top of page

క్రింది పేజీలు

ప్రస్తుత తాజా సంచికలో

లభ్యమవుతాయి

'అలనాటి' మధురాలు

క్షణంలో సగం

స్వర్గీయ శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)

సంక్రాంతి సంచిక 2016​

ఆంధ్రజ్యోతి మాసపత్రిక 1949 ఏప్రియల్ ఉగాది సంచికలో ప్రచురించబడింది

ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు. 

"బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను.

ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం.

 

ఈ సాయంత్రం ఇక్కడ ఈ నగరంలో.....సముద్రంలాంటి ఆకాశంలాంటి ఎడారిలాంటి ఆకాశంలాంటి సముద్రంలాంటి ఎడారిలాంటి ఎడారి, సముద్రంలాంటి ఎడారి, ఆకాశంలాంటి ఎడారి, ఎకసక్కెంలాంటి ఎడారి........

ఇక్కడ ఈ నగరంలో ట్రాం లో నేను......ఎదురుగుండా సెలూన్లో అద్దంలో నేను : అదైనా క్షణంలో సగంసేపు!

అదీ అసలు సంగతి. ట్రాంలో వెళుతున్న నేను సెలూన్లో అద్దంలో క్షణంలో సగంసేపు నన్ను నేను ప్రతిబింబించి నాకు నేను కనిపించాను. క్షణంలో సగంసేపు ఒకేసారి సెలూన్లోనూ ట్రాంలోనూ నివసించాను.

ఇక్కడ ఈ సాయంత్రం........ఎడారిలో ఆకాశంలో క్షణంలో సగంలో ట్రాంలో సెలూన్లో జనం మధ్య జనసముద్రమ్మధ్య జనసముద్రం మధ్య నేను.

ఇక్కడ ఈ నగరంలో ఈ క్షణంలో సగం సేపు ఏమిటి జరుగుతోంది?

 

"మనం లక్షాధికారులం కావడం ఎప్పుడు ప్రారంభిస్తాం" అని ప్రశ్నించాడు నయనకన్ను. వాళ్లిద్దరూ నాయరు దుకాణంలో నిన్నటి పకోడీలు నములుతున్నారు."ఇదిగో ఈ క్షణం" అన్నాడు దొరసామి. "టీ తీసుకున్న తక్షణం."

"డబ్బులు చాలుతాయా" అన్నాడు నయనకన్ను.

నాయరు రెండు గ్లాసులతో టీ తెచ్చి--వాళ్లముందుంచి పోయాడు.

"గుర్రాలు మోసం చేశాయని చెబుదాం. అరువుంటాడు నాయరు" అన్నాడు దొరసామి.

అక్రమ లాభాలమీద అదనపు పన్ను తగ్గింపు. ఆర్థిక పరిస్థితిమీద కేంద్ర ప్రభుత్వపు దండయాత్ర కృషి. ఇతోధిక కృషి. ద్రవ్యోల్బణము. దాని నరికట్టుటకు ఆరు మార్గాలు. రామపాదాల పీత నడక. అన్నివేళలూ తేనీటి వేళలే.

కాకెమ్మ చక్కని చుక్క. నిజంగా ఆ పేరుకి తగ్గదికాదు. పదేళ్ల కిందట మరీ బాగుండేది. అప్పుడు సినీమాలో నటించడానికిక్కడకు వచ్చింది. ఒక కెమేరా మనిషి ఆమె శరీరాన్ని అనేక కోణాలనుంచి చూసి చవిచూసి 'నువ్వు మంచం మీదకే కాని తెరమీదకి పనికిరా'వన్నాడు. దరిమిలాను చాలామంది ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు కాకెమ్మ ఇంకో మంచం మీదకి వెళ్లబోతూంది.

దశవర్ష ప్రణాళిక బుట్టదాఖలా. బంగారం ధర పడిపోవడంవల్ల బ్యాంకులకి మూడురోజులు సెలవు. ఈ రాత్రి చంద్రుడు నూటికి 75 వంతుల నష్టంతో వ్యవహరిస్తాడు. అనుకోని గుర్రాల ఆకస్మిక విజయం.

జమీందారు సొంతకారు నడుపుకుంటూ జోరుగా పోతున్నాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాతనో అంతక్రితం ఆరేడు నెలల పూర్వమో జమీందారు జాతీయ మతం తీసుకొని దీక్షావస్త్రాలు ధరించాడు.

పేవ్ మెంటుమీద నడుస్తున్న కుర్రాడు జమీందారును చూశాడు. కుర్రాడి జేబులో వేడివేడి వేరుసెనగపప్పుంది. పిడికిటి నిండా వేరుసెనగపప్పు తీసుకొని పట్టుకున్నాడు. కద్దరు దుస్తులతో కనుపండువుగా కనబడుతూన్న జమీందారుని వెరుసెనగ పప్పుతో అభిషేకించాలన్న ఆశ ఆ కుర్రాడి మనస్సులో మెరుపులాగ మెరిసింది. కాని ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. కారు జోరుగా దాటిపోయింది.

జగద్విఖ్యాతి వహించిన షేక్స్పియరు మహాకవి నాటకం హేమ్ లెట్. మనస్సు స్థిరపరచుకోలేకపోయిన మానవుని విషాదాంత గాధ.

"ఉప్మా పట్రా" అన్నాడు. పట్టుకొచ్చాడు అయ్యర్వాళ్. తింటున్నాడు తెమ్మన్నవాడు. అందులో రెండు రాళ్లున్నాయి. కాఫీ తీసుకోకుండానే బిల్లు తీసుకొని డబ్బు చెల్లిస్తూ "ఉప్మాతోబాటు రెండు రాళ్లు ఎక్కువగా ఇచ్చాడు. అంచేత వాటికి నా యథాశక్తి ధర రెండర్థణాలు ఒక అణా చెల్లిస్తున్నా" నని అణా ఎక్కువ ఇవ్వబోయాడు. నేతాజీ విలాస్ కాఫీ క్లబ్బు (ఇక్కడ పదార్థాలు కల్తీలేని నేతితో చెయ్యబడవు) ప్రొప్రయిటరు అణా వైపు అతి భయంకరంగా చూశాడు. "ఎవరైనా బిచ్చగాడికి ధర్మం చేసుకో" అన్నాడు. రాళ్ల ధర చెల్లించదలచుకున్న మనిషి అణాకాసుని జేబులో వేసుకొని రెండు అయిదు రూపాయల నోట్లు బల్లమీదపెట్టి వెళ్లిపోయాడు.

"వెర్రి వెధవ" అనుకున్నాడు ప్రొప్రయిటరు, రూపాయి నోట్లను దాచేస్తూ.ఆ సమయంలోనే ఒక అణాకాసు అడుక్కునే అమ్మి డబ్బాలో పడ్డ చప్పుడయింది.

"కమ్యూనిస్టులను పాతేస్తున్నాం" అన్నారు దొరతనంవారు. పాతేస్తున్నారు. వానలు కురిస్తే దేశం అంతటా కావలసినంత పంట.

 

**********

Dr.Goli Anjaneyulu , Tenali: alochanalanu rekettinchindi . manasunu taakindi

bottom of page