top of page

వ్యాస​ మధురాలు

నిర్వహణ:  శాయి రాచకొండ | చిలుకూరి సత్యదేవ్

vyasam@madhuravani.com 

కవిత్వంలో వంటకాలు

ద్వానా శాస్త్రి

dwana

ఇది నవంబరు 2016 లో సింగపూర్ లో జరిగిన అయిదవ ప్రప్రంచ సాహితి సదస్సులో శాస్త్రి గారు చదివిన వ్యాసం. 

“కవి, ద్రష్ట (seer), స్రష్ట (creator)”

“రవి గాంచనిచో కవి గాంచును”

“కవి కన్ను ప్రిజం లాంటిది. వేర్వేరు కోణాల్ని ప్రదర్శిస్తుంది”

ఇటువంటి ఉక్తులనీ కవి ప్రతిభావంతుడని, ఒకజ్ఞుడనీ నవనవోన్మేషమైన భావనా శక్తి గలవాడనీ వెల్లడిస్తాయి.  వంటకాలు లేదా ఆహార పదార్థాలను కవులు వర్ణించడం గమనిస్తే పైన చెప్పిన ఉక్తులు నిజమనిపిస్తాయి.  కవికి గల బహుముఖ పరిజ్ఞానంతో పాటు, కవుల అభిరుచులూవంటకాల ప్రాశస్త్యమూ తెలుస్తుంది.  ఒకనాటి వంటకాలూ, వాటి పేర్లు పరిశీలిస్తే భాష వైశిష్ట్యమూ అవగతమవుతుంది. 

పప్పన్నం భోజనంలో అతి ముఖ్యమైనది.  కందిపప్పు మరీముఖ్యమైనది.  కందిపప్పు పచ్చడి అంటే లొట్టలు వేసుకుంటూ తినవలసింది.  మరి ఈ పచ్చడి ఎలా తయారుచేయాలి?  ఏమేమి దినుసులు వెయ్యాలి? సరిగ్గా చేస్తే దాని మజాయే వేరు – అంటూ నాదెళ్ళ నృసింహ కవి ఒక ‘సీసా’లో మనకి అందించాడు. 

కవిసామ్రాట్ ముద్దులపట్టి  కిన్నెర!

వెంపటి హేమ

Damayanti

అనగా అనగా ఒక కోన ఉంది. ఆ కోనలో ఒక కొండ ఉంది.  కొండంటే మరీ పెద్ద కొండేమీ  కాదు, అది ఒక కొండగుట్ట (హిల్లక్), అంతే. ఒక వాగు ఆ గుట్టని చుట్టి, కోనలో దిగువకంతా ప్రవహించి, అడవుల వెంట సాగివచ్చి, చివరకు జీవనది  గోదావరిలో లయమైపోయింది. ప్రత్యక్షంగా కనిపించే విషయమిది. ఆ వాగు పేరు “కిన్నెరసాని”! ఆ కొండగుట్టని “పతిగుట్ట” – అంటారు. ఆ రెండు పేర్లకూ ముడివేస్తూ, ఆ ప్రదేశంలోని జానపదులు మనకు చెప్పే కథ ఒకటి ఉంది...

ఖమ్మం జిల్లాలోనే పుట్టి, అడవులగుండా ప్రవహించి భద్రాచలం సమీపంలో గోదావరి నదిలో కలిసిన ఒక సెలయేరు కిన్నెరసాని. కొ౦డగుట్టను చుట్టి ప్రవహించిన ఆ సెలయేటిని కనులారగా చూసి, దాని చుట్టుపక్కల అలమి ఉన్న ప్రకృతి సొగసుల్ని ఆస్వాదించి, ప్రవహించే కిన్నెర నడకల్లోని నేవళీకానికి ముగ్ధులైన శ్రీ విశ్వనాధ హృదయం స్పందించింది. అక్కడి జానపదులు చెప్పుకునే పుక్కిటికథ దానికి జీవమిచ్చింది .

నారన సూరన ఉదయనోదయము – సవిమర్శక పరిశీలన.

పావని

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాసపోటీ లో ప్రశంసా బహుమతి సాధించిన వ్యాసం

Tirumalasree

ఉదయనోదయము అనే ప్రబంధాన్ని తెలుగులో నారన సూరన అనే కవి రచించాడు. ఇది 5 అశ్వాసాల ప్రబంధం. దీనికి మూలాన్ని కవి తన కావ్యంలో ఎక్కడా చెప్పలేదు. కాని ఈ కథకు మూలకథ కథాసరిత్సాగరంలోని ద్వితీయ లంబకంలో ఉంది. ఈ ఉదయనోదయంను కవి భాస్కర మంత్రికి అంకితం చేశాడు. దీనిని సూచిస్తూ కథా ప్రారంభంలో ఈ విధంగా ఉంది.

కం.     నీ జనకుడుదయనోదయ

  మోజం గావించె సురుచిరుకోక్తుల నది సం

  యోజింపుము నా పేరిట

   భూజననుత నారధీర పుణ్యవిచారా. ( ఉ.నో. 1._21.ప.)

అని “ ఉదయనోదయం “ ను అంకితమిమ్మని ముడియము భాస్కరుడు కోరగా అంకితమిచ్చానని కవి పేర్కొన్నాడు. అలాగే వనమలివిలాసంను రచించి కొండూరి అక్కదండనాథునికి అంకితం ఇచ్చాడు. ఇది ఉదయనోదయంకు ముందు సూరన చేసిన రచన. కవి తన ఇంటిపేరు, ఊరిపేరు, కావ్యం ఎప్పుడు రాశాడో పేర్కొనలేదు. .

సాహిత్యంలో శబ్దము-నిశ్శబ్దము

ఇంద్రాణి పాలపర్తి

Damayanti

శబ్దశక్తి అనంతం.

ఈ ప్రపంచమే శబ్దమయం.

కొన్ని ప్రత్యేక శబ్దాలకు, వాటి ఉచ్చారణకు ఉన్న శక్తి గురించి మన ప్రాచీనులు చెప్పిన విషయాలు మనకి తెలియనివి కావు.

శబ్దాలకు ఉన్న అధిదేవతలను గురించిన నమ్మకం మనకు ఎరుకే.   

ఈ శబ్దాలు, అక్షరాలై, వాటి సముదాయం పదాలై, పదాల సముదాయం వాక్యాలై, ఇదంతా ఒక ప్రత్యేక మానవ సమూహం వారిలో వారు ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడానికి ఒక భాష అయ్యి భాసిల్లుతోంది.

ఈ భాష పరిణితి చెంది, ఉన్నత స్థాయిలో కళగా, సాహిత్యంగా పొందుతోంది. పాటలు, నాటకాలు, ప్రసంగాలు, కధలు, కవిత్వం ఇలా వివిధరూపాల్లో భాష కళకు వాహకం అవుతోంది.

bottom of page