adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

మారుతున్న సమాజంలో సాహితీ విలువలు

Madhuravani Telugu Magazine

శ్రీ వేదాంతం సుబ్రహ్మణ్యం

ఈ వ్యాసాన్ని శ్రీ వావిలాల కృష్ణ గారు మధురవాణికి అందించారు.  సుమారుగా 1977 ప్రాంతంలో వ్రాయబడినదీ వ్యాసం. రచయిత కాలం చేసి కొన్ని సంవత్సరాలైంది. సుబ్రహ్మణ్యం  గారికి తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువ ఈ వ్యాసం తెలియజేస్తుంది.  ఆ కాలంలో సమాజంలో వచ్చిన/వస్తూన్న మార్పులు, భాష, సాహిత్యం ఏవైపు మొగ్గాలీ అనే చర్చ ఈ వ్యాసానికి మూల వస్తువులు.

***

కవి వెలిబుచ్చే సత్య ప్రతిపాదనము భావ గాంభీర్యముతో కూడుకొని, చిత్త దీప్తి పరిమితము కాక, గుండెను కరిగించునదిగా ఉండి తీరాలి.   కేవల తత్త్వము కన్న, విజ్ణానమును ప్రసాదించు కళగా రూపొందాలి.  కామ క్రోధ మోహాది దుష్ట ప్రవృత్తులకు పరిహారము చూపెట్టేదిగా రూపొందాలి. 

ఇలాంటి ఆదర్శప్రాయమైన కవిత్వానికి అనుభూతి మాత్రమే ఏకైక సాధనం.  ఆ అనుభూతికి దివ్య ప్రాధాన్యము తగ్గి, తనను చుట్టియున్న పరిసరములకు సంబంధించిన హేయజనకమైన ఆలోచనలు మాత్రమే పైకుబికివచ్చినప్పటి కవిత్వము ఆహ్లాద జనకము కానేరదు.  అంటే ఆవేశమొక్కటే కవిత్వము కాదు.  అయితే, మహా కావ్యములన్నీ, అంటే వాల్మీకి రామాయణము వంటివి గూడ, ఆవేశముతో ప్రారంభమై, ఆలోచనాపూర్వకముగా రచింపబడ్డవే. అంటే, చక్కని కవిత్వ రచనకు హృదయమే కాక, మేధ కూడా అత్యవసరము.  కాబట్టి ఎడ్గర్ ఎలెన్ పో చెప్పినట్లు ‘సౌందర్యపు లయబద్ధ సృష్టియే కవిత్వపు సమగ్ర నిర్వచనమనిపించుచున్నది.  సౌందర్యమంటే రమణీయార్ధము.  చదువునప్పుడు ఆనందమిచ్చునదే రమణీయార్థము.  అపూర్వముగ, నిత్యనూతనముగ, అగుపడుట రమణీయత్వ లక్షణము.  కాబట్టి వాస్తవికత, సహజత్వముల పేరిట మురికి గుంటలలోని నాచు, బురద, రొంపి మీదనే కేంద్రీకరింపక పైన అతి సహజముగా అగపడు కమలముల మీద దృష్టి బరపి, వాటి సౌందర్యమును సరిక్రొత్త తెన్నులలో వర్ణిస్తే, కవిత్వానికి శోభ వస్తుంది.   దానిలో సంపూర్ణమైన అర్థముంటుంది.  కావుననే, చక్కటి కవిత్వానికి శబ్దము కంటే అర్థము, రసము ప్రధానమన్నారు. 

ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మారుతున్న సమాజంలో సాహితీ విలువల గుబాళింపులు మూర్కొనటానికి నిరాశావాదం, విధ్వాంసనవాదం, ఫ్యూచరిజం మొదలగు సాధనాలద్వారానే సంభవమని కొందరు ఆధునిక రచయితలు అభిప్రాయపడుతున్నారు.  వీరికి సాంప్రదాయ విచ్ఛేదమే పరమావధిగా కనబడుతుంది. 

ప్రపంచంలో సుఖదుఖాలు, హెచ్చుతగ్గులూ ఎల్లప్పుడూ ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.  మానవుని జీవితం హెచ్చుగా ఆశలు, ఆశయాల మీద ఆధారపడి ఉంటుంది.  వాటి సఫలత కొరకు ఆతని కృషి ప్రధానము.  ప్రతి పరిస్థితిలో కృషి ఫలించకపోవచ్చు.  అందుకని, వక్ర మార్గం పట్టి అయినా సరే, దొంగతనాలు, హత్యాకాండలు చేసి అయినాసరే, తన జీవితం మూడు పువ్వులూ, ఆరు కాయాలూ అయ్యేలా చూసుకొనడంలో తప్పు లేదనడంవల్ల సమాజం అడుగంటిపోతుందే కాని, వృద్ధి పొందదు.  అంటే, కొందరు సమాజంలో అధికారం సంపాదించుకొని, దాని ప్రభావంతో సామాన్యులనందరిని పీడించుకొని తింటూంటే చూస్తూ ఊరుకోమనడం లేదు.  అందుకే మన పూర్వులు సామ దాన భేద దండోపాయ క్రమాన్ని చెప్పారు.  కావున విప్లవం విధ్వంస కాండతోనే సంభవమనుకోవడం, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, అంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి హెచ్చు దేశాల్లో ప్రాముఖ్యం ఇవ్వబడుతున్నప్పుడు, అర్థ రాహిత్యంగా కనబడుతుంది.  దీని వల్ల కవులు, రచయితలు, ఆశావాదంతో వాళ్ళ రచనలు సాగిస్తే మెరుగనిపిస్తుంది. 

తాను ఎంతో కష్టపడి చదువుకొని పాండిత్యం సంపాదించుకున్న విధానంలో తన రచనలు సాగిస్తే ఏమీ లాభం లేదని పూర్తిగా బోధపడ్డది.  ఈ కొత్త ధోరణికి అలవాటు పడి, ప్రస్తుత పదజాలాన్ని ప్రయోగిస్తే, మనందరం ఇంతవరకు మన భాష సౌందర్యాన్ని మెచ్చుకుంటూ గర్వపడుతూన్న విషయం జ్ణప్తికి వచ్చింది.  యావద్భారతదేశంలో సంస్కృతపదాలు అన్నీ భాషలకన్నా మిన్నగా వాడుతూ, స్వచ్చమైన ఉచ్ఛారణతో మా తెలుగు భాష వర్ధిల్లుతున్నదంటూ ప్రగల్భాలు పలికాము.  ప్రస్తుత మన ఆరుకోట్ల జనాభా ఆంధ్రులు అనర్గళంగా మా చక్కటి భాషను మాట్లాడగలమని తక్కిన భాషల వారికి తెలియజేశాము.  సందర్భం ఉన్నా లేకపోయినా, మా కవిత్రయము, మా పోతన, మా త్యాగరాజు, మా అష్టదిగ్గజాలు, మా కళా ప్రపూర్ణులు, మా పద్మ భూషణులు, మా పద్మ విభూషణులు, అంటూ, లెఖ్ఖ లేనన్ని ఉత్సవాలు చేస్తున్నాము, వర్ధంతులు జరుపుతున్నాము, ప్రతివారికి కనపడేలా వారి పటాలకు పూల మాలలు వేస్తున్నాము.  వాళ్ళ పేర్లు పదే పదే చెప్పుకుని మాకంటే గొప్పవాళ్లు లేరని విర్రవీగుతున్నాము; ఒకరొకరితో పోటీలు పడి సంచికలు ముద్రిస్తున్నాము. 

కాగా, ఏదైనా అవకాశం వచ్చిందీ అనగానే కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్లుంటుంది మన వంత పాట.  ప్రబంధములలో స్త్రీ వర్ణన, శృంగార చేష్టలూ తప్పించి ఏమున్నదంటూ తేల్చి పారేస్తాము.  ‘ఇనుప గుగ్గిళ్ళ లాంటి, చాంతాడు లాంటి సామాసాలు వేస్తే ఎవరిని ఉద్ధరించినట్టు?’ అని ఈసడింపుగా అని ఆధునికుల మన్ననలను చూరగొంటాము.  క్రొత్త పోకడలకు నడుం కట్టాలని పురెక్కిస్తాము.

 

 రచయిత ఒక్క సారి సింహావలోకనం చేసి నాలుదిక్కులా దృష్టి సారించాడు.  ప్రతి దేశంలోనూ ప్రతి భాషలోనూ ఈ వాదన లేస్తున్నమాట నిజమే.  చదువులు వృట్టికనుగుణంగా ఉండాలనే ఉద్యమం బలమైంది.  మళ్ళీ అదే నోటితో నాయకులు వేర్వేరు భాషల పురాతన ప్రాముఖ్యాన్ని నిలబెట్టాలని ఘోష పెడ్తున్నారు.  ప్రతి సామాన్య మానవునికి అర్థమయేలా భాషని తీర్చి దిద్దాలని సలహాలిస్తున్నారు.  ఎంత ప్రయత్నించినా, ఎప్పటిలాగే కనబడుతున్నది పరిస్థితి.  ఎటు చూసినా, చెప్పుకోతగ్గ మార్పేదీ కనబడటం లేదు.  నిరక్షరాస్యత నిర్మూలిస్తేగాని దేశం ప్రగతి పథం పట్టదని వాదిస్తున్నారు.  అక్షరాలు మాత్రం వ్రాయడం, చదవడం వస్తే, నిరక్షరాస్యత నిర్మూలనం అయినట్టేనా అని ప్రతి వాదన.  ఏమిటో ఈ లోపల కాలం గడచి పోతున్నది. 

ఈ వేర్వేరు వాదనలు ఒకదానికొకటి ప్రతికూలంగా నిలబడి మానవుని తికమక పెడ్తూంటే ఈ వితండ వాదనలతో మాకేం పని అన్నట్లు కొందరు కొందరు కవులు “ఆడనీ గడయేసి ఈడనే చుక్కాని....” అనే పంథాలో నూత్న కవిత్వ ప్రబంధాలు సమకూరుస్తున్నారు.  ‘చంద్రుడు’ అనే పదము శుద్ధ గ్రాంధీకం, చాలామందికి అర్థంకాదు అనే నెపంతో ‘సెందురూడా!’ అని సంబోధిస్తునారు.  వత్తు అక్షరాలన్నిటినీ వాడుకలోంచి పూర్తిగా తీసేశారు.  అందరూ పలకడానికి సులువుగా ఉండాలి అని, ‘వాల్లు’, ‘వీల్లు’ వాడి, నాలుకకు ‘ళ’ అని పలికే కష్టాన్ని తొలగిస్తున్నారు.  వత్తు అక్షరాలన్నిటినీ, వాడుకలోంచి పూర్తిగా తీసేశారు.  ‘సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కుక్కపిల్ల’ లాటి చక్కటి పదజాలంతో కవిత్వం మహాకవుల కలాలనుంచి వెలువడుతున్నది.  అన్నిటినీ మించి ‘కొట్టు, తిట్టు, చంపు’ వంటి క్రియా పదాలు మహా ఎక్కువగా వాడుకలోకి వస్తున్నాయి.. 

అయితే దీనిలో ఒక విషయం గమనార్హం.  ప్రస్తుత కాలపు రచయిత పరిస్థితి చాలా వరకు క్లిష్టంగా తయారయింది. 

కలియుగంలో ఈ లోపల ఎన్నో మార్పులు జరిగినయి.  ధర్మం పూర్తిగా క్షీణించి పోయింది.  మోక్షమంటే నమ్మకమే పోయింది.  ఈ రెంటి గురించి ఆలోచించటానికి కూడా వ్యవధి లేకుండా జీవితమే ఒక జటిల సమస్య అయింది.  సమాజం వేర్వేరు రీతుల్లో పరిణామం చెందుతున్నది.  పాత పద్ధతులన్నిటికీ స్వస్తి చెప్పవలసి వచ్చింది.  భిన్న భిన్న నాగరికటా లక్షణములు ప్రవేశపెట్టబడినయి.  సంస్కృతి పేరిట తోటి మానవుల మారణహోమములు ప్రారంభమైనాయి.  మానవుని ప్రత్యేక వ్యక్తిత్వానికి ఆదివరకేన్నడూ లేని శక్తి సామర్ధ్యములు గుర్తింపబడ్డాయి.  ఈ క్రొత్త మార్పులకనుగుణంగా పరిశ్రమలు ప్రబలినాయి. 

 

వంశపారంపర్యంగా దేశాలను పరిపాలిస్తూ

వచ్చిన రాజులను తదితర సామాన్య ప్రజల శ్రేణికి తేబడటం జరిగింది.  కార్మిక, కర్షక తరగతులకు ఇదివరకెప్పుడూ కానీ వినీ ఎరగని ప్రాముఖ్యం ఇవ్వబడింది.  ఇవేకాక, సమాజంలో ఇంకా ఎన్నో ఇంతవరకూ ఊహింపలేని మార్పులు సంభవించినాయి.  వెట్టి చాకిరీ రద్దు చేయబడ్డది.  సేద్యము చేయువానిదే భూమి అని గుర్తించి, పట్టణాలలో, నగరాలలో ఉంటూ తమ పల్లెల్లోని పొలాల ఆదాయం హాయిగా అనుభవించే పరిస్థితులు అంతం చేయబడ్డాయి.  ఈ మార్పులకాన్నిటికీ అవసరమగు సంస్థలు ప్రభుత్వ పరంగానూ, సమాజ పరంగానూ సృష్టించ బడ్డాయి.  వీటన్నిటికీ ప్రస్తుత పరిస్థితులననుసరించి క్రొత్త పేర్లు పెట్టవలసి వచ్చింది.  వీటికొక నూత్న నిర్వచనం అవసరమయింది. 

ఇవన్నీ ఇలా ఉంటే, మత విద్వేషాలు, ఈర్ష్య, అసూయ, రాజ్య విస్తరణ కాంక్ష, వర్గ విభేదాలూ మొదలగునవి విస్తృతమై ప్రపంచ సంగ్రామాలకు కారణములైనవి.  లక్షోపలక్షలు హతులైనారు.  క్షతగాత్రులైనారు.  వీటికి తోడు ప్రకృతి సహజములకు అతివృషి, అనావృష్టి, క్షామములు, భూకంపములు, ఎన్నో సంభవించినాయి.  వీటన్నిటివల్లా మానవ జీవితం మరీ దుర్భరమయింది; మానవ మేధస్సు కృశించి, కుదించుకుపోయి, సంకుచితత్వాన్ని దృఢపరిచింది. 

రచయితకు ఇవన్నీ ప్రతిబంధకాలైనాయి.  సస్యశ్యామలంగా, వైభవోపేతంగా అలరారుతూ, అన్ని దిక్కులా ప్రచండ వేగంతో వృద్ధి పొందుతున్న దేశంలో ఎలాటి చీకూ, చింతా లేకుండా, తన పాండితీ ప్రకర్షకనుగుణ్యంగా ‘ఉపనిషద్దివ్య వల్లరీ ప్రోజ్వలత్ప్రసూనములు నీదు పాదములో సులలితములు’ అనే పాత వరుసలో ప్రారంభిస్తే, ఎవ్వరికీ అర్థం కాదని స్పష్టంగా బోధపడ్డది. 

బయటకు పరికించి చూశాడు.  వీధిలో బాలబాలికలు, స్త్రీపురుషులు, వికృత వేషాలతో, లింగ విచక్షణ లేకుండా చెట్టా పట్టాలు పట్టుకుని, కలగా పులగమైన ఓ క్రొత్త భాషలో మాట్లాడుతున్నారు, అతి త్వరితముగా పోతున్నారు.  శాస్త్రములలో, కావ్యములలో, అంతకు పూర్వం అతనెప్పుడూ ఎరుగని పదజాలం అతని చెవుల్లో పడుతున్నది.  సర్పంచ్, ఘెరావ్, మేస్త్రీ, ఓవర్ టైము, బోనసు, సర్దారు, మేనేజరు గాడు, ఓటు, క్రికెట్, జెట్, ఏర్ బస్సు లాంటి మాటలు విరివిగా వాడుతున్నారు.  సమాజంలో ఇదివరకు బూతులుగా పరిగణించబడి వర్జింపబడ్డ పదాలు, సరే సరి, ఊత పదాల్లా ప్రతినోటా తొణుకు బెణుకు లేకుండా అందరూ వినేలా అంటున్నారు. 

రచయిత సందిగ్ధావస్థలో నిస్సంశయంగా పడ్డాడు.  ఈ విచిత్ర పరిస్థితుల్లో, సంపూర్ణంగా ఎటు మొగ్గడానికీ వీల్లేదు.  ప్రాచీనాధునిక మనస్తత్వాలను కూడగట్టుకొని సమన్వయ పర్చాలి.  అందుకు ఒకటే రాజమార్గము.  మన పండితులు, విద్వాంసులు, కవులూ ఏర్పరచిన మూసలో క్రొత్తగా ఏర్పడుతున్న ఆలోచనలను స్థాపితం చెయ్యాలి.  పూర్తిగా సంస్కృత పద భూయిస్టమగు పాత శైలి గానీ, వట్టి తేలిక పదాలతోగూడిన ప్రస్తుత సామాన్య కర్షక కార్మిక భాషకు పరిమితం కాకుండా రెంటికీ మధ్యలో పయనం సాగించాలి.  ఒక కవిత్వం చదువుతున్నామంటే, మానవ మేధస్సుకు కొంచెం పని కల్పించాలి అన్నమాట.  అగాధంలో పడరాదు, అంతరిక్షంలోకి ఎగిరే ప్రయత్నం చేయాలి. 

మచ్చుకు కొన్ని ఉదాహరణలు:

“చెలువ మింపారు ఈ పృథ్వినలుముకొన్న గాఢ తిమిరమ్ములోన ఏకాకి నేను

విరహ మాధుర్య డస్సికా సరసిలోన అయితి ఒంటరివాడ శీతాంశు బోలె”

 

“ఆశలూరించు జీవితాకాశమందు

డెందమలరించు సౌఖ్య నిస్పందనములను

పలుకలేనట్టి మూగ హృధ్భావములను

తెలుపునే యెడ నిశ్శబ్ద తెరలుగాదె.”

 

“పలకని రాతి దేవుడికన్న పలికే మనిషే దేముడని

లోకానికి అవలోకంగా ప్రబోధించవయ్యా, దేముడూ!

ఎదురు చూస్తుంటాను ఎంతకాలమైనా

ప్రతి ఉదయం నువ్వు మనిషిలో ప్రవేశించే శుభ క్షణం కోసం!

మనిషే దేముడై నిలచే అమర క్షణం కోసం!”

 

“కాలపు ముళ్ళకంపపై ఆరేసిన జరీపంచ - జీవితం”

సమాప్తి -

*****

Website Designed

 &  Maintained

by

 Srinivas Pendyala