MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నేటి తెలుగు సాహిత్య విమర్శ తీరుతిన్నెలు
డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వినోదం అంటే టివీ ఛానళ్ళు – ఇంటర్ నెట్ లు, విజ్ఞానం అంటే మార్కులు అనే ధోరణితో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో, మాతృభాషలో విద్యా బోధన-సంభాషణ – భాషాభిమానం మృగ్యమవుతున్న విపత్కర తరుణంలో కూడా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో సాహిత్య సృజన చేస్తున్న నేటి రచయితలు–రచయిత్రులు అభినందనీయులు. ఈ రచయితలు తమ రచనలతో సాహిత్యాన్ని ప్రేమించే పాఠకులు ఇంకా ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తున్నారు. అంతేకాదు అనేక మంది భావి రచయితలకు సైతం వీరు స్ఫూర్తినిస్తున్నారు. దిన – వార –మాస పత్రికల్లో కూడా చక్కని రచనలు వెలువడుతున్నాయి. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కొన్ని ప్రక్రియల్లో అధికంగాను, మరికొన్ని ప్రక్రియల్లో కొంత తక్కువగాను రచనలు నేడు వెలువడుతున్నాయి. సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేటి వేగవంతమైన కాలంలో కూడా విస్తృతంగా తెలుగు సాహిత్య రచనలు వెలువడుతుండటం ఒక శుభపరిణామంగానే చెప్పాలి.
నేడు తెలుగు సాహిత్యం వెలువడినంతగా ఆ సాహిత్యం పై విమర్శ వెలువడుటం లేదనే భావన అత్యధిక మందిలో ఉంది. మరి ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా సాహిత్య విమర్శ సన్నగిల్లిందనే అంశం అందరూ అంగీకరించాల్సిన విషయమే. ఒకటిన్నర శతాబ్దికాలంగా అనేక ఉద్యమాలకు, వాదాలకు, భావజాలాలకు ప్రేరణగా ఆధునిక తెలుగు సాహిత్యం విస్తృతంగా వెలువడుతుంది. సాహిత్యం వచ్చినంతగా విమర్శ రావడం లేదని, వచ్చే విమర్శ కూడా శాస్త్రీయంగా, గుణాత్మకంగా లేదని నేడు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు వెలువడుతున్న విమర్శలో ఒక స్పష్టత, ఒక సూత్రబద్ధత, సరైన ప్రామాణికత కొరవడుతుందని ప్రస్తుత ఆరోపణ. ఐతే ఈ త్రిగుణాత్మక లక్షణాలను పుణికి పుచ్చుకున్న విమర్శకులు నేడు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.
ఒక రచన యొక్క వైశిష్ట్యాన్ని సాహితీ లోకానికి పరిచయం చేయాల్సిన గురుతర బాధ్యత విమర్శకునిపై ఉంది. రచనల్లోని లోటుపాట్లును గూర్చి కూడా ఎత్తి చూపాల్సిన కర్తవ్యం కూడా విమర్శకునిదే. కానీ నేడు వెలువడుతున్న తెలుగు సాహిత్య విమర్శ కేవలం ప్రశంసలకు మాత్రమే పరిమితం అవుతుంది. విమర్శ పాఠకునిలో జిజ్ఞాసను రేకిత్తించాలి. మంచి సాహిత్యాన్ని, అందులోని సొగసుల్ని – శిల్పాన్ని పాఠకునికి బోధించే ప్రయత్నం చేయాలి. తద్వారా మరింత లోతుగా పఠించి సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించాలనే జిజ్ఞాసను పాఠకునిలో రేకెత్తిస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న విమర్శలో అత్యధిక భాగం వస్తు చర్చకే పరిమితమై శిల్పాన్ని పట్టించుకోని తీరు కన్పిస్తుంది.
విమర్శ రచన పట్ల అవగాహనను పెంపొందించాలి. ఏది ఉత్తమ సాహిత్యమో, ఏది కాదో నిరూపించాలి. అప్పుడు పాఠకులు ఉత్తమ సాహిత్యం వైపుకు మొగ్గు చూపే అవకాశం కలుగుతుంది. కానీ నేడు విమర్శకులు తమకున్న సైద్ధాంతిక విభేదాల వల్ల తాము నమ్మే సిద్ధాంతాన్ని రచనలకు బలవంతంగా ఆపాదిస్తూ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. రచయిత యొక్క దృక్పథాన్ని వెల్లడించడం కంటే తమ సైద్ధాంతిక దృక్పథ బలాన్ని వెల్లడించడానికే విమర్శకుడు ఉత్సాహం చూపుతున్నారు. ఇది పాఠకుడిని సందిగ్ధావస్థకు తీసుకొని వెళ్తుంది. సాహిత్య పఠనంలో పాఠకులకు అడుగడుగున ఎదురయ్యే సందేహాల్ని నివృత్తి చేసి సాహిత్యాన్ని బాగా అర్ధం చేసుకొని ఆనందించేటట్లు చెయ్యాల్సిన బాధ్యత విమర్శకునిపై ఉంది. ఐతే నేడు వెలువడుతున్న విమర్శ సందేహ నివృత్తి చేయడం అటుంచి, పాఠకుడిని సందేహా సముద్రంలో ముంచుతుందనే విమర్శ కూడా ఉంది. కొందరు విమర్శకులు తమ హేతుబద్ధం గానీ పిడివాద విమర్శలతో పాఠకులను అపసవ్య మార్గంలో పయనింపజేసే ప్రయత్నం చేస్తుండటం దురదృష్టకరం.
ఉత్తమ విమర్శ పాఠకులకు విజ్ఞానాన్ని, వికాసాన్ని అందిస్తుంది. ఇది పాఠకునికి అందించాలంటే విమర్శకుడు బహుముఖ ప్రజ్ఞాశీలి అయి ఉండాలి. కవి వివిధ శాస్త్ర పండితుడైతే ఆ విమర్శకుడు అంతకు మించిన శాస్త్ర కళా పరిజ్ఞానం కలిగిన వాడే ఉండాలి. తెలుగు ప్రాచీన సాహిత్య ప్రక్రియలైన కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాల మీద గొప్ప విమర్శలు వెలువడ్డాయి. ఇందుకు కారణం నాటి విమర్శకులు అపార పాండిత్య ప్రకర్ష కలివారు కావడమే. కానీ నేటి విమర్శకులలో అంతటి పరిజ్ఞానం కలిగిన వారు చాలా తక్కువమందే ఉన్నారు. నేటి విమర్శకులలో విశాలదృష్టి కంటే అహంభావ దృష్టి ఎక్కువగా కన్పిస్తుంది. కావ్యం కన్నా తన విమర్శే మిన్నగా ఉందనే సంకుచిత భావం నుండి నేటి విమర్శకుడు బయటికి రావాలి. నచ్చిన విషయాలను – నచ్చని విషయాలను సమదృష్టితో విమర్శకుడు చాటాలి.
నేటి విమర్శకులు కేవలం ప్రాచీన సాహిత్యాన్ని సంప్రదాయ దృష్టితోనే పరిశీలించి, విమర్శనా మూసలో పరిచయానికే పరిమితమైపోతున్నారు. ఆయా సాహిత్య ప్రక్రియల అంతర్గత అంశాలపై దృషి సారించలేకపోతున్నారు. విమర్శ పామరులైన పాఠకులకు, పండితులైన రచయితలకు మధ్య మధ్యవర్తిత్వం కలిగించే వారధిలా ఉండాలి. సద్విమర్శ రచయిత హృదయానికి దగ్గరగా పఠితను చేరుస్తుంది. ఏ అనుభూతి పొంది కవి కావ్యం సృష్టించారో అదే అనుభూతిని పాఠకునికి కలిగించి ఆనందాన్నిస్తుంది. ఇందుకు విమర్శకుడు సహృదయత కలిగివాడై ఉండాలి. జాతి, కుల, మత, ప్రాంత, సిద్ధాంత పక్షపాతాల మధ్య నేటి విమర్శకుల సహృదయత చిన్నబోతుంది. విమర్శకుడు తన – పర భేదం లేని వాడుగా ఉండాలి. నచ్చిన పుస్తకాన్ని ఒక విధంగాను, నచ్చని పుస్తకాన్ని మరో విధంగాను చూడకూడదు. ఈ సమదృష్టి నేటి విమర్శకులలో కొరవడిందనే వాదన వినిపిస్తుంది.
విమర్శకుని సహనం చాలా అవసరం. ఓర్పుగానేర్పుతో విమర్శ చేయాలి. ఆవేశంతో త్వరపడి నిర్ణయం ప్రకటించడం అంత మంచిది కాదు. విమర్శకునికి తన ప్రాంత భాషలోని గ్రంథాల పరిచయం మాత్రమే ఉంటే సరిపోదు. వివిధ లోక జనవ్యవహారంతో పాటు ప్రాపంచికానుభవం కూడా చాలా అవసరం. ఐతే నేడు వెలువడుతున్నవిమర్శను గమనిస్తే ఓర్పు – పరిశ్రమించే సామర్ధ్యం – ప్రాపంచికానుభవం తదితర అంశాలను యువ విమర్శకులు పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. సాహిత్య విలువలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన సమాజంలో వచ్చే మార్పులను అంచనా వేయగల సామర్ధ్యం విమర్శకునిలో ఉండాలి. సమకాలీన సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను అవగాహన చేసుకొని సమ సమాజ క్షేమం కోసం సామాజిక స్పృహతో విమర్శ కొనసాగిస్తున్న విమర్శకులు నేడు కరువయ్యారు.
ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల భాషా ప్రభావం ఆది నుండి ఉంది. తెలుగు సాహిత్య విమర్శపై కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉంది. ఆధునిక సాహిత్యంలో నేడు పురుడు పోసుకుంటున్నవినూత్న వాదాలు, ఉద్యమాలు, వస్తువుల వెనుక ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉందనుటలో ఎటువంటి సందేహం లేదు. ఈ సాహిత్యాన్ని విమర్శించాలంటే ఆంగ్ల సాహిత్యంలో వెలువడుతున్న విమర్శలపై కూడా విమర్శకుడు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన లేకుండా కొందరు విమర్శకులు సాహిత్య ప్రక్రియలను సంప్రదాయ విమర్శ ప్రమాణాలతో కొలిచే ప్రయత్నం చేస్తున్నారు. సాహిత్య లోకంలో ఒక కవి యొక్క స్థానాన్ని నిర్ణయించడానికి, రచన యొక్క విలువను వెల్లడించడానికి తులనాత్మక విమర్శ ఎంతగానో దోహదపడుతుంది. ఇందుకు విమర్శకునికి ఇతర భాషా సాహిత్యాలపై సైతం పట్టుండాలి. అంతటి సామర్ధ్యం నేటి విమర్శకులకు ఎంతమందికున్నదనేదే ఇప్పుడు ప్రశ్న.
నేడు సాహిత్య విమర్శ చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది. కుల – మత –సిద్ధాంత ప్రాతిపదికన కవులు – విమర్శకులు విడిపోయి గ్రూపులుగా విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఒక కులంవాడి లేదా ఒక మతం వాడి సాహిత్యాన్ని మరో కులం వాడు – మరో మతం వాడు సమీక్షించి, విశ్లేషించి అందులో లోపాలు ఎత్తి చూపితే ఆ వర్గీయులు మూకుమ్మడిగా భావ దాడికి దిగుతుండటం సర్వసాధారణమైపోయింది. కువిమర్శముందు, కుటిల సమీకరణాల ముందు, కులమతాలను సమర్ధించే సాహిత్యం ముందు నేటి సాహిత్య విమర్శ సజీవత్వాన్ని కోల్పోతుంది. నేడు సాహిత్య విమర్శ బలహీనం కావడంలో రచయితల పాత్ర కూడా ఉంది. నేడు రచయితలు కుల, మత, వర్గ, లింగ రూపాలుగా విడిపోయి అస్తిత్వ వాదాల ముసుగులో కుల, మత, వర్గ, లింగ బేధాల్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. రచయితలు తమ రచనలపై వచ్చే విమర్శలను స్వాగతించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కానీ నేటి రచయితలలో ఆ స్వీకరణ కొరవడుతుంది. నిజమైన స్వచ్ఛమైన విమర్శను భరించే సహృదయత కవులు – రచయితలు కలిగి ఉండాలి. అప్పుడే సాహిత్య విమర్శ ఎదుగుతుంది. నేడు విశ్వవిద్యాలయాల నుండి వెలువడుతున్న తెలుగు పరిశోధన సిద్ధాంత గ్రంథాలలో నాణ్యతతో కూడిన విమర్శ వెలువడుటం లేదు. అనేకమంది పరిశోధకులు విమర్శ కొలమానాలపై అవగాహన లేకుండానే గ్రంథాలను సమర్పించి డిగ్రీలు పొందుతున్నారు. పరిశోధన పర్యవేక్షకులు చూడా ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం లేదు.
పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా నేడు అసలు విమర్శ అసలే లేదని, వస్తున్న విమర్శ అంతా అధ్వాన్నంగా ఉందని చెప్పడం నా ఉద్ధేశ్యం కాదు. సాహిత్య విమర్శకులలో చాలా మందికి నిర్దిష్టమైన భావజాలం లేకపోవడం వల్ల, నిరంతరం మారుతూ వస్తున్న ఆధునిక సాహిత్య వాదాలను అంచనా వేసే తూకపురాళ్ళు కావాల్సినన్ని రూపొందకపోవడం కూడా నేడు వస్తున్న విమర్శ పట్ల అసంతృప్తి కలగడానికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. అయితే తీవ్ర నిరాశ పడాల్సినంత అధ్వాన్నంగా మాత్రం నేటి విమర్శ లేదనేది మాత్రం వాస్తవం. నేటికి పదునెక్కిన, లోతైన విమర్శ చేస్తూ ముందుకు సాగుతున్న విమర్శకులు ఉన్నారు.
ఇజాలను – వాదాలను ప్రక్కనబెట్టి సాహిత్యమైనా – సాహిత్య విమర్శ అయినా బలహీనుల పక్షాన నిలబడాలి. నిజాయితీకి కొమ్ము కాయాలి. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ఈ రెండు ప్రక్రియలు ముందుకు సాగాలి. తప్పును తప్పుగా – ఒప్పును ఒప్పుగా వెల్లడించే ధైర్యాన్ని విమర్శకుడు అలవర్చుకోవాలి. సాహిత్యానికి దిక్సూచిగా విమర్శ ఉండాలి. విమర్శకుని పని రంధ్రాన్వేషణ కారాదు. గుణములున్న చోట స్వల్పమైన దోషములను పరిగణించకూడదు. అట్లాగని దోషములనే పేర్కొనకూడదని కాదు. గుణదోషాలను సమదృష్టితో విచారించువాడే ఉత్తమ విమర్శకుడు. రాగద్వేషాలకు విమర్శకుడు అతీతుడై నిష్పక్షపాత బుద్ధితో సాహిత్యతత్త్వ వివేచనకి సిద్ధపడాలి. విమర్శకునికి సానుభూతి చాలా ముఖ్యము. పూర్వ సిద్ధాంతములకు లోబడక, స్వీయాభిప్రాయాలకు తావీయక విమర్శ చెయ్యాలి. ప్రాచీన సాహిత్యాన్ని నవీన దృష్టితోగాని, ఇతిహాస పురాణాలను కావ్యదృష్టితో గాని, దేశీ సాహిత్యాన్ని విదేశీయ దృష్టితో గాని పరిశీలించే ప్రయత్నం చేయరాదు.
సమాజం మారుతుంది, దాని ప్రతిఫలనమైన సాహిత్యమూ మారుతుంది. మారిన సాహిత్యాన్ని విమర్శించడానికి కొత్త సూత్రాలను నిర్మించుకునే కార్యాచరణలో విమర్శకుడు ఎల్లప్పూడూ సిద్ధంగా ఉండాలి. పూర్వ విమర్శకులు, తన సాటి విమర్శకులు రాసిన రాస్తున్న సాహిత్య విమర్శలోని మంచిచెడులను విశ్లేషించడం, సాహిత్య విమర్శ లక్షణాలను – స్వరూప స్వభావాలను వివరిస్తూ విమర్శపై విమర్శ విరివిగా నేడు రావాలి. మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యంరావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి విమర్శ రావాలి. మంచి సాహిత్య విమర్శ రావాలంటే విమర్శ కూడా విమర్శకు గురి కావాలి. సాహిత్యము – సాహిత్య విమర్శ – విమర్శపై విమర్శ అన్నీ కలిసి మంచి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తాయి. సాహిత్య విమర్శకు మూల్యాంకనము, పునర్మూల్యాంకనమూ రెండూ నేడు అవసరమే. రచనకు విలువ కట్టడం మూల్యాంకనమైతే, మారిన సామాజిక సందర్భంలో కొత్త విమర్శ సూత్రాలతో ఆ రచనను తిరిగి అంచనా కట్టడం పునర్మూల్యాంకనము. పునర్మూల్యాంకనమూ లేకపోతే సాహిత్య విమర్శ స్తబ్ధతకు లోనయ్యే ప్రమాదం ఉంది.
తెలుగు సాహిత్య విమర్శకులు పోతున్న పోకడలను ఎప్పటికప్పడు విశ్లే్షించుకొని మంచి, చెడులు చర్చించకపోతే పిడి వాదానిదే పైచేయి అయ్యే ప్రమాదం ఉంది. సాహిత్యం అపసవ్య మార్గంలో ముందుకుసాగుతుంది. అందువల్ల భవిష్యత్తులోనైనా తెలుగు సాహిత్య విమర్శకులు చక్కని ప్రమాణాలతో సాహిత్య విమర్శ చేయాలనీ – గాడి తప్పుతున్న సాహిత్యాన్ని, రచయితల ఆలోచనలను సక్రమమైన మార్గంలో పయనింపచేయాలనీ - ఆ విమర్శలను రచయితలు స్వాగతించాలనీ –విమర్శపై వెలువడే విమర్శల పట్ల విమర్శకులు సైతం సానుకూలంగా స్పందించాలనీ - చైతన్యవంతమైన సమాజ నిర్మాణంలో రచయితలు, విమర్శకులు భాగస్వాములు కాగలరని ఆశిద్దాం.
.
OOO
డా. తన్నీరు కళ్యాణ్ కుమార్
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించారు. తెనాలిలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమెరికా తెలుగు కథా సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్.డి. డిగ్రీ పొందారు. అనేక జాతీయ - అంతర్జాతీయ - అంతర్జాల పత్రికలలో ఈయన రాసిన సాహితీ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రదేశంలో వెలువడే ఆంధ్రజ్యోతి, సాక్షి దిన పత్రికల్లో ఈయన రాసిన పలు ఎడిటోరియల్ వ్యాసాలు ప్రచురించబడ్డాయి. 2014 ఆటా వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి, 2015 తానా వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.
***