top of page

వ్యాస​ మధురాలు

పంచతంత్రం  అనే ప్రాచీన జ్ఞాన మంత్రం

apparao-muppalla.jpg

ముప్పాళ్ళ అప్పారావు

                                                       

ప్రాచీన కాలంలో భారతదేశం కథలకు, కళలకు కాణాచి. ఆ కాలపు నీతి కథల్లో పంచతంత్రం అతి ముఖ్యమైనది. పంచతంత్రం వంటి కథల సమాహారాన్ని’కథా  కావ్యము’లని పిలుస్తారు. పంచతంత్రం మూలగ్రంథం ఏదో ఎవరికీ లభించలేదు.

ఈ కథ  ప్రాచీనతపై ఎన్నో కథనాలున్నాయి. అందులో ప్రముఖంగా వినిపించేది విష్ణుశర్మ గాథ. ముఖ్యంగా అతని జీవించిన కాలంపై భిన్న స్వరాలు వినిపిస్తాయి. ఎక్కువ మంది  క్రీ.పూ. ౩వ శతాబ్ది అంటారు.

ఒక కథనం ప్రకారం ‘మహిలారోప్య’ అనే దేశపు రాజు అమరశక్తికి ముగ్గురు(కొన్ని చోట్ల ఐదుగురు)  మంద బుద్ధులైన పిల్లలు ఉన్నారు. అయన తన రాజ్యంలో  మంచి గురువు కోసం వాకబు చేసి విష్ణుశర్మ మాత్రమే వారిని సరి అయిన మార్గం లో పెట్టగలడని భావించి వారిని అతని వద్దకు పంపుతాడు.

అప్పటికే 80 ఏళ్ళ ముదుసలి అయిన విష్ణుశర్మ వాళ్ళలో బుద్ధి వికాసానికి వినూత్న పరిష్కారం కనుగొంటాడు.

జంతువుల పేరిట కథలు అల్లి వారిలో ఆసక్తి రేకెత్తిస్తాడు. ఈ రకంగా ఐదు భాగాలున్న పంచతంత్రం కథ మొదలౌతుంది. ఈ కథామాలికలో  వరసగా మిత్రలాభం, మిత్రభేదం, కాకోలూకీయము, లబ్దనాశనము(లబ్ధ ప్రణాశం) , అపరీక్షకారకం అనే అధ్యాయాలు ఉంటాయి.

ఇందులో మొదటి అధ్యాయం  స్నేహాన్ని సూచిస్తుంది. జీవితంలోనూ,రాజకీయంలోనూ, స్నేహాలు- పొత్తులు చాలా విలువైనవి. వాటిని ఏర్పరచుకోవడంలో తగిన శ్రద్ధ, నిజాయితీ అవసరం. ఈ ఐదు భాగాల కథామాలికలో  మూడు స్నేహాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచించేవే. ఒక్కటే శత్రుత్వాన్ని వివరిస్తుంది. అంటే, స్నేహానికున్న విలువ ఎంత గొప్పదో ఈ కథల్లో ద్యోతకం అవుతుంది. మొదటి రెండూ స్నేహాన్ని పొందటమూ, దాన్ని పోగొట్టుకోవడం గురించి  చెప్తాయి. కథల్లో జంతువులే ఉన్నా అవి మన మనుషులలా మాట్లాడుతూ వారిలా ప్రవర్తిస్తూ ఉంటాయి.

ఈ కథ  ప్రేరణతో కనీసం  200 అనువాదాలు 50 భాషల్లో వ్రాసారంటే, దీన్ని ఒక గొప్ప సాహిత్యసృష్టిగా భావించవచ్చు. ఈ పంచతంత్ర విశ్వ వ్యాప్తిపై విశేష పరిశోధన చేసిన ఇద్దరు జర్మన్లు థియోడోర్ బెయిన్ఫ్, యోహన్ హెర్టేల్‌ల కృషి వల్లే ఎన్నో సంగతులు బయటకు వచ్చాయి.

హేతుబద్ధ విజ్ఞానప్రేమికునికి జంతువులు మానవ భాషలో మాట్లాడటం ఏమిటి?, బద్ధ శత్రువులైన పులి, ఆవు స్నేహం ఏమిటి? అవి రెండూ మానవభాషలో ఎలా మాట్లాడుకుంటాయి?... ఇలా ఏవేవో ప్రశ్నలు మదిలో ఉదయించక మానవు. కొంత కల్పనా శక్తితో చదివి  లోపలి అంతరాథం చూడగలిగితే  ఆవులాంటి సాధు మానవుడు, పులిలాంటి కృర మానవుడు, నక్కలాంటి జిత్తుల మారి మనిషి ఇలా వాటి లక్షణాలు మనిషిలోనే ఆరోపించి ఆయన చెప్పి ఉండవచ్చని మరింత లోతైన అవగాహన ఏర్పడుతుంది.

చరిత్రలో  నీతికథల అంశంతో ఇలాంటి పాత్రలున్న 'హితోపదేశ' అనే పుస్తకం ఇంకోటి ఉంది. ఈ పుస్తక రచనాకాలం, దాని రచయిత మీద కూడా  స్పష్టత లేదు. కొంతమంది ఉద్దేశ్యంలో ఇది 12వ శతాబ్దిలో వ్రాయబడింది. దీనికి గ్రంధకర్త 'నారాయణ' అనే కవి. ఆయన 'ధవళచంద్ర' అనే రాజు కాలంలో  క్రీ.శ 800-950 మధ్య వ్రాసి ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ పుస్తక ప్రాచీన వ్రాతప్రతి నేపాల్‌లో 14వ శతాబ్దిలో దొరికిందట.

ఇక హితోపదేశానికి పంచతంత్రంకి పోలికలు చాలా ఎక్కువే. ఇంచుమించు అవే కథలు రెంటిలోనూ ఉన్నాయి. హితోపదేశంలో నాలుగే భాగాలు ఉండగా పంచతంత్రంలో ఐదు ఉంటాయి. ఐదోభాగంగా పేర్కొనే 'అపరీక్షకారకం' హితోపదేశం గ్రంథంలో  లేదు.

ఇలాంటి కథామాలిక రచనా విధానం  గుణాఢ్యుని బృహత్కథ, సోమదేవుడి కథా సరిత్సాగరం , క్షేమేంద్రుని బృహత్కధామంజరి గ్రంథాలలో కూడా కనపడుతుంది.

ఇలాంటి పోలికే ఉన్న ఇంకో పాశ్చాత్య పుస్తకం ‘ఈసోపు కథలు’. వీటిని  ఈసోపు అనే గ్రీకు కాలపు బానిస క్రీ.పూ 620-564లో వ్రాసాడని అంటారు. ఇది కూడా పంచతంత్రంలానే మౌఖికంగా ప్రాచుర్యం పొందినదే. ఇందులో పంచతంత్రంని పోలిన కథలు, అలానే ఇంకొన్ని ఇతర కథలు కూడా ఉన్నాయి. ఏది ఎవరి నకలు అనే దానిపై భిన్నస్వరాలు ఉన్నప్పటికీ, పంచతంత్రం వలే ఇది ఏక సూత్రంతో అల్లుకున్న మాలలాగా కాకుండా, దేనికదే ప్రత్యేక కథలుండే కథా సంపుటం.

ఈ గ్రంథానికి ఇంకో పోలిక జాతకకథలతో కూడా కనిపిస్తుంది. ఇవి కూడా జంతువుల కథలే. కాకపొతే ఇందులోని కథలు బుద్ధుని గత జన్మల కథాంశంతో వ్రాసినవి.

పంచతంత్రం మన దేశం దాటి వెళ్ళిన చరిత్ర వెనక ఇంకో పెద్ద కథే నడిచింది. పర్షియా దేశంలో ఒకటవ ఖుస్రో రాజు 'నుషిర్వన్' కాలంలో 'బార్జోయ్' అనే పండితుడు  ఉండేవాడు. అతను భారతదేశంలో మరణం జయించే  అద్భుత మూలిక కోసం వచ్చాడని అంటారు. వైద్యుడు కనుక అది రాజాజ్ఞ కూడా కావచ్చునేమో! అయితే అతనికి హిమాలయ ప్రాంతపు జ్ఞాని హితబోధ చేసి, అతను వెతుకుతున్నది మూలిక కాదు, పుస్తకం మాత్రమే అని  పంచతంత్ర కథలు  చెప్పాడని పర్షియా  కథనం ఉంది.

ఔషధం అనేది ఒక ప్రతీక మాత్రమే. ఇంకో కథనంలో డబ్శాలిం రాయ్ అనే రాజు తన  కలలో కనపడిన గ్రంథం వేట కోసం ఒకరిని పంపగా, బిడ్పాయ్ కలిసాడని (ఈ పదం విద్యాపతికి ప్రాకృతరూపం అయి ఉండవచ్చు), అతని ద్వారా ఈ కథలని తెలుసుకున్నాడని అంటారు.

అలా పుస్తకం వేట కోసం వచ్చిన బార్జోయ్‌కికి , బిడ్పాయ్ కలిసి పంచతంత్ర  కథలు చెప్పాడని పర్షియా పుస్తకాల్లో రాసుంది. ఆ కథలకి బిడ్పాయి చెప్పిన కథలని  పేరు పెట్టాడు కూడా.

'కలిలాగ్ -దిమ్నాగ్' అనే పేరుతో  పహ్లవి భాషలో పుస్తకం తర్జుమా చేసుకున్నారు. ఇది ఇప్పుడు అలభ్యం. అక్కడి నుంచి ఇవి సిరియన్ భాషలోకి (కలిలా -దిమ్నా), మళ్ళీ అకడి నుంచి అబ్దుల్లా ఇబ్న్ అల్ మొకఫ్ఫా ద్వారా అరబిక్‌లోకి 'కలిలా వా దిమ్నా' గా అనువదించబడింది.

అటుపిమ్మట ఇది ఇంకా ఎన్నో అనువాదాల ద్వారా యురోపుకి చేరింది. ఫేబిల్స్ ఆఫ్ బిడ్పాయ్ అని, మోరల్ ఫిలాసఫి ఆఫ్ దోని అనే పేర్లతో అనువాదాలు వెలువడ్డాయి. పైన చెప్పిన కలిలా దిమ్నాలు వేరేమిటో కాదు. మన కరటక దమనకులకి వాళ్ళు పెట్టిన పేర్లు. అక్కడా ఇక్కడా అవి నక్కలే మరి. పంచతంత్రంలో మొదట వచ్చే జంట నక్క మంత్రుల పేర్లు ఇవి.

ఇంకా ఈ కథలకి, అనువాదకులు వాళ్ళ వాళ్ళ సంస్కృతి, సామాజిక, మత పరిస్థితులకి అనుగుణమైన మార్పులు చేయడం కథల్లో కనిపిస్తుంది. వీటిని ఫ్రెంచ్‌లో 'లా ఫౌంటెన్' అనే రచయిత అనువదించాడు . అయితే ఈ కథలు మన భారతీయతతో కాకుండా, అరబిక్ వేషంలో ఫ్రెంచి వారికి పరిచయం అయ్యాయి.

బ్రిటీషు ఇండియా కాలంలో సివిల్ సర్వెంట్స్‌కిపాలనా మెళకువలు నేర్పడానికి దీన్ని వాడుకుంటే, పర్షియాలో షానామా వంటి గొప్పపుస్తకాల సరసన దీన్ని చేర్చటం అచ్చెరువొందే విషయమే. ఇప్పటి తరానికి పరిచయం లేని ఈ పుస్తకం చిన్నయ్యసూరిగారి గ్రాంథిక భాషలో ఒకప్పటి  తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠంగా తప్పనిసరి. కొందరికి ఇందులో మాకియవెల్లి విరచిత ప్రిన్స్ పోలికలు కనిపిస్తే, మరికొందరికి చాణక్య అర్థశాస్త్ర సూత్రాలు కనిపించాయట. ఉన్న అన్ని అనువాదాల్లోకి  ఇంగ్లీషులో ఆర్థర్ రైడర్(1925) పుస్తకమే  బాగా పేరు తెచ్చుకున్న గ్రంథం. 

 తెలుగులోకి వీటిని అనువదించిన వారిలో అగ్రగణ్యుడు పరవస్తు చిన్నయ సూరి .ఆయన మద్రాసు నగరంలో పండితుడు.  కేవలం మొదటి రెండు భాగాలను గ్రాంథిక భాషలో అనువదించారు. తరువాత కాలంలో మిగిలిన రెండు భాగాలను వీరేశలింగంగారు అనువదించారు. చివరి భాగాన్ని చెరుకువాడ వెంకటరామయ్యగారు అనువదించారు. వీటిని మనం 'నీతిచంద్రిక' పేరుతో విని ఉంటాం. ఇందులో హితోపదేశ గ్రంథ ప్రణాళిక లాగే మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలూకీయము, విగ్రహం, సంధి అధ్యాయాలు ఉంటాయి.

ఈ కథలని వ్రాసిన  విధానం కూడా ఒక వింతే. ఆ కాలానికి అదో గొప్ప ఆశ్చర్యకరమైన పోకడ. కథలో కథల్ని జడలాగా అల్లడం ఒక టెక్నిక్. ముందు ఒక కథ నడుస్తూ ఉంటుంది.  అందులో పాత్ర ఒక వ్యాఖ్య లేదా ఒక సందేశం చెపుతూ, ఫలానా దేశంలో ఫలానా జంతువు ఇలాంటి సందర్భంలో ఏమి చేసిందో తెలుసా అని ఆ కథ  చెప్పుకొస్తుంది. ఇలా చిన్న పాయలా మొదలై చివరికి అది నదిలా మారుతుంది. ఆ గొలుసు చివరకి వచ్చేసరికి మొదట చెప్పిన మూలసూత్రం  మన ముందు విస్పష్టంగా ప్రత్యక్షం అవుతుంది. దీన్నే ఇంగ్లీషులో ఫ్రేం స్టొరీ(frame story telling) పద్ధతిగా పిలుస్తారు.

ఒక్కటే కథ  కాకుండా ఒక మాలలా కథల్ని అల్లడం, వాటిలో మనుషుల బదులు  జంతువులని పాత్రలుగా చేయడం, వాటి ద్వారా మనకి నీతి బోధ చేయడం ఆ కాలానికి ముందడుగు. మనకిపుడు అవి కాకమ్మ కథల్లా అనిపించొచ్చు కానీ , (అన్నట్టు అందులో కాకులు గుడ్లగూబలు కథ  కూడా ఉందండోయ్)అవి ఈ ఒడిదుడుకుల జీవితంలో కొంచెం సమయస్ఫూర్తి, కొంచెం వివేచనా, మరికొంత విషయ అవగాహన నేర్పే విషయంలో ఏ కథకీ  తక్కువ కావు. 

ఎక్కువ  పుస్తకాల్లో  మిత్రభేదం తొలి అధ్యాయంగా ఉండగా, అక్కడక్కడా మిత్రలాభం మొదటిదిగా పేర్కొనడమూ ఉంది.

సంక్షిప్తంగా అధ్యాయాల వారీగా కథ

1. మిత్ర భేదం : అన్నింటి లోకి ఇదే పెద్ద కథ . పింగళకుడు అనే సింహానికి సంజీవకుడు అనే ఎద్దుకు మధ్య స్నేహం బలపడుతుంది. ఇది నచ్చని కరటక దమనకులనే నక్క మంత్రులు వారిద్దరికీ చాడీలు చెప్పి ఎలా శత్రుత్వం పెంచుతారనేది కథావస్తువు.

2. మిత్రలాభం : ఇందులో స్నేహం విలువ ద్యోతకం అయ్యే కథనం ఉంటుంది. పావురం ,తాబేలు, ఎలుక, కాకి, జింకల మధ్య ఏర్పడ్డ చెలిమి వారిని ఆపదల్లో ఎలా కాపాడింది ఈ భాగంలో వివరించటం జరుగుతుంది.

3. కాకోలూకీయము : కాకులు , ఉలూకాలు అంటే గుడ్లగూబలకు సంబంధించిన కథ . ఒకే చోట నివసించే కాకులు గుడ్లగూబల మధ్య వైరం ఏర్పడుతుంది. ఇందులో కాకులు మంచివి, గుడ్లగూబలు చెడ్డవి. గుడ్లగూబలని నేరుగా ప్రతిఘటించకుండా వారిలో ఒకరిగా చేరి వారి నాశనానికి ఒక ముసలి కాకి ప్రయత్నించడమే కథాంశం.

4. విగ్రహం : విగ్రహం అంటే విరోధం ,శత్రుత్వం అనే అర్థం సంస్కృతం లో ఉంది. ఇది అక్కర లేని తగాదా. కర్పూర ద్వీపంలో ఉండే హంస రాజు హిరణ్యగర్భుడీకీ, జంబూ ద్వీపంలో ఉండే నెమలి రాజు చిత్రవర్ణుడికి ఏర్పడిన విరోధం. అందువల్ల జరిగిన యుద్ధం, దానిలో మరణించిన పక్షులు  వివరణే ఈ కథ .

5. సంధి: పైన చెప్పిన పోరులో ఓడిపోయి పారిపోయిన హిరణ్యగర్భుడి కీ, యుద్ధం మంచిదికాదన్న సత్యం తెలుసుకుని రాయబారం ద్వారా శాంతి కోరిన చిత్ర వర్ణుడికీ జరిగిన రాజీ.

 పంచతంత్రం ఇంగ్లీషు, సంస్కృత  ఇతర మూలాల్లో ఇంకొన్ని అధ్యాయాలు కూడా కనిపిస్తాయి. అవేంటో చూద్దాం.

లబ్ధ ప్రణాశం : లబ్ధం అంటే  లభించినది, ప్రణాశం అంటే  పోగొట్టుకోవడం.  పొగడ్తలు ,మోసాలకి లొంగిపోయి ఆలోచన లేకుండా గుడ్డిగా చేసేపనులు చేటు తెస్తాయి. ఉన్న దాన్ని పోగొట్టుకునేలా చేయగలవు. దీనికి ఉదాహరణగా స్నేహితుడి గుండె అడిగే మొసలి, బంధువుల్ని చంపమని పాముకి చెప్పే కప్పా, పులి తోలు కప్పుకున్న గాడిద వృత్తాంతాలతో పై విషయాన్ని విశదీకరిస్తారు.

అసమీక్ష కారిత్వం/అపరీక్షిత కారత్వం  : ప్రత్యక్షంగా చూసి, పరోక్షంగా విని, జరిగింది  ఊహించుకుని పరీక్షించకుండా చేసేపని  అపరీక్షిత కారత్వం.  

తగిన పరిశీలనా, సరిఅయిన విచారణ లేకుండా, ఆలోచన లేని పనులన్నీచివరకు  దుఃఖానికి దారితీస్తాయి. దూరదృష్టి, అవగాహన లోపించిన పనులు దుష్ఫలితాలనే ఇస్తాయి. రక్తం తో ఉన్న ముంగిసని తప్పుగా అర్థం చేసుకుని చంపేసిన యజమాని, సింహానికి ప్రాణం పోసి దానిచేతి లోనే హతం అయిన ముగ్గురు పండితులు, పేల పిండిని చూసి మైమరచి కలగని ఉన్నదాన్ని నేలపాలు చేసుకున్న బ్రాహ్మణుడు ఇలాంటి దృష్టాంతాల ద్వారా నీతి చదువరులకు అర్థం అవుతుంది.

తెలుగులో ‘బాలల బొమ్మల పంచతంత్రం’ అని రెండుభాగాలుగా పురాణపండ రంగనాథ్ పుస్తకం, జీరెడ్డి బాల చెన్నారెడ్డి అనువాదం, బాలల బొమ్మల పంచతంత్ర కథలు అనే సరస్వతి పబ్లికేషన్ పుస్తకం, బుజ్జాయి గారి ఐదుభాగల బొమ్మల పుస్తకం, జూలై 1973 నాటి చందమామ పంచతంత్రం అనుబంధం , తాడంకి లక్ష్మీ నరసింహారావు వ్రాసిన  చాణక్య విరచిత పంచతంత్రం, ఇవికాక నీతిచంద్రిక పుస్తకాలు, ఏ ఎన్ జగన్నాథ శర్మ అనువాదం, వసుంధర వారి ప్రచురణ… ఇలా చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

 ఎన్నో వేల ఏండ్లు పాఠకులని రంజింపజేసి, ఆలోచింపజేసి , చిట్టి పొట్టి కథల్లో అనుభవాన్ని, జ్ఞానాన్ని రంగరించి గోరుముద్దల్లా బోరు కొట్టకుండా, ధ్యాస మళ్ళకుండా,పేజీ వదలకుండా చదివించిన ఈ పంచతంత్రం నేడు ఎందుకో నెమ్మదిగా  కనుమరుగవుతున్నది.  .

 

అనువాద క్రమం వరుసగా:

భారతదేశం >పెహ్లవి > అరబ్బీ > హీబ్రూ > లాటిన్ > స్పానిష్ > ఇటాలియన్ > ఇంగ్లిష్ –'మోరల్ ఫిలాసఫీ ఆఫ్ దోని'

 

విష్ణుశర్మ  (370 AD) నుంచి వరుసగా అనువాద ప్రవాహం:

 

భాష                                అనువాద రచయిత- కాలం /రాజు                               పుస్తకం పేరు

పెహ్లావీ (పర్షియా)                బార్జోయ్ (Barzoye) నుషీర్వాన్ ,570 AD                              కలిలే వా దిమ్నా

సిరియా                                బుద్ (Periodeut Bud), 600 AD                                          కలిలాగ్-దిమ్నాగ్

అరబ్బీ                                  అబ్దుల్లా ఇబ్న్ అల్ మొకఫ్ఫా, 750                                    కలిలా వా దిమ్నా

గ్రీక్                                        సైమన్ సెత్ 1080                                                             స్టెఫనైట్స్ కై ఇకేన్లటేస్

హీబ్రూ                                   రబ్బీ జోయెల్ 1250

స్పానిష్                                10 వ ఆల్ఫాన్సో, 1251                                                                  కలిలా ఎ దిమ్న

లాటిన్                                    జాన్ కాపువ  1480                                                         డైరెక్టోరియం హ్యూమన్  విటే

జర్మనీ                                         జియోవాని 1483                                                          దస్ డేర్ బుక్ బెస్పెయిల్

ఇటాలియన్                       ఆంటన్ ఫ్రాన్సేస్కో దోని 1552

ఇంగ్లీషు                                  థామస్ నార్త్ 1570                                          ఫేబుల్స్ ఆఫ్ బిద్పాయ్ / మోరల్ ఫిలాసఫీ ఆఫ్ దోని

 

                        

******

bottom of page