top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

ammante_edited.jpg
tarabai.png
rameshwaram.png
little_edited.jpg
Asaadhyudu.png

కొద్ది రోజుల క్రితం స్నేహితుడు మధు పెమ్మరాజు కొన్ని పుస్తకాలు తెచ్చి “ఇవి మంచి పుస్తకాలు, చదవండి” అని ఇచ్చాడు.  అందులో మూడు అనువాద సంబంధిత పుస్తకాలను కూడా చూసినప్పుడు నా కళ్ళు కొంచెం మెరిసాయి.  అందులో రెండు పుస్తకాలు, ‘మా అమ్మంటే నాకిష్టం’, ‘తారాబాయి లేఖ’ కన్నడ మూలాలకు తెలుగు అనువాదాలు.  మూడో పుస్తకం ‘వరద గుడి’ పరేశ్ దోశీ అనువదించిన వివిధ అనువాద కథలు.  మిగిలిన పుస్తకాలు, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు రాసిన ‘రామేశ్వరం కాకులు’, ఉణుదుర్తి సుధాకర్ గారి ‘తూరుపు గాలులు’, ఇంకోటి ‘చేదు పూలు’ మెహెర్ కథలు.  చదవాల్సిన పుస్తకాలు.  అన్నీ ఛాయ సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించినవే.  వైవిధ్యంతో కూడిన పుస్తకాలు. 

 

 

అన్నిపుస్తకాలూ చాలా సింపుల్ గా ఉన్నాయి.  ముందు, వెనక మాటలేవీ లేవు.  ఉపోద్ఘాతాలంతకంటే లేవు.    పాఠకులు తిన్నగా పుస్తకంలో దూరిపోవచ్చు.  ఈ తడవ ఒక మూడు పుస్తకాలు పరిచయం చేస్తున్నాను – మిగిలినవి తరువాతి సంచికలో.  

పై చెప్పిన మూడు పుస్తకాలూ కాక, వంగూరి ఫౌండేషన్ వారు ఈ మధ్యనే ప్రచురించిన ‘లిటిల్ డిటెక్టివ్’ పుస్తకం మా రాజు గారు తెచ్చి ఇచ్చారు.  ఆ పుస్తక పరిచయం కూడా క్రింద చూడవచ్చు.  

‘మా అమ్మంటే నాకిష్టం' వసుధేంద్ర గారు కన్నడ భాషలో రాసిన కథల పుస్తకానికి రంగనాథ రామచంద్రరావు గారి తెలుగు అనువాదం.  మూలం కర్ణాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన.  

‘మా అమ్మంటే నాకిష్టం’ కథతో మొదలై, మొత్తం 18 కథలున్నాయి ఈ సంపుటంలో.  అన్నింటికీ ఒకే రకమైన నేపథ్యం కనబడుతుంది.  చిన్న ఊరు, మధ్యతరగతి కుటుంబం, నాలుగైదు దశాబ్దాల క్రితం సాంఘిక, ఆర్ధిక వ్యవస్ఠ, ఇప్పట్లో మనం అనుకోడానికి కూడా అందని చిన్న చిన్న తీరీ తీరని కోరికలు, ఇలాంటి వ్యవస్థలో పెరిగిన ‘నేను’ చెప్పిన కథలివి.  అమ్మా, నాన్నా కూడా అమ్మగా, నాన్నగా చూడకపోతే వాళ్ళూ, మామూలు మనుషులే కదా! ప్రతీ మనిషికీ ఉండే వ్యక్తిత్వం వాళ్ళదీనీ.  అతి సులభమైన భాషలో, ఉత్తమ పురుషలో చెప్పబడిన ఈ కథలు కథలుగా అనిపించవు.  రచయిత స్వంత అనుభవాలను తన డైరీలో కొన్ని పేజీలుగా రాసుకున్నట్లుగా తోస్తుంది.  నలభై, యాభై సంవత్సరాలు పైబడి, మధ్య తరగతి కుటుంబాలలో పెరిగిన పాఠకులు రచయిత చెప్పిన కథనంలో తమ తమ అనుభవాలను జోడించుకుని కథను అనుభవించగలగడానికి ఎంతో అవకాశం ఉంది.  ఎప్పుడైనా గత అనుభవాల అనుభూతి మధురమే కదా.  

‘మా అమ్మంటే నాకిష్టం’ కథ ఒక అమ్మ, కొడుకుల కథ.   కొడుకు తన చిన్నతనంలో ఇంట్లో దుర్గంధభూరితమైన టాయ్ లెట్ కి వెళ్ళలేక నాలుగైదు రోజులు వెళ్ళక, స్కూల్లో లాగూలో అయిపోయినప్పుడు అమ్మ వచ్చి “ఏడవకు. ఏమీ కాలేదు, ఏడవకు” అని చెప్పి,   క్లాసంతా శుభ్రం చేసి, మాస్టారికి “చిన్న పిల్లవాడు, వాడికేమీ తెలియదు, క్షమించాలి మాస్టరుగారు” అని చెప్పి, ఇంటికి తీసుకెళ్ళి ఒళ్ళంతా రుద్ది రుద్ది కడిగి, స్నానం చేయించి కొత్తబట్టలు తొడిగించింది అమ్మ.  పిల్లలముందు అవమానపడ్డా, అమ్మ ఇచ్చిన ధైర్యం  కొడుకు జ్ఞాపకాల్లోంచి సులభంగా వెళ్ళపోలేదు.  అదే అమ్మ పెద్దదయిన తర్వాత తానే ఆపుకోలేకపోతే?  కొడుకు తల్లి పట్ల చూపించిన అదే సహనం పాఠకుడి మనసుకు హత్తుకుపోకుండా ఉండదు.  

ఈరోజు మనం ‘స్టెయిన్ లెస్’ స్టీలు పాత్రలు (అదే కథ పేరు కూడా) వాడతాము కానీ వాటిమీద పెంచుకున్న మోజు పెద్దగా కనబడదు.  కానీ, అమ్మకి పెళ్ళయి వచ్చిన దగ్గరనుంచీ వెండి, బంగారాలు, కొత్త చీరలు కాదు, స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలమీద మోజు.  చివరికి ఆమె చనిపోయినప్పుడు చేసిన కర్మ కాండలలో కాకి పిండాన్ని ‘స్టీలు పాత్రలన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటానని’ కొడుకు అనుకున్నతర్వాతే ముట్టడంతో మరో కథ చివరకొస్తుంది.  ఆ స్టీలు పాత్రలంటే మక్కువ పెంచుకున్న అమ్మ మానసిక పరిస్థితిని చాలా సహజంగా చెప్పడం రచయిత గొప్పదనం.  

ఇంకో కథ ‘నశ్వరమ్ శవవ్-జీవం ఈశ్వరమ్’ అన్న కథలో నాన్న పోయి ఏడుస్తున్న సందర్బంలో కూడా మొగుడు వుండి, ఎవరితోనో లేచిపోయి తిరిగి వచ్చిన వైదేహి గురించి అడగిన అమ్మ జీవితం ఎప్పటిలాగే ఉంటుందన్న ధైర్యాన్నిస్తుంది కొడుక్కి.  

మొదటి సారి చిన్న బిందెతో వీధి కుళాయి నీళ్ళు తెచ్చినప్పుడు “కొడుకు చేతికి అంది వచ్చాడుకదమ్మా” అని అమ్మ స్నేహితురాలు అన్నప్పుడు గర్వంతో పొంగిపోయిన అమ్మని, “నాలుగు చెంబులతో ముగించండ్రా...ఊరికే ఒంటిమీద కుమ్మరించుకోకండి..” అని ఎక్కడలేని విధంగా బతిమాలుకునే అమ్మని, ప్లాస్టిక్ పైపు లోంచి పీలిస్తేకాని రాని నీళ్ళను, ముప్ఫై ఏళ్ళ తరవాత ఇంటిలోపల కుళాయి వస్తే వచ్చే ఆన్నందాన్ని కళ్ళకు కట్టినట్లు పాఠకుల ముందుంచే కథ ‘కొళాయిలో నీళ్ళోచ్చాయ్’.  

 ‘మనది కాని పాత్ర’ ను మనం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పోషించాల్సి వస్తూంటుంది.  ఇంకోళ్ళ విషయంలో అది గుర్తించడం సులభం, అది మనకే అన్వయమయ్యే సందర్భాలు దాటిపోతేనే కాని గుర్తించలేమని గుర్తు చేస్తుంది కథ.    

ఇలా సాగిపోతాయి కథలు.  అన్ని కథలూ కాక పోయినా, చాలా కథలు ‘అమ్మ’ను నిర్వచించేవే.  చిన్నప్పుడు పెరిగిన ఆ ఊరును గుర్తు చేసేవే.  అనువాదం బావుంది.  చక్కగా చదివించడమే కాకుండా, మూల రచయిత శైలిని, బహుశా, ప్రతిబింబించింది.  నేను పెరిగిన ఊరుని గుర్తు చేసింది.  చిన్న చిన్న ఉళ్ళలో పెరిగిన ఎవరి జీవితానికైనా ఈ కథలు అద్దం పడతాయి.  

పుస్తకం ఖరీదు రూ. 140 ($9).  ప్రముఖ పుస్తక విక్రేతలదగ్గరెక్కడైనా దొరుకుతుందన్నారు.  

 

* * *

‘తారాబాయి లేఖ’ రంగనాథ రామచంద్రరావు గారు అనువదించినదే మరో పుస్తకం.  ఈ పుస్తకానికి కన్నడ మూలం ఎం. ఆర్. దత్తాత్రి గారు వ్రాసిన ‘తారాబాయి పత్ర’.  ఇదొక చిన్న నవల.  తను లోనయిన ఒక తీవ్ర సంఘటన నేపధ్యంలో ఒక సాఫ్ట్ వేర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ తన ప్రేయసికి (భార్యకు కాదు) లేఖల రూపంలో వ్రాసిన గత జీవిత ప్రతిబింబాలు.  లేఖలు కాబట్టి ఇది కూడా ఉత్తమ పురుషలో రాసినదే.  

విక్రమ్ జాధవ్ ఉద్యోగ రీత్యా న్యూయార్క్ వెళ్ళి, కాకతాళీయంగా తన స్నేహితుడి ఆఫీసుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెర్రరిస్టు సంఘటనలో తుపాకి దెబ్బకు గురి అవడం జరుగుతుంది.   స్పృహ తప్పిపోయిన తనని ఎవరో ఆసుపత్రిలో చేరుస్తారు.  అప్పటినుంచీ కోలుకునీ, కోలుకోక, శారీరక బాధతో పాటు ఒంటరితనంతో పోరాడుతూ, తనతో కొద్ది రోజుల క్రితం వరకూ అక్రమ సంబంధం ఉన్న రంజనికి లేఖల రూపంలో తన మనసును వెళ్ళగక్కుకుంటాడు.  ఇక్కడ ఆ లేఖలు రంజనిని చేరాయా లేదా అన్నది అప్రస్తుతం.  

రంజని బెంగళూరులో తన సహ ఉద్యోగి.  అసలు రంజనికీ తనకీ ఉన్న సంబంధం కేవలం శారీరకమైనదే.  ఆ సంబంధాన్ని కూడా తెంచుకుని రంజని తననుంచి నిష్క్రమించింది.  అయినా ఈ కష్ట సమయంలో తన మనసులోని మాటలు చెప్పుకోవడానికి ఆమే కావలసి వచ్చింది. 

 

తనొక క్షత్రియ కుటుంబంలోంచి వచ్చిన మనిషి.  ఆరేళ్ల ప్రాయంలోనే తండ్రి చేసే చట్టవిరుద్ధమైన పనులకు తనకంటే కొంచెం పెద్ద అయిన అన్నయ్య హత్య చేయబడతాడు.  అది చిన్న మనసులో పెద్ద గాయం చేస్తుంది.  ఇంకొద్ది కాలంలోనే తండ్రి కూడా హత్య చేయ బడతాడు.  తల్లీ, తానూ, ప్రాణాలరచేతిలో పెట్టుకొని ముంబై నుంచి బెంగళూరులో ఉన్న మేనమామ దగ్గరకొస్తారు.  తండ్రి బ్రతికున్న రోజుల్లో ఉంపుడు గత్తెలు నాలుగైదు మంది ఉండేవారు.  అందులో ప్రధానమైనది తారాబాయి.  అవేమీ ఎవరికీ తెలియని రహస్యాలేమీ కాదు, ముఖ్యంగా తల్లికి.  ఇంట్లో ఏమైనా మంచి వంటకాలు ఆమె చేసిందంటే, అవి తారాబాయికి వెళ్ళాల్సిందే.  అంత బాహాటంగా ఉండేది.  ఆ చిన్న మనసులో కొంచెం ఎదిగిన అన్న ప్రభావంతో కూడా ఆ తారాబాయి మీద కోపం ఉండడంలో ఆశ్చర్యమేముంది?  చిన్నతనమంతా ఆ విధంగా సంక్షోభితంగా గడిచింది.  

తల్లీ, తనూ విడిగా ఒక అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడిపుతున్న రోజుల్లో గంగతో పరిచయం, ప్రేమ, చివరికి ఆమెను పెళ్ళి చేసుకోవడం జరిగాయి.  పెళ్ళయిన కొత్తల్లోనే తల్లి గుర్తు చేస్తుంది, తమ క్షత్రియ గుణం వల్ల ఒక్క స్త్రీతో తృప్తి చెందలేడని, గంగ లాంటి బ్రాహ్మణ పిల్ల తన లాగా తట్టుకుని భరించలేదని.  గంగ గర్భం దాలుస్తుంది, కాని బిడ్డ బతకదు.  అది గంగను తీవ్రమైన విచారానికి, నిరాశకు గురి చేస్తుంది.  భర్తతో కాపురం చేస్తున్నా, క్రమంగా శారీరకంగా దూరమవుతుంది.  ఆ సమయంలోనే తను రంజనికి దగ్గరౌతాడు.  అయితే తను అమెరికా రావడానికి కొద్ది రోజుల క్రితమే విడిపోతుంది. అయినా ఇప్పుడొచ్చిన కష్ట సమయంలో రంజనికి మాత్రమే తన మనసులో ఎప్పటినుంచో ఉబుకుతున్న బాధలు చెప్పుకోగలుగుతాడు.  అయినా రంజని తన తండ్రికి తారాబాయి ఎలాంటిదో ఆలాంటిదేగా!  తల్లితో అనుబంధం, గంగ విచారాన్నుంచి దూరం చేసే ప్రయత్నం, హాస్పిటల్ లో జరుగుతున్న ట్రీట్మెంట్, నర్సుతో పెంచుకున్న చనువు, చివరికి బాధ, నిరాశ, ఇలా ఎన్నో అనుభవాలతో ఉత్తరాలు పాఠకుడిని తన జీవితంతో తాదాత్మ్యం చెందిస్తాయి.  

చివరి ఉత్తరం “ప్రియమైన చెలీ!  నేనిక ఉంటాను.  మళ్ళీ బతికి వస్తే, ఇంకా నువ్వు నువ్వుగానే, నేను నేనుగానే మిగిలివుంటే మళ్ళీ నీతో మాట్లాడుతాను.” అంటూ ముగుస్తుంది.  

ముందరలో దుండగుల చర్యలను వివరిస్తూన్నప్పుడు, ఇదొక క్రైమ్ నవలేమోననే అనుమానం రాక పోదు.  అయితే మొదటి మూడు నాలుగు ఉత్తరాల తరవాత రచయిత ఉద్దేశ్యమది కాదని తెలుస్తుంది.  కొద్ది పేజీలే అయినా, నవలలో ఒక మనిషి పూర్తి జీవితం కనిపిస్తుంది.  నిష్కపటంగా తన మనసులో మాటలను రంజనితో, అంటే, మనతో కూడా పంచుకున్నట్లే అనిపిస్తుంది.   

రంగనాథ రామచంద్రరావు గారి అనువాదం బావుంది.  మూలంతో సరిపోల్చే అవకాశం లేదు కానీ, చదువుతూంటే ఒక తెలుగు మూలం చదివినట్లే ఉంది.  

పుస్తకం కాపీలు అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతాయని చెప్పారు.  వెల రూ. 140.00.

 

* * *

 

రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు’ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు వ్రాసిన కథా సంకలనం.  ఈ మధ్యనే వంగూరి ఫౌండేషన్ నిర్వహించిన ఏడవ ప్రపంచ తెలుగు మహా సభలలో పతంజలి శాస్త్రి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించిన విషయం సాహిత్యాభిమానులు చాలా మందికి విదితమే.  

పుస్తకంలో ‘రామేశ్వరం కాకులు’ తో కలిపి పన్నెండు కథలున్నాయి.  పుస్తకం వెనుక పేజీలో ఎవరు రాశారో తెలియదు కాని, ‘…his stories are creative puzzles’ అన్నది అక్షరాలా నిజం. అంతే కాదు, ‘తన సమాంతర వాస్తవికత దృక్పథానికి ఒక తాత్విక కోణాన్ని జత చేశారు’ అని.  కథల్లో వాస్తవానికి సమాంతరంగానే, అయితే వక్రీకరించబడిన ప్రతిబింబం కనబడుతుంది – ఏదో పికాసో వేసిన చిత్రం లాగా.  ఈ వక్రీకరణలో రచయిత పడే బాధ ఉంది.  రచయిత చెప్పే మాటల్లో, జరుగుతున్న సమ సమాజానికి ప్రతికూలించే వ్యవస్థపై కొంచెం బాధ, అశాంతి వ్యంగ్య రూపంలో స్పష్టంగా కనబడుతుంది.  కథ కంచికి, మనమింటికి వెళ్ళే కథలు కావివి.  కొన్ని కొన్ని మనతో పాటు మన వెంటే నడిచి వస్తాయి.  మనల్ని కలవరపెడతాయి.  ఆగమంటాయి.  రచయిత క్లిష్టమైన ఆలోచనా సరళిని, ఎన్నుకున్న రచనా శైలిని, కథా శిల్పాన్ని అంతా త్వరగా సులభంగా దాటి కదలిపోవాలంటే కష్టమే.  కథ పరిగెడుతున్నా, మనం కొంచెం ఆగి ఆగి వెనక్కి చూస్తూ మెల్ల మెల్లగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది.  కథల్లో కనిపించే ప్రతి అంశంలోనూ రచయిత అతి స్పష్టమయిన అవగాహన చూపించారు, అది మానవ సంబంధాలైనా, ప్రభుత్వ విధానాలైనా (bureaucracy), రాజకీయ వాతావరణమైనా, ప్రకృతి స్వభావమైనా.  

‘రామేశ్వరం కాకులు’, తనకిష్టం లేకుండా వ్యభిచారంలోకి నెట్టివేయబడి, చివరికి ఆత్మహత్య చేసుకున్న ఒక స్త్రీ కథ.  ఆమె ఎంచుకున్న నిర్ణయానిగురించి తెలిసి కూడా పరోక్షంగా ప్రోత్సహించి, అందుకు సాయపడిన ఎస్సై పాత్ర ముఖ్యమైంది.  ‘అతని ప్రపంచం నిండా సరిగా వెలుతురు పడని చీకటి’ అంటారు కథలో.  

‘కె. ఎల్. గారి కుక్కపిల్ల’ కథలో ప్రభుత్వ సంస్థల్లో ఎలా నిర్ణయాలు తీసుకోబడతాయి, ఎవరు ఎవర్ని ఎలా క్లిష్ట పరిస్థితుల్లో ఇరికించవచ్చు, బయట పడ్డం ఎంత కష్టం, అన్నది ఈ కథ సారాంశం.  కె. ఎల్. గారికి ఒక కుక్కపిల్ల చూపిన విశ్వాసం తన సమస్యకు సహాయం చేయడంతో కథ ముగుస్తుంది.  

‘వెన్నెల వంటి వెలుతురు గూడు’ చాలా చిన్న కథ.  రైల్లో తారస పడిన స్త్రీని, వివాహిత అని తెలిసి కూడా, ఆమె నిద్ర పోతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా తాకి ఏవో ఊహించుకునే మనిషి ఆమె ట్రైను దిగి తనకోసం వచ్చిన పదేళ్ల పిల్లాడిపై చెయ్యి వేసి నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ మగవాడి గ్రహింపులో వచ్చిన మార్పు ఎంత కొట్టొచ్చినట్లుందో చెప్పే కథ.  

సమాంతర వాస్తవికతకు అద్దంపెట్టు ‘గా.రా.’.  శాస్తజేతనన, తమ సంఘ మర్యాదనతిక్రమించి స్వార్ధంతో ప్రవర్తిస్తున్న ఇద్దరు బిక్షువుల భవిష్య కథ చెబుతాడు.  ఆ ఇద్దరిలో ఒకడు గా.రా. అనబడే గారపాటి రాఘవరావు, ఒక రాజకీయ నాయకుడు.  ఇద్దరూ గాడిదలుగా మారడం, గాడిదలయినా, తమ తమ మూల బుద్ధిని వదలక సమస్యల్ని పరిష్కారం చేయకుండా చేస్తున్నట్లు నటించే రాజకీయవేత్తల ఆలోచనలనల లోతులు చూపెట్టే ఒక సెటైర్ ఈ కథ.  మచ్చుకి కథలోని కొన్ని సంభాషణలు - “నీకు తెలీదు, సమస్యల్ని ఉత్తుత్తినే పరిష్కారం చేయకూడదు”, “మీడియా ఎటండి? మనం ఏం జెప్పినా ఆడిష్టం వచ్చినట్టు రాసేవాడన్నమాట”, “ముందు ఒక సంఘాన్ని నియమిద్దాం.  సమస్యలంటారా? మనం తొందర పడకూడదు.  ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటది.  సభలు జరగుతానే ఉండాల.  సమస్యలు ఇవాళ కాకపోతే రేపు”.

రామాయణంలో రాముడు, సీత అడవులకు వెళ్ళిపోగా, ఊర్మిళ తనకు తోడుగా ఒక తాబేలుని తెచ్చుకుని తన ప్రాణం కంటే ఎక్కువైన సీత పేరు పెట్టుకుని తన అశాంతిని దూరం చేసుకున్న కల్పిత కథ ‘కఛ్ఛప సీత’. 

‘ఉర్వి’ కథ ప్రకృతికి పురుషుడికి మధ్య జరిగే సంఘర్షణ.  “సౌందర్యానికి అనుభవం తప్ప రహస్యం ఉండదు” అన్న సాక్షాత్కారం ఆవిర్భవించే ఆలోచన ఈ కథకు మూలం.  ప్రకృతి, పర్యావరణాలు కలుషితం చెయ్యాలనుకునే పురుషుడి ఆలోచనలకు అతీతమివి అన్న భావన కనిపిస్తుంది.  ‘Violation of land is incest’ అని కథ చివరలో రాస్తారు.  అతిక్రమణే జరిగితే పురుషుడికి అది హింసాత్మకమైన అంతమే.  

చల్లని మంచు గాలులు, నీలి రంగు పల్చని తెరల వర్ణణలు, చాలా చోట్ల కనిపిస్తూంటాయి.  కథల్లోని కొన్ని కొన్ని వాక్యాలు మరచిపోలేం.  ఉదాహరణకు “నా గుండెకాయను కండచీమ కుట్టింది”, “నా కళ్ళు చిరిగేంత విచ్చుకున్నాయి”, “కంట్లో ముక్కలు ముక్కలుగా పడుతోందామె”, “అన్నివైపులనుండి వాళ్ళని పొలం పచ్చని దుప్పటీ కప్పింది”, “ఎండ కొత్త బ్లేడులా మోకాళ్లమీద పడి చురుక్కు మంటుంది”, “మెత్తని వేళ్ళు, పొడుగుపాల సిరల లాంటివి నా జుట్టులో కదుల్తున్నాయి”, “పసుపు పచ్చని గొడుగు కింద మాటలు వెతుక్కుంటున్న ఇద్దరూ సాయంత్రం వదలి పెట్టిన జ్నాపకాల్లా ఉన్నారు” లాంటివి.

కథలలో కొన్నింటిని అంత సులభంగా ఛేదించలేం.  రచయిత ఆలోచనలతో మనమూ నిమగ్నమవగలిగితేనే ఈ కథలకు న్యాయం చేకూర్చగలం.  

అన్ని ప్రముఖ పుస్తకావిక్రేతల దగ్గరా దొరికే ఈ పుస్తకం ఖరీదు రూ. 150.00. 

లిటిల్ డిటెక్టివ్’ డా. తెన్నేటి సుధాదేవి గారి చిన్న సైజ్ డిటెక్టివ్ నవల.  ఇది వంగూరి ఫౌండేషన్ వారి తొంభై అయిదవ ప్రచురణ.  

ఇదివరలో తెన్నేటి సుధాదేవి గారు వ్రాసిన ‘వ్యాస కదంబం’ ఈ శీర్షికలో పరిచయం చెయ్యడం జరిగింది.  ఆవిడ ఒక కథా రచయిత్రిగా, ఒక వ్యాసకర్తగా, ఒక నాటక కర్తగా సాహితీ మిత్రులకు చాలా పరిచయం.  కాని, ఆవిడ ఒక డిటెక్టివ్ నవల కూడా వ్రాసారా అంటే కొంచెం ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవం.  

అయితే ఈ నవల ఇప్పట్లో రాసింది కాదు.  దాసరి నారాయణరావు గారు నిర్వహించిన ‘ఉదయం’ వార పత్రికలో 1988లో ధారావాహికంగా వచ్చిన ఈ నవల ఇప్పటికి ఒక పుస్తక రూపం దాల్చింది.  ముందు మాటలో భువనచంద్ర గారు చెప్పినట్లుగా డిటెక్టివ్ సాహిత్య సృష్టిలో రచయిత్రుల పాత్ర కొంచెం తక్కువే.  నాకైతే తెలీదు ఎవరైనా ఉన్నారేమోనన్నది.  అలాంటిది సుధ గారు 1988 ప్రాంతాలలోనే ఈ ప్రయత్నం చేయడం తప్పక హర్షించదగ్గ విషయమే.

  

ఒక పారిశ్రామిక వేత్త, బాబుల్ జైన్, ఆత్మ హత్యో, హత్యో తెలియని పరిస్థితిలో తన అరవయ్యవ పుట్టినరోజు పండగ జరుపుకుంటున్న సాయంత్రం, పై అంతస్తు నుండి క్రిందపడి మరణించడంతో మొదలవుతుంది నవల.  సంబంధం లేదనిపించే హత్యలు మరి కొన్ని.  ప్రజలకు అతిసన్నిహితంగా, అత్యంత నిష్కల్మషంగా పనిచేసే క్రిస్టియన్ ప్రీస్ట్ మరణం, తప్పిపోయిన ఒక యువతి అయితే అదే చోట సృహ తప్పిపడి ఉన్న మరోయువతి, ప్రొఫెసర్ గోఖలే సృష్టించిన వాయు శకటం ఫార్ములాను దొంగిలించాలనుకునే విదేశీ కుట్ర, భయంకరమైన క్రూరత్వంతో నిండిన ‘ఆఫ్రిదీయులు’, వారుపయోగించే విచిత్ర ఆయుధాలు, మధ్య మధ్యలో ఎలా వస్తుందో తెలియకుండా వచ్చే గజ్జెల సవ్వడి, వీటన్నిటితో ఉత్ఖంటతో సాగుతుంది నవల.  ఇంతకీ వీటన్నిటికీ ఉన్న సంబంధాన్ని కనిబెట్టే ‘లిటిల్ డిటెక్టివ్’ ఎవరు’? ఎలా సాధించాడు?  సువర్ణా పబ్లిక్ స్కూల్లో చదివే విద్యార్థి సుధీర్ బాసు తెలివితేటలెలాంటివి?  అతి క్లిష్టమయిన ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించగలిగాడు?   నవల చదవాల్సిందే.  ఒక్క రెండు మూడు గంటలలో ఆపకుండా చదివించే నవల ఇది. 

డిటెక్టివ్ నవలకుండాల్సిన గుణాలన్నీ రచయిత్రి పండించారీ నవల్లో.  పాఠకుడి మేధకు అందకుండా కేవలం లిటిల్ డిటెక్టివ్ మాత్రమే ఆలోచించగలిగే ఘటనలు బావున్నాయి, ముఖ్యంగా నవల మొదట్లో.  అయితే, సగం నవల పూర్తి అయిన తరువాత దగ్గర నుంచీ, కేవలం ఒక సినిమాను దృష్టిలో పెట్టుకుని రాసినట్లు అనిపించక మానదు.  మొత్తం అంతా కల్పితమే అయినా, విలన్లు వేసే ఎత్తుగడలు, చివరికి డిటెక్టివ్ ఒక టిపికల్ తెలుగు సినిమా హీరోగా మారి విలన్ దుర్గాన్ని ఛేదించి, పాఠకుల మనసులలో కొంచెం సింపతీ వచ్చేలా హీరోయిన్ ను పోగొట్టుకోవడం లాంటి క్లైమాక్స్ చొప్పించడం అవసరమా అని అనిపించింది. 

చాలా సులభ శైలిలో నవలను నడిపించారు రచయిత్రి.  

కినిగేలోనూ, నవోదయా బుక్ హౌస్ హైదరాబాదు లోనూ దొరికే ఈ పుస్తకం ఖరీదు రూ. 150.  

 

*****

సంక్షిప్త సమీక్ష

అసాధ్యుడు (పివి మొగ్గలు) - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

సమీక్షకులు: అంబటి భానుప్రకాశ్ ( పిహెచ్.డి స్కాలర్ )

     

రాజకీయంలో ధృవతార, సాహిత్యంలో సితార మన పివి. 

 

భారత ప్రధానిగా, ఆర్థిక సంస్కరణలవేత్తగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా, కథారచయితగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా, నవలాకారుడిగా పేరున్న పీవీ పూర్తి పేరు పాములపర్తి వెంకటనరసింహారావు.1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పూర్వ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరవాసులైన పాములపర్తిరంగారావు,రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంవల్ల పాములపర్తి వెంకటనర్సింహారావుగా మారారు.  

     పివి శతజయంతిని పురస్కరించుకొని మొగ్గలు ప్రక్రియ సృష్టికర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మొగ్గలు కవితా ప్రక్రియలో పివి సమగ్ర స్వరూపాన్ని కళ్ళముందుంచారు. నిఖార్సయిన తెలంగాణవాది పీవీ. రాజకీయనాయకుడిగానేకాక సాహితీవేత్తగా వివిధ రచనలు చేసిన పీవీ నరసింహారావు మృదుస్వభావి. సరస సంభాషణా చతురుడు. బహుభాషాకోవిదుడైన పివిని పలుకోణాల్లో దర్శించి, స్పృశించి, వారి దార్శనికతను, మేధాసంపత్తిని నిర్వచించే ప్రయత్నం చేశాడు.

 

"అత్యున్నతమైన దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన

మొట్టమొదటి దక్షిణ భారతీయ రాజకీయ దురంధరుడు

తెలంగాణ ముద్దుబిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు పివి"

                                                

 ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లుగా పివి బాల్యం నుంచే సామాజిక బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నాడు. వందేమాతరపోరాటంతో పివి రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. రామానందతీర్థ అనుయాయుడై గాంధీ అడుగుజాడల్లో నడిచినవాడు. అపారమైన దేశభక్తిని నింపుకున్నవాడనే విషయాన్ని ఇలా అంటాడు.

 

"పూవు పుట్టగానే సహస్రదళాలతో పరిమళించినట్లుగా

బాల్యంలోనే అసమాన పాండిత్యాన్ని ప్రదర్శించిన దిట్ట

సామాజికతను ఒంటబట్టించుకున్న అపారదేశభక్తుడు పివి"

       సాహితీవేత్తగా, విద్యావేత్తగా విద్య గొప్పతనాన్ని తెలిసినవాడు పీవీ. విద్య చేతనే మానవ సమగ్ర వికాసం కలుగుతుందని, మాతృభాషాబోధన విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దగలదని భావించాడు. వీరి ఆలోచన వల్లనే తెలుగు అకాడమీని, గురుకులాలను,  నవోదయాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటర్ విద్యకు రూపకల్పన చేసి ఇంటర్ విద్యా పితామహుడిగా పిలువబడ్డాడు. ఈ కీర్తి పీవీ దార్శనికతకు నిదర్శనం.  

 

"నిరుపేదలవారికి విద్య అందించాలనే సదాశయంతో

గురుకుల పాఠశాలలను నెలకొల్పిన విద్యాజ్యోతి

విద్యారంగ వ్యవస్థలోనే పెనువిప్లవం గురుకులాలు"

        దేశం ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని పదవిని చేపట్టి, ఆర్థిక సంస్కరణలతో ప్రగతిపథం వైపు పరుగులు పెట్టించిన ఘనత పీవీ నరసింహారావుది. వీరు రూపొందించిన పలు ఆర్థిక విధానాలు ఎప్పటికీ ఆదర్శనీయాలు. అదే విషయాన్ని తన మొగ్గల్లో ఇలా చెప్పాడు.

 

"దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలనే చెట్లను నాటి

భవిష్యత్తుకు సరళీకరణ ఫలాలను అందించిన ఘనుడు

భారతదేశ నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి"

 

     నిరంతరం దేశప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తూ, అలుపెరుగని ప్రభుత్వ కార్యాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, తనలోని సాహితీ సువాసనల్ని పరిమళింపజేశాడు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షమనే మహాకావ్యాన్ని ‘సహస్రఫణ్’ పేరుతో హిందీభాషలోకి అనువాదం చేశాడు. తెలుగే కాకుండా 17 భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల పాండిత్యం అతని సొంతం. అతని మరాఠీ భాష ప్రావీణ్యతకి నిదర్శనం "అబల జీవితం". తెలంగాణ మాండలికంలోనూ “గొల్లరామవ్వ”  కథనందించాడు.

 

"విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు" నవలను

హిందీలోకి "సహస్రఫణ్" గా అనువదించిన పండితుడు

అపురూపమైన అనుసృజనకు అసలైన భాష్యం పివి"

 

     మైనార్టీ ప్రభుత్వం నడుపుతూ, నిరంతరం ఎదురౌతున్న సమస్యల ఆటుపోట్లకు గురయ్యాడు. మౌనమే అలంకారప్రాయంగా ధరించి సమాధానం ఇచ్చిన బుద్ధిమంతుడు.

 

"రాజకీయంలో ఎప్పుడూ మౌనభాషియై ఒప్పారుతూనే

అనేక విమర్శలకు మౌనంతోనే సమాధానమిచ్చినఘనుడు

మౌనాన్ని అలంకారప్రాయంగా ధరించిన జ్ఞానశిఖరం పివి"

 

      ‘మదిలో వికసించిన సంస్కరణ బీజాలు కల్పతరువు క్షేత్రాలు సంస్కరణ ఫలాలు’ అంటూ సాగిన ఈ మొగ్గలో చక్కని విశేష ప్రతిభ కనిపిస్తున్నది వికసించిన బీజం, పూసిన కల్పతరువు, సంస్కరణ ఫలాలు ‘మొక్క ఎదిగి ఫలాలను అందించింది’ అనే విధంగా చక్కని కవితాత్మకత కనిపిస్తున్నది. అంత్యానుప్రాసాలంకారంలో అమరిపోయింది.           

                        

"పివి మదిలో తొలచి వికసించిన సంస్కరణల బీజాలు

భారతదేశమంతటా పూసిన కల్పతరువుల క్షేత్రాలు

నేటి దేశాభివృద్ధికి ఆధారం పివి సంస్కరణ ఫలాలు"

 

  దేశాభివృద్ది కోసం ప్రపంచ దేశాలతో స్నేహసంబంధాలు నెలకొల్పే ప్రయత్నాలు చేశాడు. పివి అనుసరించిన విదేశాంగ విధానాన్ని సరళీకృతం చేసిన విధానం నేటికి అనుసరింపబడుతున్నది. దానికి వారి చిత్తశుద్ధి, వేసిన పునాది మహోన్నతమైనదిగా గుర్తించవచ్చు. దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక విధానానికి, విదేశీపెట్టుబడులకు,  అంతర్జాతీయ ఒప్పందాలను సరళీకృతం చేసిన మేధావి.

 

"అంతర్జాతీయ ఒప్పందాలను అవలీలగానే కుదిర్చి

వాణిజ్యలావాదేవీలను సరళీకృతం చేసిన సంస్కర్త

నేటి సంస్కరణఫలాలు నాడు పివి నాటిన విత్తనాలు"

 

     దేశ ప్రధానిగా విశేష ప్రతిభను చూపిస్తూ, సమర్థవంతమైన పాలకుడైనా, కొన్ని విషాద సంఘటనలు వారిని వెంటాడాయని చెప్పవచ్చు. వాటిని ‘అయోధ్య’ పేరుతో వాస్తవిక సంఘటనలను కళ్ళముందు ఉంచారు.  ఆ విషయమే ఇలా మొగ్గలో ప్రతిబింబించింది.

 

"రావణకాష్టంవలె రగిలిన అయోధ్య బాబ్రీమసీదు ఘటన

భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వాస్తవిక సంఘటన

సత్యాసత్యాలను విశదీకరించిన పివి గ్రంథం "అయోధ్య”"

 

      అచ్చమైన తెలంగాణవాడిగా, తెలుగువాడిగా,  వేషభాషలను ప్రతిబింబిస్తూ ప్రధానిగా సాహితీవేత్తగా, మహోన్నత కీర్తిప్రతిష్టలను అందుకున్న పీవీ నరసింహారావు ధన్యజీవి. ఆయన జీవితాన్ని స్పూర్తివంతంగా అందరికీ అర్థమయ్యేలా అక్షరబద్దం చేశారు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్. ‘అసాధ్యుడు’ కవితా ప్రక్రియ మొగ్గలైనా పివి విశేషప్రతిభను, మేధోసంపత్తిని పారిజాతంలా విరబూయించారనటం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

 

అసాధ్యుడు (పివి మొగ్గలు) పుస్తకం ప్రతులకై  రచయిత డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  ని చరవాణి: +91-9032844017 లో సంప్రదించవచ్చు.

*****

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 6
Anchor 7
bottom of page