adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిశ్శబ్దంలో నీ నవ్వుల్లో నేను ఏరిన పువ్వులు

పాలపర్తి ఇంద్రాణి

పొట్ల పువ్వుల జిగిబిగిలా కొంత అందమూ కొంత అర్ధంకానితనమూ కలగలిసి చిత్రమైన అనుభూతినిచ్చేదే మంచి కవిత్వం.


ఆ కోవలో ప్రధమ స్థానంలో నిలబడే అతికొద్దిమంది విలక్షణ కవుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ గారు ఒకరు.  


కొంత సుతిమెత్తనితనము,కొంత పెళుసుదనము అందులో అందని రహస్యమూ  కలిపి జడలల్లిన చిత్రకాంతుల కవిత్వం వీరిది. వీరూ నేను చదివిన ఇంజినీరింగ్ కాలేజ్ లోనే చదువుకోవడం కాకతాళీయమే అయినా నాకు చాలా సంతోషం కలిగించే విషయం.
    

చెట్టు కవి ఇస్మాయిల్ గారు వీరి మొదటి పుస్తకం "నిశ్శబ్దంలో నీ నవ్వులు" కు ముందుమాట రాస్తూ-

భూషణ్‌పద్యాలు బక్కగా,బలంగా ఉంటాయి.ఎక్కడా పిసరంత కొవ్వు కనిపించదు. తెలుగు కవిత్వానికి లయ హృదయస్పందన వంటిదనీ,అక్షరమైత్రి ఊపిరి వంటిదనీ ఇతనికి తెలుసు.ఇతని పద్యాలు కొన్ని సీతాకోక చిలకల్లా అన్ని వేపులకీ ఒకేమారు ఎగరాలనే ప్రయత్నంలో గాలిలో రెక్కలల్లార్చుతున్నట్టు కనిపించినా,భూషణ్‌ సామాన్యుడు కాడు. కవిత్వ హృదయాన్ని గ్రహించినవాడు.ముందు ముందు ఇంకా మంచికవిత్వం రాయగల ప్రతిభ ఇతనికుంది.ఇతని పురోగమనాన్ని ఆసక్తితో గమనించదలచుకొన్నాను.- అంటారు.  

ఆహా అనిపించే కవిత్వపాదాల అందమైన పాదముద్రలు ఈ పుస్తకంనిండా-  

 

"నిలిచిన నీరు పక్షిముక్కు తాకగానే వృత్తాలతో నవ్వుతుంది"

"సుడిగాలీ,అవలాంచీ

తెరచాపా,పొగమంచూ

నీలాకాశం,ఓడస్తంభం

కేకలతో క్రేళ్ళురికే నీళ్ళు

ఎవరిని తలచుకొంటాయి?"

     
 

                         "ఎవరి ప్రతిబింబం వారికి బహుమతి"      

       

"నిన్ను నీవు పోగొట్టుకోకు

పోగొట్టుకొన్నదేదీ తిరిగిరాదు"

 

"ఛాయాసింహాసనాన్ని వేసి

స్వాగతించే చెట్టు"

 

"కాగితం మీద

నూనె బొట్టు

చిందినట్టు

నీ ఆలోచనలు."

 

"ఖాళీ గదులు సంభాషించే స్వరాలకోసం నిరీక్షిస్తాయి" (ఓహ్!) 

 

"చేతిలో వేడెక్కిన లాంతరు

అలసట నీడలు

ఎక్కడ ఆగను?"

 

"నగరంలో ఏముంది

తగరం ఎర"


గడియారం లాంటి సాధారణ వస్తువు కవి కళ్ళబడితే ఎలా కవిత్వమౌతుందో చూడండి:

ఘడియఘడియకూ

నన్ను చూడకు

అప సవ్యదిశలో తిరిగే

గడియారాన్ని నేను

 

గడచిన కాలాన్ని

వడగట్టి

రేడియం కళ్ళతో

నడచిపోతాను.  


ఎవరో ఓ పాటగానికి-

చిరునవ్వు చారల చొక్కాని

తిరగేసి తొడుక్కుని

రోజూ అందరూ తిరిగే

రోడ్డును దాటుకు వెళిపోయావు.

 

గిరికీల నీ పాట

ఎరలేని గాలంలా

వేలాడుతుంది. 


భూషణ్ గారి కవిత్వంలో  కనిపించేది కోమలత్వమూ ఈ కోమలత్వంలోనే పాదుకున్న దృఢత్వమూనూ.

ఇంకా అందులోనే పాఠకుని పెదవులపై నిశ్శబ్దంగా  చిరునవ్వులు చిలికించగల చిలిపితనమూ.అలాంటిలాంటి కవికాడితడు!    

"రంభలతో నిండి వున్న

ముంబయికో

నమస్కారం"           

 

"వికారంగా పాకుతుంది

వకే వక సర్పం

నిఖార్సైన పద్యం

సుఖాన్నిస్తుందా?"

 

"చుక్కలు లేని రాత్రి

వర్షం వచ్చిన చప్పుడుతో

తెల్లవారింది."

  

 "అలల జిహ్వలతో

మొరటు రాళ్ళను

బాది

ఊది వేసే ఉరగం

సముద్రం!"          

 

"ఎగురుతున్న పక్షితో,ఎకాఎకీ

చిగురుతో ,ముఖాముఖీ

మాట్లాడుతాను.

మరణం నా చిరునామా!

బ్రతుకు చిన్న కామా,

మర్రి వృక్షంలా నా ఊహ

వెర్రిగా నిలబడుతుంది!"


అభిరుచిగల పాఠకుడు చివరి పేజీ దాకా చదివి పుస్తకం మూసాక నిఖార్సైన పద్యాలు చదివిన కిక్కు అనుభవించడం ఖాయం. 

ఈ పుస్తకం ప్రచురించపడి రెండు దశాబ్దాలకు పైగా గడుస్తున్నా పాత ద్రాక్ష సారాయిలా దీని విలువ  అంతకంతకీ పెరుగుతూనే ఉంది!

***

Website Designed

 &  Maintained

by

 Srinivas Pendyala 

Feedback

sahityam@madhuravani.com

 

©  2021 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా sahityam@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed

 &  Maintained

 by

Srinivas Pendyala