top of page

సంపుటి 1    సంచిక 4

“శ్రీని” వ్యాస వాణి

చంద్రబాబు- మబ్బుల్లో మతాబు! మరి పేలేనా?

Srinivas Pendyala, Madhuravani,Srinivas Pendyala Madhuravani

శ్రీనివాస్ పెండ్యాల

క్రిందటి సంచికలో కుబేర చంద్రుడి గురించి చెప్పుకున్నాము, ఇక కుచేలుడి వంతు!


కుచేలుడి విషయానికి వస్తే- అనుకోని విభజన, చెట్టునీడ తప్ప కనీసం ఫైలు పెట్టుకోవటానికి ఒక బల్ల కూడా లేని ముఖ్యమంత్రి దర్జా, నిరాశా నిస్పృహలతో రాష్ట్ర ప్రజానీకం, జీతాలు, పెన్షన్లు కూడా చెల్లించలేని దివాలా స్థితిలో ఆర్థిక పరిస్థితి, అధః పాతాళంలో ఆర్థిక వృద్ధి రేటు... ఇలా చెప్పుకుంటూ పోతే- కట్టలు తెంచుకునే వరద కల్లోలాలని తలపించే సినిమా కష్టాలతో మొదలయ్యింది పాలనా ప్రస్థానం! అలాంటి క్షణాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క తాటిపై నిలబడి అనుభవాన్ని నమ్మి ముందుకు నడిచారు. చంద్రబాబుని పెట్టుబడిగా నవ్యాంధ్ర తొలి అడుగులు వేసింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మొదలయిన రాష్ట్రం, ఆరు దశాబ్ధాలుగా నిర్మించుకున్న ఆశలసౌధం భాగ్యనగరాన్ని వీడి, దానినే తొలి ప్రత్యర్థిగా స్వీకరించి, పెట్టుబడుల వేటలో పోటీ పడటం బహుశా కలం కూడా వర్ణించలేని కఠిన కార్యం కావచ్చు! 

అభివృద్ధి అనేది కనుచూపు మేరలో కనపడని స్థితిలో... చంద్రబాబు రాష్ట్ర ప్రజలకంటే ముందుగానే తేరుకున్నట్టు చెప్పుకోవచ్చు! చంద్రబాబు తీసుకున్న మొదటి ముఖ్య నిర్ణయం- ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపటం. దానికి అత్యంత అవసరమైన ఇంధనం- నమ్మకాన్ని నిర్మించటం. ఆత్మస్థైర్యం కొరవడిన పరిస్థితుల్లో... ఒక కార్యాన్ని అనుకున్న సమయంలో అనుకున్న విధంగా అడ్డంకులని అధిగమించి సాధించే స్పూర్తి ఇచ్చే ఆ ఆత్మస్థైర్యం కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన బలంలా పనిచేసింది. ఇలాంటి స్పూర్తిని చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుతో సాధించాడు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లోనే కాక పారిశ్రామిక వర్గాల్లో కూడా నమ్మకాన్ని నింపి కార్యోన్ముఖులని చేసింది.

చంద్రబాబు నాయకుడిగా కాకుండా, ఒక సగటు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. 'నాయకుడిగా కాకుండా' అని ఎందుకు అనవలిసి వచ్చిందంటే... అతనిలో నాయకత్వ వికాసం ఇంకా మనకు కనిపించటం లేదు. దీని గురించి చివరలో చర్చిద్దాము. ప్రస్తుతం ప్రభుత్వ దృష్టి అంతా ఎంచుకున్న ముఖ్యమైన మూడు లక్ష్యాల మీదే!

1. రాజధాని తొలిదశ నిర్మాణం
2. పోలవరం ప్రాజెక్టు
3. ప్రపంచం గుర్తించదగిన అంతర్జాతీయ విమానాశ్రయం

సెంటు భూమి సేకరించటం కూడా గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో,  రాజధాని కొరకు ప్రజలని భాగస్వాములని చేస్తూ 33 వేల ఎకరాల భూసేకరణ చేయటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆరు లైన్ల రోడ్ల నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు కళ్ళకి కనిపించేలా కార్యరూపం దాల్చటం చంద్రబాబు ముఖ్య విజయంగా భావించాలి. బహుశా ప్రజలు హైటెక్ బాబు గత అనుభవాన్ని నమ్మి అడుగులో అడుగేసి ఉండవచ్చు. ఉద్యోగుల తరలింపులో కొంత ఊగిసలాట ప్రదర్శించినా... బెరుకుగా అయినా తన మార్కు అడ్మినిస్ట్రేటివ్ స్టాంపు తో అధికారులని గాడిలోకి తేగలిగాడు.  అద్దె ఇంటికంటే(తెలంగాణ) EMI కట్టుకోవటమే(రాజధాని నిర్మాణం) మేలనుకున్న రాష్ట్ర ప్రజల మనోభావాలని ఉద్యోగులూ మన్నించారు. 


 తొంభయవ దశకంలో చంద్రబాబు ఐ.టీ గురించి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం భాగ్యనగరాన్ని ఆర్థిక శక్తిగా నిలిపాయి. అలాంటి నిర్ణయాలే ఇప్పుడు నవ్యాంధ్రనూ నడిపించబోతున్నాయి. రాష్ట్రానికున్న సుదూరతీర ప్రాంతాన్ని పెట్టుబడిగా తీర్చిదిద్దబోతుంది రాష్ట్ర ప్రభుత్వం!


జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పారిశ్రామిక రవాణా రంగానికి పశ్చిమ తీరాన్ని వినియోగిస్తుంటారు. ఇప్పుడున్నది స్మార్ట్ ఎలెక్ట్రానిక్ era! అది ఫోన్ కానివ్వండి, లాప్ టాప్ కానివ్వండి. తయారీ మాత్రం తూర్పు తీరాల్లోనే! చైనా, కొరియా, తైవాన్, జపాన్... ఇలాంటి ఎలెక్ట్రానిక్ దిగ్గజాలన్నీ భారత్, యూరోప్, గల్ఫ్ దేశాలకు చేసే తమ ఎగుమతులకి ఆంధ్రతీరం ఆతిథ్యమీయనుంది. ఈ మధ్య మోడీ తూర్పు దేశాల పర్యటనల్లో కుదిరిన అత్యంత ముఖ్యమైన ఒప్పందం - భారత తీరాన్ని రవాణా కేంద్రంగా రూపు దిద్దటం. ఇలా కుదిరిన ఒప్పందాల్లో  నవ్యాంధ్ర మూడు ముఖ్యమైన పోర్టులని ( విశాఖ, కృష్ణపట్నం, మచిలీపట్నం) దక్కించుకుంది. వీటికి అనుసంధానంగానే ‘శ్రీ సిటీ’ మొబైల్ హబ్ గా రూపు దిద్దుకుంటుంది. 

పోలవరం ప్రాజెక్టు రాజకీయ చక్రబంధనం లో చిక్కుకుపోవటంతో చంద్రబాబు ప్రత్యేక హోదా లీకేజీని అరికట్టటానికి ప్రత్యేక ప్యాకేజీ తో అడ్జస్టయిపోయాడు. గన్నవరం ఏర్ పోర్టు ఏర్పాటు కూడా ఊహిస్తున్నంత సవ్యంగా జరిగితే బాబు అనుకున్న లక్ష్యాలని చేరినట్టే...

ఇక ముందనుకున్నట్టుగా... నాయకత్వ లక్షణాలను తరచి చూస్తే...


ఉద్యమ వాతావరణం ఏర్పడ్డప్పుడల్లా తన బలహీనత స్పష్టంగా చూపించే స్వభావం బాబు పలు సందర్భాల్లో ప్రదర్శించాడు. తెలంగాణా ఉద్యమ సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేక తెలంగాణాలో పూర్తిగా ఉనికినే కోల్పోవటం బాబు నాయకత్వ లోపమే. ఇక, మరో ఉదాహరణ - కాపు ఉద్యమం. రాజకీయంగా ప్రజలపై, ప్రత్యర్థులపై పట్టు సాధించలేకపోతే ఉద్యమ ఉధ్ధృతిలో చిక్కుకుని, పరిస్థితులు పెనుభూతంలా రాష్ట్రాన్ని కుదిపివేసే అవకాశం కనిపిస్తుంది. విచిత్రమేమంటే... రెండు పర్యాయాలు తాను నాటి పెంచిన మొక్కలే వృక్షాలై పెనుగాలులు సృష్టించి తన ఉనికినే ప్రశ్నించినా పాఠాలు నేర్వని పసిపిల్లాడిలా ప్రవర్తించటం! నాయకుడికి తెగువ, తెగింపు అందరికన్నా నాలుగు రెట్లు ఎక్కువుండాలి. క్లిష్టమైన రాజకీయ సమస్యలు కాకపోయినా, కనీసం అతి సులభంగా కనిపించే రాజకీయ లక్ష్యాలని కూడా బాబు చేరుకోలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది!


సమకాలీనులందరూ తమ పుత్రరత్నాలని వారసులుగా ప్రకటించి ప్రజలనే అధిష్టానంతో బలవంతంగా ఆమోదింపచేసుకోగా... బాబు మాత్రం మనసు నిండా గంపెడంత ప్రేమ, వాత్సల్యాలను మూట గట్టుకుని లోకేష్ ని అధికారంలో భాగం చేయటంలో సంకోచించటమెందుకో అర్థం కావట్లేదు. రాజకీయ వారసత్వం తప్పో, ఒప్పో ఆలోచించే ఓపికా, తీరికా ప్రజలకెలాగూ లేదు. జగన్, అఖిలేష్, KTR, సింధియా... అంతెందుకు? రాజీవ్ నుండి ఇప్పటి రాహుల్ బాబా దాకా ఇలా దిగుమతి అయిన నాయకులనే కదా మనం ఆరాధిస్తూ వస్తుంది? మరి బాబు గారికి మన ఆరాధన మీద అనుమానమా? లేక, మరీ రాహుల్ బాబా పాటి నాయకత్వ పటిమ కూడా లోకేష్ బాబుకి రాలేదన్న భయమా? ఏది ఏమయినా పదే పదే ప్రతీ ఛోటా మోటా నాయకుడు చిన'బాబు' గురించి ప్రశ్నించినపుడల్లా తన మందీ మార్బలం తో ప్రెస్ మీట్లు పెట్టించడం కన్నా అధికారికంగా చినబాబుని ప్రజల నెత్తిన రుద్దటమే మేలు. ఇప్పటికిప్పుడు కాకున్నా రేపైనా, చిన బాబు ని ఎత్తుకుని ముద్దాడి గద్దెపై కూర్చోబెట్టాల్సింది ఈ ప్రజలే కదా! 

*****
 

bottom of page