top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

కథా సంకలనాల్లో రచయిత్రుల పాత్ర

Sivuni Rajeswari

ఆచార్య శివుని రాజేశ్వరి

కథా రచనల్లో రచయిత్రులకు ఎంతవరకు గుర్తింపు ఉంది? వారి కథలు సంకలనాల్లో ఎన్ని ప్రచురించబడుతున్నాయి? ఆ కథలకు ఎంత వరకు ప్రాచుర్యం లభిస్తుంది? రచయిత్రులు ఏ ఇతివృత్తానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్న ఆలోచనలే ఈ పత్ర సమర్పణకు మూలం అయ్యాయి. అందుకోసం 9 సంకలనాలు పరిశీలించడం జరిగింది. ఆ సంకలనాలపై పరిశోధన జరిగినపుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి.

ఇందు కోసం ఎంచుకున్న సంకలనాలు –

కథా మహల్                (1999 – 2002)

కథా వాహిని                (2005 – 2009)

కథా వార్షిక                  (2000 – 2006)

విశాలాంధ్ర తెలుగు కథ     (1910 – 2000)

కర్నూల్ కథ, కడప కథ, చిత్తూరు కథ ఈ పత్ర సమర్పణకు మూలాధారం.

 

కథల సంకలనాలు:

  1. కథా మహల్ (1999 – 2002) 4 సంపుటాలుగా వచ్చింది. డా. దువ్వూరి నారాయణరావు గారు తన భార్య జ్ఞాపకార్ధం స్మారక కథల పోటి నిర్వహించి వాటిలో 116 కథలను నాలుగు సంకలనాలుగా వెలువరించారు. వీటిలో రచయిత్రుల కథలు 18 మాత్రమే తక్కిన 98 కథలు రచయితల కథలు.

  2. కథా వాహిని (2005 – 2009) ఐదు సంపుటాలుగా వచ్చింది. రచన మాస పత్రికలో వెలువరించిన ఉత్తమ కథల్లో 143 కథల్ని 5 సంకలనాలుగా తెచ్చారు. వీటిలో రచయితరుల కథలు 15 మాత్రమే తక్కినవి 128 కథలు రచయితలవే.

  3. కథా వార్షిక (2000 – 2006) 6 సంపుటాలుగా వచ్చింది. ఒక సంవత్సర కాలంలో వెలువడిన ఉన్నతమైన శిల్పనిర్మాణమున్న కథల్ని ఎన్నుకుని సంకలనం చేశారు. 6 సంపుటాల్లో 64 కథలు ఉన్నాయి. వీటిలో రచయిత్రుల కథలు 11 మాత్రమే తక్కివన్ని 53 కథలు రచయితలవే.

  4. విశాలాంధ్ర తెలుగు కథ (1910 – 2000) కథా పరిణామాన్ని తెలిపే ద్రుష్టిలో 90 సంవత్సరాల కాలంలో వెలువడిన చారిత్రక పరిణామాన్ని తెలిపే గొప్ప కథల్ని 116 ఏరి ఒక సంకలనంగా వెలువరించారు. వీటిలో 15 కథలు రచయిత్రులవి తక్కినవి 101 కథలు రచయితలవే.

 

మొత్తం 16 పుస్తకాల్లో 439 కథలు ప్రచురిచబడితే రచయితల కథలు 380 ఉన్నాయి. 439 కథల్లో రచయిత్రుల కథలు 59 ఉన్నాయి.

                   

439 కథల్లో కోస్తా ప్రాంత రచయిత్రుల కథలు 37 ఉన్నాయి,

తెలంగాణ ప్రాంత రచయిత్రుల కథలు 9 ఉన్నాయి,

కళింగాంధ్ర ప్రాంత రచయిత్రుల కథలు 9 ఉన్నాయి,

రాయలసీమ రచయిత్రుల కథ ఒక్కటి కూడా లేదు.

 

రాయలసీమ రచయిత్రులే లేరా? లేక వారి కథలు సంకలనాల్లో ప్రచురించడం లేదా అన్న ఆలోచనతో రాయలసీమ ప్రాంతీయ సంకలనాలకు పరిసీలించడమైనది. ప్రాంతీయ అస్తిత్వంలో భాగంగా ‘ప్రాంతీయ సంకలనాలు ఆయా ప్రాంతీయ రచయితలను సంఘటితం చేస్తూ వారి రచనలను వెలుగులోకి తెచ్చాయి. వాటిని మూడింటిని తీసుకున్నాను.

  1. కర్నూలు కథ సంకలనంలో 62 కథలు ఉన్నాయి. అందులో 48 కథలు రచయితలవి. 14 కథలు రచయిత్రులవి ఉన్నాయి.

  2. చిత్తూరు కథలో 44 కథలు ఉన్నాయి. 36 కథలు రచయితలవి 8 కథలు రచయిత్రులవి.

  3. కడప కథలో 64 కథలు ఉన్నాయి. వాటిలో 62 కథలు రచితలవి 2 రచయిత్రులవి.

 

మొత్తం 3 సంకలనాల్లో 170 కథలు ఉన్నాయి. వాటిలో 24 కథలు రచయిత్రులవి. తక్కినవి 146 కథలు రచయితలవి.

170 కథల్లో కర్నూలు కథా రచయిత్రులవి 14 కథలు ఉన్నాయి.

చిత్తూరు కథా రచయిత్రులవి 8 కథలు ఉన్నాయి.

కడప కథా రచయిత్రులవి 2 కథలు ఉన్నాయి. 

 

కథామహల్ 4 సంకలనాల్ని, కథా వాహిని 5 సంకలనాల్ని, కథా వార్షిక 6 సంకలనాల్ని, విశాలాంధ్ర తెలుగు కథ 1 సంకలనాన్ని1999 నుంచి 2009 సంవత్సరాల మధ్య కాలంలో వెలువరించాయి. మొత్తం 16 కథల సంకలనాల్లో 11 సంవత్సరాల కాలంలో 489 కథలు ముద్రించబడ్డాయి. వాటిలో రాయలసీమ రచయిత్రుల కథ ఒక్కటికూడా లేదు. రాయలసీమ ప్రాంతీయ కథా సంకలనాల్లో 170 కథలు వస్తే వాటిలో  24 కథలు రచయిత్రులవి, 146 కథలు రచయితలవి. 24 కథల్లో చిత్తూరు రచయిత్రులవి 8 కథలు కర్నూలు రచయిత్రులవి 14 కథలు కడప రచయిత్రులవి 2 కథలు ఉన్నాయి. రాయలసీమ రచయిత్రుల 57 మంది ఉంటే వారిలో 24 మంది రచయిత్రులే సీమ సంకలనాల్లోకి ఎక్కారు. సగానికి సగం మంది రచయిత్రులు వెలుగులోకి రావలసి ఉంది.

 

రచయిత్రుల కథా ఇతివృత్త వైవిధ్యం:

  1. రాయలసీమ రచయిత్రుల కథల్లో కుటుంబ జీవితానికి, మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఉన్న ఇతివృత్తాలే అధికం.

  2. ఈనాడున్నఅస్తిత్వావాదాల్లో స్త్రీ వాదానికి ప్రాధాన్యం ఉన్న కథలు ఎక్కువ.

  3. దళిత వాదం, మైనారిటీ వాదం, బహుజన వాదాలు వంటి భిన్న అస్తిత్వ వాదాలను రచయిత్రులు స్వీకరించినా వాటిని స్త్రీవాద కోణం నుంచి విశ్లేషించారు.

  4. మొత్తం మీద ప్రాంతీయతా వాదం వీరి రచనల్లో తక్కువ. కర్నూల్, కడప ఫ్యాక్షన్ ప్రాంతాలు, ఆ ప్రాంత రచయిత్రుల కథల్లో ఫ్యాక్షనిజం కనిపించలేదు. అట్లే అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని కరువు ఆ ప్రాంత రచయిత్రుల కథల్లో కనిపించలేదు.

  5. ప్రాంతీయ రచయితల సభలు, సమావేశాల్లో వీరి పాత్ర స్వల్పం. రాయలసీమ రచయిత్రులకు కథల వర్క్ షాప్, రచయిత్రుల సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రత్యేకంగా నిర్వహించడం వారి రచనలను ప్రోత్సహించడం అముద్రిత రచనలను ముద్రించడం ద్వారా మంచి ప్రయోజనాలు లభించగలవు.

కథల పోటీలు:

రచయిత్రులు తమకున్న పరిధిలో కథలు రాయడమే తక్కువ. దానిని ప్రామాణికంగా  తీర్చిదిద్దే ఉత్తమ కథగా రూపొందించి పోటీకి పంపే వెసులుబాటు వారికి ఉండదు. అసలు పోటీల సంగతే చాలా మందికి తెలీదు. ఈ నాటికీ ఎందరో స్త్రీలు తమ భావావేశంతో తమ కోసం తీరిక వేళల్లో రాసుకున్న ఎన్నో కథలు పెట్టె అడుగునే పడి ఉంటున్నాయి. అని ముద్రణకు నోచుకోక కాలగర్భంలో కలిసిపోతున్నాయి.

నూతన పోకడలు:

కథా రచనలో ఈనాడు ఎంతో వైవిధ్యం ఉంది. అటు వస్తువులోను, ఇటు శిల్పంలోను పరిణితి చెందింది తెలుగు కథ. ఇందుకోసం కథలబడి, కథల వర్క్ షాప్, చర్చా గోష్టులు రచయితల సభలు సమావేశాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక సాధారణమైన కథను మేరుగులుదిద్ది ఉన్నతమైన కథగా తీర్చిదిద్దే మెలుకువలు ఈనాడు ఎన్నో ఉన్నాయి. రచయితలూ ఈ కథా పరిణామాన్ని ఒక కంట గమనిస్తున్నారు. తమ రచనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

 

స్త్రీలకు ఇవన్నీ తెలిసే అవకాశం తక్కువ ఎక్కువ మంది రచయిత్రులు గృహిణులే. కొద్ది మందే ఉద్యోగినులు, వీరందరికి తీరిక దొరికేది తక్కువ. తమ రచనా వ్యాసంగాన్ని ఏ అర్ధరాత్రో అపరాత్రో కొనసాగిస్తూ ఉంటారు. తమ కథకు మెరుగులు పెట్టుకోవడం వారికి తెలీదు. అందువల్ల కథల పోటీలో రచయిత్రుల కథలకు స్థానం లేనట్టే ఉద్యమ నేపథ్య కథా సంకలనాల్లో కానీ, ఉత్తమ  కథల ఎంపికలో కానీ వీరి కథలకు చోటు లేదు. ఒకనాడు నవలా రచన స్త్రీలదైనట్లు ఈనాడు కథా రచన స్త్రీలది కాలేకపోతుంది. కథా రచనలో పురుషులదే పై చేయి అవుతుంది.

         

కథా సంకలనాల్లో రచయితల కథలే ఎక్కువ ఉండటానికి కారణం, వారు ఆయా ఉధ్యమ నేపథ్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవడమే! దానికి తోడు కాల్పనికత తక్కువగా, నవీన శిల్పరీతుల్లో కథను చెక్కుతున్నారు. ఈ వెసులుబాటు స్త్రీలకూ తక్కువే. తమకు తెలిసిన తమ అనుభవం లోంచి వచ్చిన స్త్రీవాదానికే వారు మొగ్గు చూపుతున్నారు. దళిత మైనారిటీల రచయిత్రులు కూడా స్త్రీ వాదాన్నే తమ అస్తిత్వాలకు జోడించి దళిత స్త్రీవాద, ముస్లిం మైనారిటీ వాద బహుజన మైనారిటీవాద కథలు రాస్తున్నారు. అటువంటి కొన్ని కథలే ఈ సంకలనాల్లో చోటు లభిస్తోంది.

స్త్రీలకున్న పరిమితులు వలన కథా పోటీ ప్రపంచంలో స్థానం లేకపోవచ్చు కానీ, కథా ప్రపంచంలో వారికి సుస్థిర స్థానం ఉంది. తమకున్న తక్కువ పరిధిలోనే కేవలం స్త్రీలకు మాత్రమే తెలిసిన స్త్రీలు మాత్రమే రాయగలిగిన ఎన్నో సమస్యల్ని విభిన్న కోణాల్లో చిత్రించారు. ఇవి తెలుగు కథ బతికి ఉన్నంత కాలం ఉంటాయి.

 

అమెరికాలో రచయిత్రుల పాత్ర:

 

ఆంధ్ర దేశంలో కథా రచయిత్రుల కథలు కథా సంకలనాల్లో 15% ఉన్నాయి. మరి అమెరికాలో పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనతో మరి రెండు సంకలనాలకు పరిశోధించడం జరిగింది. అవి ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ వారి సంకలనాలు.

  • 20 శ. అమెరికా తెలుగు కథానిక

  • అమెరికా తెలుగు కథానిక

  1. 20 వ శతాబ్దపు అమెరికా తెలుగు కథానికలో 116 కథలు ఉన్నాయి. వానిలో 66 కథలు రచయితలవి. 50 కథలు రచయిత్రులవి.

  2. అమెరికా తెలుగు కథానిక 12 సంపుటాలుగా వెలువడింది. వానిలో 285 కథలు ఉన్నాయి. 285 కథల్లో 162 కథలు రచయితలవి. 123 కథలు రచయిత్రులవి.

 

మొత్తం 13 పుస్తకాల్లో 401 కథలు  ఉంటే వానిలో 228 కథలు రచయితలవి, 173 కథలు రచయిత్రులవి. అమెరికాలో కథా రచయిత్రుల కథలు సంకలనాల్లో 45% ఉన్నాయి. ఎక్కడో ఉన్న రచయిత్రులను టార్చిలైట్ వేసి వెతికి వెలుగులోకి తెచ్చే పని ఈ సంకలనాల్లో చేసాయి.  ముందుగా రచయిత్రులు వెలుగులోకి వచ్చినపుడే తమ కథల్ని గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ పని అమెరికాలో వంగూరి ఫౌండేషన్ సమర్థవంతంగా నిర్వహించింది. ఈ స్పూర్తితో తెలుగులో సంకలనాలు  రావలసిన అవసరం ఉంది.

OOO

Bio

శివుని రాజేశ్వరి

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలోని తెలుగు అధ్యయన శాఖలో ప్రొఫెసరుగా  పనిచేస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో 14 మంది పిహెచ్.డి. పట్టాను పొందారు. ఆమె 96 పరిశోధక వ్యాసాలు, 4 పుస్తకాలు రచించారు. 85 జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. రేడియో, వివిధ సంస్థలలోనూ ధార్మిక ఉపన్యాసాలిచ్చారు.

***

manasa chamarthy
Comments
bottom of page