top of page

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

Picture7.jpg
Picture8.jpg
Picture6.jpg
Picture9.jpg
Picture10.jpg
IMG-20230326-WA0017.jpg
కొనుగోలు వివరాలు.jpg

వంగూరి ఫౌండేషన్ వారిప్పటికి 111 పుస్తకాలు ప్రచురించడం జరిగింది.  ఇది మాటలు కాదు.  పుస్తక ప్రచురణ ఎంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నాదైనా, ముఖ్యంగా ఆ వ్యయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం విదేశాలలో నివసించే తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే ఒకే ఒక్క ఆశయంతో 1995 లో మొదలు పెట్టిన సాహిత్య కార్యక్రమం ఉదాత్తమమైనది.  అక్షరాలు ఒక పుస్తకరూపంలో కనిపిస్తే, దానికున్న విలువ వేరనే ఒక నమ్మకం వంగూరి చిట్టెన్ రాజు గారిది.  విదేశాలలో నివసించే తెలుగు రచయితలు తమ రచనలను ఒక పుస్తకరూపంలో చూసుకునే అవకాశాన్ని కలిగించిన మొదటి సంస్థ వంగూరి ఫౌండేషన్.  మొదట్లో ‘అమెరికా తెలుగు కథా సంకలనం’ పేరుతో కథా సంపుటాలు వెలువరించి, ప్రస్తుతంలో ప్రపంచ దేశాలలో (భారత దేశం మినహా) నివసించే తెలుగు రచయితలెందరి రచనలో ప్రచురిస్తున్నారు.  వంగూరి ఫౌండేషన్ వారి పుస్తకాలు ప్రింటులోనూ, ఆన్లైనులోనూ అచ్చంగా తెలుగు వారింట, అంటే, ఈ క్రింది వెబ్సైటులో దొరుకుతాయి.  https://books.acchamgatelugu.com/product-category/vanguri/

ఈ మధ్యలో ప్రచురితమైన పుస్తకాలు  ఐదు పుస్తకాల చిరు పరిచయాలు ఈ క్రింద ఇస్తున్నాను.  మిగతా రెండు పుస్తకాలలో నిర్మలాదిత్య గారి "సైబీరియన్ క్రేన్స్" కథాకోకిల ప్రచురణల నుంచి ప్రచురితమైతే, మరో సంక్షిప్త పరిచయం జడా సుబ్బారావు గారి "మంచు కింద ఉక్కపోత" మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారు ముద్రించారు.

పాస్పోర్ట్ – మరికొన్ని డయాస్పోరా కథలు – మాచిరాజు సావిత్రి

 

మాచిరాజు సావిత్రి గారు రాసిన పన్నెండు కథల సంపుటి. 

 

కెనడా నివాసి అయిన సావిత్రిగారు తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో విదేశాలకు వచ్చి, అమెరికా, కెనడాలలో విద్యాభ్యాసం చేసి, కెనడాలో స్థిరపడ్డారు.  అయితే చిన్నప్పటినుంచి తెలుగు భాషాభిమానం పోలేదు.  1969 లో ఆవిడ మొట్టమొదటి కథ ‘మోసం’ ఆంధ్ర ప్రభలో ప్రచురితమైంది.  

పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తూ, వేమూరి వేంకటేశ్వరరావు గారు అంటారు ‘వీటిలో చాలావాటిని కథలు అనడంకంటే భావోద్రేకంతో కూడిన జ్ణాపకాలు అనడమే సమంజసం’ అని.  సంపుటిలోని మొదటి కథ ‘సక్సెస్ స్టోరీ’ 1991 లో  తొలి ప్రచురణ జరిగింది.  చివరి కథ ‘సర్వ విఘ్నోప శాంతయే’ 2021లో ప్రచురించబడింది.  అంటే ముప్ఫై యేళ్ళ విస్తృతి ఉంది ఈ కథలకి.   కథాకాలం అంతకు మునుపు ముప్ఫై ఎళ్ళంటారు రచయిత్రి.  చాలా కథలు విదేశీ నేపథ్యం ఉన్నవి కాబట్టి చదివేటప్పుడు కథాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాలి. 

కథలో మొత్తం 12 కథలున్నాయి.  సరళమైన శైలితో వ్రాయబడ్డాయి ఈ కథలన్నీ.  ‘పాస్పోర్ట్’ అన్న కథ పేరే పుస్తకానికి కూడా.  ఆ కథ ఎంతో ఆత్రంగా అమెరికన్ సిటిజెన్ అయిన ఒక ప్రవాస భారతీయుడికి, ముప్ఫై ఏళ్ళై అమెరికాలో ఉంటూన్నా, సిటిజెన్ షిప్ తీసుకునే అవకాశాలు ఎన్ని ఉన్నా అమెరికా పాస్పోర్ట్ తీసుకోని భారతీయునికి మధ్య జరిగిన సంభాషణం అమెరికాలో నివసిస్తున్న ఎవరినైనా ఒక క్షణం ఆలోచింపచేస్తుంది.  “”నాకు మాత్రం నాదీ అనుకున్న దేశానికి రావడానికి ఎవరి దగ్గరో పర్మిషన్ తెచ్చుకుని వాళ్ళు సరేనంటే తప్ప లోపలికి రావడానికి హక్కు లేకుండా ఉండడం చాలా బాధనిపిస్తుంది” – ఆ బాధే అమెరికన్ పాస్పోర్ట్ వల్ల ఎన్ని లాభాలున్నా తీసుకోనిది.  అయితే కథలో చెప్పినట్లుగా టెర్రరిస్టులెప్పుడూ అమెరికన్లపైనే కన్ను వేసి ఉంచితే అది మంచిదా?  ఏమో! 

వినాయకుడి పూజ అమెరికాలో ఎప్పుడు చేస్తారు?   ఏ కేలెండరు వాడతారు – ఇండియాదా? అమెరికాదా?  వినాయక చవితి కావలసిన ఆకులు, పువ్వులు మంచు పడే ప్రాంతాల్లో దొరక్కపోతే ఏం చెయ్యచ్చు?  నవ్వించే కథ ‘సర్వ విఘ్నోప శాంతయే!’.  

ఇలా సాగి పోతాయి కథలన్నీ.  చదవండి.  

 

అమెరికోవిడ్ కథలూ, కాకరకాయలూ – వంగూరి చిట్టెన్ రాజు

 

చిట్టెన్ రాజు గారు రాసిన మరో హాస్య కథల సమాహారం.  ఆయన కథల్లోని హాస్యం, వ్యంగ్యం తెలియని వారు అరుదనే చెప్పవచ్చు.  అయితే ఇవి కథలా, వ్యాసాలా అన్న సందేహమెవరికైమనా వస్తే, వాటిని ‘కథావ్యాసా’లనో ‘వ్యాసకథ’లనో అనుకోమంటారు పాఠకుల్ని.  అంతేగా మరి.  అన్ని కథలూ, కోవిడ్ మహమ్మారి కాలంలోనో, దాని నేపథ్యంలో రాసినవి కాబట్టి, అవి అమెరికోవిడ్ కథలయ్యాయంటారు రాజు గారు,  పుస్తకంలోని కథలన్నీ కౌముది.నెట్, మధురవాణి.కామ్ అంతర్జాల పత్రికలలో అచ్చయినవే.

 

పుస్తకంలో మొత్తం పదహారు కథలున్నాయి.  కోవిడ్ ప్రపంచం మొత్తంలో మనుష్యుల జీవన విధానాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది - ముఖ్యంగా కోవిడ్ ఉదృతంగా ఉన్న రోజుల్లో.   అదేవిటో, ఎలా ఎదుర్కోవాలో తెలీని రోజులు గడిపాము.  వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని పనులు నవ్వు తెప్పించక మానవు.  అయితే కోవిడున్నంత మాత్రాన ఫ్రిజ్ పనిచెయ్యకపోవడం లాంటివి జరగకుండా ఉండవుకదా?  మన రాజు గారికి అదీ కథావస్తువే.  ఫ్రిజ్ రిపేర్ కి పడిన కష్టాలు ఆయన చెబితేనే వినాలి, అదే, చదవాలి ‘సియర్స్ వారికి విడాకులు’ కథలో.  సియెర్స్ లాంటి పెద్ద కంపెనీలకు సర్వీసు కోసం ఫోన్ చేస్తే ‘నొక్కుల పర్వం’ కాక మరేమిటి?  ఫోన్లలో ఎవరైనా మనుషులు పలుకుతారా?  ఇదైతే ఒకటి, అదైతే రెండు... నొక్కుల పర్వం లాంటి మాటలు వాడడం ఆయనకే చెల్లు. 

ఇక ‘అమెరికచ్చుతప్పులూ, అనువాదాలూ’ (చక్కగా అమరేలా అమెరికాకు మన తెలుగు పదాలను చేర్చి ఆడుకోవడం  రచయితకు మహా ఇష్టం) కథలో అంతర్జాలంలో గూగుల్ లాంటి వెబ్సైట్లు చేసే అనువాదాలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో చాలా సార్లు మనకి అనుభవమున్నా, కథ చదువుకుంటూ హాయిగా నవ్వుకోవచ్చు.  కోవిడ్ సమయంలో వాళ్ళమ్మాయి పెళ్ళి విశేషాలతో ‘కోవిడ్ పెళ్ళి’, ‘జలకాలాటల’నబడే ఫిజియో థెరపీ కష్టాలు, అమెరికేమిలా “హేరిస్సు” రాజకీయాలు, కమలను కేమీలాగా మార్చిన అమెరికా, ‘మాస్కులు - రిస్కులు’.... ఇలా చిన్న చిన్న కథావ్యాసాలతో నవ్విస్తూ చదివించే పుస్తకం.  

 

 

డయాస్పోరా కథ, సాహిత్యం అంటే ఏమిటి? (వ్యాస సంకలనం)

 

పుస్తకం పేరులోనే ఉంది పుస్తకమేమిటో అన్నది.  మొత్తం ఇరవైమూడు వ్యాసాలతో పాటు హైదరాబాదు యూనివర్సిటీ వారు ఎమ్మే తెలుగు, నాలుగో సెమిస్టరులో ‘ప్రవాసాంధ్ర సాహిత్యం – పరిచయం’ అన్న కోర్సు వివరాలతో కూడిన పుస్తకం.  వ్యాసాలన్నీ వేరువేరు చోట్ల సుమారు గత ఇరవై ఏళ్ళలో ప్రచురింపబడ్డవి.  రాసినవారు హేమా హేమీలే.  చాలా మంది ఉత్తర అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజీలాండ్ లో స్థిరపడిన సాహితీ వేత్తలే.  కొందరు భారతదేశం నుండి కూడా ఉన్నారు.  వేలూరి వేంకటేశ్వరరావు, జంపాల చౌదరి, మృణాళిని (ఇండియా), నిర్మలాదిత్య, చంద్రలత, మాచిరాజు సావిత్రి, సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి, గొర్తి సాయి బ్రహ్మానందం, భాస్కర్ రాయవరం, డా. దాట్ల వెంకటేశ్వరరావు, వంగూరి చిట్టెన్ రాజు, కల్పనా రెంటాల, రాధిక నోరి, అఫ్సర్, కె. శ్రీనివాస్, డా. కె. గీత, డా. సారథి మోటామర్రి, విజయా గొల్లపూడి, నారాయణస్వామి.  వ్యాసాలే కాక,  నలుగురు రచయితలతో ముఖా ముఖీగా ఐదు ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు - అనుభవాలు, ఆలోచనలు – వ్యాసాలకు ముందుగా సమర్పించారు – ఆటా (American Telugu Association) వారి అనుమతితో.  

ఇంతమంది అభిప్రాయాలను సేకరించి ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ ను అభినందించాలి.  

ఇంతకీ డయాస్పోరా అంటే ఏమిటి?  ఇది గ్రీకు పదం.  ఒకప్పుడు చెల్లా చెదారైన యూదు జాతి ప్రజలనుద్దేశించి వాడిన పదం.  అయితే అది అధిక ఆర్ధిక స్థాయి కోరుకుంటూ ప్రవాసులైన తెలుగు వారికీ, అదేవిధంగా వలస వచ్చిన ఇతర దేశీయులకూ వర్తిస్తుందా?  అయితే ప్రస్తుతం ఏ జాతైనా, ఏ విధంగా వలస వచ్చినా డయాస్పోరా అనేమాట ఉపయోగించడం జరుగుతోంది.  అయితే డయాస్పోరా సాహిత్యానికి, వలస సాహిత్యానికీ తేడా ఉందా? ఉంటే ఆ తేడాలేమిటి?  పిల్లల సాహిత్యం కూడా డయాస్పోరా క్రింద పరిగణించవచ్చా?  డయాస్పోరా కవిత అంటే?  డయాస్పోరా తెలుగు సాహిత్యం ఏ స్థితిలో ఉంది?  నోస్టాల్జియాకు, భారతదేశంలో వుంటూ, దూరంనుంచి ఇతరదేశాలను చూస్తూనో, లేక ఒకటి రెండుసార్లు చుట్టపు చూపుగా వచ్చి చూసి రాసిన రచనలకు, విదేశాలలో స్థిరపడి అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్తులలో కలసిపోయి సృష్టించిన సాహిత్యానికి, తేడా ఏమిటి?  ఏది డయాస్పోరా సాహిత్యం క్రింద పరిగణించాలి? డయాస్పోరాకు ప్రత్యేక లక్షణాలుండాలా?  ప్రస్తుత రచయితల్లో ఎవరు నిజమైన డయాస్పోరా రచనలను కొనసాగిస్తున్నారు? 

ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వివిధ రచయితల అభిప్రాయాలను బట్టి గ్రహించవచ్చు.  ఎన్నో కోణాల నుంచి చర్చించిన వ్యాసాలివి.  తప్పక చదవాల్సిన పుస్తకం. 

 

ప్రవాస చందమామ కథలు – సతీష్ గొల్లపూడి

సతీష్ గొల్లపూడి గారి తొలి కథా సంపుటి.  కొత్త ప్రవాస రచయితలను ప్రోత్సహించడం, ప్రపంచానికి పరిచయం చెయ్యడం వంగూరి ఫౌండేషన్ వారి ఆశయాలలో ఒకటి.   ఇంత క్రితం సతీష్ వ్రాసిన ‘ప్రవాస ప్రతిబింబాలు’ అనే కవితా సంపుటిని వంగూరి ఫౌండేషన్ ప్రచురించింది.  న్యూజీలాండ్, క్రైస్ట్ చర్చ్ నగరంలో నివాసమేర్పరచుకున్న సతీష్ గారు అతి తక్కువ కాలంలోనే రాసిన 18 కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.  

పుస్తకానికి తనదైన ముందుమాట వ్రాస్తూ, రచయిత ‘సమకాలీన జీవితంలోని మనుషుల స్వభావాన్ని, టెక్నాలజీ మొదలగు వాటివలన మారుతున్న జీవన విధానాన్ని ప్రతిబింబించడం జరిగింది’ అని అంటారు.  అలాగే ఒక కవిగా స్థిరపడి మొదటిసారిగా కథలు రాసేతప్పుడు పడిన మానసిక సంఘర్షణ గురించి కూడా రచయిత తెలిపారు.  “కథలో మన జీవిత అనుభవముంటుంది.  హృదయానికి అక్షర అనువాదం ఉంటుంది.  జ్ణాపకాల పోరాల్లోని అనుభూతులుంటాయి.  అన్నిటి కంటే ముఖ్యం వివరించడానికి బోలెడు చోటు ఉంటుంది.... పేజీ తిప్పిన ప్రతిసారి కథలో మలుపును పెట్టి తలపును ఆశ్చర్యపరచాలి.”   

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సతీష్ గారి కథలను రాస్తూ ఇది ఒక సుధాకథాలహరి అన్నారు.  “ఈ కథలలో పాత్రలు మనలో ఉంటాయి.  మన చుట్టూ ఉంటాయి.”  

కథలలో వైవిధ్యమైన కథావస్తువులను ఎన్నుకున్నారు రచయిత.  ‘పెళ్ళి గోల’ కథలో మెరుగవుతున్న స్త్రీల పరిస్థితులు, మారుతున్న సమాజం, భవిష్యత్తులో రాగలిగే మార్పులు కనబడతాయి.  ‘ప్రవాస చందమామ కథలు’ పరదేశ అనుభవాలు స్థానికులకు ఏ విధంగా ఉపయోగపడతాయో, అవి చిన్నప్పుడు చదివిన చందమామ కథాల్లా ఎంత బాగుంటాయో పాత్రల ద్వారా చెప్పిస్తారు.  వర్క్ ఫ్రమ్ హోమ్ లో కష్టాలు, 2100 లో అంతరిక్షంలో వివిధ దేశాల ప్రజల ఆవశ్యకత కొద్దీ అంతరిక్షాన్ని ఎలా ఉపయోగించుకున్నారనే ఒక సైన్సు ఫిక్షన్ కథ.  ఇలా ప్రతీ కథలోనూ రచయిత ఎంచుకున్న కథా వస్తువులలో ఎంతో వైవిధ్యముంది.  కథలు రాస్తూంటే కానీ పక్వత రాదు.  సతీష్ గారు తమ కథా రచనా చాతుర్యాన్ని  మరింతగా పెంచుకుంటూ, తెలుగు ప్రజలకు ఇంకా మంచి కథలు అందించాలని కోరుకుంటున్నాను. 

మరో మాయాబజార్ (కొన్ని సరదాగా. కొన్ని సీరియస్ గా) – రాధిక మంగిపూడి

 

 రాధిక మంగిపూడి గారు వ్రాసిన కథా సంపుటి.  ఈమె వ్రాసిన కవితలు ఇప్పటికే మూడు పుస్తకాలుగా అచ్చయ్యాయి.  కథలకు ఇది రెండో పుస్తకం.  రెండు కథల పుస్తకాలూ వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించినవే.  ఈ పుస్తకంలో 24 కథలున్నాయి.  రచయిత్రి మాటలలోనే “కథలలో ఎక్కువ శాతం హాస్య కథలు, కథనాలు ఉన్నా, కొన్ని సెంటిమెంట్ కథలు, కొన్ని ఆలోచనాత్మకంగా సాగే సీరియస్ కథలు, కొన్ని బాంధవ్యాల విలువలను తెలియజేసే కథలు కూడా పొందుపరచడం జరిగింది.”  

అతి కొద్ది కాలంలోనే రచయిత్రిగా పేరు తెచ్చుకున్న రాధిక సాహితీ జీవితం వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన ప్రపంచ సాహితీ సభలతోనే మొదలైందని అంటారు. 

చాలా కథలలో సున్నిత మైన హాస్యం కనబడుతుంది.  పాత్రలు మనకి దైనందిన జీవితంలో తారసపడుతూంటారు.  హాస్యం స్ఫురించేది సమాజంలోనుంచే.  హాస్య రచయితలు ఆ సామాజిక పరిస్థితుల్ని ఆసక్తిగా గమనిస్తూ కథలకు ఒక రూపాన్నిస్తారు.  రచయిత్రి అలాంటి హాస్యాన్ని చాలా సహజంగా చిత్రీకరించారు కథల్లో.  అందుకే ఎబ్బెట్టుగా ఉండవు. 

కథలు చదవండి.  కథలను మీముందుంచడం రచయిత్రి వంతైతే, నవ్వుకోవడం పాఠకుల వంతు. 

*****

సైబీరియన్ క్రేన్స్ - భాస్కర్ పులికల్ (నిర్మలాదిత్య)

సైబీరియన్ క్రేన్స్ – నిర్మలాదిత్య కలం పేరుతో భాస్కర్ పులికాల్ గారు ప్రచురించిన మొదటి కథా సంకలనం. ఈ పుస్తకం  "కథాకోకిల ప్రచురణలు" నుంచి వెలువడిన పుస్తకం. మొత్తం 24 కథలున్నాయి.  పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించారు.  మొదటిది ‘ఇండియా కథలు’, అంటే ఇండియాలో ఉన్నప్పుడు (1986-93) రాసినవి.  రెండోది అమెరికా కథలు, అంటే అమెరికాకు వచ్చిన తరువాత (2004-19) రాసినవన్నమాట.  మధ్యలో ఓ పదేళ్లు భాస్కర్ గారు అజ్ఞాతవాసం చేశారన్నమాట – కథలు రాయడం విషయంలో.  మొదటి భాగంలో పదకొండు కథలు, తక్కినవి రెండో భాగంలో.

భాస్కర్ గారు మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు.కేవలం వందమందే ఉన్న చిన్న గ్రామంలో (ఒకప్పటి చిత్తూరు జిల్లాలోని - ప్రస్తుతం తిరుపతి జిల్లా - రమణయ్యగారి పల్లె)  ఒకే కుటుంబంలోంచి ఐదుగురు రచయితలని తయారు చేసిన ఘనత ఆ గ్రామానికే చెల్లు. ఇది మధురాంతకం నరేంద్ర (భాస్కర్ గారి మేనమామ కొడుకు) గారి ముందుమాటలలో ప్రస్తావన.

 అలాంటి వాతావరణంలో పుట్టి, కొంతకాలం పెరిగి, ఇంటెంటై వటుడింతై అన్నట్లుగా భాస్కర్ గారు అమెరికా వలస వచ్చి ఇక్కడి కథలు రాయడం ఆయన రచనల విస్తృతికి ఎంతో తోడ్పడింది.
 
పుస్తకం రెండు విభాగాలు చేయడం ఒక ఎత్తైతే, ఆయా కథలు ఏ పత్రికలలో అచ్చయ్యాయో ఆయా పత్రికల ముఖ చిత్రాలను కూడా ఆయా విభాగాల మొదట్లో వేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంత శ్రద్ధగా ఆయా పత్రికలను దాచుకుని, వాటి జ్నాపకాలను పుస్తకరూపంలో పదిలపరుచుకున్న భాస్కర్ గారిని మెచ్చుకోవాలి.

“ఈ జాము రాత్రి నేను చేసే ప్రయాణాలే నా కథలు” అంటారు భాస్కర్.

కథలన్నీ అవి ప్రచురింపబడ్డ తేదీల కనుగుణంగా 1986 నుండి 2018 వరకు ఒక క్రమంలో ఉన్నాయి.  అవి రచయిత ఆలోచనలలోనూ, కథనంలోనూ, కథావస్తువు ఎన్నుకోవడంలోనూ కాలక్రమేణా వచ్చిన మార్పులు, చేర్పులు చూడగలుగుతాం.  అది కూడా నాకు నచ్చిన విషయం.
 
కథల మాటకొస్తే, ‘సైబీరియన్ క్రేన్స్’ – ప్రతి ఏటా భారత దేశం వలస వచ్చే కొంగలు – అలాంటి మనుషులకు ఉపమానం.  పరాయి దేశంలో స్థిరపడిపోయినా ఏటేటా తిరిగి భారతదేశం వలస వచ్చేవారి కథ.  అందరినీ మాట్లాడిస్తూ, తనకీ ఇండియాకి రావడానికి ఒక కారణమున్నా దాన్ని మాత్రం దాచుకుని మిగతా అందరి చేతా చెప్పించి అందరికీ తను చేయగలిగిన సహాయం చేసి అక్కడనుంచి తిరిగి అమెరికా చేరే ఆలోచన లేని బామ్మ కథ ఇది.  ఎనభైల్లో అది ఎంతో ముందున్న ఆలోచనతో రాసిన కథే.  


‘ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్’, ‘పంచింగ్ బాగ్’ లాంటి కథలు సగటు ఆఫీసుల్లో జరిగే భారతాల గురించి రాసినవి.  ‘లోగుట్టు’ – ఇంసైడర్ ట్రేడింగ్ గురించి.  అమెరికాలో అలాంటి పనిచేసి అరెస్టయి, శిక్ష అనుభవించి ఇండియా వచ్చి అదే పని అన్ని గవర్నమెంటు ఆఫీసుల్లోనూ అతి మామూలుగా జరిగిపోతూండడం ఆశ్చర్యమా?


ఇలా సాగిపోతాయి ఇండియా కథలన్నీ.  కథల్ని అవి ప్రచురించబడ్డ సంవత్సరాలని బట్టి ఆ నేపధ్యంలో చదువుకుంటే చదువరి రచయిత ఆలోచనలతో కనెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది.
 
అమెరికా కథలు సాపేక్షంగా ఇప్పటి కథలు.  చెప్పాలంటే ప్రవాస భారతీయుడిగా అమెరికా వాతావరణం ప్రతిబింబిస్తూ రాసిన డయాస్పోరా కథలు.  కథల్లో వచ్చిన పరిపక్వత చూడవచ్చు.  ఇంకో విషయం.  రచయిత ప్రస్తుతం వాడుకలో తెలుగు మాట్లాడేటప్పుడు దొర్లే ఆంగ్ల పదాలను యథాతథంగా, విరివిగా వాడడం కనబడుతుంది.  ఇండియా కథలలో కొంచెం తక్కువగా, అమెరికా కథలలో చాలా ఎక్కువగా చూడవచ్చు.  రచయిత నిజాయితీని మెచ్చుకోవాలీ విషయంలో.  ఒక రకంగా అది రాయడానికి సులభం – తెలుగు పదాలు వెతుక్కోక్కరలేదు.  ఇంకోటి సగటు పాఠకుడికి కూడా ఇబ్బంది ఉండదు.  అలాగని మరీ ‘మీ కేటుకు ఫుడ్డు ఏం పెడటారు?’ అన్నట్లుగా ఉండదు. 

 “ఎక్కడ నుంచి” అన్న కథ ఒక రకంగా ఫిలాసాఫికల్ ప్రశ్న.  అమెరికాలో హాస్పిస్ కేర్ హోమ్ లలో ఎలా వాలంటీర్లు పని చేస్తారు, కొద్దిరోజుల్లో చనిపోతారని తెలిసినా పేషెంట్లను ఏవిధంగా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అన్న విషయాలను నేపథ్యంగా చేసుకుని రాసిన కథ.  అమెరికాలోని కొన్ని నగరాలు, హిందూ దేవాలయాలు, ఎన్నో దొర్లుతాయి.  చిన్న చిన్న వర్ణనలు చదువుటూంటే కళ్ళకు కట్టినట్లున్నాయి.  


అమెరికాలో రెస్ట్ ఏరియాలు, ఇండియా నుంచి వచ్చి ఒక రెస్ట్ ఏరియాలో కలసిన వారితో సంభాషణలు, ఆ సంభాషణాలలో తను ఆంగ్ల సాహిత్యంలో ఎప్పుడో పరిచయమయిన ‘స్పూన్ రివర్’, అదే పేరుతో ఉన్న ఆ రెస్ట్ ఏరియా... వింత అనుభవం కాదూ?  ఇది ‘రెస్ట్ ఏరియా కథలు, స్పూన్ రివర్’ అన్న కథలో.  


కథల్లో సంభాషణలు బావుంటాయి.  కొన్ని కథలు వంగూరి ఫౌండేషన్ వారి పోటీలలో బహుమతి పొందినవి. అమెరికా కథలు అక్కడ స్థిర నివాసమేర్పరుచుకున్న తెలుగు వారు సులభంగా అన్వయించుకోవచ్చు.  చాలా కథల్లో ఆధ్యాత్మిక భావన కూడా కనిపిస్తుంది.  కొన్ని కథల్లో హాస్యం ఉంది. 
అన్ని కథలూ తప్పక చదవదగినవి. 


పుస్తకం ఖరీదు రూ. 250.00.  నవచేతన, విశాలాంధ్ర, నవోదయ పుస్తక విక్రేతల దగ్గర దొరుకుతుంది.  అమెరికాలో అమెజాన్ లో దొరుకుతుంది.    అమెరికా, కెనడా వాస్తవ్యులు చదివేందుకు కాపీలకై సంప్రదించండి.  pulikal@gmail.com.  ధర:  $5.00

*****

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 6
Anchor 7

సంక్షిప్త సమీక్ష

 

మంచుకింద ఉక్కపోత –- డా. జడా సుబ్బారావు 

మంచుకింద ఉక్కపోత కథల సంపుటి గురించి సంక్షిప్తంగా:

 

2020 -22 సంవత్సరాల మధ్యకాలంలో సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ప్రస్థానం పత్రికలలోనే కాకుండా వివిధ అంతర్జాల పత్రికలలో వచ్చిన కథలను ‘మంచుకింద ఉక్కపోత’ అనే సంపుటిగా ముద్రించారు. విజయవాడలోని ‘మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్’ నిర్వాహకులు ఆచార్య మక్కెన శ్రీనుగారి ఆర్థిక సహకారంతో ఈ పుస్తకం ముద్రించబడింది. మూడేళ్ల కాలంలో వివిధ సాహిత్య సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. ఇందులోని ‘దేవుడి భార్య’ కథ కన్నడంలోకి అనువదించబడింది. ‘దాహం’ అనే కథ అమెరికా తెలుగుసంఘం (తెల్సా) వారు 2022లో నిర్వహించిన కథలపోటీలో యాభైవేల రూపాయల ప్రథమ బహుమతిని సాధించింది. ‘ములక్కరం’ కథ హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఎం.ఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టబడింది.

 

డా. జడా సుబ్బారావు బాపట్లజిల్లా, భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామంలో జూన్ 5, 1978 సంవత్సరంలో జన్మించారు. తెలుగుసాహిత్యంలో ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి డిగ్రీలను పొందిన వీరు నూజివీడులోని ఏపీఐఐఐటీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. సుమారు ఎనభైకి పైగా కథలు, డెబ్భై కవితలు, పాతిక పాటలు రాశారు. వీరు రాసిన ‘ములక్కరం’ కథ హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఎం.ఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. వీరి ‘దేవుడి భార్య’ కథ కన్నడంలోకి అనువాదమైంది. వీరి కథలమీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతోంది. తలరాతలు, ఆకుపచ్చని కన్నీళ్లు, మంచుకింద ఉక్కపోత, గడియారం బతుకులు, వ్యాసలోహిత, విజయవిలాసం, తొలి అడుగు అనే పుస్తకాలు వెలువరించారు. తలరాతలు కథాసంపుటానికి “డా. వేదగిరి రాంబాబు కథానిక యువ పురస్కారం -2018” అందుకున్నారు. వీరు  రాసిన పాటలు ఆకాశవాణి విజయవాడ నుంచి ప్రసారమయ్యాయి.  చరవాణి: 9849031587

మంచుకింద ఉక్కపోత పుస్తకంలోని పేజీలు – 160. వెల 200/- రూపాయలు.

కావలసినవారు 9849031587 అనే నంబరుకు 200/-  ఫోన్ పే చేసి రశీదు మరియు అడ్రస్ ఇదే నంబరుకు వాట్సప్ ద్వారా పంపితే పుస్తకం పంపిస్తారు. యూ.ఎస్. (10$)

*****

                                                                                   

bottom of page