top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నండూరి రామమోహనరావు...   ఒక పరిశీలన

గిరిజా శంకర్ చింతపల్లి

girja sankar chintapalli

1952-53 సంవత్సరాలు. నేను థర్డ్ ఫాం చదివే రోజులు. అప్పుడు ఆంధ్రపత్రిక, వారపత్రిక మా యింటికి రెగులర్ గా వస్తుండేది. అంతగా హోం వర్క్   లేని రోజులవి.  అందుకని అమ్మతో పోటీగా ఆ పత్రిక చదువుతుండేవాణ్ణి. కాంచనద్వీపం అనే సీరియల్ అప్పుడు నాకు చాలా యిష్టం. అది అనువాదం  చేసినాయన ఇప్పుడు మనం స్మరించే కథానాయకుడు. నండూరి రామమోహనరావు. ఆయన అనువాదం చేసిన మార్క్ ట్వైన్ నవలలు,  రాజూ   పేద,  హకల్బెరి ఫిన్, టాం  సాయర్.. . ఇలా వరసగా సీరియల్స్ వస్తుండేవి. ఆ కథలు చాలామందికి లాగానే నాకూ పుస్తకపఠనం మీద ఆసక్తి  ఎక్కువ చేసింది. 

 

అయన అనువాద రచనలు నిజంగా అనువాదాలు కావు. అనుసృజనాలు , కవిత్రయం భారతంలా. వాటిని గురించి చెబుతూ బాపూరమణలు, "ఆ కథల్ని అతను అనువదించలేదు. తెలుగులో రామమనోహరంగా రాశాడు" అన్నారు. ఆయనకి "అనువాద హనుమంతుడ"నే బిరుదు గూడా ఇచ్చారు.  

 

ఆరోజుల్లో ఆంధ్రపత్రిక, భారతి పేరుమోసిన అగ్రస్థానంలో ఉన్న తెలుగు పత్రికలు. వాటిలో కథ ప్రచురణైతే,  అది జయ పత్రిక  అని నమ్మకం. హై స్టాండర్డ్ అని. 50వ దశకంలో ఆంధ్రపత్రికతో అనుబంధం ఉన్న మహామహులు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారూ, శివలెంక శంభూప్రసాద్, పిలకా గణపతి శాస్త్రి, కొడవడిగంటి   కుటుంబరావు, బాపూరమణలు,తెన్నేటి సూరి. నండూరి రామమోహనరావు ..ఆహా ఏమి టీమండి. ఆల్ టైం క్రికెట్ వర్ల్డ్ లెవెన్ లాగా  ఉండేది. అది ఒక వైభవోజ్వల మహాయుగం. తెలుగు రచయిత[త్రు]ల భువనవిజయం. తెలుగు పత్రికా సాహిత్యంలో స్వర్ణయుగం.

 

కృష్ణాజిల్లా ఆరుకొలను గ్రామంలో 4/24/27 న జన్మించాడు రామమోహనరావు. అతనికి ఒక తమ్ముడు[పార్థసారథి], ఒక చెల్లెలు [శ్రీదేవి]. ఈ శ్రీదేవే ముళ్ళపూడి రమణున్ని పెళ్ళాడిన లక్ష్మీ దేవి.  స్చూల్ చదువు నూజివీడు, బందరు. కాలేజి రాజమండ్రి. కాలేజీలో చదువుతున్నప్పుడే "బాల వైరాగ్యం" కలిగి ఋషికేశం వెళ్ళాడు. అక్కడ స్వామీ శివానంద దగ్గర శిష్యరికం లో వివేకానందుని  పట్ల గౌరవం పెంచుకున్నాడు. ఆర్నెల్ల తరవాత గురువుగారి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి  వచ్చి కాలేజి పూర్తి  చేశాడు.  1944 లో తన 17వ యేట  మేనమామ కూతురు రాజేశ్వరిని వివాహమాడాడు. ఐదుగురు పిల్లలు.

 

1948 లో ఆంధ్రపత్రిక సంపాదకవర్గం లో చేరాడు. వివిధస్థాయిల్లో 1960 దాకా అక్కడే  పని చేశాడు. 1960-94 ఆంధ్రజ్యోతి పత్రికలో వివిధ స్థాయిల్లో పనిచేసి, సంపాదకుడిగా రిటైర్ అయ్యాడు. ఇంకా జ్యోతి మాసపత్రిక [ఫౌండింగ్ మెంబెర్], వనితాజ్యొతి, బాలజ్యోతి...పత్రికలకి గూడా వివిధరంగాల్లో ఈయనకి సంబంధం ఉంది. 1960ల్లో ఆంద్క్రజ్యొతి సంపాదకుడు  నార్లవెంక్టేశ్వరరావుకుడిభుజంగా వుంటూ, తరచూ సంపాదకీయాలూ, వ్యాసాలూ రాశేవాడు.  మొదట్నించీ సామ్యవాదం, నిరీశ్వరవాదం, మార్కిస్మ్ పైన మోజు. ఆరోజుల్లోనే చైనా   మీద  ఒక పాట రాశాడు, "లే లే చైనా! రా రా చైనా!" అని. సరే 1961లో చైనా నిజంగా రానే వచ్చింది. బాపూరమణలు ఆయనకి ఉత్తరం రాశారు, "రమ్మన్నారు. చైనా వచ్చింది. ఇపుడేం చేద్దాం?" అని. "నా  ఎడిటోరియల్ చదవండి" అన్నాడు నండూరి కొంటెగా. " అవి ఎడొటోరియల్ కాదు. డిట్టోరియల్. ఏది నార్ల? ఏది ఎన్నార్ల"?అని ఇంకా కొంటెగా, వ్యంగ్యంగా బదులిచ్చారు బాపూరమణలు.  నార్లకి ఎన్నార్ల ఘోస్ట్ రైటర్ గా ఉండేవాట్ట.  ఆ నార్లవారి ప్రోత్సాహంతోనే మనం విశ్లేషణ చేయబోతున్న, విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం...ఇత్యాది బ్రహ్మాండమైన పుస్తకాలు రాశాడు. నా ఉద్దేశం లో అవి మహత్తర శాస్త్ర గ్రంధాలు. మన హై స్చూల్, కాలేజి  విద్యార్థులకి పాఠ్యగ్రంధాలుగా పెట్టదగిన బృహత్గ్రంధాలు. ఆంధ్రపత్రిక ఆఫీసులో పని చేసే రోజుల్లో వాళ్ళ స్నేహాన్ని నెమరువేసుకుంటూ, బాపూరమణ, "మొదట్లో నండూరి అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు కాడు. ఆయన మార్క్సిస్ట్. మేమేమో "గ్రౌచో మార్క్సిస్ట్. దరిమిలా నమ్మకం పెరిగి నండూరి కాస్తా ఫ్రెండూరి అయ్యాడు" అని వాళ్ళ టిపికల్ స్టైల్ లో చెప్పారు.   

 

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ తరవాత దాదాపు 15 సంవత్సరాలు మెడ్రాస్ లోనే నివాసం. కొన్నాళ్ళు బాపూ ఇంట్లో అద్దెకుండేవాడు. ముగ్గురూ సినిమాలు చూసేవాళ్ళు. బాగా పాడతాడు. పాతరోజుల్లో దేశాన్ని ఉర్రూతలూగించిన హిందీ సినిమా గాయకుడు సైగల్ అంటే ప్రాణం. సైగల్ కన్నా పెద్ద పాటగాడు ఇంకోడు లేడనే  ధృఢ నమ్మకం గలవాడు. అతని పాటలన్నీ    పాడేవాడు, ఆంధ్రపత్రిక వీక్లీ ని గొట్టం లాగా చుట్టి దాన్నే మైక్రోఫోన్ లాగా వాడుతూ. ఒకరోజు ఆఫీస్ లో కరెంట్ పోయింది.  పత్రి క గొట్టంలాగా చుట్టి మైక్ అందించారు, బాపూరమణలు, "సైగల్ పాట పాడ"మని అర్థిస్తూ.  నండూరి హుషారుగా పాటెత్తుకున్నాడు. కానీ ఎందుకనో పాట సరిగా రావటం లేదు. స్వరం, సృతి అన్నీ నీరసంగా ఉన్నాయి.ఇంతలోకీ కరెంట్ వచ్చింది. తీరా చూస్తే అది "ఆంధ్రప్రభ"  "అందుకే మీతో ఫ్రెండ్ షిప్ అంటే భయం"  అని విసుక్కున్నాట్ట,  తన యజమానికి నరనరాల్లోనూ నమ్మకాన్ని కరుడు కట్టించిన నండూరి. [Faithful to the employer to a fault ]

 

బాగా ఫ్రెండ్స్ అయిపోయాక బాపూరమణా, నండూరి రోజూ కలుసుకునేవారు. సాయంత్రం బాపూ భారతంలోంచి, ప్రబంధాల్లోంచి పద్యాలు పట్టుకొచ్చేవాడు. అప్పుడు నండూరి, చక్కగా వాటి అర్థాలూ, తాత్పర్యాలూ, సొబగులూ బోధించేవాడు. అంటే అప్పట్నించే ఒక పక్క మార్క్సిస్మ్ ని సమర్థిస్తూనే ఇటు వేదాంతం అనుభూతి చెందేవాడు. ఆయన జండాకి మూడు రంగులు: ఒకటి సాహిత్యం, రెండు జర్నలిసం అయితే మూడవది వేదాంతం. ఆయన చివరకి హేతువాదేగానీ, నిరీశ్వరవాది కాదు. 

 

ఆయన రచనలు

---------------------

1. నరావతారం

2. విశ్వరూపం

3. విశ్వదర్శనం [భారతీయ చింతన] 

4. విశ్వరూపం [పాస్చాత్య చింతన] 

5. అనుపల్లవి [ఆంధ్రజ్యోతి సంపాదకీయాల సంకలనం]

6. చిరంజీవులు [ఆంధ్రజ్యోతి సంపాదకీయాలు 2]

7. వ్యాసావళి.

8. అక్షరయాత్ర.

9. ఉషస్విని[ కవితలు] 

10. చిలకచెప్పిన తహస్యం [పిల్లల నవల]

11. మైఒర మంగ [పిల్లల నవల]

12. హరివిల్లు [పిల్లల గేయాలు].

ఇంకా అజ్ఞాతంగా  కలం పేరుతో రాసిన వ్యాసాలూ

 

అనువాదాలు

-------------------

1. కాంచనద్వీపం [Treasure Island..RL Stevenson]

2. కథాగేయ సుధానిధి [Aesops Fables]

3. హలల్ బీర్ ఫిన్ [Huckleberryfin' adventures..Mark Twain]

4. రాజూ పేదా [Prince and Pauper Mark Twain]

5. టాం సాయర్ [Tom Sawyer... Mark Twain]

6. విచిత్ర వ్యక్తి [ Mysterious Stranger...Mark Twain]

7.  బాలరాజు [Oscar Wilde stories]

 

పైన ఉదహరించిన పుస్తకాలు చాలామంది  చదివే ఉంటారు. నేను అనువాద పుస్తకాల జోలికి వెళ్ళను. ఆయన రచనలు ఆబాలగోపాలాన్ని అలరింపచేస్తాయి అని అందరికీ తెలుసు. దానికి నిదర్శనం ఆయనకి వచ్చిన ప్రశంసలు, అవార్డులు,  కితాబులూ, డాక్టరేట్. ఈ వ్యాసం లో నేను  గత 3 సంవత్సరాల్లో  చదివిన,  మళ్ళీ మళ్ళీ చదువుతున్న, విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం  వీటి గురించి చర్చిస్తాను. సైన్స్ డిగ్రీ లేని జర్నలిస్ట్, ఈ టాపిక్స్ మీద ఎంత అథారిటీతో రాశాడో చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన, అందరికీ నచ్చుతాయనుకున్న ఆయన శైలి గురించి కొంచెం స్ట్రెస్స్ చేస్తాను. 

 

విశ్వదర్శనం గురించి. ముందుగా  ...పాశ్చాత్య దృక్పథం రాశారు. ఇదీ, దీని తరవాత ప్రాచ్య చింతన...రాయడానికి 16 సంవత్సరాలు పట్టిందట. ఎన్నార్ల రచనా ప్రక్రియ పంథా అర్థం కావాలంటే ఆయన మిత్రుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మగారి వివరణ తోడ్పడుతుంది, " ఏదయినా రాయ దలచినపుడు, స్క్రిబ్బిల్ పాడ్ తీసుకుని ఒక వాక్యం రాసేసి, కొట్టేసి, ఆ కాగితం చింపేస్తేగానీ ఆయన వాక్య రచనకి వేడి అందుకోదు" తన తాత్సారం గురించి తనే ఇలా  పల్లవించారు శ్రీ ఎన్నార్ల,  "James Joyce, Fenigan Wake  అనే పుస్తకాన్ని రాయడానికి 14 సంవత్సరాలు పట్టిందట. దానికి కారణాలు ఆ నవల నిడివిమాత్రమే కాకుండాఅయన శైలి, భాష, పట్టింపులు...ఒక రోజంతా ఆలోచించి ఒక వాక్యం లో ఒక కామా  పెట్టేవాట్ట. మర్నాడు రోజంతా ఆలోచించి ఆ కామా అనవసరమని తీసేసేవాట్ట. నేనంత గొప్పవాణ్ణి కాను గానీ నా perfectionism, ఉద్యోగవత్తిడి, అనారోగ్యం" అని తన గురించి నమ్రతగా చెప్పుకున్నాడు, నిగర్వి ఎన్నార్ల.

 

ఎవరు  ఏపని చేసినా దాన్ని విమర్శించేవాళ్ళుంటారు కదా. బాపూరమణలు సాక్షి సినిమా తీద్దామనుకున్నప్పుడు, "సాక్షి నామ సంవత్సరం" అని దండోరా వేశారు. కొంతమంది లోకులు "సరే" అన్నార్ట. కొంతమంది కాకులు "సడేలే" అన్నార్ట.  అలాగే ఎన్నార్ల విశ్వదర్శనం పాశ్చాత్య చింతన  రాస్తున్నప్పుడు, "పాశ్చాత్యుల ఫిలాసఫీ ఎవడిక్కావాలోయ్? దమ్ముంటె, శంకరాచారి, ఉపనిషత్తులు ...వీటి గురించి వెలగబెట్టు" అన్నార్ట. అదే ప్రాచ్య విశ్వదర్శనం రాస్తున్నప్పుడు, "ఇండియన్స్ కి ఫిలాసఫీ ఏమిటండీ? నా మొహం" అన్నారట. "ఆ అన్నాయన మొహం బాగానేవుంది గాబట్టి, నేను రాశాను" అని చమత్కరించాడు నండూరి.

 

ఈ పుస్తకాలు రాయడానికి ప్రేరేపణ కి ఉన్న బాక్ గ్రౌండ్ గురించి  ఇలా చెప్పాడాయన. "1950-51 లో Bertrand Russell రాసిన  A History of Western Philosophy చదివాను.ఆ పద్ధతిలో తెలుగులో సరళంగా భారతీయ, పాశ్చాత్య తత్వ సిద్ధాంతాల గురించి

 రాయాలనే ఉబలాటం మనసులో దోబూచులాడింది.అలా కొన్ని దశాబ్దాలు దొర్లిపోయిన పిమ్మటవిశ్వరూపం, నరావతారం, ఆతరవాత తత్వం మీదకి మనసు పోయింది." విశ్వ దర్శనం అనేపేరు ద్వంద్వార్థ ప్రాతిపదికగా పెట్టాడు. " దర్శనం అంటే చూట్టం. కానీ భౌతిక నేత్రాలతో కాదు.తాత్విక చక్షువులతో చూడాలి.  పాశ్చాత్య, ప్రాచ్య తత్వ చింతనలో మౌలిక భేదాలున్నాయి. కానీ పోలికలుగూడా ఉన్నాయి. "

 

క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల సమయం లో, భారత దేశం లో గౌతమ బుద్ధుడు, జైనుల తీర్థాంకర్ లాంటి మహనీయులున్నప్పుడు, గ్రీస్ దేశం లో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్...ఇత్యాది వారి తత్వ సిద్ధాంతాలు యూరప్ లో చలామణీ అవుతున్నాయి. ఒకే సమయంలో రెండు వివిధ ఖండాల్లో తాత్విక సామరస్యం గురించి ఉటంకిస్తూ, జవహరలాల్ నెహ్రు తన డిస్కవరీ ఆఫ్ ఇండియా [Discovery of India] లో, "వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రతించుకునేవారేమో!" అంటాడు. ఇప్పుడు మన భారత చరిత్రకారుల్నడిగితే, "అవన్నీ మా వేదాల్లోనే ఉన్నాయిష. వాళ్ళే కాపీ కొట్టారు" అని తీసి పారేస్తారు గానీ సైంటిఫిక్ గా నిర్ధారించలేరు. అయినా హేతుబద్ధంగా ఆలోచిస్తే, కాంట్, షోపెణార్, హేగెల్ , స్పినోజా ...వీళ్ళు గూడా మన భారత ఋషులవంటివాళ్ళే అనిపిస్తుంది

అంటే వారు  గూడా, సత్యాన్ని "దర్శించారు" వాళ్ళనేగదా ఋషులు అన్నాము. సత్యాన్ని దర్శించడానికి భారతీయులకే పరిమిత హక్కు కాదుకదా!.

 

విశ్వదర్శనం...భారతీయ చింతన

____________________________________________

 

ఇందులో  ఋగ్వేదకాలపు ఋషులదగ్గర ప్రారంభించి జిడ్డు కృష్నమూర్తి తో ముగిస్తాడు. "మతం కళ్ళు మూసుకొని విశ్వశించు అంటుంది. [సంశయాత్మా  వినశ్యతి]; తత్వం  కళ్ళు తెరుచుకొని ప్రశ్నించు అంటుంది. అథాతొ బ్రహ్మ జిజ్ఞాసా " తో మొదలుపెట్టి ఉపనిషత్తులు,  గాంధీ, వివేకానందా , టాగోర్., దయానంద సరస్వతి, దివ్యజ్ఞాన సమాజం...ఇలా ఒకటేమిటి, భారత తత్వ చింతనలోని అన్ని విధాల రూపు రంగులని వివరించాడు. అన్ని పుస్తకాలూ చదవడానికి టైం లేనివాళ్ళూ, అవసరం లేనివాళ్ళూ [నాలాంటివాళ్ళు] ఈ పుస్తకం చదివి ఆయా సబ్జెక్ట్ లలో సులభంగా పాస్ అవ్వచ్చు. తాను  స్వతహాగా హేతువాది అయివుండి, మార్క్సిస్మ్ సింపథైసర్ అయివుండి గూడా, ఉపనిషత్తులగురించి అంత గొప్పగా రాయడానికి ఆయనిచ్చిన సంజాయిషీ, " నేను ఛాందస హిందూత్వ పునరుద్ధరణవాదిని కాను. హిందూ సమాజంలోని అనేకమైన దుర్లక్షణాలని నేను ఏవగించుకునే క్షణాలని ఎన్నైనా చెప్పగలను. కానీ, హిందూత్వం లో, హిందూ సంస్కృతిలో, సభ్యతలో ఏదో ఒక అనిర్వచనీయమైన ఆకర్షణ, సాటిలేని సౌందర్యం మరువరాని మహోన్నత్వం ఉన్నాయి. వాటిని నేను ప్రేమించకుండా, అభిమానించకుండా ఉండలేను.హిందూ మతంలో అన్ని మూఢ విశ్వాసాలను, అన్ని హేతువిరుద్ధ భావాలని ఏనాడో తిరస్కరించాను. వాటి కారణంగా అలనాటి వేద ఋషులు ఆనంద పారవశ్యంతో గానం చేసిన ఉషః సూక్తాల   ఉజ్జ్వల కవితా సౌందర్యాన్ని నేను ఒదులుకోలేను. కాళిదాసమహాకవి  ఉపమానిరుపత్వం,  భవభూతి కవితా విభూతి...రెండూ నాక్కావాలి. మీరా గీతాసమీరాలకు పులకించిపోవడం నాకెంత యిష్టమో చెప్పలేను. ఇవన్నీ, యిలాంటివన్నీ నాక్కావాలి. వీటికి సముచిత సగౌరవ స్థానం ఇవ్వని హేతువాదం నాకక్కర్లేదు.   వీటిని తుంగలో  తొక్కాలనే వాదాన్ని నేను గంగలో గిరాటేయకుండా ఉండలేను. వీటన్నిటికీ మీలాగే నేనూ వారసుణ్ణి. "ఏ మంచి పూవులన్  ప్రేమించినావొ , నినుమోచె నీ తల్లి కనక గర్భమున" అని రాయప్రోలు పాట పాడుకునే హక్కు నాకుంది"..అని గర్జించి పలికాడు. తిరణాల్లో తప్పిపోయిన ఐదేళ్ళ కుర్రాడు, అకస్మాత్తుగా అమ్మ కనిపిస్తే ఇలాగే పలవరిస్తాడేమో!

 

వేదాల గురించి చెబుతూ   శృతి అనేమాట ఎలా వచ్చిందీ, అవి ఎందుకు  గ్రంధస్థం  చెయ్యబడలేదు...దగ్గర్నించీ  అపౌరుషేయాలంటే ఏమిటి, వేదాంగాలేమిటి, ఇలాటి అనేకానేక ప్రశ్నలకి చాలా సైంటిఫిక్ గా అధునాతనంగా సమాధానాలిస్తాడు. నిజంగా ఈ పుస్తకం మన మత గ్రంధాలకీ, తత్వశాస్త్రానికీ లిఫ్కో గయిడు . ఇది చదివితే చాలు ఫస్ట్ క్లాస్ తప్పకుండా వస్తుంది.  

 

వేదాన్ని ఎలా చదవాలి? పదపాఠం, క్రమపాఠం, ఘనాపాఠం...వీటిని A B C D  ల సంకేతంతో చక్కగా అర్తమయ్యేలాగా వివరించాడు. ఇందులో ఇతడు రాసింది ప్రోజ్ కాదు పొయట్రీ. మథ్యే మథ్యే హ్యూమర్. "ఋగ్వేదకాలపు ఋషులు  సోమపానం చేస్తూ సామగానం చేశారు." నాసదీయసూక్తాన్ని వివరిస్తూ, తన్ను తాను తమాయించుకోలేక, ఘటోత్కచుడు 15వ రాత్రి  కురుక్షేత్ర యుద్ధం లో ఆకాశమార్గాన స్వైర విహారం చేసినట్టు, ప్రోజ్ కారొదిలేసి పొయట్రీ జెట్ లో వీరవిహారం చేశాడు. మచ్చుకి ఒక పేరా,

"సృష్టిసూక్తం. ఇది ఈనాటికీ ఆశ్చర్యం కొలిపేటంత తత్వ వివేచనతో అలరారుతున్నది. మూడువేల యేళ్ళనాడు  సప్తసింధు నదీతీరాల్లో నక్షత్రఖచిత విశాల వినీలాకాశం కింద  ఉషాదేవి తూర్పున బంగారు వాకిళ్ళు తెరుస్తున్న సమయంలో, నిబిడారణ్యాల తమాల తరుచ్ఛాయల్లో,   ఆశ్రమవాటికల్లో, సూర్యునికి అర్ఘ్యం విడుస్తూ, హోమగుండాన్ని పరివేష్ఠించి ఆసీనులై

భారతీయులైన కవులు, ఋషులు  విశ్వరహస్యద్వారాలని తెరవడానికి ప్రయత్నం చేస్తూ, తెరమరుగున దాగిన సత్యాన్ని కనుగొనడానికి తహతహలాడుతూ, ఈ సూక్తం పఠించేవారా అన్న ఊహే మనస్సులను ఏదో ఔదాత్త్యం తో నింపేస్తుంది. ....ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో తెలుసుకోగలవారెవ్వరూ లేరు.అతడు ఈ విశ్వాన్ని సృజించాడో లేదో ఎవరికీ తెలియదు.  అప్పుడు దేవతలు లేరుగాబట్టి వారికీ తెలియదు. పరమ వ్యోమానికి అధ్యక్షుడైన పరమాత్మకు మాత్రమె బహుశః సృష్ట్యారంభ రహస్యం తెలిసి ఉంటుంది. ...బహుశః అతడికి గూడా తెలియదేమో?!"

 

[ఇట్లాంటి కవిత్వాన్ని తూచడానికి తనదగ్గర తూనికరాళ్ళు లేవన్నాడు చెలం. తూచవద్దు. అనుభవించు, పలవరించు" అన్నాడు శ్రీశ్రీ

 

నండూరి రవీంద్రనాథుని గీతాంజలి గూడా తెనుగుసేత చేశాడు. మచ్చుకి,

 "పొంగి పొరలే నా జీవనపాత్రనుంచి నా ప్రభూ!ఏ దివ్యామృతాన్ని ఆస్వాదించగోరుతున్నావు?

 

నా  కవీ ! నా  నేత్రాలనించి నీ సృష్టిని అవలోకించడమే నీకు  ఆనందమా? నా శ్రవణద్వారాలవద్ద నిలిచి నీ నిత్య మథుర స్వరమేళను ఆలకించడమే నీ అభిమతమా? ---------

 

ఈ మంత్రాలు, జపాలు, భజనలు వదిలెయ్ ఈ గుడిలో తలుపులన్నీ మూసివేసి ఈ ఒంటరి చీకటి మూల ఎవరినయ్యా నీవు పూజించేది? కళ్ళు తెరిచి చూడు. నీ దేవుడు నీ ఎదుట లే డు. ...కర్షకుడు బీడునేలను దున్నుతున్నచోట, అక్కడ, ఎండలో, వానలో వారితో పాటు ఉన్నాడు. నీ కాషాయ వస్త్రాల్ని తీసేసి, ఆయనవలె దుమ్ములోకి, ధూళిలోకి రా"

 

ఇంకొకటి:

అర్థరాత్రివేళ సన్యసించడానికి నిశ్చయించిన ఒక మనిషి యిలా  అనుకున్నాడు. "ఇల్లు వదిలి దేవుణ్ణి అణ్వేషించడానికి ఇదే మంచి సమయం.  ఇంతకాలం నన్ను  యిక్కడ యీ భ్రమలో కట్టిపడేసింది ఎవరో?"  దేవుడు, "నేనే". అని రహస్యంగా అన్నాడు. కానీ  ఆ మనిషి చెవులు మూసికొని ఉన్నాడు. అతని భార్య మంచానికి ఒక  పక్కగా ప్రశాంతంగా నిదురిస్తోంది. ఆమె రొమ్ముపై ఆమె శిశువు నిదురిస్తున్నాడు. "నన్నింత కాలం మోసగించిన మీరు ఎవరు?" అన్నాడు ఆ మనిషి. "వారు సాక్షాత్తూ ఈశ్వరుడే" అన్నది ఆకాశవాణి. శిశువు కలగని, పలవరిస్తూ తల్లికి మరింత దగ్గరగా జరిగాడు. దేవుడు, "ఆగు. మూర్ఖుడా! ఇల్లు   విడిచివెళ్ళవద్దు."  ఆజ్ఞాపించాడు   కానీ ఆమనిషి వినిపించుకోలేదు. దేవుడు నిట్టూర్పు విడిచి, "నన్ను వదిలి నా భృత్యుడు  నాకోసం వెదుకుతాడేమిటి?" అని విస్తుపోయాడు.

 

ఇంక విశ్వదర్శనం...పాశ్చాత్య చింతన. తన ఉపోద్ఘాతంలో "పాశ్చాత్య తత్వవేత్తల సిద్ధాంతాలతో తెలుగు పాఠకులకి ప్రథమ పరిచయం కలిగించడమే ఈ రచన ముఖ్యోద్దేశం" అని వినయంగా నాంది పలికినా, ఒక బ్రహ్మాండమైన టెక్ష్ట్ బుక్ [Text Book] రాసి  పారేశాడు. మొట్టమొదటి చాప్టర్ వశిష్టుడు రాముడికి బోధించిన యోగవాశిష్టం లో మొదలయి, కృష్ణుడి భగవద్గీతా, బుద్ధుని ధమ్మపదం  మీదుగా ఈ సోక్రటీస్ కథలోకి జారుకుంటుంది.

 

సోక్రటీస్ డెల్ఫి వెళ్ళాడు. అక్కడ గణాచారి జ్యోతిష్యం చెబుతుంది. "ఎవరు నువ్వు?  ఏంగావాలి?" అడిగింది దివ్యవాణి.

"నేను సోక్రటీస్. నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని. ఏం చెయ్యాలి?"

"నిన్ను నువ్వు తెలుసుకో." అన్నది గణాచారి.

[ఇది మూడువేల సంవత్సరాల తరవాత మనకి బోధించిన రమణమహర్షి మాటల్లాగా ఉన్నాయి కదా!]

గ్రీక్స్ తత్త్వవేత్త థేలిస్ తో మొదలయ్  ఫ్రెంచ్ తత్త్వవేత్త జేన్ పాల్  సార్టర్ తో  ముగుస్తుంది. మధ్యలో పిథాగరస్ అంకెల వాదం, డెమోక్రటిస్ అణువాదం [మన వైశేషిక వాదంలాగా] సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ [డిడక్షన్ థీరీ] బేకన్ [ఇండక్షన్ థీరీ] [బేకన్ ని పోలిన విజ్ఞాని, ప్రతిభాశాలి, నీచుడు మానవజాతిలోనే లేడు..పోప్] , డి కార్టె , నేను ఆలొచిస్తున్నాను గనక నేనున్నాను  [Cogito Ergo  sum] ]  స్పినోజా [సత్యాన్ని నిరాకరించి ధనార్జన చేయటంకంటె ధనాన్ని నిరాకరించి సత్యాన్వేషణ చేయాలి..God intoxicated philosophy] రూసో [I feel therefore I am..నేను అనుభవిస్తున్నాను గనక నేనున్నాను] ఇమ్మాన్నువల్ కాంట్ [[అతను పెళ్ళి చేసుకోలేదనటం కంటె అతను పెళ్ళి చేసుకోబడలేదనాలి.." అంత కురూపట] , ఇంకా ఇంకా బర్ట్రాండ్ రస్సెల్  వగైరా, వ..

. తమాషా ఏమిటంటే మన పూర్వీకులు "భూగోళం" అని వ్యవహరించేరోజుల్లోనే , పాశ్చాత్యులు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనే విశ్వాసంలో ఉండేవారు. అది తప్పని ఎవరయినా ఖండిస్తే, మతం పేరిట వాళ్ళని అరి కట్టేవారు, ఉరి తీసేవారు.

 

ఇలా చెబుతూ పోతుంటే ఎంతయినా రాయవచ్చు. చెలానికి శ్రీశ్రీ ఇచ్చిన సలహాయే నాది కూడా. ఈ పుస్తకాలు మళ్ళీ మళ్ళే  చదివి చదివి అనుభవించాలి, పల్లవించాలి. ఈ పుస్తకం గురించి పుట్టపర్తి నారాయణాచార్యులు ఇలా "ఆషామాషీగా చదివే పుస్తకం కాదు. జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన గ్రంథం." అన్నారు. బాపూ ఇది చదివి" విశ్వదర్శనం  చదువుతూ ఆనందం పట్టలేక  ఈ జాబు రాస్తున్నాను. ఇంత విశదంగా, అందంగా రాయగా చదవగా నేనెరగను. సకల శాస్త్రాలూ క్షుణ్ణంగా చదవటం వేరూ, ఆ చదివినది గౌరవం తో అర్థం చేసుకుని మాబోటివాళ్ళకు పిల్లలకు  చెప్పినంత అందంగా అందివ్వడం మీ ఘనత... నేను చదవడం ఎన్నటికీ మరవలేని మహత్తర అనుభవం. థ్రిల్. ..జోహార్లు చెప్పుకుంటూ...[మీకు నమ్మకం లేని] భగవంతుడు మిమ్మల్ని..." .  మామూలుగా "రెండు ముక్కలు మాట్లాడండీ", అంటే, "రెండు ముక్కలు" అని కూచునే బాపూ ఇంత సుదీర్ఘమైన కితాబిస్తే ఇంక మాటల్లో చెప్పేదేముంది . 

 

తమాషా ఏమిటంటే మన పూర్వీకులు "భూగోళం" అని వ్యవహరించేరోజుల్లోనే , పాశ్చాత్యులు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనే విశ్వాసంలో ఉండేవారు. అది తప్పని ఎవరయినా ఖండిస్తే, మతం పేరిట వాళ్ళని అరి కట్టేవారు, ఉరి తీసేవారు.

 

ఇలా చెబుతూ పోతుంటే ఎంతయినా రాయవచ్చు. చెలానికి శ్రీశ్రీ ఇచ్చిన సలహాయే నాది కూడా. ఈ పుస్తకాలు మళ్ళీ మళ్ళేఏ చదివి చదివి అనుభవించాలి, పల్లవించాలి. ఈ పుస్తకం గురించి పుట్టపర్తి నారాయణాచార్యులు ఇలా "ఆషామాషీగా చదివే పుస్తకం కాదు. జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన గ్రంథం." అన్నారు. బాపూ ఇది చదివి" విశ్వదఋశనం చదువుతూ ఆనందం పట్టలేక  ఈ జాబు రాస్తున్నాను. ఇంత విశదంగా, అందంగా రాయగా చదవగా నేనెరగను. సకల శాస్త్రాలూ క్షుణ్ణంగా చదవటం వేరూ, ఆ చదివినది గౌరవం తో అర్థం చేసుకుని మాబోటివాళ్ళకు పిల్లలకు  చెప్పినంత అందంగా అందివ్వడం మీ ఘనత... నేను చదవడం ఎన్నటికీ మరవలేని మహత్తర అనుభవం. థ్రిల్. ..జోహార్లు చెప్పుకుంటూ...[మీకు నమ్మకం లేని] భగవంతుడు మిమ్మల్ని..." .  మామూలుగా "రెండు ముక్కలు మాట్లాడండీ", అంటే, "రెండు ముక్కలు" అని కూచునే బాపూ ఇంత సుదీర్ఘమైన కితాబిస్తే ఇంక మాటల్లో చెప్పేదేముంది . 

 

అనువాద పుస్తకాలగురించి  రెండు మాటలు. అవి నిజంగా అనువాదాలు కావు. బాపూరమణల భాషలో, "అనుసృజనాలు, అనితర సాధ్యాలు.'" నాబోటివాళ్ళకి చిన్నతనం లో రీడింగ్ అలవాటు చేశాయి. ఇంకా చదవాలనే కుతూహలాన్ని ప్రోత్సహించాయి. అయితే అప్పుడు గమనించని , ఇప్పుడు గౌరవిస్తున్న అంశం అయన పద శైలి,  ఇంగ్లీషు  పదాల్ని తెలుగులో చెప్పినప్పుడు ఆయన సృజించిన భాష . "తెలుగులో రామమనోహరంగా చెప్పాడు", {ముళ్ళపూడి} Newton's Third Law  కి ఆయన తెనుగుసేత "ప్రతి క్రియకూ ఒక ప్రతిక్రియ" అని చెప్పగలిగిన మాటలశిల్పి. "మంచు కురుస్తోంది...చలి కరుస్తోంది " అని మాటల్ని చెక్కడం ఆయనకే చెల్లు. మహదేవన్ అనె సంగీత దర్శకుడు తెలుగులో చాలా సినిమాలకి చేశాడు. టమిల్లో గూడా చాలా. ఆయన కూర్చిన అనేక హిట్ పాటల గురించి చెబుతూ "తెలుగు సినిమా హిట్లర్ [Hitler] అన్నాడు. ఆరుద్ర గురించి మాట్లాడుతూ "అందుకే ఆధునిక తెలుగు సాహిత్యం లో ఆరుద్రన్, ఒక రుద్రన్" అన్నాడు.  ఆరుద్ర మాట వచ్చింది గాబట్టి ఒక పిట్టకథ. ముళ్ళపూడి వెంకట రమణ పెళ్ళిచేసుకున్నది, నండూరి చెల్లెలు శ్రీదేవి. పెళ్ళి నండూరి వారి కుగ్రామంలో వారి పాత ఇంట్లో జరిగింది. అక్కడ ద్వారబంధాలన్నీ చాలా పొట్టివట. అందరూ తలకి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా వంగి వెళ్ళాలి. అప్పుడు అన్నాట్ట, "ఈ ఆడ పెళ్ళివాళ్ళు మా మొగపెళ్ళివాళ్ళకి తలవంపులు తెస్తున్నారు"  సత్యాగ్రహం అనేమాటకి చాలాకాలం అర్థం తెలుసుననుకునేవాణ్ణి, "సత్య+ఆగ్రహం" అని సవర్ణదీర్ఘ సంధి చేసి  , నిజమైన కోపం అనుకునేవాణ్ణి. నండూరి పుస్తకంలో గాంధీ మీద చాప్టర్ చదివినప్పుడు తెలిసింది ,"అది సంస్కృత పదమని , దాని అర్థం గట్టిగా పట్టు [పట్టుదల, శ్రద్ధ] అని, కోపానికీ దానికీ సంబంధం లేదని. ఆపదాన్ని గాంధీ గారి అనుచరుడొకడు సృష్టించాడు.

 

మార్క్ ట్వైన్ అనువాదాలగురించి ఒక్క  మాట. అతడు ఇండియా వచ్చినప్పుడు చాలాప్రభావితుడయ్యాడు. ముఖ్యంగా ఆడవారి రకరకాల, రంగురంగుల చీరెలూ, మగవారి వివిధ ప్రాంతాల్లోని వేషభాషలూ, జనసామాన్యం చీకూ చింతాలేని ఆటపాటలూ...ఇత్యాది. అయితే  మర్క్ ట్వైన్ తన dry humour కి ప్రసిద్ధి గాబట్టి, కొన్ని మచ్చుతునకలు. అతడు హై స్చూల్ తో చదువాపేశాడు. దాన్ని గురించి చెబుతూ, "నేను 10 సంవత్సరాలు స్కూలుకి వెళ్ళాను. కానీ అది నా విద్య కి ఏమీ ఆటంకం కలిగించలేదు. [I attended school for 10 years. But  it never interfered with my education] ఇండియా లో  తను  చూసిన  వాటి గురించి  కొన్ని  చెణుకులు  1. చొక్కా  ...ఇండియాలో బండరాళ్ళని పగలగొట్టడానికి ఉపయోగించే సాధనం. 2. సృష్టిలో మానవుడొక్కడే సిగ్గుపడే జంతువు. సిగ్గు పడవలసిన జంతువు గూడా. 3. క్లాసిక్స్ [classics] చదివితే బాగుండుననిపించేవి, కానీ చదవడానికి బుద్ధిపుట్టనివి.

 

ఇక విశ్వరూపం

 

పిల్లలకి అర్థమయ్యేలా రాశాడు. మనం ఇప్పుడు పెద్ద టెలిస్కోపుల ద్వారా చూసే విశ్వం, దాని  ఆయువు ఇలాటివాటి గురించి అర్థమయ్యేలా . ఈ సత్యాలు తమాషాగా మన పురాణాల్లో చెప్పిన 14 భువనభాండాలు, బ్రహ్మ కల్ప వయోపరిమితి, మళ్ళీ ప్రళయం, మళ్ళీ సృష్టీ [సృష్టి  ...  కాదు projection అంటాడు వివేకానందుడు] ...ఆకాశంలో ఏరోజు రాత్రయినా ఎన్ని నక్షత్రాలు కనబడతాయి? "కోటానుకోట్లు" అని సాధారణ సమాధానం. తప్పు. 3,000. [మూడు వేలు] మామూలు బైనాకులర్స్ తో చూస్తే, 50,000. రెండు అంగుళాల టెలిస్కోపయితే మూడు  లక్షలు. హవాయీ లోని టెలిస్కోపు వ్యాసం 390 అంగుళాలు. దాంతో 1299 కొట్ల  కాంతి  సంవత్సరాలు చూడవచ్చు. చంద్రగోళం మీద ఒక కొవ్వొత్తి వెలిగించినా కనిపిస్తుందిట!!!. మన పాలపుంతకి [Milky Way]  కి ఆపేరెలా వచ్చింది? [మన పురాణాల కథ...క్షీరసాగరమథనమప్పుడు ఆ నక్షత్రాలూ, చందమామ, ఇంకా ఆయన సోదరి లక్ష్మీదేవి...] అదే గ్రీకు మైథాలజీ లో గూడా కథలున్నాయి,  [హెర్కులస్ బాలుడిగా అమ్మ హీరా దగ్గర పాలు తాగుతూ తొందరపడి ఆమె స్తనాని గుద్దాట్ట... అప్పుడు ఆపాలు ఆకాశమంతా చిందాయని వాళ్ళ కథ.   ఆతతాయిని అందుకనే "పాలుదాగి రొమ్ముగుద్దేరకమ"ని సామెత

 

మనం  ఒక్కసారి పీల్చిన  ఊపిరిలో ఉన్న అణువులని లెక్కపెట్టడానికి, "వెయ్యిమంది సెకనుకి వందచొప్పున రోజుకు 8 గంటలు పనిచేస్తే వెయ్యి కోట్ల సంవత్సరాలు పడుతుందట". ఇంకో రకంగా చెబితే, ఒకదానిపక్కనొకదాన్ని పేరిస్తే మన సౌర కుటుంబం  దాటిపోతాయి.

 

ఇంకా యూరప్ లో భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళున్నారు. [Flat Earth Society]

ఇంకా న్యూటన్ , ఐన్స్టీన్ ..ఎందరో మహానుభావుల గురించి, వాళ్ళ సిద్ధాంతాలు  మనకర్థమయ్యే  భాషలో చెబుతూ, వాళ్ళ జీవితాల్లో ఆసక్తికరమైన సంఘటనలని ఉటంకిస్తూ

మలుపుతిరిగిన విశ్వం; విస్తరిస్తున్న విశ్వం...ఇవన్నీ చదువుతుంటే థ్రిల్ల్. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. బట్టతలవాటినెత్తిమీద వెంట్రుకలు గూడా నిక్కబొడుచుకుంటాయి. అది ఒక రకమైన మానసిక సమాధి. తలతిరుగుతుంది. అందుకే, "విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన, వీధివాకిలియేదె చెల్లెలా" అన్నాడు కృష్ణశాస్త్రి.

 

 ఇక నరావతారం గురించి.  ఇందులో పలురకములైన జీవ సృష్టి నించి "జంతూనాం నరజన్మ దుర్లభమనే" నరుడిదాకా ఎలా పరిణామం  చెందిందో చాలా ఆసక్తికరంగా రాశాడు. డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతమే  అన్నిటికంటే సైంటిఫిక్ అని అభిప్రాయపడతాడు. మన పురాణాల్లో చెప్పిన బ్రహ్మ సృష్టి, క్రీస్టియన్ మతం చెప్పిన  దేముడి సృష్టి, మోర్మొన్స్ సిద్ధాంతం, ఇవన్నీ సైంటిఫిక్ గా పరిశీలిస్తే అవి "కార్య-కారణ" వాదానికి బదులు  చెప్పలేనివిగా కనిపిస్తాయి  ఆ సిద్ధాంతాలని నమ్మేవాళ్ళని  హేతువాదం తో ఒప్పించడం, అసంభవం. ఈరోజుకిగూడా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళున్నారు . ఈ రోజుకి గూడా జీసస్ క్రైస్ట్ శ్వేతజాతివాడనీ,  , నీలి కళ్ళు ఉండేవని , అతనికి ముందు ప్రపంచమే లేదనీ, అసలు చంద్రమండలమ్మీదకి  మానవుడు కాలు పెట్టలేదనీ , అది టివి వాళ్ళు చూపించిన మాయ అనీ...ఇల్లాంటి నమ్మకాలున్నవాళ్ళు అన్ని మతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఉన్నారు. అవన్నీ మూఢ నమ్మకాలకిందా, డెల్యూజన్ కింద  అనుకోవాలంతె. ఒకప్పుడు ప్రఖ్యాత ఫిసిసిస్ట్ జె. బి. ఎస్.  హాల్డెన్, మన విష్ణు కథల్లో మొదటి మూడు అవతారాలూ నీటి జంతువులే, [మత్స్యం, కూర్మం, వరాహం] అని చమత్కరించాడు గానీ  ఋగ్వేదంలో ఒక్క మత్స్యావతారాన్నే వర్ణించారు. నాచురల్ సెలెక్షన్ అందరూ నమ్మవలసిన సైన్స్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అందరూ నమ్మకపోవచ్చు. ఈ వాదాలన్నీ మన శంకరాచారి "అహం బ్రహ్మాస్మి" అద్వైతం తో ఎలా సామరస్య పరచగలం? వివేకానందుడు ఒకచోట, సర్వైవల్ ఆఫ్ ది ప్యూరెస్ట్ అని వ్యవహరించాడు. అయితే శంకరాచారి గూడా మనం జంతువులమేనన్నాడు గదా!

 

మనకి  కనబడనంతమాత్రాన లేదు, లేడు అనడానికి మన వేదాంతం గాని, జంతుశాస్త్రం  గానీ వ్యతిరేకం. వైరస్, ఈ పార్థివ చక్షువులకి కనబడదు. కానీ లేదు అనలేము. అలాగే భగవంతుడు గూడానేమో? సర్వైవల్ వాదం నిజం కాకపోతే ఇంతకు ముందు కని వినీ ఎరగని కొత్త కొత్త క్రిములొస్తున్నాయి గదా! పోలియో, స్మాల్ పాక్స్  ఇప్పుడు లేవు. అవే మార్పు [metamorphosis] చెంది   కొత్తగా ఎయిడ్స్, సార్స్, కొవిడ్ 19...లాగా వస్తున్నాయేమొ.! మీరు  చదవండి, మననం చేసుకొండి, అనుభవించండి.

 

ఈ పుస్తకంలో చాలా అనూహ్యమైన ఘట్టాలుంటాయి. మచ్చుకి ఒక్క కథ. గిబ్బన్స్ అనే కోతి జాతిలో [అనేక రకాలయిన కోతుల్లో మన హనుమంతుడెవరో] "ఉమ్మడి కుటుంబాలు" వ్యవస్థ ఉంది . అయితే ఆడపిల్లకి యుక్త వయసు రాగానే  తల్లి తన్ని బయటకి తగిలేస్తుంది. మగ గిబన్ కి యుక్ల్త  వయసు రాగానే తండ్రి తన్ని తగిలేస్తాడు. 

 

జగమెరిగిన బ్రాహ్మడికి జందెమేల అని ఆయన సర్వతోముఖ రచనలే ఆయనకి ఆభరణాలు. అయినా ఈ వ్యాసకర్తగా ఆయనకి వచ్చిన బిరుదులూ, సన్మానాలూ కనీసం పేర్లయినా చెప్పక పోతే నాకు  బాధగా ఉంటుంది. 1.మద్రాసు తెలుగు అకాడమీ "ఉగాది వెలుగు" అవార్డ్ 2. విజయవాడ లో వై. చింతామణి అవరొ. 3. ఒంగోల్ అభిరుచి వారి పాత్రికేయరత్న"  4. మద్రాసు కళాసాగర్ అవార్డ్, 5. అభినందన సంస్థ హైదరాబాద్ "ముట్నూరి క్రృష్ణారావు అవార్డ్ , 5. తెలుగు యూఒనివర్శిటీ  డాక్టరేట్, 6. ఆంధ్ర ప్రదేష్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ,7. అప్పాజ్యో’శ్యుల  ఫౌండేషన్ వారి "ప్రతిభామూర్తి" అవార్డ్  వగైరా వగైరా,.ఆయన్ ఇంకో నా మం "పాత్రికేయ భీష్ముడు.”  అమె రి కా   నాలుగు సార్లు, రస్ష్యా ఒకసారి  పర్యటించాడు.  

 

చివరికి !!! నండూరి రామమోహనరావు గారి అనంగు మిత్రుడు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు, చెప్పిన వాక్యాలతో ఈ వ్యాసం ముగిస్తాను. " స్వభావం చేత అంతర్ముఖుడు. అంతరంగంలో తాత్వికుడు. ఆయన అభిరుచులు సంస్కారవంతములు...వెరసి ...పత్రికారంగంలో అంతటి సంగీత సాహిత్య  కళా మర్మాలెరిగిన వ్యక్తి చాలా అరుదు. ఆయన లోని జీవన సౌందర్య లాలస ...రామ మనోహరం"

 

అది ఒక వైభవోజ్వల మహాయుగం

***

bottom of page