top of page

కథా​ మధురాలు

రోబోట్ వైఫ్

 

జయంతి ప్రకాశ శర్మ

Jayathi Prakash Sarma.PNG

దసరాకి వెళ్ళినావిడ ఉగాదికి కూడా రాకపోయేసరికి నరసయ్యగారికి కోపం ముంచుకొచ్చింది.

"ఏఁవయ్యా? ఇదేం బావుందా! కరోనా కారణంగా రెండేళ్ళ నుండి పండగా పబ్బం లేదని గొడవ చేస్తుంటే.. దసరాకు సరదాగా వచ్చాం. పండగయిన తర్వాత బయలుదేరితే,'అక్క ఓ వారం రోజులు ఉంటుందని, నన్ను పొమ్మనమని మీ ఊరి భాషలో చెప్పకనే చెప్పావు! పైగా 'మీకు మీ కామ్రేడ్స్ ఉన్నారుగా, దేనికీ లోటుండదని'  ఎద్దేవా కూడా చేసావు! అయినా నీకు బుద్ది లేదు సరే, మీ అక్కకి ఉండక్కర్లేదా చెప్పూ? అమ్మమ్మ అవతారం ఎత్తిన తర్వాత కూడా ఇంకా పుట్టింట్లో తిష్ట వేయడం అస్సలు బాలేదు!" అంటూ బామ్మర్దికి ఫోన్ చేసి చెడామడా తిట్టిపోసాడు. 

"అదేం మాట బావగారు? మీరైనా, మేమైనా కొంపల్లో లింగులింగుమంటూ ఇద్దరేసే ఉ‌న్నాం కదా? మన నలుగురం ఒక దగ్గరే ఉంటే, పేకాటకి హెండ్స్ సరిపోతాయని అంటే, అప్పుడు ఊ అన్నారు. ఇప్పుడేమో ఉఁహు అంటున్నారు!" అంటూ బామ్మర్ది ఫోన్లోనే బావగారికి తాయిలం రాశాడు.

"ఆ పాట నీకు బాగా వంటబట్టినట్టుందిలే! అయినా ఇప్పుడు మీకు హ్యాండ్ తక్కువైంది, నాకు హ్యాండే లేదు!”

“అందుకే మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమని అక్క చెప్పమంది!” 

“బావుంది సంత! నీకు పనీ పాట లేదు. నాకెక్కడ అవుతుంది.రెక్కాడితే గాని డొక్క ఆడదుగా!"

“దోసిళ్ళ నిండా పింఛను తీసుకుంటున్నారుగా. ఇంకా రెక్కలు ఆడించడం దేనికి బావగారు?” 

“మరదే. అసలు విషయాన్ని హైజాక్ చేసి, డొంకల్లోకి దింపుతున్నావు. దసరాకి వచ్చిందా? సంక్రాంతి అయింది, ఉగాది కూడా అయింది. గూటికి చేరదామనే ఆలోచన మీ అక్కకి లేదు. 'విడాకులు తీసుకున్నారా అన్నయ్యగారూ?' అంటూ అపార్ట్మెంట్ అంతా కోడై కూస్తున్నాది. అదొక్కటే మిగిలింది బామ్మర్ది!” నరసయ్యగారు చిరాకు పడుతూ, ఫోన్ ని కుడి చెవి నుండి ఎడమ చెవికి మార్చాడు.  

"సరే బావగారు. మీరు మరీ అంతలా అంటున్నారు కాబట్టి మేం అందరం బయలుదేరి రేపే వచ్చేస్తున్నాం..!"

"నీ దుంపతెగ. బహువచనం ఏమిటి? కొంపతీసి పెన్షన్ని మిగిలిద్దామని ప్లాను వేసావా బామ్మర్ది! మీరెవరు రానక్కరలేదు. మీ అక్కని అక్కడే ఉంచుకుని, అమావాస్యకు, పున్నెంకి పట్టుచీరలు పెడుతూ దీవెనలు తీసుకో!" అంటూ కోపంగా ఫోన్ పెట్టిసారు నరసయ్యగారు.

 

అప్పటికే ఆయన బుర్రలో ప్లాన్ 'బి' రడీగా ఉంది. అలస్యం చేయకుండా జోసెఫ్ ఎండ్జల్ బర్జర్ మనవడు మైకేల్ జోసెఫ్ కి ఫోన్ చేసాడు.

 

"హాలో మైకేల్‌, నేను నరసయ్యని! మీ తాతా నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకునే వాళ్ళంలే... నీకు తెలియదు! అప్పటికి నువ్వింకా పుట్టలేదులే! మీ తాతా పోయిన రోజు వద్దామనుకున్నా, రాకెట్ దొరకలేదు. రాలేకపోయాను!"

 

"ఓకే సార్. ఐ యామ్ విత్ బిల్ గేట్స్, టెల్ మీ?వాట్ డుయూ వాంట్?"

"ఏం లేదు మైకేల్‌. మా ఆవిడ నైన్ మంథ్స్ బాక్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది”

“కంగ్రాచులేషన్స్ సార్! ఈట్ ఇస్ ఎ న్యూస్ ఇన్ యువర్ కంట్రీ. బట్ హియర్ ఇట్ ఇస్ కామన్!”

 

“ఏడిసినట్టుంది..  నా మాట పూర్తి కాకుండా నువ్వేదో ఊహించికోకు! ఆవిడ నేను కలసి లాస్ట్ అక్టోబర్లో, దసరా పండగని సరదాగా గడపడానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాం! పండగ అవగానే నేను వచ్చేసాను.nఓ వారం తర్వాత మా ఆవిడ వస్తానని చెప్పింది, కానీ ఇప్పటికీ ఆర్నెల్లు గడిచాయా. ఫికర్ లేదు! పైపెచ్చు మా బామ్మర్ది కూడా పంపించేలా లేడు! వాళ్లిద్దరికి తిక్క కుదిరాలంటే, అర్జంటుగా ఓ ఆడ రోబోట్ కావాలి.  రెడీగా ఉంటే పంపు!”

“నో సర్. ఇంకా మా దగ్గర అలాంటి రోబోట్స్ తయారుచేయలేదు. నేను ఆ రీసెర్చ్ పని మీదే ఉన్నాను. కానీ మీ ఇండియన్స్ అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తూ, నా ఆలోచనలకు సహకరించడం లేదు!”

“ఓ గాడ్. ఇంటి దగ్గర ఆలి ఉంటే, ఇంకేం చేస్తారు. వాళ్ళ బొంద! సరే. నేనే నడుం కడతా!”

“ఎక్సలెంట్  నరసయ్ గారు. గో అహెడ్! ఐ విల్ గైడ్ యు!”

“థాంక్యు మైకేల్! సామాను లిస్టు చెపితే, నేనే ఏదో పాటుపడి తయారు చేసేస్తాను. మధ్యలో డౌట్లు వస్తే నారాయణమూర్తిగారు ఉన్నారుగా, ఆయన్ని అడుగుతాలే!"

“వాహ్. వెరీ నైస్ నరషయ్య గారు. మీరు తయారు చేసిన తర్వాత ఎలా పని చేస్తుందో చెప్పండి. వాటితో  మీకంటే ఎక్కువ అవసరం మాకే ఉంది!” అంటూ మైకేల్ ఫోన్లోనే లిస్టు చెప్పాడు.

 

నరసయ్య గారు సెల్ లో రికార్డింగ్ ఆన్ చేసి, ఆ లిస్టు రికార్డ్ చేసారు.

“అన్నీ అసెంబుల్ చేసిన తర్వాత నాకు మెసేజ్ ఇవ్వండి. ఈమెయిల్ లో సాఫ్ట్వేర్ పంపుతాను!” అంటూ మైకేల్ ఫోన్ కట్ చేశాడు. 

 

నరసయ్యగారు ఆలస్యం చేయకుండా, కారేసుకుని పూర్ణా మార్కెట్ కి వెళ్ళి, పాత ఇనుప సామానులు, కంప్యూటర్లు అమ్మే దుకాణాలు వెతికి, కావలసిన సామానులు, వెల్డింగు మెటిరీయల్ కొనీసారు.

 

పదిహేను రోజులు గెడ్డాలు, మీసాలు పెంచుకుని, జుట్టుకి రంగు వేయకుండా, మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ ఓ రోజు అపార్ట్మెంట్ దద్దరిల్లేలా 'యురేకా' అని గట్టిగా అరిచారు.

 

"ఏమిటా అరుపులు!" అంటూ ఎదురుగా ఉన్న ఆడ రోబోట్ కూడా అదే స్థాయిలో అరిచింది.

 

"నా కృషి ఫలించింది మై డియర్ రోబోట్ వైఫ్! ఇవాళ నుంచి నీ పేరు అదే!! మేం లేకపోతే, మగాళ్లకి తెలవారదనుకునే పెళ్ళాలకి నీతో చెక్ పెడతాం! హ..హ..హ.." అంటూ గట్టిగా నవ్వారు నరసయ్య గారు.

 

"నవ్వాపి,  వచ్చే శ్రావణ మాసం సంగతి చూడండి! ఇంతకీ కొత్తచీర కొన్నారా?" అంటూ ఆ రోబోట్ వైఫ్ చిరాగ్గా చూసింది!

 

"ఒకటేమిటి డియర్! ఆ బెడ్ రూములో రెండు బీరువాల్లో ఉన్నవన్నీ నీవే! పోయి ఎంచుకో!" అంటూ రిమోట్లో కమాండ్ ఇచ్చారు.

 

"డామిట్, ఒకళ్ళు కట్టి వదిలేసిన చీరలు కట్టడమా. అదేం కుదరదు!  కాంచీపురం వెళ్ళి కొత్తవి  కోనవలసిందే!"

 

"ఎక్సలెంట్ రోబోట్ వైఫ్! నేను ఊహించిన దానికంటే నువ్వు ఎక్కువగా రెస్పాన్స్ ఇస్తున్నావు. థాంక్స్ టూ మిస్టర్ మైకెల్! యు నో మైకేల్. యంగ్ బాయ్ ఫ్రమ్ అమెరికా!  నిన్ను తయారు చేయడంలో నాకు మంచి సలహాలు ఇచ్చాడు. నారాయణమూర్తి గారిని అసలు అడగలేదు. అడిగితే, ఆయన ఇంకెదో చెప్పి, నా కొంప కొల్లేరు చేసేస్తాడు!"

 

అంతలో గుఁయ్, గుఁయ్ అంటూ సౌండ్ వినబడింది.

 

"మర్చిపోయా, షాపింగ్‌ కి వెళ్దామన్నావు కదా! మంచి కాఫీ కలిపి తీసుకురా, కాఫీ తాగి వెళ్దాం!" అంటూ కొంటెగా చూసాడు.

 

"ఏం వొళ్లెలా వుంది? మీ ఆవిడ అనుకున్నావేమిటి. కాఫీలు గట్రా తేవడానికి? ఐయామ్ రోబోట్ వైఫ్!" అంటూ చెయ్యెత్తింది.

 

"పో, చిలిపి! ఆ మాత్రం కాఫీ కలపలేననుకున్నావా! టూ మినిట్సాగు!" అంటూ వంటింట్లోకి దారి తీసారు నరసయ్యగారు.

 

వంటింట్లో డబ్బాలన్ని వెతికి ఓ డబ్బా తీసి "ఎంత వారలైనా రోబో దాసులే." అంటూ త్యాగరాజు వారి పాటను కొంచెం మార్చి పాడుకుంటూ స్టవ్ వెలిగించారు.

 

వెనకే వచ్చిన రోబోట్ వైఫ్ "ఓరి మగడా. అది పంచదార కాదు, ఉప్మా రవ్వ! మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పుడు అర్ధమయింది!" అంటూ కొర కొర చూసింది.  

 

"ఆవిడగారు వెళ్ళిపోతే ఏం జరిగింది.. అంతకంటే వెయ్యిరెట్లు బెటర్ వైఫ్ వి నువ్వొచ్చావు కదా!"

 

"మరదే. నేను వైఫ్ ని కాదు. నా పేరు రోబోట్ వైఫ్! మేం మ్యారేజులు చేసుకోం!"

 

"మ్యారేజ్ వద్దులే. సహజీవనం చెద్దాం! జస్ట్ లైక్ గుడ్ ఫ్రెండ్స్! జట్టుకి రంగేసుకున్నాను గాని, రిటైర్ అయి దశాబ్దం గడిచిందిలే! ఈ కొంపలో వంటపనులు, ఇంటిపనులు నువ్వు చూడు చాలు! నేను అంట్లు తోమడం,  ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం చేస్తాను! డివిజన్ ఆఫ్ లేబర్ తో డివిజన్ ఆఫ్ వర్క్ కూడా! యూనో, ఐ యామ్ ఎ ట్రేడ్ యూనియన్ ఫెలోనా! సరే, నీకు కొత్త కదా. నువ్వలా నిలబడు, ఈ పూటకి నేను వంట చేస్తా!" అంటూ ఫ్రీజ్ తీసి "ఈ బీరకాయ తొక్క తీసి పెట్టు, ఈలోగా రైస్ కుక్కర్ పెడతా!" అంటూ రెండు కాయలు ఇచ్చారు.

 

"అయ్యో రామా. ఇవి బీరకాయలు కావు, పొట్లకాయలు!" అంటూ ఇక లాభం లేదనుకుంటూ, వంట ఎలా చేయాలో తానే చెప్పసాగింది రోబోట్ వైఫ్.

 

"స్టవ్ ని సిమ్ లో ఉంచి, పోపు వేయించాలి. పోపంటే ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, రెండు ఎండు మిరపకాయలు చిదిమి, రెండు చెమ్చాల నూనెలో సిమ్ లో వేయించాలి! లేకపోతే అపార్ట్మెంట్ అంతా తుమ్ములతో దద్దరిల్లి పోతుంది!" అంటూ ప్రతీ విషయం చెప్పసాగింది.

 

"నీకు కొత్త కదా అని, ఈ పూటకి నేను చేసాను గాని, రాత్రి నుంచి నువ్వే చెయ్యాలి!" అంటూ నుదుట పట్టిన చెమటని తుడుచుకున్నారు నరసయ్యగారు.

 

"అబ్బే. వంట చేయడం మా ఇంటా వంటా లేదు! అవన్నీ చేయడానికి నేనేం మీ ఆవిడ్ని అనుకున్నావేమిటి. నా దగ్గర దట్ డాల్ కాంట్ కుక్!" అంటూ రోబోట్ వైఫ్ వీథి గుమ్మం వైపు దారి తీసింది.

 

"ఇదిగో. ఇదిగో. నా మాట విను!" అంటూ రోబోట్ వెంట పరుగు తీసారు నరసయ్యగారు.

 

"అబ్బే కుదరని పని!" అంటూ స్పైడర్ మాన్ లా అపార్ట్మెంట్ మీద నుంచి దూకి పారిపోయింది రోబోట్ వైఫ్.

 

"బ్రహ్మే కాదు, మైకేల్ తాతగాడు కూడా భర్తగాడ్ని అర్ధం చేసుకునే వైఫ్ ని సృష్టించలేడు!" అనుకుంటూ వంటింటి వైపు దారి తీసారు నరసయ్యగారు.

అంతలో-

 

డోర్ బెల్లు వినబడటంతో, గాఢ నిద్రలో ఉన్న నరసయ్యగారు తుళుక్కుపడి లేచి, పరుగెత్తికెళ్ళి వీధి తలుపులు తీసారు.

 

"మళ్ళీ లాక్ డవున్ పెట్టేస్తున్నారుట. రిటైరయిన వాళ్ళం ఎక్కడున్నా ఒకటే కదా అని, అందరం కలిసి వచ్చీసాం!" అంటూ, పది సూట్ కేసులతో ఇంట్లోకి అడుగుపెట్టిన బామ్మర్ది కుటుంబంతో పాటు, పద్మావతిగారు లోపలకి అడుగుపెట్టడం చూసిన నరసయ్యగారికి కాలం కాని కాలంలో భోగిమంట రాజుకుంది!!

 

****

bottom of page