top of page

సంపుటి 1    సంచిక 4

'అలనాటి' మధురాలు

విముక్తి    

వేగుంట మోహన్ ప్రసాద్ (మో)

ఇంతకాలవూ కాగితాలతోనే గడిచిపోయింది
ఏం కావాలో కాయితాల మీద రాస్తూ
నువ్వేం రాశావో ఆ పుస్తకాల్లో ఆబగా చదూతూ
ఎవరో ఏదో కొత్త పుస్తకం తెచ్చిస్తారని
గుడ్లప్పగించి చూస్తూ నిద్రగాచి చదూతూ
ఇంతకాలవూ కాగితాలతోనే గడిచిపోయింది

ఒక్కొక్క అశృబిందువూ బిక్క చ్చిన శవం
దాన్ని దోసెడు కాగితం మీద పూడ్చి తగులబెట్టి
నిర్ణిద్ర మానసాంతర స్మశానంలో 
శాంతి కోసం నిద్ర లేచి ఏడుస్తో
ఇంతకాలవూ కన్నీరోడుతున్న పుస్తకాలతోనే గడిచిపోయింది

ఈ బొమికెలెవరివి ఈ కపాల ప్రకంపనలెవరివి
అని ఒక్కొక్క చీకటి చీరికనీ చీలుస్తో
ఒక హటాన్నరాల వాన కురిసి 
ఆకలి డొక్కల పిడుగులు రాలినపుడు

అభివ్యక్తి వాద వ్యక్తంతర దు:ఖాగ్ని కీలల్ని
మానసమరుభూమి మీద చల్లార్చినయ్
ఆకలి వేగుల లుంగలు నాలోకి నేను గా 
నా నడుస్తున్న కాళ్ళకడ్డం బడి
ఇంతకాలవూ కన్నీటి కాగితాలతోనే గడిచిపోయింది

కీచురాళ్ళ లా నరాల సూదుల వాన
రాత్రంతా అలా నరాలు కురుస్తున్నప్పుడు
నా శిరస్సులోకి నా రాజేసుకున్న
నిప్పు కణికెల మీద మొక్క జొన్న కండెలా 
హృదయాన్ని తిప్పుకుంటూ వేపుకుంటున్నాను..
ఆ నరాల సూదుల వానకి
నా రాసిన కాయితాలు చింకి చీకి నాని
తడిసి మళ్ళీ కన్నీళ్లు కార్చినయ్
ఆత్మాశాంతి కోసమో విశ్వశాంతి కోసమో గాని మరి

 

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

సీత తల్లి  

గుడిపాటి వెంకట చలం

పద్య సమాధి   ~ఇస్మాయిల్

పద్యాన్ని లోతుగా తవ్వుతున్నాడు కవి.
టన్నుల కొద్దీ మన్ను కింద
టన్నుల కొద్దీ మనస్సు కింద
కప్పబడి ఉంది పద్యం.

ఇంతలోతుగా దీన్ని
ఎవరు పాతేశారో తెలీదు.
దివారాత్రాలు తవ్వి
శవపేటికను వెలికితీయాలి.
ప్రాణవాయువు తగిల్తే
పరవాలేదు బతకొచ్చు.

పద్యాన్ని లోతుగా తవ్వి
ప్రేతపేటికని తెరిచాక
ప్రతిసారీ అందులోంచి
బ్రతికొచ్చే శవం తనే.

సీత తల్లి    ~గుడిపాటి వెంకట చలం

“ఆ వీధినా! ఆ వీధిని నేను రాను ---!” అని పట్టుపట్టి పక్క తోవల తీసుకెళ్ళాడు వెంకట్రావు. కారణం ఏమిటని ప్రాణం తియ్యగా, తియ్యగా, సిగ్గు దిగ మింగి, ఒక రోజు ఇద్దరం పడుకున్న తరువాత చీకట్లో చెప్పాడు.

‘మేడమీద కిటికీలో ఆ అమ్మాయిని చూచిన నాటినుంచి సరదా కలిగి రొజూ ఐదారు సార్లు ఆ దోవనే తిరుగుతూ ఉండే వాణ్ని.  రెండో రోజున కొంచెంగా నవ్వి నా ఆశల్ని మొలకలెత్తించింది. కానీ, నాలుగో రోజునుంచి కింద గుమ్మంలో వాళ్ళ తల్లిలా ఉండే ఒక ఆమె నుంచుని, పైకి చూసే నా వంక కోపంగా చూస్తోవుండడం కనిపెట్టాను. అయినా ఆడడానికి భయపడతానా నేను అనుకొని, మళ్ళీ మళ్ళీ వెడుతున్నాను.  రోడ్డు మీద నడిచే నన్ను ఎవరేమంటారు? కిటికీ లో కూచున్న అమ్మాయి తల్లో గులాబీ పూలు చంపలకి అందమిచ్చాయి. ఒక సారి పైకి చూసి తలొంచుకుని వెళ్ళిపోతున్నాను.

‘అబ్బాయీ! మాట! ఇట్టారా!” అంది తల్లి గుమ్మంలోంచి.

దులిపేసుకుని పారిపోయి, ఇక ఆ వీధిని రాకూడదని అనుకంఠంలో కున్నాను. కానీ, ఆడదానికి భయపడతానా అనిపించింది. అయినా ఎందుకు పిలుస్తోందో? కంఠంలో కోపం వినపట్టం లేదు. పలక్క వెడితే తప్పు పని చేసినట్టుంటుంది. నేను ఏంచేశానని తప్పు పట్టడానికి! గుమ్మం లోకి వెళ్లి

“ఎందుకు” అన్నాను.

“ఇట్టారా!; చెపుతా”

కోపం లేదు. వెడితేనేం?

లోపలకి వెళ్లాను.

“ఇదిగో చూడు. చిన్న వాడివి. వృద్దిలోకి రావలసిన వాడివి. ఇలాంటి పనులు నీకూ, నీ కుటుంబం మర్యాదకీ తగినవి కావు”

“ఏం చేశాను?” అనపోయినాను కానీ  ఆమె తిడుతో ఉంటే వినడం బాగుంది. కోపం లేదు ఆమె చక్కని కళ్ల ల్లో.

“నీకు పెళ్లయిందా?”

“లేదు”

“నీకు చెల్లెళ్లున్నారా?

“ముగ్గురున్నారు”

“వాళ్ళ కోసం ఎవరన్నా ఇట్లా వీధి వెంబడి తిరుగుతుంటే నీకు ఎట్లా వుంటుంది?”

“చాలా తమాషాగా ఉంటుంది.”

“మంచి వాడివే. మా అమ్మాయి మీ చెల్ల్లెల్లాంటి పిల్ల కాదూ. అట్లా అల్లరి చేస్తావా దాన్ని?”

“నేనేం అల్లరి చెయ్య లేదు.”

“ఊరికే బూకరించకు. నేను చూస్తోనే ఉన్నాను. ఇల్లాంటి పనులు మానెయ్యి. ఇక్కడే కాదు. ఎక్కడాను. నీ కోసం , నువ్వు బాగు పడాలనే చెపుతున్నాను. మా అమ్మాయి కేమీ నష్టం లేదు.  ఇట్లా చూడు. ఇలాంటి  చక్కటి మొహాన్నీ, కళ్ళనీ నీ భార్య కోసం దాచుకో. అందరికీ ఇలా పంచేస్తే  యేడవదూ? సరే కానీ..ఎక్కడ చదువుకుంటున్నావు?”

“హై స్కూలు లో”

“ఏ క్లాసు?”

“స్కూలు ఫైనలు.”

“ఇంకేం, ఊరికే అల్లరి చెయ్యక పోతే రోజూ వొచ్చి మా అమ్మాయికి ఇంగ్లీషు చెప్ప రాదూ?”

నా వళ్ళు పరవశమయింది.

సీతకి ఇంగ్లీషు రాదు. చెప్పినా రాదు.  ఊరికే పిచ్చిగా మొహం వంక చూస్తూ కూచుంటుంది. ఆ అమ్మాయి కోసం నేను పడ్డ ఉత్సాహం ఇంగ్లీషు చెప్పడంలో సగం పోయింది. కానీ సీత అందమైన పిల్ల. చూపులతో చాలా అల్లరి చెయ్యగలదు. ఆ తల్లి మాత్రం రొజూ పాఠం చెప్పినంత సేపూ మాతో కూచుంటుంది. కనక పుస్తకం మీది నుంచి సీత నాకేసి కింది చూపులెన్ని చూసినా, నేను ఆ అమ్మాయి పాదాల్నెంత  నొక్కినా ఏం లాభం లేక పోయింది. ఇంగ్లీషులో తల్లికి తెలియకుండా మాట్లాడదామంటే సీతకి అంతా కలిసి పదిహేను ఇంగ్లీషు మాటలొచ్చు—బల్లా, చాపా, పిల్లీ మొదలైన వాటికి.  ఇంక ఆ ప్రైవేటు మానెయ్యాలనుకుంటున్నాను. ఆలోచించి ఒక చీటీ రాశాను. సీతకి పుస్తకంలో పెట్టాను; ఆ రాత్రి అన్నం తొరగా తిని మేడ మెట్ల మీద నుంచోమని.  చదువైన తరువాత బైటకి వెళ్లి ఒక అరగంట తిరిగి వెనక్కి వచ్చి సరాసరి మెట్లు ఎక్కుతున్నా.  వొంటి లోంచి మాటలు వినపడుతున్నాయి. మెట్ల మధ్య నల్ల చీర చెరుగు కనపడ్డది. గుండెలు కొట్టుకుంటుంటే మెట్లు ఎక్క లేక పోయినాను. దీపం బాగా కనపట్టం లేదు. దగ్గరకి వెళ్లి బుజం మీద చెయ్యేశాను. సీత తల్లి! చప్పున నా చెయ్యి పట్టుకుని దగ్గరకి లాగి,

“ఏమిటిది బాబు? ఏం పని, మంచి వాడవే!”

ఇంకా ఏమిటో చెప్పపోతోంది. భయంతో నేను పరిగెత్తుకుని వచ్చేశాను.

మర్నాడు వెళ్ళ సాహసించ లేదు. కానీ కబురు వచ్చింది. రాత్రి ఏమీ జరగనట్టే ప్రవర్తించింది ఆమె. పదిరోజులయింతర్వాత ఒక రోజు సాయంత్రం నేను వెళ్ళేటప్పటికి తల్లీ , కూతురూ ఎవరూ ఇంట్లో లేరు. వో గంట కూచున్నాను. ఈ ట్యూష న్ నాకు విసుకు పుడుతోంది. ఆవిడట్లా కావిలి కూచుని ఉంటే యేం లాభం? అప్పుడే వుదయించే వెన్నెల తరిమిన నల్లని ఆకాశపు చిరునవ్వు కాంతితో నిండిన పొలాల్ని చూసి, చూసి విసుకు పుట్టింది. సీతను వొంటిగా కలుసుకోవాలి!

 

చీకటి పడ్డది. దీపాలెవరూ వెలిగించ లేదు. బండి వాకిట్లో ఆగింది. సీత పైకి వచ్చింది. గంధం, దవనము, పరిమళాలు నన్ను కమ్మాయి. చీకట్లో వెనకనే వెళ్లి నుంచున్నాను. బీరువాలోంచి తీసిన పట్టు చీరవాసన వేసింది. మెడ మీద ముత్యాల హారం, దాని మీద వొదులుగా అల్లిన జడా కనబడ్డాయి.

“సీతా?”

చప్పున తిరిగి చూసింది.

ఇంతలో కిందినించి,

“బాబు వొచ్చాడా?” అంది తల్లి.

నా ప్రయత్నం అంతా విఫలమయింది.

“లేదు” అంది సీత.

ఆశ్చర్యపడిపోయినాను. ఆ “లేదు” అన్న వొక్క మాటకే సీతకి దాస్యం చెయ్యొచ్చు! నెల రోజులు  చెప్పినా ఇంగ్లీషులో వర్తమాన కాలానికీ, భూత కాలానికీ తేడా తెలీని సీత , ఈ విషయంలో ఎంత వివేకం చూపిందో! రెండు చేతులు జాచి సీతని దగ్గరకి తీసుకున్నాను. ఆ పల్చని పట్టు చీరలోంచి గట్టి చిన్న ....నన్నానుకున్నాంది. నా వేళ్ళ కింది ఆమె లేత దేహం ఝల్లు ఝల్లు మని వొణికాము. చీకట్లో తిప్పేసుకునే ఆమె పెదవుల్ని వెతికాను. అట్లా నుంచున్నాయి, ఎంతో సేపు, కదలడానికి భయపడుతో! మెల్లిగా సోఫా మీద అట్లాగే ఒరిగాము. ఎంతో సేపయింది. గట్టిగా నన్ను ఆమె చేతులు వొత్తాయి. నా వొళ్ళు బాధతో లాక్కు పోయింది. ఇంతలో మెల్లిగా దీపం వెలుతురు పడ్డది. సీత తల్లి ఎదురుగా నుంచుంది.

“ఏమిటది? ఆ(.........”

మేం మాట్లాడక విడిగా నుంచున్నాము. సీత చాలా భయపడి వొణకడమో, లేక ఏడవడమో, చేస్తుందనుకున్నాను.

“నువ్వు పో!” అంది సీతని, ఆమె తల్లి.

మాములుగా పక్కకి తిరిగి వెళ్ళిపోయింది.

“ఏం చేస్తున్నావు? ఇందుకా నిన్నిట్లా నమ్మింది? చిన్నదాన్ని చేసి ........మంచి వాడవనుకుని.....ఇదా నాకు చేసే ఉపకారం? సిగ్గుగా లేదూ?”

ఏం చేస్తుంది? కొడుతుందా? నేను మళ్ళీ కొట్టలేనూ? ఆమె చేతుల కేసి చూశాను. గుండ్రంగా, పెద్దవిగా, చల్లగా ....

“నాక్కోపం వచ్చింది నీ మీద; ఏం చెయ్యనూ?ఇట్లాంటి బుగ్గల్ని ......” అంటూ

దగ్గరికి వచ్చి  నా బుగ్గలు కఠినంగా నొక్కింది.

“ఇంకెప్పుడూ ఇలా చెయ్యనను.”

నిరాశ పొందిన నా నరాలు వూరికి తహ తహ లాడుతున్నాయి. ఇంకా అనుభవానికై వెతుకుతున్నాయి.

“చెయ్యనన్నదాకా నిన్ను వదలను” నా చెయ్యి పట్టుకుంది. దగ్గిరగా నుంచుని.

ఆమె ఊపిరి నా తల మీద తగులుతోంది. గాఢంగా లాగే ఆమె నిశ్వాసం నాకు వినపడుతోంది.

“ఏం, మాట్లాడవేం?”

నా మొహం దగ్గిరగా ఆమె వెచ్చని మెత్తని రొమ్ము కమ్మేస్తోంది.

“అయితే వెళ్ళనీను, యింతే”

ఆమె రాసుకున్న మొగలి అగరువాసన నా తల తిప్పింది.

“ఇంతే నిన్ను.” గట్టిగా కావలించుకుంది. నా చేతులతో ఆమె చేతులని పైన పట్టుకున్నాను.

సీత తల్లి సీత కన్నా బావుంది. కానీ మళ్ళీ వెళ్ళడం అంటే భయంగా ఉంది.

ఎందుకంటే....ఇంక చెప్పను.

***

Anchor 1
bottom of page