top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

సత్యాన్వేషణ - 17

అఖిల జంతుకోటి ప్రపంచ మహాసభలు

 

సత్యం మందపాటి

అనగనగా ఒక అడవి. అడవి అంటే కాకులు దూరని కారడవీ కాదు. చీమలు దూరని చిట్టడివీ కాదు.

కాకులూ, చీమలూ వున్న మామూలు సాదాసీదా అడవిలాంటి తోట. తోటలాంటి అడవి. 

అక్కడ ప్రప్రధమ ‘అఖిల జంతుకోటి ప్రపంచ మహాసభలు’ ఇప్పుడు జరుగుతున్నాయన్నమాట. 

మరి జంతు ప్రపంచంలో ఆడియో మీడియా, విడియో మీడియా, సోషల్ మీడియాలాటివేమీ లేవు కనుక, ఇక ఆలస్యం లేకుండా ఆ మహాసభల విశేషాలు నేనే చెప్పేస్తాను. చిత్తగించండి. 

***

‘సభకి నమస్కారం. అఖిల జంతుకోటి మహాసభలకు స్వాగతం. సుస్వాగతం. ఈ సభాస్థలి మానవులు నివాసం వుండే నగరానికి దగ్గరలో వున్నందున, మృగరాజారణ్యం నించీ మన ప్రియతమ నాయకులు కేసరిగారు వచ్చి మన సభను నిర్వహించటానికి కుదరటంలేదు కాబట్టి, ఈ సభకు అధ్యక్షులుగా వుండమని గజేంద్రగారిని కోరుతున్నాం’ అన్నాడు సభా నిర్వాహక కార్యవర్గ ప్రతినిధి కాలభైరవ. 

సభలో వున్న అందరి కరతళాలతో గజేంద్ర వచ్చి కూర్చుని తొండం పైకెత్తి సభకి నమస్కారం పెట్టాడు.

“మన సభకి రావలసిన వారందరూ వచ్చేసినట్టేనా?” అడిగాడు గజేంద్ర. 

అప్పుడే వచ్చిన కుందేలయ్య అన్నాడు, “నేను, మా తాబేలమ్మ కలిసే బయల్దేరాం. నా వీపు మీద ఎక్కమ్మా తొందరగా వెళ్ళొచ్చు అన్నాను. ఒకటే సిగ్గు పడిపోయింది. తను నెమ్మదిగా నడిచి వస్తాను, తనకోసం ఎదురు చూడకుందా సభ మొదలు పెట్టేయమని మీకు చెప్పమన్నది” 

“నేను చెప్పానా, ఈమధ్య వీళ్ళద్దిరూ కలిసి తిరుగుతున్నారని. ఏమోనమ్మా! ఒకళ్ళ వేగానికి ఇంకొకళ్ళు తట్టుకోలేరు వద్దమ్మా అని చెప్పాను. వింటేనా? పిదప కాలం, పిదప బుధ్ధులు” అంది పక్కనే అక్కడ చెట్టు మీద కూర్చున్న కాకమ్మ. 

“ఇప్పుడు కాలం మారిపోయింది కదా! అయినా నీ కాకమ్మ కబుర్లకేం కానీ, ముందు అక్కడ సభలో ఆయన మాట్లాడుతున్నారు విను” కాకమ్మ పక్కనే కొమ్మ మీద కూర్చున్న పిచ్చిక పిల్ల అన్నది.

“సరే అయితే. ఇక సభ మొదలుపెడదాం. ఇప్పుడు ఈరోజు కీలకోపన్యాసం చేయబోతున్న చీమరాజుగారిని ఆహ్వానిస్తున్నాను” అన్నాడు కాలభైరవ.

 

చీమరాజు వచ్చి గజేంద్ర పక్కనే కూర్చున్నాడు. అంత పెద్ద గజేంద్రుడి పక్కన చీమరాజు మరీ చిన్నగా వున్నాడేమో, తల బాగా పైకి ఎత్తి చూస్తూ కూర్చున్నాడు. 

“ఇప్పుడు సభ ప్రారంభమవుతుంది” అని కాలభైరవ తోకాడించుకుంటూ వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్నాడు. 

గజేంద్ర అన్నాడు “ఈరోజు మన సభలో ఎక్కువగా వినపడే విషయం ఒకటి వుంది. ఇక్కడ, అంటే ఈ భూమి మీద, మనం అందరం సంతోషంగా, క్షేమంగా, సామరస్యంతో బ్రతకవలసిన అవసరం వుంది. ఎందుకంటే ఇది మన భూమి. మనమందరం జీవించే మనందరి నివాసం. దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ. అంటే ఇక్కడ బ్రతుకుతున్న జంతుకోటిదీ, మొక్కలూ, చెట్లూ మొదలైన హరిత ప్రాణకోటిదీ, మానవులదీ. జనాభా లెఖ్కలు చూసుకుంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న వారిలో మన జంతుకోటి చాల ఎక్కువ. తర్వాతనే చెట్లూ, చేమలూ, మొక్కలూ, పొలాలూ మొదలైన హరిత ప్రాణులు. చివరన వచ్చేదే మానవులు. ఒక్క మానవులు తప్ప మిగతా ప్రాణకోటి అంతా, ఎంతో సామరస్యంతో, సఖ్యంగా వుండటమే కాక, మన భూగోళాన్ని సస్యశ్యామలం చేసుకుంటూ, నిరంతరం కాపాడుకుంటున్నాం. ఈ దురిత మానవులు మన ప్రకృతిని, మనుగడని, భూమాతనీ కాపాడుకోవటం మాట అటుంచి, వాటిని పాడు చేస్తున్నారు కూడాను. అది మనం ప్రతిరోజూ చూస్తున్నదే! ఈ నేపధ్యంలో ఈ మహాసభలు జరుగుతాయి. ఇప్పుడు ఈనాటి కీలకోపన్యాసకులు చీమరాజుగారిని మాట్లాడమని ఆహ్వానిస్తున్నాను”     

చీమరాజు గొంతు సర్దుకున్నాడు. “సభకు నమస్కారం. నేను చెప్పబోయేది చాల ముఖ్యమైన విషయం. ఎంతో జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద లెఖ్కలోనే కాదు, జీవన పరిణామ వికాసక్రమంలో కూడా మనమే మనుష్యుల కన్నా ఎంతో ముందున్నాం. రకరకాల జంతుకోటి, హరిత ప్రాణి మూడు బిలియన్ల సంవత్సరాల క్రితమే వున్నది. ఆ తర్వాతనే, నాలుగు కాళ్ళ జంతువులు రెండు కాళ్ల పై నడుస్తూ చింపాంజీలయి, కోతులుగా, ఆది మానవులుగా రావటం ఒక మిలియన్ సంవత్సరాల క్రితమే అయినా, శరీరమంతా జుట్టు పోయి, కాస్త బుధ్ధీ బుర్రా వచ్చి ఈ రోజుల్లో మనుష్యుల్లా అవతారాలు వచ్చింది యాభై వేల సంవత్సరాల క్రితమే” అన్నాడు.

ఆయన మాటలకు అడ్డం వస్తూ అన్నది మారుతి, పక్కనే వున్న తన అమ్మ వానరతో. “నేను చెప్పాను గదా. పూర్వజన్మలో నేను మనిషిగా వున్నప్పుడు ఇవన్నీ చదువుకున్నాను. చింపాంజీలలోనించీ ఆండ్రాయిడ్లూ, హ్యూమనాయిడ్లూ వచ్చాయనీ, వాటిలోనించే ఆది మానవులూ, తర్వాత నాలాటి మానవులూ..” 

“మరప్పుడెప్పుడో మనుష్యుల్లోనించీ వచ్చాక, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి కోతివయిపోయావా!” అంది పక్కనేవున్న మార్జాలం. 

అందరూ పెద్దగా నవ్వుతుంటే, “ఎవరది? మన ఆత్మీయ అతిథి మాట్లాడుతుంటే అడ్డం వస్తున్నది?” కోపంగా అడిగాడు కాలభైరవ. 

మారుతి తండ్రి హనుమ అన్నాడు, “మా మారుతి. చిన్న పిల్ల కదా. దానికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. ఇంకో నెలా రెండు నెలల్లో ఆ జ్ఞాపకాలన్నీ మరచిపోయి మనలో ఒకటయిపోతుంది. మీరు కానీండి గురువుగారూ” అని.

చీమరాజు తన కీలకోపన్యాసం కొనసాగించాడు. “ఈ భూమి పరిణామ క్రమంలో మానవులు జంతువుల దగ్గరే ఎంతో నేర్చుకుని, అవి వారి జీవన విధానంలో కలుపుకున్నారు. ఉదాహరణకి మన జంతువుల్లో కొంచెం సాధు స్వభావం కలిగినవన్నీ, అంటే ఆవులూ, గేదెలూ, జింకలూ, గొర్రెలూ, ఏనుగులూ, పక్షులూ, చేపలూ, మా చీమలూ మొదలైనవన్నీ తమ ఆత్మరక్షణ కోసం గుంపులు గుంపులుగా జీవించటం చూసి, మనిషి కూడా సంఘజీవి అయిపోయాడు. గుంపుల్లో జీవించటం మొదలుపెట్టాడు. పశువులకి వున్న కొమ్ములూ, బలమైన శరీర భాగాలూ చూసి, తన ఆత్మరక్షణకి కావలసిన ఆయుధాలు సమకూర్చుకున్నాడు. వానలకీ చలికీ వేడికీ తట్టుకోవటానికి మన చీమ పుట్టలు చూసి, తనూ ఇల్లు కట్టుకోవటం నేర్చుకున్నాడు”

“అవును. మన చీమల పుట్టలు చూసిన వారికెవరికైనా తెలిసిపోతుంది. వాటిలో ఎన్నో అంతస్థులు, వర్షాలకి తట్టుకునే విధంగా కట్టిన కట్టడాలు. వాటి అందాలు చూసే పాములు మన చీమల పుట్టల్లో చేరుతున్నాయి కదా” అన్నాడు ఎర్ర చీమయ్య. 

“అవును మరి. అంత గట్టిగా, చక్కగా కట్టుకుంటే, మేమెలా వూరుకుంటాం. పిలవని పేరంటానికి వచ్చి, అక్కడే వుండిపోతున్నాం” నవ్వుతూ అంది నాగమ్మ, పడగ విప్పి వయ్యారంగా నాట్యం చేస్తూ.  

చీమరాజు తన ఉపన్యాసం కొనసాగించాడు. “అవును. మీరు చెప్పింది నిజమే. అది కూడా మానవులు మన దగ్గర చూసే నేర్చుకున్నారు. లేకపోతే ఏ గుహల్లోనో మగ్గిపోయి, ఈపాటికి పోయేవారు. అలాగే ఆహార విషయాల్లో కూడా. ఒక వర్షపు రోజునో, చల్లగా వున్న రోజునో అవసరం వస్తుందని, మనం అందరం అన్ని రకాల గింజల్నీ, ఇతర ఆహార పదార్ధాలనీ మోసుకుంటూ, ఒకరి తర్వాత ఒకళ్ళం చక్కటి వరుసలో నడుచుకుంటూ వచ్చి, మన ఇంట్లో అడుగున దాచుకుంటాం కదా. వాళ్ళూ మనల్ని చూసి అలా ఆహారం దాచుకోవటం నేర్చుకోలేదూ! అసలు చీమల్లో వున్న క్రమశిక్షణ ఆ మనుష్యుల్లో ఏదీ? ఇలా ఎన్నో మన జంతుకోటి నించీ వాళ్ళు నేర్చుకున్నారు. అలాటిది మన ఉనికికే పెద్ద సమస్య అయిపోయారిప్పుడు” చెప్పటం ఆపి, అక్కడే ఒక ఆకు మీద నిలిచిన నీటి బొట్టుతో తన గొంతు సవరించుకుంటున్నాడు. 

ఈలోగా వెనకాల ఏదో గోలగోలగా వుంది. 

“ఏమిటది? మళ్ళీ సభకి అంతరాయం… ఎవరది?” అడిగాడు కాలభైరవ. 

 వెనకాల వరుసలో గాడిద మీద విలాసంగా కూర్చున్న కోయిల అన్నది. “రెండు రోజుల్నించీ ఈ గార్ధభ్ ఒకటే గొడవ పెడుతున్నాడు. నాలాగా మధురంగా పాడటం నేర్పించమని. నేను ఎలా పాడాలో చెప్పి, సాధన చేయి అంటే ఓండ్రు పెడతాడు. మరి మధురంగా పాడాలంటే ఎలా పాడతాడు? చెబితే వినడు. చెప్పకపోతే ఏడుస్తాడు. సరిగ్గా పాడమంటే ఇంకా గట్టిగా ఓండ్రు పెడతాడు. ఏం చేయను?” కోయిల గార్ధభ్ వేపు జాలిగా చూస్తున్నది.  

‘గార్ధభ్. వూరుకో నాయనా. ఏమిటా ఆగడం? కొంచెం సాధన చేస్తూ వుండు. అదే వస్తుంది” అని నచ్చచెప్పింది పక్కనే వున్న చారల గాడిద. 

“ఆఁ! ఎక్కడున్నాను?” అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు చీమరాజు. “ఆమధ్య నేను పక్క పుట్టలో వుంటున్న మా పిల్ల చీమ దగ్గరికి శెలవులకి వెళ్ళినప్పుడు, ఎవరో ఒకాయన పెద్ద ట్యూబుతో మొక్కలకు నీళ్లు పోస్తూ, వాళ్ళ పుట్ట మీద నీళ్ళు పోసి, మమ్మల్ని చంపటానికి ప్రయత్నించాడు. అందరం ఇటూ అటూ చిందరవందరగా పరుగెత్తాం. ఈలోగా అది చూసి మన కందిరీగన్ అతని ముక్కు మీద వాలటంతో భయపడి పారిపోయాడనుకోండి. లేకపోతే ఈపాటికే నా ప్రాణం పోయి వుండేది. అందుకే మనుష్యులకి దూరంగా వెళ్ళి, అక్కడ ఇంకొక పుట్టు కట్టుకుని వుంటున్నాం” 

“అవును. ఆరోజు జరగరానిది జరిగిపోయివుంటే, ఈరోజు మనకి ఆత్మీయ అతిధి వుండేవాడే కాదు. అయినా ఈ మానవులకు ఇదేం పోయే కాలం? మనమేం తప్పు చేశాం. వాళ్ళకేమైనా అన్యాయం చేశామా? మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. వాళ్ళకెందుకు?” అన్నాడు గజేంద్ర కోపంగా.    

మారుతి ఉత్సాహంగా చేయి పైకెత్తుతున్నది, తను మాట్లాడాలని. మారుతి నాన్న హనుమ వారిస్తున్నాడు “ఏమిటా కోతి వేషాలు?” అని. 

అధ్యక్షుడు గజేంద్ర అది చూసి అన్నాడు, “పోనీ మాట్లాడనీ. చిన్నపిల్ల ఉబలాటపడుతున్నది” అన్నాడు. 

మారుతి లేచి నుంచుని రెండు చేతులూ, ఒక్క తోకా వూపుతూ అన్నది. “అధ్యక్షా! నాకు ఇప్పుడు ఇంకా కొన్ని పూర్వజన్మ జ్ఞాపకాలు బుర్రలో చక్రాల్లా తిరుగుతున్నాయి. చెప్పనా?” ఈసారి ఎంతో మర్యాదగా అడిగింది. 

“చెప్పు. మరచిపోయే లోపుగా త్వరగా చెప్పేసెయ్” అన్నాడు కాలభైరవ. 

“మానవులు మనలాగా సఖ్యంగా వుండరు. ఒకళ్ళ మధ్య ఇంకొకళ్ళు గీతలు గీసుకోవటమంటే వాళ్ళకి మహా సరదా. కనీవినీ ఎరుగని అర్ధంలేని దౌర్భాగ్యాలెన్నో కల్పించుకుని, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఇకరి నొకరు చంపుకుంటుంటారు. కులాలనీ, మతాలనీ, రంగులనీ, ప్రాంతాలనీ, నేనే గొప్ప నువ్వు కాదనీ, ఇలాటివేవో దరిద్రాలు సృష్టించుకుని గీతలు గీసుకోవటమే వాళ్ళకి ఆత్మానందం. మనలాగా కలసిమెలిసి వుండటం వాళ్ళకి చేతకాదు. మనం వాళ్ళ మీద ఎంతో నయం! ప్రాణ రక్షణకి తప్ప మనం హింస అనేది ఎరగం! వారికి ఇతరులని హింసించటం, దోచుకోవటం అంటే ఒక సరదా. ఒక మనిషి సాటి మనిషిని దోచుకోవటం మరదేం సరదానో!” అన్నది మారుతి.

పక్కనే వున్న నల్ల ఆవు, తెల్ల ఆవుతో అంటున్నది. “ఏమిటో మారుతి చెప్పేది ఒక్కటీ అర్ధంకాదు. మతమనీ కులమనీ, మనకి తెలియని కొత్త మాటలు చెబుతున్నది. ఒక్క రంగే మనకి తెలుసు. నువ్వు తెలుపు, నేను నలుపు. మనిద్దరం స్వయానా అక్కచెల్లెళ్ళం. ఇద్దరం అందంగా వున్నాం. ఒకళ్ళంటే ఇంకొకళ్ళం వదలి వుండలేం. మరి ఈ మానవులకెందుకో ఈ మాయరోగం!” అని.

పక్కనే వున్న చారల గాడిద అంది. “నన్ను చూడండి. నేను మీ అందరికన్నా అందంగాలేనూ! తెలుపేమిటి, నలుపేమిటి? నావి తెలుపు మీద నలుపు చారలా, నలుపు మీద తెలుపు చారలా? ఆ రెండు కలిస్తేనే ఎంతో అందం” అంది భుజాలు ఎగరేస్తూ.

“అవును. సత్యం పలికావు” అన్నాడు తీరిగ్గా పడుకుని గడ్డి నెమరేస్తున్న వృషభ్. 

“ఇంతకీ చీమరాజుగారిని ఆయన కీలకోపన్యాసాన్ని పూర్తి చేయనిస్తారా?” అడిగాడు కాలభైరవ. 

“ఇంకొక్క విషయం చెప్పటం మరచిపోయాను. నా పూర్వజన్మ జ్ఞాపకాలు చకచకా మరచిపోతున్నాను. ఇవాళ చెప్పకపోతే కష్టం. చెప్పనా! ఇంకొక్కటే” అని ప్రాధేయపడింది మారుతి. 

“ఛీ! వూరుకో. అన్నీ కోతి వేషాలు. కుప్పిగంతులూ” అంటున్నాడు హనుమ, తండ్రి హోదాలో వారిస్తూ. 

“మానవుల గురించి మనకి తెలియని విషయాలెన్నో చెబుతున్నది చిరంజీవి మారుతి. చెప్పనీ హనుమా” అన్నాడు అధ్యక్షుడు గజేంద్ర.  

మారుతి ఉత్సాహంగా అన్నది. “మనం ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు, ఏది దొరికితే అది తినేసి తృప్తి పడతాం. మనమే కాదు మన నాయకుడు మృగరాజు కేసరిగారు కూడా అంతే. తను నాయకుడు కదా అని కనపడ్డ జంతువులన్నిటినీ చంపుకుంటూ వెళ్ళడు. ఆయనకి ఆకలి వేయనప్పుడు, నేను ఆయన వీపు మీద ఎక్కి గంతులు కూడా వేసేదాన్ని. నన్ను చూసి చిరునవ్వి, కళ్ళు మూసుకు పడుకుంటాడు. ఆయనకి ఆకలిగా వున్నప్పుడు మాత్రం నేను పక్కనే వున్న చెట్టెక్కి సరదాగా చూస్తూంటాను. కానీ మానవులు అలా కాదు. కాపీనం ఎక్కువ. స్వార్ధం విపరీతం. ఎంత సంపాదించినా వాళ్ళేమీ రోజుకి పదిసార్లు తినరు. తినలేరు. అజీర్తి చేస్తుంది. అయినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూనే వుంటారు. ఎందుకో తెలుసా? మిగతా వారికి అందకుండా వుంటుందని! అదో తుత్తి వాళ్ళకి” అంది మారుతి. 

“తుత్తి అంటే?” అడిగింది అమాయకంగా, కోతి మీద వాలిన దోమ. 

“ముందు నన్ను కుట్టకుండా ఎగిరిపో… అసలే నేను నా పూర్వజన్మ జ్ఞాపకాలు మరచిపోతుంటే నువ్వొక దానివి. నా మీద కూర్చుని ఇదేమిటి అదేమిటి అని జుయ్యి జుయ్యిమని పాటలు పాడతావ్. నొప్పి పుట్టేట్టు కుడతావ్. నువ్వు మానవుల్లో వుండాల్సిన దానివి. ఇక్కడ కాదు” అంది మారుతి విసుక్కుంటూ. 

“లేదు. నాకు కూడా ఆకలిగా వుంటే, నీది లేత రక్తం కదా అని నీమీద వ్రాలాను. నేను నువ్వు చెప్పిన మనిషినీ కాదు, మానునీ కాదు. మామూలు దోమని” అంది దోమ నొచ్చ్జుకుంటూ. 

“ఇంతటితో ఎంతో ఆవేదనతో చేసిన నా ఉపన్యాసం సమాప్తం. ఇప్పుడు నేను చెప్పిన విషయాల మీద మీలో ఎవరికైనా ప్రశ్నలు కానీ, స్పందన కానీ వుంటే చెప్పండి” అని చీమరాజు కూర్చున్నాడు.

వానర చేయి పైకెత్తింది.

“చెప్పమ్మా?” అని అడిగాడు అధ్యక్షుడు గజేంద్ర.

“ఈ మానవులు చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అడవులు, తోటలూ అన్నీ నాశనమైపోతున్నాయి. మానవులు మనకన్నా బలవంతులు కదా. మనమేం చేయాలి?” అని అడిగింది వానర. 

పక్కనేవున్న కొలనులోని బంగారు చేప అంది “నేను మీ ప్రశ్నలకేమీ అడ్డు రావటం లేదు కానీ, నా ప్రశ్న కూడా అలాటిదే. నదులు, సముద్రాలు అన్నీ చెత్త చెదారంతో నింపేస్తున్నారు ఈ మానవులు. చెరువులు పూడ్చేసి ఏవేవో పెద్ద పెద్ద పుట్టలు కట్టేస్తున్నారు. మాకు నివాస యోగ్యమైన నీటి ప్రదేశాలు తగ్గిపోతున్నాయి. త్రాగటానికి నీరు కరువైపోతున్నది” 

మారుతి కిసుక్కున నవ్వి, “చెరువులు పూడ్చేసి కట్టేవి పుట్టలు కాదు. అవి ఆట స్థలాలు. స్టేడియంలు అంటారు అక్కడ” అంది. 

“ఏదయితే ఏమిటిలే, మన జీవితాలని నాశనం చేస్తున్నారు మానవులు” అంది బంగారు చేప. 

మేక చేయి పైకెత్తింది, తనూ ఒక విషయం చెప్పాలని.

“చెప్పమ్మా మేకమ్మా” అన్నాడు గజేంద్ర. 

“ఎక్కడబడితే అక్కడ మమ్మల్ని చంపేసి తినేస్తున్నారు ఈ మానవులు. మా వూళ్ళో వెయ్యి మంది వుండే వాళ్ళం. ఇప్పుడు రెండు వందల మందిమే మిగిలాం” అంది తన బంధు మిత్రులని కోల్పోయిన మేక. 

తను కూడా మాట్లాడతానని రెండు కాళ్ళల్లో ఒక కాలు పైకెత్తబోయి క్రిందపడింది కోడి. 

లేవకుండానే అంది. “మా పిల్లల్ని గుడ్లులాగా వుండగానే తినేస్తున్నారు. మమ్మల్ని కూడా మెడలు విరిచేసి చంపేసి తింటున్నారు ఈ మానవులు. వారిని ఏం చేయాలి?” అని.

సభాధ్యక్షుడు గజేంద్ర అన్నాడు, “అవును. మీరు చెప్పింది అంతా నిజమే. మా దంతాలు నరికి తీసుకు వెడుతున్నారు ఈ దుష్ట మానవులు. ఆ బాధకి తట్టుకోలేక ఎంతోమంది ఏనుగులు చనిపోతున్నారు. మొన్ననే మా బంధుమిత్రుల్లో పదిమంది అలా నరకయాతన అనుభవించారు. ఆరుగురు ఆ బాధ భరించలేక చనిపోయారు కూడాను. ఏం చేస్తాం. మాకు బలం వున్నా, మేము సాధు గుణం కలవాళ్ళం. ఈ మానవులు మన మృగాలకన్నా క్రూరులు. వారి దగ్గర ఎన్నో రకరకాల ఆయుధాలు కూడా వున్నాయి” 

“అయితే ఇలా మనల్నీ, మన నివాస భూమినీ నాశనం చేస్తున్న మానవుల ఆగంతాలను ఎలా ఆపటం, గురువుగారూ” అని అడిగారు అందరూ ఏక కంఠంతో. 

గజేంద్రుడు ఒక్క క్షణం అలోచించి, “ఇలా అడిగితే హఠాత్తుగా అడిగితే, నా దగ్గర జవాబు లేదు. కానీ మనమందరం ఇలాటి ప్రమాదకరమైన మానవుల పనులను ఆపటానికి ఏం చేయాలి అని ఆలోచించి, వారం రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పుడు మీరందరూ చెప్పేది విని, ఏం చేయాలో అది చేద్దాం. ఇంతటితో ఈనాటి సభ సమాప్తం” అన్నాడు.

అప్పుడే రొప్పుకుంటూ నెమ్మదిగా వచ్చింది తాబేలమ్మ.

“అమ్మయ్య వచ్చేశావా?” అంటూ ప్రేమగా ఎదురెళ్ళాడు కుందేలయ్య.

“మన సభ మొదలయిందా?” అడిగింది తాబేలమ్మ.

“మొదలవటమేమిటి, నీ ముఖం. పూర్తయిపోతేనూ. నేను అదే చెప్పాను మీ ఇద్దరికీ పొత్తేమిటి అని. ఎప్పుడైనా నా మాటలు విన్నారా? చెబితే అర్ధం చేసుకోరూ” అంది చెట్టు మీద కూర్చున్న కాకమ్మ. 

*****

bottom of page