top of page

కథా​ మధురాలు

సాటిలేని మిత్రుడు

 

తమిళ మూలం : జయకాంతన్
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

(1962లో ఆనంద వికటన్ లో మూల తమిళ కథ తొలిగా ప్రచురించబడింది.)

“సార్, మిమ్మల్ని ఎవరో ఫోనులో పిలుస్తున్నారు” అని ఆఫీసు నౌకరు సందేశం విని ముద్రణ యంత్రం ముందు నిలబడి అచ్చు కాగితాలు సవరించుతున్న చంద్రన్ తలెత్తి చూసాడు.

“నన్నా? కొంచెం ఎవరని అడుగు.”

 

“ఎవరో వేణు అట!” అని అంటూ ఆఫీసు నౌకరు తిరిగి వచ్చాడు. ‘వేణు’ అని ఆ పేరు వినగానే తలెత్తిన చంద్రన్ ఒక క్షణం ఆఫీసు నౌకరు మొహం తేఱిపార చూసాడు. అతని చేతిలోని కలం - నళ్ళించిన వేళ్ళనుంచి - కిందకి జారి, నేల మీదున్న తడిసిన అచ్చు కాగితాలపై పడగానే వాటిని సిరా తాకింది.

 

‘ఎవరో వేణు అట. అవును, వాడు ఎవడో ఒకడే. ’ అని అసాధారణమైన బలంతో చంద్రన్ తనలో గొణుక్కున్నాడు.

 

“సరే, నేను లేనని చెప్పేయ్!”

 

ఆఫీసు నౌకరు ఫోనులో పలికిన అబద్దం, అచ్చు యంత్రాల హడావిడిని దాటి, ఆ పత్రిక ఆఫీసు సందడిని దాటి చంద్రన్ చెవులలో మ్రోగింది.

 

“అతను బయటికి వెళ్ళివున్నారు సార్. తెలీదు. ఇంట్లో లేరు. ఎప్పుడు వస్తారో? సరే, మీరు మదురైనుంచి మాటాడుతున్నారా, చెప్తాను. జ్యోతీ హోటల్ కదూ? రూమ్ నంబర్ ఏడుకదూ?. సరే, చెప్తాను, సార్. ”

***

 

తన ఆఫీసు గదికి తిరిగి వచ్చిన తరువాత చందన్ కుర్చీలో వొంగి కూర్చున్నాడు. 

‘నేను నా పేరూ, ప్రతిష్ట పోగొట్టుకొని ఇక్కడకి మళ్ళీ వచ్చి పనిలో చేరానని వేణుకి ఎలా తెలుసు?’

 

‘ఈ వేణుని నమ్ముకొని మదురైకి వెళ్ళి, చేతిలో ఒక పైసా కూడా లేకుండా, ఆకలితో, కడుపు మంటతో, మదురై వీధుల్లో ఊరకే తిరుగుతూ నేను తిరిగి వచ్చి ఇంకా మూడు మాసాలు కూడా అవలేదే?’

 

‘అంతలో మరిచిపోవడం ఎలాగ? వాడికి ఎంత సాహసం - నాకు ఫోను చేసి హోటల్ కి రమ్మని పిలిచాడు! గర్వం, ధనవంతుడనే గర్వం! వీడి దయ కావాలని నేను వీడు పిలవగానే వచ్చి నిలబడతానని వీడి ఉద్దేశం కాబోలు!’

 అనే ఆలోచన రాగానే చంద్రన్ మండిపడ్డాడు.

 

 ఇప్పుడే వేణుని ఫోనులో పిలిచి కళ్ళలో రక్తం విరజిమ్ముతున్నట్టు తీక్షణంగా చూస్తూ నాలుగు మాటలు మొహాన్నే చెప్పాలని రిసీవరుని చేతిలో అందుకున్నాడు. 

 

రోషం, దుఃఖంతో అతని చేతిలోని రిసీవరు వొణికింది.

“యెస్. జ్యోతీ హోటల్."

 

“రూమ్ నంబర్ 7 కి కనెక్ట్ చెయ్యండి."

 

“రూమ్ నంబర్ 7 కదూ? వేణు ఉన్నారా?” అని అడిగినప్పుడు చంద్రన్ కంఠధ్వని తడబడింది.

 

“నేను వేణు మాటాటుతున్నాను.” అనే జవాబు విని అతని మొహం ముడుచుకుంది. కొంచెం సమయం ముందు క్రూరంగా, నిశ్చితంగా నిలబడిన అతని మనసు - ఇప్పుడు ఆ కంఠధ్వని విన్న వెంటనే - వెనకాడి, సడలటం మొదలుబెట్టింది. 

 

‘ఈ రోజు వేణు నా మిత్రుడు కాదు. కాని ఓ సమయంలో వాడు నాకు ఎంత అన్యోన్యమైన మిత్రుడుగా మెలిగాడు! అదిప్పుడు అబద్దంగా కనిపించినా ఆ బూటకమైన అభిమానం ఎన్నిసార్లు నా కాలేజి ఫీజులు చెల్లించివుంది! ఒక లక్షాధిపతి ధరించినట్టు నాకూ దుస్తులు అనుగ్రహించింది. ఇదిగో, ఇప్పుడు నేను తొడుక్కున్న Tekron Slack కూడా వాడేగా నాకు కొని ఇచ్చాడు? అదేమో, వాడు హఠాత్తుగా మారిపోయాడు.మదురైనుంచి నేను తిరిగిరావడానికి వాడిచ్చిన డబ్బుని ‘వొద్దు!’ అని వాడి మొహంమీద పారేసాను కాని వాడు ఎప్పుడో నాకు కొనియిచ్చిన రిస్టు వాచీ ని అమ్మేసే కదా నేను ఇక్కడికి వచ్చాను? నా మర్యాద, స్వతంత్రత పొగొట్టుకున్నట్టు నేను వాపోయినా రెండు వందల రూపాయల జీతంతో ఈ పత్రికలో నాకు ఉద్యోగం దొరకడానికి వాడి దయేకదా కారణం? ఆ రోజు వాడు నిర్దయతో మెలిగినా, నేనూ కృతజ్ఞత మరిచిపోయి వాడి మనసుని నొప్పించడం న్యాయం కాదే?’

 

కొన్ని క్షణాల్లో ఇటువంటి ఆలోచనలలో పడిపోయిన చంద్రన్ మనస్సు భారం పెరగడంతో, అతని మొహం, కళ్లు ఎఱ్ఱబారిపోయాయి. 

 

వీడి మౌనం వలన రిసీవరులో నుంచి వేణు ‘హలో’, ‘హలో’ అని అరిచాడు. చంద్రన్ చేతి వొణకడం తగ్గింది. మౌనంగా రిసీవరుని టెలిఫోనుమీద పెట్టినప్పుడు కన్నీళ్ళని ఆపడానికి ముంజేతితో మొహాన్ని తుడుచుకున్నాడు.

 ***

 

కాలేజీలో చదుపుకునే రోజుల్లో చంద్రన్, వేణు మిత్రులయ్యారు.

తల్లి సహోదరుడు - ఒక మామయ్య - తప్పితే ఇతర బంధువులని ఎవరూ లేని చంద్రన్ కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలోనే తన చదువుకీ, పెంపకంకి ఆధారమైన మామయ్యని పోగొట్టుకొని కాలేజీ చదువు ఆపేయాలని ఆలోచించాడు. 

 

మదురైకి సమీపంలో ఒక గ్రామంలో తమకి సాటిలేని ఒక ధనికుల కుటుంబంలో పుట్టిన వేణు పట్టణానికి వచ్చి చదువుకోవాలనే కారణం వలన హాస్టల్లో చేరాడు. చంద్రన్ కూడా అదే క్లాసు, అదే గదిలో ఉంటున్నాడు. 

 

విద్యార్థుల సంఘంలో జరిగే ఉపదేశాల్లో, ఉపన్యాసాలలో పాల్గొన్న చంద్రన్ కి మంచి ఖ్యాతి. కాలేజీ పత్రికలో అతను రాసిన వ్యాసాలు చదివి విద్యార్థులతోబాటు అధ్యాపకులు కూడా అతన్ని పొగడేవారు. చంద్రన్ కాలేజీ జీవితంలో నిత్యమూ అతనిచుట్టూ ఒక ఆసక్తి గల గుంపు అతనితో వాదాడుతూ ఉంటుంది. రాజకీయం, సామాజిక ప్రశ్నలు, ఆర్ధికశాస్త్రం, కళ - ఏదైనా సరే - నేర్పుగా వాదించి, తెలివిగా తీర్పు చెప్పే ప్రజ్ఞ చంద్రన్ కి ఉంది. వేణు ఆసక్తి అంతా కాలేజీ ఆటలు, పోటీలలోనే. ఐనా కూడా అతనికి చంద్రన్ పట్ల మెచ్చుకోలు, ఆకర్షణ ఉన్నాయని చంద్రన్ ఎప్పుడూ ఊహించనే లేదు. 

మామయ్య కన్నుమూసిన తరువాత తను చదువు ఆపేసి, తనకని ఎవరూ లేని చెన్నై నగరం విడిచి మరెక్కడైనా వెళ్ళిపోవాలని చంద్రన్ తన ఆప్త స్నేహితులకి దుఃఖంతో చెప్పిన మాటలు అతని గదిలోనే ఉంటున్న వేణు మొదట్లో వినలేదు. అప్పుడు వారిద్దరూ మిత్రులు కారు. అందరిదగ్గరా శెలవు పుచ్చుకొని ఆఖరికి చంద్రన్ కి నమ్రతగా ఆ సంగతి వేణుకి తెలియజేసినప్పుడు అతను అదిరిపడ్డాడు.

 

“చంద్రు, నువ్వు నా రూమ్మేటుగా గా ఉండడం నాకు ఎంత సంతోషంగా, గర్వంగా ఉందో తెలుసా? కాలేజీలలో అసలు స్పోర్ట్స్ మెన్ కే మంచి గుర్తింపు ఉంటుంది. కాని నాకు నీ ఉపన్యాసం విన్నతరువాత నువ్వు ఎటువంటి ప్రజ్ఞాత అని బోధపడింది. నువ్వు చదివే పుస్తకాలు, నీ ఊహలు, సిద్ధాంతాలు - అవన్నీ నీ సమీపంలో ఉన్న నాకే బాగా తెలుసు. అందువలనే నాకు నీగురించి ఇతరులకంటే బాగా తెలుసు. నువ్వు చదువు ఆపేసి వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది. నీ చదువు ఇక్కడే సాగడానికి నేనేమైనా చెయ్యగలనంటే ఆ సహాయం నేను తప్పకుండా చేస్తాను” అని వేణు చెప్పగానే చంద్రన్ ముందు నిర్ఘాంతపోయాడు.

 

“వేణు, నీ దయ తెలియకుండా నేను ఇన్ని రోజులు గడిపేసాను. థ్యాంక్యూ. నీ దగ్గర ఎటువంటి సహాయం అడగాలని నాకు తెలీదు. ఇన్నిరోజులూ మామయ్యకి భారంగా ఉన్నాను.. అతనూ పోయారు. ఎవరైనా ఇప్పుడు నాకు చేయూత ఇచ్చినాకూడా ఎదుగే స్థితిలో నేను లేను. ఇతరులే నా భారం మోయాలి. స్నేహం అనేది భారం కాకూడదు, వేణు. ” అని చంద్రన్ వాపోయాడు.

 

“చంద్రు, సాయం చేసే శక్తి ఉన్నవాడికి సాయం చెయ్యడం ఒక భారం కాదు. నువ్వు తప్పకుండా నా సహాయానికి ఒప్పుకోవాలి. మీ మామయ్య నీకు ఎలా సాయం చేసారో అదే విధంగా నీ చదువు సాగడానికి నాకూ బాధ్యత ఉంది. క్లాసులో కంటే మన గదిలోనే నీ సంభాషణలో నేను ఎక్కువగా నేర్చుకుంటున్నాను. ఆ అవకాశం కొనసాగడానికి నేనిది చెయ్యకూడదా?” అని వేణు అడగ్గానే చంద్రన్ మరేం అనలేకపోయాడు.

 

“నాకూ ఇప్పుడిప్పుడే దేవుడిమీద భక్తి, అతనికి కృతజ్ఞత చెప్పాలనే భావన కలుగుతోంది!” అని ఉద్రేకంతో చంద్రన్ అన్నాడు.

 

“‘నాకూ..’ అంటే, నీకు అసలు దేవుడుమీద నమ్మకం లేనేలేదా?” అని వేణు నవ్వుతూ అడిగాడు.

 

“లేదు!” అని ఆరంభించిన చంద్రన్ ఆ రోజు చాలా సేపు ‘నాస్తిక వాదం’ చేసాడు. కాని ఇందులో మాత్రం ఇద్దరు మిత్రులు ఏకీభవించలేదు.

 

ఆఖరికి వేణు చెప్పాడు. “అవునులే, మిత్రుడంటే అన్ని విషయాలలోనూ ‘సరే’ అనే పాట పాడకూడదు, అవునా? అందువలనే నేను నీతో వాదించలేకపోయినా, నీ తీర్పు పొరబాటు అంటున్నాను.”

 

“అదికాదు వేణు. మనందరం సైన్సు చదివాం. Biological Evolution అనే మాట వస్తే అదొక పోరాటం, అవునా? ఆ పోరాటం కొన్ని పరిమాణాల నియమాలు అనుసరించి సాగుతుంది. ఆ పోరాటాన్ని ముందూ, వెనుకా, పరిశీలించడమే స్చిఎంచె చేస్తోంది. అందులో మానవుడికి దేవుడుతో ఎటువంటి పొత్తూ లేదు. ” అని చంద్రన్ చెప్తూంటే, మరికొందరు విద్యార్ధులు వచ్చారు. వాళ్ళుకూడా వాదించారు. వేణు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. 

ఆ తరువాత వేణు, చంద్రన్ సహపాఠులు మాత్రం కాకుండా అన్ని విధాల్లోనూ యీడైన జతగా మెలిగారు. తనకేం వసతులు ఉన్నాయో అవన్నీ వేణు చంద్రన్ కి సమకూర్చాడు. దుస్తులు, భోజనం, వినోదం - వీటిని అనుభవించడంలో వారిద్దరిమధ్యా ఎటువంటి భేదమూ లేదు.

 

ఒకసారి వేణుకి ఇంటినుంచి రిస్టు వాచీ కోసం నాలుగు వందలు రూపాయలు పంపించారు. కాని వేణు రెండువందల రూపాయలకి రెండు వాచీలు కొన్నాడు. అందులో ఒకటి చంద్రన్ కి ఇచ్చినప్పుడు చంద్రన్ “ఇది కొంచెం ఎక్కువే’ అని గొణుకుతూ వెనకాడాడు. కాని వేణు గారాబంగా నొక్కిచెప్పిన తరువాత మారుమాట చెప్పలేకపోయాడు.

 

చంద్రన్, వేణు స్నేహం ఆరంభించిన నాలుగు సంవత్సరాల తరువాత, చదువు ముగించి కాలేజీనుంచి నిష్క్రమించినప్పుడు వేణుని అతని తండ్రి మదురైలో తను కొత్తగా స్థాపించిన కర్మాగారంకి మేనేజింగ్ డైరెక్టర్ గా రమ్మని ఆజ్ఞ పంపారు.

 

చంద్రన్? అతను ఏది చదివివున్నా, అతనికి ఎంత ప్రావీణ్యం ఉన్నా ఏం లాభం? ప్రపంచం ఎలా ఉందనేది అతనికి తెలుసు కాని అందులో ఎలా జీవించాలని తెలీదు. అప్పుడు కూడా మరేం తోవ తెలియక చంద్రన్ వేణు సహాయం ఎదురుచూసాడు. అతని సంకోచం తెలుసుకున్న వేణు “సహాయం కోరడానికి స్నేహితులకి హక్కు ఉంది. అందుకోసం నువ్వేం సిగ్గుపడవద్దు. నువ్వలా బాధపడితే మన స్నేహం ఇంకా పూర్తిగా ఎదగలేదన్నమాట!” అని ఓదార్చాడు. 

 

‘వేణు ఎప్పుడూ తక్కువగానే మాటాడతాడు, కాని వాడి మాటలు ఎంత సార్ధకంగా ఉన్నాయి!’ అని ఎప్పటిలాగే చంద్రన్ కి విస్మయం కలిగింది.

 

“అదికాదు వేణు, నా భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది, నేనుకూడా నీతోబాటు మదురైకి రానా?” అని చంద్రన్ నిరాశతో అడగ్గానే వేణు మౌనంగా చాలా సేపు ఆలోచించాడు.

 

తరువాత చెప్పాడు- “అలాగేం వద్దు, చంద్రు. అంతేకాక, నువ్వు గుమాస్తా ఉద్యోగం చెయ్యడానికి పుట్టలేదు.” మళ్ళీ కొన్ని క్షణాలు ఆలోచించి, ప్రేమతో చంద్రన్ చేతులు పట్టుకుని, నమ్మకంతో “నీకేం విచారం వద్దు. తప్పకుండా నేను నీకొక మార్గం కనిపెడ్తాను” అని నవ్వుతూ హామీ ఇచ్చాడు. 

 

కొన్నిరోజుల తరువాత వేణు ఉత్సాహంతో చంద్రన్ కి చెప్పాడు: “చంద్రు, నీకొక మంచి ఉద్యోగం దొరికింది. ఇవాళ అకస్మాత్తుగా మా నాన్నగారి స్నేహితుడు ఒకతన్ని కలుసుకున్నాను. అతనొక పత్రిక ఆరంభించాలని గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో నీకు తగిన ఉద్యోగం సంపాదకుడుగా పని చెయ్యడం అని నాకనిపించింది. అతనూ సరేయని వెంటనే ఒప్పుకున్నారు. ఈ నెల నీకు ఆ ఉద్యోగం ఖాయం” అని వేణు చెప్పగానే చంద్రన్ కి ముందు ఒక విధమైన భయమూ, అదే సమయం తనొక రచయతగా, సంపాదకుడుగా మారబోయే ఆహ్లాదమూ కలిగింది. ఆ తరువాత ఈ ఐదు సంవత్సరాల ఎడబాటులో మిత్రులు ఇద్దరూ నెలా ఒక రెండు సార్లు ఉత్తరాలు పంపుకునేవారు. చంద్రన్ కధలు, వ్యాసాలు చదివి వేణు, ఆనందించి, తన మెచ్చుకోలు తెలిపేవాడు. వర్తకరీతిగా మూడునెలలకి ఒక సారి చెన్నైకి వచ్చినప్పుడెల్లా వేణు చంద్రన్ తో అన్ని చోట్లా తిరిగేవాడు. తను దుస్తులు, వస్తువులు ఏవి కొన్నా చంద్రన్ కి అధికంగానే కొని ఇచ్చాడు. చంద్రన్ ‘వొద్దు!’ అని ఆక్షేపించినా వంద రూపాయలు, రెండు వంద రూపాయలని వేణు అతనికోసం ఖర్చు చేసేవాడు. అందుకు కారణం అతను నిర్వహించే కర్మాగారం ఘనంగా సాధించిన అభివృద్ధి మాత్రమేకాదు. లోకోపకార బుద్ధి అతనికి పుట్టుకతో వచ్చింది. మనసారా దానం చేసి చేసి అతని చేతులు సర్వజన హితేచ్ఛకి దోహదం చేసాయి. 

‘వేణుకి ఎన్ని బాధ్యతలు, శ్రమలు! నాకేం బాధ్యతలు, శ్రమలు లేకపోయినా అతని మిత్రుడు అనే ఒక కారణం వలన నేను కూడా ఇవన్నీ అనుభవించడం జరుగుతోంది!’ అని చాలా సార్లు చంద్రన్ ఆలోచించేవాడు.

 

ఆరు నెలల ముందు వేణు పెళ్ళి చేసుకున్నాడు.

 

వెళ్ళి సంతోషంలోనూ వేణు మనసులో ఒక కొఱత చోటుచేసుకుంది. ఖరీదైన, విదేశీయ వస్త్రంలో తను ధరించిన సూట్ చంద్రన్ కి కుట్టలేదని వేణు బాధపడ్డాడు. అందుకు కారణం చంద్రన్ ఆ సూట్ బ్రహ్మాండంగా ఉందని పొగడాడు.

 

“చంద్రు, విను. నీ పెళ్ళికి ఇలాంటి సూట్ కుట్టాలి!” అని పరిహాసం చేసినా “మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు నీకు ఈ సూట్ ఖాయం!” అని వేణు మాట ఇచ్చాడు. 

 

'అదృష్టం బాగుంది, వాడిని నమ్మి నిజంగా నేను పెళ్ళిచేసుకొనివుంటే? కిందటి నెల నేను ఉద్యోగం రాజీనామా చేసి వీధిలో నిలబడినప్పుడు - వాడు నన్ను దూరంచేసుకున్న స్థితిలో - నా గతి ఏమయేది?” అనే ఆలోచనలో పడిన చంద్రన్ కి వేణు ఇలా ఉన్నట్టుండి మారిపోవడానికి కారణం అతని భార్య కాబోలు అని కూడా అనుమానం కలిగింది.

 

***

 

పోయిన నెల చంద్రన్ కి అతని యజమానితో తీవ్రమైన అభిప్రాయభేదం ఏర్పడింది.

 

నవతరంలో పుట్టిన చంద్రన్ దృష్టిలో - ఒక ప్రతికూల రాజకీయ పక్షం ఏర్పాటుకి స్వాగతం చెప్పే విధంగా ఒక సంపాదకీయం రాయమని - ఆ పత్రిక యజమాని అతనికి చెప్పారు.

 

“నేను రాయను!” అని చంద్రన్ దృఢంగా నిరాకరించాడు.

 

“అబ్బాయీ, పత్రిక నాది. నేను చెప్పినదే రాయడానికే నువ్వున్నావ్” అని అతను అన్నారు.

 

“నా అభిప్రాయానికి విరుద్ధంగా నేనేదీ రాయలేను. రచయతకి మాత్రం వ్యక్తీకరణ స్వాతంత్య్రం లేదంటున్నారా?” అని చంద్రన్ మొండిపట్టు పట్టాడు.

 

“మిస్టర్ చంద్రన్, వ్యక్తీకరణ స్వాతంత్య్రం, ఆదర్శ రచనలు - ఇవన్నీ కధలు గిలికే వాళ్ళకి వదిలేయండి . మీరొక వర్కింగ్ జర్నలిస్టు.”

 

“సార్, చాల్లేండి! రచయితలగురించి, రచనల గురించి మీ మనసులో ఏముందో నేను తెలుసుకున్నాను. ఇదిగో, నా రాజీనామా!” అని కడుపు మంటతో గిలికిన రాజీనామా ఉత్తరంని అతని చేతిలోకి నెట్టి చంద్రన్ నిష్క్రమించాడు. 

 

- అవన్నీ ఏ ధైర్యంలో? ఒక ధనవంతుడు తన పక్క ఉన్నాడనే ధైర్యంతో ఇంకొక ధనవంతుడుని విరోధించుకోడం ఎంత పెద్ద పొరబాటు! ఆ మందమతి తనకొక మంచి పాఠం నేర్పించిందని చంద్రన్ తన్ను తనే నిందించుకున్నాడు.

 

ఉద్యోగం వదిలేసిన తరువాత చంద్రన్ వేణుకి రెండు ఉత్తరాలు రాసాడు.

 

వాటికి జవాబు రాకపోవడం ఒక పెద్ద ఆశ్చర్యమే అని చెప్పాలి. ఆ తరువాత చేతిలోవున్న పదిహేను రూపాయలతో మదురైకి బయలుదేరాడు. వేణు దగ్గర ఏదైనా ఆర్ధిక సహాయం దొరికితే, ఊరుకి తిరిగివచ్చిన తరువాతే రూము అద్దె ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత ఒక నెల హోటల్లో ఒక నెల ఉంటూ, చేతిలో ఒక నూరు రూపాయలు ఉంటే అది తీరేముందు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని చంద్రన్ నమ్మాడు. 

 

***

 

చేతిలో ఒక సంచితో చంద్రన్ మదురై జంక్షన్ నిష్క్రమించినప్పుడు సమయం పదకొండున్నర దాటిపోయింది. వేణు ఇంటికి వెళ్ళకుండా అతని ఆఫీసుకే చంద్రన్ వెళ్ళాడు.

 

ఆఫీసు స్వాగతం గది సోఫాలో, అక్కడున్న పత్రికలని తిరగేస్తూ చంద్రన్ కూర్చున్నాడు. అంతలో ఒక ప్యూన్ వచ్చి పిలిచాడు. అతని వెనుక నడుస్తూ ఒక ఆ.ఛ్. గదిని చేరుకున్న చంద్రన్ తన మనసులోని చలనం దాచుకొని, స్నేహభావంతో “ఏమిటయ్యా వేణు, నా రెండు ఉత్తరాలకి నీదగ్గరనుంచి జవాబు లేదు. అందుకే నిన్ను ఎదురుగా చూసి అడగాలని ఇలాగ తటాలున వచ్చేసాను!” అని కృత్రిమ ఉత్సాహంతో అన్నాడు.

 

“ఓ, నేను చాలా బుస్య్ గా ఉన్నాను. ఇవాళ మధ్యాహ్నం కోడైక్కనాల్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ఆక్కడ రెండువారాల క్యాంపు. ఒక నెలగా నా భార్య చెబుతూనే వుంది, ఇప్పుడే టైం దొరికింది” అని అంటూ అహంకారంతో వేణు తన టై సరిచేసుకున్నాడు. మాట్లాడుతున్నప్పుడుకూడా అతను చంద్రన్ మొహం చూడలేదు. ఈ కొత్త మార్పుకి కారణం ఏమిటో చంద్రన్ కి అర్ధం కాలేదు. కాని ఒకటి మాత్రం తెలిసింది. ఆ యజమానుడిని విరోధం పెట్టుకోవటమనేది ఈ యజమానుడికి నచ్చలేదు.

 

ఇద్దరూ మౌనంగానే కూర్చున్నారు. చంద్రన్ వేణుగురించే ఆలోచించాడు: ‘మనసనేది ఎంత విచిత్రంగా మారుతోంది! వేణుయేనా ఇలా మాటాడుతున్నాడు? నాతోనా? ఇలాంటి ధోరణి వీడికెలా వచ్చింది? వచ్చినవాడిని చూసి చిరునవ్వుకూడా లేదు, మాటల్లో ఏ సారమూ లేదు, అసలు వాడు నన్ను చూడనే లేదు! ఇది ఒక కొత్త ధోరణి! ధనవంతులకి తగిన ధోరణి! అవును, వాడి హోదాకి, నడతకి తగిన ప్రవర్తన! సరేలే, నాకున్న పాతకాలపు స్నేహం హక్కువలన ఆఖరికి వీడి సహాయం తీసుకొని మర్యాదగా, అన్యోన్యంగా మా స్నేహంనుంచి విడిపడటమే నేను వివేకంతో చెయ్యవలసిన పని. నాకు ఈ నిమిషం మరేం చెయ్యాలో తెలీదు.”

 

“వేణు. నేను ఆ ఉద్యోగం వదిలేసానని నీకు తెలిసివుంటుంది.”

 

“హుం, నువ్వు నాకు రాసావుగా. ” సిగరెట్టు పొగ మడుచులు ఊదుతూ వేణు చెప్పాడు: “నా దృష్టిలో, నువ్వు రాజీనామా చేయటం ఒక పొరపాటు.”

 

“నేను నా లక్ష్యానికి, అంతరాత్మకి విరుద్ధంగా రాసి, నా రచనలు, మనస్సాక్షి అమ్మాలని అంటున్నావా?” అని చంద్రన్ ఆక్రోశంతో అడిగాడు.

 

“హూ. లక్ష్యం! మనస్సాక్షి! ప్రాక్టికల్ గా మాట్లాడటం నువ్వింకా నేర్చుకోలేదన్నమాట!” అని వేణు నవ్వాడు.

 

“బుద్ధిజీవి అంత సులభంగా యంత్రంగా మారడం ఎలాగ సాధ్యం?” అని చంద్రన్ చిరచిరలాడాడు.

 

“ఓ, అలాగా?” అని వేణు పెదవి విరిచాడు. “సరే, చంద్రు, ఇది నీ వ్యక్తిగత సమస్య. నీకేది ఇష్టమో అదే కానీ. ఓహ్, మై గుడ్ నెస్. అపుడే ఒకటయింది. ఇంకా అర్ధగంటలో నేను ఇంటినుంచి బయలుదేరాలి! ఇక నువ్వెందుకు వచ్చావో చెప్పు, వింటాను.”

 

వేణు పెదవి విరిచి అలా తన్ను నిర్లక్ష్యం చెయ్యడం, ‘ఇది నీ వ్యక్తిగత సమస్య.’ అని తోసిపుచ్చడం చూసి తన ఏకైక స్నేహితుడు తన రాకని చులకన చేస్తున్నాడని చంద్రన్ నొచ్చుకున్నాడు. 

 

కాని వేణు అన్నట్టు ప్రాక్టికల్ గా, లోకపరిచయంతో, లౌక్యంగా తను మెలగాలని ఊహించి చంద్రన్ మాటాడాడు. “నీ దగ్గర ఒక సహాయం కోరడానికి వచ్చాను. ఇది నేను నీకు ఇచ్చే ఆఖరి పీకులాట కానీ నేను నా ఉద్యోగం వదిలేసి చాలా బాధపడుతున్నాను. ఒక నెలలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. అంతవరకు. ” అని తడబడుతూ ఇంగ్లీషులో చెప్పాడు. తన విన్నపంలో వున్న నీచత్వంని భాష రవ్వంత మఱుగు చేస్తుందనే ఉద్దేశంతో, అయిష్టంగా, మెల్ల మెల్లగా చంద్రన్ మాట్లాడాడు. వేణు తల వొంచి, ఒక చేతి వేళ్ళతో కనుబొమలు నిమురుకుంటూ ఆలోచించాడు.

“స్నేహంలో సాయం కోరడానికి హక్కు ఉంది, ఇందులో బిడియం, సిగ్గుకి చోటు లేదు’ అని నువ్వు చెప్పినది గుర్తుచేసుకొని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నాకు రెండు వందలు రూపాయలు కావాలి. నాకు సూట్ కొనడం గురించి నువ్వు చెప్పలేదూ? అందులో సగం. నాకు సూట్ వొద్దు!” అని చంద్రన్ సగం నవ్వుతూ, సగం ఎఱ్ఱబారిన మొహంతో అన్నాడు. 

 

‘ఇది అబద్ధం!’ అనే ధోరణిలో, ధృడంగా, ఎవరికో చెప్పవలసిన జవాబుని, అలక్ష్యంగా వేణు ఈ స్నేహితుడికి చెప్పాడు.

 

“ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఇంకొకసారి చూద్దాం.” అని అంటూ వేణు లేచాడు. అతనితోబాటు భగ్నమైన హృదయంతో చంద్రన్ కూడా లేచాడు. ఇద్దరూ ఆఫీసునుంచి నిష్క్రమించారు. బయట కారు నిల్చొనివుంది. గంభీరంగా నడుస్తున్న వేణు వెనుక చేతిలో ఒక ఖాకీ సంచితో వస్తున్న చంద్రన్ కి ఈ బాహ్య ప్రపంచం కృత్తిమంగా కనిపించింది.

 

“సరే, నువ్వు ఊరుకి తిరిగి వెళ్ళు! మనం మళ్ళీ కలుసుకుందాం.” అని కారులో ఎక్కి కూర్చున్న వేణు “చంద్రూ!” అని గారాబంగా పిలిచాడు. రక్తమయమైన రెండు కన్నులతో చంద్రన్ అతన్ని చూసాడు. వేణు చంద్రన్ మొహం చూడకుండానే, కాల్చుతున్న తన సిగరెట్టు పొగలో మొహం చిట్లించుకుంటూ, పర్సునుంచి రెండు పది రూపాయల నోట్లు తీసి కారు బయట నిల్చున్న చంద్రన్ కి అందించి “ఊరుకి వెళ్ళడానికి డబ్బు ఉందా?” అని అడిగాడు. చంద్రన్ చేతిని తట్టాడు. తన చేయి స్వీకరించడానికి, వేణు చేయి అర్పించడానికి స్వాభావికంగా అలవాటు పడిపోవడం వలన అలా జరిగిందా అన్నట్టు ఆ రెండు నోట్లు వేణు మొహంలో వాలాయి.

 

“చాలా థ్యాంక్స్!” అని గర్జిస్తూ చంద్రన్ అక్కడనుంచి వేగంగా నిష్క్రమించాడు.

 

వేణులో కనిపించే మార్పుకి ఒకే ఒక కారణముందని చంద్రన్ కి తోచింది. ‘ఆ ప్రతికూల రాజకీయ పక్షంలో ఈ ధనవంతుడు కూడా చేరాడన్నమాట! దాన్ని నేను నిరాకరించాను అనే ఒక కారణం వలన వీడూ నన్ను తిరస్కరించడం జరుగుతోంది” అని నిశ్చయించుకుని ఎప్పుడో వేణు కొనియిచ్చిన వాచీని అమ్మేసి చంద్రన్ మద్రాసుకి వచ్చేసాడు. కాని అతను ఎదురుచూసినట్టు ఉద్యోగం అనేది అంత సులభంగా దొరకలేదు.  ఒక నెలవరకూ బాధపడ్డాడు. ఏమీ జరగలేదు.

 

చంద్రన్ పడుతున్న శ్రమని తెలుసుకున్న మాజీ యజమాని తన గౌరవానికి హాని రాకూడదని చంద్రాన్ని అకస్మాత్తుగా ఒక సమావేశంలో కలుసుకున్నట్టు చూసి అతనితో మాటాడారు.

 

“పాత్రికేయులకి వ్యక్తీకరణ స్వాతంత్య్రం కావాలంటే మాకు - యజమానులకి - ఏ ఆక్షేపణా లేదు. ఎందుకంటే మనం ఉండేది ప్రజాస్వామ్యం, మేం అందులో భాగమై ఉన్నాం. మీరు ఉద్యోగం చేసే పత్రిక ఒక లక్ష్యం కోసం ప్రకటించినప్పుడు అందులో మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ప్రకటిస్తే మీరు మా స్వాతంత్య్రంలో చొరబడుతున్నారన్నమాట, అవునా? పత్రిక లక్ష్యం తెలుసుకొని దాన్ని స్వీకరించి మీరు రాయాలి. అదే జరుగుతోంది, వెస్టు బెంగాల్ లో. అక్కడ పాత్రికేయులు తమకని ప్రత్యేకంగా ఒక పత్రిక నడుపుతున్నారు. తాము పని చేసే పత్రికలో ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగించుకొని, వాటిని ఖండించి కూడా తమ పత్రికలో వాళ్ళు రాస్తారు. వాళ్ళ సొంత అభిప్రాయం ఏమిటో మనకి బోధపడుతుంది. ఇక్కడ మీరూ అలా చెయ్యవచ్చు, కాని ఇక్కడ అది సాధ్యమా? మిమ్మల్ని మినహాయించి మరెవరికైనా వ్యక్తిగత దృక్పథం, ఉద్దేశం అని అంటూ ఏమైనా ఉందా? అందరూ కూలీకి పని చేసేవారేకదా? తను చెప్పేది ఎప్పుడూ చెయ్యడు, తను ఏది చేసినా అది సరే - ఇదే అందరికి అలవాటైపోయింది!. నీలాంటివారు ఈ ప్రపంచంలో పదిమందికూడా లేరే?” అని అతను తన సానుభూతి తెలియజేసినప్పుడు ఇతరులగురించి అతని ఆలోచన విని చంద్రన్ నీరసపడ్డాడు.

 

ఇప్పుడు అతని బోధన విని, తన ఓటమి ఒప్పుకొని చంద్రన్ మళ్ళీ ఆ పాత ఉద్యోగంలో చేరాడు. తనలాంటివారితో సంప్రదించి, వెస్ట్ బెంగాల్ లో ఉన్నట్టు తమకీ ఒక పత్రిక కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

అవును మరి, ఆదర్శ భావనలు - మాట్లాడాలంటే ఎంత సులభం!

 

***

 

సాయంకాలం ఆరుగంటలకి చంద్రన్ తన గదికి తిరిగివచ్చాడు. మేడ మెట్లు ఎక్కి వస్తూంటే తాళం వేసిన గది తలుపు ముందు ఒక స్టూలుపై కూర్చున్న వేణు “నువ్వు ఆఫీసునుంచి బయలుదేరివుంటావని అర్ధగంటగా నేను ఇక్కడ కాచుకొని వున్నాను” అని అంటూ నిలబడి, ఒక చిరునవ్వు నవ్వాడు.

 

చంద్రన్ వేణుని చూడలేకపోయాడు. తల వంచుకోని గది తెరిచాడు.

 

“నువ్వు బాగా చిక్కిపోయావ్!” అని అంటూ వేణు చంద్రన్ భుజం తాకాడు. చంద్రన్ వాడి చేతిని మౌనంగా తీసి గదిలోకి ప్రవేశించాడు. లోపలికి వచ్చి చొక్కాయి విప్పిన తరువాతే తన స్వాగతం ఎదురుచూస్తూ, గడపదగ్గర నిలబడివున్న వేణుని చూసి చంద్రన్ కి జాలి కలిగింది.

 

“కమిన్” అని పైపైకి అన్నాడు.

 

బయట, కిటికీ పక్కన ఉన్న ఒక అట్ట పెట్టెని చేతిలో అందుకొని లోపలికి వచ్చిన వేణు దాన్ని మంచంమీద వదిలేసి, కుర్చీలో కూర్చున్నాడు.

 

ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, కోటు, టై సడలించుకున్న వేణుని చూసి చంద్రన్ వాడికని ఫ్యాన్ మీట నొక్కాడు. కాని ఇద్దరూ ఏమీ మాటాడుకోలేదు. 

వేణు కోటు జేబులో సిగరెట్టు ఉన్నా చంద్రన్ తో ఎలాగైనా మాట్లాడాలని “చంద్రు, సిగరెట్టు ఉందా?” అని అడిగాడు. చంద్రన్ మౌనంగా తన సిగరెట్టు పాకెట్టు అందించాడు. “థ్యాంక్స్!” అని వేణు అన్నప్పుడు చంద్రన్ కన్నులు చిమ్మగిల్లాయి, మానసికంకా వాడికి ఏడవాలనిపించింది. ‘ఒరేయ్ వేణు, మనం ఎంత మారిపోయాం! మనలో ఎంత ఎడబాటు! ఉత్తికే, మర్యాదకోసం మనం ఇవన్నీ చేస్తున్నాం!’ అని వాపోయాడు. 

“చంద్రు, నీకు నా మీద చాలా కోపం కదూ?” అని వేణు నవ్వుతూ అడిగాడు.

“నా కోపం నిన్నేం చేస్తుంది?. ” అని తల వంచి చంద్రన్ అడిగాడు.

“అబద్ధం వద్దు, నిజం చెప్పు! నీకు నామీద చాలా కోపం! సాయంకోసం వచ్చిన స్నేహితుడిని నేను నిర్లక్ష్యం చేసాను కదూ?”

 

వేణుని మాడ్చుతున్నట్టు చంద్రన్ తలెత్తి చూసాడు: “స్నేహం! మన స్నేహం ఎప్పుడో చచ్చిపోయింది!”

 

“చంద్రు, ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. ‘స్నేహం’ అని నువ్వు ఒక మంచి కథ రాసావు. నా గురించి రాసినా ఆ ధనికుడైన స్నేహితుడి పాత్ర నాకు బాగా నచ్చింది. రచయితకి - అతను ఒకరి గురించి పొరపాటు పడినా - అందులో తప్పకుండా ఒక లాభం ఉంది, అవునా? లేకపోతే అటువంటి పాత్ర సృష్టించడం ఎంత అసాధ్యం!”

 

“జీవితంలో మనం కలుసుకునే పాత్రలే సాహిత్యంలోనూ కనిపిస్తాయి. నువ్వూ, నేనూ స్నేహితులైనా మనం వేరే వేరే వర్గాలకి చెందిన వ్యక్తులం కదా? నీ వర్గం ఆదర్శాలు రక్షించే పక్షాన్ని నేను ఎదిరించిన కారణం వలనే నువ్వు ఆ రోజు నన్ను అవమానించావ్?” అని చంద్రన్ మాటలు విని వేణు నవ్వాడు. అతని నవ్వు చూసి చంద్రన్ ఆగాడు.

 

“సరేలే, కానీ, నువ్వు మాట్లాడు, వింటాను. నీ మాటలు విని చాలా కాలమైంది. అందుకోసమే నేనివాళ నా ప్రయాణం క్యాన్సిల్ చేసి నిన్ను చూడాలని వచ్చాను. కాని, ఎందుకు నువ్వే నన్ను ఆ పక్షంలో చేర్చావని అడుగుతున్నాను. మదురైలో, ఆ పక్షాన్ని తీవ్రంగా ఎదిరించే ధనవంతుడు నేనే అని తెలుసుకో!” అని అంటూ, చొక్కాయిని విప్పి, కోట్ హ్యాంగర్ ని కొక్కెమునకు తగిలించి, పక్కనేవున్న చంద్రన్ తువాలుని అందుకొని వేణు తన ఛాతీ కప్పుకున్నాడు.

‘అలాగైతే, మరెందుకు వేణు ఆ రోజు అలాగ నన్ను తిరస్కరించాడు? డబ్బు కారణమా? అసలు వాడికి డబ్బు ముఖ్యం కాదే?’ అని చంద్రన్ కి తలా తోకా తెలియలేదు. కలవరపడుతూ మంచం చివరన తలగడని ఆనుకొని కూర్చున్నాడు.

 

వేణు కుర్చీని దగ్గరకి ఈడ్చుకొని ‘ఇక ఈ సంభాషణ ఎలా ఎలా ఆరంభించాలి, వీడి తప్పైన అంచనా ఎలా మార్చడం?’ అనే ఆలోచనలో ఇంకొక సిగరెట్టు తీసుకొని చంద్రన్ కి పాకెట్టు అందించాడు. ఇద్దరూ తమ తమ అగ్గిపెట్టెలతో సిగరెట్లు వెలిగించుకున్నప్పుడు వేణు తన అగ్గిపుల్ల ఆర్పేసి చంద్రన్ దగ్గర తన సిగరెట్టు వెలిగించుకున్నాడు. సగం సిగరెట్టు తీరేవరకూ ఎవరూ మాటాడలేదు. ఇలాగే మౌనం సాగించడం వద్దని వేణు ఒక దగ్గు దగ్గి ఆరంభించాడు.

 

“నా మనసులో ఏముందో చెప్పేస్తాను. నాకు నీలాగ మాట్లాడడం తెలీదు, కాని నీకు నా మనసు బోధపడుతుందని నా నమ్మకం. ” అని వేణు ఒక నిమిషం మౌనం వహించి ఆలోచించాడు. తరువాత చెప్పాడు- “‘మానవ జీవితం ఒక పోరాటం’ అని నువ్వు తరచుగా అనడం నీకు గుర్తుందా? ఆ పోరాటంనుంచి నువ్వు తప్పించుకోవద్దనే ఆ రోజు నేను నీకు సాయం చెయ్యలేదు. నీ కథలో ఒక ‘ధనికుని స్నేహం స్థిరం కాదు’ అని నువ్వు రాసావ్. ‘మన స్నేహమూ అలా అయిపోకూడదు’ అని నీకంటే ముందే ఆలోచించినందువలనే నేనలా చేసాను. ” ఆ మాటలు నమ్మలేనట్టు చంద్రన్ మంచంనుంచి లేచి వేణు కళ్ళని చూసాడు.

 

“ఇలా రా, వచ్చి కూర్చో. వివరంగా చెప్తాను. ” అని వేణు తనకి సమీపంలో ఉన్న కుర్చీని చంద్రన్ వైపుగా కొంచెం జరిపాడు.

 

 “ఉద్యోగరీత్యా, అంతస్తురీత్యా నాకు ఎందరో ఉన్నారు స్నేహితులుగా. కాని అవన్నీ తమ తమ అవసరం కోసం వాళ్లు వేసే వేషాలు. జీవితంలో ఒకరికి స్నేహం అనే ఒకే ఒక వసతికోసం స్నేహితుడు దొరకడం చాలా దుర్లభం. అటువంటి స్నేహితుడుగా ఎవరైనా ఉండవచ్చు- అతని మనస్సు, ఆత్మ ఒకేలాగ పనిచేస్తాయి. నేను అలాంటివాళ్ళని, చాలామందిని - ఊహించివున్నాను. దురదృష్టవశాత్తూ నేను అన్ని వసతులు ఉన్న కుటుంబంలో పుట్టాను. నువ్వు ఆ రోజు వచ్చినట్టు, అదే పరిస్థితిలో, వాళ్ళందరూ వచ్చినప్పుడు, ‘అది నా ధర్మం’ అనే భావనతో అన్ని విధాలా సాయం చేసాను. కాని ఆ స్నేహితులు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త కారణాలు చెప్పుకుంటూ సాయం అడగడం ఆరంభించారు. వాళ్ళకి సాయం చెయ్యడంలో నాకేం నష్టం లేదు, కాని వాళ్ళ ఆత్మవిశ్వాసానికి, బాధ్యతకి నా స్నేహం అడ్డుగా ఉందేమో అని నాకనిపించింది. ‘మా స్నేహానికి ఆధారం సహాయమేనా?’ అని నేను ఆలోచించాను. జీవితం అంటే కొత్త కొత్త ప్రశ్నలు లేవడం సహజమేకదా? అది నా జీవితంలోనూ జరుగుతుందని వాళ్ళెవరూ ఆలోచించలేదు. ఆఖరికి, ఎప్పుడైనా నా స్నేహం వలన వాళ్ళకి లాభం లేదంటే వాళ్ళు నన్ను ఏవగించుకున్నారు. నేను నా ధనవంతుడి స్వరూపం చూపించానని దూషించారు. హూం, అలాగ వాళ్ళందరూ పోయిన తరువాత ఆఖరికి మిత్రుడుగా నువ్వే మిగిలావు."

 

“నువ్వూ నా సాయానికి వచ్చి నిలబడినప్పుడు నాకు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. నా స్నేహం వలనే నువ్వు తొందరపడి నీ ఉద్యోగం రాజీనామా చేసావని నేను అనుకుంటే అదేం పొరబాటు కాదే?” అని వేణు అడిగినప్పుడు అతను తన్ను ఒక ముద్దాయిగా కోర్టులో విచారణచేస్తున్నట్ట చంద్రన్ కి అనిపించింది. ‘అవును, ఎంత నిజం!’ అని పెదిమని కొరుకుతూ తల వొంచుకున్నాడు.

 

“చంద్రు, నీ గురించి - ఒక ఉదాత్త మనిషి స్నేహం గురించి - నేను బాధ్యతగా ఆలోచించాను. నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలని నాకనిపించింది. మన స్నేహం వలన మనం ఊరికే పైపైన ఆదర్శాలు వల్లించే మందమతులైపోకూడదు. అలాగైతే ఒక రోజు మన స్నేహమూ క్రుంగిపోతుందని నాకు భయం కలిగింది. చంద్రూ, కొంచెం ఆలోచించు. ఆ రోజు నువ్వడిగిన డబ్బు నేను ఇచ్చివుంటే నీ నిరంకుశమైన చేష్టకి నేనూ దోహదం చేసివుంటాను. నువ్వు తప్పకుండా మళ్ళీ అదే ఉద్యోగంలో చేరడం జరిగివుండదు. నువ్వు మాటాడే ఆదర్శభావనలకి తగిన ఉద్యోగం ఈ సమాజంలో నీకు దొరకదు. పెద్ద పెద్ద సమస్యలగురించి చమత్కారంగా, ఆవేశంతో వాదించి తృప్తి పొందే ఈ నాటి సరాసరి తమిళ ప్రముఖులలో నీకూ వాటా లభించి ఉండేది, అంతే! ఎటువంటి ధర్మమూ, బాధ్యత లేనివాడు ఈ లోకంలో ఏదీ సాధించలేడు. ఆఖరికి స్నేహానికి కూడా వాడు తన అర్హత పోగొట్టుకుంటాడు, అవునా?”

 

ఇద్దరూ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. తన మనసులో ఉన్నదేదో ఇంకా తేటగా తెలియజేయలేదని బాధ పడుతూ వేణు ఏదో ఆలోచనలో పడ్డాడు.

 

వేణు మాటల్లోని చాలా నిజాలు తనకి పూర్తిగా బోధపడినట్టు చంద్రన్ సిగరెట్టు పొగని పీల్చుకుంటూ నెమ్మదిగా తలని తట్టుకుంతూ ఆలోచిస్తూ కూచున్నాదు. 

 

“ఇప్పుడు అదే పత్రికలో ఉద్యోగం చెయ్యడం వలన నువ్వు నీ హక్కులేవీ పోగొట్టుకోలేదు. నువ్వు ఆదర్శించే నియమాలకని ఒక పత్రిక స్థాపించబోతున్నావ్, అవునా? నువ్వు రాజీనామా చెయ్యడానికి కారణం ఏమిటి - తప్పించుకోవాలనేకదా? అందుకే ‘ప్రాక్టికల్ గా ఉండు’ అని నేను అన్నాను. ‘జీవితం ఒక పోరాటం!’ అని అంటే మాత్రం సరిపోతుందా? జీవితం ఎందుకు పోరాటంగా ఉంది? నీ ఆదర్శాలు నీతోనే ఉండనీ. అవి జీవితంలో సఫలమవకుండా, వాటికోసం నువ్వు పోరాడుతూ కాలం గడుపుతున్నాం, అందుకే జీవితం పోరాటంగా ఉంది. నువ్వు పోట్లాడి సాధించవలసిన పనికి నువ్వు నిన్నే నమ్మాలి, నన్ను నమ్మితే ఏం లాభం? ఆత్మవిశ్వాసం ఉంటే నన్నెందుకు నమ్మాలి? నీవున్నచోట నిలకడగా నిలబడడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆ తరువాతే స్నేహం! ‘స్నేహం బరువుగా లేదు’ అని నువ్వే చెప్తావ్!” అని అంటూ వేణు నవ్వాడు.

 

చంద్రన్ మనసూ మెత్తబడింది. వేణుని చూసి నవ్వాలనిపించింది. కాని మరేదో ఆలోచనలో చంద్రన్ పెదిమలు కదిలాయి.

 

“నా స్నేహితులందరితో చేసిన పొరబాటు నీతో చెయ్యకూడదని నేను ఆలోచించాను. వచ్చే అపకీర్తి ముందే వచ్చేసిందనుకో, దాన్ని సర్దుకోడానికి నాకు అవకాశం దొరుకుతుందనే నమ్మకంతోనే ఆ రోజు అలాగ చేసాను. అందుకోసం ఇప్పుడు నీ దగ్గర నేను క్షమాపణ అడగను!” అని అంటూ వేణు నవ్వాడు. 

 

‘ఆహా, ఈ వేణు ఎంత సావధానంగా, మెలకువగా ఆలోచిస్తున్నాడు!’ అని చంద్రన్ మనసు పొగడింది. “నేను కూడా నీ దగ్గర క్షమాపణ అడగను. ఎందుకంటే నువ్వు నన్ను క్షమించేసాన్, అది నాకు తెలుసు!” అని చంద్రన్ నవ్వాడు.

 

“అబ్బా, ఆఖరికి నీ నవ్వు చూసాను! నా భార్యని నవ్వించడానికి రెండు మాటలు చాలు! నీతో అదేం అంత సులభం కాదు!” అని అంటూ వేణు “ఇదిగో, నీకు నచ్చిన సూట్!” అని ఆ అట్ట పెట్టెని తెరిచి చంద్రన్ ముందు పెట్టాడు. “‘దీన్ని కుట్టే ఖర్చులో సగం ఇస్తే చాలు!’ అని ఆ రోజు ఏడ్చావు. చెప్పు, ఇప్పుడు దీనితో నీకెంత డబ్బు కావాలి?” అని తన పర్సు తెరిచాడు.

 

“నాకేం వద్దు!” అని చంద్రన్ వెనకాడడం చూసి వేణు నవ్వాడు.

 

“చంద్రూ, మన స్నేహానికి ఇవన్నీ ఆధారం కాదు. ఇవన్నీ ఒక ఆనవాలు మాత్రమే. డబ్బూ, ఆస్తి చాలా అల్పమైన వస్తువులు. ‘ఇది కావాలి, అది కావాలి’ అని దేన్నీ గొప్పగా చెప్పవద్దు!” అని వేణు మాటలు విని చంద్రన్ మిత్ మీరిన సంతోషంతో అతనివైపు తన చేతిన చాచాడు.

 

వేణు తన చేతిలోని పర్సుని నేల పడేసి చంద్రన్ చేతిని పట్టుకున్నాడు.

ఇద్దరూ తమ స్నేహం శాశ్వతమైందనే ఆహ్లాదంతో చేతిలో చేయి వేసుకున్నప్పుడు ‘ఇవన్నీ ఆనవాలు మాత్రమే, ఆధారం కాదు’ అని వేణు సందేశానికి తగినట్టుగా ఆ ఖరీదైన సూట్, డబ్బున్న పర్సు వాళ్ళ కాళ్ళముందు అలాగే పడి ఉన్నాయి.

*****

bottom of page