top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

raama-mayam.jpg
Vijnaanam.jpg
Satyanveshana Final Cover.jpg
manchu-karigaaka_edited.jpg

అంతా రామమయం:

కొద్ది నెలల క్రితమే శ్యామ్ విహారి గారు వ్రాసిన రెండు పుస్తకాలు పంపి చదవమని చెప్పినప్పుడు, అన్ని పుస్తకాలలాగే పక్కన పెట్టి ‘తరవాత చదువుతాను’ అని చెప్పి పక్కకు పెట్టేసాను.  ఆ ‘తరవాత’ రావడానికి మరికొన్ని నెలలు పట్టింది.  చివరికి చదివిన వెంటనే అనిపించిన మాట ‘నేను ముందే ఎందుకు చదవలేక పోయానా’ అని.  మరో సందర్భంలో సి.ఎస్. శర్మ గారి శత జయంతి సభలో విహారి గారెని చూడడం, ఆయన మృదుభాషణాన్ని వినడం జరిగింది.  అదృష్టవంతుణ్ణి అనుకున్నాను.  

‘అంతా రామమయం’ (సారస్వత వ్యాసాలు) విహారి గారు రామాయణంలోని పాత్రలపైన, ‘ధర్మ సూక్ష్మ ప్రసారం’ అన్న మకుటంతో ప్రతి కాండలోనూ తను చూసిన ధార్మిక విలువలు, తదితర వ్యాసాల సంపుటి.  పదహారు వ్యాసాలు ‘భక్తి పత్రిక’ లో ధారావాహికంగా ప్రచురించబడ్డవని చెప్పారు.    

ఇప్పుడు మళ్ళీ “రామాయణం ఎందుకు” , రామాయణాన్ని మళ్ళీ ఎందుకు చదవాలి అని ప్రశ్నలు వేసి ఆయనే చెప్పిన సమాధానం “అది ఎప్పటికీ చిరాయువు కనక, ఎప్పటికీ సమాజానికి మంచినే చెబుతుంది కనక”, “అది మానవేతిహాసం..... మనిషి మనసు వైకల్యానికీ, మనిషి నడత వైచిత్రికీ అద్దం పట్టింది రామాయణం”.  

రాముడు దేవుడనలేదు, విహారి గారు.  రామాయణం కథలో చెప్పిన మంచి సమాజానికి ఉపయోగమనే ప్రగాఢ నమ్మకాన్ని, ఉదాహరణలతో మనముందుంచారు.  రామాయణాన్ని కేవలం భక్తి పరంగానే కాక, అది ఒక కథ లాగే చూసినా, ఆయా పాత్రలను చిత్రీకరించిన వాల్మీకి కవి గొప్పదనం, పాత్రల ఔచిత్యం అతి సులభమైన శైలిలో మనముందుంచారు రచయిత.  ఎంతో అనుభవంతో జీవితాన్ని చవి చూసి రాసిన ఆయన మాటలు శిరోధార్యాలు.  

ఇదివరలో విహారి గారు 6,500 పైగా పద్యాలతో శ్రీ పదచిత్ర రామాయణం, చందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండలూ వ్రాసి ప్రచురించారు.  ఎందరో కవి, పండితుల ప్రశంసలనందుకున్న కావ్యమది.  వాల్మీకి రామాయణాన్ని అనుభవించి తిరిగి తనామాటల్లో చెప్పిన విహారి గారు వాల్మీకి రామాయణాన్నే కాదు, తెలుగులో వెలువడిన అన్ని రామాయణాల్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారన్నది ఆయన రాసిన ఒక వ్యాసం ద్వారా విదితమవుతుంది.  మరి అంత చదివి, జీర్ణించుకుని మాట్లాడిన మాటలు ఎంతో విలువైనవని చెప్పడంలో అతిశయోక్తి ఏముంది?

రాముడు గురించి చెప్పనక్కరలేదు.  ఎన్నో వ్యాసాలలో రాముడికి ధర్మాన్ని తు చ తప్పకుండా అమలుపరిచే గుణం, రాజుగా తన బాధ్యత, చుట్టుపక్కల అందరితో తనకున్న అభిమానంతో కూడిన అనుబంధం, సీతతో జరిపిన వాగ్వివాదాలు, ఆమె వినకపోతే ఆమె మాటే విన్న సందర్భాలు, ఎన్నో, ఎన్నెన్నో.

రామాయణంలో ప్రధాన పాత్రలు రాముడు, సీత, లక్ష్మణుడు అని ఎవరూ చెప్పనక్కరలేదు కదా.  మరి ఒక కవిగా, రచయితగా, వాల్మీకి మిగిలిన పాత్రలతో కథ ఎలా నడిపాడు?

వాల్మీకి సృష్టించిన కొన్ని సమయానుకూలంగా వచ్చి వెళ్ళే  పాత్రల గురించి చెబుతూ, విహారి గారి మాటల్లో “రామావతార పరమార్థాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించిన దుష్టబుద్ధి మంథర.  ఆమె సీతారామ లక్ష్మణ వనగమనం తర్వాత కనిపించదు.  సీతకు పతివ్రతా ధర్మాలను చెప్పి ప్రీతి దానం చేసిన ధర్మస్ఫూర్తిమూర్తి అనసూయ.  రాముని గుణప్రశస్తి చేసీ మునులు శరభంగుడు, సుతీక్ష్ణుడు.  అగస్త్యుడు, భరద్వాజుడు, ఇంకా మారీచుడు, శబరి, జటాయువు, సంపాతి, స్వయంప్రభ, శూర్పణఖ, అకంపనుడు, ఇలా ఎందరెందరో వారి వారి కర్తవ్యాలను నిర్వహించి తెరవెనక్కు వెళ్ళిపోతారు.  కథాగతిని అనుసరించి పాత్ర పోషణ జరగాలనే పాఠాన్ని అందించారు మహర్షి.  ప్రతి పాత్ర చిత్తవృత్తిని స్పష్టంగా ఎరిగిన కవి ఆయన.  ఆయా పాత్రల మనస్తత్వ వైరుధ్యాలను, వైచిత్రిని, అపూర్వంగా దర్శనం చేసినవాడాయన.”  మంధర, అనసూయ, శూర్పణఖ, స్వయంప్రభ, పక్షీరాజులు, శబరి, తార, మండోదరి, ఇలా వీరందరి పాత్రలు కథకు ఎలా చక్కగా అమరిపోయాయన్నది విహారి గారు చక్కగా విశదీకరించారు.  

ఆరు వ్యాసాలలో ఆరు కాండలలో చెప్పబడిన ధర్మ సూక్ష్మాలు వివరించారు విహారి గారు.  కొన్ని నేను ఆశించినంతగా లేవని చెప్పాలి.  బహుశా నేను ప్రస్తుత ధర్మాన్ని అప్పటి ధర్మంతో పోల్చి చదివానేమో!  

ఇక తెలుగులో పద్యారామాయణాల గురించి చెప్పిన వ్యాసం నాకు నచ్చింది.  నాకు తెలియని రామాయణాలెన్నో కనబడ్డాయి. 

వాల్మీకి రామాయణంలో చూపించిన అప్పటి సమాజం, రామతత్వం, అందులో కనిపించని యోగవాశిష్టం గురించి చిన్న ఉపోద్ఘాతంతో పుస్తకం ముగుస్తుంది.  

ధార్మికులకు, భక్తులకు, రామాయణం ఒక కథే అనుకునే నాలాంటి వారికి, వాల్మీకి రాసిన రామాయణంలో కనబడే గొప్పదనాన్ని చిలికి కొన్ని చిన్న వ్యాసాలలో పొందుపరిచి మనముందుంచారు విహారి గారు.  వాల్మీకి రాసిన రామాయణం చాలామందిమి చదవము, తెలుసుననుకుంటాము.  మనకు తెలిసిన రామాయణం పెద్ద ఎత్తులో తెలుస్తుందేకాని, ఒక గొప్ప రచయిత రాసిన ఉద్గ్రంథంలో రచయిత పరంగా చూడం.  కొన్ని లోతులు మన దృష్టిని ఆకర్షించవు, దృష్టికి అందవు కూడా.  చిన్న చిన్న సులభశైలిలో అందించిన వ్యాసాలు ఎంతో ఆసక్తికరంగా చదివించడమే కాక తెలిసీ తెలియని ఎన్నో విషయాలకు స్పష్టతనిస్తాయి.  పుస్తకం పేరు సార్ధకం – అంతా రామమయం.  రామాయణం గురించి తెలుసుననుకునే వారికి, తెలియదనుకునేవారికీ కూడా ఈ వ్యాస పరంపర ఒక కొత్త కోణం చూపిస్తుంది.  అందరూ చదవవలసిన పుస్తకం.  

అరవై ఏళ్ళ పైచిలుకు తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన విహారి గారి కలంనుండి రామాయణంపై వెలువరించబడిన ఈ పుస్తకం పండిన తీయ మామిడిపండు లాంటిది.  ఆయన అందించారు.  అనుభవించడం పాఠకుల వంతు.  

పుస్తకానికి వెల కట్టలేము.  సతీష్ గ్రాఫిక్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకం రచయితనుంచి పొందవచ్చు (vihaari912@gmail.com).

 

 

 ‘కంటి వైద్య శాస్త్రంలో ప్రాచీన భారత దేశం అందించిన జ్ణాన సంపద (నిజా నిజాలపై ఒక వైద్య నిపుణుడి విశ్లేషణ)’ Musings on Medicine, Myth and History: India’s Legacy అనే పుస్తకానికి డా. చాగంటి కృష్ణకుమారి గారు వ్రాసిన అనుసృజన.  ఈ ఆంగ్ల మూలం డా. వాడ్రేవు K రాజు (Dr. V. K. Raju) MD, FRCS, FACS మరియు డా. లీలా రాజు, MD తో జరిపిన సంభాషణల సారం.  

పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ, డాక్టర్ వ్యాకరణం అచ్యుత రామారావు గారు (ఇంగ్లండ్) అన్నారు “ఈ పుస్తకం చదువుతూ, మీరు ప్రతి పుటానీ తిప్పుతున్నప్పుడు, వాడ్రేవు కె రాజూ గారి గుండెల్లో పొంగిపోర్లే భారతీయ భావానురాగాలు మీ చెవుల్లో దూరి  సరసాలాపనలు చేస్తాయన్నది నిజం.” అని.  

డా. వాడ్రేవు రాజు గారు రాజమండ్రిలో పుట్టి, కంటి వైద్యంలో ఉన్నత విద్యనభ్యసించి, భారతదేశమే కాకుండా ఇంగ్లండు, అమెరికాలలో కూడా ఎన్నో వేల కంటి వైద్యం, శస్త్ర చికిత్సలు చేసి, లాభాపేక్ష లేని సంస్థలు వైద్య సంస్థలను స్థాపించి, అటు రాజమండ్రిలో, కాకినాడలోనే కాక అమెరికాలో కూడా Eye Foundation of America (EFA) అనే సంస్థతో ఎంతో మందికి సహాయ పడుతూ ఈ రోజుకీ సేవలందిస్తున్నారు.  EFA ద్వారా అమెరికా భారత దేశాలే కాక ఈజిప్టు, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, టాంజానియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా మొదలైన దేశాలలో కూడా అపారమైన సేవలందించిన ఘనత రాజు గారిదే.  

పుస్తకం ముఖ్యోద్దేశ్యం పాఠకులకు “ప్రాచీన భారతదేశపు వైద్యం ఈ విధంగా వ్యాధులను గుర్తించి, వాటి చికిత్సలను నిర్వహించేదో చూపుతూ, ఆ నిర్వహణలో అనుసరించిన విధానాలలో, వారు కనరపచిన సాంస్కృతిక విజ్ఞాన విస్తృతి మీరనుకున్నదానికంటే ఎంతో ప్రాచీన కాలం నాటిది సుమండీ” అని ప్రపంచానికి చెప్పడమే.  రాజు గారు కేవలం నిపుణులైన డాక్టరే కాదు.  ఎంతమంది లేనివారికో కంటిచూపు తెప్పించినవారే కాదు, ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం పై ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో పరిశోధన చేసి, కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకున్న రాజు గారు ఆయా శాస్త్రవేత్తలకు, పురాతన వైద్యానికి రావలసిన గుర్తింపు రాకపోవడం వల్ల అందరికీ తెలియ చెప్పాలన్నది మొదట ఇంగ్లీషులో రాసిన పుస్తకానికైనా, ఇప్పుడు తెలుగులో వచ్చిన తర్జుమాకి అయినా ప్రధానమైన కారణం.  అందుకే ఎంత ఎక్కువమంది ఈ పుస్తకాన్ని చదివితే, అంత ఆనందం రాజు గారు పొందుతారనడంలో ఆశ్చర్యం లేదు.  

“అందుకే ‘కొన్ని వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటి సారిగా భారతదేశంలోనే కంటి శుక్లానికి శస్త్ర చికిత్స చేసారనీ, అది చేసిన వైద్యుడు సుశ్రుతుడినీ, చాలామంది చరిత్రకారులు నమ్ముతారు’ అని చెబుతాను.  --- అలాగే ఒక్కోసారి ‘ప్రతీదీ తగు మోతాదులో తీసుకోవాలి – గుర్తుంచుకోండి’ అని చెబుతూ ‘ఆయుర్వేదం చెప్పినట్లు’ అంటాను.  ‘ప్రసిద్ధ ప్రాచేన గ్రీకు వైద్యులు (అవును హిప్పోక్రేటీస్ వంటి వైద్యులు) వారి వైద్య శాస్త్రంలో చేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలు ప్రాచీన భారతీయుల నుండి గ్రహించినవే!’ అని వ్యాఖ్యానించడానికి వెరవను.” అని ఢంకా బజాయించి చెప్తారు రాజు గారు. 

గమనించవలసిన విషయమేమిటంటే ఈ పుస్తకంలో చెప్పిన మాటలు, సేకరించిన విషయాలు, ‘మాకూ ఉన్నాయిష’ అని తెలిసీ తెలియక చెప్పినది కాదు.  ఎంతో శాస్త్రీయ పరిశోధనతో విస్తృతమైన ఆధారాలతో సాధికారకంగా చెప్పిన మాటలు.  మూడువేల సంవత్సరాలక్రితమే సుశ్రుతుడు శస్త్రచిత్స, అది కూడా కంటికి, చేసినట్లు ఆధారాలేమిటి?  

సుశ్రుతుడు సంకలనం చేసిన ‘సుశ్రుత సంహిత’ గ్రంధం ఆధారంగా రాజుగారు ఎన్నో వివరించారు.  సుశ్రుతుడు కీ.పూ. 800-600 ప్రాంతం వాడని, శస్త్ర చికిత్సా వైద్యుడు, ఒక ఆచార్యుడు.  పుస్తకంలో వైద్యునికి ఉండాల్సిన అర్హతలు, ముక్కు, చెవులు అతికించే పద్ధతులు (ప్లాస్టిక్ సర్జరీ) పద్ధతులు, స్త్రీకి శిశువు జంమిస్తున్నప్పుడు ఫోర్సెప్స్ ఉపయోగించే విధానం, కంటి శస్త్ర చికిత్సలో కేటారాక్ట్ ఆపరేషన్ చేసే విధానం, ఎలా ఎన్నో వివరించడం జరిగింది.  అంటే కాదు, కళేబరాల్ని ఉపయోగించి విద్య బోధన చేసిన మొదట ఆచార్యుడితడే.  ఇవన్నీ రాజు గారు ఎంతో ఆసక్తి కరంగా విపులంగా వివరించారు.  

అంతే కాదు అతి ముఖ్యమయిన ఒక వ్రాతపతి – బోవర్ మానుస్క్రిప్ట్ – కొండ రావిచెట్టు పట్టాలపైనా బ్రాహ్మీ లిపిలో ఉన్న వ్రాతపతి – తూర్పు టర్కిస్తాన్ లో కూచార్ అనే ప్రదేశంలో దొరకడం వల్ల ఎన్నో విషయాలు వెలికి వచ్చాయి.  అప్పట్లో గ్రీకు, భారతదేశాల మధ్య రాకపోకలు, భారతదేశం నుండి గ్రీకులకు జ్నాన మార్పిడి ఎలా జరిగింది, ఇలా ఎన్నో విషయాలు మనముందుంచారు రాజు గారు.  

భారత దేశంలో ఆయుర్వేదం పుట్టుపూర్వోత్తరాలు, ఆయుర్వేదం యొక్క ఆశయాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయీ పుస్తకంలో.  

చాలా విలువైన పుస్తకం ఇది.  ఆధారాలతో నిరూపించిన సత్యాలను అందరికీ అందుబాటుకు తేవాలనే తాపత్రయంతో రాసిన పుస్తకం ఇది.  

డా. కృష్ణకుమారి గారి అనుసృజన చాలా సులభశైలిలో ఉంది.  ఆవిడ ఎన్నో సైన్సు పుస్తకాలను వ్రాసారు, అనువదించారు. తమ రచనా వ్యాసంగానికి ఆవిడ ఎన్నుకున్న ముఖ్య వస్తువు సైన్సు.  ఆవిడ చేసిన ఈ ప్రయత్నంలో ఎక్కడ తెలుగు పదాలు వాడాలో అక్కడ, ఎక్కడ ఆంగ్ల పదాలు వాడాలో అక్కడ వాడడంవల్ల చదువరికి సులభమయింది.  కంటిలోని అన్నీ భాగాలకు తెలుగు పేర్లు లేవు.   “చొరవ తీసుకొని కొన్నిచోట్ల అవసరమనిపించి మూలంలేని సంగతులను కూడా చేర్చాను.  మూలంలో రాసిన కొన్ని విషయాలను తెలుగు పాఠకులకోసం మార్పులు చేశాను – మూల రచయిత అంగీకారంతో” అన్నారు కృష్ణకుమారి గారు.  అందుకే విషయంలోకూడా చదవడానికి ఆసక్తి కలిగించింది.  

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతుంది.  భారత దేశంలో Goutami Eye Institute, Rajahmundry, అమెరికాలో Eye Foundation of America, Morgantown, West Virginia దగ్గర కూడా లభ్యమవుతాయి.  వెలకట్టలేని పుస్తకం ఇది.  

 

 

 

‘సత్యాన్వేషణ’:

 

మందపాటి సత్యం గారు ఈ మధురవాణి త్రైమాసపత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాసాల సంకలనం.  ఈ వ్యాస సంకలనానికి  దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల గారితో పాటు, నేను కూడా ముందుమాట రాసాను. అక్కడి నా మాటలను ఇక్కడ కొన్ని మీతో పంచుకుంటూ పుస్తకాన్ని పరిచయం చేస్తాను.  

‘సత్యాన్వేషణ’ శీర్షికలో వచ్చిన చాలా వ్యాసాలలో హాస్యం, వ్యంగ్యం కనబడుతుంది.  చిట్టెన్ రాజు గారు చెప్పినట్లుగా, అవి   కేవలం నవ్వుకోవడానికే కాదు, కాస్త నించుని ఆలోచిస్తే అన్నీ ఏవో ముఖ్య సందేశాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందిస్తున్నవే.  

 

ఆయన చెప్పిన కొన్ని మాటలు మనసుని తాకుతాయి ఎంతవారికైనా.  “పరిణామసిద్ధాంతంలో అవతరించిన ఈ భూగోళం మీద నువ్వూ, నేనూ అనే గీతలు లేనేలేవు.  మనమే గీసుకున్నాం.” అంటారు.  “మనిషి మళ్ళీ మనిషిగా ఎప్పుడు పుడతాడు? ఎప్పుడు మళ్ళీ మనిషిగా జీవిస్తాడు?” అనే ప్రశ్నలతో మొదలైంది సత్యాన్వేషణ ఈ పుస్తకంలో.  ఎంతో కదిలించిన వ్యాసం.  అక్కడనుండి మొదలైన వ్యాసాలు ఎన్నో అంశాలను స్పృశిస్తూ మనల్ని ప్రశ్నిస్తాయి.  

 

శ్వేతజాతీయుల అహంకారం, నల్లవారి బానిసత్వమే కావచ్చు, భారతీయులలో కులాల రూపంలో ఉన్న జాత్యహంకారమే కావచ్చు, రాజకీయాలలో ఉన్న కుళ్ళే కావచ్చు, మందుల కంపెనీలు ప్రజలను మభ్యపెట్టే వాణిజ్య ప్రకటనలే కావచ్చు, వైద్యవిధానంలో జరుగుతున్న మోసాలే కావచ్చు, పర్యావరణ పరిరక్షణ చెయ్యక, చెయ్యలేక మన కాళ్ళను మనమే నరుక్కునే ప్రపంచం కావచ్చు, జీవితమంతా సాహిత్యానికో, మరో కళకో అంకితం చేసి చివరకు ఏమీ మిగలక తిండికి కూడా లేని కళాకారులను సరిగా చూడలేని సమాజం గురించి కావచ్చు, రచయితలు, కవులు తమ తమ పుస్తకాలను తామే అచ్చు వేయించుకుని అవి కొనేవాళ్ళు కానీ, చదివే వాళ్ళు కానీ లేక నిజంగా మంచి సాహిత్యానికి పట్టిన గ్రహణం కావచ్చు, సినీ సాహిత్య సౌరభం కావచ్చు, తమ తమ భాషలపై అర్థం లేని ఆవేశాలు కావచ్చు, ఆయన ముట్టుకోని విషయం లేదు.  ఎన్ని పిట్టకథలో, ఎన్ని సంఘటనలో, ఎంత మంది రచయితలో, ఎంతమంది దర్శకులో, ఎంత చరిత్రో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విశ్వం కనబడుతుంది ఈ వ్యాసాలలో.  

 

అంతే కాదు.  కొన్ని కొన్ని వ్యాసాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి.  గిలిగింతలు పెడతాయి.  నవ్విస్తాయి, కవ్విస్తాయి.  హాస్యం, వ్యంగ్యం కలగలిపి పాఠకులకు కిక్ తెప్పించేవి ఎన్నో!  అమెరికాలో మనుమలను, మనుమరాళ్లను  చూసుకునే తాతలు, అమ్మమ్మలు, మామ్మల మధ్య మాట, మంతీలు,  సైబర్ యుగంలో, సాంఘిక మాధ్యమాల అలలలో కొట్టుకొని పోతూ గమ్యం తెలియదని కూడా తెలియని బతుకులు, అన్నీ బలిసిన తండ్రి, తల్లి, ఏమీ రాని కొడుకుల మధ్య సంభాషణం, అఖిలభారత జంతు సంఘం పేరడీ, ఇలా సాగిపోతాయి పుస్తకమంతా.

అన్నీ చదవ దగిన, చదవ వలసిన వ్యాసాలు.  

సత్యాన్వేషణ పుస్తకం కేవలం ఈ-పుస్తకం గానే ప్రచురించారు.  ప్రతులు కినిగేలో, ఇతర ఈ-పుస్తకాలు దొరికే ఎక్కడైనా దొరుకుతాయి ఒక్క అమెజాన్ లో తప్ప.    

 

 

‘మంచు కరిగాక’ : 

 

విన్నకోట రవిశంకర్ గారు వ్రాసిన కవిత సంకలనం.  

రవి శంకర్ గారు సహజ కవి.  ఆయనది కవిగానూ, రవిగానూ బాహ్య ప్రపంచాన్ని అంతరంగంలో చూడగలిగే దృష్టి.  అతి సున్నితమైన భావాలు కూడా స్పష్టంగా తనదైన కవిత్వంలో వ్యక్తం చేయగలిగే కవి రవిశంకర్.  'మంచు కరిగాకా 2011 నుంది 2021 వరకూ అడపా దడపా రాసిన కవితల సంకలనం.  ఆయన ఉందే ఊరులో మంచు అప్పుడప్పుడు మాత్రమె పడుతుంది. అలా పదిన మంచు కరిగాక అది చూసిన భావనలో అదే పేరుతో రాసిన కవిత అది.  

'ఎన్నాళ్ళకో వచ్చిన తెల్ల తుఫాను - అంతలోనే 

పరిచిత ప్రదేశాలు వెతుక్కుంటూ 

తరలిపోయింది

అదే అదనుగా సూర్యుడు

పదునుపోయిన కిరణాలతోనే

తన పని మొదలు పెట్టాడు'

 

అంటూ మొదలైన కవిత ఈ విధంగా ముగుస్తుంది

 

'మంచు వెళ్ళే మార్గంలో 

మా ఊరు ఎప్పుడో గాని తగలదు

వచ్చినప్పుడు అది 

పంచి ఇచ్చిన అనుభవాన్ని మాత్రం

కొన్నాళ్ళవరకూ ఊరు

పంచదారలా చప్పరిస్తూనే ఉంటుంది'

 

‘పదును పోయిన సూర్యుడు’, ‘అనుభవాన్ని ఎక్కడ మిగలదో అనుకుంటూ పంచదారలా చప్పరించే ఊరు’ - ఈ రెందు ఉపమానాలూ చాలవూ, కవి మనసులోకి మనల్ని పరకాయ ప్రవేశం చేయించడానికి?  అంతే కాదు, ఈ కవితలోనే అంటారు -

 

ఒక్క రాత్రిలోనే

ముసలి రూపం దాల్చిన ఇళ్ళన్నీ

ఇప్పుడు అక్కడక్కడ నెరిసిన తలలతో

నడివయసు గృహస్తుదిలా కనిపిస్తున్నాయి

 

సుమారు ముప్ఫై ఒక్క కవితలున్నాయి ఈ పుస్తకంలో.  అన్నీ చిన్న కవితలు, సున్నిత భావాలను వ్యక్తం చేస్తూ మనల్ని ఏక్కడో ప్రశాంతంగా ఉండే ఏదో లోకానికి తీసుకెళ్తాయి.  

 

రవిశంకర్ గారి గురించి రాస్తూ, తమ్మినేని యదుకుల భూషణ్ అంటారు - "రవిశంకర్ కవిత్వాన్ని జాగరూకతో చదివే పాఠకునికి - అందమైన జలపాతం వెనుక దాగిన రహస్యమయదీప్తిలా - అందులో తప్పక ఒక తలపోత, తాత్వికత పొడసూపుతాయి." – చక్కని మాట.

 

కవితల్లోంచి కొన్ని చిన్న తళుకులు - 

 

"రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతరు వస్త్రాలు

ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు" - ఆట

 

"కాని, తప్పటడుగులు వేసిన నేలే

ఎప్పతికీ తలపుల్లో నిలుస్తుంది" - ప్రవాసి

 

"యౌవ్వనం ఒక నిరంతర సంచారి

ముసలితనం

ఒక అనాహ్వానిత అతిథి" - మళ్ళీ వసంతం

 

"ఈ కటిక నిశ్శబ్దంలో 

ఒక అల్లరి పదం

మువ్వకట్టిన లేగదూడై

గంతులు వేయాలి" - కదలిక

 

"చిన్నప్పతి జ్ఞాపకాలు

శిలా శాసనాలు

నిన్నతి అనుభవాలు

నీటిపై రాతలు" - మరుపు

 

ఇలా సాగుతాయి కవితలన్నీ!  చక్కటి అనుభూతుల్ని కలిగిస్తూ...

 

చిన్న పుస్తకం.  మంచి కవితలు.  చదవండి.  

 

ముఖచిత్రం కూడా రవిశంకర్ కవితే - మంచు పడిన భూమి, ఆకులు రాలిపోయిన ఒంటరి చెట్టు, దాని పక్కనే కూర్చుండే బల్ల.  మంచు కరగలేదప్పటికి.  బొమ్మ చూసి మనం కరిగిపోతాం.

అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకం ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతాయి.

“Open your eyes, Open your mind, Open your soul - పాఠకునికి ఈ మూడింటిలో ఏ ఒక్కటి కలిగించినా మా ప్రయత్నం సఫల మైనట్టే" అన్నారు పబ్లిషర్లు.  మూడూ కలిగిస్తాయి రవిశంకర్ గారి కవితలతో.  మంచి పుస్తకం పాఠకులకందించినందుకు అన్వీక్షికి వారికి కూడా అభినందనలు.    

 

***

-శాయి రాచకొండ

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
bottom of page