top of page

కథా మధురాలు

ఏకాకి

Tirumalasree

ఆర్. శర్మ దంతుర్తి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ

టెక్సాస్ లో ఆస్టిన్ సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్ మెంట్. సత్య మూర్తి పొద్దుటే లేచి కుక్కతో బాటు అలా నాలుగు రోడ్లూ తిరిగొచ్చాక స్నానం చేసి టి.వి. చూడ్డం మొదలు పెట్టాడు కాఫీ తాగుతూ. ఈ ఎనభై ఏళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు? తాను అమెరికా వచ్చినప్పుడు టి.వి. రిమోట్ అనేది ఉండేది కాదు. ఇప్పుడో? తన ఫోను ఉంటే చాలు, కాలు కదిపే పనిలేదు. ఆ ఫోనే టివీ రిమోట్ లాగానూ, దానితోటే వాతావరణం ఎలా ఉందో, అన్ని ఒక్క సెకనులో తెలుస్తున్నాయి. మనిషి ఎంత పురోగమించినా మనస్తత్వం పురోగమించదు కాబోలు. తానొచ్చి యాభై ఆరేళ్ళవుతోంది.
 
ఆలోచనలని ఆపడానికా అన్నట్టు ఫోను మోగింది. తనని వారానికి మూడు సార్లు ఇంటికే చూడడానికొచ్చే నర్సమ్మ దగ్గిర్నుంచి. ఓ గంటలో రావొచ్చా అని అడుగుతోంది. రావొచ్చని చెప్పాక మళ్ళీ ఆలోచనలు. నదులన్నీ చివరకి సముద్రంలోనే కలుస్తాయన్నట్టుగా ఏది ఎక్కడ మొదలు పెట్టినా చివరకి తన ఆలోచనలన్నీ తండ్రి దగ్గిరే ఆగుతాయి. ఓ సారి గతంలోకి వెళ్తే-

తనకి అప్పుడు పదిహేనేళ్ళు. అప్పుడే టెంత్ క్లాసు రిజల్ట్స్ వచ్చాయి. తనకొక్కడికే సెకండ్ క్లాసు వచ్చింది. మొత్తం నలభై మంది పరీక్ష కెళ్తే అందులో పాసైంది పంతొమ్మిది మంది. ఒక్కడికి కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. తనదే స్కూల్ ఫస్ట్. అయినా ఇంటికొచ్చేసరికి నాన్న కృష్ణా రావు తిట్టడం మానలేదు, "అప్రాచ్యపు వెధవా, నీ గురించి ఎంత కష్టపడినా, ఎన్ని ప్రైవేట్లు పెట్టించినా సెకండ్ క్లాస్ ఏవిట్రా?" అని మొహం మీదే చివాట్లు పెట్టాడు. స్కూల్లో ఎవరికీ పస్ట్ క్లాస్ రాలేదు కదా అని సర్ది చెప్పబోయేరు తాను, తన స్నేహితులూను. ఆయన వింటేనా? ....
 
తలుపు చప్పుడైతే వెళ్ళి తీసాడు నర్సమ్మ ని లోపలకి రానివ్వడం కోసం. ఎప్పటి లాగానే బ్లడ్ ప్రెషరూ, షుగరూ కొలిచాక అడిగింది నరసమ్మ, "ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఏమైనా తేడాగా ఉంటోందా? జీవితం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?" యధాప్రకారం అడగవల్సిన ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలు అడగడానిక్కారణం తన ఉద్యోగం పోకుండా చూసుకోవడమే కానీ సత్యమూర్తి బాగు కోసం కాదనేది ఇద్దరికీ తెల్సిన విషయమే.

ఓ నీరసం నవ్వు నవ్వి చెప్పేడు సత్య మూర్తి "ఈ కుక్క లేకపోతే ఈ పాటికి పోయి ఉండేవాణ్ణే. ఈ వయసులో ఇక బ్లడ్ ప్రెషర్ ఎలా ఉన్నా ఒక్కటే. అప్పుడప్పుడూ నడుస్తుంటే కళ్ళు తిరుగుతుంటాయి. కానీ ఆగి, ఆ తల తిరుగుడు తగ్గాక నడిస్తే బాగానే ఉంది. జీవితం ఎలా అంటే పోయే ప్రాణమే కానీ వచ్చేది కాదు కదా? నేను పరుగెట్టిన రేస్ అయిపోయింది. ఆ పైనున్న వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడమే."
 
"అందరూ అంతే కదా? పైనున్న వాడు ఎవర్ని ఎప్పుడు పిలుస్తాడో తెలిస్తే ఇంక కథేముంది?" నర్సమ్మ చెప్పింది, "అయినా ఎనభై ఏళ్ళ వయసులో మీరు మీ పనులు చేసుకోగల్గుతున్నారు. తోడుగా ఈ బోల్ట్ అనే కుక్క ఉంది. మీకేమైనా అయితే ఇక్కడున్న ఎమర్జన్సీ బటన్ లు ఎలా నొక్కాలో ఏమి చేయాలో ఈ బోల్ట్ కి ట్రైనింగ్ ఇచ్చారు కదా? ఏమీ ఆదుర్దా పడకండి. మీరు నిశ్చయంగా నిండు నూరేళ్ళు బతుకుతారు."

"ఆ, బతకడం సరే, బతికి ఏం చేయాలి?" 

"జీవితం ఇలాగే ఉంటుంది మిస్టర్ మూర్తీ, ఎవరికైనా అంతే కదా? జస్ట్ గో విత్ ద ఫ్లో!" నవ్వుతూ బయటకి నడిచింది నరసమ్మ మళ్ళీ రెండు రోజులాగి వస్తాను అంటూ.
ఆవిడని వెళ్ళనిచ్చి తలుపు వేసాక మళ్ళీ చిన్నప్పటి ఆలోచనలు. పియ్యూసి అయ్యేక ఏమైంది? ....
 
"నీ మార్కులకి ఇంజినీరింగులో ఏ బ్రాంచ్ వస్తుందిరా? ఏ బ్రాంచ్ తీసుకుంటున్నావు?" కృష్ణారావు అడిగేడు కొడుకు  సత్య మూర్తి ని.

"ఎలక్ట్రానిక్స్ లో వైజాగ్ లో జేరుదామని... " మాట నాన్చేసేడు సత్యం.

"అదేంట్రా, కాకినాడ మనకి దగ్గిరే కదా? రోజూ వెళ్ళి రావొచ్చు."

"వైజాగ్ లో అయితే ఎలక్ట్రానిక్స్ బావుంటుంది అంటున్నారు తెల్సినవాళ్ళు."

"ఎలక్ట్రానిక్స్ మనకెందుగ్గానీ, మెకానికల్ తీసుకోకూడదూ? అశోక్ లేలాండ్ లోనో మరో కంపెనీలో ఉద్యోగం వస్తుంది"

"నాకు ఎలక్టానిక్స్ చదవాలని ఉంది"

"ఇలా తయారయ్యావన్న మాట. మన సీతారామం కనక ఇక్కడే ఉండి ఉంటే అతని చేత చెప్పించి ఉండేవాణ్ణి. సీతారామం మెకానికల్ తీసుకోలేదూ?"

"నాన్నా, సీతారామం మెకానికల్ ఎందుకు తీసుకున్నాడో నీకు తెలుసా?"

"ఇష్టం ఉండే తీసుకున్నాడు."

"అక్కడే నీతో నాకు దెబ్బలాట. సీతారామంకి ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలనే ఉంది కానీ మార్కులు సరిపోక మెకానికల్ తీసుకున్నాడు.  నేను క్రితం సారి వచ్చినప్పుడు మాట్లాడితే ముందు ఎలక్ట్రానిక్స్ వస్తే తీసుకో అని చెప్పాడు."

"మెకానికల్ అందరికీ ఉద్యోగాలొస్తాయిరా. మెకానికల్ తీసుకుంటే రేప్పొద్దున్న ఉజ్జోగం రాకపోయినా ఏదో షెడ్డు పెట్టుకోచ్చు."

సత్యం విసురుగా లేచి బయటికెళ్ళిపోయేడు. నాన్న చిన్నప్పట్నుంచీ అంతే. తనిష్టం అనేదేమీ ఉండకూడదు. ఆయనకి నచ్చింది నేను చేయాలి. వైజాగ్ లో సీటు కానీ వచ్చిందా మళ్ళీ ఇటువైపు రాకూడదు, మనసులో ఒట్టుపెట్టుకుంటూ ముందుకి సాగాడు సత్యం.
 
ఆరేళ్ళు గడిచే సరికి సత్యం బి.ఈ పూర్తిచేసుకుని మద్రాసు ఐ ఐ టి లో తాను తీసుకున్న ఎలక్టానిక్స్ ఎం టెక్ చివర్లో ఉన్నాడు. తర్వాత రెండేళ్ళలో ఐ ఐ టి చదివే వాళ్ళందరూ చేసేది ఒకటే కనక అట్నుంచటే అమెరికా వచ్చేసాడు. ఖాళీగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు తల్చుకుంటే, మొదట్లో తండ్రి మెకానికల్ లో జేరమన్నందుకు కోపం, అంతకుముందూ రోజూ తనతో నెగటివ్ గా మాట్లాడుతూ  తనకొచ్చిన రేంక్ లని కూడా మెచ్చుకోకపోవడం వల్ల తండ్రి అంటే అదో విముఖత. తన తల్లి ఏనాడు నోరెత్తింది కనక తండ్రి ముందు?
 
ఏదో చిన్నప్పుడు బీదరికంలోంచి పుట్టినవాళ్లనుకున్నా, తన తండ్రికి ఉద్యోగం ఉంది. తిండికీ బట్టకీ లోటులేదు. తనని మరి అలా కించపరుస్తూ మాట్లాడ్డం ఎందుకు చేసాడో? ఎప్పుడో ఓ సారి జోకులా అనడం వేరూ ప్రతీ రోజూ దెప్పడం వేరూ. తనకి వైజాగ్ లో ఉన్నంతకాలం డబ్బులు పంపించాడు సరే అవి తాను అమెరికా వచ్చేసాక అణా పైసల్తో సహా వెనక్కి ఇచ్చేశాడు కదా?
 
తన తండ్రి కృష్ణారావు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ నెగటివ్ కిక్కులు ఇవ్వడంలో ఆయనంతటివాడు లేడు. తనకి పియ్యూసి లో మంచి మార్కులొచ్చినా ఎలక్ట్రానిక్స్ లో వైజాగ్ లో సీటు వచ్చినా మెచ్చుకోవడం అన్నది ఎప్పుడు లేదు. తాను ఇంట్లో లేనప్పుడు తన గురించి ఏమి చెప్పేవాడో కానీ తన ముందు మాత్రం ఎప్పుడు మెచ్చుకున్నది లేదు. ఏ పండగకో, పబ్బానికో బట్టలు కొనడం కోసం కూడా తీసుకెళ్ళి తనకి నచ్చినవి తీసుకోమనేవాడు. తాను తీసుకున్న టెరీకాట్ లాంటి ఖరీదైనవి చూసి డబ్బులిచ్చినా ఇంటికొచ్చేదాకా "మనం చేసే ఉద్యోగానికి ఈ కాటన్ బట్టలు సరిపోవు కాబోలు. అయ్యగారికి టెర్లినూ టెరీకాటూనూ" అని సణుగుతూనే ఉండేవాడు.  ఈ సణుగుడంతా వినీ వినీ తనకి మళ్ళీ తండ్రి మొహం చూడాలని అనిపించలేదు. ఆయనంతే అనుకుంటూ కాకినాడలో సీటు వస్తుందని తెలిసినా కావాలని దూరంగా వైజాగ్ లో సీటు కావాలని చెప్పి అక్కడికే వెళ్ళాడు.
ఐ ఐ టి నుంచి అమెరికా వచ్చేస్తూంటే తండ్రికి కానీ తల్లికి కానీ చెప్పలేదు.  ఆయనికి తెలిస్తే ఏమంటాడో - వెళ్ళనిస్తాడో లేదో లేకపోతే ఎటువంటి నెగటివ్ కిక్కు తగుల్తుందో అని శంక. విమానం ఎక్కాక చిన్నగా కొంచెం బాధ మొదలైంది అదేమిటో. తనకూడా ఎయిర్ పోర్ట్ కి ఎవరూ రానందుకేమో. తనకి తండ్రి దగ్గర్నుంచి శాశ్వత స్వాతంత్ర్యం ఇస్తూ విమానం తనని అమెరికా తీసుకొచ్చి పారేసింది. మరెప్పుడూ ఇండియా వెళ్ళాల్సిన పని రాలేదు.
 
రాలేదా, అంటే నిజంగానే వచ్చింది వెళ్ళాల్సిన పని కానీ తానే వెళ్ళలేదు అనడం సరి. అమెరికా వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఇంటికి తీరిగ్గా ఉత్తరం రాయడం - తాను ఎందుకు చెప్పకుండా వచ్చాడో, అవన్నీ ఏవరువు పెడుతూ. తండ్రి తక్కువ తిన్నాడా? ప్రతి ఉత్తరంలో ఎందుకలా అన్నాడో, ఎందుకు అంటూనే ఉంటాడో అన్నీ చెప్తూ రాశాడు. కొంతమంది అంతే. వాళ్ళు చెప్పిందే వేదం. దూర తీరాల్లో ఉన్నాడు కదా ఇంక వృద్ధిలోకి వచ్చిన కొడుకుతో సరిగ్గా మాట్లాడదాం అనుకోలేదు ఆయన. ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా అమ్మ నాన్నతో అలా అంటారేం అని కానీ తనని వెనకేసుకొచ్చినది కానీ లేదు. ఆవిడ తనకో అర్ధం కాని ప్రహేళిక. వంట గదీ, తానేమో తన పనేమిటో అంతే.
 
అమెరికా వచ్చిన మూడు నెలల్లో తనకి లిండా పరిచయం. మరో ఏడాదిలో ఇక్కడే పెళ్ళీను. తండ్రికీ, తల్లికీ చెప్పాలనిపించలేదు. చెప్తే తండ్రి ఏమంటాడో ఊహించడం అంత కష్టమా? ఉత్తరోత్తరా తండ్రి దగ్గిర్నుంచి డబ్బులకోసం ఇప్పుడో ఉత్తరం అప్పుడో ఉత్తరం వచ్చేవి. ఆయన రిటైరైపోయి ఆ ఊర్లోనే ఉన్నాడని ఉత్తరాలు చెప్పేవి. తాను రాయడం తగ్గించాడు కూడా.  పుట్టిన పిల్లలకి తానూ లిండా ఎలాగో అలాగే ఒక హిందూ పేరు, ఒక క్రిష్టియన్ పేరూ కలిసి వచ్చేలాగా మల్లిక అనీ అబ్బాయి మైకేల్ అనీ పేర్లు పెట్టారు. రోజులు గడుస్తూంటే ఓ రోజు ఆఫీసునుంచి ఇంటికొచ్చాక టెలెగ్రాం అనేది వచ్చింది. మీ నాన్న పోయాడంటూ ఎవరో పంపిన టెలెగ్రాం అది. ఫోనులో చెప్పేసి తర్వాత పోస్టులో పంపారు. ఏమి చేయాలో తనకి తెలియలేదు. టెలెగ్రాం వచ్చేసరికి అప్పటికే తండ్రిపోయి మూడురోజులౌతోంది.
 
లిండాతో మాట్లాడాడు.  మల్లికకీ, మైకేల్ కీ స్కూళ్ళు ఉన్నాయి. అవికాక సాయంత్రం లో వేరే స్విమ్మింగ్ క్లాసులూ స్కూల్లో మరోటీ, మరోటీను. లిండా తెగేసి చెప్పేసింది తాను ఇవన్నీ చూసుకోలేనని. కావలిస్తే ఓ పది రోజులు శెలవు తీసుకుని వెళ్ళలేకపోయేవాడా? తనకీ వెళ్ళాలనిపించలేదు. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న - వెళ్ళి ఏం చేయాలి? ఈ పాటికి తండ్రికి అంతిమ సంస్కారం అయిపోయి ఉంటుంది. పదోరోజు దాకా తాను అమ్మ మొహం చూస్తూ కూర్చోవాలి. ఆవిడ తనని కనడం తప్ప ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడింది లేదు. అన్నీ ఆలో చించుకుని వెళ్ళకూడదనే నిశ్చయించుకున్నాడు. ఎవరో పెద్దమనిషి రెండురోజులకి - ఎలా సంపాదించాడో కాని, తనకి ఫోన్ చేసాడు మళ్ళీ రమ్మని అడగడానికి.  ఎడ్రస్ సంపాదించి తల్లికి డబ్బులు పంపించాడు కానీ వెళ్ళలేదు. మరో రెండేళ్ళకి అమ్మ పోయినప్పుడు కూడా ఇదే తంతు - మరో సారి రెవైండ్ అండ్ ప్లే బాక్ అన్నట్టు. ఆ తర్వాత అక్కడి ఇల్లు ఏమైందో, ఎవరెలా ఉన్నారో తనకి పట్టలేదు....
 
మధ్యాహ్నం అవుతూంటే లేచి కిచెన్ లోకి వెళ్ళాడు సత్యమూర్తి ఆకలి తీర్చుకోవడానికి. బోల్ట్ కూడా వచ్చింది. దానికి పెట్టాల్సినది పెట్టి నీళ్ళు అందించాక గతం రాత్రి వండుకున్న ఉప్మా తీసి వేడి చేసుకుని తినడం సాగించాడు. తింటూ, ఎప్పుడో కొన్న సి.డి పెట్టేడు మ్యూజిక్ వినడానికి. సుమతీ శతకం, వేమన శతకం ఒక్కొక్కటీ వస్తున్నాయి.
 
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమి లేమి వసుధను సుమతీ!
 
.... మరో ఇరవై ఏళ్ళు గడిచేసరికి అంచెలంచెలుగా తనకి ప్రమోషన్లూ, డబ్బులూ వచ్చిపడుతూనే ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్లై వాళ్ల దారి వారు చూసుకున్నారు. అమెరికన్ల లాగే తాను - తండ్రి తనకిచ్చిన నెగటివ్ కిక్కులు దృష్టిలో పెట్టుకుని - ఏ నాడూ ఒక్కసారి పల్లెత్తు మాట అనకుండా పెంచాడు పిల్లల్ని.  ఈ పెంచడంలోతాను పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు పొంగిపోయాడు కూడా. మల్లికని మెడికల్ కాలేజీలో చేరమన్నప్పుడూ, మైకేల్ ని బిజెనెస్ స్కూల్లో జేరమని సలహా ఇచ్చినప్పుడూ తన మీద ఇద్దరూ విరుచుకు పడ్డారు. తాను బిత్తరపోయేడు వాళ్ల మాటలకి. తన తండ్రి ఇచ్చిన నెగటివ్ కిక్కులకి తాని వైజాగ్ పారిపోయేడు సరే, మరి తన పిల్లలకి ఏనాడూ తాను నెగటివ్ కిక్కులివ్వలేదే? మరి వాళ్ళెందుకు తననుంచి దూరంగా పారిపోయి, మల్లిక హిస్టరీలోనూ మైకేల్ పాలిటిక్సు లోనూ చదువుకున్నారు? పోనీ ఈ చదువులు అచ్చి వచ్చాయా అంటే అదీ లేదు. మల్లిక ఓ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ లా చేరింది. మైకేల్ వాషింగ్టన్ లో ఎవరో సెనేటర్ దగ్గిర చేరి వాడి మూతీ చేతులు కడుగుతున్నాడు.
 
పిల్లలు వేరే ఊళ్లలో చదువుతూంటే ఖాళీ గూట్లో ఉన్నలిండా తన మీద మొహం మొత్తి, పనిచేసే చోట వేరే అతనితో ప్రేమలో పడింది. ఓ రోజు తీరిగ్గా చెప్పేసింది తనతో - మనిద్దరికీ పడదూ నేను వేరే వెళ్తున్నానూ అని. పెళ్ళైన ఇన్నాళ్ళలోనూ ఒక్కసారైనా లేనిది అలా అందేమిటో?
 
తర్వాత్తర్వాత జరిగిన విషయాల్లో తాను నామకః పిల్లలకి తండ్రి మాత్రమే. తన పుట్టినరోజుకీ, పండగలకీ ఓ కార్డు పారేసి చేతులు దులుపుకుంటారు. తాను లిండాని చేసుకున్నట్టే వాళ్ళిద్దరూ ఎవరినో చేసుకున్నారు కూడా. తనని పెళ్ళికి పిలిచారు కార్డ్ పంపించి. పెళ్ళిలో తాను పెళ్ళి పెద్దా కాదు, చిన్నా కాదు. అందరూ ఆహా ఈయనా అంటే ఒహో ఆయనా అన్నారు. మూడు గంటల్లో అన్నీ తెమిలిపోయి అదే రోజు సాయంత్రం ఇంటికొచ్చేసేడు. లిండా ఉన్నంతకాలం ఒంటరి తనం లేదు. లిండా వెళ్ళేసరికి తాను యాభైల్లో ఉన్నాడు.  అప్పట్నుంచి తనకి తోడుగా ఎవరూ లేరు. ఇంకా దాదాపు ఇరవైఏళ్ళు సర్వీస్ ఉంది రిటైర్మెంట్ తీసుకోడానికి.
 
కాలం ఎవరి కోసమూ ఆగదు కనక రిటైర్మెంట్ రానే వచ్చింది. వచ్చే సోషల్ సెక్యూరిటీ డబ్బుల్తో బతకడం ఒక్కడూ నెట్టుకురావొచ్చు కానీ హవాయి లాంటి ప్రదేశం కన్నా టెక్సాస్ లో స్టేట్ టేక్సెస్ లేవు కనక ఇక్కడే సులభం. అలా తాను ఎప్పుడూ తెలియని ఆస్టిన్ లో వచ్చిపడ్డాడు.  ఈ మధ్యనే కొంచెం తల తిరుగుడూ అవీ వచ్చేసరికి ఈ హాస్పీస్ వారు కుక్కని తోడుగా ఇచ్చారు.
 
తండ్రి తనకి నెగటివ్ కిక్కులిచ్చాడని పారిపోయి ఇంటికి దూరమయ్యాడు తాను. మరి తన పిల్లలెందుకు తన దగ్గిర్నుంచి వెళ్ళిపోయారు? తానెప్పుడూ నెగటివ్ కిక్కులివ్వలేదే? ఎక్కడుంది తన తప్పు?
 
అమెరికాలో ఒక్కడూ బతకడమా, లేకపోతే ఇండియా వెళ్ళిపోవడమా? అప్పటిదాకా ఏమీ పట్టించుకోని తనకి అప్పుడు ఇండియా వెళ్ళాలంటే ఎంత కష్టమో తెల్సి వచ్చింది.  తన బండి ఓడ అయింది. ఇప్పుడు ఓడ మళ్ళీ బండి అయ్యాక చేసేదేవుంది? ఇప్పుడు ఇండియా వెళ్ళాలంటే అమెరికా సిటిజెన్ షిప్ ఏమౌతుందో? పెర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే కార్డు పెట్టుకుని వెళ్ళొచ్చేమో. వెళ్తే ఎక్కడుండాలి? ఏం చేయాలి? బోల్ట్ లాంటి కుక్కని తీసుకెళ్ళవచ్చా? ఈ కుక్క లేకపోతే ఎలా? రోగమో రొచ్చో వస్తే ఎవరు చూస్తారు? శతాధిక ప్రశ్నలు. ఏ స్వతంత్రం కోసమైతే తాను అమెరికా వచ్చాడో ఆ స్వతంత్రం ఇప్పుడో జైలులా మారుతోంది. ఇక్కడ్నుంచి ఈ వయసులో బయటకి వెళ్ళాలి. కాని వెళ్ళే మార్గాలెన్ని? ఇండియాలో బతకడం కుదరకపోతే మెక్సికో, కోస్టారికా వెళ్ళొ చ్చా? అక్కడకి వెళ్తే మళ్ళీ ఇవే ప్రశ్నలు - ఎవరు చూస్తారు? వీసా ఎలా? ఇరవై ఆరేళ్ళ కుర్రాడిగా వీసాకి అప్లికేషన్ పెట్టడం వేరూ, ఎనభై ఏళ్ళలో వేరే దేశంలో అప్లికేషన్ పెట్టడం వేరూను. ఇంతాచేసి తానింకెంతకాలం బతుకుతాడు?
 
తన తండ్రి తనలాగే ఇలాంటి ఆలోచనల్తో యమయాతన పడ్డాడా పోయేముందు? తండ్రిపోయాక తల్లి ఎలా ఓర్చుకుందో? తండ్రి పోయాక తాను ఇండియా వెళ్లకపోవడానికి తల్లి కూడా ఓ కారణం. తనని కూడా తీసుకురావాల్సి వస్తుందేమో అనే ఒక శంకా, తనని చూసి ఏమంటుందో, వెనక్కి ఇండియా వచ్చేయమంటుందనో మరో శంకాను. తన జీవితం చరమాంకంలో ఉంది. ఈ అంతిమ కాలంలో అన్ని దార్లూ మూసుకుపోయి ఇప్పుడు తాను బతికే బతుకు, తనకి వెనక్కి పోలేని ముందుకు ఈదలేని ఒకేఒక మిగిలిన అతి సంకట మార్గం.  ఎప్పుడో ఇండియన్ రైల్వేస్ లో వెళ్తూంటే రైల్లో ఎమర్జన్సీ ద్వారం దగ్గిరన్ హిందీలో రాసిన వాక్యం గుర్తొచ్చింది - సంకట్ కాల్ మే బాహర్ జానే కా మార్గ్. అది తనకి అన్వయించుకుంటే ఇప్పుడు తనకున్నది - అంతిమ కాల్ మే బాహర్ జానే కా సంకట్ మార్గ్ - ఇలా చావొచ్చే దాకా బతకడమే!
 
తాను చేసిన పనులకి తల్లీ తండ్రీ  ఏదో శాపం పెట్టినట్టున్నారు. ఆ శాపం ఇప్పుడు తనకి సూటిగా తగుల్తోంది.
 
ఆలోచనల్ని తెగ్గొడుతూ ఎడమచేతిమీదనుంచి సన్నగా నెప్పి ప్రారంభమైంది. చేయి విదిల్చి ఓ సారి లేవబోయేడు. సాధ్యం కాలేదు. నెప్పి మెల్లిగా దవడలమీదకీ, ఛాతీ మీదకి పెరుతూ వస్తోంటే మస్తిష్కంలో తన తండ్రి కృష్ణారావు నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఆ పక్కనే చీర ముసుగు కప్పుకుని అమ్మ. ఆ పక్కన ఏ భావమూ చూపించని లిండా మొహం. ఆ పైన ఈ తతంగం ఎంతసేపురా భగవంతుడా అనుకుంటున్నట్టూ నిముష నిముషానికి వాచీ చూసుకునే తన పిల్లలు మల్లికా, మైకేల్. చాతీ మీద ఏనుగు కూర్చున్నట్టు నెప్పి. కళ్ళు మూతలు పడిపోతూంటే పక్కకి వాలిపోయేడు సత్య మూర్తి.
 
"యధా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తధా పూర్వకృతం కర్మా కర్తార మనుగచ్ఛతి" సి.డి. లోంచి మంచి గాత్రంతో మహాభారతం లో నీతి పద్యం వస్తూనే ఉంది. 
 
కాసేపు సత్య మూర్తిలో ఏ కదలికా లేకపోవడం చూసి బోల్ట్ దగ్గిరకొచ్చి అరిచింది సత్య మూర్తిని లేపడానికి. వంట్లో ఏ కదలికా లేకపోవడంతో వెంఠనే ఎమర్జన్సీ బటన్ నొక్కడానికి అటువేపు పరుగెట్టింది.

***

Bio

ఆర్. శర్మ దంతుర్తి

శర్మ దంతుర్తి - పుట్టినది చదువుకున్నది, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట/కాకినాడలలో. ఆ తర్వాత మెంఫిస్, టెనెసీ నుంచి డాక్టరేట్ పట్టా. ప్రస్తుత నివాసం కెంటకీ. ఈమాట, సుజనరంజని, సారంగ, కౌముది వెబ్ మేగజైనలోనూ, తానా వార్షిక పుస్తకంలోనూ, ఇప్పుడు మధురవాణిలోనూ యాభై దాకా కధలూ కవితలూ ప్రచురించబడ్డాయి. వంగూరి వారి పోటీలలో మూడు సార్లు చిన్న చిన్న బహుమతులూ, ప్రశంసా పత్రాలూ సాధించారు. ప్రస్తుతం కౌముది మేగజైన్లో గత మూడేళ్ళనుంచీ ధారావాహికంగా "పోతన భాగవతంలో రసగుళికలు" వ్యాసాలు వస్తున్నాయి.

***

Mani vadlamani
Comments
bottom of page