top of page

సంపుటి 1    సంచిక 4

కథా మధురాలు

లెట్స్ గో ఇండియా

Syamala Dasika

శ్యామలాదేవి దశిక

ఏమిటీ… చేతిలో న్యూస్ పేపరు పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నారు? మనం ఇండియా వచ్చి మూడు నెలలై పోయింది. హైదరాబాద్ లో మా ఆఖరి చెల్లిలింట్లో నెలరోజులు... గుంటూర్లో మీ తమ్ముడింట్లో నెలరోజులు మకాం పెట్టాం. అక్కడ్నించి బంధువుల్ని చూసినట్టు ఉంటుంది... ఊళ్ళు  చూసినట్టు ఉంటుందంటూ  బెంగుళూరు...  చెన్నై...  వైజాగ్...  తిప్పారు. ఆ తర్వాత కాకినాడ వెళ్ళి మీ అక్కగారిని చూసొచ్చాం. ఇక ఈ తిరుగుళ్ళు నావల్లకాదు. మన గృహప్రవేశం ఎక్కడో చెప్తే నేను తట్టా, బుట్టా చూసుకోటం మొదలెట్టుకుంటాను. నా తిప్పలేవో నేను పడాలికదా?
ఏమిటీ...  అంతా అయోమయంగా ఉందా.. ఇక్కడి ఈ లైఫ్ స్టైలు... ఈ హడావిడి… గందరగోళం...  ఈ ధరలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయా?! ఇదంతా మనం తట్టుకోగలమా అని ఆలోచిస్తున్నారా? 
చించండి... చించండి...  బాగా చించండి!  టొమేటోలు కిలో రెండో౦దలు... ఉల్లిపాయలు మూడొందలు... ఇంటద్దె ఇరవైవేలు...   మామూలు జాకెట్టు కుట్టుకూలి వెయ్యిరూపాయలు!  మీకు కళ్ళోక్కటే… నాకయితే అన్నీ తిరుగుతున్నాయి!
ఖర్చు మాట ఎలా ఉన్నా ఇండియాలో ఆ వాతావరణం, ఆ పద్ధతులు మీకు సరిపడవని నేను మొదట్నించీ అంటూనే ఉన్నాను. అసలు ఇక్కడ ఉంటున్నవాళ్ళే ఇప్పటి మార్పుల్ని తట్టుకోలేక పోతుంటే, నలభై అయిదేళ్ళ కిందట దేశం వదిలి వెళ్ళిన మీ వల్ల ఏం అవుతుందిటా? అమెరికా వచ్చేసిన ఏడేళ్లకు ఇండియా వెళ్లారు. ఆ తర్వాత అయిదేళ్ళకోసారి వెళ్తూ వచ్చారు. అక్కడ్నించి పెళ్ళిళ్ళకు, పెద్దవాళ్ళకు బాగులేనప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అసలు వెళ్ళటమే మానేసిన మీకు, ఇప్పుడు అక్కడ ఏం పని అని అడిగానా లేదా?
రిటైర్ అయినప్పటినుంచీ...  ఇన్నాళ్ళుగా  అక్కర్లేని  ఇండియా ఉన్నట్టుండి ఇప్పుడు  కావాల్సోచ్చింది. ఆ పాతరోజుల్ని... ఆ పాత సరదాల్ని  ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ అందిపుచ్చేసుకుందాం అనుకోటం అత్యాశే అవుతుంది. ఏమన్నా అంటే ఇన్నేళ్ళు అయితే ఏంటీ... ఎంతైనా అది నేను పుట్టిపెరిగిన  గడ్డ. “నా మట్టి - నా నీళ్ళు” అంటూ చంద్రబాబు లాగ చేతులు తిప్పుకుంటూ ఉపన్యాసం ఇచ్చారు. మన అమెరికాలో అంతా టూ క్వయిటు...  అదే ఇండియాలో అయితే ఎంచక్కా పిచ్చుకల కిచకిచలు...   పక్కింట్లో నుంచి ఘుమఘుమలు... ముంగిట్లోనే మువ్వొంకాయలు...  సందడే... సందడి అంటూ చంక లెగరేసుకుంటూ ఓ సంబరపడిపోతూ వచ్చారు! తీరా వచ్చాక ప్రతిదానికీ తెల్లమొహం వెయ్యడం, అన్నిటికీ ఆశ్చర్య పోవడం!    
ఎక్కడపడితే అక్కడ టవర్లు వెలిసాక సెల్ఫోన్ల గోలే తప్ప పిచ్చుకలు లేవు...  కిచకిచలు లేవు అంటే, నా మాట నమ్మారా?  పక్కిళ్ళల్లోనుంచి పులావ్ వాసనలు, పాయసాల ఘుమఘుమల సంగతేమోకానీ...  ఎక్కడంటే అక్కడ సందులేకుండా కట్టిపారేస్తున్న అపార్ట్మెంట్స్ తాలూకు దుమ్ము, ధూళితో అందరికీ ఎలర్జీలు...  ఆయాసాలు వస్తున్నాయి. ఇక వాకిట్లో కొస్తే వంకాయలు దొరికే మాట నిజమే అయినా వాటితో పాటు అరుపులు...  మోతలు కూడా భరించాలి.
అన్నట్టు అరుపులంటే గుర్తొచ్చింది. ఇందాక ఫోన్ లో సుజాతతో మాట్లాడుతుంటే  బావగారు ఎలా ఉన్నారూ? అంటూ ప్రత్యేకంగా అడిగింది! “పాత సామాన్లు”  కేక వినిపించగానే మిమ్మల్నే తలుచుకుంటూ ఒకటే నవ్వుకుంటున్నారుట.
ఏమిటి...  ఆ గందరగోళం...   గడబిడలో  మీకు అలా వినిపించింది అంటారా?
ఆమాటా నిజమేలెండి...  రవి వాళ్ళు ఉండే ఆ రోడ్డులో ఇప్పుడు రద్దీ బాగా పెరిగిపోయింది. మీరు, మీ చెల్లెళ్ళు దేశం వదిలేసినా రవి మాత్రం ఉన్నచోటే ఉండిపోయాడు. మీ ఇంటి వారసత్వం చక్కగా పుణికిపుచ్చుకున్నాడు! మీ అమ్మానాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడూ అలాగే ఉంది. ఇంట్లో కొడుకు - కోడలు, మనవలు... వేళాపాళా లేకుండా రవి కోసం వచ్చే క్లైంట్స్...  గలగలా కబుర్లు చెప్పే వంటావిడతో...   ఇల్లు సందడి సందడిగానే ఉంటుంది! ఇదికాక  బయట రణగొణ ధ్వని… హడావిడి! ఎప్పుడూ ఏవో ఎడ్వటైజ్మెంట్లు... అమ్మకాలు... అరుపులు వినిపిస్తూనే ఉంటాయ్. రోజూ పొద్దున్నే “పాత కుర్చీలు కొంటాం… పాత బల్లలు కొంటాం” అంటూ బండిమీద మైకులో పాత సామాన్లు కొనేవాడు వస్తువులన్నీ  ఏకరువు పెడుతూ ఉంటాడు. ఆ వరసలో వాడు పాత పళ్ళాలు కొంటాం... పాత మూకుళ్ళు కొంటాం అని అరుస్తుంటే... మీరెమో పాత పెళ్ళాల్ని కొంటాం...  పాత మొగుల్నికొంటాం అని అనుకున్నారు!
చిత్తూరి నాగయ్య సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలతో ఆగిపోయిన మీకు ఓ కొత్తసినిమా చూపించాలంటే భయం. క్షణక్షణానికి వాడేం అన్నాడు… వీడేం అన్నాడు… హీరోయిన్ ని పట్టుకుని ఆ అమ్మాయెవరు అంటూ నా బుర్ర తినేస్తారు.  అలాంటి మీకు ఈ రోజుల్లో ఇండియాలో...  అదీ ఆంధ్రదేశంలో...  అందులోనూ నడిరోడ్డుమీద అమ్మేవాళ్ళ వాళ్ళ మాటలేం తెలుస్తాయి? ఎలా అర్ధమవుతాయిటా?! పోనీ ఆ అనేదేదో నాతో అనచ్చుగా?  పోయిపోయి మీ మరదలితో అనేసారు. దాంతో ఇంటిల్లిపాదికి తెలిసిపోయింది!
ఆస్తమా... బీపి ఉన్నాయని రవిని  అవి తినద్దూ ఇవి తినద్దూ అని సుజాత అన్నప్పుడల్లా “ఇదిగో నన్నిలా కాల్చుకు తిన్నావంటే “నువ్వు పా...  త పెళ్ళానివని సాయిబు కిచ్చేసి, ఏంచక్కా కొత్త పళ్ళాన్ని తెచ్చేసుకుంటా” అని మీ తమ్ముడు బెదిరిస్తున్నాడుట! ఇంత గొప్ప ఐడియా ఇచ్చిన మా అన్నయ్యని మెచ్చుకోవాలి, ఎంతైనా అమెరికా బుర్ర కదా అంటూ సుజాతను ఆటపట్టిస్తున్నాడుట!
ఇదిగో...   మీరెంత తెలివిగలవారైనా  తెలుగు దేశంలో ఉండటం అంటే అంత తేలిక కాదు. ఇక్కడుండాలంటే మీరు, నేను చాలా మారాలి...  చాలా నేర్చుకోవాలి... తెలుసుకోవాలి.
మా పెద్ద చెల్లిలింటి కెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా? చాలా ఫాషన్ బుల్ గా ఉన్న అమ్మాయి స్కూటర్ మీద వచ్చి గేటు తీసుకుని ఫోన్ లో చూసుకుంటూ లోపలికొచ్చింది. అక్కడే హాల్ లో ఉన్న నేను “రండి మా చెల్లెలు లోపలుంది పిలుస్తాను” అంటూ కుర్చీ చూపించాను. ఆ అమ్మాయి నా మాటలేవీ పట్టించుకోకుండా నన్ను ఎగాదిగా చూసి సరాసరి లోపలికెళ్ళిపోయింది. ఆ ఆమ్మాయి ఏం చెప్పిందో ఏమిటో కాసేపటికి మా సునీత నవ్వుకుంటూ వచ్చింది! ఆ అమ్మాయి వాళ్ళ పనిమనిషిట. పదోక్లాసు వరకు చదువుకుందిట. ఎక్కువిళ్ళలో పనిచెయ్యటానికి వీలుగా ఉంటుందని టూవీలర్ కొనుక్కుందిట. పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో చదివిస్తోందిట. కొత్త సినిమా పాటలు రావడం ఆలస్యం, టక్కున టోన్ రింగ్ మార్చేస్తుందిట! పెట్టుకున్న కొత్తల్లో ఈ అమ్మాయి సంగతి తెలీక సునీత “నిన్న సాయంకాలం పనికి రాలేదేం... నీ కోసం ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా?” అని అంటే  ఆ అమ్మాయి వెంటనే  “గదేంది మేడం.. నో కమింగూ అని సెల్ కి కొట్టినాగంద లుక్ జెయ్యలె?” అందిట!
మా చెల్లెలు అంది “అక్కా... నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా శ్రీదేవిని అడుగు చక్కగా చెప్తుంది. లేటెస్టు ఫాషన్...  కొత్త సినిమాలు... ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది... ఇవ్వాళా రేపు జరుగుతున్న మోసాలు వగైరా అన్నీ నాకంటే దానికే బాగా తెలుసు” అని ఆ పనమ్మాయి గురించి చెప్తుంటే సంతోషంతో పాటు ఎంత ఆశ్చర్య పోయానో!! అన్ని విషయాల్లో ఎన్నేసి మార్పులో? భాషలో మార్పు..తిండిలో మార్పు... పద్ధతుల్లో మార్పు... కొత్త కొత్త జోకులు.. కొత్త మాటలు అంతటా చూస్తూనే ఉన్నాంగా?
పూర్వం బాగా చదువు కున్నవాళ్ళు అవసరమైనప్పుడు ఇంగ్లీషులో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా పసిపిల్ల దగ్గరనుంచి ముసలమ్మ దాకా అందరూ ఇంగ్లీషుని సొంతం చేసేసుకుంటున్నారు.ఒక్కొక్క సారి వింటుంటే నవ్వు వస్తుంది! మా పెద్ద వదిన మనవళ్ళని రైసు ఈటూ... హండు వాషు... బుక్కు రీడు... అంటూ ఇంగ్లీషులో మాట్లాడేసానని మురిసిపోతూ ఉంటుంది! ఈ మధ్యనే కొడుకు పెళ్ళి చేసిన మా పిన్ని కూతురు వాణితో, ఏమే! కొత్త దంపతులు ఎలా ఉన్నారని నేను సరదాగా అడిగితే అది “ఏమిటోనే అక్కా... పెళ్ళి అయి ఆర్నెల్లు అయినా, ఇంకా ఇద్దరికీ సెట్టు కావడం లేదు” అంది! అందరి మాటల్లో సినిమా ప్రభావం... టి వి ప్రభావం బాగా ఉంది. మనకు తెలిసిన మాటలు… జోకులు ఇప్పుడు ఎవ్వరూ వాడటంలేదు.
మనం చదువుకునే రోజుల్లో అన్నింటికీ “గాడిద గుడ్డేం కాదూ” అనేవాళ్ళం. ఇప్పుడు అందరూ ప్రతిదానికీ “తొక్కేం కాదూ” అంటూ కొట్టిపారేస్తూ ఉంటారు.  చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు “రేపు పాఠం అప్పచెప్పక పోయావో తాట వలిచేస్తా “ అంటూ బెత్తం చూపించేవారు. మా పెదనాన్న పిల్లలం అల్లరి చేస్తుంటే “ ఇదిగో నేను వచ్చి మీ అందరి వీపులు విమానం మోత మోగిస్తా” అని అనేవారు. ఇప్పుడు జనాలు “ నీ బెండు తీస్తా “ అంటూ బెదిరిస్తూ ఉంటారు. మన రోజుల్లో “ ఏమి అనుకోకు... తమాషాగా అన్నాను... ఆందోళన/ బెంగ పడకు” లాంటి మాటల్ని సందర్భాన్ని పట్టి వాడేవాళ్ళం. ఇప్పుడు వాటన్నిటికి బదులుగా “ లైట్ తీస్కో “ అనేస్తున్నారు. పూర్వం అన్నింటిని పొదుపుగా వాడుకుని భాషని దండిగా వాడుకునేవారు. ఇప్పటి వాళ్ళు అన్నీ విరివిగా ఖర్చుపెడుతూ తెలుగు భాషని మాత్రం చాలా పొదుపుగా వాడుకుంటున్నారు!
మొన్న మీ మావయ్యింట్లో, వాళ్ళ కోడలు జయ టీ వి చూస్తూ ఉన్నట్టుండి “నాకు తెలుసు.. వీడు తెలుగు తీర్ధం పుచ్చేసుకుంటాడని” అంటే నేను అదేమిటి ఇక్కడ అన్నింట్లో తేడాలున్నట్టే తీర్ధంలో కూడా తెలుగు తీర్ధం...  అరవ తీర్ధం అని రకాలు ఉన్నాయా అని అనుకున్నా. తీరా చూస్తే ఓ ప్రతిపక్ష రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి దూకేసాడని దాని అర్ధంట! అదే తెలంగాణా పార్టీ అయితే గులాబి తీర్ధం అని అంటారుట! టోపీలు పోయి కండువాలు వచ్చాక పదవికోసం తరచు పార్టీ మార్చే వాళ్ళని “వీడు రోజుకో కండువా మార్చేస్తుంటాడు!” అని తేలిగ్గా అనేస్తూ ఉంటారు! 
మాటలతో పాటు లైఫ్ స్టైల్ కూడా బాగా మారిపోయింది. అందరికి “వెస్ట్రన్ కల్చరు వ్యామోహం” ఎక్కువైపోయింది! పండగ టైములో మనం రైల్లో వస్తున్నప్పుడు చూసాంగా. స్కూళ్ళకి సెలవులేమో చాలామంది పిల్లల్తో ప్రయాణాలు చేస్తున్నారు. పిల్లలు అందరూ విడియో గేములు ఆడుకోవడం... వెస్ట్రన్ మ్యూజిక్ వినడం... అమ్మానాన్నలు కూడా పిల్లల్తో ఇంగ్లీషులోనే మాట్లాడ్డం చూసి ‘ఇది రాజమండ్రీ వెళ్ళే రైలేనా’ అని మీకు అనుమానం కూడా వచ్చింది. గుర్తుందా?! నా పక్కన కూర్చున్నాయనతో మాటల్లో నేను మన మనవడు ఫ్లూటు వాయిస్తాడని, మనవరాలు కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నదని చెప్తే ఆయన వెంటనే “అమెరికా వెళ్ళి కూడా మీకు ఇదేం బుద్ధి?” అన్నట్టు చూసాడు!           
నా ఫ్రెండ్ అంజలి చాలా ఏళ్ళు తెలుగు టీచర్ గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయింది. నేను “మీ అబ్బాయి పిల్లలకి తెలుగు బాగా చదవడం, రాయడం వచ్చా’ అని అడిగితే, ‘అది సడేలే...   వాళ్లకు మాట్లాడటమే రాదు, ఇక చదవడం.. రాయడం కూడానా’ అంది!  నా మనవలకు మన మాతృభాష రావడానికి… తెలుగులోని తియ్యదనం తెలియడానికి వాళ్ళేమన్నా అమెరికాలో పుట్టి పెరుగుతున్నారా? అంటూ జోకేసింది!      
ఏమిటీ...  మీరు మనసులో ఊహించుకున్నదానికి ఇక్కడ చూస్తున్న దానికి ఎక్కడా పొంతన లేదా... తిరిగి వెళ్ళిపోవటం మంచిదేమో అని అనిపిస్తోందా?   
అమ్మయ్యా!  ఈ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను.అందుకే మన వాళ్ళు, ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుండమన్నారు. ఆనాడు అమెరికా వెళ్తే, జీవితం సుఖంగా ఉంటుందని పడిపోయాం. ఇన్నేళ్ళు ఆక్కడి సౌకర్యాలు… భోగభాగ్యాలు అన్నీ హాయిగా అనుభవించాం. ఇప్పుడు వయసు మీద పడి ఓపికలు  తగ్గిపోగానే ఏదన్నా అయితే మనల్ని అమెరికాలో ఎవరూ చూడరన్న భయం పట్టుకుంది మీకు. వెంటనే మీ కళ్ళకు భారతదేశం భేషుగ్గా కనిపించింది! ఇప్పుడు దేశం వెళ్తే  దర్జాగా బతకొచ్చని ఇక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఆప్పటి సుఖంకోసం అమెరికా. ఇప్పటి సుఖం కోసం ఇండియా! అందరికీ ఎక్కడున్నా సౌకర్యాలు… సుఖాలు కావాలి కానీ ఇబ్బందులు...  సమస్యలు అక్కర్లేదు. అందుకే ఇక్కడి మార్పులు, ఇబ్బందులు చూసి భయపడుతున్నారు. నా ప్రశ్నకు ముందు సమాధానం చెప్పండి. ఇబ్బందులు కష్టాలు ఎక్కడ లేవుటా? మన అమెరికాలో లేవా?
ఈ నలభై ఐదేళ్ళలో అక్కడ కూడా మనం ఎన్ని మార్పులు చూడలేదు? ఎన్ని ఇబ్బందులు పడలేదు? ఎన్ని నేర్చుకోలేదు? అస్సలు ఈ భూమండలం మీద ఉన్నంతకాలం ఏ మానవుడు వీటినుంచి తప్పించుకోలేడు. దూరపు కొండలు నునుపు అని ఇక్కడ లేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నాయి. సమస్యల్ని... ఇబ్బందుల్ని జాగ్రత్తగా, తెలివిగా అధిగమిస్తూ వెళ్ళటమే మనపని. అంతేగాని గోడకు కొట్టిన బంతిలా ఇక్కడ కాదని అక్కడా, అక్కడ కాదని ఇక్కడా పరుగులెట్టటం ఏం మంచిపని చెప్పండి? అంతేకాదు మన చిన్ననాటి మధురస్మృతుల్ని అప్పటి సరదాలను మనసులో భద్రంగా దాచుకోవాలే కానీ వాటిని మళ్ళీ పొందాలని ప్రయత్నం చేస్తే అవి చేదుస్మృతులయ్యే ప్రమాదం ఉంది!
ఏమిటీ...  నేను చెప్పింది అక్షర సత్యం అంటారా?...  అర్జెంటుగా మన గూటికి వెళ్ళిపోయి యమ అర్జెంటుగా నాచేతి వంట తినాలనిపిస్తోందా మీకు?!.

oooo

Bio

శ్యామలా దేవి దశిక

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం లో పుట్టి, ప్రకాశం జిల్లాలోని బాపట్ల దగ్గర ఉన్న “చెరుకూరు” అనే పల్లెటూరులో పెరిగి రాజబాహదూర్ వెంకట్రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడా , హైదరాబాద్ లో చదువుకున్న శ్యామలా దేవి గారు వివాహం తరువాత నలభై ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు.  “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” పేరిట తెలుగు జ్యోతి, కౌముది, సుజన రంజని మొదలైన పత్రికలో ధారావాహికలు ప్రచురించారు. కుటుంబ నేపధ్యంలో అమెరికాలో దైనందిన జీవితాలని ఆహ్లాదంగా స్పృశిస్తూ సాగే “అమెరికా ఇల్లాలి ముచ్చట్లు” రెండు సంపుటాలు గా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు. శ్యామలా దేవి గారు భర్త రామకృష్ణ తో  న్యూ జెర్సీ లో నివాసం.

***

Syamala Dasika
Comments
bottom of page