top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

“దీప్తి” ముచ్చట్లు

ఆ నీలికళ్ళమ్మాయి 

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"ఆద్యా! ఆ అమ్మాయి ఒక్కతే కూర్చుని ఉంది. వెళ్లు, వెళ్ళి మాట్లాడు" నాలుగోసారి నేనా మాట చెప్పటం.

 

పార్కులో కోలాహాలంగా ఉంది. ఆద్య స్నేహితులందరూ ఆటల్లో మునిగిఉన్నారు. ఆద్య కూడా ఆట ధ్యాసలో ఉంది. మంచినీళ్ళ కోసమని నా దగ్గరికి వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నాను. కొత్తగా పార్కులో కనబడుతున్న ఆ అమ్మాయిని ఆటల్లో కలుపుకొమ్మని. ఆ అమ్మాయి ఒంటరిగా కూర్చుంటే ఏదోలా ఉంది నాకు.

ఆద్య మంచినీళ్ళు తాగుతూనే ఒకసారి ఆ రాతిబెంచీపై కూర్చున్న ఆ నీలికళ్ళ కొత్తమ్మాయి వైపు పరిశీలనగా చూసింది. "ఓ పలకరింపుకీ పలుపలువిధాల తలపోతలా?" మనస్సులోనే విసుక్కున్నాను. చూస్తే బహుశా ఆద్య వయసే అయుండాలనిపించింది. లేదంటే ఒక సంవత్సరం చిన్నో, పెద్దో అయుండాలి? కాకపోతే ఆ అమ్మాయి ఆడుకునేందుకు అంత ఆసక్తిగా ఉన్నట్టు లేదు. ఓ గంట నుంచీ అలా కూర్చుని అందరినీ చూస్తోందే కానీ, ఎవరినీ పలకరించే ప్రయత్నం చేయనేలేదు. అలాగని నిర్లక్ష్యంగానూ లేదు. ఎందుకనో ఆ అమ్మాయిని పలకరించాలంటే ఏదో తటపటాయింపు ఆద్యలో. ఇలాంటి సందర్భాలు, సందిగ్ధాలు ఆద్యకి కొత్త కాదు.

నేను పెరిగిన దేశం, చుట్టూ ఉన్న మనుషుల తీరూ వేరు. ఆద్య పెరుగుతున్న పరిస్థితులు వేరు. మా చిన్నప్పటి రోజుల్లో మనిషిని పలకరించేందుకు, స్నేహం ఏర్పరుచుకునేందుకు ఆలోచన, కాసింత సమయం ఉంటే చాలు. ఇప్పుడో?  ఇప్పుడు, అందునా నేను చూస్తున్న ఈ పడమటి దేశాన వ్యక్తి స్వేచ్ఛకి ప్రాధాన్యం. పదకొండేళ్ళకే బాల్యావస్థ దాటి వ్యక్తిత్వం ఏర్పరుచుకుంటూ వ్యక్తులుగా మారిపోతూంటారేమో ఇక్కడి పిల్లలు, అంత తేలిగ్గా వాళ్ళ పరిధిలోకి చొచ్చుకెళ్ళలేము.  ఆద్యా తన చిన్నప్పటిలా లేదు. ఇంతకుముందయితే, నేను చెప్పక్కర్లేకుండానే తానే వెళ్ళి ఇట్టే పరిచయాలేర్పరుచుకునేది. అలా అనుకుంటూంటే, ఆ అమ్మాయీ ఇతర పిల్లలని పలకరించేందుకు మొహమాటంతోనే అలా కూర్చునుందేమో అనిపించింది. దానితో మరో సారి చెప్పాను ఆద్యకి, కలుపుకొమ్మని.

మరొక్కసారి చూసింది ఆ అమ్మాయి వైపు. తటపటాయిస్తూనే దగ్గరికివెళ్ళింది. "హాయ్" అని పలకరించబోతూంటే ఆ అమ్మాయి చటుక్కున తలతిప్పుకుంది. స్ట్రేంజర్ డేంజర్?  అనుకునుంటుందా? ఏదేమయినా ఆద్యకి కొంత అవమానంగా అనిపించి, బలవంతం చేసిన నా వైపు చురుగ్గా చూసి, ఆడుకునేందుకు తన స్నేహితులవైపు వెళ్ళింది.

నాకూ ఆ కొత్తమ్మాయి ప్రవర్తన వింతగా తోచింది.

ఈ కాలం పిల్లలు అలా ఒంటరిగా కూర్చోవటమంటూ ఉంటే చేతిలో ఏ ఫోనో, లేక ఐప్యాడో ఏదో ఒక ఎలెక్ట్రానిక్ పరికరం చేతిలో ఉండాల్సిందే. ఆ అమ్మాయి చిత్రంగా ఖాళీగా కూర్చుని ఉంది. ఆడుతున్న పిల్లలవైపే చూస్తూ కూర్చుంది. చేతిలో ఏవో చిన్న గులకరాళ్ళు. ఆ నీలిరంగు కళ్ళలో ఆకాశమంత అభావం  దాగుంది. వయసుకి మించిన గాంభీర్యం ఆ కూర్చున్న విధానంలో! 'సిగ్గరి కాబోలు, కొత్తవాళ్ళతో కలువలేదేమో!' ఆ ఆలోచన రాగానే ఆ అమ్మాయినుంచి తల తిప్పి పిల్లలకేసి దృష్టి సారించాను.

ఉన్నట్టుండి పిల్లల్లో ఏదో కలకలం. వైల్డ్ ఫైర్! కొంచెం దూరంలో ఉన్న అడవుల్లో వైల్డ్ ఫైర్ మొదలయింది. దట్టంగా మేఘాలని కమ్మేస్తూ పొగ కనబడుతూ ఉంది. మేముండే ఈ "ఎల్ సెరిటో" ప్రాంతంలో అడవుల్లో కార్చిచ్చు కొత్తేమీ కాదు. క్షణాల్లో అప్రమత్తమయ్యారంతా. ఎవరి పిల్లలని వాళ్ళు తీసుకుని పార్కింగ్ వైపు వెళుతున్నారు. కంగారుగా నేనూ ఆద్యని పట్టుకుని, చిన్నవాడయిన అర్ణవ్ ని దాదాపుగా పార్కంతా గాలించి పట్టుకుని పార్కింగ్ వైపు వెళుతూ, ఆ కొత్తమ్మాయి కూర్చున్న బెంచీ వైపు చూసాను. బెంచీ ఖాళీగా ఉంది. ఆ నీలికళ్ళ కొత్తమ్మాయి అక్కడ లేదు.  ఇంటికి వెళుతున్నప్పటికీ ఎక్కడో ఆ అమ్మాయిపై ధ్యాసే. ఆ అమ్మాయి చుట్టూ  పెద్దవారెవరూ కనబడలేదు.

 

అంతలోనే ఎక్కడికి వెళ్ళింది?

 

క్షేమంగా ఇంటికి చేరుంటుందా?


***
 

"అమ్మా, ఆ నీలికళ్ళ కొత్తమ్మాయి గుర్తుందా?" రెండు రోజులయ్యాక ఓ  సాయంత్రం ఇంటికి వస్తూనే అడిగింది ఆద్య.

"ఎవరూ? ఆ రోజు స్టేట్ పార్క్ లో చూసినమ్మాయా?"

"అవును. ఆ అమ్మాయి ఈ రోజు మా ఫ్రెంచ్ క్లాస్ లో కనబడింది. మా ఇద్దరికీ ఒకే టీచర్. నన్ను చూసి, గుర్తుపట్టి పరిచయం చేసుకుంది. పేరు ఎలీనా. ఫ్రాన్స్ నుంచి వాళ్ళ అమ్మ ప్రాజెక్టుపని మీద వచ్చారట. ఈ సంవత్సరం ఇక్కడే ఉంటారట" ఆద్య మొహంలో సన్నగా సంతోషం.

"ఓ! అదన్నమాట సంగతి. భాష రాకే అలా మొహం తిప్పుకుందేమో కదా ఆ రోజు?" కుతూహలంగా అడిగాను.

"అదేమీ లేదు. ఇంగ్లీషులోనే చక్కగా మాట్లాడింది మరి ఈ రోజు. ఆ రోజెందుకలా చేసిందో ? ఇపుడు ఒకే స్కూలయ్యేసరికి దగ్గరనిపించానేమో మరి?" ఆద్య తనకు అనిపించిన కారణం చెప్పింది.

ఆ తరువాత ఎలీనా ఆద్యకి, ఆద్య తోటివాళ్ళందరికీ మంచి స్నేహితురాలయింది. ఆ అమ్మాయి ఐ.క్యూ చూస్తే వయసుకి మించిన తెలివితేటలున్నట్టుగా అనిపించేది.

ఆ అమ్మాయి ఎవరికి తగ్గట్టుగా వారితో కలివిడిగా భలే అల్లుకుపోతుంది. మొదటిరోజు చూసినప్పటికీ, తనకై కలిసిపోయిన అమ్మాయికీ ఎంతో తేడా! అందునా, నన్ను ఇండియన్ పిల్లల్లా "ఆంటీ" అని పిలవటం నచ్చింది. ఇక్కడి పిల్లలెవరూ అలా పిలువరు. ఆ సార్వజనీన "ఆంటీ" అనే పిలుపును తిట్టుకుంటాము కానీ, పిల్లలు మరీ అంత ఫార్మల్ గా ఇంటిపేరుతో పిలవటం కంటే "ఆంటీ" అంటూంటే ఆ దగ్గిరతనం వేరేలా ఉంటుంది. బావుంటుంది.


***


ఓ సంవత్సరం తరువాత వాళ్ళ అమ్మ ప్రాజెక్టు పని అయిపోయిందనీ, ఆ వారాంతం ఫ్రాన్స్ కి తిరిగెళ్ళిపోతున్నామనీ చెప్పింది ఎలీనా. మాకు బెంగగా అనిపించింది. సంవత్సరంలో ఎంత దగ్గరయిపోయిందీ? ఆద్యకి సరైన స్నేహితురాలు. వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుండనిపించింది. అదే మాటంటే ఆ నీలికళ్ళలో ఎంత ఆనందమో!

వాళ్ళమ్మ కి ఫోన్ చేసి ఆ శుక్రవారం సాయంత్రం వాళ్ళిద్దరినీ ఇంటికి రమ్మన్నాను. ఇతర స్నేహితులనీ పిలిచి, చిన్న ఫేర్ వెల్ పార్టీలా ఇద్దామని. వాళ్ళమ్మ ఇల్లు ఖాళీ చేసి, సర్దుకునే పనులు ఇంకా మిగిలున్నాయని చెప్పి సున్నితంగా రాలేమని చెప్పింది. ఆద్య స్నేహితురాలికని మంచి బహుమతి కొని ఉంచింది. వెళ్ళేముందు ఇచ్చేందుకని.

ఆ శుక్రవారం పొద్దునే ఎలీనా వాళ్ళమ్మ మెసేజ్. ఎలీనాని వాళ్ళింటి దగ్గర పికప్ చేసుకుని స్కూల్ లో దింపగలనా అని అడుగుతూ!

"అదెంతపని?  తప్పకుండా! ఎనిమిదీ పది వరకు మీ ఇంటి వద్ద ఉంటాను" అని చెప్పాను.

అన్నట్టే ఆద్యని స్కూలుకి తీసుకెళుతూ మధ్యలో వాళ్ళింటి వద్ద ఆగాను. ఎలీనా కారులో కూర్చుందన్న మాటే కానీ, ముభావంగా ఉంది ఆ రోజు. అరచేతిలో నున్నటి గులకరాళ్ళని పట్టుకుని తిప్పుతుంది.

 

ఆ అమ్మాయికి నచ్చే పాటలు పెట్టి అద్దంలోనించి ఆ అమ్మాయిని చూసాను. మౌనంగా ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. ఇంతకుముందెపుడయినా ఇలా కార్లో తీసుకెళుతుంటే, నా కార్ లో స్పాటిఫై నుంచి వినబడే తెలుగు, హిందీ భాషల పాటలనీ శ్రద్ధగా వినేది. తొందరగానే పట్టేసి, నాతో పాటుగా హమ్ చేసేది. మెచ్చుకోలుగా ఎలీనాని చూసినప్పుడల్లా,  ఆద్య నా వైపు చూసి ముసిముసిగా నవ్వేది. ఆద్యకి నా పాటల పాటవం అబ్బలేదని నాకు కినుక అని బాగా తెలుసు. ఆద్య తనకి నచ్చిన, భాష తెలీని కొరియన్ పాటలని ఇట్టే పట్టేస్తుంది కానీ, నేను మెచ్చే పాటలేవీ దానికి పెద్దగా నచ్చవు. నేర్చుకునే ప్రయత్నమూ చేయదు. కానీ, నాకు ఇష్టమైన పాటలన్నీ ఎలీనాకి నచ్చటం నాకు భలే నచ్చేది. అదేంటో, ఆ రోజు మాత్రం ఆ అమ్మాయి వింతగా కనబడింది. వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందేమో అనుకున్నాను కానీ, మొదటి రోజు చూసిన వింతైన గాంభీర్యం ఆ అమ్మాయి మొహంలో.

స్కూలు దగ్గర వాళ్ళిద్దరినీ దించి, ఆఫీసు దారిలో ఉన్నప్పుడే స్కూలు నుంచి అర్జెంట్ ఆటోమేటెడ్ కాల్ వచ్చి, కంగారుగా వెనుతిరిగాను. స్కూలులో ఏదో అగ్నిప్రమాదమట.

 

నేను తిరిగి స్కూలుకి వెళ్ళేసరికి పొడుగాటి లైన్లలో కార్లు. అంతటా అగ్నిమాపకదళం వారి వాహనాలు, వెలుగుతూనూ, వెలుగుతోనూ భీతికొలిపే ఎరుపు, నీలం రంగుల బల్బులు, శబ్ధంతో మెదడుని బేధించే సైరన్లు, దట్టంగా అలుముకున్న పొగ. ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదట. అదృష్టం కొద్దీ పార్కింగ్ లాట్ లో ఎవరూ లేనపుడు మొదలైన మంటలు వేగంగా చుట్టుముట్టేకంటే ముందే పిల్లలనీ, స్టాఫ్ నీ తరలించారట. అంత హడావిడిలోనూ మెసేజులిస్తూ తల్లిదండ్రులకి వివరాలు తెలుపుతున్న స్కూలు స్టాఫ్ ని అంతటి ఆందోళనలోనూ అభినందించకుండా ఉండలేకపోయాను. ఎలీనానీ ఇంటికి తీసుకెళుతున్నానని ఎలీనా తల్లికి మెసేజ్ చేసాను.

స్కూలు ముందు, వరుసగా కదల్చలేనంతగా చిక్కుకుపోయిన కార్లన్నిటినీ దారి మళ్ళించి, పిల్లలను ఉంచిన బిల్డింగ్ వైపు తిప్పారు. ఆద్యనీ, ఎలీనానీ నాతోపాటు ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటి దారిలో ఆద్య, ఆ సంఘటన తాలూకు వివరాలు చెబుతోంది. స్కూలు స్టాఫ్ తమనెలా అప్రమత్తం చేసిందీ, ఎంత సమయస్పూర్తిగా ప్రవర్తించిందీ చెబుతుంది. వాళ్ళకి ఇలాంటి ప్రమాద సంఘటనల్లో ఎలా సంయమనం పాటించాలి, రక్షించుకోవాలి అనేది ముందుగానే డ్రిల్లు చేసి చూపిస్తారు. నిజంగా ప్రమాదం ఎదుర్కున్నప్పుడు ఆ అనుభవం పిల్లలకీ, స్టాఫుకీ పనికొచ్చేలా. ఆద్య క్షణం ఆగకుండా మాట్లాడుతున్నప్పటికీ ఎలీనా మాత్రం ఇంకా మౌనంగానే ఉంది.  ఆ అమ్మాయి మూడ్ అస్సలు బాలేదు. అప్పుడు అడిగాను. "భయపడ్డావా? ఆర్యూ ఫైన్? " అని. ఆ అమ్మాయి అడ్డంగా తలాడించబోయినట్టే అనిపించి, వెంటనే తల తిప్పుకుంది. ఆ అమ్మాయి నీలి కళ్ళలో ఏదో దిగులు. ఇంట్లో ఏమయినా సమస్యలున్నాయేమో?

సాయంత్రం వరకూ ఇంట్లో ఉంది కానీ, ఏమీ మాట్లాడలేదు. మాతో పాటే లంచ్ చేసి, కాసేపు పడుకుంటానంటూ నిద్రలోకి జారుకుంది.

అంతలోపు ఎలీనా వాళ్ళమ్మ నుంచి ఫోన్ వచ్చింది. పికప్ చేసుకునేందుకు వస్తున్నానని. ఎలీనా వాళ్ళమ్మ ఎలీనాని తీసుకెళుతుంటే చూసాను. ఎందుకో ఆమె మొహం ఎర్రగా కందిపోయి ఉంది. ఎప్పటిలా తీయగా పలుకరించలేదు. వాళ్ళ మూడ్ చూసి, వాళ్ళు వెళ్ళేలోపు కలవటం కష్టమని తెలిసిందేమో, ఆద్య తాను కొన్న గిఫ్ట్ ఇచ్చి, ఎలీనాని గట్టిగా హత్తుకుంది. ఎలీనా నేనూహించినట్టుగా కదిలిపోలేదు. ఆ అమ్మాయి నీలికళ్ళలో పొద్దున్నించీ అదే అంతుపట్టని అభావం. డినయల్ బిహేవియర్ కాబోలు. వదిలి వెళ్ళటం కష్టమయినపుడు ఆ భావాన్ని అంగీకరించరు ఆ వయసు పిల్లల్లో కొందరు. వాళ్ళు కారులో కూర్చున్నాక చూసాను. ఎలీనా, వాళ్ళమ్మతో ఏదో వాదిస్తుంది.

నిట్టూర్చి ఇంట్లోకి వచ్చాను. ఆద్య నా కోసమే ఎదురుచూస్తున్నదానిలా కూర్చునుంది. "అమ్మా. నీకు తెలుసా? ఎలీనా సూపర్ నేచురల్ గర్ల్. మామూలు అమ్మాయి కాదు."

"నీ మొహం. ఆ అమ్మాయి పాపం ఏదోలా ఉంది. స్నేహితులని వదిలివెళ్ళలేకేమో?"

"అదంతా కాదమ్మా! నాకు ఎలీనా బాగా తెలుసు. అంత చిన్నవాటికి దిగులుపడదు. ఆ అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ అమ్మాయి నాతోపాటే ఉంది. నన్ను కెఫెటేరియా మీదుగా వెళదామంది. అలా వెళుతూంటే, లంచ్ లేడీ ఏప్రాన్ చివర నేను ఫైర్ చూసాను. ఎలీనా వెంటనే పక్కకి తిరిగి, చేతిలోని రాళ్ళు రుద్దగానే, అవే మంటలు పార్కింగ్ లాట్ నుంచి వచ్చాయి."

"సరే! నువ్వు ఆ టీవీ చూడటం తగ్గించు కాస్త! ఫైర్ బెండర్లూ అవీ ఇవీ చూసి, ఇదిగో అన్నిటికీ ఏవేవో ఊహించుకుంటున్నావు?."

"ఏదో రహస్యం ఉంది మమ్మీ, ఆ నీలి కళ్ళు వెలుగుతూంటే చూసాన్నేను." గొణిగింది ఆద్య.


ఆ మాటలు విని, దాని తమ్ముడు అర్ణవ్ పరిగెత్తుకొచ్చాడు. "అక్క చెప్పింది నిజం కావచ్చు. నాకిప్పుడు గుర్తువస్తోంది. గత నెల నువ్వు లేనపుడు, డాడీతో కలిసి పూల్ పార్టీకి వెళ్ళానా?  శాలినీ వాళ్ళింట్లో పూల్ పార్టీలో అందరూ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు ఎలీనా మాత్రం స్విమ్మింగ్ రాదంటూ వెళ్ళి బార్బిక్యూ దగ్గర కూర్చుంది. నేను కార్న్ కాబ్స్ తీసుకోవటానికి వెళ్ళినపుడు చూసాను. స్మోక్ వచ్చినప్పుడల్లా ఎలీనా కళ్ళలో స్పార్క్స్ వచ్చాయి. ఏవో రాతి ఎమ్యులెట్స్ ఉన్నాయి ఆ అమ్మాయి చేతిలో. వాటిని రుద్దగానే, ఫైర్ తగ్గిపోయి, స్పార్క్స్ మాయమయ్యాయి." ఫిక్షన్ సినిమాలు ఎక్కువగా చూసే మా వాడి ఊహాగానాలు నాకలవాటే. నిజమనిపించేంత సత్యదూరమైన కథలల్లటంలో దిట్ట వాడు. ఎటొచ్చీ వాడి తెలుగాంగ్ల భాష రాయటానికీ చేయి తిరగదు నాకు.

"అవునా? మరి నాకెందుకు చెప్పలేదు?" ఆద్య తమ్ముణ్ణి నమ్మినట్టే ఉంది.

"ఏమో, ఆ నీలి కళ్ళు బహుశా లెన్సెస్ కావచ్చు. అలాగే అవుతాయేమో అనుకున్నాను.  ఇప్పుడేగా నాకూ తెలిసింది. సూపర్ నేచురల్ గాళ్ అని?"

అదన్నమాట వాడి లాజిక్కు. అందితే సైన్సు, అందకపోతే ఫిక్షను.

ఇక వాళ్ళిద్దరి మాటలనీ ఆపి, హోం వర్క్ చేసుకొమ్మని పంపించాను. పంపించానే కానీ, నాకు ఎలీనా మీదే లాగుతుంది. నాకు మొదటిసారి ఆ అమ్మాయిని పార్కులో చూసినపుడు సరిగ్గా వైల్డ్ ఫైర్ కంటే ముందు, ఆద్య పలకరిస్తే చటుక్కున తల తిప్పుకోవటం గుర్తొచ్చింది.  బహుశా నిప్పంటే భయమేమో. పొగని చూడగానే ఏ జ్ఞాపకాలేవయినా కదిలి స్థబ్ధుగా అవుతుందేమో? ఎంత దగ్గరయినా, మనసు చొచ్చుకునిపోయి చూడలేని పరిధులెలా చెరగబడవో తెలీలేదు. ఆ అమ్మాయి మాట్లాడితే కదూ? నాకు తెలిసుండేది. మాట్లాడనపుడు నాకవకాశమేదీ?

 

పిల్లలిద్దరూ ఆ అమ్మాయికీ ఫైర్ కీ ఏదో సంబంధముందనే నమ్ముతున్నట్టున్నారు. ఇంకా వాళ్ళలో వాళ్ళేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీళ్ళకి టీవీ తగ్గించాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను.

 

***


తర్వాతి రోజు సాయంత్రం, అందరం కలిసి డిన్నర్ చేస్తూంటే టీవీలో వచ్చిన వార్త కాస్త కలవరపరిచింది. ఎలీనా వాళ్ళ కమ్యూనిటీలో గంట క్రితం అగ్నిప్రమాదం జరిగిందట.  న్యూస్ లో చూపుతున్న దాని ప్రకారం ఒక ఇల్లు పూర్తిగా భస్మమయింది.

పదే పదే చూపిస్తున్న ఆ ఇల్లు చూడగానే గుర్తుపట్టాను. అది ఎలీనా వాళ్ళిల్లు. ప్రమాద సమయానికి అందులో మనుషులెవరూ లేరనీ చెబుతున్నారు.


"థ్యాంక్ గాడ్. వీళ్ళు బహుశా ఈ పాటికి ఫ్లైట్ లో ఉండుంటారు." పైకే అన్నాను. ఆద్య, అర్ణవ్ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.

"నే చెప్పానా? ఏలియెన్స్ సిటీ మొత్తం కాల్చేయబోతుంటే, ఎలీనా ఆ ఫైర్ ని తన రాక్ ఎమ్యులెట్స్ తో ఖాళీ ఇంటికి మళ్ళించింది." తనకే సొంతమైన తెలుగాంగ్లభాషలో అక్కతో మాట్లాడుతూ, ఊహాగానాలు మొదలెట్టాడు మావాడు. 
 
ఫోనేమయినా కలుస్తుందేమో ప్రయత్నిద్దామని ఫోన్ చేసాను ఎలీనాకి, ఎలీనా వాళ్ళమ్మకి. ఉహూ. నాట్ రీచబుల్.

ఫ్రాన్స్ వెళ్ళిపోయాక మరెపుడూ ఎలీనా ఏ మెయిలూ చేయలేదు. 

 

మౌనంగా కూర్చుని  చేతిలో రాళ్ళు రుద్దే ఆ నీలికళ్ళమ్మాయి మాత్రం మాకు అపుడపుడూ గుర్తొస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కోలా!

 


*****

bottom of page