top of page

కథా​ మధురాలు

నవరాత్రి- 3

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

శరన్నవరాత్రి మూడవదినం ‘తదియ’.

రమణ మూర్తి గారింట్లో దేవిని “చంద్ర ఘంటా" రూపంలో పూజించి విశ్రాంతిగా కూర్చున్నారు శాస్త్రిగారు. పూజకు వచ్చినవారినుద్దేశించి “మీరందరూ భక్తిగా పూజలో పాల్గొన్నారు. ఆ లలితా దేవి సకల శుభాలనూ కలగ జేయాలని ప్రార్ధిస్తూ, మీకు మహిషాసుర మర్ధిని ఘట్టం వినిపిస్తాను" అంటూ చెప్పడం మొదలెట్టారు .

            

పూర్వం మహిషుడనే రాక్షసుడు వుండేవాడు. అతడు అమరత్వ సిద్ధికై తపస్సుచేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. మహిషుడు తనకు చావులేకుండా వరమిమ్మని అడిగాడు.

 

బ్రహ్మ నవ్వి “భూమిపై పుట్టిన ప్రతి జీవి గిట్టుట తిరిగి జన్మ నెత్తుట తప్పదు, కావున యింకేదైనా వరం అడుగు“ అన్నారు.

 

అందుకు మహిషుడు "దేవదానవుల వలనా, పురుషుల వలనా నాకు చావు లేకుండా వరమివ్వు. స్త్రీల వల్ల అని నేనడగను, యెందుకంటే స్త్రీలు అబలలు, నేను మహా శక్తివంతుడను. నేనలా స్త్రీ వలన చావు తప్పించమని అడుగుట సిగ్గుచేటు"  అంటూ వికటహాసం చేశాడు .

 

"తధాస్తు, నీకు స్త్రీ వల్లనే మరణం సంభవిస్తుంది" అనిచెప్పి అంతర్ధాన మయ్యాడు బ్రహ్మ. వరబలంవలన మహిషుడు గర్వంతో విరగబడి, భీకర యుద్ధాలు చేసి యింద్రాది దేవతలను ఓడించాడు. భూమండలాన్నంతటినీ ఏక ఛత్రాధిపత్యంగా యేలాలని సంకల్పించాడు. మహిషాసురుని ధాటికాగలేక దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని ప్రార్ధించగా బ్రహ్మ వారందరితోనూ కలిసి వైకుంఠము చేరి విష్ణుమూర్తిని యీ ఆపద నుండి కాపాడమని ప్రార్ధించారు. శ్రీమహావిష్ణువు వారందరికీ అభయమిచ్చి "దేవతలారా! బ్రహ్మవరం వలన మహిషుని జయించడం మనవల్ల కాదు. వాడు స్త్రీ చేతనే మరణిస్తాడు. అతి భయంకరుడైన వాడిని స్త్రీ మాత్రమె జయించగలదు కనుక మనమందరమూ మనయొక్క శక్తి అంశలతో బ్రహ్మాండమంతా తానే అయిన వొక మహాశక్తిని స్త్రీ రూపంగా ఆవిర్భవింప” అని చెప్పగా జనార్ధనుని మాటలకు అందరూ మహానందంతో కార్యోన్ముఖులయ్యారు.

 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖముల నుండి దివ్య తేజములు వెలువడినవి. మహేంద్రుడు మొదలైన దేవతల నుండి అనేకమైన రంగులుగల దివ్య తేజములు వెలువడి, హిమవత్పర్వతము వలె రాశీభూతమైంది. ఆ యొక్క దివ్యమైన తేజము వొక స్త్రీ మూర్తిగా రూపు దాల్చింది.

 

అగ్ని వలన తెలుపు యెరుపు నలుపు వర్ణాలు కలిగిన త్రినేత్రములు, ఉదయ సంధ్యల వలన కనుబొమలు, వాయు తేజంతో చెవులు, కుబేరతేజంతో నువ్వు, పువ్వు వంటి నాసిక, యముని తేజంతో కాళరాత్రి వంటి కురులు, రుద్రతేజంతో పద్మము వంటి ముఖము, భూమియొక్క తేజంతో సర్వావయవములూ శోభిల్లి, సకల శుభలక్షణములూ కలిగి సురభిళమైన అద్భుత లావణ్యవతియై నిలిచిన లలితాపరాభట్టారికను చూడగానే దేవతలందరి హృదయాలూ ఉప్పొంగినవి.

 

ఆ దేవికి విష్ణువు చక్రాన్నీ, శివుడు త్రిశూలాన్నీ యింకా పాశము, శంఖము, శతఘ్ని, ధనుర్బాణములు, వజ్రము, దండ కమండలములూ, పరశువూ, పద్మమూ, పానపాత్ర కౌమోదకీ కవచములు యివ్వగా, సూర్యుడు తన తేజస్సును, చంద్రుడామె పెదవులపై వెన్నెలవంటి చిరునగవునూ సమర్పించగా ఆ మహాశక్తి, ప్రత్యక్షమాహేశ్వరి, ఛండ ప్రచండ శక్తియై మహిషాసుర మర్ధనం చేసి జగాలు నిండి, క్షీరసాగర మద్యంలో దేదీప్య మానంగా వెలుగుతున్న మణిద్వీపంలో నిలిచి, అండపిండ బ్రహ్మాండాలనూ పాలిస్తున్నది  జగన్మాతయై. అంటూ ముగించారు శాస్త్రి గారు.

 

ఆ తల్లికి మరోసారి నీరాజనం సమర్పించి లేచి సెలవు తీసుకున్నారు శాస్త్రిగారు. ఆ రాత్రి యధాప్రకారం అరుగు మీదకు చేరారు శాస్త్రిగారు. తమ జీవితంలో జరిగిన వొక సంఘటన గురించి చెప్తున్నారు.

 

ఒకనాడు నేను గుడిలో వుండగా, గుడి ఆఫీసునుండి ఒకతనొచ్చి అయ్యా మీకు హైదరాబాదు నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పాడు. మా రెండో అమ్మాయి శైలజ ఫోన్లో - “నాన్నా! ధాత్రి కనపడటం లేదు” అంటూంది యేడుస్తూ. వివరాలడిగాను. ఆమెకు తొలిచూలు ఆడపిల్ల .రెండోకానుపు మగపిల్లవాడు.

“మా యింటి యెదురుగా అపార్ట్మెంట్ కడుతూ వీధిలో యిసుక పోశారు. అందులో పిల్లలు ఆడుకుంటున్నారు. కొంతసేపయ్యాక, పక్కింటామె వచ్చి మీ ధాత్రిని యెవరో కార్లో యెక్కించుకుని వెళ్ళారట, మా అబ్బాయి ఆటల్లో పడి మరిచినట్లున్నాడు. యిప్పుడే వచ్చి చెప్పాడు అని చెప్పింది. వెంటనే నేను మీ అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పి, మీకు కాల్ చేశాను నాన్నా. యీ చుట్టుపక్కల చాలా మందిని అడిగాను,  కారు వివరాలెవరూ చెప్పలేక పోతున్నారు. అని చెప్పింది. నా కూతురు దుఃఖాన్ని భరించలేక పోతున్నాను. వెళ్దామంటే రాత్రికి గానీ బస్సులేదు అన్నారు. గుడిలోకొచ్చి వో మూలగా కూర్చుని బిడ్డ క్షేమంగా 

దొరకాలని సంకల్పం చేసుకుని, తల్లి భ్రమరాంబికను ధ్యానిస్తూ  కూర్చున్నాను. వచ్చిన భక్తులందరికీ మా నాయనగారు తీర్ధ ప్రసాదాలు యిస్తున్నారు. గుడిమూసే వేళయి చాలా సేపయింది.

మళ్ళీ ఫోను, మా అల్లుడు గారు. “మన ధాత్రి దొరికిందటండీ. శైలజ ఫోన్ చేసిన వెంటనే నేను పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ యిచ్చాను.  తర్వాత వెదకటం మొదలు పెట్టాము. నా తోటి పనిచేసేవారు, వాళ్ళ బళ్ళమీద తలా ఒకదిక్కూ వెళ్ళారు. మా శాయశక్తులా వెదికాము. నిరాశతో యింటికొచ్చాను. శైలజ పూజ గదిలో వుంది. వెళ్ళి ప్రక్కనే కూర్చున్నాను. కొంతసేపట్లోనే పోలీస్ స్టేషన్ నుండి ఫోనొచ్చింది, యే వార్త విన బడుతుందోనని వణికిపోయాను. మీ అమ్మాయిమాత్రం తల్లిపాదాలు మరింత గట్టిగా పట్టుకుంది. 'మీ పాప దొరికిందండీ. క్షేమంగా వుంది రండి' అని పోలీసులు యిప్పుడే చెప్పారు. నేను వెళ్తున్నాను ఖంగారు పడకండి“ అనగానే యే వార్త వినాల్సొస్తుందోనని వూపిరి బిగబట్టుకున్న నాన్నగారు వొక్క సారి పెద్దగా “తల్లీ భ్రమరాంబికా"  అంటూ తల్లి ముందు సాగిల పడ్డారు. నేను తల్లి పాదాలు గట్టిగా పట్టుకుని ప్రణిపాతం చేసి లేచి బయలుదేరాను.

 

                **

  

అసలేమి జరిగిందంటే, 

పద్దెనిమిది యిరవై యేళ్ళ ముగ్గురు అబ్బాయిలు కారు  దిగి పిల్లను పిలిచి మాయ మాటలు చెప్పి కారెక్కించుకున్నారట. సిటీ పొలిమేరలు దాటి వెళ్ళి వొక పల్లె చేరారు. మధ్యాహ్నమయింది, వూరికి కాస్త యెడంగా వున్న గుడిసె ముందు కారాపి దగ్గరలో వున్న టీ కొట్టు కెళ్ళారు.

 

యిద్దరు కొట్లో వున్న చిన్న ట్వ్ లో వీళ్ళెత్తుకు పోతున్న పాప ఫొటో చూపుతూ, “యీ పాప పేరు ధాత్రి, ముగ్గురు వ్యక్తులు యీ బిడ్డను కారెక్కించుకుని వెళ్ళారు. పాపను చూసిన వాళ్ళు దగ్గరలోని పోలీసు స్టేషన్ లో తెలపండి. పాప పేరెంట్స్ లక్ష రూపాయలు బహుమతి యిస్తారు" అంటూ పదే పదే చెప్తున్నారట.

 

అదిచూసి వాళ్ళిద్దరూ టీ తీసుకోకుండా వెళ్ళిపోయారట. కారుదగ్గరున్న వో గుడిసె ముందు కూర్చున్న ముసలమ్మ దగ్గరకు పాపను తీసుకెళ్ళి “అవ్వా, పాపకు జ్వరంగావుంది దగ్గరలో మందుల షాపుందా” అని అడిగారు. 

 

“యీ పల్లెకొంపలో మందుల షాపేడ వుంటాది నాయనా, పై సందులో వుండే అంగట్లో జరం గోలీ లిస్తారు పోండి. యెండలో జరంతో వుండే బిడ్డనెందుకు  తిప్పతారు. యీ అరుగు మీద పండబెట్టండి. నే జూసుకుంటాను. అయ్యో బిడ్డకు తెలివిలేదే, నీళ్ళు తెస్తానుండండి” అంటూ లోపలి కెళ్ళింది. అవ్వ నీళ్ళచెంబుతో తిరిగొచ్చేసరికి  పాప వొక్కతే వుంది. అవ్వ పాపకు సపర్యలు చేసి, లేపి కాస్త గంజి తాపి, వెళ్ళినవాళ్ళు యెంతసేపటికీ రాక పోయే సరికి చుట్టుపక్కలవాళ్ళను పిలిచి బిడ్డను పోలీసులకప్పగించారు.

 

తల్లిని ధ్యానించుకుంటూ నేను హైదరాబాదు చేరే సరికి బిడ్డ యింటికి చేరింది. మరునాడు మేము పల్లెకు వెళ్ళి, ఆ ముసలమ్మను సాక్షాత్తూ దుర్గా మాతగా భావించి నమస్కరించాము. మా అల్లుడు ఆమెతో బ్యాంకు అక్కవుంట్ ఓపెన్ చెయ్యించి లక్షరూపాయలు అందులో పెట్టారు.

 

పాపను రక్షించింది ఆ తల్లేకదా అంటూ రెండుచేతులెత్తి నమస్కరించారు శాస్త్రిగారు .

 

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ ||

 

        శ్రీ మాత్రే నమః

 

        *****

bottom of page