top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

“దీప్తి” ముచ్చట్లు

ఆ రెండో వైపు

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

దట్టమైన అరణ్యం. ఎటు చూసినా కలి కాటుకలు పులిమినట్టున్న కారడవి.  కదంబవనం వైపుగా స్పష్టమైన గమ్యం చేరే దారిలో ఉన్నట్టే ఉండి తన ప్రమేయం లేకనే తోవ తప్పి దిక్కు తోచక తిరుగుతున్న బాటసారి అతను.  నిరామయంగా ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఆకలి దప్పులూ తెలిసిన గుర్తే లేదతనికి. అవును. అతను ఆకలిని జయించినవాడిననే అనుకున్నాడు.ఆ కలి మాయనీ దాటినవాడిననే భావించాడు, దిశ మారేంతవరకూ. తెలీని మలుపులలో పయనిస్తున్నప్పుడు తరచి చూడక వేసిన అడుగులు కొన్ని ఇలా చిక్కుకుపడేలా ఆపాయి. ఆకలి, దాహం. అన్నీ చుట్టుముడుతున్నాయి.

"స్వామీ, స్వామీ" తనని కదుపుతూ శిఖమౌళి పిలిచిన పిలుపుకి, మెలకువలోకి, ఇలలోకి వచ్చిపడ్డారు శ్రీచక్రానంద గౌతములవారు. గౌతములుగా ప్రసిద్ధులు.


"ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి" - ఋషుల వాక్కులోని అర్థాలు కూడా ఆ వాక్కుని అనుసరిస్తూ పరిగెడుతుంటాయట.  మరి ఋషినైన నా కలలో వచ్చే అంశాలకి అర్థాలు వేటిని అనుసరిస్తున్నాయి? ? ఆలోచిస్తూనే తన వైపే చూస్తున్న శిఖమౌళిని పరికించి చూశారు గౌతములు.

జ్వరపీడనం వల్లే కలవరించి ఉంటారనుకుంటూ నుదుటిపై చేయిపెట్టి చూస్తున్న శిఖమౌళి మొహంలో స్వామి వారి ఆరోగ్యంపై చిన్నపాటి ఆందోళన. స్వామివారిని కలలోనైనా కలవరపరిచేదేది ఏదయినా ఉందంటే నమ్మలేడు శిఖమౌళి. సర్వసంగపరిత్యాగి అయిన స్వామివారికి కలతలూ, కలవరింపులూ ఏముంటాయనీ? వయోభారం వల్ల శారీరకంగా వచ్చే చిన్న చిన్న రుగ్మతలు తప్ప మానసికమైన మరే బాధలూ అంటవన్న గట్టి నమ్మకం శిఖమౌళి లాంటి శిష్యులందరికీ.

దేశవిదేశాలనుంచి వేల కోట్ల విరాళాలు వస్తున్నప్పటికీ, తనదైన ఈ చిన్న పర్ణశాల వంటి ఆశ్రమం వదలని స్వామివారి పట్ల శిష్యులందరికీ అపారమైన గురి, గౌరవం. వారెవరికీ తన మనసులో అంకురిస్తున్న చింత గురించి తెలిసే అవకాశమే లేదు.

చిరునవ్వుతో శిఖమౌళికి బానే ఉన్నానన్నట్టుగా సైగ చేసి, తన కుటీరం వెలుపలికి వచ్చారు.

తన కుటీరం చిన్నదే. దానిని ఆవరించుకుని పెరిగిన ఆశ్రమం పరిధి చాలా పెద్దది. దాదాపు ఒక చిన్నపాటి నగరమంత. కనుచూపు మేరా కుటీరం ముందున్న ప్రశాంతమయిన ఉద్యానవనాన్ని ఆనుకుని అన్ని హంగులతో అధునాతనంగా నిర్మితమైన తెల్లని భవంతి వైపు దృష్టి సారించారు స్వామి వారు. దేశ విదేశాలనుంచి తన దర్శనానికి వచ్చే ప్రముఖులు వారి సౌలభ్యం కోసం నిర్మింపచేసారు దాన్ని.ఈ మధ్య వరకూ ఏ స్థాయి అధికారి అయినా, సగటు భక్తుని వలెనే కుటీరంలో దర్శనం చేసుకుని వెళ్ళేవారు. మరి ప్రస్తుతం? "కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః" మనసులోనే ఒకింత విరక్తిగా నవ్వుకున్నారు. కౌపీనం కోసం కాదు, పలు ప్రాణాల సంరక్షణార్థం పూనుకుంటే, ఈ పటాటోపాలన్నీ తనని వెంటాడుతున్నాయి.

తూర్పు వైపుగా దృష్టి మరల్చుకున్నారు. నగరంలో ఇటీవలే నిర్మితమైనది అతి పెద్ద క్యాన్సర్ ఆసుపత్రి.  విదేశాలనుంచి అందిపుచ్చుకున్న అధునాతన వైద్యవిధానాలతో వైద్యఖర్చులు భరించలేని అశక్తుల  కోసం సంకల్పించిన ఆసుపత్రి అది. వద్దన్నా వచ్చిపడే విరాళాలతో ఆశ్రమానికి విపరీతంగా పెరుగుతున్న ఆదాయవనరులు సక్రమంగా ఉపయోగపడాలనే  మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి, దానికి అనుబంధంగా చుట్టూ ఏర్పడిన వసతి సముదాయం, బందువుల కోసం ఏర్పరిచిన భోజనశాల అన్నీ సంకల్పించిన మేరకు చక్కగా అమరాయి. కానీ, ఈ వ్యవధిలో తెలీకుండానే పడిన కొన్ని చిక్కుముడులు తేలిగ్గా విడివడేలా లేవు.

"స్వామీ, సోమసుందరంగారు మీ దర్శనానికై వేచి ఉన్నారు. ప్రభాతవేళ మీ ధ్యానం ముగిసాక కాస్త సమయం కేటాయించమంటారా?" - శిష్యుడి అర్థింపు. ఈ సోమసుందరమనే ప్రముఖ పారిశ్రామికవేత్త అందించిన భూరి విరాళానికి తెలీకుండానే  తనతో  సమయం విక్రయించబడింది. అయిష్టంగానే తలూపారు గౌతములు.

దైవసన్నిధిలో ప్రతీ క్షణం ప్రశాంతంగా గడుపుతూ అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో, తన ప్రమేయం పెద్దగా లేకుండానే లౌకికమైన బంధాలలో చిక్కుబడ్డారు. తన ఆకర్షణా వలయాన్ని అల్లుకుని ఎన్నో మంచి సంకల్పాలు నెరవేరుతున్నాయి. వాటితో పాటే ఈ సోమసుందరం లాంటి  వారే తమ సొంతప్రయోజనాల కోసం వాడటమూ జరుగుతున్నట్టు తెలుస్తుంది.  ధనాన్ని మదుపు పెట్టటమే తప్ప దానం ఇచ్చే స్వభావం కాదు కొందరిది. అది అర్థమయ్యాక మరెపుడూ అతని వద్దనుంచి ఏదయినా సున్నితంగా తిరస్కరించవలిసిందిగా సూచించారు శిష్యులకి.


అతను వచ్చినప్పుడల్లా అతనికూడా వచ్చే వ్యాపారాత్మక ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఈసారి ఏమి తీసుకురానున్నాడో!

స్నానపానాదులు, ధ్యానం ముగియగానే ఠంచనుగా లోపలికి వచ్చాడు సోమసుందరం. ఈసారి అతని వెంటే అతని కూతురు. అతి సాధారణమయిన దుస్తుల్లో ప్రసన్నంగా ఉన్న ఆ అమ్మాయి అతిసంపన్నుడు సోమసుందరం కూతురని అతను చెప్పేవరకూ ఊహించలేకపోయారు అక్కడున్నవారెవరూ. పరిచయం చేస్తూ, గౌతములవారికి నమస్కరించమని చెప్పగానే  “నమస్కారం. బాగున్నారా?” అని మొహమంతా విచ్చుకుంటున్న నవ్వుతో అడిగింది.

 

గౌతముల వారి మొహంలో విస్మయం. ఎన్నాళ్ళయింది తనని ఎవరయినా అంత సాధారణంగా పిలిచి.  ఆశ్రమంలో "జై శ్రీ ప్రభు" కాకుండా మరి ఏ ఇతర పలకరింపులు ఉండవు. ఆ విషయంలో శిష్యులు, భక్తులు అప్రమత్తంగా ఉంటారు.

సోమసుందరం పరిచయం చేసాడు కూతురిని. "దీక్ష. నా రెండో కూతురు." విదేశాలలో వైద్యవిద్య పూర్తిచేసుకుని ఈ మధ్యే ఇక్కడికి వచ్చింది. మీ ఆశ్రమం గురించి విని ఆకర్షితురాలయింది. కొన్నాళ్ళు ఈ ఆసుపత్రిలో డాక్టర్ల వద్ద  సహాయకురాలిగా ఉంటానని కోరింది."


ఆ మాటలు వినగానే అక్కడే ఉన్న శిఖమౌళి చాలా అయిష్టంగా మొహం పెట్టాడు "ఆసుపత్రిలోనూ పాగా వేద్దామనుకుంటున్నాడు ఈ సోమసుందరం" అన్న ఆలోచన అతన్ని కలవరపరిచింది. పక్కనే ఉన్న శ్రీకరం వైపు చూసాడు. అతనూ అదే ఆలోచనల్లో ఉన్నాడేమో, గౌతములు ఎలా దాటవేస్తారని చూస్తున్నాడు.

సోమసుందరం ఏది చెప్పినా "ఆలోచిద్దాము" అని దాటవేసే గౌతములు 'సరే'ననటంతో వారిద్దరూ చకితులయ్యారు.

ఆ పై కూతురిని బయటకి వెళ్ళమని సైగ చేసి, వెళ్ళేంతవరకూ చూసి గౌతములవారికి విన్నవించుకున్నారు. "విదేశాలలో కలిసి చదువుకున్న ఓ అన్యమతస్తుడిని పెళ్ళి చేసుకుంటానంటుంది, స్వామీ, సంప్రదాయాలపై  నమ్మకమే లేకుండా పెంచామేమో మరి. కొన్ని వారాలపాటు ఈ ఆశ్రమ వాతావరణంలో ఉంటే, ఆ యువకుడిని మర్చిపోతుందన్న ఆశతో తీసుకువచ్చాను."

గౌతముల మొహంలో ఏ భావాలూ కనబడలేదు. కాసేపటి తర్వాత సూటిగా చెప్పారు. "అమ్మాయి ఇష్టాయిష్టాలు ఏవయినా అవి మార్చే ప్రయత్నం మేము చేయబోము. తనకి తాను తన ఇష్టాలు మార్చుకుంటుందని మీరనుకుంటే మీ అమ్మాయి ఇక్కడ ఉండటానికి నాకు ఏ అభ్యంతరం లేదు."

సోమసుందరం మొహంలో నిరాశ స్పష్టంగా కనబడింది. "చూద్దాం స్వామి గారు. భక్తి పెరిగితే ఆలోచనలు మారవచ్చు." -అక్కడికీ తన అభిప్రాయం మారని సోమ సుందరం అన్నాడు.

"భక్తి పెరిగితే ఆలోచనలు మారటం సత్యమే. భక్తితో పాటుగా జ్ఞానమూ పెరుగుతుంది, ఆలోచనల విస్తృతి పెరుగుతుంది. ఆ జ్ఞాన ప్రయోజనాన్ని సాధించలేని భక్తి  మాత్రమే మౌఢ్యాన్ని పెంచుతుంది." గంభీరంగా అన్నారు గౌతముల వారు.

ఆ మాటల వెనుక అంతరార్థం గ్రహించిన శ్రీకరులు చిరునవ్వు నవ్వారు. సోమసుందరం మాత్రం తానేమి వినాలనుకుంటున్నాడో అదే విన్నాననుకున్నాడు కాబోలు, మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.

ఆసుపత్రిలో వైద్యులకి సహాయంగా పనిచేస్తూ, కొత్త మెళకువలు నేర్చుకుంటున్న దీక్ష, వైద్యసహాయంతోనే కాకుండా తన సహజసిద్ధమైన మంచితనంతో ఆసుపత్రిలో అందరినీ ఆకట్టుకుంది. ఆసుపత్రికే తప్ప ఆశ్రమానికి పెద్దగా వచ్చేది కాదు దీక్ష. కానీ, ఆసుపత్రి, ఆశ్రమం కార్యకలాపాలన్నిటినీ చూసే శ్రీకరులు దీక్ష గురించి గౌతములకి చెబుతుండేవారు. ఆ అమ్మాయి ప్రసక్తి వచ్చినప్పుడల్లా శిఖమౌళి మొహంలో కాస్త అసహనం దాచినా దాగకపోయేది.


**

ఉన్నట్టుండి ఓనాడు భోజనశాలలో మంటలు చెలరేగాయి. ఆ పరిసరాలలోనూ ఎవరూ లేని సమయమయినప్పటికీ ఆ దట్టమైన పొగని చూస్తూంటే మంటలు ఎంతవరకూ వ్యాపించి, ఏ అపాయం తలపెడతాయోనన్న భయంతో అందరూ ఆందోళన చెందారు. అగ్నిమాపకదళం వారు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ ఏ ఆపదా వాటిల్లలేదని తెలిసాక గౌతములవారి మొహంలో ప్రశాంతత తిరిగి చోటు చేసుకుంది. కాకపోతే ఎపుడూ ఏ కార్యక్రమాలకీ మీడియాని ఆహ్వానించకపోవటంతో ఈ ఆశ్రమం గురించి తెలీని వారి దృష్టి ఈ ప్రమాదం మీదుగా ఆశ్రమం వైపుకి మళ్ళింది.

అన్ని మాధ్యమాలలోనూ అప్పటికి నెలకొని ఉన్న స్తబ్ధత వల్ల ఔత్సాహికులు చర్చించుకోవటానికి, ఆవేశకావేశాలకి లోనవటానికీ మరి ఏ ఆసక్తికరమైన అంశం లేకపోవటంతో ఏదో ఒక వార్తతో నాలుగురోజులు గడుపుకోవాలన్న ఆరాటంతో ఎదురుచూస్తున్నవారందరికీ ఈ మంటలు ఆహారమయ్యాయి.

ఆవురావురుమంటూ అందుకున్నారు. అజాతశతృవు అయిన గౌతములవారి ఆశ్రమం చేస్తున్న సేవా కార్యక్రమాలకి సమకూరిన ధనం అందరినీ ఆకర్షించే విషయమయ్యింది. అదంతా ఆ స్వామి యొక్క అక్రమార్జనే అంటూ ఆరోపణలు చేయటం ఆరంభించారు. నిజాలు నిర్ధారించుకుని మాట్లాడేందుకు ఎవరికీ సమయం లేదు. ఆసక్తి అంతకన్నా లేదు. పరిహాసాలే ప్రాయోజిత ప్రమాణాలుగా చెల్లుతున్న రోజులు కనుక ఎవరికి వారు తాము చూస్తున్న వైపు తప్ప అవతలివైపుకి చూడటమనేది ఐచ్ఛికంగా మరిచిపోతున్న తరుణం. వాణిజ్య, రాజకీయ  ప్రపంచానికి కావాల్సింది ఏ కథకైనా ఏదో ఒకవైపు  మాత్రమే చూసే మనుషులు. వాళ్ళంతా మూకుమ్మడిగా రెండో వైపంటూ ఉంటుందని నమ్మిన తక్షణం కార్పోరేట్ ప్రపంచం కుదేలవక తప్పదు కనుక అందుకనుగణంగా ప్రజలని ప్రోత్సహించేలా మానవవనరులలో అంతటా ఏర్పడుతున్న ఎన్నో ఉపాధులు.

గౌతముల కుటీరంలో టీవీ, చరవాణి వంటి సౌకర్యాలు ఏవీ లేనందువల్ల గౌతముల వారికి ఊరి వెలుపల జరుగుతున్న ఈ గలాటా అంతా తెలియలేదు. ఒక్కరోజులో ఊహించనంతటి రభస అవుతున్నప్పటికీ ఆ విషయాలేవీ వీరి దృష్టికీ రాలేదు. శ్రీకరులు మాత్రం నిర్వికారంగా అన్నిటినీ గమనిస్తూ, స్వామివారికి ఆవలివైపు జరుగుతున్న చర్చల విషయం చెప్పే సమయం కోసం చూస్తున్నారు.  ఈ లోపలే దీక్ష ఎన్నడూ లేనిది ఆశ్రమానికి వచ్చి వారితో మాట్లాడేందుకు అనుమతి కోరింది.

"ఎలా ఉన్నారు?" అంటూ చిరునవ్వుతో పలకరించింది. మెల్లిగా స్వామివారి ఎదురుగా కూర్చుని. గౌతముల వారు చిన్నగా నవ్వి, తలాడించారు.

"క్షమించాలి, ఆ ప్రమాదం నావల్లే జరిగింది" అంది దీక్ష. గౌతములవారు అర్థం కానట్టు చూసారు.

అక్కడే ఉండి వింటున్న శిఖమౌళి భృకుటి ముడిపడింది. అతనికి సోమసుందరం మీద ఉన్న అపనమ్మకం వల్ల దీక్ష రాక వెనుక ఏదో బలీయమైన కారణం ఉంటుందని నమ్ముతున్నాడు. కూతురి ద్వారా ఆశ్రమం ఆసుపాసులు తెలుసుకునేందుకే దీక్షని పంపి ఉంటాడని అతను బలంగా నమ్ముతున్నానని నమ్మబలుక్కుంటున్నాడు. కానీ, అతని ద్వేషానికి వేరే కోణమూ ఉందని అతను చెప్పుకోలేని పరిస్థితులుండటం అతనికి రుచించట్లేదు. ఇపుడిక దీక్ష నిజరూపం బయటపడనుందని అతనికి ఆనందం. శ్రీకరుల వైపు చూసాడు. అతను నిశ్చలంగా ఉండటం ఎంత మాత్రం నచ్చలేదు శిఖమౌళికి. తనలాగే అందరూ దీక్షని ద్వేషించాలని అతని అభిమతం. ఒకే ఆశ్రమంలో ఉంటూ మతపరంగా ఒకే సైద్ధాంతిక విలువలు పంచుకుంటున్నపుడు ఇష్టాలు, ద్వేషాలు కూడా అందరివీ ఒకే రకంగా ఉండాలని బలంగా నమ్ముతాడు శిఖమౌళి. అందుకు విరుద్ధంగా గౌతములవారు, శ్రీకరులు దీక్షని ఆదరించటం అతన్ని అసహనానికి గురి చేస్తుంది.
 
"ఎలా, ఎందుకని అడగరా?" దీక్ష తనే మళ్ళీ ప్రశ్నించింది.

గౌతములు చూసారు శ్రీకరుల వైపు. శ్రీకరులు వచ్చి దీక్ష ఎదురుగా నిలుచుని సందేహంగా అడిగారు.

"మీ నాన్నగారు సోమసుందరం పొద్దునే తన మనుషులని పంపారు. సంక్లిష్ట పరిస్థితులనుంచి గట్టెక్కించే హోమాన్ని తలపెడదామనుకుంటున్నట్టు. అతని వ్యాపారాలు బయటపెట్టి,   అతన్ని న్యాయపరంగా ఇరకాటంలో పెట్టింది నువ్వే కదూ?"

అవునన్నట్టుగా తలాడించింది దీక్ష.  

"నాన్నగారి మనస్తత్వం, ధనమోహం తెలిసిన నేను, అతను సేదతీరేందుకు ఆశ్రయించే ఈ ఆశ్రమానికి ఇచ్చిన విరాళాలని వేటికో పెట్టుబడులుగా భావించాను. అందుకే ఇక్కడ చేర్పించమని కోరాను. మామూలుగా అయితే సేవాకార్యక్రమాలపై ఆసక్తి ఉన్న స్వభావం కాదు మా నాన్నగారిది కానీ నన్ను చేర్పించటంతో మీకు మరింత దగ్గరవచ్చునన్న ఆలోచనతో వెంటనే ఒప్పుకున్నారు. మీ ఆసుపత్రి నిర్వహణ చూస్తూ పారదర్శకంగా జరుగుతున్న సేవాకార్యక్రమాలని గమనించాను. ఎక్కడా ఏ లొసుగూ గమనించలేకుండా పకడ్బందీగా ఆర్థికవ్యవహారాలు నడుపుతున్నారేమోనన్న అనుమానం నన్ను వీడలేదు. చివరిగా భోజనశాలలో ఎవరూ లేనపుడు మంటలు లేపి, పదిమంది దృష్టీ ఇటువైపు తిరిగేలా చేసాను. ఆ తర్వాత జరిగిన మాధ్యమాల ప్రహసనంలో రెండువైపులా జరిగిన మూర్ఖపు వాదనలు విన్నాక తెలిసింది. నేను చేస్తున్న ఈ శోధన, వారి ఏకపక్ష ఆలోచనల కంటే భిన్నంగా ఏమీ లేదని. నా అనుమానాలు కట్టిబెట్టి మరిన్ని కోణాలలో పరిశోధన సాగించాను. ఆ తీగ లాగితే మా నాన్నగారి ప్రయత్నాలు సఫలమవలేదనే అర్థమయింది. అంతకుముందు నాన్నగారిపై ఉన్న ఆరోపణలలో కొన్నిటికి ఈ ప్రయత్నంలో సాధించిన ఋజువులతో లంకె కుదిరింది.  ఆశ్రమానికి, అతని అక్రమ ఆర్జిత వ్యాపారాలకి సంబంధంలేదని స్పష్టంగా తెలిసింది.  క్షమించమని అడిగేందుకే వచ్చాను. మీ ఆసుపత్రిలో ఇలాగే కొనసాగాలని ఉంది. అందుకు మీ అనుమతి కోరుతున్నాను."

అంతా ప్రసన్నంగా వింటూ, మౌనంగా కూర్చుని ఉన్న గౌతములు ఏమనబోతున్నారని దీక్షతో పాటు శిఖమౌళి కూడా ఎదురుచూస్తున్నాడు.

అన్నీ విన్నాకా శిఖమౌళి మొహంలో అనుమానపు తెరలు ఇంకా అలాగే ఉన్నాయి. తండ్రికి భిన్నమైన వ్యక్తిత్వం ఈ అమ్మాయిది అని తెలుస్తున్నప్పటికీ అతని విముఖత తగ్గలేదు. అతని కారణాలు అతనికున్నాయి. 

అక్కడ అలుముకున్న నిశ్శబ్ధాన్ని ఛేధిస్తూ శ్రీకరులు అడిగారు- "మీకు ఇదంతా చేసేందుకు అవసరమైన సమాచారం, సాయం ఎవరు అందించారు?"

"అన్వర్ అనీ, నా చిన్ననాటి స్నేహితుడు. ప్రభుత్వ పన్నుల శాఖలో అత్యున్నత పదవిలో ఉన్న ఉన్నతాధికారి. అన్ని విభాగాలలో అధికారులూ అతనికి స్నేహితులే. "

ఆ సమాధానం వింటూనే శిఖమౌళి చివ్వున తలెత్తాడు. "ఓ, మీరు ప్రేమించిన అన్యమతస్థుడు అతనేనా? వివాహమూ చేసుకోబోతున్నారా?" హఠాత్తుగా, ఇక ఆగలేనట్టుగా దురుసుగా దూసుకొచ్చిన శిఖమౌళి ప్రశ్న వింటూనే గౌతములవారి మొహంలో ప్రసన్నత మాయమైంది. దీక్షపై శిఖమౌళికి ఉన్న అసహనానికి మరో కారణం ఆ మాటలతో స్పష్టమయినట్టుంది శ్రీకరులకి కూడా. అతనూ ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అతనిని వారిస్తున్నట్టుగా అడ్డంగా తలూపారు.

ఆశ్చర్యపోయింది దీక్ష. "ప్రేమా? అదేమీ లేదే? నా దృష్టి అంతా వైద్యవృత్తిమీదే మరి కొన్నాళ్ళు."

శిఖమౌళికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు.ఆ ఇబ్బందికరమైన మౌనం నుంచి తప్పించమన్నట్టుగా గౌతములవారి వంక చూసాడు. శిఖమౌళి మాటలను, తనకి తెలీకుండా అతనిలో పేరుకున్న అసహనాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న గౌతముల వారి మనసులో ఓ కొత్త చింత మొదలయింది. కళ్ళలో అతని ఆందోళన ప్రస్ఫుటంగా కనబడుతుంది. తాను ఇంకా ఏమి చేయాల్సి ఉందో గ్రహించారు. తదుపరి కార్యాచరణ పట్ల ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా తలపంకించారు.

అతను శిఖమౌళి వైపు నుంచి చూపు మరల్చి, దీక్షకి సమాధానమిచ్చారు - " రెండో వైపు కూడా స్వయంగా చూసి నిర్ధారించుకున్నందుకు సంతోషంగా ఉందమ్మా. యేళ్ళకొద్దీ నాతో గడిపినవారికీ మూలతత్వమైన మానవీయ జ్ఞానం, సహనం  అవగతం చేయించటంలో విఫలమయ్యానేమో.   తక్కువ సమయంలోనే  అన్ని దిశలూ చూడగలిగే  పరిణతి సాధించిన నీవు ఆశ్రమంలో ఉండటం ఆనందమే." అన్నారు. 

శిఖమౌళి గౌతములవారి కళ్ళలో ఉన్న వేదన గమనించి కలవరపడ్డాడు. అతని ఆలోచనలకి గౌతములవారి వేదన అందలేదు. ఈ సారి మాత్రం తన ఆలోచనలే గౌతములవారి కలతకి కారణమయ్యాయన్న విషయం అర్థమయేందుకు మరింత సమయం పట్టొచ్చు శిఖమౌళికి.

 

*****

bottom of page