top of page

సంపుటి 1    సంచిక 4

వంగూరి పి.పా.

సాహిత్యమూ- చందాలూ

వంగూరి చిట్టెన్ రాజు

అదేమిటో తెలియదు కానీ, నా జాతకంలో కొన్ని ఫోన్ కాల్స్ ఎప్పుడు రాకూడదో అప్పుడే వస్తాయి. అదిగో అలాంటిదే మొన్న నాకు బాగా దగ్గర అయిన సో ప్రా. స్నే నుంచి వచ్చిన ఫోన్. ఉన్న మాట చెప్పొద్దూ, నా విషయంలో మటుకు దగ్గర స్నేహితులకీ, దగ్గర బంధువులకీ ఒక గొప్ప స్వారూప్యత ఉంది. అనగా, నేను ఆనందంగా చేసుకుంటున్న పనులు అన్నీ శుద్ద వేస్ట్ అని వాళ్ళు ఫీల్ అయిపోతూ, అసలు పట్టించుకోరు...అనగా నేను తెలుగు సాహిత్యం గురించి ఏదైనా మాట్లాడబోతే వాళ్ళు పూజలూ, వంటల గురించో, చంద్రబాబు గురించో మహేష్ బాబు గురించో తగులుకుంటారు నన్ను వదుల్చుకోడానికి. ఆఖరికి నేను అలనాటి టెంపో రావు డిటెక్టివ్ నవల గురించి నోరు విప్పినా టాపిక్ ట్రంపు గాడి అవాకులూ, చవాకుల మీదకి వెళ్లి పోతుంది. ఇక నా ఇమెయిల్స్ చదవకుండా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి అని కూడా నాకు అర్థం అయింది.  ఇదిగో మొన్న వచ్చిన ఫోను వలన ఈ విషయం మరీ బలపడింది.

ఇంతకీ ఈ సో.ప్రా.స్నే. దేనికో నన్ను పిలిచి “ఈ వెధవ చందాల గోలతో చచ్చి పోతున్నాం గురూ. ఊళ్లో రెండు వందల రెండో గుడికి..ఈ సారి పిచ్చి తల్లి గుడిట.. ఈ క్షుద్ర దేవత భక్తుడు  ఒహడు, గైగోలు పాడు లో స్వచ్చ భారత్ కోసం ఉన్న టాయిలెట్లు పడగొట్టి హై టెక్ వి కట్టిస్తాను అని మరొహడూ, మన సినిమా సాంస్కృతిక సమితి కల్చరల్ ప్రోగ్రాంకి  హంస పందిని..సారీ నందిని ... పిలవడానికి డబ్బులు పోగేస్తున్నాం అని వాళ్లూ ఒహటేమిటి, ఒహడేమిటి..” అని చందాలు అడిగే వాళ్ళని అడ్డమైన తిట్లూ తిడుతూ వాపోయాడు.

“హమ్మయ్య, తిడితే తిట్టాడు కానీ, నా ఇమెయిల్ చదివాడన్న మాట” అని సంబర పడిపోయి “అయితే ఎంత ఇస్తున్నావ్?” అని అడిగాను.

“దేనికీ?” అన్నాడు వాడు.

“అదే గురూ, సింగపూర్ కి” అన్నాను.

“సింగపూరా? అదేమిటీ?”

“అదే గురూ, మొన్న పెద్ద మెయిల్ పంపించానుగా సింగపూర్ లో చేస్తున్న ప్రపంచ సాహితీ సదస్సు గురించీ “ అన్నాను కొంచెం అనుమానంగా.

“నీ బోడి మెయిల్స్ ఎవడు చదువుతాడోయ్...పైగా చేట భారతం అంత రాస్తావు. సబ్జెక్ చూడగానే, పైగా ఏమన్నా ఎటాచ్ మెంట్స్ ఉంటే నా ల్యాపుటాపు దాన్ని ఆటోమేటిక్ గా డిలీట్ చేసి పారేస్తుంది.”

“ఆరి వెధవా?”

“ఏమన్నావ్?”

“అదేలే. నువ్వు నా మెయిల్ చదివి సింగపూర్ సదస్సుకు ఏమన్నా డొనేషన్ ఇవ్వడానికి పిలిచావేమో అనుకున్నాను.”

“నీ మొహం. అంత బుద్ది పొరపాటు పని ఇప్పటి దాకా చేశానా? నీ పేరే చందాల రాజు అని అందరికీ తెలుసు. అసలు నిన్ను ఇప్పుడు పిలిచింది నీలా అడ్డమైన వాటికీ చందాలు అడుక్కునే వాళ్ళ ని తిట్టడానికే” వాడు రెచ్చి పోతున్నాడు. ఎంతయినా సో.ప్రా. స్నే కదా! నయా పైసా ఇవ్వ కూడదు కానీ కావలసినన్ని చివాట్లు పెట్టవచ్చును. సరిగ్గా మా క్వీన్ విక్టోరియా పద్ధతే!  

ఇక్కడ నాకు ఎందుకో ఒక సారి బాపు గారితో చివాట్లు తినడం గుర్తుకొస్తొంది. పదిహేనేళ్ళ క్రితం బాపు గారిని మా హ్యూస్టన్ లో సాహితీ సదస్సుకి ఆహ్వానించాం. అప్పుడు ఆయనతో ఫోన్ లో యాదాలాపంగా మాట్లాడుతూ “మిమ్మల్ని చూడడానికి చాలా మంది వస్తారు. మాకు చందాలు కూడా బాగానే వస్తాయి” అన్నాను. అంతే..ఆయన ఫోన్ లోనే ఎగిరి పడుతూ “నీకేమన్నా బుద్దుందా? జూ లో కోతిని చూపించి నట్టు నన్ను కూచోబెట్టి చందాలు అడుక్కుంటావా. చస్తే రాను.” అని నన్ను ఎడా, పెడా వాయించేశారు. ఆయన్ని క్రిందకి దింపి, మళ్ళీ ఒప్పించి హ్యూస్టన్ తీసుకు రావడానికి మా తాతలు దిగి వచ్చారు. అలాంటిది, మొన్న నా సో కాల్డ్  ప్రాణ స్నేహితుడు (సో.ప్రా.స్నే) గాడి తిట్లకి నేను బెదిరి పోయి. సిగ్గు తెచ్చుకుని చందాలు అడగడం మానేస్తానా? నో ఛాన్స్. తేడా అల్లా..నేను అడుగుతూనే ఉంటాను కానీ వాళ్ళు ఇవ్వరు. అందుకే వాళ్ళ దగ్గర అంత డబ్బు నిలవ ఉంటుంది..మరి మన దగ్గరేమో..” అంటుంది మా క్వీన్ విక్టోరియా నిట్టూరిస్తూ. కదా!

అసలు సాహిత్యానికీ, చందాలకీ ఉన్న అవినాభావ సంబంధం ఈ నాటిది కానే కాదు. ఎక్కడో ఓ పోతన లాంటి కవి “గూళలు” అని తిట్టినంత మాత్రాన, అగ్రహారాలు పుచ్చుకున్నా, గండ పెండేరాలు తొడిగించుకున్నా ...నిజానికి ఆయా రాజులు, రాయల వారు అందరూ చేసినది చందాలు ఇచ్చి సాహిత్యాన్ని పోషించడమే కదా! అందుకే సాహిత్యం కోసం చందాలు కానీ...చందాల కోసం సాహిత్యం కాదు బాబోయ్!

    

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే..రాబోయే నవంబర్ 5-6, 2016 తారీకులలో సింగపూర్ లో 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు చేస్తున్నాం. దానికి చాకిరీ అయితే చెయ్య గలను కానీ డబ్బులెక్కడివీ? అందుకే అందరినీ “భాగస్వాములు చేసే సదుద్దేశ్యముతో” అనే వంకతో చందాలు అడుగుతూ కొన్ని వేల ఈమెయిల్స్ రెండు, మూడు సార్లు పంపించి ఇప్పటికి రెండు వారాలు అయింది. ఇద్దరు దక్షిణ ఇచ్చారు

*****

1
2
bottom of page