top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా మధురాలు

నిర్వహణ:     దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

ఆట – పోరు

తాడికొండ కె. శివకుమార శర్మ

అతని బలప్రదర్శనమూ, ఆమె ప్రతిఘటనా – అదీ వాళ్ల ‘సంసారం’! ‘మనలో మన మాటగా అడుగుతున్నాను, అంత ప్రతిఘటించేవాళ్ల అవసరం నీకున్న దంటావా?’ ఒకటీ అరా గొంతుకలు అప్పుడప్పుడు అతన్ని రహస్యంగా చెవిలో అడిగి వాటి శరీరాలని అతని చేతి విసురుకు గురిచేశాయి. ఆ తాకిళ్లు, ‘ఇంకా ప్రతిఘటన అవసరమా?’ అంటూ ఆమె దగ్గరకు వెళ్లనీకుండా వాళ్లని ఆపాయి.

అంతా శాంతియుతంగా ఉన్నదనుకున్నప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగే సంఘటన ఒకటి జరిగింది. అది, ఆమె తల పైకెత్తుకుని అతనికి దూరంగా జరిగి నిలబడడం. కల కాదన్నట్టుగా వాళ్లిద్దరి మధ్యా అందరికీ కనబడేలా గోడ కూడా వెలిసింది. వచ్చి ఆమెను పరామర్శ చెయ్యడానికి ముందుగా జంకి, కొన్నాళ్లకి అతను కనుచూపుమేరలో లేడని నిర్ధారణ అయిన తరువాత ఒక్కొక్కరుగా అప్పుడప్పుడు విచ్చేశారు. తరువాత, అలా రావడాన్ని అతను ఓరచూపులో చూసినా కూడా పట్టించుకోకపోవడం, ఆ రాక అతని కనుసన్నల్లో జరిగినా కోపగించుకోకపోవడం వాళ్లకి కొంచెం ధైర్యాన్నిచ్చాయి. కూపీ తియ్యగా, లావాదేవీల్లో వచ్చిన కష్టనష్టాలు అతని మనసుని పూర్తిగా ఆక్రమించుకున్నాయని తెలిసింది. అత్యధిక శాతం ఊపిరి పీల్చుకున్నారు.

అంటుమొక్క

నిర్మలాదిత్య

అప్పుడు ఎదురు పడింది, మొదటి సారి, లక్ష్మి. తామర పువ్వు రెక్కల లాంటి పెద్ద పెద్ద కళ్ళతో, కాటుక పెట్టకున్నా, నల్లగా కంటి చుట్టూ ఉన్న రేఖలతో, ముదురు మట్టి పసుపు రంగులో అందంగా ఉంది. మాటలు అస్సలు లేవు కానీ, ఇక ఆరోజు మేము తోట తిరిగినంత సేపు మాతోనే తిరగడంతో బాగా గుర్తుండి  పోయింది.

 తోటలో నిమ్మ, కమలా పండ్ల చెట్ల తో బాటు మామిడి చెట్లు కూడాచాలా ఉన్నాయి .  లోపలికి పోతే మనూర్లో దొరికే సపోటా, సీతాఫలం, పనస, కొబ్బరి, అరటి చెట్లు కూడా కనిపించాయి. మనూరికే పోయినట్లనిపించింది. అప్పుడే శ్రీదేవి ఈ తోటలు వరదాచార్యులవని చెప్పింది.  పూజారి ఇంత  పెద్ద తోటలు వేసి, మనూర్లో లాగా పండించడం, ముచ్చట వేసింది. శ్రీదేవి తోట మధ్యలో ఉన్న గుడిసెలకు దారి తీసింది. అక్కడున్న ఓ గుడిసెలో, ఓ మూడు గ్యాస్ స్టవ్  ల మీద కడాయిలలో నూనె సల సలా కాగుతున్నది.  నూనెలో కరివేపాకు ఆకులు,  మందారం పూల రెక్కలు, మరువము, ధవనము లాంటివి వేసి మరిగిస్తున్నారు.

దృష్టి కోణం

మణి వడ్లమాని

ఆరోజు పొద్దున జరిగిన సంఘటన  గుర్తు చేసుకుంది. ఉమ, కృష్ణమూర్తి యేవో కబుర్లు  చెప్పుకుంటూ బ్రేక్ ఫాస్ట్  చేస్తున్నారు.

 

కృష్ణమూర్తి కిచెన్  అంతా కలయచూస్తూ  “అవునూ, కొత్త రైస్ కుక్కర్ వాడుతున్నావు కదా? మరి ఆ పాతది ఎక్కడుంది?”

 

“దాన్ని కమలకి ఇచ్చేసాను”

 

“నీకు బుద్ధుందా? పనిమనిషికివ్వడం ఏంటి ?”

 

“అయ్యో మనకి అవసరం లేదు, పైగా  బాగు చేయించుకుని వాళ్ళు వాడుకుంటామని చెప్పింది. అయినా కొత్తగా ఇవాళ  ఇలా అడుగుతున్నారేంటీ?”

లేత గులాబీ వెన్నెల

అనన్య

నాలుగు అడుగులు వేగంగా వేసింది అటువైపు.

 

వెయిటింగ్ ఏరియాలోకి నడిచి వెళ్లిన ఒక కుర్రాడు ఎవరికో ఒక ఫైల్ అందించి, వెనక్కి వస్తున్నాడు. అవతల వ్యక్తిని చూడాలని ప్రయత్నించింది కానీ స్తంభం అడ్డు వస్తోంది. ఫైల్ తీసుకున్నట్టుంది. మళ్లీ సోఫా మీద అటు తిరిగి కూర్చుంది ఆ వ్యక్తి. తెల్లటి కాటన్ చున్నీ మాత్రం కనిపించింది. అటు వెళ్లి చూడాలని అనిపించినా, మళ్లీ తన స్థానం గుర్తొచ్చి, తమాయించుకొని వెనుదిరిగి, అసెంబ్లీ ముగించుకొని తన గదికి వెళ్లింది ప్రభావతి. కానీ రోజూ లేనిది ఈరోజు అసెంబ్లీ చాలా ఎక్కువసేపు జరిగినట్టుంది. క్షణమొక యుగంగా గడిచినట్టు అనిపించింది.

 

వెంటనే అటెండర్ ను పిలిచి, ఇంటర్వ్యూ మొదలుపెట్టేస్తాను, ఒకొక్కరినీ పంపమంటూ అభ్యర్థుల జాబితాను అతనికిచ్చింది ప్రభావతి.

నీ యిల్లు బంగారం గాను...

ఇర్షాద్ జేమ్స్

జయదేవ్, సుహాసిని వాళ్ళ ఇల్లు చాలా త్వరగా సేల్ అయిపోయింది. 

 

వాళ్ళు ఒక త్రీ బెడ్రూం లగ్జరీ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు.

నిజానికి లగ్జరీ అపార్ట్మెంట్ అనేది ఒక విరోధాభాసాలకారం. (oxymoron)

 

అపార్ట్మెంట్ అంతా సామాను తో చిందరవందరగా వుంది.

 

“ఈ శనివారం రియల్టర్ తో అపాయింట్మెంట్ వుంది”, చెప్పాడు జయదేవ్.

అహల్య అంతరంగం

గిరిజా హరి కరణం

అలా ఆ పాలరాతి అరుగుపై కూర్చున్న అహల్య, పాలకడలిలో వుద్భవించిన లక్ష్మీదేవిలా, చందన శీతల చంద్రకళలా వుంది. ఆమె ముఖంలో అసహనం కనిపిస్తూంది, విరిసిన తామరల వంక తదేకంగా చూస్తోంది. 

అహల్య ప్రతి దినం సాయంత్రం తన చెలులతో కలిసి ఆడుకుంటుంది. అప్పుడేమో తామరమొగ్గలు కొలనులో ఆకుల మధ్యన యెక్కుపెట్టిన బాణాల్లా నిలబడి వుంటాయి. తెల్లవారగానే పరుగెత్తి వచ్చిచూస్తేనేమో విచ్చిన కమలాలు కొలనంతా పరుచుకుని వుంటాయి. అవి యెలా వికసిస్తాయో చూడాలన్నది అహల్య కోరిక.

 

ఆ రోజున చెలులందరితో సమాలోచన చేసింది. ఆ రాత్రి తెల్లవారక ముందే వచ్చి పద్మాలు వికసించడం చూడాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి అతి కష్టమ్మీద నిద్రనాపుకుని చివరికెలాగైతేనేం చెలులందరూ కొలను గట్టుమీద చేరారు. అర్ధరాత్రి గడిచాక, చీకటిగా వుండటంవల్ల యేమీ కనిపించడంలేదు. గుంపుగా కూర్చుని గుస గుసగా కబుర్లాడుకుంటూ కొలనువైపే దృష్టి వుంచి కూర్చున్నారందరూ.

ఆత్మ దర్శనం ( తమిళ మూలం: జయకాంతన్ )

అనువాదం: రంగన్ సుందరేశన్

సరేలే, అవన్నీ పోనీ.  ఇప్పుడు నేను సంతోషంగా, గౌరవంగా - అరవై సంవత్సరాల తరువాత - సంతోషంగా, గౌరవంగా ఉన్నాను. ప్రాప్తం ఉంటే మనం మళ్ళీ కలుసుకుందాం.  మీరందరూ నన్ను మరచిపోయారేమో - నాకేదీ మరవడం సాధ్యం కాదు.  ” -  ఇలాగ, నీ తండ్రి, గణపతి శాస్త్రి.   

‘గణపతి శాస్త్రి’ అనే సంతకంలో ‘శాస్త్రి’ అనే పదం కొట్టేసి ఉంది.

కవరులోని కట్ట కాగితాలని చేతిలోకి తీసుకొని, సంపాదకుడు అనే ధోరణిలో శివరామన్ అందులో ఎన్ని పేజీలున్నాయని పరిశీలించాడు. పేజీలలో సంఖ్యలు లేవు. అవన్నీ ఒక నోటుబుక్కునుంచి చింపిన కాగితాలు కాబట్టి కొనలో తునకలు కనిపించాయి. కొన్ని పేజీలలో పెన్సిల్ తోనూ, కొన్ని పేజీలలో కలంతోనూ రాసినవి దీర్ఘమైన చింతనతో, చాలా రోజులుగా మనసులో పాతుకుపోయిన స్పష్టమైన ఆలోచనలు - దిద్దబాటులు, తప్పులు లేకుండా - కనిపించాయి. అన్ని పేజీలు ఒకేసారి పూర్తిగా చదివేయాలని అతనికి ఆతురత, కాని అందుకు సమయం లేదు, ఇతర ఆఫీసు పనులున్నాయి. శివరామన్ ఆ కట్టని భద్రంగా తన సంచిలో తీసి ఉంచాడు.  అది ఎక్కడ నుంచి వచ్చిందని మళ్ళీ మళ్ళీ కవరుని తిప్పి చూసాడు.

bottom of page