
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
మధురవాణి ప్రత్యేకం
సాహితీ సౌరభాలు
ప్రబంధ కవి – నంది తిమ్మన

ప్రసాద్ తుర్లపాటి
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
(గత సంచికలలో ప్రబంధ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ప్రబంధ కవులయిన నన్నెచోడ కవిరాజు, అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు ల కవితా శైలుల విశ్లేషణ, తదితర విషయాల పై క్లుప్తంగా పరిచయం చేశాను. ఇక ఈ సంచికలో మరియొక ప్రబంధ కవి – నంది తిమ్మన గారి గురించి పరిచయ వ్యాసాన్ని సమర్పిస్తాను. )
శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానములో అష్టదిగ్గజ కవులలో ఒకడిగా ప్రఖ్యాతి గాంచిన నంది తిమ్మన 16 వ శతాబ్దం పూర్వ భాగానికి చెందిన కవి (1520 ప్రాంతము). నంది సింగయ, తిమ్మాంబ ల పుత్రుడు నంది తిమ్మన. ఈ కవి రచించిన ప్రబంధ కావ్యం – “ పారిజాతాపహరణం” . ఈ ప్రబంధములో తన గురించి ఈ విధముగా పరిచయం చేసుకొన్నాడు.
కౌశికగోత్ర విఖ్యాతు డాపస్తంబ సూతృడార్వేల పవిత్రకులుడు
నంది సింగనామాత్యునకు తిమ్మాంబకు తనయుండు సకల విద్యావివేక
చతురుడు మాలయమారుత కవీంద్రునకు మేనల్లుండు కృష్ణారాయక్షితీస
కరుణా సమాలబ్ధఘన చతురాంతయానమహాయాగ్రహార సన్మానయుతుడు
పారిజాతపహరణం తిమ్మన గారి అద్వితీయ ప్రబంధం. రాయలవారికి, వారి రాణి చిన్నాదేవికి కలిగిన అంతఃపుర ప్రణయ కలహాన్ని తీర్చడం కొరకై, శ్రీకృష్ణుడు, సత్యభామల మధ్య ప్రణయకలహం ఏ విధముగా సమసిపోయిందో అన్న కధాంశం తో ఈ కావ్యం రచించినాడని ఒక నానుడి. ఈ కావ్యం శృంగార రస ప్రధానంగా సాగినా, సామాజిక అంశములను, సంసారంలోని చిన్న మాటపట్టింపులు, వాటిని ఆలుమగలు పరిష్కరించుకొని వారి మధ్యనున్న అనుబంధాన్ని పెంపొందించుకొనవలసిన ఆవశ్యకతను వివరించారు.
పారిజాతాపహరణ కావ్యం ఐదు ఆశ్వాసాల ప్రబంధం. ఈ కావ్యనాయికానాయకులు సత్యభామ శ్రీకృష్ణుడు. రుక్మిణి, నారదుడు మిగిలిన ప్రధాన పాత్రలు. ఈ కావ్యంలో తిమ్మన చక్కని కధాశిల్పము తో పాటుగా పాత్ర పోషణలో, వర్ణనలో, శైలిలో మంచి పాండితి ప్రతిభ కనపరచాడు. తిమ్మన యొక్క ఈ కావ్య శైలి వలన “ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు ..” అన్న నానుడి ఏర్పడినది. పాత్రను బట్టి శైలి, నాటకీయత, సామెతలు, సూక్తులు, సమయోచితమైన ఉపమానాలు, తెలుగు నుడికార మధురిమలు ప్రయోగిచుట తిమ్మన కవితా ప్రత్యేకత. తిమ్మన ఈ ప్రబంధము లో సత్యభామ పాత్రను ఒక శృంగార రసాధిదేవతగా చిత్రీకరించాడు. ఆమె సౌందర్యం, అభిజాత్యం, అలకలు, పలుకుల ను ఎంతో సౌందర్యవంతముగా వర్ణించాడు. శ్రీకృష్ణుని మానవ మూర్తిగా చూపిస్తూ, రుక్మిణి వినయం, నారదుని కలహప్రియత్వం, దేవేంద్రుని అహంకారం మరియు అమాయకత్వం చక్కగా వివరించాడు.
సంస్కృత హరివంశం లోని కథను ఆధారంగా తీసుకొని సర్వ ప్రబంధ లక్షణాలతో ఈ కావ్యాన్ని తీర్చిదిద్దాడు.
తిమ్మన ప్రతిభను ఆయన రచించిన పద్యాల సొబగులలో ఆస్వాదిద్దాము.
పారిజాతాపహరణం కావ్యము అవతారికలో తిమ్మన చేసిన స్తుతి –
శ్రీ మదికిం ప్రియంబెసగ చేర్చిన యుయ్యెల లీల వైజయం
తీమిళితాచ్చకౌస్తుభము నిద్దపుకాంతి దనర్చి యాత్మవ
క్షోమణి వేది బొల్పెసగ చూడ్కుల పండువు సేయు వెంకట
స్వామి కృతార్ధుజేయు నరసక్షితినాధుని కృష్ణరాయునిన్
తన వక్షస్థలముపై నున్న వైజయంతీమాల అనే ఉయ్యాలలో లక్ష్మీ అమ్మవారిని, వైజయంతీమాలతో బాటు ప్రకాశిస్తున్న కౌస్తుభాన్ని వక్షస్థలం మీద ధరించిన వేంకటేశ్వర స్వామి ఊపుతున్నట్లున్నాడని; ఆ శృంగార వేంకటేశ్వరుడు మా ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలవారిని రక్షించవలసినది అని తిమ్మన ప్రారంభ ప్రార్ధనలోనే కథావస్తువును ధ్వనింపజేశాడు.
తదుపరి తిమ్మన చేసిన ఈ పరమశివుని ప్రార్ధనలో, నాయిక అసూయా భావాన్ని సూచించాడు.
పొలతుల్కౌగిటం గ్రుచ్చి యెత్తి తలబ్రాల్ వోయించు నవ్వేళ నౌ
దలగంగం దన నీడ తాను గాంచి, మౌగ్ధ్యంబొప్ప వేరొక తొ
య్యలియంచున్మదినెంచు పార్వతి యసూయావ్యాప్తికి నవ్వు క్రొ
న్నెలతాలుపు కృష్ణరాయునికి సంధించున్ మహైశ్వర్యముల్
చెలికత్తెల సహాయంతో శివుడికి తలంబ్రాలు పోస్తూ, అతని తలపైనున్న గంగలో తన నీడ తానే చూచి వేరొక స్త్రీ అనే భ్రమతో అసూయపడుతున్న పార్వతిని చూచి నవ్వుకుంటున్న ఆ పరమేశ్వరుడు కృష్ణరాయునికి మహాఐశ్వర్యాలని ప్రసాదించాలని ప్రార్ధన చేశాడు.
ఈ రెండు ప్రార్ధన పద్యాలలో కథానాయకుని సమయస్ఫూర్తి, కథానాయిక అసూయా భావాన్ని సూచించి, కావ్యానికి నాంది పలికాడు.
నారద పాత్ర -
సరిగమపదనిస సంజ్ఞ స్వరంబుల - మహతి నభో వాయు నిహాతి మొరయ
భగీరధీ పయః పరిపూర్ణ మణి – కమండలపు హస్తంబున జెలువు మిగుల
ప్రణవ మంత్రావృత్తి పావన స్పటికాక్ష - వలయంబు కర్ణ శషుకలిక వ్రేల
సమర నృ నృత్యోచిత చామర వాలంబును – గక్షపాలయు భుజాగ్రమున మెఱయ
దేహకాంతులు లకాల చంద్రికల నీన
జడలు మోక్షధ్రువ పల్లవ శంక సేయ
గగనమున నుండి వచ్చె నాకస్మికముగా
నారీ వేరంపు తపసి దైత్యారి కడకు
దేవర్షినారదుడు తన మహతి వీణపై సప్తస్వరాలు వాయిస్తూ, ఆకాశగంగా జలాన్ని కలిగిన మణిమయ కమండాలన్ని పట్టుకొని, తన జపమాల ను ధరించి, వెన్నెల కాంతి వంటి తేజస్సుతో శ్రీకృష్ణ దర్శనార్ధం ద్వారకా నగరానికి పారిజాత పుష్పము తో విచ్చేసాడు. ఆయన జడలు మోక్ష వృక్షానికి చిగురులా తోస్తున్నాయి.
సత్యభామ పాత్ర చిత్రణ –
తిమ్మన కవితా శిల్పానికి కోపగృహములో సత్యభామను శ్రీకృష్ణుడు సముదాయించు ఘట్టము ఒక చక్కని ఉదాహరణ. తిమ్మన అసమాన రచనాశిల్పంతో ఆశ్చర్యము, కోపము , అసూయ అవమానము దుఃఖము పెనవేసిన నాయికగా సత్యభామ సజీవ మూర్తిని మనకు సాక్షాత్కరింప చేశాడు.
దేవర్షినారదుడు దేవలోకం నుంచి పారిజాత దివ్య కుసుమాన్ని తెచ్చి రుక్మిణీ మందిరములోనున్న శ్రీకృష్ణుని కిచ్చిన శ్రీకృష్ణుడు ఆ పారిజాత సుమమును రుక్మిణికి యిచ్చినాడు. సత్యభామ చెలికత్తె ఈ ఉదంతమంతా చెప్పింది సత్యభామ కు. అప్పుడు -
అన విని వ్రేటువడ్డ యురగాంగనయుం బలె, నేయి వోయ భ
గ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కులఁగుంకుమ పత్ర భంగ సం
జనిత నవీన కాంతి వెదజల్లగ గద్గదఖిన్న కంఠియై.
దెబ్బతిన్న త్రాచువలె, నేయిపోయగా భగ్గున మండిన అగ్ని కీలలు ఎలా భగ్గుమని లేస్తాయో అలా జ్వాలవలె లేచి, కన్నులు ఎర్రపడి, ఆ కళ్ళలోని అరుణ కాంతి చెంపల మీదకు వ్యాపించి కుంకుమతో కలసి ఒక కొంగ్రొత్త కాంతి వెదజల్లుతూ ఉండగా, దుఃఖము ముంచుకొస్తూ వుంటే, స్త్రీ సహజమైన గద్గద కంఠముతో సందేహాందోళితయై ఈ విధముగా అంటున్నది –
ఏమేమీ! కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా?
యా మాట ల్చెవియొగ్గి తా వినియెనా యా గోపికావల్లభుం?
డేమే మాడెను రుక్మిణీపతియు? నీ వింకేటికిన్ దాఁచెదే?
నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కం బెఱింగింపవే!
అతుల మహానుభావమని యవ్విరి దానొక పెద్ద సేసి య
చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద యిచ్చిన నిచ్చెఁగాక తా,
నాతడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసిన జేసెఁగాక, యా
మతకరి వేలుపుందపసి మమ్ము దలంపగ నేల యచ్చటన్.
సత్య భామ తనకు బాధ కలిగించే విషయాలను ప్రస్తావిస్తోంది ఈ పద్యంలో . నారదుడు పారిజాత పుష్పాన్ని కృష్ణునికి ఇవ్వటం, ఆయన దానిని రుక్మిణి కీయడం, నారదుడు తనను గేలి చేస్తూ మాట్లాడడం. ఈ మూడూ ఆమెకు భాధాకరమైనవే. ఈ పద్యంలో సత్యభామ మనస్థితి చాలా స్వభావసిద్ధంగా వర్ణించబడినది. నారదుడు ఆ పువ్వును ఓ బ్రహ్మాండమైనదిగా వర్ణించి కృష్ణుడి మెప్పు కోసం ఇస్తే ఇవ్వని, దాన్ని కృష్ణుడు తనకు ఇష్టమైన వారికి ఇస్తే ఇవ్వని, కానీ, ఆ మతకరి వేలుపుం దపసి (మతకము + అరి మోసకారి) నన్ను గూర్చి మాట్లాడ్డమెందుకు. సత్యభామ యొక్క అలక్ష్యాన్ని అసూయను, స్వాభిమానాన్ని, అతిశయాన్ని చూపాడు తిమ్మన.
ఇక తన ప్రియసఖుడైన శ్రీకృష్ణుడిపై కోపగించుకొని -
మాసిన చీర కట్టుకొని, మౌనముతోడ, నిరస్తభూషయై,
వాసెన కట్టుకట్టి, నిడువాలిక కస్తురి పట్టు వెట్టి, లో
గాసిలి, చీకటింటి కడ గంకటిపై జలదాంత చంద్ర రే
ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజ విషాద వేదనన్.
అని వగల బొగులుచు
జనితామర్షమున కోపసదనంబునకున్
జనియె లతాంగి హరిచం
దన కోటరమునకు నాగతరుణియు బోలెన్
హరి చందన కోటరమునకు వెళ్ళు నాగ కన్యక వలే కోపసదనానికి కోపంతో వెళ్ళింది సత్యభామ. మాసిన చీర కట్టుకొని గదిలో మౌనంగా రోదిస్తూ మంచం మీద శయనించింది. ఇక శ్రీకృష్ణుడు సత్యభామ మందిరానికి విచ్చేసి ఆమెకు ఎన్నో సపర్యాలు చేశాడు. ఇక -
పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు దీర్ప నె
ప్పాటును పాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్టఁ నా జగ
న్నాటక సూత్ర ధారి యదు నందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్
పొగడపూవుల తావిని బోవు సువాసనకల సత్యభామ మనస్సులో సంభవించిన కోపభారాన్ని మరి ఇక ఏ విధముగా పోగొట్టే ఉపాయము కనిపించకపోవటంతో, చివరకు మెత్తని చిగురుటకుల వలే కోమలమైనవిగా ఎర్రటి కాంతితో శోభించే సత్యభామ పాదాలకు తన కిరీటములోనున్న మణులకాంతితో కలసి వన్నె తెచ్చే విధముగా, ఆమె మృదు పల్లవ కోమల పద ద్వయానికి తన శిరస్సును మెల్లగా తాకిచ్చాడు ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు.
“ముక్కు తిమ్మన ముద్దుపలుకులకు “ ఈ పద్యం చక్కని ఉదాహరణ.
ఆగ్రహోదగ్ర యైన ఆ సత్యభామ –
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిర మచ్చో వామపాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్ల యగు నాధుల్నేరముల్సేయ బే
రలుకం జెందిన కాంత లెందునుచిత వ్యాపారముల్నేర్తురే?
సాక్షాత్తు బ్రహ్మ, ఇంద్రుడు, మొదలైన దేవతలచే నిరతము పూజించబడే శిరస్సు, సాక్షాత్తు మన్మధుని కన్నతండ్రి ఐన శ్రీమన్నారాయణుడి శ్రీరస్సు, అటువంటి పరమ పవిత్రమైన శిరస్సుని సత్యభామ తన ఎడమ కాలితో అవతలికి తొలిగేలా త్రోసినది. భర్తలు నేరాలు చేస్తే, పెను కోపము చెందిన కాంతలు ఉచితానుచితాలు చూస్తారా ?
ఇక్కడ తిమ్మన చమత్కారాన్ని గమనిద్దాం –
“ .. మచ్చో వామపాదంబునందొలగంద్రోచె లతాంగి..” - పాదము ‘తో’ తొలగత్రోసినది (తృతీయ విభక్తి)
మరియొక విధముగా ...
“ .. మచ్చో వామపాదంబునందొలగంద్రోచె లతాంగి..” - పాదాన్ని అక్కడ ‘నుండి’ తొలగించింది (పంచమి విభక్తి)
ఇంతకూ సత్యభామ తన ‘పాదముతో తన్నిందా’ లేక తన ‘పాదాన్ని అక్కడనుండి తొలగించినదా’ ? విశ్వనాధ వారు మాత్రం తన పదాన్ని అక్కడ నుండి తొలగించినది అన్నదానినే సమర్ధించారు.
(ఎమెస్కో వారు ప్రచురించిన ‘పారిజాతాపహరణము’ అన్న కావ్యానికి విశ్వనాధ వారు కమనీయమైన పీఠిక రచించారు)
మరి శ్రీకృష్ణుడు -
నను భవదీయదాసుని మనంబున నెయ్యపు గిన్క బూని తా
చినయది నాకు మన్ననయ; చెల్వగునీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము దాకిన నొచ్చునంచు నే
ననియెద; నల్కమానవు గదా! యికనైన నరాళకుంతలా!
ఓ ఆరాళకుంతలా (వంకీలు తిరిగిన కేశములు కలదాన !! ), నీ పదపల్లవములు, నా శరీరములోని కంటకము లవలే నున్న రోమాలను తాకి నొచ్చుకోలేదు కదా ! నీవు అల్కపూని తంతే అది నాకు గౌరవమే కదా!! ప్రణయకోపంలో తాచినా ఫరవాలేదు అంటూ అనునయించాడు ఆ లీల మానుషవేషధారి మురారి.
అప్పుడు సత్యభామ -
ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచేఁ
గాసిలి యేడ్చె ప్రాణ విభు కట్టెదుటన్ లలితాంగి పంకజ
శ్రీ సఖమైన మోము పయి చేల చెరంగిడి బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కల కంఠ వధూ కల కాకలీ ధ్వనిన్ !!
ఈర్ష్య వలన పుట్టిన శోకం సత్యభామ మనసులో దావానములా వ్యాపించింది. పంకజం వంటి తన ముఖముపై చీర చెంగు కప్పుకొని తన ప్రాణవిభుని ముందరే, లేత చిగురుటాకులు తినడం వలన మధురమైన కంఠం కల ఆడుకోయిల (కల కంఠ వధూ ) అవ్యక్తమైన సన్నని స్వరముతో (కాకలీ ధ్వనిన్) ఏడ్చింది. తిమ్మన గారి కథానాయిక ముద్దు ముద్దుగా ఏడ్చింది అనడానికి ఉదాహరణ ఈ పద్యం. నాయిక ఏడుపుని ఇంత మధురంగా వర్ణించడం తిమ్మన కే చెల్లు.
ఇక శ్రీకృష్ణుడు సత్యభామకు పారిజాత పుష్పమేమి, ఇంద్రాది దేవతల నెదిరించి పారిజాత వృక్షాన్ని ఆ స్వర్గము నుంచి తీసుకొని వచ్చుట, సత్యభామ గృహములో నాటుట, పుణ్యక వ్రతము, ఆ వ్రత విధిగా సత్యభామ శ్రీకృష్ణుని నారదునికి దానముగా ఇచ్చుట, నారదుడు శ్రీకృష్ణునితో నూడిగములు చేయించుకొనుట, సత్యభామ శ్రీకృష్ణుని మరల గొనుట, నారదాదులు శ్రీకృష్ణుని స్తుతించుట ఇత్యాది అంశములు ఈ కావ్యములో తిమ్మన ఎంతో అందముగా రచించాడు. తెలుగు సాహిత్యములో అద్భుతమయిన ప్రబంధం పారిజాతాపహరణము.
ఐదవ ఆశ్వాసములో నారదుడు చతురోక్తులతో, చిత్ర విచిత్ర పద్య పదబంధాలతో శ్రీకృష్ణుని నుతించే సందర్భములో తిన్నన రచించిన పద్యాలు చిత్ర, బంధ కవితా రీతులకు ఉదాహరణలు గా పేర్కొంటారు. కొన్ని ఉదాహరణలు –
అనులోమ విలోమ కందము
నాయ శరగసారవిరయ
తాయనజయసా రసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతా యరవిరసాగరశయనా !
ఈ కంద పద్యమును నర్ధభ్రమక కందమని అందురు. మొదటి రెండు పాదములును తుది నుండి వెనుకకు చదివినచో మూడు నాలుగు పాదములగును. అనగా పూర్వార్ధమును త్రిప్పి చదివినచో నుత్తరార్ధమును, ఉత్తరార్ధమును వెనుక నుండి చదివినచో పూర్వార్ధము నగునని భావము.
పాదభ్రమకము
ధీర శయనీయ శరధీ
మార విభామమత మమత మమభావిరమా
సార సవన సవసరసా
దారాద సమ తార హార తామసదరదా !
పాద భ్రమక మనగా, ప్రతి పాదమును వెనుక నుండి చదివినను నదే పాదమే యగును. దీనినే అనులోమ విలోమ పాదామని అందురు.
ద్వక్షరి కందము
మనమున ననుమానము నూ
నను నే నామ మనుమనుమననమును నే మ
మ్మున మాన నన్ను మన్నన
మను మను నానా మునీన మానానునా
కేవలం ‘న’, ‘మ’ అను రెండక్షరముల తొడనే సాగిన కందమిది, అందుకే ద్వక్షరి కందమని పేరు.
ఈ విధముగా తిమ్మన చిత్ర విచిత్ర కవితారీతులు కూడా మనకనదించాడు. నంది తిమ్మన పారిజాతాపహరణ కావ్యాన్ని అత్యంత రమణీయంగా, సరసంగా, వర్ణనా భరితంగా రచించి పఠితులకు ఆనందాన్ని కలిగించాడు.
“మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూప నట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మా! “
అని తెనాలి రామకృష్ణుడి లాంటి మహా కవి చేత పొగడబడిన అష్ట దిగ్గజ కవి, మంగళ మహశ్రీ నంది తిమ్మన.
*****