top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

పోపుల పెట్టె ( హాస్య కథ )

 

వాణీశ్రీనివాస్

vani srinivas.JPG

"రజనీ! నీకీ విషయం తెలుసా? 

మన కాంతామణిని హైదరాబాద్ లో త్యాగరాయ గానసభలో, గజమాలతో సత్కరిస్తారుట.

గజారోహణం, కిరీటధారణం చేస్తారుట.

ఎంత దృష్టం అంత గౌరవానికి నోచుకోవాలంటే పెట్టి పుట్టాలి మరి.

 

"అవునా గజనీ… సారీ, గజలక్ష్మీ! నీకెలా తెలుసు?"

 

"మన వాట్సాప్ మిత్ర బృందం చెవులు కొరుక్కుంటున్నారు."

 

"అవునా ఎవరూ !మన సమూహంలో వుండే ఆ కాంతామణికేనా?

మనిషి జానెడు జడ బారెడు ఆ కాంతామణికా?

ఆవిడకేం వచ్చి చచ్చు. ఏదో చడా మడా రాసేస్తుందే  కానీ చేవ వుండద్దా రచనల్లో.

స్టేజి ఎక్కించి ప్రకృతి గురించి మాట్లాడమంటే దిక్కుల వంక వికృతంగా చూస్తుంది .

గట్టిగా కొలిస్తే గజం ఉండదు.ఆవిడకి గజమాలేవిటే. మూర చాలు."

 

"లేదే రజనీ, ఆవిడ కలం ఈ మధ్య రాటుతేలిందిట.

పక్క సమూహం వాళ్ళు చెప్పుకుంటున్నారు."

 

"కలాన్ని ఆకురాయితో అరగదీసి ఉంటుంది. బాగా పదును తేలిందేమో.

ఆవిడ ఉండేది మన పక్క బజార్లోనేగా. పద వెళ్లి అభినందించి వద్దాం."

 

"వెళదాం పద, నడు త్వరగా! అదిగో ఆ వచ్చేది చలపతి గారే కదూ.

నీకో విషయం తెలుసా? కాంతామణికి ప్రోత్సాహకుడు. వెనక ఉండి నడిపించే అదృశ్య హస్తం అతగాడే మరి. మన గ్రూప్ లో ఉంటాడు"

 

"ఇదంతా నీకెట్లా తెలుసే గజనీ"

 

"నీకు తెలీదా పద్నాలుగు సమూహాలు వాట్సాప్ ఇల్లెక్కి కూస్తున్నాయి.

నాకూ ఈ మధ్యన ఎవరో చెపితేనే ఈ విషయం తెలిసింది."

 

"నీ మాట నమ్మొచ్చా ?”

 

"పుకార్లు నమ్మితేనే అవి షికార్లు కొడతాయి

చచ్చు ప్రశ్నలు ఆపి ఈ విషయం విను.

ఆవిడ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిందిట.

ఒక అదృశ్య హస్తం నన్ను నడిపిస్తోందని.

ఆ హస్తమే ఇప్పుడు నడిచొస్తోంది చూడు.

 

నమస్కారం చలపతి గారూ. మేమిద్దరం కాంతామణి మిత్రురాళ్లం.

 

నమస్కారం తల్లీ ఇంతకీ కాంతామణి ఎవరమ్మా...నాకు గుర్తురావడం లేదు. సరే. సెలవమ్మా."

 

" నటిస్తున్నాడు చూడు. అజ్ఞాత స్నేహితుడుకదా. ఎందుకు బయట పడతాడూ.."

***

 

"ఆహాహా కాంతామణి గారూ! మీ రచనలు కత్తులు, పిడి బాకులు, కాగడాలు, బాణాలు అనుకోండి”

 

"రండి రజనీ గారూ, గజలక్ష్మి గారూ! దేనికండీ పొగడ్తలు. ఇన్ని మారణాయుధాలు నా దగ్గర ఉన్నట్టు నాకే తెలీదండీ.

 

"మసాలా ఆకు డబ్బాలో పడేసి మూత పెట్టినా పోపుల డబ్బాలో ఇంగువ దాచి మూత తీసినా,వాసన ఎక్కడికి పోతుంది? గుప్పుమంటుందండీ. మీరు చెప్పకపోయినా మాకు తెలిసిపోయింది లెండి."

 

"ఇదేం పోలికండీ బాబూ!"

 

"అది పోనీలేండి. మీకు హైదరాబాద్ లో సన్మానంట కదండీ. అభినందించి పోదామని ఇట్టావచ్చాము.

మీ వంటి గొప్ప రచయిత్రి మా మిత్రురాలంటే మాకు గర్వకారణం కదండీ. ఎప్పుడూ మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటామో. కదే గజం."

 

"అబ్బే మీరు పొరపడ్డారు. సన్మానం నాకు కాదండీ. ఆ కాంతామణి గారు వేరు. ఆవిడ చాలా పెద్దావిడ.

చిన్నప్పటినుండి సాహిత్య కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన విదుషీమణి.

ఆవిడ గొప్పతనానికి ఈ సన్మానాలూ అవీ తక్కువే.

ఆవిడ భర్త గారి మరణం ఆవిడని కుంగదీసినా,

అదృశ్యంగా ఉండి ఆయనే నన్ను నడిపిస్తున్నారు

అని చెప్పుకునే నిగర్వి ఆవిడ.

 

అవునా మీరేమో అనుకున్నాం. కాకపోతే సరే లేండి..

ఇక వస్తాం…"

 

ఏమే! గజనీ ఇప్పటిదాకా ఏవేవో చెప్పావు.

పోపుల డబ్బాలో దినుసులన్నీ కలిపి తిరగమూత పెట్టావు. అంతా మాడి కంపు కొడుతోంది చూడు.

మన మొహాలల్లే.

ఇప్పుడేమంటావ్."

 

"ఏవో విన్నవి చెపుతాను గానీ అన్నీ ప్రత్యక్షంగా చూసిరావటానికి నేనేమన్నా యక్షిణినా…?

ఆ నోటికి ఈ చెవి కలిపితే పుకారు షికార్లు కొడితే నాదా తప్పు."

 

"సర్లే పద. గ్రూపుల్లో గుట్టుగా కరోనా కధలు రాసుకుందాం."

*****

bottom of page