top of page

సంపుటి 1    సంచిక 4

కథా మధురాలు

ఎపిసోడ్ నంబర్ 876

rajesh yalla

రాజేష్ యాళ్ళ

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో బహుమతి సాధించిన కథ

"కొంచెం కాఫీ ఇస్తావా సీతాలూ?!" అలసటగా సోఫాలో కూర్చుంటూ భార్యను అడిగాడు రామారావ్!
కనుచివరలనుండే రామారావ్ వైపు కోపంగా చూసింది సీతాలు. 'రెప్ప కూడా ఆర్పకుండా నేను "ఈ యుగం ఇల్లాలు" సీరియల్ చూస్తోంటే మధ్యలో నీ గోలేంటీ' అన్నట్టుగా ఉందామె క్రీగంటి కోపం!
మళ్ళీ రెట్టించకుండా ప్రకటనల విరామం వరకూ ఓపిగ్గా ఎదురు చూశాడు రామారావ్. "బ్రేక్ వచ్చింది సీతాలూ, కాఫీ కలిపెయ్యొచ్చులే!" ఆనందంగా అరిచాడు.
"ఆ ముదనష్టపు కాఫీ ఏదో ఆఫీస్ క్యాంటీన్లో తాగేసి రమ్మని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినరేంటీ?!" కస్సుమని కసిరింది సీతాలు.
"వాడు మరీ కుడితి నీళ్ళలా ఇస్తున్నాడు సీతాలూ! నీలా కమ్మని కాఫీ కలిపేటంత సీను వాడికెలా ఉంటుంది చెప్పు?!" మెచ్చుకోలుగా భార్యను చూస్తూ చెప్పాడు రామారావ్.
"కాకా పట్టడం ఆపండి ముందు. ఈ సీరియల్ అయ్యేదాకా ఆ పేపర్ చదువుకోండి." మళ్ళీ హుంకరించింది సీతాలు.
"పేపర్ పొద్దున్న చదివేశాను సీతాలూ!" బిక్కముఖం వేసి చెప్పాడు రామారావ్.
"అంత కక్కుర్తిగా అంతా ఒకేసారి ఎవడు చదవమన్నాడు మిమ్మల్ని?! భాగాలుగా సీరియల్స్ చూసే నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకోరేం మీరు?!" సీతాలు ఇంకా సెగలు కక్కుతూనే ఉంది.
కాఫీ సెగలకు బదులుగా సీతాలు సెగలను చూసిన రామారావ్ అప్పుడే సీతాలు కాఫీ ఇవ్వదని నిర్ణయించేసుకుని బుద్ధిగా పేపర్ తీసుకుని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు.
మరో పావుగంటకు "ఈ యుగం ఇల్లాలు" సీరియల్ ముగిసింది.
"హమ్మయ్య!" అనుకుంటూ పేపర్ మూసి భార్య వైపు చూశాడు రామారావ్ ఆనందంగా. అంతలోనే అతని ముఖం వాడిపోయింది. సీతాలు వంటింట్లో కాకుండా ఇంకా హాల్లోనే ఉంది.
"ఈ యుగం ఇల్లాలు" అయిపోయినట్టుంది కదా సీతాలూ?!" అడగొచ్చా లేదా అన్నట్టుగా అడిగాడు రామారావ్.
"ఈ యుగం ఇల్లాలు అయిపోయింది. కానీ అది పూర్తయ్యీ అవ్వగానే ఇంకో ఛానెల్లో "మొగలి ముళ్ళు" సీరియల్ వస్తుంది. దాని కోసమే ట్రై చేస్తున్నా. "మొగలి ముళ్ళు" తర్వాత "వయసు పిలిచె" సీరియల్ వస్తుంది. ఈ ఛానెల్స్ తిప్పుకోవడానికే టైం సరిపోవడంలేదంటే మధ్యలో మీరేంటి?!" ఆగ్రహోదగ్రురాలై చూసింది సీతాలు.
"నీకు తెలుసు కదా సీతాలూ! సాయంత్రం పూట కాఫీ తాగకపోతే కడుపులో ఏదో అశాంతిగా ఉంటుందే!" ముఖం దీనంగా పెట్టుకుని, తన కడుపును పట్టుకుని చెప్పాడు రామారావ్.
భర్త మాటలకు చిర్రెత్తుకొచ్చింది సీతాలుకి. "కాఫీ తాగక పోయినంత మాత్రానికే ఏమీ అయిపోదులెండి. అసలా కడుపుకి ఎప్పుడు ఇబ్బంది లేదని?! ఉదయం లేచింది మొదలు ఆపసోపాలు పడిపోతూ అరడజను సార్లు టాయిలెట్టుకీ వసారాలోకీ రంగులరాట్నంలా తిరుగుతారు. అసలా పొట్టలో ఏదో ప్రోబ్లం ఉంది చూపించుకోండి అంటే వినరు. పైగా నేనేదో మీ కడుపు మాడగొట్టేసినట్టు వెధవ డైలాగులొకటి!"
రామారావ్ మారు మాట్లాడలేదు. సీతాలు టీవీ ఛానెళ్ళు మార్చడంలో బిజీ అయిపోయింది. ఆమె చేతిలోని రిమోట్, జేమ్స్ బాండ్ చేతిలో రివాల్వర్లా విన్యాసాలు చేస్తోంది.
కాసేపు ఆ రిమోట్ తో కుస్తీలు పట్టి భర్త వైపు చిరాగ్గా చూసింది సీతాలు. "ఈ దిక్కుమాలిన రిమోట్లో బ్యాటరీలు వేయించమని ఎన్నిసార్లు చెప్పాలి మీకు?!"
"నిన్ననే వేసాను కదా సీతాలూ?" నెమ్మదిగా చెప్పాడు రామారావ్.
"చవకరకం వేస్తే ఎక్కువసేపు రావండీ! ఫారిన్ వి దొరుకుతున్నాయి తెచ్చి వెయ్యండి. అవైతే కనీసం వారం రోజులకైనా వస్తాయి." హుకుం జారీ చేసింది సీతాలు. 
సీతాలు చేతివేళ్ళెంత వేగంగా పని చేసినా ఆ ఛానెల్ మారలేదు. అందులో వార్తలు మొదలైపోయాయి. దాంతో ఆమె ముఖం మళ్ళీ కందగడ్డలా మారిపోయింది. "అబ్బా, ఇప్పుడెలా...సీరియల్స్ అన్నీ ఇవ్వాళ మిస్సయిపోతానేమో! నాకు చాలా భయంగా ఉంది. అసలే రాత్రి పదింటికొచ్చే "ముదరపాకం" సీరియల్ మంచి రసకందాయంలో ఉంది.  పక్కింటి పిన్నిగారు కూడా లేరాయె! మీరేమో ఈ ముదనష్టపు రిమోట్లో మంచి బ్యాటరీలు వేయించరు." కేకలు వేస్తూ చెప్పింది సీతాలు.
"ఎక్కడ దొరుకుతాయి ఆ ఫారిన్ బ్యాటరీలు?" భార్య కోపాన్ని తట్టుకోలేని రామారావ్ అడిగాడు.
"చెట్టంత మగవాడికి వేలెడంత బ్యాటరీలు ఎక్కడ దొరుకుతాయో కూడా నేనే చెప్పాలా? హవ్వ హవ్వ!!" కోపంగా నోరు నొక్కుకుంది సీతాలు.
"సరే, తెచ్చి పెడతా కానీ వచ్చేసరికి నాకు వేడి వేడిగా ఉప్మా చేసి పెట్టాలి మరి! ఇవాళ ఆఫీస్ లో చాలా పని ఉంది. ఆకలి దంచేస్తోంది." పొట్టను చేత్తో తట్టుకుంటూ చెప్పాడు రామారావ్.
"వేలిచ్చి ఉంగరాన్ని లాక్కోవడం అంటే ఇదే! ముందు కాఫీ అన్నారు... ఇప్పుడు ఉప్మా అంటున్నారు! నాకింకేం పని లేదనుకుంటున్నారా?! ‘మగాడే మహాపాపం' సీరియల్ ఎలానూ మిస్సయింది. ఇదే ఛానెల్లో ఇప్పుడు 'కలవారి కండలు ' సీరియల్ వచ్చేస్తుంది. ఇష్టం లేకపోయినా చూసి చావక తప్పదు కదా! ముందు మీరెళ్ళి రండి త్వరగా!" భర్తను ఆగ్రహంతో చూస్తూ చెప్పింది సీతాలు.
"ఎలాగూ బైటకెళ్తున్నారు కాబట్టి ఉడిపి హోటల్లో వేడి వేడిగా ఉప్మా మీకూ, మసాలా దోశ నాకూ కట్టించేసుకుని రండి. కాఫీ నేను పెడతాన్లెండి. ఏకంగా ఈ రాత్రికి భోజనం కూడా అదే." ప్రోగ్రామంతా భర్తకు చెప్పేసి 'కలవారి కండలు ' చూడ్డంలో మునిగిపోయింది సీతాలు.
ఉసూరుమంటూ బైటపడ్డాడు రామారావ్. మరో గంటసేపు ఊరంతా గాలించి ఫారిన్ బ్యాటరీలు కొని, హోటల్ కి వెళ్ళి టిఫిన్లు కట్టించుకుని ఇంటిదారి పట్టి సీతాలు సీరియల్ పిచ్చి ఎలా కుదర్చాలా అని బుర్రబద్దలు కొట్టుకున్నాడు. 
అంతలోనే అతని బుర్రలో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. నేరుగా కేబుల్ టీవీ ఆఫీసుకెళ్ళాడు.
లోపల కూర్చుని ఉన్న కుర్రాడు రామారావ్ ను చూస్తూనే అడిగాడు. "ఏం కావాలి సార్?"
"మాకు కేబుల్ టీవి వద్దు శ్రీనూ! కనెక్షన్ కట్ చేసేయ్!" కసితీరా చెప్పాడు రామారావ్.
"అలా ఎప్పుడు కట్ చెయ్యమంటే అప్పుడు కట్ చెయ్యం సార్!" నిష్కర్షగా చెప్పాడు కేబుల్ శ్రీను.
"వద్దన్నా బలవంతంగా చూపిస్తారేంటయ్యా?!" కోపంగా అడిగాడు రామారావ్.
"అలా కాదు. మొన్ననేగా మీకు సెటప్ బాక్సు కొత్తది ఇచ్చాం. దానికి ఒక వాయిదానే కట్టారు. ఇంకో రెండు నెల్లకి కానీ మీరివ్వాల్సిన బాకీ అంతా తీరదు.  ఇప్పుడు కట్ చెయ్యాలంటే చెయ్యడం కుదరదు సార్. మీకంతగా కావాలంటే ఆ డబ్బులు కట్టెయ్యండి. వెంటనే కట్ చేసేస్తాను." 
"ఎంతివ్వాలి?" విసుగ్గా అడిగాడు రామారావ్.
"వెయ్యి రూపాయలు. ఈ నెలకివ్వాలసింది మూడొందలు.  సెటప్ బాక్స్ వెనక్కి ఇచ్చేస్తున్నందుకు మరో వెయ్యి కట్టండి." గణిత శాస్త్రవేత్త రామానుజన్లా వేగంగా లెక్కలు చెప్పేసాడు కేబుల్ శ్రీను.
"సెటప్ బాక్స్ వాయిదాలు వెయ్యంటున్నావ్. మళ్ళీ ఇంకో వెయ్యెందుకయ్యా శ్రీనూ?! మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావే?!" రామారావ్ దబాయించబోయాడు.
"అన్యాయం ఏముంది సార్? మీరు సెటప్ బాక్స్ నాకు వాపసు ఇచ్చేస్తారు. ఇంకో కొత్త కనెక్షన్ వచ్చే దాకా నేను దాన్ని ఆఫీసులో పెట్టి పూజిస్తూనే ఉండాలా?! ఆ లాసు ఎవడు భరిస్తాడు? అందుకే ఇలా ఫైన్ వెయ్యడం ఈ మధ్యనే మొదలు పెట్టాం." సగర్వంగా చెప్పాడు కేబుల్ శ్రీను.
రామారావ్ కోపం నషాళానికెక్కేసింది. అంతలోనే తన కోపం, తన కేబులు  తన శత్రువులన్న విషయం చటుక్కున గుర్తు చేసుకుని పచ్చి వెలక్కాయలా గొంతులో ఆ కోపాన్ని అడ్డంగా పడేసుకున్నాడు. పర్స్ తీసి అడిగినంతా కేబుల్ శ్రీను చేతిలో పెట్టేసాడు. 
"ఇప్పుడు కట్ చేసెయ్ మరి!" డబ్బులు పోయినా కేబుల్ పోతోందన్న ఉత్సాహంతో పేద్ద కేరింత పెట్టాడు రామారావ్.
"మీరు ఇంటికెళ్ళేటప్పటికి కనెక్షన్ ఉండదు. మీకు మళ్ళీ కనెక్షన్ కావాలంటే కొత్త ప్లాన్ ప్రకారం అయిదువేలు డిపాజిట్ చెయ్యాలి. గుర్తు పెట్టుకోండి. ఇప్పుడే మీరు ఆలోచించుకుని కనెక్షన్ ఉంచుకుంటే మీకే మంచిది." రామారావ్ ఇచ్చిన డబ్బులను తిరిగి వెనక్కు ఇవ్వబోతూ చెప్పాడు కేబుల్ శ్రీను.
"మళ్ళీ కనెక్షనా? ఈ జన్మలో వద్దురా బాబూ!" అని రెండు చేతులూ దణ్ణం పెట్టి వెనుతిరిగాడు రామారావ్.
రామారావ్ ఇంటికి చేరేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ శోకసంద్రంలో మునిగిపోయి ఉంది సీతాలు. ఆమె చేతిలో మొబైల్ ఫోన్ ఈ అయిదు నిమిషాల సమయంలోనే అరవై సార్లు కేబుల్ ఆఫీసుకి రింగ్ అయినట్టుగా తెలిసిపోయింది రామారావ్ కి. "కేబుల్ టీవీ ఛార్జిలు బాగా పెరిగిపోయాయని కుర్రాడు ఎదురై చెప్పాడు సీతాలూ. అందుకే ఇవాళ్టినుండే ఆపెయ్యమని చెప్పాను." బెదురుబెదురుగా భార్యకు సర్ది చెప్పాడు రామారావ్.
"ముష్టి మూడువందలకే మీకు ఎక్కువైపోయిందా కేబుల్ టీవీ ఛార్జి? ఇంట్లో ఉండే ఆడదానికి ఈ సీరియల్సే ఆధారం అని, అవి లేకపోతే వాళ్ళకు పిచ్చెక్కిపోతుందని కూడా అర్థం చేసుకోలేని మగవాడూ ఒక మగవాడేనా?! ఛీ ఛీ... నాతో మాట్లాడకండి మీరు!" రిమోట్ ని రామారావ్ వైపు విసిరి విసవిసా నడుచుకుంటూ లోపలికెళ్ళిపోయింది సీతాలు. దూసుకొస్తున్న రిమోట్ ని గబగబా వంగుని లాఘవంగా తప్పించుకున్నాడు రామారావ్. గురి తప్పిన రిమోట్ కాస్తా నేలను తాకి బద్దలైంది. రామారావ్ మనసు ఆనందంతో గంతులేసింది!
ఎలాగో ఆ కాళరాత్రి గడిచింది. 
ఉదయం లేచి త్వరత్వరగా ఆఫీసుకి వెళ్ళిపోయాడు రామారావ్.
దిక్కుమాలిన టీవీ సీరియల్స్ ఏవీ లేని ఇంట్లో హాయి గొలిపే  ప్రశాంతతను ఊహించుకుంటూ ఆ సాయంత్రం ఆనందంగా  ఇంట్లో అడుగుపెట్టిన రామారావ్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు!
విలాసంగా సోఫాలో కూర్చుని ఎదురుగా ల్యాప్ టాప్ పెట్టుకుని చిద్విలాసంగా నవ్వుకుంటూ సీరియల్ చూసేస్తోంది సీతాలు. భర్త వైపోసారి చూసి గర్వంగా కనుబొమలెగరేసి మళ్ళీ ల్యాప్ టాప్లోకి తల దూర్చేసింది!
"ఇదెక్కడిది సీతాలూ?!"
"నెట్ కనెక్షన్ తో కలిపి ఏభై ఆరు వేలయ్యింది. మీరు బీరువాలో ఉంచిన అయిదువేలూ స్పాట్ పేమెంట్ గా కట్టేశాను. మిగతాది వాయిదాల్లో!!  మళ్ళీ ఓ పావుగంటలో వస్తానని చెప్పి వెళ్ళాడా ఫైనాన్స్ కుర్రాడు. ఇదిగో ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టండి.” భర్తకు హుకుం జారీ చేసింది సీతాలు.
చేసేదేమీ లేక ఉసూరుమంటూ సీతాలు చూపించిన చోట సంతకం పెట్టేసి కొరకొరా చూసాడామె వైపు.  అదేమీ ఖాతరు చెయ్యలేదు సీతాలు. తన లోకంలో తనుంది మరి!
“గంట లేటయితే అయింది కానీ అన్ని సీరియల్సూ నిక్షేపంగా వచ్చేస్తున్నాయి ఇంటర్నెట్లో!!" ఎగిరి గంతేస్తున్నట్టుగా చెప్పింది సీతాలు!!
అమాంతంగా స్పృహ తప్పి సోఫాలో వెనక్కి వాలిపోయాడు రామారావ్!!
అదేమీ పట్టని సీతాలు మాత్రం "కుంకుమ-పసుపు" సీరియల్ - ఎపిసోడ్ నంబర్ 876 ని ఆనందంగా చూస్తూనే ఉంది!!

.

oooo

Bio

రాజేష్ యాళ్ళ

రాజేష్ యాళ్ళ: వీరి నివాసం విశాఖపట్నం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో క్యాషియర్ గా ఉద్యోగం . అప్పుడప్పుడూ కథలు రాయడం ప్రవృత్తి. తెలుగు భాషన్నా, తెలుగు సాహిత్యమన్నా ఎనలేని ఇష్టం.

***

rajesh yalla
Comments
bottom of page