top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

థేంక్యూ మామ్ (అనువాదం)

Langston Hughes

Langston  Hughes

Krishnaveni

క్రిష్ణవేణి

Bio

ఈ కథ 1958 లో ప్రచురించబడింది. లాంగ్స్టన్ హ్యూసే 20 వ శతాబ్దం యొక్క హార్లెం రినైసాన్స్ కాలపు రచయిత. ఆయన ఆఫ్రికన్ అమెరికన్ జీవితాల/అనుభవాల గురించి రాసేవారు.

భారీకాయం గల ఆ స్త్రీ చేసంచీలో- సుత్తీ, మేకులూ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. సంచీ పట్టీ పొడుగ్గా ఉండి, ఆమె భుజంమీద వేళ్ళాడుతోంది. రాత్రి ఇంచుమించు పదకొండు గంటలయింది. ఆమె వొంటరిగా నడుస్తున్నప్పుడు, ఒక కుర్రాడు ఆమె వెనుక పరిగెత్తి, ఆమె సంచీని లాక్కోడానికి ప్రయత్నించాడు. కుర్రాడు వెనుకనుంచి లాగిన మొదటిసారే, చేసంచీ పట్టీ తెగింది. కానీ, అతని బరువూ, చేసంచీ బరువూ కలిసి, కుర్రాడి బాలన్స్ కోల్పోయేలా చేశాయి. తను ఆశించినట్టుగా వెంటనే పారిపోలేకపోయి, అబ్బాయి పక్కబాటమీద వెల్లకిలా కింద పడ్డాడు. అతని కాళ్ళు పైకి లేచాయి. ఆ లావాటి స్త్రీ వెనక్కి తిరిగి, గురిచూసి నీలం జీన్స్ వేసుకుని ఉన్న అతని పిరుదుల మధ్య తన్ని, ఆ తరువాత కిందకి వంగి, కుర్రాడి చొక్కా ముందు భాగం పట్టుకుని పైకెత్తి, అతని పళ్ళు కదిలేలా అతన్ని కుదిలించింది.

 ఆ తరువాత, “అబ్బాయీ, నా చేసంచీ ఎత్తి, ఇలా పట్రా” అంది. ఆమె ఇంకా కుర్రాడిని పట్టుకునే ఉండి, తన సంచీ ఎత్తడానికి అవసరం అయినంతగా మాత్రం, కిందకి వంగింది. ఇప్పుడామె “ఊ, ఇప్పుడు చెప్పు. నీకు సిగ్గు వేయడం లేదూ?” అడిగింది.

తన చొక్కా ముందుభాగం ధృడంగా ఆమె పిడికిట్లో ఉండటంవల్ల, కుర్రాడు “వేస్తోంది మామ్” అన్నాడు.
“ఎందుకలా చేయాలనుకున్నావు?” స్త్రీ అడిగింది.
“కావాలని చేయలేదు. “కుర్రాడు చెప్పాడు.
“అబద్ధం చెప్తున్నావు.’ అందామె.

అప్పటికే, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు- ఆగి, చూడ్డానికి వెనక్కి తిరుగుతూ, కొందరు చూస్తూనూ, నిలబడ్డారు.
“నిన్ను వదిలిపెడితే కనుక, పారిపోతావా?” అడిగింది స్త్రీ.
“అవును మామ్.“ అన్నాడు కుర్రాడు.

“అయితే, నిన్ను వదలను.” ఆమె అతన్ని వదిలిపెట్టలేదు.
“మామ్, సారీ.“ చిన్నగా చెప్పాడు కుర్రాడు.

“హ్మ్, నీ మొహం మురికిగా ఉంది. మొదట, నీ మొహం శుభ్రం చేయాలని ఉంది. మొహం కడుక్కోమని నీకు చెప్పేవారెవరూ లేరా మీ ఇంట్లో?”
“లేరు మామ్.” అబ్బాయి.
“అయితే, ఈ సాయంత్రం అది శుభ్రపడుతుంది.” ముందుకి నడుస్తూ, బెదిరి ఉన్న కుర్రాడిని తన వెనుకాతలే ఈడుస్తూ చెప్పింది స్త్రీ.

 

అతనికి పద్నాలుగో, పదిహేనో ఏళ్ళున్నట్టు కనిపిస్తున్నాడు. టెన్నిస్ జోళ్ళూ, నీలం రంగు జీన్సూ వేసుకుని- దుర్బలంగా, నాజూకుగా, లొంగదీయగల మొక్కలా కనిపించాడు.
“నువ్వు నా కొడుకువయి ఉంటే కనుక- మంచికీ, చెడుకీ మధ్య ఉన్న తేడా బోధించేదాన్ని. ఇప్పటికి నేను చేయగలిసే పనల్లా, నీ మొహం కడిగించడమే. ఆకలిగా ఉందా?” అడిగింది.
“లేదు మామ్, మీరు నన్ను వదిలేస్తే చాలు.” ఈడ్చబడుతూ వచ్చిన కుర్రాడు చెప్పాడు.

“నేనా మలుపు తిరిగినప్పుడు, నిన్నేమైనా హైరానా పెట్టానా?” ఆవిడ అడిగింది.
“లేదు మామ్ “


“కానీ, నువ్వు నాతో పరిచయం పెంచుకున్నావు. ఆ పరిచయం ఇంకొంతకాలం పాటు సాగదని నువ్వనుకుంటే కనుక, ఇంకోసారి ఆలోచించుకో. నీ గురించి నేనేమనుకుంటున్నానో చెప్పడం పూర్తయిన తరువాత, శ్రీమతి లుయెల్లా బేట్స్ వాషింగ్టన్ జోన్స్‌ని నువ్వు గుర్తు పెట్టుకోబోతావు” అన్నదామె.
 కుర్రాడి మొహంమీద చెమట కారుతూ ఉండగా, అతను పెనుగులాడ్డం మొదలుపెట్టాడు. శ్రీమతి జోన్స్ ఆగి, అతన్ని తనముందుకి లాగింది. ఇటూ అటూ గుంజి, అతని చేతికింద చేయి వేసి, చుట్టూ తిప్పి అతని మెడవెనుక అరచేతిని చుట్టి, వీధిమీదిగా అతన్ని ఈడుస్తోంది.
ఆమె తన గుమ్మం వద్దకి చేరిన తరువాత, కుర్రాడిని హాల్లోనుంచి ఇంటివెనుక అమర్చిపెట్టున్న, విశాలమైన వంటింట్లోకి లాగింది. లైటు వేసి, తలుపు తెరిచే ఉంచింది. ఆ పెద్ద ఇంట్లో, అద్దెకున్న మిగతావారు నవ్వుతూ మాట్లాడుకోవడం వినగలిగాడు కుర్రాడు. వారి తలుపుల్లో కూడా కొన్ని తెరిచి ఉండటం వల్ల,- స్త్రీ, తనూ వొంటరిగా లేమని అర్థం చేసుకున్నాడు.


“నీ పేరేమిటి?” అడిగిందామె.
‘రోజర్.” సమాధానం చెప్పాడు.

 “మంచిది రోజర్, ఆ సింక్ వద్దకి వెళ్ళి మొహం కడుక్కో.” అంటూ, ఆఖరికి అతన్ని వదిలిపెట్టిందామె. రోజర్ తలుపువైపు చూసి, స్త్రీవైపు చూసి, మళ్ళీ తలుపు వైపు చూసి, నీళ్ళతొట్టిని సమీపించాడు.
“వెచ్చటినీళ్ళు వచ్చేవరకూ నీరు కారనీ. ఇదిగో, శుభ్రమైన తువ్వాలు తీసుకో.” అందామె.

“నన్ను జైలుకి పట్టికెళ్తారా?” సింక్ మీదగా వంగుతూ, అడిగాడు కుర్రాడు.
 “ఆ మొహంతో, నేను నిన్ను ఎక్కడకీ తీసుకు వెళ్ళను. నేనేమో, ఏదో కొంచం తినడానికి వండుకుందామనుకుంటూ, ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుంటే, నువ్వు నా చేసంచీ లాక్కున్నావు. ఇంతాలశ్యం అయిపోయింది. నువ్వూ, ఏమీ తిని ఉండవు కదూ? ” అడిగింది.
“మా ఇంట్లో ఎవరూ లేరు.” చెప్పాడు అబ్బాయి.
‘అయితే మనం భోజనం చేద్దాం. నీకు ఆకలిగా ఉందనుకుంటాను. ఉండే ఉంటుందిలే. నా చేసంచీ లాక్కోడానికి ప్రయత్నించావుగా!” చెప్పింది స్త్రీ,
 “నీలపు స్వీడ్ జోళ్ళ జత కావాలనుకున్నాను.” చెప్పాడు కుర్రాడు.
“మంచిదే కానీ, ఆ స్వీడ్ బూట్లేవో కొనుక్కోడానికి నా సంచీ లాక్కోనవసరం లేదు. నన్ను అడిగి ఉండవలిసింది.”
అంది శ్రీమతి లుయెల్లా బేట్స్ వాషింగటన్ జోన్స్.
“మామ్?“


మొహంమీదనుంచి నీరు కారుతూ ఉండగా, కుర్రాడు ఆమెవైపు చూశాడు. ఒక సుదీర్ఘ విరామం. చాలా సుదీర్ఘమైనది. అతను తన మొహం తుడుచుకుని, మరింకేం చేయాలో తెలియక, మళ్ళీ తుడుచుకున్న తరువాత, ‘ఇంకిప్పుడేమిటో!’ అనుకుంటూ, ఆమె వైపు తిరిగాడు. తలుపు తెరిచుంది. తను హటాత్తుగా, దాన్నుండి హాల్లోకి పారిపోవచ్చు. తను పరిగెత్తవచ్చు, పరిగెత్తొచ్చు, పరిగెత్తవచ్చు!
స్త్రీ తన పగటి మంచం మీద కూర్చునుంది. కొంతసేపటి తరువాత అంది, “ఒకప్పుడు, నేనూ చిన్నదాన్నే. నేను పొందలేకపోయినవాటిని నేనూ కావాలనుకున్నాను.“


మరొక దీర్ఘ విరామం. కుర్రాడి నోరు తెరుచుకుంది. తరువాత, తను ముఖం చిట్లించానని తెలియకుండానే మొహం చిట్లించాడు.
స్త్రీ అన్నది, “హ్మ్, నేను ‘కానీ’ అంటాననుకున్నావు కదూ? ‘కానీ, నేను జనాల సంచీలు లాక్కోలేదు’ అని నేను చెప్తాననుకున్నావు. సరే, నేనలా చెప్పబోలేదు.” విరామం. మౌనం. “నీకు చెప్పలేకపోయే కొన్ని పనులు నేనూ చేశాను నాయనా. దేవుడికి ముందే తెలిసి ఉండకపోతే కనుక, నేనది ఆయనకీ చెప్పలేను. కాబట్టి, మనం తినడానికి ఏదో సిద్ధం చేసేవరకూ నువ్వు కూర్చో. చూడదగ్గట్టుగా ఉండేలా,- ఆ దువ్వెన తీసుకుని, నీ జుట్టు సరిచేసుకో.”

గదిలో ఇంకొక మూల, ఒక తెర చాటున- ఒక గాస్ ప్లేటూ, ఐస్ బాక్సూ ఉన్నాయి. శ్రీమతి జోన్స్ లేచి, తెర వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కుర్రాడు పారిపోబోతాడేమోనని ఆమె చూడనూలేదూ, తన పగటి మంచంమీద తను వదిలిన తన చేసంచీ గురించీ పట్టించుకోలేదు. కానీ, ఆమె కంటికొసనుంచి తనని సులభంగా చూడగలిగేలా, అబ్బాయి గది దూరపు కొసన కూర్చుండేలా జాగత్తపడ్డాడు. ఆమె తనని విశ్వసించలేదన్న నమ్మకం అతనికి లేదు. ఇప్పుడు, తనని సంశయించడం అతనికి ఇష్టంలేకపోయింది.


“బహుసా- పాలో, ఇంకేవో తెచ్చేటందుకు, దుకాణానికి ఎవరైనా వెళ్ళే అవసరం ఉందా?” అడిగాడు కుర్రాడు.
“నీకు తీపి పాలు కావాలంటే తప్ప, అవసరం లేదు. ఇక్కడ, నా దగ్గరున్న డబ్బాపాలతో నీకు కోకో చేద్దామనుకున్నాను.” చెప్పిందామె.
“అది చాలు.” అన్నాడు కుర్రాడు.


చల్లపెట్టెలో ఉన్న కొన్ని పెద్ద చిక్కుళ్ళనీ, పందిమాంసాన్నీ వేడిచేసి కోకో తయారుచేసి, టేబిల్ సిద్ధం చేసిందామె. కుర్రాడెక్కడ ఉంటాడని కానీ, అతనివాళ్ళెవరని కానీ, లేక అతన్ని ఇబ్బంది పెట్టే ఏ వివరాలూ ఆమె అడగలేదు. దానికి బదులు, వారు భోజనం చేస్తుండగా- ఆమె చాలాసేపటివరకూ తెరిచి ఉండే హోటెల్ బ్యూటీ షాప్‌లో తన ఉద్యోగం గురించీ, అక్కడ పని ఎలా ఉంటుందో అనీ, అక్కడికి వచ్చి పోతూ ఉండే బ్లాండ్స్, రెడ్ హెడ్స్ గురించీ, స్పానిష్ ఆడవాళ్ళ గురించీ అతనికి చెప్పింది. ఆ తరువాత తన పది సెంట్ల కేకులో సగభాగం కోసి, అతనికిచ్చింది.
“మరి కొంచం తిను నాయనా.”- అంది.

వారి భోజనం పూర్తయాక, ఆమె లేచి, “ఇవిగో, ఈ పది డాలర్లూ తీసుకుని, నీ నీలం రంగు స్వెడ్ జోళ్ళు కొనుక్కో. మరోసారి నా చేసంచీ కానీ, ఇంకెవరిది కానీ కొట్టే పొరపాటు చేయకు. దొంగిలించిన డబ్బుతో కొనుక్కునే జోళ్ళు వాటికున్న విలువకన్నా ఎక్కువైన కష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలి. కానీ, ఇప్పటినుంచీ ఇంక సరిగ్గానే ప్రవర్తిస్తావని ఆశిస్తాను బాబూ.” చెప్పింది.


ఆమె అతన్ని హాల్ నుంచి తలుపువరకూ తీసుకెళ్ళి, దాన్ని తెరిచింది. వీధిలోకి చూస్తూ, “గుడ్ నైట్, నీ ప్రవర్తన సరిదిద్దుకో అబ్బాయీ!” అంది.
 శ్రీమతి లుయెల్లా బేట్స్ జోన్స్‌కి “థేంక్యూ మామ్“ అన్నదానికన్నా మరింకేదైనా చెప్దామనుకున్నాడు కుర్రాడు. కానీ, ఏ అలంకారాలూ లేని వరాండా మెట్ల మలుపు వద్ద వెనక్కి తిరిగి, గుమ్మంలోనున్న భారీ స్త్రీని చూసినప్పుడు అతని పెదవులు కదిలినప్పటికీ, అతనది కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. ఆ తరువాత, ఆమె తలుపు మూసేసింది. అతనామెని మరెన్నడూ చూడలేదు.

.

***

క్రిష్ణ వేణి

ఆంగ్ల సాహిత్యం లో మాస్టర్స్ చేసిన క్రిష్ణ వేణి గారు జర్నలిజం లోనూ పీజీ డిప్లొమా చేసారు. ఎనిమిదేళ్ళు అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లో Broadcaster గా , నిర్మాతగా వ్యవహరించారు. విహంగ పత్రికలో ‘క్రిష్ణగీత”  శీర్షిక కింద 25 నెలల్లో 30 కాలమ్స్ రాశారు. ఏడు కథలూ, ఒక అనువాదపు కథ, రెండు సినిమా రివ్యూలూ, మరి రెండు కాలములూ- మిగతా పత్రికలకి రాశారు.

IIMC (Indian Institute of Mass Communications) విద్యాసంస్థ  నుంచి Film Making కోర్సులో సర్టిఫికేట్ పొందారు.

***

Krishnaveni
Thank you, M'AM langston hughes

Langston Hughes (1902 - 1967)

 

He is best known for the literary art form of jazz poetry, and for his work during the Harlem Renaissance. He was an American poet, social activist, novelist, playwright, and columnist.

bottom of page