top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం

అధ్యాత్మికం

 స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

ఎర్రాప్రగడ రామకృష్ణ

మీకు గుర్తుందా? మనదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా మనదేశంలోనే ఒక భాగమైన గోవాను మనం స్వాధీనం చేసుకోవడానికి పధ్నాలుగేళ్ళు పట్టింది. ఎస్! బుడత కీచుల నుండి మనం తీవ్రమైన ప్రతిఘటనల నేపథ్యంలో గోవాను 1961లో ఎట్టకేలకు స్వాధీనం చేసుకోగలిగాము! సర్వతంత్ర స్వతంత్ర భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో - మనం కొన్ని చేదు గాయాలను గుర్తు చేసుకోవలసి ఉంది.

 

నిజానికి 1947లో మనకి లభించినది - కేవలం టెరిటోరియల్ ఫ్రీడమ్ మాత్రమే. పొలిటికల్ ఫ్రీడం మాత్రమే - అని ఒక బలమైన వాదన ఇంకా వినిపిస్తూనే వుంది. ఆర్థిక పరమైన, ఆధ్యాత్మికపరమైన స్వాతంత్ర్యం ఇంకా లభించలేదనే ఒక విశ్లేషణ నేపథ్యంలో - మనం గోవా విడుదల కథను స్మరించుకోవాలి. దేశమంతటా స్వేచ్చా వాయువులు - యథేచ్ఛగా సంచరిస్తున్నా- గోవా మాత్రం పోర్చుగీస్ ఆధిపత్యంలోనే మిగిలిపోయింది. అది భారత దేశంలో ఒక భాగం కాదని, తమకు చెందిన ఒక ప్రత్యేకమైన రాజ్యమనీ, పోర్చుగీస్ మొండికేసింది. ఏళ్ళ తరబడి చర్చలు, వివాదాలు నడిచాయి. ఆఖరికి సైనిక చర్య అనివార్యమైంది. యుద్ధం జరిగింది. ఇరుపక్షాలూ రక్తసిక్త మయ్యాయి. కేవలం కొన్ని వందల విస్తీర్ణం గల మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకునే క్రమంలో గోవా నేల రక్తంతో తడిసింది. ఈ సువిశాల భారతదేశానికి స్వేచ్ఛ లభించడంలో - అది కూడా మహా బలశాలి, సూర్యుడస్తమించని మహాసామ్రాజ్యంగా, అపారమైన వనరులు, సైనిక పాటవం కల్గిన బ్రిటిష్ వారి నుండి మనకు స్వేచ్చ లభించడంలో సైతం - జరగనంత హింస, ఆయుధాలతో పని - చిన్న శత్రువుతో కలిగింది. అది ఎందుకో మర్చిపోతే ఎలా? గోవాను గెలవడానికి మనకు అంత కష్టం ఎందుకైంది? బ్రిటిష్ వారితో పోలిస్తే పోర్చుగీసు వాళ్ళెంత? మరి ఏమిటి కారణం? మిగిలిన అంత పెద్ద భూభాగాన్ని మనం అహింసా యుతంగా లోబర్చుకోగల్గిన వాళ్ళం. జె.ఎం. చౌధురి అని గుర్తు - ఆయన నేతృత్వంలో యుద్ధం చెయ్యడమూ – 70 మందికి పైగా సైనికులను మనం కోల్పోవడమూ ఆఖరికి 1961 డిసెంబర్ 19న స్వాధీనమూ జరిగిందంటే లోపం ఏమిటి? మనం ఆలోచించుకోవద్దూ! ఆగష్టు 15 అంటే శెలవు రోజో, చాక్లెట్ల పండగో కాదు - అది మన జాతికి సంబంధించిన ఒకానొక చిరస్మరణీయమైన విజయం. గొప్ప సంబరం. మన దేశంలో దసరా - అందరికీ పండుగ కాదు! క్రిస్మస్ - అందరికీ పండుగ కాదు! రంజాన్ అందరికీ పండుగ కాదు! కాని, ఆగష్టు 15, జనవరి 26 మన భారతీయులందరికీ పండుగలు! అంతేకాదు, దేశమంతటా జరిగే పండుగలా రెండూ! ఆ పండుగల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను మనం గుర్తు చేసుకోవాలి. పాండవుల దగ్గరికి సంజయుడు రాయబారం వెళ్ళొచ్చాకా - గుడ్డి రాజు గారు పాండవుల బలం ఏమిటయ్యా - అని అడుగుతాడు. అతగాడి ఉద్దేశ్యంలో - కౌరవుల పక్షం బలమైనదనీ, పైగా యోధులు చాలా ఎక్కువని! ఆ దిక్కుమాలిన ఆలోచనను సంజయుడు గుర్తుపట్టి - మొట్టమొదటే కృష్ణుడి పేరు ఎత్తుతాడు. ముందు కృష్ణుడికి సమానమైన యోధుణ్ణి మన పక్షంలో చూపించు, తక్కిన వారి విషయం తర్వాత ఆలోచిద్దాం - అని చురక వేస్తాడు. అది ప్రజ్ఞ అంటే. అటువైపు సైన్యం ఎంతుంది, ఇటువైపు ఎంతుంది? అందులో వీరులెంతమంది, ఇందులో ఎందరు... ఇవన్నీ కాకుల లెక్కలు. కౌరవసైన్యానికి, పాండవ పక్షానికి తేడా ఒక్కటే ఉంది. ఇరు పక్షాలకూ సంబంధించి విజయాన్ని ఖాయం చేసే ఒకే ఒక్కడు - శ్రీ కృష్ణుడు! ఆయన పాండవుల వైపు ఉన్నాడు. అదొక్కటే రహస్యం. మిగిలినవన్నీ అప్రస్తుతం. అలాగే 1947లో మనం సాధించిన అద్భుత విజయం వెనుక గాంధీ మహాత్ముడు ఉన్నాడు. 1961 నాటికి ఆయన లేడు. అదొక్కటే తేడా! దానివల్ల అవలీలగా, అహింసాయుతంగా, అనతికాలంలో మనకు దక్కవలసిన విజయం - చచ్చీ చెడీ, పధ్నాలుగేళ్ళ పాటు తంటాలు పడితే దక్కింది. అది కూడా రక్తం చిందిన తర్వాతే దక్కింది.

ఒక్కమనిషి ఉనికి వల్ల అంత తేడా వుంటుందా; పాండవుల విజయంలో అసలు హీరో అర్జునుడు కదా - అని మనకి సందేహం వస్తుంది. అందుకూ భారతమే జవాబు చెప్పింది. శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి తర్వాత స్త్రీ జనాన్ని, గోసంపదనూ అర్జునుడి రక్షణలో తరలిస్తుంటే - కేవలం కొంతమంది దొంగలు వాళ్ళను దోచేసారు. యోధాన యోధులను నిర్జించి, మహేంద్రుడి అర్ధసింహాసనాన్ని అధిష్ఠించిన అర్జునుడు దోపిడీ దొంగల ముందు చేతులెత్తేసాడు. 

భీష్మ, ద్రోణ, కృపాది, ధన్వి నికారాభీలంబైన కురు మహా సైన్యాన్ని ఒంటిచేత్తో జయించి, గోగ్రహణం సమయంలో అసాధారణమైన విజయం ప్రసాదించిన అర్జునుడి చేతిలోని గాండీవం - మామూలు డెకాయిట్స్ ముందు పుచ్చుకర్ర అయిపోయింది. కారణం ఏమీ లేదు - ఆ విజయాలన్నింటి వెనకా శ్రీకృష్ణుడున్నాడు. ఇప్పుడు లేడు. అంతే తేడా! అలాగే స్వరాజ్య సమరంలో గాంధీజీ ఉన్నాడు, గోవా యుద్ధం వెనుక లేడు. అంతకన్నా ఏం లేదు. 

కృష్ణుడు, గాంధీ అనేవి వ్యక్తుల పేర్లు కాదు - ధర్మానికి సంకేతాలు. ధార్మిక నేపథ్యం కల్గిన వ్యక్తుల ప్రమేయం - విజయాన్ని శాసిస్తుంది. తేలిగ్గా సాధిస్తుంది. ఈ జాతికి కావలసింది - అదిగో అలాంటి నాయకులు. ప్రస్తుతం ఈ జాతి ఈ సమాజం - రాజకీయ నాయకుల్ని తయారు చేస్తున్నాయి. పుట్టగొడుగుల్లా - వీధికి నలుగురూ అయిదుగురూ పుడుతున్నారు. పేట నాయకులు, కులం నాయకులు, రాజకీయులు... వీరు కాదు మనకి - నేషనల్ లీడర్సు కావాలి. ఇద్దరి మధ్యా సూదికి, కత్తెరకి ఉన్నంత తేడా వుంది. సూది కలపడానికి పుట్టింది. కత్తెర విడదీయడానికి పుట్టింది. అమోఘమైన, నీతిమంతమైన వ్యక్తిత్వంతో ఈ జాతిని కలిసికట్టుగా ముందుకు నడిపించే సామర్థ్యంగల నాయకులు ప్రస్తుతం ఈ దేశానికి అవసరం... అలాంటి అవసరాలు ఏర్పడినప్పుడు ఈ దేశం గొప్ప నాయకులను రూపొందించుకున్నది కూడా. సమయం వచ్చినప్పుడు వస్తారు. అది చరిత్ర చెప్పే నిజం. మనం ఆగస్టు 15న, జనవరి 26న పాడుకునే పాటలు - అదిగో అలాంటి మహాయోధుల ఆగమనానికి సంబంధించిన వైతాళిక గీతాలు. మనం సంబరాలన్నీ వారిని స్వాగతించడానికి ఈ జాతి సంసిద్ధమవుతున్నదని తెలియజేసే ఎమోషనల్ సంకేతాలు. మంగళ తోరణాలు. స్వస్తి. 

*****

bottom of page