Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కవితా  మధురాలు

రమణ జీవి

సాలె పురుగు 

 

కొయ్య వెలుతురు 

ఎంతకీ మూతపడని కళ్ళు 

 

సాలెగూట్లో చిక్కుకుని 

కిందకి దిగని నిద్ర 

 

శ్వాసకు వురేసుకున్న 

సాలె పురుగు 

వులకదు పలకదు 

 

గది  నిండా మిణుగురులు 

ఏకాంతాన్ని కుడుతూ 

 

కనురెప్పలు 

వాలని తెరచాపలు 

లేచి ఆగిన కెరటాలు 

 

సర్వ శక్తుల్తో ప్రయత్నిస్తా 

కండరాల్తో 

నాడీ  మండలాల్తో 

అయినా కెరటాలు వొంగవు 

 

చివరికి ఓ నర్సు అరచేత్తో 

రెండు పావురాల్ని 

నిమురుతుంది 

 

గొల్లున ఓ ఏడుపు 

వినిపిస్తుంది 

 

("నలుగురు పాండవులు" కవితా సంపుటి నుండి)

ramana-jeevi.jpg

డా.టి.రాధాకృష్ణమాచార్యులు

 

తొలిపొద్దు పొడుస్తున్న వైపు

మంచు తెరల్లో దాగిన సూర్యుడు

పైనించి కిందికి దిగడమే 

కర్తవ్య గీతమే కాలం కదలిక

 

మట్టితోటీ రాళ్ళనూ తాకుతూ 

 తరలిపోతున్నది

పోతూపోతూ రాళ్ళను 

కొశ్చని కత్తులుగా మలుస్తుంది

నవ్య నడకల ప్రవాహమే కాలం

 

నిద్రపోనివ్వదూ తనూ నిద్రపోదు

పొద్దు తిరుగు కాంతి చలనం కాలం

పూల వాసన మోసుకొచ్చేదే కాలం

పని చేసేదే కాలం బతుకు తొవ్వలో 

 

పసివాళ్ళ బోసి నవ్వుల విరిసే 

జీవన వెలుగు రేకులే కాల చిత్రం 

 ఎవరికోసం  ఆగదని తెలిసినా 

ఆశల అవనిలో విలువైంది

 ఊహల బాల్యం పిలిచే కాలం

 

హృదయంతో పలకరిస్తే 

నీలో నిలిచి తనలో తనై 

సాగుతుందీ చరణా‌ల కాంతి కాలం

ఆశల వాహినిలో కాలం ఓ కావ్యం   

 

సృష్టిలో ఆశయ కలాలెన్నో కాలంలో 

సృజనలో జన సాహితి కావ్యాలన్నో

ఆ సృజనకారులు లేకున్నా,  ఉన్నారు

 ఇప్పుడు జీవిస్తూనేవున్నారు అక్షరాల్లో

 వారే కాలంలో గాధాసప్తశతులేమో !

   

నదీనదాలూ సాగేదే కాలం మనసు

కొండలు కోనలు నడిచేవే కాలంలో  

ఆ స్ప్రహ,ఆ స్ఫూర్తే కాలం ఘనకీర్తి

నడిచే నదిలో కదిలే కాలం ఓ కీర్తన 

 

మనకు ముందూ ఆడిందీ కాలం

మనతో కూడి నడుస్తుంది కాలం

మన తర్వాతా నర్తిస్తుందీ కాలం

 ప్రవాహ గీతంలో మౌనశబ్దం 

 

 కాలం నిద్రలేని ప్రయాణంలో 

పరుగెత్తుతుంది క్రమశిక్షణగా

 నిజంగా  ప్రవహించేదేగదా గమనం  

కాలంలో ఆశల వాహిని  ఓ కావ్యం 

radhakrishnamacharyulu.JPG

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

  నాగరాజు రామస్వామి

లేఖిని ఆకులు రాల్చిన వేళ

                     (రైటర్స్ బ్లాక్)

కవీ!

ఒక్కోసారి, 

ఏదో సృజన మాంద్యం 

నిన్ను హఠాత్తుగా ఆవహిస్తుంది,

నీ కలాన్ని కదలనివ్వదు.

అలా నీ లేఖిని ఆకులు రాల్చిన వేళ

నీలో చిత్రమైన చీకటేదో కమ్ముకుంటుంది;

ఆ శిశిర శార్వరిలో,

ఆ నీలయామినిలో

నీ నెమల్లు ఆడవు, నీ పక్షులు పాడవు, 

నీ సెలయేళ్లు పారాడవు. 

 

ఆ చీకటి రాత్రుల కలల దారులలో 

నీవు ఒంటరి సంచారివి;

ఎంత తవ్వుకున్నా ఒక్క స్వప్నం పెకలదు.

మధుకర వనవీధులలో మధువుల బేహారివి;

ఎంత గొంత చించుకున్నా ఒక్క పాటా చిగురించదు.  

కృష్ణ నికుంజాలలో నీలికన్నుల నెమిలివి;

ఎంత తపించినా కవనమేఘం ద్రవించదు.

భావుక సీమలలో నీవు అక్షర సేద్యకుడివి;

ఎంత గింజుకున్నా ఒక్క అక్షరం మొలకెత్తదు.

 

నీ లేఖిని ఆకులు రాల్చిన 

ఆ చిత్రమైన చీకటి రాత్రి

కాలాకాశ కృష్ణద్రవ్యమై, 

నీ కాలికింది లోకమై,

నీ నెత్తిమీది నీలిమై,

నీ గుప్త స్తరాల సుప్త చైతన్యమై

నీలో ఘనీభవిస్తుంది.

 

కాని.....

ఒక్కోసారి, 

ఒకానొక దృశ్యాదృశ్య అదృశ్య హస్త మేదో

నీ దోసిట రహస్య అక్షర నక్షత్రాలను రాల్చుతుంది.

 

అప్పుడు, అలవోకగా 

నీలో ఆమని వికసిస్తుంది,

నీ చీకటిమ్రోడు చిగురిస్తుంది,

నీ లేఖిని రజనీగంధమై పరిమళిస్తుంది,

నీ కవన కాసారంలో కలల కలువలు హసిస్తుంటవి,

నీ ఒంటరి దారులను కృష్ణరశ్మి వెలిగిస్తుంది,

ఒక ముగ్ధమోహన పరవశ మురళి

నీ బృందావనిలో మూర్ఛనలు పోతుంది,

నీ కోసం ఆకాశం దిగి వస్తుంది,

నీ కవన కంఠంలో 

చీకట్లను పోకార్పే ఉదయరాగం

నిదురలేస్తుంది.

 

ఓ అక్షర శిల్పీ! 

అది నీ పునర్జన్మ;

అప్పుడు  

నీవు పాటల పుష్పమై పల్లవిస్తావు, 

అక్షరాలను మీటుకుంటూ 

అంధ తమసుల అవని మీద 

సలిల స్వరాలను చల్లుతుంటావు, 

చీకటిచిచ్చు రగులుతున్న కుటిలాకాశం మీద 

వెలుతురు చుక్కలను చెక్కుతుంటావు.

nagaraju.jpg

  బుద్ధి కరిగేతేగా....

రాత్రికి కుదురులేదు

జాముకోసారి మూలుగుతూ

బయటను పిలుస్తుంది.

 

నిమిషానుకోసారి

దుప్పటి తలుపు సందులో

నిద్రను తొంగి చూసి....

 

చీకటి ముఖంపై

తెల్లని నీళ్లు చల్లుతుంది.

తొందరగా తెల్లబడితే

చల్లగా తప్పుకోవాలని

 

నిశికట్లను కసిగా కొరుకుతూ

కరిగే కాలాన్ని దరువేసే

గడియారాన్ని గుర్రుగా చూస్తూ

గోళ్లు కోరుక్కుంటుంది.

 

గడ్డ కట్టిన బుద్ధి కరిగితేనేగా

నల్లటి పగటి

గుండెలపై ఒదిగి

చీకటి తెల్లగా మారేది.

 

           * * *

చందలూరి నారాయణరావు

ch narayana.JPG