Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

ఎన్నారై కాలమ్ - 2

2. తమ పాత్రలతో రచయితల సంభాషణలు

 

satyam.jpg

సత్యం మందపాటి

నా ఐదున్నర దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో ఎన్నో కథలూ, వ్యాసాలూ, నాటికలూ వ్రాశాను. ఐదు నవలలూ వ్రాశాను. దురదృష్టవశాత్తూ మనకి ఇలాటి తెలుగు సాహిత్యం వ్రాయటం ఎలా, వాటి లక్షణాలు ఏమిటి అని పాఠాలు చెప్పే తెలుగు చదువులు ఆనాడూ లేవు, ఈనాడూ లేవు. అందుకని నేను హైస్కూలు రోజులనించీ ఎన్నో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతూ వుండేవాడిని. ఆ పుస్తక పఠనాన్ని ఆనందించటమే కాకుండా, ఆ గొప్ప రచయితలు ఎలా వ్రాసేవారు, అసలు కథకిగానీ, వ్యాసానికిగానీ, నాటకానికిగానీ, నవలకిగానీ లక్షణాలు ఏమిటీ, ఎలా వ్రాస్తే పాఠకులకు నచ్చుతుంది అని ఎన్నో పాఠాలు కూడా ఆ మహానుభావుల పుస్తకాలే నాకు నేర్పాయి. ఎందరో ఆ మహానుభావులకి నా శతకోటి వందనాలు!

ఈ ఒక్కొక్క ప్ర్రక్రియలోనూ వ్రాయటంలో చాల తేడాలు వున్నాయి. పద్యాల్లో ఎంతో క్లుప్తంగా విషయాన్ని నాలుగు వాక్యాల్లోనే ఛందో లక్షణాలు కాపాడుకుంటూ, అందమైన నడకతో వ్రాయటం మన తెలుగు భాషలోనే సాధ్యం. కవిత వ్రాసేటప్పుడు భావుకత, పద విన్యాసం, నాజూకు నడక ఎంతో అందానిస్తాయి. వ్యాసం వ్రాసేటప్పుడు మనకి స్వతంత్రం ఎక్కువ. కాకపోతే ఎంతో పరిశోధనా, పరిశీలనా అవసరం. ఆ రెండూ లేకపోతే వ్యాసం చిన్నబోతుంది. కథలు ఒకటో, రెండో సంఘటనల మీద ఆధారపడి వ్రాస్తాము కనుక, వాటిని వాటంతట అవే చదివించుకునే విధంగా వ్రాయటం అవసరం. నా భావనలో కథకి చక్కటి ముగింపు ఇంకా ఎంతో అవసరం. నాటిక లేదా నాటకం వ్రాసేటప్పుడు ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోపెట్టి, వారిని తృప్తి పరచటం కూడా ముఖ్యం. నవల వ్రాయటంలో ముఖ్యమైనది, మనసులో పెట్టుకున్న కథనీ, కథనాన్నీ ఒక చక్కటి ప్రణాళిక ద్వారా పాఠకులకి అందించటం. ఐదారు పేజీల కథకే చదివించే గుణం వుండాలంటే, రెండు వందల పేజీల నవలకి ఆ చదివించే గుణం ఎంత వుండాలో వూహించండి!

నేను కథలు వ్రాసేటప్పుడు కొన్ని రోజులు మనసులోనే కథనం ఎలా వుండాలని ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత ఒక గంటా గంటన్నరలో కథ వ్రాస్తాను. అదే నవల అయితే, వ్రాయదలుచుకున్న విషయం, పాత్రలు పూర్తిగా అవగాహనలోకి వచ్చాక, దాన్ని కొన్ని అధ్యాయాలుగా విభజించుకుని, నేను అనుకున్న కథా వస్తువుని, నేను అనుకున్న పాత్రలతో, కొన్ని మంచి సంఘటనలు కలిపి, ప్రతి అధ్యాయం ఒక కథలాగా వ్రాసుకుంటాను. కాకపోతే ప్రతి పాత్రనీ ఆ పాత్ర పోషణతో వ్రాయటం, మొత్తం కథ చివరి వరకూ ఏక క్రమంగా వుండటం అవసరం. అది మంచి పద్ధతో కాదో నాకు తెలియదు కానీ, అలా వ్రాసిన నా కథలు సస్పెన్సుతో పాఠకులకు నచ్చుతున్నాయి. నాకూ అలా వ్రాయటం బాగుంది.

మనం ఏ ప్రక్రియలో ఏది వ్రాసినా వుండవలసినవి అందమైన పాత్రోచిత భాష, చక్కటి పదాల పొందిక, చదివించే గుణంం, నడక, చదివాక ఒక మంచి కథ/వ్యాసం/పద్యం/కవిత/నవల/నాటిక చదివామనే తృప్తి, ఆనందం.

ఛందోబద్ధమైన పద్యాలు తప్ప, మిగతా ప్రక్రియల్లో వేలు పెట్టానుగానీ, నాకు బాగా ఇష్టమైన ప్రక్రియలు, నేను ఎక్కువగా వ్రాసినవీ కథలూ, వ్యాసాలూ, ఐదు నవలలూ.

ఇవి వ్రాసేటప్పుడు కథల్లో కొంచెం తక్కువగానూ, నవలల్లో ఎంతో ఎక్కువగానూ నేను సృష్టించిన నా పాత్రలు నాతో మాట్లాడుతూ వుండేవి అంటే కొంచెం ఆశ్చర్యంగానే వుంది కదూ!

అదెలాగో, ఎందుకో చెబుదామనీ, కథలూ నవలలూ వ్రాసేటప్పుడు నా మానసిక పరిస్థితి ఎలా వుందో, మిగతా రచయితల రచనలు చదివాక వారి మానసిక పరిస్థితి ఎలా వుండేదో అని వూహిస్తూ, ఆ నా పరిశీలన మీకు చెప్పాలనే కోరికతో ఈ వ్యాసం వ్రాస్తున్నాను. చిత్తగించండి.

***

కొన్ని సంవత్సరాలుగా వ్యాసాల మీదా, కథల మీదా దృష్టి పెట్టి, నాకెంతో ఇష్టమైన ఒక చక్కటి నవలకు పనికి వచ్చే నిజ జీవితంలోని ఒక క్లిష్టమైన కథావస్తువుని అటకెక్కించిన నన్ను, నిద్రలో కూడా ఆ నవల కథావస్తువు తట్టి లేపి, ఇంకా వ్రాయవేమిటిరా నాయనా అని నా వెంట పడింది. ఒక నెల రోజులపాటు ఎలా వ్రాయాలా అని చక్కటి ప్రణాళిక వేసుకుని, నాలుగు వారాల్లో ఆ నవలని పదిహేను రోజుల క్రితమే పూర్తి చేశాను. అప్పుడే ఆ నవలలో నేను సృష్టించిన పాత్రలు నాతో రోజూ చాలసేపు, నేను వేరే పనులు ఎన్నో చేస్తున్నా కూడా నన్ను వెంటాడుతుండేవి. నాతో మాట్లాడుతూనే వుండేవి. ‘నన్ను తర్వాత ఏంచేస్తావు, ఈ సమస్యనించీ నన్ను ఎలా బయట పడేస్తావు అని అడిగేవి. నవల వ్రాయటం పుర్తవగానే, ఆ పాత్రలు కూడా ‘ఇక మా పని అయిపోయింది’ అని మా సంభాషణల్లోనించీ నిష్క్రమించాయి.

అప్పుడే నాకీ అలోచన వచ్చింది. ఎందుకు నా నవలలో పాత్రలు నన్ను వెంటాడాయా అని? ఇంతకు ముందు ‘చీకటిలో చందమామ’ నవల కానీ, అంతకుముందు ‘నీటి బుడగలు’, ‘జై జవాన్, జై కిసాన్’ నవలలు వ్రాసినప్పటికంటే, నా సంచలన నవల ‘నిజమే కల అయితే’ వ్రాసినప్పుడు మరీనూ. రాత్రీ పగలూ నా పాత్రలు నా పక్కనే కూర్చుని నవలని నడిపించేవి. మధ్యేమధ్యే నన్ను ‘ఇలా ఎందుకు చేస్తున్నావు’ అని ప్రశ్నించేవి. ‘ఇది బాగుంది. ఇది బాగా లేదు’ అని చెబుతుండేవి.

మరి ఇది రచయితలకి అందరికీ ఇలా జరుగుతుందా? అనే ప్రశ్న ఒకటి ఉదయించింది.

ముందుగా నాకు గుర్తు వచ్చింది కళాతపస్వి విశ్వనాథ్ గారు. మనందరికీ ఎంతో ఇష్టమైన గొప్ప దర్శకుడు. నేను ఆయన్ని ఎప్పటినించో, అంటే శంకరాభరణం రోజులనించీ, ఇంకో కోణంలో కూడా పరిశీలించటం మొదలుపెట్టాను. కథా, నవలా రచయితగా.

ఆయన చిత్రాలకు అన్నిటికీ కథ ఆయనే వ్రాసుకుంటారు. ఒక్కొక్కప్పుడు కొన్ని చిత్రాల్లో ఆయన రచయితగా ఎంతో క్లిష్టమైన సందర్భాలు సృష్టించుకుని, దానిలోనించీ ప్రజారంజకంగా బయటికి రావటం చూస్తుంటే విపరీతమైన ఆశ్చర్యం వేసుంది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టు ఆయన కొన్ని సంఘటనలు సృష్టిస్తారు. అది అంత గొప్ప రచయితకి పెద్ద కష్టం కానే కాదు. కానీ ఆ వ్యూహంలోనించీ ఆయన బయటకు వచ్చే పథ్ధతే మనల్ని నిబిడాశ్చర్యంలో ముంచేస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణలు ఎన్నో వున్నా, నాకు బాగా నచ్చింది సప్తపది కథ. ఆ సినిమా చూడనివారుండరు కనుక కథ చెప్పటం అనవసరం. అంత క్లిష్ట సమస్యకి ఆయన ప్రేక్షకులను సమాధానపరిచేలా పరిష్కారం ఎలా ఇస్తారా అని ఆనుమానంతోనూ, భయంభయంగానూ చూశాను చివరి అరగంటా. ఆయన ఇచ్చిన ముగింపు అందరికీ దిగ్భ్రాంతికి కలిగిస్తుంది. మూడవ తరం కుటుంబంలో జరిగిన ఆ తరం సంఘటనకి పరిష్కారం ఆ మూడవతరం నించే రావాలిగానీ, రాదు. కొంత మారిన రెండవతరం నించీ కూడా రాదు. ఎంతో సంప్రదాయబద్ధమైన మొదటి తరం నించీ వస్తుంది. అది అందర్నీ విస్మయపరుస్తుంది.

అలాగే ‘సిరివెన్నెల’లో ఒక చూపులేని అతను, చెవిటీ మూగ అయిన ఆమె మధ్య సంభాషణలు, ఇలా దాదాపు ప్రతి చిత్రంలో తనని తానే ఛాలెంజ్ చేసుకుంటారాయన.

ఒక టీవీ ముఖాముఖీలో విశ్వనాథ్ గారిని ఎవరో ఇదే ప్రశ్న అడిగితే, ఆయన చెప్పిన జవాబు అలా తనని తనే ఛాలెంజ్ చేసుకోవటమంటె తనకి ఇష్టమనీ, అలా చేస్తున్నప్పుడు తన పాత్రలే కథని నడిపిస్తాననీ, ఆ పాత్రలే తనకి ఎటు, ఎలా వెళ్ళాలో చెబుతాయని, నిద్రపోకుండా ఎన్నో రాత్రులు తన పాత్రలతో ఎంతో సమయం గడుపుతాననీ చెప్పారు.

అవేనేమో రచయితలు తమ పాత్రలతో చేసే సంభాషణలు అంటే! 

తర్వాత నేనెంతో అభిమానించే రచయితలు ఎందరో గుర్తుకి వచ్చారు.  

వారిలో ముఖ్యంగా నలుగురు - త్రిపురనేని గోపీచంద్,  రావిశాస్త్రి, బుచ్చిబాబు, చలం. వారి పుస్తకాలు మళ్ళీ చదువుతుంటే వారు సృష్టించిన పాత్రలు అవి వ్రాసే సమయంలో వారితో మట్లాడేవేమో అనిపించేది!

త్రిపురనేని గోపీచంద్ మానసిక విశ్లేషణ చేస్తూ రచనలు చేసిన తత్వవేత్త. ఆయన వ్రాసిన అన్ని పుస్తకాలకూ అభిమానినైన నేను, ముఖ్యంగా ఆయన వ్రాసిన ‘అసమర్థుని జీవయాత్ర’ నవలకు వీరాభిమానిని. ఆ నవలలోని ముఖ్యపాత్ర సీతారామారావు గోపీచందేనని ఎంతోమంది పాఠకులూ, సమీక్షకులూ, విమర్శకులూ అనేవారు. ఎక్కడో ఒకచోట ఆయనే అలా చెప్పినట్టు లీలగా నాకు గుర్తుంది కూడాను. ఇంటా బయటా ఆయన నిర్మించుకున్న భావాలకు, తనకి కావలసినవారే విభిన్నంగా ప్రవర్తిస్తుంటే, ఆయన పొందిన మానసిక సంక్షోభంలోనించీ వచ్చిన పాత్రే సీతారామారావు అని కొందరు సమీక్షకులు అభిప్రాయపడ్డారు.

ఈ నవల్లో సీతారామారావు నిద్రపోతున్నప్పుడు, పోనప్పుడూ కూడా చుట్టూవున్న జంతువులతోనూ, శివపార్వతులతోనూ, ఇంద్రుడి అప్సరసలతోనూ మాట్లాడేవాడు. ఇంద్రుడి సభలోని అప్సరసలని తన తొడ మీద కూర్చోపెట్టుకునేవాడు. ఆఖరికి తను మంచం మీద పడుకుని పైన గోడ మీద పాకుతూ తననే చూస్తున్న బల్లితో కూడా తన గోడు ఇలా చెప్పుకునేవాడు.

“నీకు సుఖంగా వుందా?” గోడ మీద బల్లిని అడిగాడు సీతారామారావు.

బల్లి ఆగింది.

“నాకు లేదు” అని బల్లికి చెప్పాడు.

“నీకు కోపం వస్తుందా?”

బల్లి ఆగింది.

“నాకు వస్తుంది” అన్నాడు.

బల్లి కదిలింది.

“బల్లీ” అన్నాడు.

బల్లి ఆగింది.

“నీకు బాధలున్నాయా” అడిగాడు.

బల్లి కదిలింది.

“నాకున్నాయి”

బల్లి ఆగింది.

“నీకూ నాకూ సంబంధం వుందోయ్ బల్లీ! నీలో నేనున్నా, నాలో నువ్వున్నావు” అన్నాడు.

బల్లి కదిలింది.

“బల్లీ”

బల్లి ఆగలేదు.

“సోదరీ”

బల్లి పరుగెత్తింది.

వెంటనే సీతారామారావుకి భయం వేసింది.

ఇలా సాగుతుంది ఆ అసమర్ధుని ఆవేదన!

ఇది ఎన్నోసార్లు నేను చదివిన పుస్తకం. ప్ర్రతిసారీ నాకు ఇక్కడ రచయిత తన పాత్రలతో తన మానసిక విశ్లేషణని చెప్పుకుంటున్నట్టుగానే వుంటుంది.

అలాగే బుచ్చిబాబుగారి నవల  ‘చివరకు మిగిలేది’. ఈ నవలని తెలుగులో వ్రాసిన సమగ్రమైన “మనో వైజ్ఞానిక నవల” అంటారు. ఈ నవలలో ఆయన సృష్టించిన క్లిష్టమైన పాత్ర దయానిధి. దయానిధి ఎదుర్కొన్న మొదటి సమస్య ‘ప్రేమరాహిత్యం’.

“జీవితంలో నిజమైన విషాదం ద్వేషించటం కాదు. ప్రేమించలేక పోవటం” అంటారు బుచ్చిబాబు, శివరాజు వెంకట సుబ్బారావుగారు.

దయానిధికి తల్లి ఆరాధ్య దేవత. దానికి కారణం ఆమెలోని దయ, సానుభూతి, అర్థం చేసుకోగల విశాల హృదయం. అమృతం చాల విధాల అతని తల్లిని పోలివుంటుంది. అందువల్లనే ఆమె దయానిధికి దగ్గరయింది. ఈ తల్లి, కొడుకుల అనురాగ బంధం, దానినించి జనించిన దయానిధి ప్రవర్తన, ఫ్రాయిడ్ నిర్వచించిన “ఈడిపస్ కాంప్లెక్స్”కు లక్షణాలు అంటారు మొదలి నాగభూషణశర్మగారు.

“మానవుడికి కావల్సింది మతాలు, దేవుళ్ళు, మొక్కుబళ్ళు, రాజకీయాలు కావు. మానవుడికి కావాల్సింది దయ. కొంచెం, కాస్తయినా చాలు” అంటారు బుచ్చిబాబు. మానవులలో వుండే మమతే ఆర్థిక సాంఘిక చారిత్రక వ్యత్యాసాలకతీతమై మనిషినీ మనిషినీ స్నేహపాశంతో బంధించివేసే మానవతా లక్షణం. దానిని పొందటానికి దయానిధిలాటి సామాన్య మానవుడు తనజీవితంలో చేసే అన్వేషణే “చివరకు మిగిలేది”.

ఈ నవల చదువుతుంటే, బుచ్చిబాబుగారిలో దయానిధి నిగూఢంగా లేకపోతే ఇలాటి నవల వ్రాయటం చాల కష్టం అనిపిస్తుంది. లేదా బుచ్చిబాబుగారు రోజూ దయానిధి పాత్రని నడిపించటానికి ఆ పాత్రతో మాట్లాడుతూ వుండాలి. ఆ పాత్ర నడుస్తున్న విధానం మీద ఎంతో పట్టు వుండాలి.

అలాగే నాకు రావిశాస్త్రిగారి “అల్పజీవి”లో సుబ్బయ్య కూడా కనిపిస్తాడు.

చలంగారి “మైదానం”లో రాజేశ్వరి. ఒక్కొకసారి రాజేశ్వరి మనలాటి పాఠకులలో చలంగారిని చూస్తూ మాట్లాడుతున్నదా అనిపిస్తుంది.

కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథలో ఇంకో విశేషం వుంది. ఆ కథ వ్రాసేటప్పుడు ఆయన ఎంత మథనపడ్డారోగానీ, అప్పల్రాముడు మాత్రం ఆ కథ చదివిన ‘హృదయం వున్న ప్రతి పాఠకుడినీ” కొన్నాళ్ళు వదిలిపెట్టడు. మన వెంటే వుంటాడు. కళ్ళల్లో నీళ్ళకు బదులు రక్తం తెప్పిస్తాడు. కొన్ని కథల్లో రచయిత తనుకుతానుగా ఏమీ చెప్పడు. తను ఎన్నుకున్న ఒక పాత్ర చేత తను చెప్పదలుచుకున్నది చెప్పిస్తాడు. ఆంటే రచయితే ఆ పాత్రధారణ చేస్తాడన్నమాట. ఈ కథలో కారా మాష్టారు చేసిన పని అదే!

ఇందాక కథా రచయిత దర్శకుడు విశ్వనాథ్ కళాతపస్విగారి గురించి చెప్పుకున్నాం కదా. కొన్నేళ్ళక్రితం

ఈటీవీవారి స్వరాభిషేకం కార్యక్రమంలో బాలుగారితోపాటు, సిరివెన్నెలగారు కూడా వున్నారు. అప్పుడు బాలు గారు, సిరివెన్నెలగారు వ్రాసిన ఒక పాట పాడాక, ఆయన పాటల గురించి విపులంగా చెప్పారు. విశ్వనాథ్ గారు తనని తానే ఛాలెంజ్ చేసుకుని కథ అల్లుతారని చెప్పుకున్నాం కదా. అదే విషయం బాలుగారు చెబుతూ, ఆయన పాటలు వ్రాసేవారిని కూడా ఒక పెద్ద క్లిష్టమైన పరిస్థితిని వర్ణించి, అక్కడ పాత్రోచితంగా, సందర్భోచితంగా తనకి నచ్చే పాట వ్రాయమంటారుట. అలాటి ఛాలెంజ్ ఎక్కువగా సిరివెన్నెలగారికే ఇస్తారుట. ఆయన ఇంటికి వెళ్ళి, ఆ రాత్రంతా, తన ఆఫీసు గదిలో అలాటి పాట వ్రాయటానికి కూర్చుని ఒక తపస్సులో వున్నట్టుగా కూర్చుంటారుట. ఆ గదిలోనించీ సిరివెన్నెలగారి మాటలూ, పాటలూ, అరుపులూ, కేకలూ పాట పూర్తయేదాకా వినపడతూనే వుంటాయిట.

బాలుగారి మాటల్లో, ‘పాట పూర్తయేదాకా అసలు నిద్ర పోకుండా జుట్టు పీక్కుంటాడు, అరుస్తుంటాడు, గొంతెత్తి మాట్లాడుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. దానికి అర్ధం ఏమిటంటే, మర్నాడు ప్రొద్దున్నే ఎంతో గొప్ప పాట ఒకటి రాబోతున్నది అని”.

అదే సిరివెన్నెలగారి ప్రాణమిత్రుడు, నా మిత్రుల్లో నాకు ఎంతో ఇష్టుడు కిరణ్ ప్రభ కూడా చెప్పారు. ఆయన కాలిఫోర్నియాలో కిరణ్ ప్రభగారింట్లో వుండి కొన్ని పాటలు వ్రాస్తున్నప్పుడు అలాగే జరిగేదన్నారు.

అంటే ఆయన దర్శకుడు ఇచ్చిన పాత్రలనీ, క్లిష్టమైన సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకుని, తనలో తను మాట్లాడుతుంటారు అంటే, ఆయన మధనపడుతూ ఆ పాత్రలతో మాట్లాడుతున్నారన్నమాట. ఒక్కొక్కసారి వ్రాసిన చరణాలని చింపేస్తూ, మళ్ళీ మళ్లీ వ్రాసి తనకి నచ్చే దాకా అలా వ్రాస్తూనే వుంటారుట. ఒక పాటలో అయితే చరణాలు తనకే నచ్చక, ఒకే చరణాన్ని ఇరవై తొమ్మిదిసార్లు వ్రాశారుట!

దీనికొక ఉదాహరణ ఒకసారి మేము కలిసినప్పుడు సిరివెన్నెలగారే చెప్పారు. ‘స్వాతికిరణం’ చిత్రంలో, ఒక గురువుని మించిన శిష్యుడు తన గురువుగారి ఈర్ష్యా అసూయలకు తన జీవితాన్ని అంతం చేసుకుని బలి అయిపోతాడు. అతని శవాన్ని రైల్లో వాళ్ళ వూరికి తీసుకువస్తుంటారు. అప్పుడు విశ్వనాథ్ సిరివెన్నెలగారిని ఒక పాట వ్రాయమన్నారుట. ఆయన తప్ప, సంగీత దర్శకుడు పుహళేంది, సిరివెన్నెలగారు, అక్కడ వున్న మిగతావారంతా ‘అక్కడ పాట వద్దు, ప్రేక్షకుల మనసు వికలమైన సమయం, సినిమా కూడా అయిపోతున్నది, ఆ సందర్భంలో పాట బాగుండదు’ అన్నారుట. విశ్వనాథ్ గారు మాత్రం పాట వుండాలని పట్టుబట్టారుట. దానితో సిరివెన్నెలగారి కవితా ప్రయాణంలో మరో నిద్ర పట్టని రాత్రి వచ్చేసింది.

ఆ రాత్రంతా జుట్ట్టు పీక్కోటం దగ్గరనించీ, తనలో తనే మాట్లాడుకోవటం మొదలైన పైన వ్రాసిన కార్యక్రమాలన్నీ చేస్తూ, ఆయన ఎంతో క్షోభ పడుతుంటే, తెల్లవారు ఝామున పల్లవీ, చరణాలు ఒక్కసారిగా వచ్చేశాయిట. ఆ పాట వింటూ కళ్ళల్లో నీళ్ళు రాని వారు ఎవరూ వుండరు. అంత గొప్ప పాట అది.

కథలోని విషయాన్ని మన పురాణాల్లోని కథతో రంంగరించి ఎంత హృద్యంగా వ్రాశారో చూడండి. మీకు ఆ పాటని మళ్ళీ ఒకసారి గుర్తుచేయాలనివుంది.

 

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

రెప్పవేయనే లేదు ఎందుచేత, ఎందుచేత

 

పదహారు కళలని పదిలంగా ఉంచనీ

ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత

కాటుక కంటినీరు పెదవులనంటనీకు

చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా

 

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి

సంతసాన మునిగింది సంతులేని పార్వతి

సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి

పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి

ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా

ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా

 

ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి

కాలకూటము కన్న ఘాటైన గరళమిది

గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది

 

ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి

ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ!

 

స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ పాట వింటున్న వారి కళ్ళల్లో నీళ్ళు రావటం కనిపిస్తూనే వుంటుంది.

ఈ పాట వింటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా?

విశ్వనాథ్ గారు సృష్టించిన పాత్రలు, సందర్భం, సిరివెన్నెలగారి ఆవేదన చూడలేక ఆ మహాకవితో పలికించినదే ఈ పాట అని!

*****