top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

ఓ మరపురాని ప్రయాణం

Radhika Bukka

రాధికా కే బుక్కా

ఉపోద్ఘాతం

కొన్ని కథలు నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అసలు నిజంగా జరిగాయేమో అన్నట్టు ఉంటాయి. కానీ, చాలా చిత్రం గా, కొన్ని నిజంగా జరిగిన సంఘటనలు కథల కంటే కల్పితంగా అనిపిస్తాయి. ఆ సంఘటన మనకే జరిగితేనో లేక మనం ప్రత్యక్షం గా చూసి ఉంటేనే తప్ప నమ్మాలనిపించదు. చెప్పేవాళ్ళు కథలు అల్లేస్తున్నారు అనిపించక మానదు. ఎప్పటికీ మరిచిపోలేని గొప్ప  జ్ఞాపకం గా  మిగిలిపోయిన అలాంటి ఒక సంఘటన గురించే ఇప్పుడు నేను చెప్పబోయేది.

**

"అమ్మా, రెండు రోజులు సెలవలు వస్తున్నాయి, పుట్టపర్తి కి వెళ్దామా " అన్నాను నేను.

ఉద్యోగం లో చేరి ఆరు నెలలయింది. మాకు చిన్నప్పటి నించి అమ్మమ్మగారి ఇల్లు, నాయనమ్మ గారి ఇల్లు తెలియదు. మా అమ్మమ్మ గారు మా అమ్మ మూడో ఏడు లోనే ప్రసవసమయం లో గుర్రంవాతంవచ్చి చనిపోయారు. తండ్రి,  ఆడపిల్లని నేను పెంచలేను అని మా అమ్మని వారి అమ్మమ్మ వద్ద, పిన్నులు , పెద్దమ్మల వద్ద పెరగనిచ్చారు. మా అమ్మే ఎప్పుడూ తన పుట్టింట్లో తండ్రి, అన్నల వద్ద లేదు, ఇక మాకు అమ్మమ్మగారి ఇల్లు అసలే లేదు.  మా నాన్నగారు వాళ్ళింట్లో అందరికన్నా చిన్న. మా నాయనమ్మ గారు మా అమ్మా, నాన్నల పెళ్లి అయ్యాక వీరి వద్దే ఉండేవారు. నా చిన్నతనం లోనే ఆవిడా మరణించారు. నాన్న వైపు అన్నదమ్ములు ఉన్నా, అంతగా రాకపోకలు లేవు. అక్కాచెల్లెళ్లు వాళ్ళే వచ్చిపోతుండేవారు. దీంతో, మాకు వేరే ఊరు వెళ్ళటం సెలవలకి అనే సంగతే ఉండేది కాదు.

మా అక్కల చిన్నతనం లో మా నాన్నగారు పుట్టపర్తి బాబా గారి ఫోటో ఒకటి ఇంట్లో  తెఛ్చి పెడితే,ఆయన జుట్టు చూసి పిల్లలు భయపడతారేమో అని మా అమ్మ ఆ ఫోటో తీసెయ్యండి అని మా నాన్నని బతిమాలిందిట. అలా ఆ ఫోటో బీరువా లోకి వెళ్ళిపోయింది అప్పుడు.

తరవాత నా చిన్నతనం లో మేము ఇల్లు మారాక, మా చుట్టుపక్కల కొన్ని ఇళ్లల్లో సాయి భజన చేస్తుండేవారు. ఈ సారి మా అమ్మ కూడా సత్య సాయి ప్రబోధల వైపు ఆకర్షితురాలయ్యింది. బీరువాలో ఫోటో బైటకి వచ్చింది. మేము కూడా భజనలు, సేవా కార్యక్రమాలలో పాలు పంచుకునే వాళ్ళం.

మా వేలువిడిచిన మేనమామ గారి కుటుంబం తో మొదటిసారి పుట్టపర్తి వెళ్లొచ్చాక మా అమ్మ కి, అక్కడి పద్ధతులు, క్రమశిక్షణ, స్వామి సన్నిధిలో ఉండటం ఎంతో ప్రశాంతం గా అనిపించి, ‘పుట్టింటికి వెళ్లినట్టు చాల హాయిగా ఉంది మనసుకి!’ అంది. నాకు ఆ మాట మనసులో ఉండిపోయింది!! నేను పుట్టపర్తి కి నా ఇంజనీరింగ్ లో కానీ వెళ్ళటం కుదరలేదు. నేను వెళ్ళినప్పుడు నాకు కూడా అక్కడ చాలా ప్రశాంతం గా అనిపించింది.

నేను ఉద్యోగం లో చేరాక మా అమ్మ, నాన్నలని పుట్టపర్తి తీసుకెళ్లాలని నాకు చాలా ఉండేది. అందుకే ఇప్పుడు ఆ ప్రస్తావన తెచ్చాను. నాన్న తనకి  ఈ సారి పని ఉండి రాలేనని, మరొక సారి వెళదామని అన్నారు.

"పోనీ, అమ్మా, నువ్వూ నేనూ వెళ్తే " అన్నాను.

"అమ్మో, నువ్వు నేనేనా, కష్టమమ్మా, నువ్వేమో చిన్నదానివి, నాకేం అంతగా ఏమీ తెలియదు. వద్దు" అనేసింది.

నేను అన్నీ చూసుకోగలనని, పర్వాలేదని అమ్మ, నాన్నలని ఒప్పించే సరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఎందుకో చాలా సాహసోపేతం గా అనిపించింది. జరగబోయేది మనసుకి ఏదో అర్ధం అయ్యి ఉంటుంది. పుట్టపర్తి కి సికింద్రాబాద్ నించి ఉండే డైరెక్ట్ ట్రైన్ దొరకక, ధర్మవరం వెళ్లే ట్రైన్ కి టికెట్స్ తీసుకున్నారు నాన్న.  పుట్టపర్తి లో తెలిసిన వాళ్లు ఇద్దరు ముగ్గురు కలిసి, అక్కడకి వెళ్ళినప్పుడు ఉండటానికి ఇల్లు కొనుక్కున్నారు. ఎవరైనా వెళ్తుంటే వాళ్లకి కూడా ఆ ఇంటి తాళాలు ఇచ్చేవారు. వాళ్ళ దగ్గర తాళాలు తీసుకున్నాము. ప్రయాణం అయ్యే రోజు వచ్చింది. అన్ని జాగ్రత్తలు చెప్పి ట్రైన్ ఎక్కించారు నాన్న. అమ్మ, నేను మాత్రమే ప్రయాణం చెయ్యటం కొత్తగా అనిపించింది!!

మర్నాడు పొద్దునే, ధర్మ వరం లో దిగి, పుట్టపర్తి వెళ్లే బస్సు ఎక్కాం. దాదాపు 40 కిలోమీటర్లు దూరం. మధ్యలో పల్లెలు కొన్ని ఉన్నాయి. కొద్ది దూరం అయితే   కొండలు, గుట్టలు, తుప్పలు, నిర్మానుష్యం అయిన దారి తప్ప మరింకేం లేదు. మొత్తానికి పుట్టపర్తి చేరుకొని, ఇల్లు అడ్రెస్స్ వెతుక్కుంటూ వెళ్లి ఇంట్లో దిగి, త్వర త్వరగా తయారయ్యి దర్శనానికి వెళ్ళాము. మాకు తెలియని విషయం ఏమిటంటే, అప్పుడే ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయి అక్కడ. ప్రశాంతి నిలయం అంతా కిట కిట లాడుతోంది. స్వామి దర్శనానికి వచ్చి చాలా సేపు బయట కూర్చోటం, రోజుకో ప్రసంగం ఇవ్వటం, స్టూడెంట్స్ అంతా చక్కని భజనలు పాడటం, వివిధ దేశాల నించి వచ్చిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించటం ఇలా అద్భుతం గా గడిచింది ఆ మూడు రోజులూ!!

కల్ప వృక్షం దగ్గరికి,  చిత్రావతీ నది దగ్గరకి కూడా వెళ్ళొచ్చాము మధ్యలో వీలు దొరికినప్పుడు. నా ఆనందానికి అవధుల్లేవు!! బతిమాలి అమ్మని తీసుకొచ్చాను, ఇక్కడ ఇంత చక్కగా జరుగుతోంది,  మరో రెండు రోజులు ఉండేలా ఆగితే  బాగుండును అని అనుకుంటూ ఉన్నాను. తిరిగి వెళ్లిపోయే రోజు వచ్చేసింది. పొద్దున్న విధిగా దర్శనం ముగించుకుని ఇంటికి వెళ్ళాం. అన్నీ సర్దేసుకుని, మధ్యాహ్నం ప్రశాంతి నిలయం కాంటీన్ లో భోజనం చేసి, గేట్ ఎదురుగా ఉన్న గణపతి కి పదకొండు ప్రదక్షిణాలు చేసి,  ఇంటికి బయలుదేరాము. అప్పటికి టైం 2 అయ్యింది.6 గంటలకి మా ట్రైన్  ధర్మవరం నించి.

 

"4 కల్లా బయలుదేరాలి అమ్మా, నెమ్మదిగా బస్సు స్టాప్ కి వెళ్లి బస్సు ఎక్కి ధర్మ వరం వెళ్ళాలిగా!" అంది అమ్మ.

నాలుగయ్యేందుకు ఇంకా రెండు గంటలు ఉందని, ఇంటికి చేరుకొని ఒక్క గంట సేపు నడుం వాలుద్దామని అనుకున్నాము.

మూడు రోజులూ తెల్లరగట్లే లేవటం, గబా గబా  దర్శనం క్యూ లో కూర్చోటం, పొద్దున్న దర్శనం అయ్యాక, ఇంటికి దూరం చాలానే నడవాలని ప్రశాంతి నిలయం లోనే గుడికో, ధ్యాన వృక్షం దగ్గరో , బయట చిత్రావతి, కల్ప వృక్షం దగ్గర కి వెళ్ళటం, తరువాత మళ్ళీ సాయంత్రం దర్శనం క్యూ లో కూర్చోటం, ఇలా చెయ్యటం వలన బాగానే అలిసిపోయాం. అంతగా నిద్రపోని అమ్మకి కూడా బాగా నిద్రపట్టేసింది.

గబుక్కుని మెలకువ వచ్చి చూస్తే 4 అయిపొయింది. ఆదరా బాదరాగా సర్దుకుని, తయారయ్యి, బస్సు స్టాండ్ కి వచ్చేసరికి 4:30. ధర్మవరానికి అరగంటకో బస్సు అంతే. 4:30 బస్సు ఆ రోజు ఎందుకో ఓ 5 నిమిషాల ముందు వెళ్లిపోయిందట. అయ్యో అనుకుని, షేర్డ్ ఆటో లూ, టాక్సీ ల వాళ్ళని అడిగాం. ఆదివారం సాయంత్రం కాబట్టి అక్కడ నించి తిరిగి ఎవరూ రారని, ఖాళీ గా రావాల్సి వస్తుందని, కనుక అంత దూరం రామని అంతా ఒకే పాట పాడారు!!!

 

ఇంకా మాకు నెమ్మదిగా  ఖంగారు పట్టుకుంది!! ఇక 5 గంటల బస్సు మాత్రమే దారి. అక్కడ 6 కి ట్రైన్!! ట్రైన్ స్టేషన్ కి ఓ నాలుగడుగుల దూరం లోనే బస్సు ఆగుతుంది , కాబట్టి, గబా గబా నడిస్తే 6:00 కల్లా చేరిపోగలము అనుకున్నాం!! అనుకున్నట్టుగానే బస్సు వచ్చింది, 5 కి బయలుదేరింది. ధర్మవరానికి టికెట్ తీసుకుని, అప్పటికి కాస్త ఊపిరి పీల్చుకున్నాం. కొద్దిసేపట్లో బుక్కపట్నం వచ్చింది. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు! దిగే వాళ్ళు దిగారు. టైం 5:10 అల్లా అయ్యింది. ఇంకా దాదాపు 30-35 కిలోమీటర్లు వెళ్ళాలి. కొంత సంశయం గానే ఉంది.

అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్ లు రాలేదు. అన్నీ మనం వెళ్తేనే పనులు జరుగుతాయి.

"ఒక వేళ ట్రైన్ తప్పిపోతే, టికెట్ కాన్సల్ చేయించుకుని, మళ్ళీ రేపటికి టికెట్ ఉందో లేదో చూసుకుని బుక్ చేయించుకోవాలి. తిరిగి పుట్టపర్తి కి వెళ్లి, హోటల్ రూమ్ చూసుకోవాలి. మేమున్న ఇంటి తాళాలు పక్క ఇంటి వాళ్లకి ఇచ్చేసాము, ఆ రోజు రాత్రే మరొక కుటుంబం దిగుతున్నారు ఆ ఇంట్లో. రేపు ఆఫీస్ లో పని కూడా చాలా ఉంటుంది. సెలవు ఇవ్వమంటే అసలు కుదరదన్నారు మేనేజర్! దేవుడా, స్వామి, రక్షించు!! సాక్షి గణపతికి చెప్పే బయలుదేరాం కదా… మరి ఇలా టెన్షన్ గా  ఉందేంటి "... ఇలా పరి పరి విధాలా పోతోంది మనసు.

అమ్మని చూస్తే ఆవిడ కూడా అదే పరిస్థితి లో ఉంది!! ఇంతలో ఉన్నట్టుండి బస్సు ఆపేసాడు డ్రైవర్ !! ఏమయ్యింది భగవంతుడా అనుకుని, కండక్టర్ దగ్గరకి వెళ్లి అడిగాను...

కొందరు రైతులు రోజూ ఆ టైం కి ఆ బస్సు ఎక్కి ధర్మవరం వెళ్తారని, ఈ రోజు ఎందుకో ఇంకా రాలేదని, కాబట్టి వాళ్ళు వచ్చే వరకూ అక్కడే ఉంటామని చెప్పాడు!!  నా ఖంగారు చూసి, ఏమయ్యింది అని అడిగాడు.

6 కి ట్రైన్ ఉందని అది అందుతుందో లేదో అని ఖంగారుగా ఉందని చెప్పాను.

" ఖచ్చితం గా అందదు" అన్నాడు పక్క నించి డ్రైవర్!!

" అసలు 6 ట్రైన్ కి ఇప్పుడెలా బయలుదేరారు? ఈ పల్లె తరవాత మరొక రెండు పల్లెల్లో ఆపుతాం బస్సు. రైతులు వచ్చాక వాళ్ళ బుట్టలు, బాగ్గులు బస్సు పైకి ఎక్కించాలి. కనీసం ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది. ధర్మవరం చేరే సరికి కనీసం 6:30 అవుతుంది. సాయంత్రాలు, అదీ ఆదివారం సాయంత్రాలు నెమ్మదిగానే నడుస్తాయి బండ్లు.  మీకు అంత అర్జెంటు అయితే, ఇక్కడే దిగిపోయి ఏవైనా జీపులు వస్తాయేమో చూసుకోండి, లేదా వెనక్కి పుట్టపర్తి పోండి. ఇద్దరూ ఆడాళ్లే ప్రయాణం అయినట్టున్నారు " అన్నాడు  డ్రైవర్ కొంత కరుకుగా !!

 గుండెల్లో దడ మొదలయ్యింది !! అమ్మ ఇది వింటూనే వెనక్కి వెళ్లిపోదాం. ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో టిక్కెట్లు మార్పించుకుందాము అంది. నాకేమో మర్నాడు ఆఫీస్ లో ఉన్న అర్జెంటు పనులు గుర్తొచ్చి,

" లేదమ్మా, కిందకి దిగిపోయి, ఏవో జీపులు అంటున్నారుగా. దొరుకుతాయేమో చూద్దాం" అన్నాను.

అమ్మ కి అంతగా నచ్చలేదు. ఓ పక్కన సంధ్య వాలుతోంది, ట్రైన్ కి టైం అయిపోతోంది!! కిందకి దిగుతుంటే , జాగర్తగా వెళ్ళండి మాడం అన్నాడు కండక్టర్ !  దూరం గా ఒక జీప్ కనిపించింది !

 బ్రతుకు జీవుడా అని అక్కడకి గబగబా వెళ్లాను. ఇలా ధర్మవరం తొందరగా వెళ్లాలని, వస్తారా? అని అడిగాను. ఆ డ్రైవర్ పంచెకట్టు మాత్రమే కట్టుకుని, పైనా ఏ ఆచ్చాదనా లేకుండా ఉన్నాడు. ఇక్కడ ఇలాగే ఉంటారు కామోసు అనుకున్నా.

" ఓ, తప్పకుండా వస్తాము. గట్టిగా బండి తొక్కితే 20 నిమిషాల్లో ధర్మవరం లో ఉంటాం " అన్నాడు అతను.

కొంచం భారం దిగినట్టయ్యి , అమ్మ దగ్గరకి వెళ్లి , " పదమ్మా , 20 నిమిషాల్లో వెళ్ళిపోతాము" అని ఆవిడ ఎంత విముఖం గా ఉన్నా బయలుదేర దీశాను.

"నాన్నగారికి ఫోన్ చేసి చెప్పమ్మా, ఇలా అయ్యింది, ఇలా జీప్ లో వెళ్తాం అని" అని అమ్మ అంది.

సెల్ ఫోన్ తీసి చూద్దును కదా, దాంట్లొ ఛార్జ్ లేదు!! పొద్దున్న ఛార్జ్ చేద్దామనుకుని మర్చిపోయాను !!  అన్నీ, ఒకేసారి ముసరాలా అనిపించింది.

 

ఓపెన్ టాప్ జీప్. డ్రైవర్ వాలకం చూసి అమ్మకి భయం పట్టుకుంది. "5:20 దాటు తోంది. వెలుగ్గానే ఉంది. రోడ్ మీద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, ఏం భయం లేదమ్మా, పద ", అని జీప్ ఎక్కించేసాను. ఆవిడ ఆంజనేయ దండకం చదువుకోవటం మొదలు పెట్టింది. జీప్ రివ్వున తీసుకుపోతున్నాడు. ఓ చిన్న పల్లె వచ్చింది, నెమ్మదించేసాడు. ఇంతలో ఒకతను పరుగున వచ్చి డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు.

" ఇతనెవరూ !!!" భయంగా అడిగింది అమ్మ.

" ఏం భయం లేదక్కా, రోజూ నాతో వస్తాడు " అన్నాడు జీప్ డ్రైవర్.

" మాతో చెప్పాలి కదా ముందుగానే " అంది అమ్మ.

నవ్వి ఊరుకున్నారు ఇద్దరూ. జీప్ స్పీడ్ అందుకుంది.

" అమ్మలూ, అన్నివేళలా అసందర్భం గా ధైర్యం పనికి రాదు. నే చెప్తున్నా వినిపించుకున్నావు కాదు" అంది .

లోపల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నంత దడ గా ఉన్నా,  బయటకి నవ్వుతూ "ఏం పర్వాలేదమ్మా, ఇంకో పావు గంట లో వెళ్ళిపోతాం. జీప్ లో ఇంకొకరెక్కితే మనకేంటి" అన్నాను. కోపం గా చూసింది అమ్మ. రోడ్ మీద మా జీప్ తప్ప మరొక అలికిడి లేదు. చుట్టు  పక్కల ఒక నరపిక్కి  కూడా లేరు. రోడ్, దూరం గా కొండలు, మైదానం అంతా తుప్పలు, మహా నిర్మానుష్యం గా ఉంది.

దాదాపుగా 5:30 అవుతోంది. ఇంకొక 20 కిలోమీటర్లు  వెళ్ళాలి! ఇంతలో జీప్ నెమ్మదించటం మొదలు పెట్టింది. అంతలోనే ఆగిపోయింది!!!!  గుండె జారిపోయింది!! నాకొక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది!! మా అమ్మ పరిస్థితి చెప్పఖర్లేదు !! టక్కున తెలివి తెచ్చుకుని, "ఎందుకు ఆగిపోయింది జీప్?" అన్నాను.

"బండిలో పెట్రోల్ అయిపొయింది " అన్నాడు తాపీగా జీప్ డ్రైవర్.

"అదేంటి, మరి ఇవన్నీ ముందుగా చూసుకోవద్దా", దాదాపుగా అరిచాను.

అటువైపు నించి ఆ సమాధానమూ లేదు. మా అమ్మ కి భయం వణుకు వచ్చేసింది.

" మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఇలా దారి మధ్యలో ఆపేస్తే. ముందే చూసుకునుంటే మేమసలు ఎక్కే వాళ్ళమే కాదు కదా" అని కీచుగా అడుగుతున్న అమ్మని, నిమ్మకి నీరెత్తినట్టు  ఉన్న వాళ్ళని చూస్తుంటే, కాళ్ళూ చేతులూ ఆడటం మానేశాయి!! 

" అడుగుతుంటే చెప్పరేంటి? ఏం చేస్తారిప్పుడు", గట్టిగా అడిగాను. 

వాళ్ళు నింపాదిగా  కిందకి దిగుతూ, " ఏదైనా బండి వస్తే, వెళ్లి పెట్రోల్ తీసుకురావాలి. అప్పుడు గానీ కదలదు ఈ బండి. ఈ దారిలో ఈ టైం లో బళ్ళు రావటం చాలా తక్కువే" అన్నారు !!!

అమ్మ నావంక కోపం గా, నిస్సహాయం గా, నే చెప్తే అసలు విన్నావు కాదు అన్నట్టు చూసింది!! ఆవిడ మాత్రం ఏం చేస్తుంది. గబుక్కున ఎటైనా పరిగెత్తుదాం అన్న, గట్టిగా అరుద్దామ్ అన్నా... చుట్టుపక్కల కనిపించినంత మేరలో ఏమీ లేదు!!

ఇప్పుడు ఏం జరగబోతోంది... వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని. అసలు  మాకే జరుగుతోందా ఇదంతా అని కలవరపడిపోయాను.

ఓ క్షణం ఆ జీప్ డ్రైవర్,అతని స్నేహితుడి కేసి చూసాను. భగవంతుడా నీదే భారం అనుకున్నాను.

"అమ్మా, పద బాగ్స్ తీసుకుని కిందకి దిగుదాం" అన్నాను. ఆవిడ అయోమయం గా చూసి, ఒక బాగ్ పుచ్చుకుని లేవబోయింది.

 "మీకెందుకు, మేము దించుతాము, అయినా కిందకి దిగి మాత్రం ఏం చేస్తారు " అని జీప్ డ్రైవర్ స్నేహితుడు సన్నగా నవ్వుతూ దగ్గరకి రాబోయాడు.

హఠాత్తుగా మహా మొండి ధైర్యం వచ్చేసింది నాకు. చాలా తీక్షణం గా చూసాను అతన్ని. "మేము  ఏం చేస్తామో నీకు అవసరం లేదు. పక్కకి జరుగు" అని కరుకుగా చెప్పాను.

"అవతల వైపు నించి దిగమ్మా, పక్క పల్లె వరకూ నడుచుకుంటూ వెళదాం" అని నా బాగ్ అందుకున్నాను.

అవతల వైపుకి జీప్ డ్రైవర్ వచ్చాడు.

ఇప్పుడేం చెయ్యాలా అని వేగం గా ఆలోచిస్తున్నాను... వాడికేసి చూసాను. వాడు అక్కడే ఆగిపోయి దూరం గా చూస్తున్నాడు.

ఏంటా అని తిరిగి చూస్తే, ఆపద్భాందవుడు లా ఏదో ఆర్ టీ సీ బస్సు వస్తూ కనపడింది!!!

ఆ క్షణం లో కలిగిన భావన మాటల్లో వర్ణించటం కుదరదు. గబుక్కున కిందకి దిగి, చేతులూపాం. బస్సు దగ్గరవుతూ నెమ్మదించింది. చూస్తే, మేము ఎక్కి దిగిపోయిన ధర్మవరం బస్సే!!!

కండక్టర్ కిందకి దిగిపోయి మా దగ్గరకి వచ్చాడు.

" ఏమైందమ్మా ఇక్కడున్నారు" అని అడిగాడు. సంగతి చెప్పాం. మమ్మల్ని వెంటనే బస్సు లోకి ఎక్కేయ్యమన్నారు.

"ఏంది రా " అని గద్దించాడు బస్సు డ్రైవర్ కిందున్న జీప్ డ్రైవర్ ని, అతని స్నేహితుడినీ.

"ఏం లేదన్నా, బండి లో పెట్రోల్ లేక ఆగిపోయింది అంతే " అన్నారు వీళ్ళు కాస్త భయం గా…

" అంతేనారా? ఇదే రూట్ మనది రోజూ, ఇంకొక రోజు చూసుకుందాం మీ సంగతి" అని , బస్సు నడపటం మొదలు పెట్టాడు.

లోపల లోపల దేవుడికి శతకోటి దణ్ణాలు పెట్టుకున్నాం అమ్మ, నేను, సమయానికి వీళ్ళు వచ్చినందుకు !!

వాళ్లకి కూడా కృతఙ్ఞతలు చెప్పాము.

"ఇప్పుడు చెప్పండమ్మా, మీ ట్రైన్ ఎన్నింటికి ? మీరు ఎంత ప్రమాదం నించి తప్పించుకున్నారో తెలుసా ! ఆ దేవుడు మీ తోడు ఉండబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. బుక్కపట్నం లో రైతులు వాళ్ళల్లో ఒకరి ఇంట్లో ఎదో శుభకార్యం ఉందని , ఇవాళ రామని చెప్పి పంపేశారు బస్సు ని. అందుకే తొందరగా ఇక్కడకి వచ్చాము. మేము రావటం లేట్ అయితే ఏం జరిగుండేదో తెలియదు" అన్నాడు బస్సు డ్రైవర్ మాతో !! అతనన్నది అక్షరాలా నిజం.

అప్పటికి సమయం 5:35 అయ్యింది. ఇక ట్రైన్ పట్టుకోటం జరిగే పని కాదు. తిరిగి రాత్రి పుట్టపర్తి

వెనొక్కొచ్చే ఓపికా లేదు!!  ధర్మవరం నించి ఏదైనా బస్సు లో వెళ్ళాలి హైదరాబాద్ కి , కానీ అన్ని గంటలు బస్సు ప్రయాణం నాకు అస్సలు పడదు!! ఇలా ఆలోచిస్తూ, ట్రైన్ 6:00 కి అని చెప్పాను.

"లేట్ గా బయలుదేరి ఎంత పని చేశారమ్మా! అన్నా, ఏమైనా చేయగలమా మనం" అన్నాడు కండక్టర్ డ్రైవర్ తో.

అప్పటికి, బస్సు లో దాదాపుగా ఒక పది మంది ఉన్నారు. అందరూ చాల ఉత్సుకతగా ఉన్నారు. ఏం జరుగుతోందో అని.  ఒకరిద్దరు వచ్చి మాట్లాడి వెళ్లారు కూడా.

డ్రైవర్," సరే , ఒక పని చేద్దాం. వీలున్నంత త్వరగా వెళదాం... ట్రైన్ అందించగలమేమో చూద్దాం" అన్నాడు.

మాకు చాలా ఆశ్చర్యము, అలాగే ఎంతో ఆనందము కలిగాయి ఆ మాటలు వింటూనే. బస్సు వేగం

ఒక్కసారిగా పెరిగిపోయింది

ఇక వెంటనే కండక్టర్ , హుషారుగా ప్రయాణీకులందరితో చెప్పసాగాడు

" ఈ తల్లీ కూతుర్లు ఇద్దరినీ ధర్మవరం స్టయిన్ దగ్గర దింపటం, అదీ టైం కి దింపటం మన బాధ్యత అని డ్రైవర్ అన్న, నేను అనుకుంటున్నాం. మీరు కూడా ఒప్పుకుంటారా"

దానికి అందరూ కూడా అవును, ఆడకూతుళ్లని టైం కి దింపేద్దాం అని అన్నారు.

 

"అయితే మరి, బస్సు చాల స్పీడ్ లో పోతుంది. వచ్చే పల్లె లో ఎంత మంది దిగుతారు చెయ్యి ఎత్తండి" అన్నాడు.

ఓ ముగ్గురు చేతులెత్తారు.

"మీరు త్వరగా తలుపు దగ్గర నించుని ఉండండి. బస్సు ఆపీ ఆపనట్టు  అపుతాం. దిగిపోండి. ఎక్కే వాళ్ళని బట్టి అప్పుడేం చెయ్యాలో చూస్తాం" అన్నాడు. వాళ్ళు ఇంకా టైం ఉన్నా వెళ్ళిపోయి తలుపు దగ్గర నించున్నారు. పల్లీ రాగానే, దూరం నించి ఎక్కే వాళ్ల్లు ఎందరో అని చూసాడు కండక్టర్, ఓ ఇద్దరు యువకులు మాత్రమే ఉన్నారు. ముందు వైపు తలుపు దగ్గరకి వెళ్లి “త్వరగా ఎక్కండి” అని

వాళ్ళకి గట్టిగా చెప్పాడు. వాళ్ళు అయోమయం గా గబా గబా బస్సు వైపుకి వచ్చేసారు.

 బస్సు ఆగీ ఆగనట్టు ఆగింది. వెనక నించి దిగిపోయిన వాళ్ళు, జాగ్రత్త మాడం అని చేతులూపారు మాకు. ముందున్న యువకులు దాదాపుగా రన్నింగ్ బస్సు ఎక్కేసారు కండక్టర్ సహాయం తో. టైం 5:45 దాటిపోయింది. బస్సు ఇంకా వేగం పుంజుకుంది. మాకు అసలు ఇదంతా జరుగుతోంది నిజమేనా అన్నట్టు ఉంది.

ధర్మవరం టౌన్ లోకి వెళ్ళినతరవాత బస్సు స్పీడ్ తగ్గించేయాల్సి వచ్చింది.  టౌన్ లో ఉన్నబస్సు స్టాండ్స్ లో బస్సు ఆపలేదు. కండక్టర్ ముందు తలుపు వైపు నించుని , “మేము మళ్ళీ 5 నిమిషాల్లో వస్తాం, మిమ్మల్ని ఎక్కించుకోటానికి” అంటూ చెప్తున్నాడు...

 

టైం 5:55 అయ్యింది. ముందు పల్లెలో దిగిపోయిన ముగ్గురిలో ఒకతను, బైక్ మీద బస్సు వెనకాల వచ్చేసాడు. కండక్టర్, అతను నవ్వుకుంటూ , చేతులు ఊపుకున్నారు. బస్సు లో మిగతా వాళ్లు చాలా ఉత్కంఠ  గా చూస్తున్నారు. ఇక మా పరిస్థితి చెప్పనలవి కాదు. మొత్తానికి బస్సు సరాసరి ధర్మవరం రైల్వే స్టేషన్ ముందు ఆపాడు బస్సు డ్రైవర్.

టైం 6 అయ్యింది. ట్రైన్ బయలుదేరటానికి సిద్ధం  గా ఉంది అనే అనౌన్స్మెంట్ వినిపిస్తోంది!!! మా బాగ్స్ పట్టుకుని కండక్టర్, మరొకరు రైల్వే స్టేషన్ లోకి వెళ్లిపోయారు.

డ్రైవర్ " త్వరగా వెళ్లండమ్మా " అన్నాడు... మాకు అసలు మాటలు రాని పరిస్థితి. మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టి అతనికి, కిందకి దిగి గబా గబా లోపలకి వెళ్ళాము. మా బోగీ ఎదురుకుండానే ఉంది. అప్పుడే ట్రైన్ బయలుదేరబోతోంది. లోపలికి ఎక్కీ ఎక్కగానే మొదలయిపోయింది. మా బాగ్స్ అందించారు. వాళ్లకి కూడా దణ్ణం పెట్టి, చేతిలోకి తీసి పట్టుకున్న 500 నోట్ కండక్టర్ కి ఇవ్వబోయా, తాను, డ్రైవర్ తీసుకొమ్మని చెపుదామని.

"వద్దమ్మా, డబ్బులు కావాలంటే ముందే అడిగే వాళ్ళం, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి " అన్నాడు!!

ఆ మాటలకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. మేము మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పాము . అంత కంటే ఏం చెయ్యగలం? ట్రైన్  వేగం పుంజుకుంది !! మేము లోపలకి వెళ్లి బెర్తుల్లో కూర్చున్నాకగానీ ప్రాణం కుదుటపడలేదు!

అసలు ఏం జరిగిందో సింహావలోకనం చేసుకుంటే, ఇది అసలు మనకే జరిగిందా, నిజమేనా ఇంత సాహసం, మనమే చూశామా ఇంత మానవత్వం, మనుషుల్లో దేవుడు కనిపించటం అంటే ఇదేనా అని అర్ధం కాని ఓ స్థితిలో కూర్చుని ఉన్నాం చాలా సేపు. ఒకే ఒక గంటలో ఏంటో దుష్టమైనా బుద్ధి కలవాళ్ళని, మహా మానవత్వం ఉన్నవాళ్ళని చూసాము!! జీవితం ఎంత విచిత్రమైనది కదా అని అనిపించింది.

" అమ్మలూ, ఇలాంటి ప్రయాణం మళ్ళీ ఇంకొకసారి చెయ్యవద్దు. ఇంత సాహసం వద్దు. అన్నీ క్షణాల్లో అటూ ఇటూ జరిగేలా అయ్యాయి. నిజంగానే ఆ దేవుడి దయ, స్వామి దయ వల్ల ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ మన పాలిట దేవుళ్ళుగా వచ్చారు. లేదంటే ఏదైనా జరిగి ఉండేది" అని దణ్ణం పెట్టుకుంటూ అంది. అమ్మ చెయ్యి పట్టుకుని కిటికీ లోనించి చూస్తూ  ఉండిపోయాను!

ఇంటికెళ్లి నాన్న కి ఇదంతా చెప్తే ఏమంటారో!! మొదటి సారి అమ్మని తీసుకుని ఒక్కదాన్నే చేసిన ప్రయాణం ఇంత ఆసక్తికరం గా ఉంటుంది అని అసలు ఊహించలేదు.

జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం గా గుర్తుండిపోతుంది, ఆ గొప్ప మనుషులని ఎప్పటికీ మరచిపోలేము కదా అని మనసులోనే మరో సారి వాళ్లకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.

***

Bio

రాధికా కే బుక్కా

వృత్తి రీత్యా I.T. రంగం లో పని. ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు. తెలుగువన్ రేడియో లో స్వచ్ఛందంగా రేడియో జాకీ గా చేస్తున్నారు. హాబీ జర్నలిస్టు గా ఒక వెబ్  పత్రికకి రాస్తూంటారు. కొన్ని కవితలు, కథ/ వ్యాసాలు వెబ్ పత్రికలలో అచ్చయ్యాయి. అప్పుడప్పుడూ టీవీ రిపోర్టర్ గా సాంస్మృతిక కార్యక్రమాలను రిపోర్ట్ చేస్తారు. శాస్త్రీయ సంగీతము ఇష్టమైన వ్యాపకం.

***

Radhika Bukka
bottom of page