
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
వ్యాస మధురాలు
కవిత్వంలో వంటకాలు
ద్వానా శాస్త్రి
ఇది నవంబరు 2016 లో సింగపూర్ లో జరిగిన అయిదవ ప్రప్రంచ సాహితి సదస్సులో శాస్త్రి గారు చదివిన వ్యాసం.
“కవి, ద్రష్ట (seer), స్రష్ట (creator)”
“రవి గాంచనిచో కవి గాంచును”
“కవి కన్ను ప్రిజం లాంటిది. వేర్వేరు కోణాల్ని ప్రదర్శిస్తుంది”
ఇటువంటి ఉక్తులనీ కవి ప్రతిభావంతుడని, ఒకజ్ఞుడనీ నవనవోన్మేషమైన భావనా శక్తి గలవాడనీ వెల్లడిస్తాయి. వంటకాలు లేదా ఆహార పదార్థాలను కవులు వర్ణించడం గమనిస్తే పైన చెప్పిన ఉక్తులు నిజమనిపిస్తాయి. కవికి గల బహుముఖ పరిజ్ఞానంతో పాటు, కవుల అభిరుచులూవంటకాల ప్రాశస్త్యమూ తెలుస్తుంది. ఒకనాటి వంటకాలూ, వాటి పేర్లు పరిశీలిస్తే భాష వైశిష్ట్యమూ అవగతమవుతుంది.
పప్పన్నం భోజనంలో అతి ముఖ్యమైనది. కందిపప్పు మరీముఖ్యమైనది. కందిపప్పు పచ్చడి అంటే లొట్టలు వేసుకుంటూ తినవలసింది. మరి ఈ పచ్చడి ఎలా తయారుచేయాలి? ఏమేమి దినుసులు వెయ్యాలి? సరిగ్గా చేస్తే దాని మజాయే వేరు – అంటూ నాదెళ్ళ నృసింహ కవి ఒక ‘సీసా’లో మనకి అందించాడు.
“వేడి మంగలములో వేయించి వేయించి
గరగర విసిరిన కందిపప్పు
సరిపడ్డ లవణంబు సంధించి వండిన
కనకంబుతో సరి కందిపప్పు
అన్నంబులో జొన్పి యాజ్యంబు బోసియు
కల్పి మర్దించిన కందిపప్పు
పట్టి ముద్దలు చేసి భక్షణ సేయంగ
కడుపులో జొచ్చిన కందిపప్పు
పైత్య వాతంబు లెల్లను పారద్రోలి
కాంత పై యాశ పుట్టించు కందిపప్పు
బక్క దేహుల కెల్లను బలమునిచ్చి
ఘనత దెచ్చును ఏ ప్రొద్దు కందిపప్పు!”
పప్పుకీ ఆవకాయకీ సంబంధం వుందని తెలిసిందే. ఈ రెండూ “మాచింగ్” అన్నమాట! గరికపాటి నరసింహారావు ఆవకాయ పై రుచికరమైన పద్యం చెప్పారు.
“మామిళ్ళముక్కపై మమకారముంజల్లి
అందింపగా జిహ్వ ఆవకాయ
కూరలే లేనిచో కోమలి వేయుచో
అనురాగముంజల్లు ఆవకాయ
చీకుచున్ననుగాని పీకుచున్ననుగాని
ఆనందమేనిచ్చునావకాయ
ఆపదలనాదుకొను కూర ఆవకాయ
అతివనడుమైన జాడియే ఆవకాయ
ఆంధ్రమాత సిందూరమే ఆవకాయ
ఆంధ్ర దేశమ్మెతానొక్క ఆవకాయ “
ముళ్ళపూడి వెంకటరమణ ఆవకాయ గురించి ఓ పాట అందుకున్నారు –
“మధురం మధురం – ఆవకాయ మధురం
పాతదీ మధురం – కొత్తదీ మధురం
ఊటా మధురం – పిండీ మధురం
ముక్కా మధురం – టెంకీ మధురం
చర్మం మధురం – స్మరణం మధురం”
భోజనం, వంటకాలు అంటే శ్రీనాథుడినే చెప్పాలి. మంచి భోగి. పదిహేనవ శతాబ్దం నాటి శ్రీనాథుడు తెలుగు రుచుల్ని తనివితేరా సీసపద్యంలో ఘుమఘుమలాడించాడు....పద్యం కూడా పోపుఘాటులా వుంటుంది.
“మాణిభంధాశ్మలవణ పాణింధమములు
బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు
పటురామ ఠామోద భావితములు
తంత్రిణీకరసోప దేశదూర్దురములు
జంబీరనీరాభిచుంబితములు
హై యంగవీనధారాభిషిక్తంబులు
లలిత కస్తుంబరూల్లంఘితములు
శాకపాక రసావళీ సౌష్టవములు
భక్ష్య భోజ్య లేహ్యంబులు పానకములు
మున్నుగాగల యోగిరంబులు సమ్రుధ్ధి
వెలయగొనివచ్చెనందొండువిధములను”
మిరియాలపొడి చల్లి తయారుచేసినవి కొన్ని - సంధవలవణంతో చేసిన "తప్పాల చెక్క"లు కొన్ని - ఆవపిండివేసిన ఆవడలాంటివి కొన్ని - ఇంగువవాసనతో ఘుమాయించేవి కొన్ని - నిమ్మరసంతో చేసినవి - నేతిలో మునిగితేలేవి కొన్ని - భక్ష్య, భోజ్య, లేహ్యములు, చోష్యాలు - పీలుస్తూ తాగేవి (పులుసు, చారు), పానీయాలు - ఇలా శ్రీనాథుడు తెలుగు వారి ఆహార సంస్కృతిని అక్షరాలా రుచి చూపించాడు. చాటు పద్యాలలో ఇంకా బాగా చెప్పాడు.
తాళ్ళపాక అన్నమయ్య తక్కువ తిన్నాడా? వేంకటేశ్వరునికి నివేదనతో వంటకాలు వివరించాదు. అక్కాళపాశాలు - నేతిపాయసాలు; అప్పాలు; గోధుమ సేమ్యా వంటకాలు; పంచదార క్రొన్నేతితో చేసినవి; మిరియాలతో తాళింపు పెట్టిన కూరలు - కమ్మని కూరలు; సుగంధ ద్రవ్యాలు వేసిన రోటి పచ్చళ్ళు, పిండివంటలు, పెరుగుతో చేసినవి - ఆరగించవో స్వామీ - అని వేడుకుంటాడు.
శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రెడ్డిదొరల భోజనంలోని ప్రత్యేక వంటకాన్ని తెలియచెప్పాడు. ఆ వంటకం పేరు 'పొరటు’. గురుగుకూర, పులి చెంచలి కూర, తుమ్మి కూర, లేతగరిసాకు, చింత చిగురు - వీటితో కూరలు వండుకునేవారలు. ఈ ఆకు కూరల్ని ఉడకబెట్టి, పెసరపప్పును కలిపి నూనెతో తయారు చేసేవారట.
తిరుపతి వేంకటకవులు ఓ అవధానంలో పకోడిపై పద్యం చెప్పమంటే పకోడీని ఇలా సమర్పించారు. “కరకరలాడు కొంచెమగు కారము గల్గు పలాండు వాసనా హారమగు కొత్తిమీరయను నల్లము గన్పడు నచ్చనచ్చట ధరను పకోడీ బోలెడు పదార్తములేదని తద్రనజ్నులాదరమున పల్కుచుందురది తాదృశ్యమే యగునంచు దోచెడిన్”
చిలకమర్తి కుడా పకోడీల సొగసును, మహిమను వర్ణిస్తూ కొన్ని పద్యాలు చెప్పారు. వంకాయ కూరపై వచ్చిన కవిత్వం కూడా తక్కువేమీ కాదు. ఓ చాటుకవి వంకాయవంటి కూరలేదు పొమ్మన్నాడు. బసవరాజు అప్పారావు
“గుత్తి వంకాయ వంటి కూర లేదోయ్ లేదోయ్
గుత్తొంకాయతో వలపంతా కూర్చినానోయ్ బావా”
అని సరసాలాడించాడు. మరో పద్యంలో విలక్షణమయిన వంకాయ కూరను చూపించాడో కవి.
“మెట్ట వంకాయ యల్లము మిర్చి జేర్చి
పచ్చి కరివేపతో పెనయపచనమొంది
చిట్టి వడియాల పోపుతో మిట్టి పడెడు
ముద్ద వంకాయ మిసవని మొప్పె యున్నె?"
తెలుగు వాళ్లకి ఆవకాయ తరవాత బాగా ఇష్టమయినది గోంగూర పచ్చడి. అందుకే గోంగూర కవి ఎవరో..
“గోంగూర వంటి శాకము
సంగీతము చేత నబ్బు రసజ్ఞతయున్
బంగారు వంటి ధాతువు
శృంగారము వంటి రసము చిక్కవు సుమ్మీ”
చివరగా గరికపాటి గారి మిరప బజ్జీ అపూర్వ వర్ణన ఆస్వాదిద్దాం.
“అయిదు గంటల వేల ఆ దారి ప్రక్కగా
చుయ్యుమనును గూబ గుయ్యిమనును
పచ్చి మిరపకాయ కచ్చి రేపెడునట్లు
గ్రుచ్చి గ్రుచ్చియు చూచు గుండె వైపు
శనగ కవచమూని సలసలా వేగుచో
కడుపులో రసనాడి కదులుచుండ
వేడి బజ్జి కొరికి వేడు చన్నీళ్ళతో
రుచి అదేమొ దాని రూపామేమొ
ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగా జేయు
మిరప బజ్జీల రుచి నేను మరవలేను
ఒక్కటో రెండో మంచిదే, ఎక్కువయిన
సచిను టెండూల్కరుడు మాకు సాటి రాడు”
మూర్తి జొన్నలగడ్డ:
“అరటి పువ్వుండు నొక్క మూర
వండి చూచిన వచ్చు పిడికెడు కూర
ఆవ ఘాటు ఆదరగొట్టుచుం డెరా
ఆలసించిన ఆశాభంగమురా
అసలే పిడికెడు కూర అందరికీ అరకొర”
ఉప్మా:
“ఉప్మా కుతకుత ఉడికె
వాసన ఘుమఘుమ లాడె
వలదన్నవినదీ మనసు
ఉప్మా రుచి నీకేమి తెలుసు
జీలకర్ర జీవము పోసె
కరివేపకూ జీడిపప్పుకూ చక్కని జోడి కుదిరెనులే
కొందరు జనులకు ఉప్మా అలుసు
దాని విలువేమిటో పెసరట్టుకి తెల్సు
అరిటాకులో ఉప్మా ఆవకాయతో తిని చెప్మా
ఇదియేనురా పెళ్ళిళ్ళలో పలహారం”
మాతృభూతయ్య కవి - 18వ శతాబ్దం -
చల్ల గురించి ఏమని చెప్పాడో చూడండి:
“శ్రీరమ్య మైనట్టి చిక్కని చల్ల
సారస్యమైనట్టి చక్కటి చల్ల
కూరిమికొనరమ్మ కొమరైన చల్ల
భారతి గొన్నట్టి బాగైన చల్ల
శ్రీరమ గొన్నట్టి చెలువైన చల్ల
పార్వతి గొన్నట్టి పరువైన చల్ల
నవ్వుచుగొనరమ్మ నా చేతి చల్ల
నల్లావు పితికిన నయమైన చల్ల
తెల్లావు పితికిన తేటైన చల్ల
ఎఱ్ఱావు పితికిన హెచ్చయిన చల్ల
నఱ్ఱావు పితికిన నాడెంపు చల్ల
.... చల్లనయై సకల తాపశమమై సమమై చెల్లుగ మధురంబాసి
చల్లకు ముల్లోకములను సాటియు గలదె?"
oooo
ద్వానా శాస్త్రి ( ద్వాదశి నాగేశ్వర శాస్త్రి)
ద్వానా శాస్త్రిగా, లబ్ధప్రతిష్టులైన ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారు కృష్ణా జిల్లా లింగాల లో జూన్ 15, 1948 నాడు జన్మించారు. ఆంధ్రా, నాగార్జున & ఉస్మానియా విశ్వవిద్యాలయాలో చదువుకుని డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అమలాపురం లో 32 సంవత్సరాలు SKBR కాలేజ్ లో అధ్యాపకుడిగా పనిచేసి, స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని సివిల్ సర్వీస్ అధికారులకి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. సాహిత్య సవ్యసాచిగా పేరు పొందిన శాస్త్రి గారు 800 పేజీల తెలుగు సాహిత్య చరిత్ర తో సహా 50 పైగా గ్రంధాలు, వేల కొద్దీ వ్యాసాలూ, రెండు వేల సమీక్షలు రచించడమే కాకుండా ప్రముఖ వక్తగా పేరు పొందారు. సాహిత్య పరమైన అనేక అంశాలపై 12 గంటలు ఏకధాటీగా ప్రసంగించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు మొదలైన రికార్డుల లో ఎంపిక అయ్యారు. శతాధిక పురస్కార గ్రహీత.
