top of page

వ్యాస​ మధురాలు

పోతన - శ్రీనాథుల జీవిత ప్రస్థానం

rajeswari.PNG

డా. శివుని రాజేశ్వరి

నా నృషిః కురుతే కావ్యం అంటే బుషి కాని వాడు కావ్యాన్ని రచింపలేడు. ఋషులు, ద్రష్టలు, స్రష్టలు వారు సత్యాన్ని ఆత్మ జ్ఞానంతో దర్శించి వాఙ్మయ రూపంలో సృష్టించారు. భారతీయ వేద విజ్ఞానం అంతా ఆవిధంగా వెలువడింది. వేదాలు, వేదాంగాలు ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు అందులో భాగం. ఇది ప్రభుసమ్మితమైన వాఙ్మయం. మంత్ర రూపంలోను సూత్రీకరించబడింది. పురాణ ఇతిహాసాలు వీని ఆధారంగా ‘మిత్రసమ్మితంగా’ వెలువడినాయి. వ్యాస వాల్మీకాది మహర్షులు, శంకరాచార్యులవంటి గురువులు, కాళిదాసాది కవులు ప్రభుతసమ్మితమైన వాఙ్మయాన్ని మిత్రసమ్మితమైన సాహిత్య గ్రంథాల రూపంలో మానవాళికి అందించారు.

ఆ తరువాత దశలో సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా సద్గ్రంథాలనుండి ఎన్నో గ్రంథాలను కవులు, పండితులు రచించారు. క్రమక్రమంగా పురాణేతిహాసాలనుండి మూలాన్ని తీసుకొని కల్పనలు జోడించి, కావ్యాలు, ప్రబంధాలు రచించే కవుల సంఖ్య పెరిగింది. ఈ దశలో భారతీయ సాహిత్యం ‘కాంతాసమ్మితంగా’ రూపొందింది. కావ్యాల్లో అలంకారాలు, వర్ణనలు జొప్పించి, పాండిత్య ప్రకర్షతో గ్రంథాలను రచించడం అధికమయినది. వీనిలో సత్యదర్శనం కంటే పాండిత్య ప్రకర్షకు ప్రాధాన్యం పెరిగింది. వీరిలో అధికులు రాజాశ్రయులు కావడం వలన రాజలను మెప్పించడం, పండితుల ప్రశంసలు పొందడం ధ్యేయంగా మారింది.

జ్ఞానం ఆత్మ జ్ఞానంగాను, పండితజ్ఞానంగాను చీలిపోయింది. మేధోపరమైన జ్ఞానం కలిగిన ఈ పండిత కవుల సమూహం ఆత్మజ్ఞానులను అవహేళన చేయడం మొదలయింది. భారతీయ వాఙ్మయాన్ని సాహిత్యాన్ని ఆత్మజ్ఞాన దృష్టితో కాకుండా మేధోపరమైన జ్ఞానదృష్టితో పరిశీలించడం మొదలయింది. ఒక వ్యక్తికి వ్యక్తిత్వ జ్ఞానానికి మధ్యన ఒక సంబంధం ఉండాలి. మేధో పరమైన జ్ఞానం ఆత్మజ్ఞానానికి దారితీయాలి. ఆత్మజ్ఞానంతో కూడిన ఆ వాదనలు వ్యక్తికి నిరంతర సహచరులుగా ఉంటే అవి మార్గదర్శకులుగా రక్షకులుగా మారతాయనేది సూక్తి.

మన తెలుగు సాహిత్యంలో సమకాలీనులైన ఇద్దరు కవులను ఆత్మజ్ఞానానికి పండిత జ్ఞానానికి ప్రతీకలుగా నిలిచినవారి జీవితాలను తులనాత్మకంగా పరిశీలించాలి. అప్పుడు ఆత్మజ్ఞానంతో కూడిన ఆలోచనలు వారికి మార్గదర్శకులుగా, రక్షకులుగా మారతాయన్న సత్యం అవగతమవుతుంది. శ్రీనాథుడు పోతన సమకాలీనులైన కవులు. ఆత్మజ్ఞానం కలిగిన పోతన, పండిత జ్ఞానం కలిగిన శ్రీనాథుడు తమ తమ జీవితాలను ఏ విధంగా నిర్మించుకున్నారు. తమని తాము కవులుగా ఏ విధంగా మలుచుకున్నారు. తాము నమ్మిన జ్ఞానాన్ని తమ కవిత్వం ద్వారా ప్రజావళికి ఎంతమేరకు అందించారు. అన్న విషయాన్ని తులనాత్మకంగా సరిపోల్చినపుడు జ్ఞాన సంబంధమైన ఆలోచనలు ఏ మేరకు మార్గదర్శకులుగా, రక్షకులుగా మారతాయన్నది స్పష్టమవుతుంది.

శ్రీనాథుడు - పోతన  జీవితాల తారతమ్య పరిశీలన

         శ్రీనాథుడు పాండిత్య ప్రకర్ష కలిగిన మేధో కవి. కవిసార్వభౌముడు. రాజాశ్రయుడై కనకాభిషేకాలు లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు పొందినవాడు. 12 గ్రంథాలను రచించిన ఉద్దండ పండితుడు. సంస్కృతంలో శ్రీహర్షుడు రాసిన నైషధాన్ని శృంగార నైషధం పేరిట అనువదించాడు. ‘నైషధం విద్వదౌషధం’ అని కీర్తింపబడింది. కాశీఖండం, అయఃపిండం అని పేరు కాంచింది. సీసపద్యాల మేటి కవి. ఇంతటి మేధోజ్ఞానం కలిగిన పండిత కవి శ్రీనాథుడు భోగలాలసుడు కావడం వలన రాజాశ్రయుడై విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఆ రాజులు గతించగానే దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. జీవిత చరమాంకంలో బొడ్డుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని రాజుకు శిస్తు చెల్లించలేక రాజదండనకు గురై విలపించాడు. అయినా అతనిలోని స్వాతిశయం చెక్కుచెదరలేదు. శ్రీనాథుడు ‘కలియుగంబున నికనుండ కష్టమనుచు దివిజకవివరుగుండియల్ దిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’ అంటూ తనువు చాలించాడు.

పోతన సహజకవి. పాండిత్య ప్రతిభ పెద్దగా కలిగినవాడు కాదు. నాలుగు కావ్యాలను రచించాడు. మొదటివి - వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగినీదండకము. కవిత్వ పటిమ అలవడడానికి రచింపబడిన శతకము, దండకాలు. అతను జీవితకాలం శ్రమించి రచించిన మేటి కావ్యం ‘ఆంధ్రమహాభాగవతము’. ఈనాటికి పండిత పామరలోకంలో నర్తిస్తూ, జనబాహుళ్యంలో నిలిచింది. పోతన భాగవత పద్యాలు రానివారు మారుమూల గ్రామాల్లో సైతం ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం కవికి – కావ్యానికి బింబ ప్రతిబింబభావం ఉండడమే. కవి జీవితమే కావ్యాలలో ప్రతిబింబిస్తుంది. కవి అంతరాత్మ ధరించే విరాట్ స్వరూపమే కావ్యం. భాగవతం రాసిన పోతన నిజజీవితంలో పరమ భాగవతోత్తముడు. విలాసవంతమైన జీవితం కాక నిరాడంబర నిర్మలమైన జీవితం గడిపాడు. కృషీవలుడైన కర్మయోగిగా పొలము దున్నుకొని బ్రతికిన రైతుబిడ్డ పోతన. భాగవత కవిగా తాను అందించిన సందేశాన్ని ఆచరించి లోకానికి చూపిన కవిమాత్రుడే కాక, త్రికరణశుద్ధిగల అనుష్ఠాన వేదాంత పోతన. రాజాశ్రయాన్ని తిరస్కరించాడు. తన కావ్యాన్ని నరాంకితం చేయనన్నాడు. “బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్నికన్ అక్కూళల కిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడనైనేమి” అని నిర్భయంగా చాటాడు.

సహజకవి అయిన పోతన తన జీవితంలాగానే తన కవిత్వాన్ని కూడా ద్రాక్షాపాకంలో సాగించాడు. అతని కావ్యం మేధోపరమైన జ్ఞానంతో కాక, ఆత్మజ్ఞానంతో వెలువడింది. “పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట నే పలికిన భవహరమగుట, బలికెదవేరొండుగాధ పలుకనేల?” అంటూ నిష్కామ కర్మచేసి కర్మ ఫల త్యాగం చేసాడు. ‘భాగవతంబు తెనిగించి నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్’ అన్నాడు పోతన. ఆత్మజ్ఞానంతో ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన ‘ఆత్మజ్ఞాని పోతన’ అని రూఢి అయ్యింది.

పోతన జన్మరాహిత్యాన్ని మోక్షాన్ని కోరుకుంటే, శ్రీనాథుడు స్వర్గాన్ని కోరుకున్నాడు. వారి ఆత్మజ్ఞాన, మేధోజ్ఞాన సంబంధమైన ఆలోచనలే వారి వారి జీవితంలో సుఖదుఃఖాలకు కారణమయ్యాయి. ఆత్మజ్ఞానంతో కూడిన ఆలోచనలకు వ్యక్తికి సహచరులుగా ఉంటే అవి మార్గదర్శకులుగా, రక్షకులుగా మారతాయన్న సూక్తి వీరి జీవితాల్లో ప్రస్ఫుటించింది. ఆ జ్ఞానం ఉన్న పోతన ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే, అదిలేని శ్రీనాథుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపి వార్థక్యంలో దుర్భరమైన వేదనకు గురయ్యాడు. జ్ఞాన సంబంధమైన వారి ఆలోచనలు వారి కవిత్వంలోను ప్రతిఫలించాయి. ఆత్మజ్ఞాన దృష్టితో వెలువడిన భాగవత కావ్యం ప్రజావళికి దివ్యానందాన్ని, మోక్ష జ్ఞాన దృష్టిని అందించింది. పోతనకు చిరకాల కీర్తి ప్రతిష్ఠను మిగిల్చింది.

 

*****

 

 

 

 

bottom of page