top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  3

Website Published &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా​ మధురాలు

ఎక్కడమ్మా కోడలా

 

పద్మజ చివుకుల

Padmaja Chivukula

ఓ ఆహ్లాదకరమైన ఉదయం. బాల్కనీ లో కూర్చుని వేడి వేడి కాఫీ సేవిస్తూ చలి తెరల్ని చీల్చుకుంటూ పైకి వస్తున్న సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నాను.

"ఇదిగోండి, ఇవ్వాళ ఏకాదశి, మంచి రోజు, పని మొదలు పెట్టండి" లాప్ టాప్ తెచ్చి నా ముందు పెట్టింది శ్రీమతి. మా ఆవిడ అని అనలేదండోయ్, తన పేరే శ్రీమతి.

"శుభం, అవిఘ్నమస్తు" అనుకుంటూ మాట్రిమోనీ వెబ్ సైట్ ఓపెన్ చేశాను.  దీని గురించి నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇప్పుడు కొలీగ్ కూడా అయిన సుధాకర్ చెప్పాడు.

పోయిన వారం "మా వాడికి ఏమన్నా మంచి సంబంధాలుంటే చెప్పరా. ఈ ఏడు పెళ్లి చేసేస్తాం" అడిగాను సుధాకర్ ని. 

వాడిక్కూడా ఒకడే కొడుకు, కాకపోతే అయిన సంబంధమే వుంది కనుక వాడు వెతకక్కర్లేదు.

"నాకు చెప్పావు గా, ఇంకా వదిలేయ్" అన్నాడు. అనటమే కాదు మూడో రోజు నా సీట్ దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు. వాడిది వేరే డిపార్టుమెంటు.

"మా షడ్డకుడి కూతురుంది రా" వివరాలన్నీ ఫోన్ మెసేజ్ రూపం లో ఇచ్చాడు. మా వాడి వివరాలన్నీ కూడా ఇచ్చాను సుధాకర్ కే. తర్వాతి వారం నింపాదిగా చెప్పాడు, వాళ్ళు చూపిస్తే జాతకాలు కలవలేదట.

"ఇదేమిట్రా, మొదటి దే ఇలా అయ్యిందేంట్రా?" మొహం వేలాడేసాను.

"ఏం కాదులేరా. నువ్వసలు వాళ్ళతో మాట్లాడలేదు కాబట్టి ఇదసలు లెక్క లోకే రాదు"

"అంతేనంటావా"

"అంతే. అయినా మా వాళ్ళందరూ ఇలా విడిగా చూడట్లేదు రా. మాట్రిమోనీ సైట్ లు చాలా వున్నాయి. దీని తాత లాంటి సంబంధాలు ఉంటాయి అందులో. మా ఎంక్వయిరీ బాక్స్ కి చెప్పానంటే అసలు ఇంటర్నెట్ ఎప్పుడు మొదలైంది, మాట్రిమోనీ వెబ్ సైట్స్ ఎప్పుడు వచ్చాయి.. ఇత్యాది వివరాలన్నీ నీ చేతి లో పెడుతుంది" గొప్పగా హామీ ఇచ్చాడు. ఎంక్వయిరీ బాక్స్ అంటే వాళ్ళ ఆవిడ అన్నమాట.

దాని ఫలితమే ఇవ్వాల్టి ఈ కార్యక్రమం. అన్ని వివరాలు ఎంటర్ చేసి, కాస్సేపు కనిపించిన కొన్ని ప్రొఫైల్స్ చూసి, కాస్సేపు శ్రీమతి తో ముచ్చటించాను.

"ఆమ్మో తొమ్మిది అయింది. నా టిఫిన్?"

"ఏమంత తొందర? ఆదివారమేగా. కాస్సేపాగండి" ఎన్నో సంబంధాలు వచ్చినట్లు, అందమైన కోడలు దొరికినట్లు ఊహించుకుని మురిసిపోతున్న శ్రీమతి విసుక్కుంది.

మర్నాడు ఆఫీస్ కి వెళ్ళానే కానీ కళ్లన్నీ ఫోన్ మీదే. దాని దుంప తెగ.. రోజూ చేసే కాల్ సెంటర్ల వాళ్ళు కూడా మొరాయించారు. ఇంటికి రాగానే శ్రీమతి ఆత్రం గా "ఎవరైనా చేసారా?" అడిగింది. తల అడ్డం గా వూపాను.

"చేస్తారు లెండి. నిన్నేగా రిజిస్ట్రేషన్ చేసాం. ఇవ్వాళ ద్వాదశి, ఎవ్వరూ చెయ్యరు. రేపు వస్తాయి చూడండి" విశ్లేషించింది.

ఆ సంబడం కూడా అయింది. మూడో రోజు ఇంక ఉండబట్టలేక సుధాకర్ కి ఫోన్ చేశాను.

"ఆర్నీ ఆత్రం గూలా. కాస్త ఆగరా. ఈ రెండ్రోజులు కాస్త పని వుంది. ఆదివారం ఇంటికొస్తా తీరికగా" ఫోన్ పెట్టేసాడు.

వీడికే పెద్ద పని ఉన్నట్టు పోజు తిట్టుకుంటూ “టిఫిన్లకే వచ్చేయండి నువ్వూ,చెల్లెమ్మా” అని మెసేజ్ పెట్టాను.

చిద్విలాసం గా సతీసమేతం గా విచ్చేశాడు తొమ్మిది గంటలకల్లా. వాళ్ళావిడ శ్రీమతికి మంచి ఫ్రెండ్. వేడి వేడి ఇడ్లి, పెసరట్టు ఉప్మా చేసింది శ్రీమతి.

"బాగా మెక్కావుగా, చెప్పు ఇంక" కసిగా అన్నా.

"ఉండరా. అక్కడికే వస్తున్నా" ఉయ్యాల బల్ల మీద సర్దుక్కూర్చున్నాడు.

"విషయం ఏంటంటే. ఆడపిల్ల వాళ్ళు చెయ్యకపోతే మనమే చెయ్యాలిట" ఉపదేశిస్తున్నాడు వేడి వేడి అల్లం టీ చప్పరిస్తూ.

"మరీ మనమే చేస్తే ఏం బాగుంటుందిరా" సందేహించాను.

"ఈ రోజుల్లో అలాంటివి పట్టించుకోకూడదు. ముందుకెళ్లిపోవటమే".

 నలుగురం లాప్ టాప్ చుట్టూ చేరాం. మా అభిరుచి కి తగినట్లున్నవన్నీ సెలెక్ట్ చేసాం.

మొదటి నెంబర్ కి ఫోన్ చేశాను. ఉత్సుకత గా చూస్తున్నారు శ్రీమతి, సుధాకర్ దంపతులు.

"హలో"  అటునుంచి.

"నమస్తే. నా పేరు వెంకటరమణ"

"ఆ.. అయితే"

వామ్మో ఏంటిది? అనుకుంటూ "మీ అమ్మాయి ప్రొఫైల్ చూసాం మాట్రిమోనీ లో. మా అబ్బాయి వున్నాడు. కనుక్కుందామని చేశాను" చెప్పాను.

"ఆహా.. మీ అబ్బాయి రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పండి. చూసాక చేస్తాం" ఇంక మాట్లాడేమి లేనట్లు చెప్పాడాయన. నెంబర్ చెప్పి పెట్టేసాను.

"ఏంట్రా కాస్త అన్న మంచి మన్ననా లేకుండా" అసంతృప్తి గా అన్నాను.

"ఏం కాదులే.. ప్రొసీడ్. నెక్స్ట్ నెంబర్ చూడు"

"హలొ" ఆడ గొంతు.

నా పరిచయం చేసుకుని "మీ వారికిస్తారా.  మాట్లాడతాను" అన్నాను.

"నేనే మాట్లాడతా మా ఇంట్లో. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎక్కడా?" ప్రశ్నలు వరసగా సంధిస్తోంది.

"ఒక్క నిముషమమ్మా. మా ఆవిడ మాట్లాడుతుంది" నాకు ఆవిడతో ఇబ్బంది అనిపించి శ్రీమతి కి ఇచ్చాను.

ఒక ఇంటర్వ్యూ లో ప్రశ్నలకి సమాధానాలు చెప్పినట్లు చెపుతోంది శ్రీమతి. అయ్యాక "ఏమిటండీ.. పెళ్ళైతే మన అబ్బాయి నోరు కుట్టేసేటట్లు వున్నారు. వద్దు" ఏవగింపు గా చెప్పింది.

"ఇలాగే చూడరా. మంచిది సెట్ అయ్యేవరకు. ఇక వస్తాం" చెప్పి వెళ్ళిపోయాడు సుధాకర్ భార్యను తీసుకుని.

ఆ రోజు నుంచి రోజుకొక ఫోన్ నెంబర్ తీసుకోవటం, చెయ్యటం నిత్యకృత్యమై పోయింది.

ఒకరోజు "మొన్న మీరు ఫోన్ చేసారు కదండీ. అమ్మాయిని చూసుకోవటానికి వస్తారా?" కాస్త మర్యాదగానే అడిగారు. తర్వాతి వారం మా అబ్బాయి అభిషేక్ ని తీసుకుని పెళ్ళిచూపులికి వెళ్ళాం. ముగ్గురం ఎందుకని సుధాకర్ ని కూడా రమ్మన్నాను.

అమ్మాయి తరపు వారు బాగానే మర్యాద గా ప్రవర్తించారు. పిల్ల కూడా బాగుంది. నాకు, మా ఆవిడ కి నచ్చింది. అభిషేక్ కేసి చూసాను, నాకిష్టమే అన్నట్లు అనిపించింది. "ఒకసారి పిల్లలు మాట్లాడుకుంటే బాగుంటుంది" అన్నాడు పిల్ల తండ్రి. మాకు అదే నయం అనిపించింది. ఇంకాస్సేపు పిచ్చా పాటి మాట్లాడి వచ్చేస్తుండగా అన్నాడు మా అబ్బాయి "తాను బాగానే మాట్లాడింది డాడీ. నేను యూ.స్. వెళ్లే అవకాశం వుందా అనడిగింది.  నేను ఒక్కడినే కనుక అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశ్యం లేదు, ప్రాజెక్ట్ మీద అయితే వెళ్లి వచ్చేస్తాను అన్నాను".

నా శ్రీమతి, కొడుకు అంగీకారం తెల్పాక మర్నాడు ఫోన్ చేశాను వాళ్ళకి నచ్చింది అని చెప్దామని.

"సారీ అండి. యూ.స్. వెళ్లనన్నారని వెనకాడుతోంది అమ్మాయి" నసుగుతూ ఫోన్ పెట్టేశారు అయన.

నిర్ఘాంతపోయాను. శ్రీమతి నిట్టూర్చింది. సరే.. ఇది కాకపోతే ఇంకొకటి.. అనుకుంటూ లిస్ట్ ముందేసుకున్నాను.

ఆ తర్వాత ఒక్కక్కటే ఎదురు దెబ్బ తగులుతూ వచ్చింది.

"ఒక్కడే కొడుకున్న సంబంధం వద్దనుకున్నామండీ" ఒక తల్లి దీర్ఘం తీసింది.

ఎక్కువ మంది అయితే బాధ్యతలు అంటారు, ఒక్కడైతే శొంఠికొమ్ము అంటారు. ఎట్లా వేగాలి వీళ్ళతో..

"అబ్బాయి జాబ్ చేసేది మరీ పెద్ద MNC కాదు కదా!" ఒక డిటెక్టివ్ తండ్రి.

"ఆల్రెడీ నాలుగు, అయిదు సంబంధాలు లైన్ లో వున్నాయి. అవి కాకపోతే అప్పుడు చూద్దాము " మరొకరు .. ఇదేమైనా టికెట్ క్యూ నా??

"మీ అబ్బాయి తన భావాలకు మ్యాచ్ కాలేదు అంటోందండి మా అమ్మాయి "ఒక పుత్రికావిధేయుడైన తండ్రి.

మరొక సంబంధం వాళ్ళైతే ఫోన్ చేస్తూనే "అత్తగారు వున్న సంబంధం చెయ్యం" మొహం మీద కొట్టినట్లే చెప్పారు. "వీళ్ళ దుంప పిలక బెట్ట.. వాళ్ళ కోసం నేను పోవాలా?" ముక్కు చీదింది నా శ్రీమతి.

ఇంకా ఎన్ని తమాషాలు విన్నానంటే..."మీది పిత్రార్జితం ఇల్లు అంటున్నారు, అంటే పాతది, చాకిరీ ఎక్కువ, ఫెసిలిటీస్ తక్కువ.. అమ్మేసి ఫ్లాట్ తీసుకుంటారా?" ఏమిటో తన కూతురి చేత చాకిరీ చేయిస్తామన్నట్లు ఫీల్ అయ్యాడు ఒక మహానుభావుడు.

ఇవ్వన్నీ విని పిచ్చెక్కింది నాకు. జుట్టు పీక్కుందామన్నా బట్టతలాయా! మర్చిపోయా.. ఒక సంబంధం నా బట్ట తల వల్లే తప్పిపోయింది. వంశపారంపర్యం గా వస్తుంది అబ్బాయి క్కూడా అని తిరక్కొట్టింది ఆ పిల్ల.

పాత కాలం లో అమ్మాయిలదే రాజ్యం. పూర్వం రాజుల కాలం లో స్వయంవరం ప్రకటించి మరీ ఎన్నుకునేవారు రాజకుమార్తెలు. తర్వాత కూడా కన్యాశుల్కం ఇచ్చి మరీ ఆడ పిల్లలని చేసుకునేవారు. తర్వాత నుంచి కాలం మారింది. మరీ 50 ల దశకం నించి ఆడపిల్లల పరిస్థితి దుర్భరం ఐంది. కన్యాశుల్కం స్థానం లో వరకట్నం మొదలైంది. ఒక సగటు తండ్రికి కూతుళ్లు గుండెల మీది కుంపటి గా మారారు. ఎక్కడ చూసినా ఆడపిల్ల పెళ్లి చేయలేని తల్లి ద్రండులు, వరకట్నం పేరుతో పీక్కుతినే అబ్బాయిల తల్లితండ్రులు. 90 వ దశకం దాకా ఇదే పరిస్థితి.

ఎవరిదాకో ఎందుకు. తన తల్లే ఉదాహరణ. కట్నం ఇవ్వలేకపోయారని పీటల మీద పెళ్లి ఆపపోయిందట తన నాన్నమ్మ. చిన్నగా నచ్చచెప్పి పెళ్లి జరిపించారట తాతగారు. అప్పటినుంచి అమ్మకు అత్తగారి ఆరళ్ళు రుచి చూపించింది నాన్నమ్మ. ఇంటెడు చాకిరీ అమ్మదే. అయినా కడుపు నిండా తిననిచ్చేది  కాదు అత్తగారు. రోజంతా సూటిపోటి మాటలు, సాధింపులే. పనంతా పూర్తి చేసి పెరట్లో ఒక మూలన కూర్చుని ఏడ్చేది అమ్మ. చాలా చిన్నవాడు తాను. బుల్లి బుల్లి చేతుల్తో అమ్మ కన్నీళ్లు తుడవడం లీలగా జ్ఞాపకం. నాన్న గారు కూడా నాన్నమ్మ కు ఎప్పుడూ ఎదురు చెప్పలేదన్నట్లే గుర్తు మరి.

ఒకరోజు పొద్దునే లేచేసరికి నాన్నమ్మ అరుపులు వినపడ్డాయి. అమ్మ నూతి లో కాలు జారి పడిపోయిందని చెప్తోంది అందరికీ. అప్పుడు తెలియలేదు గాని కాస్త పెద్దయ్యాక అర్ధం అయింది అమ్మ జారిపడలేదు, కావాలనే ప్రాణం తీసుకుందని. కనీసం నాన్నగారి ఓదార్పు వున్నా అమ్మ బతికేదేమో. ఆ తర్వాత నాన్నమ్మ నన్ను బాగానే ఆదరించింది, తల్లి పోయిందనే జాలి అయ్యుండచ్చు.

ఊహ తెలిసాక అనుకున్నాడు తన భార్య ను ఎప్పుడూ ఏడిపించకూడదని. అలాగే చూసాడు కూడా. ఏ ఒక్కరోజు శ్రీమతిని కంట తడి పెట్టనివ్వలేదు. ఆఖరికి డెలివరీ అప్పుడు తన ఏడుపు చూడలేక మళ్ళీ పిల్లల మాట తలపెట్టలేదు.

అమ్మ కాలం లాంటి పరిస్థితులు ఈ రోజు లేవు. 2000 నుంచి కాలం మళ్ళీ మారింది. ఆడపిల్లల ఛాయిస్ మళ్ళీ వచ్చింది. చాలా పారామీటర్స్ చూసి మరి ఎన్నుకుంటున్నారు. ఎలాంటి అమ్మాయిలు దొరుకుతారో అని భయపడటం అబ్బాయిల వంతయింది.... మా కోడలు ఎక్కడ వుందో, ఎప్పుడు బయటికొస్తుందో....ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మోగింది. కొత్త నెంబర్.

"హలో" అన్నాను అనాసక్తంగా.

"నమస్కారమండీ. నా పేరు పరంధాము. మీ అబ్బాయి పెళ్ళికి వున్నాడని తెలిసి మా అమ్మాయికి అడుగుదామని చేశాను" అన్నాడతను.

"అలాగా. ఇంతకు ముందు ఏమైనా చూసారా?" ఎందుకైనా మంచిది అని అడిగాను గత అనుభవాల్ని దృష్టి లో పెట్టుకుని.

"లేదండి. ఇందాకే రిజిస్ట్రేషన్ చేసాం వెబ్ సైట్ లో. మీ అబ్బాయి వివరాలు చూసి ఫోన్ చేస్తున్నాను" నొచ్చుకుంటున్నట్లు అన్నాడు.

ఇద్దరి తరపున వివరాలు మాట్లాడుతుంటే తెలిసింది, అతను అమ్మ తమ్ముడి కొడుకని. అంటే నాకు బావ. నా ఆనందానికి అవధులు లేవు. మా అమ్మ ఒకసారి మా ఇంటికొచ్చి కష్టపడింది, ఈ సారి కోడలి రూపంలో మరో సారి వస్తే తనకు అంతులేని ఆనందం కలిగించాలి.

వెంటనే చెప్పేసాను "బావా, మీ సంబంధం మాకు అంగీకారమే. మేం పిల్లని చూడనక్కరలేదు. కాకపోతే మీరు అబ్బాయిని చూడాలి కాబట్టి రేపు మీరు రండి. మీకందరికీ ఇష్టమైతే మీ అమ్మాయే నా కోడలు".

పక్కనుంచి శ్రీమతి ఆశ్చర్యం గా వింటోంది. ఫోన్ పెట్టేసి నా శ్రీమతి తో చెప్పాను సంతోషం గా "మా అమ్మే మళ్ళీ మనింటి కోడలిగా వస్తోంది."

ఆ తర్వాత మా ఇంటి పెళ్లి సందడి చెప్పాలంటే  కాదు, నవలే అవుతుంది.

***

bottom of page