top of page

సంపుటి 1    సంచిక 4

“దీప్తి” ముచ్చట్లు

గో'కులము నవ్విందీ...

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

“నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు “... ఎంతో శ్రావ్యంగా, రాగయుక్తమైన శృతిలో పద్యాలు వినవస్తుంటే తాదాత్మ్యంతో... అలాగే వింటూ కూర్చుండిపోయాను. ఆదివారం ఉదయాన్నే నిత్య వాళ్ళింట్లో వేడివేడి ఫిల్టర్ కాఫీ కి అదనంగా వాళ్ళత్తయ్య గారి నోట ఈ పద్యామృతం... ఆహా... ఎంత బావుందో ఈ ఉదయం!

 

ఇంకా సాగుతూనే ఉంది... "నవ్వు రాజిల్లెడి మోము... " ...వింటూంటే నా మోము పైనా సన్నని మందహాసమేదో  చేరింది!  ఎందుకనో.?! ఆ మోహన రూపం మదిలో మెదిలిందా?! పోతన పదవిన్యాసం పెదవులపై నిలిచిందా ... లేక తన గొంతులో తీయదనం కదిల్చిందా...! ఏదైతేనేమి! బావుందీ సమయం!

 

అంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ తో చిన్న అంతరాయం.

 

పక్కనే సండే క్రానికల్ చదువుతున్న అంకుల్- "ఒకసారి బయటెవరో చూడు వేణీ, నిత్య లోపలెక్కడో ఉంది..."

 

"న--ల్ల---ని వాడ్డు, నల్లని వాడ్...డు..." పాట ఆగి ఆగి... మెల్లిగా వినిపిస్తూండటంతో... "ఆంటీ పూజలో ఉన్నట్టున్నారు కదా, నే చూస్తాను..." అంటూ నేనూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాను.

కానీ, ఆంటీ అప్పటికే తలుపు తీసి, పాటని ఇంకా గొణుగుతున్నట్టు వల్లిస్తూనే ఉన్నారు.

అవతలి వైపుకి చూసిన నాకు అర్థమయిపోయింది.

ఆవిడ ఆ మొదటి పదం వద్దే ఎందుకు ఆగిపోయారో... పద్మనయనమ్ముల వాడు నా చెవులని ఇంకా ఎందుకు చేరట్లేదో!

 ఆవలి మనిషి మా అందరి ఇళ్ళలో,  చిన్న రిపేయిర్ అయినా ఒక్క ఫోన్ తో వాలిపోయే హ్యాండీమ్యాన్... రోనాల్డ్.

 అతను లోనికి వస్తుంటే అలాగే బొమ్మలా నిలబడి చూస్తున్నారు ఆంటీ!

 ఆంటీ అమాయకమైన కళ్ళు  ఆవిడ మనసులోని భయం, భీతి లాంటి భావాలను అస్సలు ఏమాత్రం దాచట్లేదు... అహా! దాచటానికి ఏమాత్రం ప్రయత్నించట్లేదు అంటే సబబేమో. అరసెకనులో అనుమానాలన్నీ ఆరా తీస్తూ  అడిగేస్తున్నట్టున్న ఆ చూపులు నాకయితే చాలా ఇబ్బందిగా తోచాయి. మరెందుకనో,  రోనాల్డ్ ఆవిణ్ణి గమనించాడు కానీ, అభావంగా ఉంది అతని మొహం.  ఏ  ఇబ్బందీ  కనబడలేదు. పుట్టినప్పటినుంచీ ఎన్ని ఎక్స్ రే కళ్ళు చీల్చాయో ?!  అనుమానపు చూపులు బహుశా జీవితంలో అంతర్భాగమయ్యయేమో?! అతని భాష అర్థమయ్యీ, కాని ఆంటీ చూపులు అతనిలో ఏ భావాన్ని కలిగించి ఉంటాయో చదవలేకపోయాను. తనంతట తాను తన టూల్స్ తో లోపలికి వస్తున్నాడు.

 

అంతలో నిత్య వచ్చి చెప్పింది-" నేనే పిలిచానత్తయ్యా, కొన్ని చిన్న చిన్న రిపేర్లున్నాయి. ఆదివారం కదా, ఈ రోజే ఫిక్స్ చేయిద్దామని."

 

ఆంటీ బయటకే అనేసారు..." ఏమో! ఇతడి వాలకం తేడా లేదూ? వేరే ఎవరికైనా చెప్పాల్సింది. ఇంటి ఆసుపాసులన్నీ తెలుసుకుని, మీరు లేనప్పుడు మాపై దాడి చేస్తేనో?!" నిత్య నా వైపు ఇబ్బందిగా చూసింది.

అంతలో అంకుల్ చార్జ్ తీసుకున్నారు… “ఇదిగో వేణీ, అదే పొరపాటు. నీకు నచ్చనిది వాలకం కాదు. రంగు. వాళ్ళంతా దొంగలే ఉండరు... నీ మాటలు అతడిగ్గానీ అర్థమయ్యాయంటే నిన్నూ స్యూ చేస్తాడు, తెలుసా?!" అని మొదలుపెట్టి...  రేసిజం ఎంత తప్పో......  రోసా పార్క్స్ లాంటి వారి గురించీ... ప్రెజుడీస్ గురించీ... చక్కగా... వివరంగా చెప్పుకువస్తున్నారు. అబ్బో! చాలా అబ్బురంగా అనిపించింది.

 

చెప్పొద్దూ? ఆ జ్ఞానధార చూస్తే...   అంకుల్ లో "ఐ హేవ్ ఎ డ్రీం" అంటూ ఎఫెక్టివ్ స్పీచ్ ఇస్తున్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కనబడ్డాడు, ఇంకా చెప్పాలంటే... అర్జునుడికి గీత చెబుతున్న శ్రీ కృష్ణుడూ గుర్తొచ్చాడు!

 

ఈ క్లాసు కార్యక్రమం ఆంటీ పై పని చేసినట్టే కనబడింది కూడా! అదెలా తెలుసంటారా? పని చేసుకుని వెళుతున్న రోనాల్డ్ కి ఆంటీ విప్పారిన మొహంతో బై చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పారు! ఆ దృశ్యాన్ని,  ఆ తర్వాత అంకుల్ని అడ్మైరింగ్ గా చూసాను!

 

కిడ్స్ ఫెస్టివల్ కి పిల్లలని తీసుకుని వెళుతూ, నిత్య  కూడా వస్తానంటే పికప్ చేసుకోవటానికి వచ్చాను. ఒక్క అరగంట పడుతుందని నన్నిక్కడ కూర్చోబెట్టి, పిల్లలని రెడీ చేయటానికి వెళ్ళింది నిత్య. ఆంటీని నిత్య తో పాటు చూస్తూనే ఉంటాను కానీ, అంకుల్ తో ఇలా తీరిగ్గా కూర్చుని ఎప్పుడూ మాట్లాడనేలేదు.

 

అంతలో అనుకోకుండా అసలు విషయం గుర్తొచ్చి ఆంటీ తో ..."అన్నట్టు, మీ గాత్రం మాత్రం భలే ఉందాంటీ... సంగీతం నేర్పుతుంటారా?" అన్నాను.

ఆంటీ మొహమాటంగా నవ్వి..."థ్యాంక్సమ్మా! ఏదో! అప్పుడప్పుడూ పాడుతూంటాను... సరదాకి!" అన్నారు.

అంకుల్ అన్నారు..." అలాగే అంటుందమ్మా... కానీ, అన్నమయ్య కీర్తనలు ఎంత బాగా పాడుతుందనుకున్నావు? అంతెందుకు... నీకు, నిత్యకూ ఫ్రెండ్ శ్వేత లేదూ? ఆ శ్వేత వాళ్ళ అమ్మగారు, ఈవిడా కలిసే నేర్చుకున్నారు... ఆవిడేమో చక్కగా పేద్ద గాయని గా పేరు తెచ్చుకున్నారు.  అయినా వాళ్ళ కులంలో తెలివీ, తెలివిడీ ఎక్కువే లేమ్మా. అందునా...  సంగీతం అంటే తమ సొత్తనుకుంటారు కదూ వాళ్ళు?!" ఒక్కసారిగా పక్కన బాంబు పేలినట్టు అదిరిపడ్డాను... ఇంతసేపు వర్ణ వివక్షపై అంత చక్కగా మాట్లాడిన అంకుల్ ... అసందర్భంగా వర్గాల గురించి మాట్లాడటంతో అవాక్కయ్యాను.  ఏం మాట్లాడాలో తోచక... నిత్య వస్తే బయల్దేరవచ్చని చూస్తున్నాను. మామూలుగా అయితే ...ఈ టాపిక్ వింటే  చిన్నగా నవ్వుకునేదాన్నేమో!.... కానీ, మొదట విన్న మెచ్యూర్డ్ అనాలసిస్ కి, ఈ మాటలకీ ఏ రకంగానూ పొంతన లేకపోయేసరికి మనసంతా చేదుగా మారింది.

 

మౌనంగా ఉన్న నన్ను ఆంటీ పలకరించారు- "అవునమ్మాయ్, కార్తీకమాసం వస్తుంది కదా? ఇక్కడ వనభోజనాలకవీ వెళతారా? మాకు చాలా అలవాటు..."

 

హమ్మయ్య! టాపిక్ మారినందుకు నాకూ రిలీఫ్ గా అనిపించింది. ఉత్సాహంగా మొదలుపెట్టాను... "అవునాంటీ... ప్రతీసారి అందరం కలిసి వెళతాము ... ఈసారీ వెళదాము. పిల్లలు కూడా పిక్నిక్ అంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. సరదా గా ఉంటుందాంటీ..."  నా ధోరణిలో నేను చెప్పుకుపోతూంటే... అంకుల్ అడిగారు..." ఓ, అయితే మీరూ మా వాళ్ళేనా? సంతోషమమ్మాయ్. చూస్తూనే అనుకున్నాను. ఆ మాటతీరూ అదీ..." నేను మళ్ళీ అవాక్కయ్యాను? 'మా వాళ్ళేనా' అంటారేంటీ? మేమెపుడూ పరాయిగా ఎవరితోనూ ఉండము కదా?

 

నేనలా అయోమయంగా అవాక్కవుతూనే ఉన్నాను... మళ్ళీ ఆయనే చెప్పారు..."మొన్న గుడిలో ఒకబ్బాయి

కలిశాడమ్మా! ఆ అబ్బాయి పేరు శ్రీకరట. మనవాళ్ళేనట. మన కులసంఘానికి అధ్యక్షుడట. నన్ను పరిచయం చేసుకుని మరీ వనభోజనాలకి ప్రత్యేకంగా ఇన్వైట్ చేసాడమ్మా . చాలా గ్రాండ్ గా అవుతాయట కదా...! సినిమా స్టార్లూ వస్తున్నారట. మన వాళ్ళే ఆ స్టార్లు కూడా!"

అదీ… అప్పుడు వెలిగింది... నా మేటి మట్టి బుర్రకి...   మనవాళ్ళంటే అర్థమేంటో మహా బాగా అర్థమయ్యింది!

అది వెలిగింది సరే... మరి... ఇంతకీ... శ్వేత వాళ్ళెవరు? నిత్య వాళ్ళెవరు? సరదాగా మాట్లాడుకోవటమే కానీ... ఈ కులాలు, గోత్రాలు... వగైరా వివరాలెపుడూ కనుక్కోలేదు. ఇప్పుడు ఉన్నపళంగా ఈయన "మీరు మావాళ్ళా కాదా" అంటే ఏమిటీ చెప్పటం?!! 

పైగా సినీ స్టార్లకే తప్పట్లేదు కులప్రాతిపదికన ఆహ్వానాలు! మరి మేము వీళ్ళ వాళ్ళము కాకుంటే... అంతే సంగతులా? ఈ సారి మా మిత్రవర్గ పిక్నిక్కు హుళక్కేనా?? ఎప్పుడూ కలిసి వెళ్ళే మేమంతా... విడివిడిగా, వేరు వేరు వర్గాలవారీగా వెళ్ళే సీన్ ఊహకీ అందలేదు.

 

ఇక, అంకుల్ మాటలు వినటం మానేసింది నా బ్రెయిన్. అంకుల్ కూడా చివరికి ఏదో ముక్తాయించి... సండే క్రానికల్ పక్కన బెట్టి టీ.వీ లో తెలుగు న్యూస్ చానెల్ పెట్టారు.

 

ఈ నిత్య ఎప్పుడొస్తుందోనని ఆలోచిస్తూ, టీ వీ వైపు చూసాను. ఫేస్ బుక్ లో గాలికి తిరిగే గాసిప్సే న్యూస్ చానెల్ లో! కాకుంటే, సంభ్రమాశ్చర్యాలు, ఆవేశాక్రోశాలు, శోధనావేదనలు లైవ్ సైజ్ లో కనిపించి వార్తల్లా అనిపిస్తాయంతే.

 

చానెల్స్ తిప్పీ, తిప్పీ... తిప్పటం అంటే ఆ యాప్ లో  క్లిక్ చేసీ, చేసీ... ఒక చానెల్ దగ్గరెక్కడో ఆగారు. అందులో...  నాగ చైతన్య, సమంత ఈ మధ్య ఏవో పూజలు చేసారని చెబుతూ... అప్పటికే చూసీ చూసీ విసుగెత్తిన ఫోటోలనే మళ్ళీ, మళ్ళీ చూపిస్తున్నారు.  ఫ్యాన్స్ ఎంతెంత  గొప్పగా సంబరాలు చేసుకున్నారో కూడా చెబుతున్నారు! “ఏ పూజో అదీ?” అని తెగ ఆశ్చర్యపడుతూనే, ఏ పూజయి ఉంటుందో, ఎందుకయి ఉంటుందో విశ్లేషిస్తున్నారు! అబ్బో! ఏదో సివిల్ డ్రెస్ లో చేసుకున్న పూజకే మీడియా హడావిడి ఎక్కువైపోయింది. రేపు వాళ్ళు చర్చిలో, గుడిలో రెండు రకాల పెళ్ళిళ్ళు చేసుకుంటారట మరి... హెడ్ లైన్స్ అన్నీ అవేనేమో! ...ఊ.పె.కు.హ. తరహాలో... నా మానాన నేను సీరియస్ గా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇందాకటి అంకుల్ మాటలు నా ప్రమేయం లేకుండానే బుర్రని తొలిచేయటం మొదలెట్టాయి....  అప్పుడెందుకో కానీ,  వీళ్ళు, వాళ్ళు కాకుండా చాలామంది  హీరోల మీద జాలేసింది. పాపం, ఈ హీరోలు ఇల్లాలు విషయంలో కానీ, కోడళ్ళు, అల్లుళ్ళ విషయంలో ఈ కుల పట్టింపులలాంటివి అసలేమాత్రం పట్టించుకోరు కదా..., వాళ్ళని మోడల్ గా తీసుకునైనా వీళ్ళు మారకూడదూ? ...ఇంటికి వచ్చిన కోడలు ఫ్రెండు కూడా మన కులమో, కాదో కనుక్కునే దశలో వీళ్ళు!  పైగా పాపం... అన్ని వర్గాల హీరోలు వాళ్ళ మానాన వాళ్ళు సినిమాలు, బిజినెస్సులు చేసుకుంటూంటే... వాళ్ళకీ కులం అంటగట్టి వాళ్ళని చట్రాల్లో బిగిస్తారు వీళ్ళు!

నా ఆలోచనలు వింటే... "వీళ్ళు అంటావేంటమ్మా?... మీరు మా వాళ్ళు కాదా?" అంటారేమో!  ఇంతకీ, నాగార్జున వీళ్ళ వాళ్ళేనా.?.. మరి మేము? అయితే మాత్రం... నాగార్జున కూడా వచ్చేస్తారు ఏదో ఓ ఈవెంటుకి. ఎంచక్కా  నేనూ, నిత్యా కలిసి నాగార్జునతో సెల్ఫీ దిగేయొచ్చు! పనిలోపనిగా మా ఫ్రెండు స్వప్ననీ పిలిచి ఇంకో సెల్ఫీ తీయించొచ్చు. తనకసలే నాగార్జునంటే చాలా ఇష్టం. ఇంతకీ స్వప్న వాళ్ళెవరి వాళ్ళో! వీళ్ళవాళ్ళనే చెప్తే సరి. బ్రిలియంట్!

 

నెత్తి మీద ఒక్క మొట్టికాయ పడింది. చూస్తే నిత్య. "ఏమయిందే! మాటా, పలుకూ లేకుండా కూర్చున్నావు. నేను రెడీ. బయల్దేరుదామా??" అంటూ వచ్చింది నిత్య.  

స్ప్రింగులా లేచి నిల్చున్నాను, 'పద' అంటూ...

 

ఇంతలో... ఆంటీ చేతికి మారింది చానల్. ఒకటి నిజం... కులాలు ఎన్నారైల ఐకమత్యాన్ని శాసించవచ్చు. ప్రాంతాలు తెలుగువారి మనోభావాలని శాసించవచ్చు, పైనుంచి రాజకీయాలు వీటన్నిటినీ చిద్విలాసంగా శాసించవచ్చు. కానీ... ఇంట్లో రిమోట్ ని శాసించేది మాత్రం ఆడవాళ్ళు, ఆడవాళ్ళు, ఆడవాళ్ళే... ఈనాటికీ, ఏ నాటికీ...! అలా ఆంటీ గుత్తాధిపత్యం కిందికి వెళ్ళిన రిమోటు... టీ.వీ.ని భక్తి చానల్ కి మార్చింది. ప్రశాంతమైన వదనంతో ఉన్న కృష్ణుడి ఫోటో పై రంగురంగుల గ్రాఫిక్ పూలు పడుతున్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో "విశ్వమంతా తానే ఉన్నానని, జీవులందరిలో తానే ఉన్నానని" గీతలో చెప్పిన శ్లోకం వస్తుంది. హమ్మయ్యా! ఏ రొదా లేకుండా బావుందీ చానెల్ అనుకునేంతలో... బుర్రలో పురుగు మళ్ళీ తొలిచింది... సిల్లీ థాట్ కి నవ్వొచ్చింది. పాపం, కృష్ణుడికి తెలుసో మరి?  తనకీ కులముందని?...

 

మేము బయల్దేరుతుంటే... "జాగ్రత్తమ్మా! రాత్రి అవకుండా వచ్చేయండి. రాత్రవుతే మాత్రం గ్యాస్ స్టేషన్లలో అక్కడా ఆగకండి. అసలే మీరొచ్చే దారిలో --వాళ్ళు... … " ఆంటీ ఇంకా ఏదో అనబోతూ... సీరియస్ గా చూస్తున్న అంకుల్ ని గమనించి, ఇందాకటి లూథర్ కింగ్ స్పీచ్ గుర్తొచ్చిందేమో, ఠక్కున ఆగిపోయారు!

"మీ ఆడాళ్ళింతే! న్యారో మైండెడ్!!" సార్వజనీన సత్యం చెప్పినంత సాలిడ్ గా చెప్పేసి పేపర్లో తలదూర్చారు అం...కుల్!

బుర్రలో పురుగు అమాంతం ఎగిరిపోయింది. సందేహాలకీ, సమ్మతాలకీ అందకుండా...!

మగవాళ్ళు, ఆడవాళ్ళు... మన వాళ్ళు, కాని వాళ్ళు... అక్కడి వారు, ఇక్కడి వారు… తెల్లవారూ, నల్లవారు... అందర్నీ... భక్తి చానెల్నీ, నల్లనివాడు- చిన్ని కృష్ణున్నీ... ఆ పక్కనే అమాయకంగా నుంచున్న గోపమ్మనీ ఓ చుట్టు చుట్టి మరీ ఎగిరిపోయింది...

ఆలోచనలకీ, ఆకాశానికీ సాపేక్షంగా!!

 

*****

comments
bottom of page