ఎన్నో సాహితి  ప్రక్రియలతో రచయితకి పరిచయం ఉండడం గమనార్హం.  ఈ పుస్తకంలో ఒకటి రెండు మిని వ్యాసాల్లాంటివి కుడా కనబడతాయి.  కొన్ని కథలు ‘ఇంకొంచెం’ పరిణితి చెందితే బాగుండుననిపించాయి.  ఒకటి మాత్రం నిజం.  కథలు రాయడంలో మెలకువలు అవగాహన చేసుకుంటూ, మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్న ఈ యువ రచయితకు మంచి భవిష్యత్తుంది.  
వెంపరాల పబ్లికేషన్సు పుస్తకం ఖరీదు రూ. 100.  ప్రతులు విశాలాంధ్ర, నవోదయా, ప్రజాశక్తి, కినిగే మొదలైన అన్ని చోట్లా దొరుకుతాయి.

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని మంచి గ్రంధాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి. కేవలం మా ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం మేరకే పుస్తకాలు స్వీకరించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

Website Designed
 &  Maintained
by
 Srinivas Pendyala